ఆంధ్రకవుల చరిత్రలో కొట్టవచ్చినట్లు కానిపిస్తున్న కొన్ని లోపాలను చక్కదిద్ది ప్రచురించాలనే ఉద్దేశంతో మధురకవి శ్రీ నాళము కృష్ణారావు, శ్రీ దంగేటి నారాయణస్వామి అధ్యక్ష కార్యదర్శులుగానున్న హితకారిణీ సమాజం 1950 వ సంవత్సరంలో ఆంధ్రకవుల చరిత్రను పరిష్కరించే బృహత్కార్యభారాన్ని ఆంధ్రచరిత్రపరిశోథక వైదుషీధురంధులయిన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారి భుజస్కంధాలమీదనుంచింది. సహృదయంతో ఆకార్యభారాన్ని స్వీకరించి సువిమృష్టంగా పరిశీలించి వారాంధ్ర కవుల చరిత్రను సంస్కరించి 1952 వ సంవత్సరప్రాంతాలలో ఆవతారికతో పాట హితకారిణీ సమాజం వారికందచేశారు.
ఆనాటినుండి హితకారిణీ సమాజంవారు ఆంధ్రకవులచరిత్రను పునః ముద్రించడంకోసం బహుళప్రయత్నాలు చేసినారు. నేటికి దైవమనుకూలించింది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఆర్థికసహాయం చేసింది. ఆంధ్రకవుల చరిత్ర ప్రథమభాగం వెలుగుచూచింది.
శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఆంధ్రకవుల చరిత్రలో నూతనంగా సంతన చేసిన కవుల నామాలముందు విషయసూచికలో చుక్కల గుర్తులుంచినాము.
వారిందులో చేర్చిన నూత్న విశేషాల్ని, అధస్సూచికల్ని [ ] ఈ బ్రాకెట్లచే సూచించినాము.
వారు చేర్చిన విశేషాంశాలు, అధస్సూచికలు ఎంత అమూల్యాలో విద్వద్వర్యులకు వివరింపనక్కరలేదు.
ఓం తత్ సత్
రాజమహేంద్రవరం
12-2-1978
విద్వాన్ సహదేవ సూర్యప్రకాశరావు
ఉపాధ్యక్షులు
హితకారిణీ సమాజము