పుట:Abaddhala veta revised.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చికిత్స పేరిట చేరింది. సాల్ పెట్రి ఆస్పత్రిలో ఆమెకు నిర్బంధచికిత్స జరుగుతున్నా ఇంటికన్నా అదే ఆమెకు నచ్చింది, ఇంటికి తిరిగి వెళ్ళమన్నా ఆమె అంగీకరించలేదు. హిస్టీరియా రోగిగా ఆస్పత్రిలో వుండడమే సుఖంగా వున్నదామెకు. నేటి పిచ్చాసుపత్రివలె నాడు చార్ కాట్ ఆస్పత్రి వున్నదన్నమాట. మతసంస్థలలో చేరిన అమ్మగార్లవలె ఎంత నిర్బధంవున్నా కనీసావసరాలు తీరేవి. డాక్టరుకు భయపడి, లొంగివుండటం వల్ల అన్నీ సక్రమంగా జరిగేవి. మతచార్యులు చెప్పినట్లు నడుచుకుంటే మఠాలలో, ఆశ్రమాలలో అలాగే వుంటుంది. స్వేచ్ఛ, వ్యక్తిత్వం, సొంత ఆలోచన చంపుకుంటే సరి.

హిస్టీరియా రోగులుగా వర్గీకరించినవారిని చార్ కాట్ పరిశీలిస్తుండేవాడు. వీరు నాటకం ఆడటంలేదని, అబద్ధం చెప్పడంలేదనీ చార్ కాట్ ఉద్దేశం. నరాలజబ్బు పేరిట హిస్టీరియా చికిత్సకు ఆనాడు ఏమాత్రం గౌరవం లేదు. హిస్టీరియా పేరిట ఏదైనా చేయొచ్చు. చార్ కాట్ తన పలుకుబడి ఉపయోగించి హిస్టీరియాకు గౌరవాన్ని ఆపాదించాడు. శారీరికంగా ఎలాంటి జబ్బులేని నరాల జబ్బుకు హిస్టీరియా అని నామకరణం చేశారన్నాం గదా.

ఫ్రాన్స్ లో గిలిటన్ బయలుదేరి ఉరి తీయడానికి సౌకర్యాలు పెంపొందించే పద్ధతులు చూపాడు. ఇది ఉరి తీసేవాడి నిమిత్తం చేసిన సంస్కరణ. అలాగే జబ్బు పేరిట నటించి, ఆస్పత్రిలో వుండడానికి చార్ కాట్ మార్గం సులువుచేశాడు. బాగుపరచి బయటకు పంపే ఉద్దేశం లేదు. హిస్టీరియా నేడు మానసిక చికిత్స గౌరవం పొందడానికి ఫ్రాయిడ్ మొదలు ఎందరో తోడ్పడ్డారు.

హిస్టీరియా రోగి వర్ణించే లక్షణాలకు, నిజంగా జబ్బుచేసిన శారీరకరుగ్మతులు కొన్నిసందర్భాలలో పోలిక చూపవచ్చు. ఇది హిస్టీరియా రోగి వర్ణించే తీరులోనే వుంది. వైద్యుడు యీ తేడా గమనిస్తే హిస్టీరియా గుట్టు రట్టవుతుంది. కాని వైద్యుడికి అది గిట్టుబాటు కాదు. కనుక వైద్యపరిశోధకుడే యీ పనిచేయాలి. చార్ కాట్ తన రోగులకు తానొక సేవకుడుగా భావించలేదు. వారి లక్షణాలను వర్గీకరించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. పెత్తందారీతనంతో దబాయింపు విధానాన్ని అవలంబించిన చార్ కాట్, శాస్త్రీయ పరిశోధనకు పూనుకోలేదు. హిస్టీరియా, హిప్నాసిస్ అనేవి పరిశోధనాంశాలైతే, చార్ కాట్ చెప్పాడు గనుక అవే ప్రమాణాలు అని అనరు. నిత్య పరిశోధనలో రుజువుకు నిలబడ్డాయా లేదా అని చూస్తారు. హానిమన్ చెప్పాడు గనుక, హోమియో సరైనది అన్నట్లే, వేదాల్లోవుంది గనుక తిరుగులేదన్నట్లే, చార్ కాట్ విషయంలోనూ ప్రవర్తించారు.

హిస్టీరియా నరాలజబ్బుగా చిత్రించి ప్రచారం చేయడంలో చార్ కాట్ తనను తాను వంచించుకుంటున్నట్లు, అబద్ధాన్ని ఒక కళగా ప్రచారం చెస్తున్నట్లు గ్రహించకపోలేదు. సమాజంలో తన స్థానాన్ని నిలబెట్టుకోడానికి చార్ కాట్ తన ప్రచారాన్ని కొనసాగించవలసి వచ్చింది. శారీరిక రసాయనిక లక్షణాలు వైద్యరంగానికి చెందినవి. కాని వాటిలో నిర్ధారణ కావాలి. మానసిక,