పుట:Abaddhala veta revised.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పయ్ సంవత్సరాలుగా మనోవిజ్ఞానరంగంలో నిజం చెప్పి, ఎదురీదుతున్నాడు. ఫ్రాయిడ్ గురించి ఆయన పరిశోధనలు, ఆయన పేర జరుగుతున్న విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించి చెప్పాడు. ఫ్రాయిడ్ కు అలవాటుపడిన వారికి కొన్ని వింతగానూ, కొన్ని షాకింగ్ గానూ వుంటాయి. శాస్త్రీయ పరిశీలనలో యివి సర్వసాధారణమే.

వియన్నా విశ్వవిద్యాలయం నుండి 1881లో ఫ్రాయిడ్ ఎం.డి. డిగ్రీ స్వీకరించాడు. వియన్నా జనరల్ హాస్పిటల్ లో రెండేళ్ళు పనిచేశాడు. మనం హవుస్ సర్జన్ అంటామే అదన్నమాట. మొదట్లో నిపుణుడుగా అవుదామనే ఆలోచన లేకున్నా 1883లో అభిప్రాయం మార్చుకున్నాడు.

పారిస్ వెళ్ళి 1885 అక్టోబరు నుండి 1886 ఫిబ్రవరి వరకూ అంటే నాలుగున్నర మాసాలు సుప్రసిద్ధుడైన జాన్ మార్టిన్ చార్కాట్ వద్ద వున్నాడు. 1887 నుండి 1888 వరకూ మెదడు పై పుస్తకం రాయడానికి గాను అధ్యయనం చేశాడు. అదెందుకో గాని పూర్తి కానేలేదు. 1891లో నరాల విషయమై(APhosia) ఫ్రాయిడ్ సుప్రసిద్ధ గ్రంధం ప్రచురితమైంది. 1883 నుండీ 1897 వరకూ నరాల విషయం బాగా పట్టించుకొని, ఫ్రాయిడ్ అందలి లోతుపాతులు అధ్యయనం చేశాడు.

వియన్నాలో వైద్యవృత్తి చేస్తున్న సుప్రసిద్ధుడు జోసెఫ్ బ్రాయర్(Joseph Breuer)26వ ఏట నుండి ఆ రంగంలో వున్నడు. ఆయన వద్దకు వచ్చే రోగులలో 21 సంవత్సరాల అనా ఓ అనే ఆమె హిస్టీరియా లక్షణాలతో వుండేది. తన జీవితంలో ఎదుర్కొన్న అనేక విషయాలను డాక్టర్ తో మాట్లాడితేనే ఆమెకు ఉపశమనం. వూరట లభించాయని "మాట్లాడే చికిత్స"గా ఆమె ఆ చికిత్సా విధానానికి పేరు పెట్టింది. ఫ్రాయిడ్, బ్రాయర్ లు యీ పద్ధతికి ఉత్తరోత్తరా కథార్సిస్ అని పేరు పెట్టారు. మనో విశ్లేషణలో యీ పద్ధతి,అభివృద్ధి చెందని ప్రాథమిక దశగా ఫ్రాయిడ్ చెప్పాడు. ఇది గ్రీక్ మాట.

అనా ఓ ఏం చేసింది? తన జబ్బు లక్షణాలను తానే అనుకరించి డాక్టర్ బ్రాయర్ తో మాట్లాడింది. అంటే జబ్బు లక్షణాలు ఆమెకు తెలుసన్నమాట. కనుక ఆ లక్షణాలను తెచ్చిపెట్టుకొని రోగిగానూ, డాక్టర్ తో ఆ లక్షణాల గురించి మాట్లాడి మామూలు వ్యక్తిగానూ మారిందన్న మాట. మానసిక రోగులు కావాలని జబ్బు తెచ్చుకోవడం చాలా సందర్భాలలో బయటపడింది.

గ్రీకుల నాటకాలలో, ముఖ్యంగా అరిస్టోటల్ కెధార్సిస్ పద్ధతిని స్టేజిపై చూపారు. గ్రీకు సాహిత్యాన్ని ఫ్రాయిడ్ చదివాడు. గ్రీకులలో ఉపవాసం, మాట్లాడడం ద్వారా ఉపశమనం పొందటం అలవాటే.విషాదాంత నాటకాలలో ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపెట్టే ఉద్వేగరీతుల్ని కెధార్సిస్ అన్నారు. ఫ్రాయిడ్ వీటినే తన చికిత్సా విధానంలో ప్రవేశపెట్టాడు. ఫ్రాయిడ్ కనుగొన్నట్లు ప్రచారంలోకి వచ్చిన పద్ధతి ఇదే.