పుట:Abaddhala veta revised.pdf/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేరుకుని, ప్రపంచమే నేను, నేనే ప్రపంచం అనే దశను అనుభవించామన్నారు. ఒక అరగంట వున్న ఈ స్థితి ఎల్.ఎస్.డి వల్లా, మాత్సుకో అనే స్త్రీ సాంగత్యంలో లభించిందన్నారు. బౌద్ధులు చెప్పే శూన్యదశ, హిందువులు చెప్పే సమాధి, తురియావస్థ, బ్రహ్మలో ఏకం కావడం యిత్యాదులన్నీ యివేనని భారతి అనుభవపూర్వకంగా చెప్పారు.

1952-53 ప్రాంతాలలో అస్సాంలో వుండగా తాంత్రిక యోగ సాధనలో కూడా శూన్యస్థితికి చెరుకున్నట్లు ఆగేహానంద భారతి పేర్కొన్నారు. తాంత్రిక విద్యలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు దశలున్నాయి. ఉత్తరార్థంలో మద్యం సేవిస్తూ, మాంసం, మత్స్యం ఆరగిస్తూ, స్త్రీ సన్నిధిలో ముద్రవేసి, మైధునం జరపాలి. సంభోగంలో రేతస్సును స్థంభింపజేయాలని కొందరు తాంత్రికులంటారు. ఊపిరిని, శుక్లాన్ని, ఆలోచనను స్థంభింపజేస్తే శూన్యదశ చేరుకుంటారని వారి నమ్మకం. బౌద్ధ తాంత్రికులు, హిందువులలో కొందరు యీ పద్ధతిని నమ్ముతారు. ద్వైతం పోయి ఏకత్వం సిద్ధిస్తుందని వారి విశ్వాసం. తాంత్రిక ఆశ్రమాలను భారత ప్రభుత్వం నిషేధించిన దృష్ట్యా ప్రస్తుతం తాంత్రిక యోగసాధన యీ పద్ధతిలో సాగడంలేదు.

1950 ప్రాంతంలో ఆగేహానంద భారతి సన్యాసిగా పాదయాత్ర చెస్తూ నాగపూర్ సమీపంలో దారితప్పారు. అప్పట్లో సౌదర్యలహరి ఆలాపిస్తూ సంచరిస్తున్నారు. అందులో అందమైన దేవీస్తుతి ఆయనకు హత్తుకుపోయింది. ఆకలితో అలసటతో వుండడం, అప్పుడే పాడుబడిన విఠలేశ్వర దేవాలయానికి చేరుకున్నాడు. అక్కడ దేవీ విగ్రహం కనిపించగా, అప్పుడే పూజచేసి ఎవరో దండవేసి వెళ్ళిన దృశ్యం కూడా చూచాడు. నమస్కరించి, వెళ్ళిపోయాడు. కొన్ని మైళ్ళ దూరాన వున్న గ్రామస్తులు మజ్జిగ యిస్తే తాగి, దేవీ విగ్రహానికి పూజలు చేస్తున్న పూజారి ఎవరు అని అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి చుట్టుపట్ల దేవీ విగ్రహం ఏదీ లేదని చెప్పారు. చూపిస్తాను రమ్మంటే, ఒక అబ్బాయిని యిచ్చి పంపారు. వెళ్ళి చూస్తే పాడుబడ్డ దేవాలయమేగాని, దేవీవిగ్రహం లేదు. తన మానసిక ధోరణి, మనస్సుపై సౌదర్యలహరి స్తుతి ప్రభావం వలన, ఆకలిపై వున్న ఆగేహానందకు దేవీ విగ్రహం కనిపించినట్లయింది. మనస్సులో వున్నదే బయట చూచినట్లయింది.

ఒకసారి హౌరా స్టేషన్ లో వుండగా ఆగేహానంద భారతి దగ్గరకు ఒక సాధువు వచ్చి, నేనే భగవంతుడ్ని అన్నాదట. భారతి సమాధానమిస్తూ అది అసంభవం అన్నాడు. ఎందుకని? అని సాధువు ప్రశ్నిస్తే, నేనే భగవంతుడ్ని గనక అని భారతి సమాధానం చెప్పాడు. వెంటనే ఆ సాధువు భారతి కాళ్ళపై సాష్టాంగపడి, మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అలా గట్టిగా అరమరికలు లేకుండా జంకూగొంకూ లేకుండా చెబితే నమ్మేవారున్నారు. వివేకానంద ఇలాగే రామకృష్ణ పరమహంస మాటలు నమ్మాడు. నీవు దేవుణ్ణి చూశావా అని నరేంద్రనాధ్ (వివేకానంద కాక పూర్వం) అడిగితే, చూశాను , నీవూ చూడొచ్చు అని రామకృష్ణ పరమహంస చెప్పేసరికి, మళ్ళీ ప్రశ్నించకుండా లొంగిపోయి శిష్యుడయ్యాడు. సూచన(Suggestion) అలా పనిచేస్తుంది సందేహవాదులమీద