పుట:Abaddhala veta revised.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అందరికీ ఓట్లు వచ్చిన దృష్ట్యా అంటరానివారికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి, రిజర్వేషన్ లకు ఒప్పుకున్నారు. వారి ఓట్లకోసం అనేక ఆకర్షణలు విసిరారేగాని, అంటరానితనం పోగొట్టడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. ప్రయత్నించరు కూడా.

తెలంగాణా ప్రాంతంలో బూర్గుల రామకృష్ణారావు-కొండా వెంకటరంగారెడ్డి కొట్లాటలు,రావు, రెడ్డి ముఠాల పేరిట బ్రాహ్మణ-రెడ్డి కలహాలు రాజకీయాల్లో ప్రవేశించాయి. ఆంధ్రతో కలిసే వరకూ యీ కులపోరాటాలు రాజకీయాల్లో సాగాయి. ఇందులో మహారాష్ట్ర, కర్నాటక వారు కూడా చేతులు కలిపారు.

మద్రాసు నుండి విడిపోయి ఆంధ్ర ఏర్పడినప్పుడు రెడ్డి నాయకత్వం జాగ్రత్తగా బ్రాహ్మణుల్ని కలుపుకున్నది. టంగుటూరి ప్రకాశాన్ని అడ్డం పెట్టుకుని సంజీవరెడ్డి పాలన సాగించారు. బెజవాడ గోపాలరెడ్డి ఈ సమరంలో సంజీవరెడ్డికి లొంగిపోయాడు. కమ్మ నాయకత్వం కోసం రంగాచేసిన కృషి, బ్రాహ్మణ ఆధిపత్యానికి బూర్గుల రామకృష్ణారావు ప్రయత్నం విఫలమయింది. తెలంగాణా ఆంధ్ర కలిసేసరికిరెడ్డి నాయకత్వం బలపడింది. ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి నాయకత్వం తిరుగులేనిదిగా ప్రారంభమైంది.

ముఖ్యమంత్రి పదవి కీలకమైంది. అధికారం చేజిక్కించుకుంటే మిగిలినవి సమకూర్చు కోవడం సులభం. కులాన్ని బలపరచడమూ సాధ్యమే. ముఖ్యమంత్రి కులానికి ప్రాధాన్యత వస్తుంది. "మన వాళ్ళకు" పనులు జరుగుతాయి. ఇతర కులాలవారికి కొంత మేత పడేసి అట్టిపెట్టవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించిన కులం, పరిపాలనలో, న్యాయవ్యవస్థలోనూ ప్రాకింది. ఆంధ్రప్రదేశ్ లో వున్నతంతు ఇతర రాష్ట్రాలలోనూ వుండేవి. సంజీవరెడ్డి, బ్రాహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, అంజయ్య, విజయభాస్కరరెడ్డి, భవనం వెంకట్రామ్, జనార్ధనరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా రెడ్డి కులాన్ని జాగ్రత్త చూచుకోగలిగారు. సంజీవయ్య రాజీ అభ్యర్ధిగా ముఖ్యమంత్రి అయినందున అట్టే చేయలేకపోయారు. వెంగళరావు వెలమలకు సేవచేసినా వారి సంఖ్యాబలం తక్కువ అయినందున అట్టే రాలేదు. పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా బ్రాహ్మణ రాజ్యస్థాపనకు కృషి చేశారు. వర్ణవ్యవస్థ కావాలన్న విశ్వనాధ సత్యనారాయణ పుస్తకాలు కొనిపించడంతో బాటు, వేయిపడగలు హిందీలోనికి అనువదించడం, పురోహితవర్గాన్ని కొమ్ముకాయడం వంటివి చేయగలిగారు. కేంద్రంలో ఇందిరాగాంధి తెలివిగా అంటరాని కులోద్ధరణ కార్యక్రమాలు చేబట్టి ఓట్లు దండుకోగా, రాష్ట్రాలలో అది బాగా ఉపయోగపడింది. బ్రాహ్మణేతర అగ్రకులాలకు వ్యతిరేకంగా హరిజనులు, బ్రాహ్మణులు కలవడం పెద్ద వ్యూహమే. ఇందిరాగాంధి తమ ఉద్ధరణకై చిత్తశుద్ధితో పనిచేసిందని నమ్మేవారూ, పి.వి. నరసింహారావు నాయకత్వాన్ని అంగీకరించే షెడ్యూలు కులాల వారూ యీ వ్యూహంలో పడి కొట్టుకుంటున్నవారే! రాష్ట్ర ముఖ్యమంత్రిగా యన్.టి.రామారావు వున్నప్పుడు కమ్మకులానికి యెక్కడలేని ప్రాధాన్యత వచ్చింది. మారుమూలనున్న వారిని వెతికి తెచ్చి పదవులు కట్టిపెట్టారు. కమ్మ రాజ్యస్థాపనకు