పుట:Aandhrakavula-charitramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తావన

సంఘ సంస్కర్తలు, నవకవితా వైతాళికులు శ్రీకందుకూరి వీరేశలింగంగారు రచించిన ఆంధ్రకవుల చరిత్ర ప్రతులకోసం తెలుగునాడు నాల్గు చెరగుల నుండి మాకుత్తరాలు పుంఖాను పుంఖాలుగా వచ్చినవి. వస్తున్నవి. అప్పటికే ఆంధ్రకవులచరిత్ర మూడు భాగముల ప్రతులన్నియు చెల్లుబడి యయిపోయినవి.

పుస్తకోపేక్షితులయిన ఆంధ్రపుత్రుల అభ్యర్థనల ననుసరించి, ఆనాటికి ఆంధ్ర కవులచరిత్ర మీది విమర్శనలను గమనించి దానిని సమగ్రంగా సంస్కరించి ప్రచురింప ఆనాటి హితకారిణి సమాజంవారు కృతనిశ్చయులైనారు.

ఆనాటి హితకారిణీ సమాజమునకు అధ్యక్షులు మధురకవి శ్రీ నాళము కృష్ణారావు కార్యదర్శి శ్రీ దంగేటి నారాయణస్వామి, శ్రీ నాళము కృష్ణారావు ఆధ్యక్షతను ౩౦-10-50 నాడు జరిగిన హితకారిణీ సమాజ కార్యనిర్వాహక వర్గ ప్రత్యేకసభలో ఈ క్రింది తీర్మాన మామోదింపబడినది.

"ఆంధ్ర కవులచరిత్ర సవరణలో అత్యవసరమని తోచిన సవరణలు, మార్పులు, చేర్పులు, ఈ వగైరా మార్పులు చేర్చుట లేక Foot Notes లో చేర్చుట, అనే మొదలగు సూచనలన్నియు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికే వదలివేయుటకు తీర్మానింపబడినది. అతి ముఖ్యమని తోచిన చోట్ల మార్పులుచేస్తూ వీరేశలింగంగారి ప్రత్యేకతకు భంగం రానివ్వరని కమిటీవారు విశ్వసించుచున్నారు."

ఆ తీర్మానము ననుసరించి శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు ఆంధ్రకవుల చరిత్రను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించి హితకారిణీ సమాజం వారికి ఆందచేశారు.

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారిని ఆ బృహత్కార్యం నిర్వర్తించినందులకు - మా హితకారిణీ సమాజం 500 రూపాయలు పారితోషికమిచ్చి ఘనంగా సన్మానించింది.