పుట:2015.392383.Kavi-Kokila.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాలా

వెంకట : మీ దేవూరు?

రోగి : ఇక్కడ్నే, ఏటవతల.

వెంకట : ముందు నీకు మందిచ్చి. తర్వాత ఆసుపత్రికి తీసుకొని పోతాను. నీకేమీ భయంలేదు.

రోగి : నేను బతకతానయ్యా?

వెంకట : నీకేమాత్రం ప్రాణభయములేదు. నీవు ధైర్యంగాఉండు. దేవుడున్నాడు రక్షించడానికి.

రోగి : ఆ దేవుణ్ణి చూడడానికి వస్తేనే యిట్లయిందయ్యా, [బాధతో] ఆ - - ఎట్లయ్యా.

[ఇంతలో నరసింహం మందు తీసికొనివచ్చి సైకిల్‌ను గోడకు ఆనించును.]

వెంకట : ఈ బిడ్డను పట్టుకో; మందిస్తాను.

[అందించునపుడు బిడ్డ యేడ్చును.]

రోగి : అయ్యో, నాబిడ్డ ఆకటికి అల్లాడుతుందయ్యా, నేనైనా గుక్కెడు పాలిస్తాను.

వెంకట : [బ్రతిమాలినట్లు] నీవీయగూడదమ్మా, [నరసింహం తట్టు తిరిగి] నరసింహం, చేతిగుడ్డ పాలల్లోముంచి ఒక్కొక బొట్టుగా బిడ్డ నోట్లో పిండు; చూస్తాం. [రోగి ప్రక్కకువచ్చి] అమ్మా, నోరు తెరువు ఈమందు కొంచెంతాగు. నీకు తప్పకుండా బాగౌతుంది.

[మిక్స్చరు నోటిలో పోయును. ఆమె గుటక వేయును.]

[ఇంతలో రంగారావు, కళ్యాణరెడ్డి వచ్చి కొంచెము దూరముగా నిలబడి రోగిని చూచుచుందురు.]