Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

599

బ మ్మె ర పో త రా జు

       
        క. కేరుచు నొయ్యన డగ్గఱ
           జేరుచు నురుముష్టిహతికిఁ జిక్కక వేగం
           దాఱు చహంకృతం గ్రమ్మఱ
           దూఱు చధోక్షజుఁడు మల్లుఁ ద్రుంచె ననంగన్.

       మ. పురిటింటం బసిబిడ్డచందమున వాపోవంగ నాఁ డాత్మలో
           మురువొప్ప న్విషదుగ్ధయుక్తకుచయై ముద్దాడు రాకాసి గు
           ర్తెఱి గిష్టంబుగఁ బాలు ద్రావు మిషచే నిర్వైన కాలంబునం
           ధరణిం గూల్చిన నందపుత్రువలనం దార్కాణ ధర్మస్థితుల్.

ఇట్లొక్కయప్పకవి మాత్రమే గాక రేఫఱకారములకు యతిప్రాసమైత్రి కూర్చిన యితర మహాకవుల పద్యములను గూడ సర్వలక్షణసారసంగ్రహమునందుఁ గూచిమంచి తిమ్మకవి చూపినవానిలోఁ గొన్నిటి నిందుదాహరించుచున్నాను.

1. అల్లసాని పెద్దన మనుచరిత్రమునందు—

       శా. శ్రేణుల్గట్టి నభోంతరాళమునఁ బాఱెం బక్షు లుష్ణాంశుపా
           షాణ వ్రాతము కోష్ణమయ్యె మృగతృష్ణావార్డు లిం కెం జపా
           శోణం బయ్యెఁ బతంగబింబము దిశాస్తోమంబు శోభాదరి
          ద్రాణం బయ్యె సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్.

2. కృష్ణరాయలు, ఆముక్తమాల్యదయందు -

      మ. ఇలకు న్వ్రేఁగగుఁ బండు తీరవనపుండ్రేక్షుచ్చటల్ తీపు ల
          గ్గలమై వ్రాల నురుస్వనంబు లెసఁగంగాఁ ద్రిప్పు రాట్నంపుగుం
          డ్రలునాఁ దేనెకొలంకులం బొరలి పాఱన్విచ్చుపంకేరుహం
          బుల నాడెం దొలుసంజఁ దేటివలయంబు ల్తారఝంకారముల్.

3. పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నమునందు-

       క. గ్రక్కునఁ జని వాలుదునో
          ఱెక్కలుఁ గట్టుకొని దివిజరిపుమేడలపై
          నక్కొమ్మఁ జూచు టెపు డెపు
          డొక్కో ? యనునంత తమక మున్నది మదిలోన్.