పుట:2015.392383.Kavi-Kokila.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము] సీతావనవాసము 73

కథానాయకుఁడా?

యజ్ఞ : [ఆశ్చర్యముతో] రామాయణ మేమిటి ?

లవు : మీకుతెలియదా?

యజ్ఞ : అయ్యో ! తెలియదే.

లవు : నిజముగనా?

యజ్ఞ : ఏమీ మాబోఁటి మహాబ్రాహ్మణు లబద్ధములాడుదురా ?

లవు : వాల్మీకితాతగారు రఘువంశీయుఁడైన రామునిచరిత్రమును ఛందోబద్ధముగావించిరి. ఆరాముఁడేనా మీ రామచంద్ర నరేంద్రుఁడు?

యజ్ఞ : అట్లేయున్నది. ఏమిచిత్రము ! వేదములందుఁ గాక ఛందస్సు మఱియొక చోటఁబుట్టెనా ?

లవు : అవును; మాతాతగారి అమృతవాక్కునందు.

యజ్ఞ : ఎట్లు ?

లవు : ఒకనాఁడు ప్రొద్దువొడుపున వాల్మీకితాతగారు శిష్యులతోఁ గూడ గంగానదికి స్నానమునకుఁ బోవుచుండ దారిలో నొకచెట్టుకొమ్మపై నొక క్రౌంచమిథునము ముద్దులాడుకొనుచుండెనఁట. అంతలో నొకబోయ యొకపిట్టను కఱకుటమ్మున నేలగూల్చెను. పాపము ! రెండవపిట్ట దానిని గాంచి కరుణముగ వాపోవుచుండ తాతగారు వీక్షించి ఆబోయవానిని శపించిరి.

యజ్ఞ : తర్వాత ?

లవు : ఆశాపము అనుష్టుప్పు శ్లోకరూపమున వెలువడినది. ఈచిత్రమునకు శిష్యులును తాతగారును ఆశ్చర్యపడుచుండు సమయమున బ్రహ్మదేవుఁడు ప్రత్యక్షమయి రఘురాముని చరిత్రమును శ్లోకరూపమున రచియింపుమని ఆదేశించెను.

యజ్ఞ : [స్వగతము] ఆహా! యీకథను వినుకొలఁది వింత వొడముచున్నది ! [ప్రకాశముగ] నాయనా? నీవెవ్వరిబిడ్డవు, మీ తండ్రిపే రేమి ?