పుట:2015.392383.Kavi-Kokila.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94 కవికోకిల గ్రంథావళి [సప్తమాంకము

                        గన్నామే యిటువంటివింత? యయినం గానిండు; నేబోయి మా
                        యన్నం దెత్తు రిపు ప్రభేదన చణ వ్యాపారపారీణతన్

మాండవ్యా, న న్నా కదనరంగమునకుఁ గొనిపొమ్ము.

మాండ : [స్వగతము] అయ్యో! నాకే రావలయునా యీమహా విపత్తు ? మునుఁగబోయి మొసలికిఁ జిక్కితిని. ఒక్క శిలీముఖము తప్పి దారి నాపైఁబడినఁ బ్రాణముల నూటికొనకమానదు. [ప్రకాశముగ] లవా, యిట్టి కార్యముల బాల్యచాపలము ఆపదలకు మూలమగును.

సీత : నాముద్దుకూనా, నీకేల యీదుర్బుద్ధి ? తారతమ్య మెఱుంగక పోరిన కుశకుమారుని గతి యే మైనది ?

                       చంద్రబింబమ్ము జలద సంఛన్నమయ్యెఁ;
                       గాఱుఁచీఁకటి నల్గడఁ గ్రమ్ముకొనియెఁ;
                       దారకలు మాసి యొక్కటే తార నిలిచె;
                       నదియు నుఱిఁగిన గతియేమి యయ్య నాకు ?

లవు : అమ్మా, రోషాగ్నిజ్వాలల నానెత్తురు తుకతుక యుడుకుచున్నది. ప్రతిహింసావేశము నన్నుఁ బెరరేఁపుచున్నది. నన్ను వదలుము.

సీత : నాయనా, నీముష్కరత చాలింపుము. కడసారి నాముద్దు కొమరుని మృతకళేబరమునైనఁ గాంచుటకు నన్నుఁగొనిపొమ్ము.

లవు : తల్లీ, నీవు విచారింపవలదు. అన్న సర్వతోముఖ బాణ ప్రయోగదక్షుఁడు. ఆతఁడు మరణించియుండుట కల్ల. అన్న మూర్ఛిల్లియుండిన భీతిల్లి ఈమాండవ్యుఁడు పరుగెత్తియుండును.

మాండ : నీవుమాత్రము భీతిల్లకుందువా ? అప్పటికిని ధైర్యవంతుఁడను గావున దూరముననుండియైన నంతయుఁ దెలిసికొని వచ్చితిని.