పుట:Aandhrakavula-charitramu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

289

అ ధ ర్వ ణా చా ర్యుఁ డు

కోరిక గలవారికి గ్రంధము మఱి యెక్కడ దొరకును ? ఎక్కడ నైనను కారికావళి పుస్తకరూపమున నున్నను, ప్రకటింపఁబడినను తత్కారికలన్నియు కవిశిరోభూషణమునుండి యెత్తి వ్రాయఁబడినవే గాని వేఱుకావు. నన్నయ భట్టునకుఁబ్రధమాచార్యత్వమును, అధర్వణాచార్యునకు ద్వితీయాచార్యత్వమును, మొట్టమొదట సృజించి యాంధ్రపండిత లోకమున వ్యాపింపఁ జేసినవాఁడహోబలపండితుడే యని తోఁచుచున్నది. ఈ కారికలను రచియించినవాఁడు నిజమయిన యథర్వణాచార్యుఁడు గాక పేరు మార్చుకొన్న కృత్రిమాధర్వణాచార్యుఁ డగుటచేత, పాడి వేంకటస్వామిగా రన్నట్టు మొదట గాలి నరసయ్యరూపమునుండి వాతూలాహోబలరూపమునకు మాఱి మరల "వాతూల వంశే౽వతారభూయశ్శ్రీనన్నవిద్వానహమేవ సో౽స్మి” అని తానే చెప్పుకొన్నట్లు విద్వాంసుఁడయి ప్రధమాచార్యుడైన యా నన్నయభట్టారకుఁడే యీ యభినవ నన్నయభట్టావతారమున ద్వితీయాచార్యుఁ డయి వికృతివివేకకర్తయయి యుండును. కారికావళీకర్తకు ప్రధమాచార్య భావన యకలంకుని శబ్దానుశాసనమును నిపుణము గా చదువుటచేత దానిలోని మంగళ శ్లోకమువలనఁ గలిగెను. వికృతివివేక కారుఁడు శబ్దానుశాసనకర్తయైన యకలంకునిశిష్యుఁడై నను కాకపోయినను దన పుస్తకమునందాతనిఁని బేర్కొనుటచేతనే 1604 వ సంవత్సరమునకుఁ దరువాతివాఁడని నిరాక్షేపణీయ సిద్ధాంతమేర్పడుచున్నది. అధర్వణునిచే రచియింపఁబడినది త్రిలింగ శబ్దాను శాసన మొక్కటియే కాని వికృతివివేకము కాదు. ఆంధ్రకౌముదీకారుఁడు తా నధర్వణవ్యాకరణమును జదివినట్లీ క్రింది శ్లోకమున జెప్పి యున్నాడు.

           "అధర్వణాని కాణ్వాని బార్హస్పత్యాని సంవిదన్
            కౌముదీ మాంధ్రశబ్దానాం సూత్రాణి చ కరోమ్యహమ్."

దీనినిబట్టి యధర్వణాచార్యుఁడు పండ్రెండవ శతాబ్దాంతమునందో, పదుమూడవ శతాబ్దాది నో యున్నట్లు నిశ్చయముగాఁ దెలియవచ్చుచున్నది. అహోబలపండితు లీతనిని ద్వితీయాదార్యుఁ డని వాడుటయు, ఇతఁడు