పుట:Abaddhala veta revised.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన సమాజంలో "పిచ్చి" వాళ్ళను మానసిక రోగులుగా చూడడం ప్రమాదకరం. 'పిచ్చి' అనేది శారీరక, మెదడుకు చెందిన జబ్బుగా గుర్తిస్తే గొడవలేదు. వైద్యం కూడా స్పష్టపడుతుంది. మానసిక లక్షణం అనేసరికి, రోగితో వైద్యుడు ఆడుకుంటున్నాడు. ఏదీ రుజువుకు నిలబడదు. అందుకని ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం, మత్తుమందు ఇవ్వడం, గ్రామాలలో కొట్టడం సాధారణమైపోయింది. థామస్ సాజ్ దీనంతటినీ దారుణ మోసంగా ఎదుర్కొంటున్నాడు. ఎదురీదుతున్నాడు? మన సామాజంలో మతం పేరిట దివ్యశక్తులు ఎలా ప్రాబల్యంలోకి వచ్చాయో పాశ్చాత్య లోకంలో పిచ్చిపేరిట సైకియాట్రి అలా తిష్టవేసుకున్నది. ఇప్పుడిప్పుడే అవి మనకూ అంటుకుంటున్నయి.

మతం పేరిట జనాన్ని సర్వకాలాల్లో మోసం చేయవచ్చు అనేది బలపడుతున్నది. కొందరికి ఆధ్యాత్మిక వ్యాపారం గిట్టుబాటుగా వుంది. కనుక ఏదో ఒక రూపేణా అది వదలకుండా పట్టుకొస్తున్నారు.

అయితే ఏం చెయ్యాలి? అనే ప్రశ్న రావచ్చు. పిల్లలకు హైస్కూలు స్థాయిలోనే శరీరాన్ని గురించి శాస్త్రీయంగా చెప్పడం మొదలెట్టాలని థామస్ సాజ్ సూచించారు. శరీరాన్ని, మెదడును అవగహన చేసుకుంటుంటే, చాలా భ్రమలు తొలుగుతాయి. మనస్సు పేరిట (మైండ్) సృష్టించిన మతకల్పనలు, భ్రమలు,దౌజన్యాల నిజానిజాలు తెలుస్తాయి. సృజనాత్మక శక్తియుక్తుల గురించి పరిశోధన కూడా జరపాలని, వీటిగురించి సమన్వయీకరణ వుండాలని ఆల్డస్ హక్స్ లీ సూచించారు. చదువుకున్న అమెరికావంటి చోట దివ్యశక్తులు,భక్తి, ప్రార్థనలతో చికిత్సలు, అద్భుతాల బండారాన్ని జేమ్స్ రాండీ బయటపెట్టారు. అయినా మతవాదులు బ్రతుకుదెరువుకు, సమాజంపై పట్టుకు రకరకాల ఎత్తుగడలు, వ్యూహాలు పన్నుతూనే వుంటారు. బాబాల అవతారాలు బలహీనుల్ని బాధిస్తూనే వుంటాయి. హేతువాదులు నిత్యం జాగరూకులై ఎదురీదాల్సిందే.

- హేతువాది,జూన్ - జూలై 1991
పరలోక శక్తులు - నిద్ర పక్షవాతం

భూమి మీదకు అప్పుడప్పుడూ వేరే లోకాల నుండి మనుషులు వస్తున్నారని కొందరిని ఎత్తుకుపోయి మళ్ళీ వదలిపెడుతున్నారనే నమ్మకాలున్నాయి. వదంతులూ వున్నాయి. అమెరికా, యూరోప్ లో యీ వింత ప్రచారం అనేక మందిని ఆకట్టుకున్నది. కొన్ని పుస్తకాలు, సినిమాలు వచ్చాయి.

ఇతర లోకాలలో మనుషులు వున్నరా? వారే భాష మాట్లాడుతారు? ఎలా ప్రయాణం చేస్తారు?

ఈ విషయాలపై పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు