పుట:2015.392383.Kavi-Kokila.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము] సీతావనవాసము 95

లవు : అమ్మా, కాలవిలంబన మగుచున్నది. నన్నుఁబోనిమ్ము. [కౌఁగిలి విడిపించుకొనును.]

సీత : నాయనా, నా మాటవినరా.

                    నాదుముద్దుకూన, నాకన్ను వెన్నెలా,
                    నాదు భాగ్యరాశి, నాకుమార,
                    పుత్రశోకవహ్నిఁ బొగిలింప నెంచితే ?
                    రార కన్నతండ్రి, రణమువలదు.

లవు : అమ్మా, యాకూళలకు అన్నయ్యను నప్పగించి నన్ను సుఖముండు మనియెదవా ?

                    అన్నను నొంచినట్టి యభియాతిబలంబులు చెట్టుపుట్టలన్
                    వెన్నడి మున్నడింబఱవ భీషణసంగరమందు మబ్బులోఁ
                    జెన్నగు మించునా మెఱసి చిందఱవందఱచేసి శౌర్యమ
                    భ్యున్నతి నొందఁ దెచ్చెద సహోదరు నీవు ముదంబుఁబొందఁగన్

సీత : మాండవ్యా, యిఁక నేనేమిసేయుదును ? ఈలవుఁడు నామాట సరకు సేయకున్నాఁడు ?

మాండ : అమ్మా, నీవు బ్రతిమాలినను విననివానికి నా సదుపదేశము చెవిని దూరునా ?

            లవు : తల్లి నీవైన వాల్మీకి తాతయైనఁ
                     దాపసేశ్వరులైన విధాతయైన
                     అన్న యవమానమునకు రోషాగ్నిరగులు
                     నన్ను నిలుపంగ లేరని నమ్ముమమ్మ.