పుట:Abaddhala veta revised.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యిందుకుగాను తమిళులతో చేతులు కలిపారు. కాంగ్రెసు లో బ్రాహ్మణులు మధ్య నియోగి- వైదిక స్పర్థలు ఒక వైపున వుండగా, ఆంధ్ర-అరవ బ్రాహ్మణుల మధ్య కలహాలు మరోవైపు సాగాయి. ఇందులో దివ్యజ్ఞాన సమాజ నాయకురాలు అనిబిసెంట్ అరవ బ్రాహ్మణ కోపు వేసుకున్నది.

1912లో నటేశ మొదలియార్ ద్రావిడ సంఘాన్ని స్థాపించారు. ద్రావిడ సాహిత్య ప్రచురణ జరిగింది. బ్రాహ్మణేతర హాస్టళ్ళను ప్రోత్సహించారు. 1916లో దక్షిణ ప్రజాసంఘం వచ్చింది.

జస్టిస్ పార్టీకి నాంది పలికారు. అధికారంలోకి రావాలనే ఆకాంక్ష యిందులో వుంది. ఆంధ్ర, తమిళ బ్రాహ్మణేతరులు కలిసి 1916లో యీ పార్టీని స్థాపించారు. బ్రిటీష్ వారి ఆశీర్వచనం వీరికి వుంది.

జస్టిస్ పార్టీ పుట్టేనాటికి రూరల్ బోర్డులు, తాలూకా బోర్డులు రాగా, ఆ తరువాత జిల్లా బోర్డులు వచ్చాయి. స్థానిక సంస్థలలో తమ ఆధిపత్యానికి ఆయా అగ్రనాయకులు ప్రయత్నించారు.

జస్టిస్ పార్టీ అధికారానికి వచ్చిన తరువాత కొత్తకుల రాజకీయాలు వచ్చాయి. బ్రాహ్మణేతర పార్టీగా పేరు తెచ్చుకున్న పార్టీ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ద్వేషించింది గాని, బ్రాహ్మణత్వాన్ని అనుకరించింది. బ్రాహ్మణుల వలె తామూ కావ్యాలు రాయగలమని,మంత్రాలు చెప్పగలమని, పాండిత్యం ప్రదర్శించగలమని నిరూపించదలచారు. అలాగే అనేక పుస్తకాలు వచ్చాయి. అన్ని రంగాలలో బ్రాహ్మణులను అనుకరించారు. పెళ్ళిళ్ళలో పౌరోహిత్యం చేయించారు. దీనివలన కమ్మ బ్రాహ్మణులనే పేరు కూడా వచ్చింది. మిగిలిన వారి కంటె కమ్మకులంవారు బ్రాహ్మణులతో బాగా పోటీపడ్డారు. కనుక వృత్తిరీత్యా తమ భృతిని దెబ్బతీశారనే కోపం బ్రాహ్మణులకు సహజంగానే కమ్మవారిపై ప్రబలింది. రెడ్లు, క్షత్రియలు, రాజులు, కాపులు అధికారం కోసం తిప్పలుపడినా వృత్తిరీత్యా బ్రాహ్మణులతో తారసిల్లలేదు. బ్రాహ్మణ, కమ్మద్వేషం బాగా ప్రబలి, నాటుకపోయింది. జస్టిస్ పార్టీలో నాయకులు, ముఖ్యంగా పానగల్లు రాజా అవసరమైతే బ్రాహ్మణుల సహాయం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. బొబ్బిలిరాజా జస్టిస్ పార్టీలో బ్రాహ్మణుల్ని చేర్చుకోవాలన్నారు. మునిస్వామి నాయుడు కమ్మ ముఖ్యమంత్రిగా జమీందారులైన రాజులు, క్షత్రియులపై పోరాడారు. జస్టిస్ పార్టీలోని బ్రాహ్మణేతరులు, ముఖ్యంగా రాజులు, క్షత్రియులు ఒక వైపు, కమ్మ మరోప్రక్క కొట్టుకున్నారు.

దేవాలయంపై బ్రాహ్మణులకు వున్న పట్టు తప్పించాలని జస్టిస్ పార్టీ ప్రయత్నించి విఫలమైంది. అధికారంలో మంత్రులుగా జస్టిస్ పార్టీవారున్నప్పటికీ, కీలక ఉద్యోగాలలో ఐ.పి.యస్. అధికార్లలో బ్రాహ్మణులు ఎప్పటికప్పుడూ జస్టిస్ వారికి అడ్డుపడుతూ వచ్చారు. సాధ్యమైనంతవరకు జస్టిస్ పార్టీవారు తమ కులాల్ని ప్రోత్సాహించి, పెంచి పోషించారు. విద్యారంగంలో,