పుట:Aandhrakavula-charitramu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

255

రంగనాథుఁడు

     చ. 'అనఘు హుళక్కిభాస్కరు మహామతి శ్రీబిల్లలమఱ్ఱి పెద్దిరా
         జును బినవీరరాజుఁ గవిసోమునిఁ దిక్కనసోమయాజిఁ గే
         తనకవి రంగనాధ నుచితజ్ఞుని నెఱ్ఱన నాచిరాజుసో
         మన నమరేశ్వరుం దలతు మత్కులచంద్రుల సత్కవీంద్రులన్.'

పూర్వలాక్షణికు లందఱును రంగనాధుని లాక్షణికకవినిగా నంగీకరించియున్నారు. ఇప్పడు ముద్రితమైన గ్రంథమునందుఁ గొన్ని ప్రక్షిప్తభాగములు కూడ చేరియున్నందున, అక్కడక్కడఁ గొన్ని వ్యాకరణదోషములు కానవచ్చుచున్నవి. కాని యవి కవివి కావనుట నిశ్చయము. పుస్తకమునం దెక్కడను కవి పేరైనను లేకపోవుటయే కాక కాండముల యంతముల యందుఁగూడ,

     ద్వి. 'అని యాంధ్రభాష భాషాధీశనిభుఁడు
           వినుతకావ్యాగమవిమలమానసుఁడు
           పాలితాచారుఁ డపారథీ శరధి
           భూలోకనిధి కోనబుద్ధభూవిభుఁడు
           తమతండ్రి విఠ్ఠలధరణీశుపేరఁ
           గమనీయగుణ ధైర్యకనకాద్రిపేర
           బని పూని యరిగండభైరవుపేర
           నాచంద్రతారార్కమై యొప్పుమీఱ
           భూచక్రమున నతిపూజ్యమై వెలయు
           నసమాన లలిత శబ్దార్ధసంగతుల
           రసికమై చెలువొందు రామాయణంబు
           పరఁగ నలంకారభావనల్నిండc
           గరమర్థి ... ... కాండంబు సెప్పె.'

అని కోన బుద్ధరాజు రచియించినట్టే వ్రాయబడియున్నది. అయినను బుద్ధరాజు తన్నును, దనకావ్యమును బొగడుకొన్నట్టున్నరీతినిబట్టి చూడఁగా పండితులాత్మస్తుతి పరాయణులు కాఁజాలరు గనుక పుస్తకమును వేఱొకరు రచియించిరనియే యూహింపవలసి యున్నది.