పుట:ASHOKUDU.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

అ శో కుఁ డు

నేమేమియో పాడుకొనుచుఁ బోవుచుండెను. అతని వంకను జూడవలయుననియు నాతనిగానము బాగుగానాలకింపవలయు ననియు మహా రాజు మిగులఁగుతూహల పడియెను. అప్పుడొక సేవకున కాజ్ఞాపించుట చే సేవకుఁ డాబౌద్దబాలసన్యాసి నచ్చటకుఁ దీసికొని వచ్చెను.

మహారాజు పరమాదరముతో నా బాలయోగి నుచితాసనమునఁ గూర్చుండఁ జేసెను; ఆతని యోగక్షేమములం దెలిసికొనియెను. అప్పుడా బాలయోగి తన నామము నిగ్రోధుఁడనియుఁ దన గురుని పేరు తిష్యుఁడనియుఁ దెలియఁ జేసి యీ క్రిందివిధముగ గానము సేయఁదొడంగెను. దాని భావమిది--

జీవునకు దేహము గేహమువంటిది. దేహరూపంబగు నీగృహమును నిర్మించిన తృష్ణం గూర్చి యన్వేషించుచు నే ననేక పర్యాయము లీజగంబునకు వచ్చియుంటిని; అనేక జన్మములను గ్రహించియుంటిని, మరలమరల నెల్ల కాలమును జన్మాంతరముల నందుచుండుట ఎంతదుఃఖకరము ! ఓగృహ నిర్మాణ కారిణీ ! నే నిప్పటికి నిన్ను బ్రత్యక్షముగఁ జూడఁ గలిగితిని. ఇఁక నీవు మరల నీగృహమును నిర్మింపఁజాలవు. గృహ స్తంభములను, బార్శ్వదండములను గూడ సంపూర్ణముగ నేను భగ్నము చేసి వైచితిని. సంస్కార విహీనం బగు నాహృదయ మిప్పటికిఁ దృష్ణాక్షయసాధనమును గ్రహింపఁగలిగినది."

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/70&oldid=333993" నుండి వెలికితీశారు