ఆ నాటినుండి ఆంధ్రకవులచరిత్రను ప్రచురించడంకోసం ప్రయత్నాలు చేస్తున్నాము, ప్రధానంగా ధనాభావమే మా ప్రయత్నానికి అవరోధమని మనవి చేయనవసరంలేదు. నేటికి మా ప్రయత్నం సఫలీకృతమయింది. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ ప్రభుత్య విద్యాశాఖామాత్యులు శ్రీ మండలి వేంకట కృష్ణారావుగారి సహృదయత వల్లనే ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నుండి ఆుధ్ర కవుల చరిత్ర ముద్రణకోసం రు 10,000 విరాళమందినది. వారికి మా మస8పూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఆంధ్రకవుల చరిత్ర ప్రధమ భాగాన్ని ముద్రించినాము. ఇటులనే ఆంధ్రకవుల చరిత్ర ద్వితీయ భాగాన్ని (మధ్యకాలపు కవులు) తృతీయ భాగాన్ని (ఆధునిక కవులు) ప్రచురించడానికి విరాళమందీయుమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించుచున్నాము.
పాఠకుల ఉపయోగార్థం పూర్వ ప్రచురణల పీఠికల్ని ఈ గ్రంధంలో పొందు పఱచినాము.
ఇందులో ఇంకను ఏమయిన మార్పులు చేయవలసి యున్నను, పొసగిన దొసగులను మలి ముద్రణలో సవరించగల వారము.
సాకల్యంగా ఆంధ్ర కవులచరిత్రమును పరిష్కరించి ఇచ్చిన చరిత్ర చతురాననులు కీ.శే. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికి మా శ్రద్ధాంజలి, మమ్ము ప్రోత్సహించి, మాతో సహకరించి ఈ గ్రంథమును సర్వాంగ సుందరముగా తీర్చి దిద్ది పరిచయవాక్యాలు వ్రాసిన మా హితకారిణీ సమాజోపాధ్యక్షులు విద్వాన్ శ్రీ సహదేవ సూర్యప్రకాశరావుగారికి కృతజ్ఞతా పూర్వకంగా మా సుమాంజలి.
పుస్తక మచ్చువేసి యిచ్చిన శ్రీ సుజనరంజనీ ముద్రాశాల వారికి మా ఆభినందనలు.
మొండ్రేటి లక్ష్మీపతి
అధ్యక్షులు
దంగేటి లక్ష్మణరావు
కార్యదర్శి
హితకారిణీ సమాజము
రాజమహేంద్రవరం
12-2-1978