పుట:Abaddhala veta revised.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాజిక లక్షణాలకు చక్కని మాటలు పనిచేస్తాయి. కనుక మరో చికిత్స పేరిట రుజువుకు నిలబడని రీతుల్ని చార్ కాట్ మొదలు నేటివరకూ అవలంబిస్తున్నారు.

హిస్టీరియా రోగులు, ముఖ్యంగా స్త్రీలు, ఎలా అబద్దాలు చెప్పి మోసం చేసి నటిస్తారో చార్ కాట్ పేర్కొన్నాడు. వైద్యులకు నచ్చచెప్పడంలో వారు తమ చాకచక్యమంతా ప్రయోగిస్తారన్నారు. హిస్టీరియా దొంగజబ్బు అని చార్ కాట్ కు బాగా తెలుసునన్నమాట. చార్ కాట్ తన కాలంలో రోగుల వంచన తెలిసే ఒప్పుకున్నాడు. అది అతడికి ప్రతిష్ఠను, కీర్తిని, పలుకుబడిని తెచ్చిపెట్టింది. అదే విధానం మరో రూపంలో మానసికవైద్యులు కొనసాగిస్తున్నారు. చార్ కాట్ తన పరిశీలనలు ఏనాడూ తిరిగి చూచుకోలేదు. ఏ రోగినీ హిప్నటైజ్ చేసి పరిశీలించలేదు. కనుక తాను రోగుల్ని గురించి చెప్పేవాటి మంచిచెడులు పరిశోధనకు గురిచేసిన తీరేలేదు. ఇంకా విశేషం ఏమంటే, చార్ కాట్ శిష్యులు రోగుల్ని హిస్టీరియా లక్షణాలతో నటించమని శిక్షణ యిచ్చిన ఉదాహరణలున్నాయి! చార్ కాట్ మరణానంతరం యీ విషయాలు కొన్ని బయటపడ్డాయి. చార్ కాట్ శిష్యులు ఎవరూ, గురువుకు భయపడి కాబోలు, రోగుల్ని గురించి నిజం చెప్పలేదు. చార్ కాట్ నియంతృత్వ మనస్తత్వం కూడా యిందుకు కారణం కావచ్చు.

హిస్టీరియా గురించి చార్ కాట్ దృష్టి ఏమంటే, రోగి తన లక్షణాలను మానవ సంబంధాలుగా చూపుతున్నాడనే, అయితే ఆ మాట బయటకు ఎందుకు చెప్పలేదంటే, ప్రజలలో హిస్టీరియా పట్ల వున్న భావన అట్టిపెట్టడానికే. సమాజంలో తన ప్రయోజనాల కోసం,నిజం కప్పిపుచ్చి, వైద్యం అనే గౌరవాన్ని హిస్టీరియాకు తెచ్చిపెట్టిన అపఖ్యాతి చార్ కాట్ కు దక్కాలి. చార్ కాట్ కారణంగా ఫ్రెంచి సైన్స్ అకాడమీ హిస్టీరియాను స్వీకరించింది. 1882 ఫిబ్రవరి 13న అకాడమీకి చార్ కాట్ తన భావాలు తెలియపరచాడు. అప్పటికీ పశు అయస్కాంతం గురించి అకాడమీ ఖండించింది. అందువలన హిస్టీరియాకు అయస్కాంతశక్తితో ఎలాంటి సంబంధం లేదని చార్ కాట్ ప్రకటించాడు. కాని, చార్ కాట్ చెప్పే హిస్టీరియా, హిప్నాటిజాన్ని అకాడమీ పరీక్షకు గురిచేయాలి కదా. మెస్మర్ అయస్కాంతాన్ని అలాచేసి ఖండించారు గదా. అలా చేయలేకపోవడం చార్ కాట్ పలుకుబడికి నిదర్శనం కావచ్చుగాని, అకాడమీ శాస్త్రీయ ప్రతిష్ఠకు కాదు. హోమియోపతిలో పలుకుబడి పనిచేసి, శాస్త్రీయ పరిశీలన పక్కకు నెట్టినట్లే, హిస్టీరియాలోనూ జరిగింది!

ఆధునిక వైద్యంలో హిస్టీరియా

భయంతో కూడిన హిస్టీరియాలో ఎందుకు ఆందోళన చెందుతున్నదీ వ్యక్తికి తెలియదని ఫెనికెల్ (Fenichel) సిద్ధాంతీకరించాడు. ఒంటరిగా వదలి వెడుతుంటే చిన్నపిల్లలు భయపడతారే, అలాంటిదే ఆందోళనాపూరిత హిస్టీరియా అంటే. పిల్లలలో యీ లక్షణాన్ని హిస్టీరియా అనం గదా.

మానసిక రుగ్మతలన్నీ మెదడుకు చెందినవేనని కార్ల్వెర్నిక్ అన్నాడు. కాని, మానసికం అంటే ఏమిటో నిర్ధారణ యింతవరకూ జరగలేదు. హిస్టీరియాలో కొన్ని సంజ్ఞలు దేహం ద్వారా