పుట:Abaddhala veta revised.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృషి చేశారు. వీరి అధ్యయనంలో ఇటలీ, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, కెనడా హోమియో వైద్యులు తోడ్పడ్డారు. ఈ పరిశోధన జరిగేటప్పుడు సేకరించే సమాచారాన్ని పరిశీలిస్తామని నేచర్ పత్రికా సంపాదకుడు మేడక్స్, డా॥ వాల్టర్ స్టీవర్ట్(అమెరికా ఆరోగ్య సంస్థకు చెందిన వ్యక్తి) జేమ్స్ రాండీలు కోరారు. పరిశోధనా ఫలితాలు నేచర్ పత్రికలో ప్రచురిస్తామన్నారు. తీరా చూడనివ్వకపోయినా, పరిశోధనా ఫలితాలు గమనిస్తే తప్పుడు లెక్కలిచ్చినట్లు తేలింది. శాస్త్రీయపరిధిలోకి రావాలని హోమియో తాపత్రయం అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనకు నిలవలేని హోమియోవారు శాస్త్రానికి పరిమితి వుందనీ, అన్నీ శాస్త్రం ద్వారా వివరించలేమనీ తప్పుకుంటున్నారు. శాస్త్రీయ విజ్ఞానం అంతం లేనిది. రుజువుకు నిలవనపుడు అరమరికలు లేకుండా తృణీకరించి, ఆధారాలకై అన్వేషిస్తుంది. పెత్తందారీతనాన్ని ఒప్పుకోదు. ఎంత గొప్పవారు చెప్పినా, మందువాడినా రుజువు ఒక్కటే ప్రమాణంగా స్వీకరిస్తుంది.

హోమియోను గురించి వాస్తవాలు అనేకం వున్నాయి. అమెరికాలో వివిధ దశలలో హోమియో గురించి పరిశీలన సాగింది. ఫెడరల్ ఫుడ్ డ్రగ్ కాస్మటిక్ చట్టం 1938లోనే హోమియోను క్షుణ్ణంగా పరీక్షకు పెట్టి శాస్త్రీయ పరిశోధనకు నిలవలేదని అమెరికాలో ప్రకటించారు. కేన్సర్ నివారణ, వైరస్ చికిత్స, ఉద్దీపన ఔషధాలు అని ఆమ్మే హోమియో మందులన్నిటినీ బలవంతంగా 1984లో ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిలిపివేసింది. పెన్సిల్వేనియా ఆరోగ్యశాఖ కూడా 1985లో హోమియో ఔషధాలను పరిశీలించి నొప్పినివారిణి, శక్తి పునరుజ్జీవనాలు, మొదలైన ఆకర్షణీయ పేర్లుగల వాటిని నిలిపేశారు. 1986లో జార్జిగెస్ అనే హోమియో వైద్యుడు కోర్టుకు వెళ్ళి, హోమియోను రుజువుచేయలేక, ఓటమిని అంగీకరించాడు. (అమెరికాలో నార్త్ కెరోలైనా) అమెరికా ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నియమ నిబంధనలు హోమియోకు అన్వయిస్తే, హోమియో మందులు మార్కెట్ లో వుండజాలవని స్టీఫెన్ బారెట్ ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో కూడా హోమియో గురించి వాదోపవాదాలు సాగాయి. పార్లమెంటు చివరకు శాస్త్రజ్ఞులతో కూడిన సంఘాన్ని నియమించి పరిశీలింపజేస్తే మందుశాతం తగ్గించుకుంటూపోతే, శక్తి పెరుగుతూ పోతుందని రుజువుకాలేదని నివేదిక సమర్పించింది 1977లో.

హోమియో పితామహుడు హానిమన్ జర్మనీలో 1819లో యువరాజు షవర్జన్ బర్గ్ కు వైద్యం చేస్తే అతడు చనిపోయాడు. ఇది చూచి మండిపడిన ప్రజలు హానిమన్ వెంటబడి తరిమికొట్టి, ఆయన మందుల్ని, పుస్తకాల్ని తగులబెట్టారు. హానిమన్ తరువాత ఫ్రాన్స్ లో స్థిరపడి 80వ ఏట తనకంటె 45 సంవత్సరాల చిన్న యువతిని పెళ్ళాడి హోమియో ప్రాక్టీసు చేశారు. ఆయన చనిపోయేనాటికి(1843) ఆధునిక వైద్య, జీవ, అణు, జన్యు, శారీరక శాస్త్రాలు అభివృద్ధి చెందలేదు. బహుశా హానిమన్ యీ శాస్త్రాల పరిశోధనల రీత్యా తన వైద్యాన్ని విడనాడి, మారేవాడేమో.