పుట:Abaddhala veta revised.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హాస్టళ్ళలో కులరీతులు విస్తరిల్లాయి. స్థానిక సంస్థలలో ఉద్యోగాలు, పదవులు, కులరీత్యా పంపిణీ జరిగింది. అలా వీలులేనిచోట అవసరమైతే ఎన్నికలు వాయిదావేసి, నామినేట్ చేసిన సందర్భాలున్నాయి. బ్రాహ్మణులు జస్టిస్ పార్టీకి దూరంగా వుండగా, కాంగ్రెస్ లో ఉత్తరోత్తరా ప్రముఖపాత్ర వహించిన కమ్మవారు జస్టిస్ పార్టీకి సుముఖంగా వున్నారు.

కాంగ్రెసులో అన్ని కులాల వారున్నప్పటికీ పెత్తనం బ్రాహ్మణులదే. స్వాతంత్ర్యం వచ్చేవరకూ అదే స్థితి కొనసాగింది. అయితే అందులో ఏకత్వం లేదు. వైదికనియోగ కలహాలు సంభవించాయి. ప్రకాశం-పట్టాభి రాజకీయాలన్నీ యీ బ్రాహ్మణశాఖల పరంగానే సాగాయి. అలాగే కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు మొదలైన నాయకులు, వి.వి.గిరి, తెన్నేటి విశ్వనాథం, కళా వెంకటరావు ప్రభృతులు యీ కలహ పురాణాల్లో రాజకీయాలు నడిపారు. కాంగ్రెసులో యీ బ్రాహ్మణ నాయకత్వాల చుట్టూ మిగిలిన అగ్రకులాలు పరిభ్రమించాయి. ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలోనూ యివి పనిచేశాయి.

జస్టిస్ పార్టీ 1937లో అంతమైన తరువాత క్రమంగా కాంగ్రెసులో చేరిన జమీందార్లు, పెద్ద రైతులు, బాబులు, ఆయా నాయకుల్ని ఆశ్రయించారు. జైళ్ళకు కూడా కులరాజకీయాల్ని మోసుకెళ్ళారు.

అధికారం కోసం కులాన్ని అడ్డం పెట్టుకొని కొట్టుకున్నారేగాని, అందరి సంక్షేమం కొరకు కాదని గ్రహించాలి. ఈ కుంపటి యజ్ఞంలో కొందరు కులాల పేరిట చదువుకొని, ఉద్యోగాలు సంపాదించి, ఆర్థికంగా బాగుపడి వుండొచ్చు. కాని సమాజంలో ఉత్తరోత్తరా ప్రబలిన కులద్వేషాలకు యివి దోహదం చేశాయి. ఆజ్యం పోశాయి. రాజకీయాల్లో కులాన్ని ప్రవేశపెట్టిన పాప ఫలితమే య్దంతా.

ఫిర్కా సంస్కరణ ద్వారా ఉద్ధరించాలని పథకం వేసిన టంగుటూరి ప్రకాశం, మద్రాసు ప్రభుత్వాధినేతగా అందరూ బ్రాహ్మణులనే ఫిర్కాస్కీంలో నియమించారు. ఇతర కులమంత్రులు తమ చేతనైనంతగా తమ కులంవారికి తోడ్పడ్డారు. ఎవరికి వారే కులాధిపతులుగా చలామణి అయ్యారు.

స్వాతంత్ర్యం వచ్చే నాటికి యిదీ కుల రాజకీయాల పరిస్థితి! కులసంఘాలు ఏర్పడి, తీర్మానాలు చేశాయి. కాని కులం పోగొట్టుకోవాలనే వామపక్ష ధోరణులు కూడా అప్పుడే వచ్చాయి. కులాంతర వివాహాలు జరిగాయి. పురోహితుడుకాని, మంత్రాలుకాని లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కాని వారి సంతానానికి కులం పోగొట్టలేకపోయారు.

అంటరానితనం పోవాలనే కార్యక్రమం చేబట్టిన వారు కూడా పైపైన ఏదో పనులు చేశారుగాని, మూలం మతం రీత్యా వుందని గ్రహించారు. వెనుకబడిన కులాలవారు సైతం అంటరానివారిని కలుపుకోలేక పోయారు.