పుట:Aandhrakavula-charitramu.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

600

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

4. అయ్యలరాజు రామభద్రుఁడు రామాభ్యుదయమునందు-

       ఉ. నైరిభవారిభద్విరదశాస ఖడ్గఖరాధిరూఢులై
           తారలు బూరగొమ్ములను దప్పెటలుం బటహంబులుం బదు
           ల్నూఱులు వేలు మ్రోయఁ గవను ల్వడి హత్తి యుత్తర
           ద్వారకవంకఁ దాఱ కిరువంకలఁ బౌఁజులు దీర్చి రయ్యెడన్.

5. పిల్లలమఱ్ఱి పినవీరన్న- జైమినిభారతమునందు -

       ఉ. తూరుపు తెల్లవాఱుటయుఁ దోడనె మంగళపాఠకస్తుతుల్
           మీఱఁ దదీయరాగముల మేల్కొని కాల్యసమంచితక్రియల్
           దీఱిచి పాండుపుత్ర వసుదేవసుతుల్ ప్రమదంబు మోములం
           దేరఁగ వేడ్కతో నరుగుదెంచి సభాస్థలి నిల్చి రయ్యెడన్.

6. సంకుసాల నృసింహకవి కవికర్ణరసాయనమందు -

        గీ. వనధి సర్వంకషంబయ్యు వలయుపనికి
           ఱేపులనెకాని దొరసాని రీతిదనరి
           విశ్వరూపకుఁడయ్యు శ్రీ విభుఁడు కూర్మ
           రూపమున సేవ్యుఁడగు నారురుక్షులకును.

తిమ్మకవి చూపినట్లు రేఫఱకారమును మైత్రి చేసిన మహాకవు లింతమంది యుండఁగా వీరినందఱిని లాక్షణికులనుగా నంగీకరించి వీరి పద్యముల నుదాహరించిన యప్పకవియొక్క బమ్మెర పోతరాజును మాత్రము రేఫఱకారములకు యతిప్రాసములయందు పొత్తుగలిపె నన్న హేతువు చేత నేల నిరాకరింపవలయునో యూహించుట మానసగోచరము కాకున్నది. ద్విరేఫ భేదవిషయమున నిప్పటివారు పూర్వపువారిని మించినారు. పూర్వులలోఁ గొందఱు తద్భవమున శకటరేఫము లేదన్నారు. తాతంభట్టు కవిలోక చింతామణియందు “అచ్చ తెనుఁగులను దీర్ఘముల మీఁద బండఱాను లేదు పద్మనాభ!" యని చెప్పియున్నాడు. ఇప్పటివా రన్ని చోట్లను బండిఱాలు కనిపెట్టినారు.