పుట:Abaddhala veta revised.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అరవిందుడు ఇంగ్లండ్ లో చదువుకున్నాడు. ఇంగ్లీషులో కవిత్వం రాశాడు. ఇండియాకు వచ్చిన తరువాత జైలులో ఆయనకు 'దివ్యశక్తులు' కనిపించాయి. పాండిచేరిలో స్థిరపడి, భార్యను యించుమించు వదిలివేసి, పెళ్ళి అయి పిల్లలున్న ఫ్రెంచి వనితను ఆధ్యాత్మికంగా ఆకర్షించాడు. పాండిచేరిలో యోగిగా మారిన అరవిందుడు ఆధ్యాత్మిక చింతన ప్రభావంతో రాసిన లైఫ్ డివైన్, సావిత్రి గ్రంథాలలో పులుముడు ధోరణి మార్మిక లక్షణాలు బాగా కనిపిస్తాయి. లైఫ్ డివైన్ ఉద్గ్రంథాన్ని మూడో వంతుకు కుదించవచ్చని అగేహానంద భారతి వ్యాఖ్యానించాడు. ఆయన భక్తులు అరవిందుడు చనిపోయినప్పుడు, దేహం శుష్కించదనీ, శాశ్వతంగా వుంటుందనీ నమ్మి, ప్రచారం చేశారు. యోగశక్తులు అంతదూరం పోలేదని రుజువైంది!

ప్రపంచానికి గురువు, మరో అవతారం అని జిడ్డు కృష్ణమూర్తిని గురించి అనిబిసెంట్ దివ్యజ్ఞానం పేరిట ప్రచారం చేసింది. ఇదంతా శుద్ధ అబద్ధం అని గ్రహించిన కృష్ణమూర్తి జాగ్రత్తపడి, దూరంగా వున్నాడు.

గాంధీమహాత్ముడు తన ఆత్మశక్తి చెబుతున్నదంటూ, 1921లో దేశానికి స్వరాజ్యం లభిస్తుందని బాహాటంగా ప్రకటించి, పప్పులో కాలేశాడు. హిమాలయాలంత తప్పుచేశానని తరువాత ఒప్పుకోవలసి వచ్చింది.

ఇంతకూ యోగశక్తులు, దివ్యశక్తులు, అతీంద్రియశక్తులు వున్నాయా, లేవా? ఈ చర్చ వలన, సాధారణ మానవులకు యిలాంటివి లేవని తేలిందిగదా. పోతే కృత్రిమంగా శరీరాన్ని శుష్కింపజేసినందువలన, మెదడుకు తగిన పోషక పదార్థాలు అందకుండా చేసినందువలన, మందులవలన కొన్ని విలక్షణాలు కనిపిస్తాయి. వాటికి ముద్దుముద్దుగా దైవం పేరిట రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇదే అలవాటుగా మారితే, జబ్బు క్రిందకు తేలుతుందన్నమాట. ఈ జబ్బు శారీరకమైనదే. మెదడు కూడా శరీరంలో ప్రధానమైన భాగమే, మరి మనోరోగం, మనోశక్తి మాటేమిటి?

ఏది మనస్సంటే?

మనస్సు (మైండ్) అనేది, మనం సృష్టించిన తియ్యటి పదం. మనస్సు అనేది ఆత్మ, దైవంలాంటిదే, మానసిక రోగాలు ఆ కోవకు చెందినవే. మానసిక శక్తులు అనేది ఎంత నిజమో, మనస్సుకు పట్టే రోగాలు అంతే నిజం. వీటికి ఆధారం, రుజువు లేదు. అయినా మానసిక రోగాన్ని ఉజువు చెస్తామంటూ మానసిక వైద్యులు బయలుదేరారు. ఇలాంటివారి గుట్టును థామస్ సాజ్ (Thomas Szasz) బట్టబయలు చేశాడు. టి.వి.లో కార్యక్రమాలు బాగా లేకపోతే, టి.వి.ని రిపేర్ కు తీసుకెడితే ఏం ప్రయోజనం? కాని మానసికవైద్యులు అదే చేస్తున్నారు. శరీరంలోనో, మెదడులోనో వచ్చేవాటికి మానసిక జబ్బులని పేరుపెట్టి చికిత్స పేరిట వ్యాపారం చెస్తున్నాడు. అమెరికాలో సుప్రసిద్ధ హ్యూమనిస్టు థామస్ సాజ్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక తిట్లకు లంకించుకున్నారు.