పుట:2015.392383.Kavi-Kokila.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 కవికోకిల గ్రంథావళి [షష్ఠాంకము

లవు : ఏమో నాకుఁదెలియదు.

యజ్ఞ : [స్వగతము] ఆహా! ఈకుమారుఁడు రాజకుటుంబమునఁ బుట్టవలసినవాఁడు. [ప్రకాశముగ] నాయనా ? వాల్మీకిమునీంద్రుల, యాశ్రమము చూపించెదవా?

లవు : వాల్మీకితాతగారు కుటీరమునలేరు. మృత్యుంజయ తీర్థమునకు శిష్యులతోఁగూడ పోయియున్నారు.

యజ్ఞ : ఏమి నే బయలుదేరిన లగ్న మహత్త్వము ! ఆగస్త్యమహర్షి యాశ్రమమునకు ఏతట్టు పోవలయును?

లవు : రమ్ము. దారి చూపించిపోయెదను.

యజ్ఞ : నాయనా, దీర్ఘాయుష్మంతుఁడవుగమ్ము.

[నిష్క్రమింతురు.]

_________

పంచమస్థలము : అడవి.

_________

[కుశలవులు సమిధలకట్టలతో ప్రవేశింతురు]

కుశు : తమ్ముఁడా, నీవేరిన సమిధ లివేనా ?

లవు : అన్నా, నేను పుల్లలు ఏరునప్పుడు కాలిలో ముల్లు విఱిగి నొప్పిచేసినది. అందువలన కొద్దిగ నేరితిని.

కుశు : ముల్లు తీసికొంటివా ?

లవు : తీసితిని; ఇంకను కొంచెము నొప్పిగానున్నది.

కుశు : కుటీరమునకుఁ బోదమురమ్ము; గారనూనె పూసిన నొప్పితగ్గును.

లవు : ఇప్పుడే ఆశ్రమమునకు నడువలేను. కొంతసే పీ చెట్లనీడ కూర్చుండి పోవుదము.