పుట:Abaddhala veta revised.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200సి హోమియో అంతకు మించిపోయింది. అవగాడ్రో అనే శాస్త్రజ్ఞుడు హానిమన్ సమకాలీనుడు. పదార్థంలో అణువుల విషయం అంచనా వేసే రీతి అతడు చెప్పాడు. రసాయనిక శాస్త్రం ప్రాథమిక పాఠాలు తెలిసిన వారికి యీ విషయం అవగాహన అవుతుంది. హోమియో ఈ సూత్రానికి విరుద్ధంగా వుంది.

హోమియోలో మందు లేకున్నా పనిచేస్తుందని వాదించే వారున్నారు.

ఒక్క అణువు కూడా హోమియో మందులో లేనప్పుడు, కేవలం సారాయి, నీరు, చక్కెర మాత్రం హోమియో లక్షణాలను గుర్తు పెట్టుకొని చికిత్సకు ఉపకరిస్తాయని, కుదుపుతూ పలచబడేటట్లు చేస్తే హోమియోలో శక్తి అధికమవుతుందనేది నమ్మకం అయితే కావచ్చుగాని, రుజువుకు నిలవదు.

హోమియోలోను ప్రసిద్ధుల సిద్ధాంతాలు, ఆచరణ కూడా శాస్త్రీయ పరీక్షకు పెట్టడం, ఎక్కడా రుజువుకు నిలవకపోవడం సర్వత్రా జరుగుతూనే వుంది. అయితే హోమియోకు పలుకుబడి, ప్రచారం వుంది. అది నమ్మేవారిపై పనిచేస్తున్నది. ముఖ్యంగా ప్లాసిబో (Placebo) ఆధారంగా హోమియో వ్యాపారం సాగుతునంది. డాక్టరు వస్తున్నాడన్నా అతని చేతి మీదుగా మందిచ్చినా కొందరికి వూరట లభిస్తుంది. ప్రతి మనిషికీ ఏదైనా రుగ్మత వచ్చినప్పుడు ఆటుపోటులుంటాయి. మందు తీసుకోకపోయినా శరీరం తట్టుకొని నిలబడగల రీతులు కొన్ని సందర్భాలలో లేకపోలేదు. అలాంటి అవకాశాల్ని తమ విజయంగా చెప్పుకునే చికిత్సాపరులున్నారు.

మెదడువాపు వ్యాధికి బెల్లడోనా యిస్తే పనిచేస్తుందని హోమియోవారు ప్రచారం చేసి, ప్రభుత్వం దగ్గర పలుకుబడి వుపయోగించి, మాత్రలు పంచారు. రాష్ట్రంలో జనానికి బెల్లడోనా యిచ్చి మెదడువాపు వ్యాధి వచ్చినవారిని మినహాయించి, మిగిలినవారిని తమ వలననే వ్యాధి రాలేదని ప్రచారం చేయగల ఘనులు.

హోమియో రాజకీయ పలుకుబడి ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణ గమనిద్ధాం.

అమెరికాలో ఒక హోమియో డాక్టరు రాయల్ కోప్ లాండ్ న్యూయార్క్ నుండి సెనేటర్ గా ఎన్నికయ్యాడు. 1938లో ఆయన తన పలుకుబడి ప్రచారాన్ని ఉపయోగించి ఔషధాల పరిశీలన పరిధిలోకి హోమియో రాకుండా మినహాయించేటట్లు చేయించగలిగాడు. Food, Drug, Cosmetic Act ప్రకారం అమెరికాలో అన్ని మందులూ పరీక్షకు గురైన తరువాతనే అమ్మనిస్తారు. హోమియోపతి వారు గుట్టుచప్పుడుగా వ్యవహరించి మినహాయింపు తెచ్చుకొని, హాయిగా పంచదార మాత్రలు అమ్ముకుంటున్నారు. మనదేశంలో హోమియో పరిశోధన అనేదేమి లేదు. కేవలం మందుల అమ్మకం, డాక్టర్ల వ్యాపారం వునంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో హోమియో వారికి విపరీత పలుకుబడి వుంది. అదంతా సరే. ఇంతకూ శాస్త్రీయం అంటేనే చిక్కు. అది లేకుండా. చిట్కా వైద్యంగా చలామణి అయినంతకాలం చేపమందు, తేలుమంత్రం వంటిదే అది