పుట:2015.392383.Kavi-Kokila.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఎనిమిది] కుంభ రాణా 203

రాణా : నాప్రజలు నన్ను త్యజించిరా ?

కుమా : రాణిగారిని విశ్వసించుచున్నారు.

రాణా : నా సైన్యములు?

కుమా : రాణిగారి సతీత్వము ననుమానింపవు.

రాణా : [యోచనా మగ్నముగ] అమాత్యులు, ప్రజలు, సైన్యములు మీరా సతీత్వము సంశయింపరు ! - నే నేమైన పొరపడితినా ?

కుమా : ఎట్టి వివేకవంతులైనను పొరపడుట కలదు.

రాణా : [యోచించుచు హఠాత్తుగ తలయెత్తిచూచి] కుమారా, నేను పొరపడలేదు. న్యాయమని నాకు తోఁచినయెడల ప్రపంచమునకు ప్రతి స్పర్ధిగ నైన నిలువఁగలను - లోకులు మూఢభక్తులు, గతాను గతికులు; అమాత్యులు దుర్బల హృదయులు, సైనికులు వివేక శూన్యులు. ప్రత్యక్ష సాక్ష్యము మీరా యపరాధమును నిరూపించుచున్నది. - ఇపుడేమి కర్తవ్యము ? - ఎవ్వరును లేరా ?

కుమా : రాజప్రసాద మంతయు నంధకార కులాయముగా నున్నది.

రాణా : [కోపముతో] మీరా రక్తజ్వాలలతో మన ప్రాసాదము మరల నుద్దీప్తము కాఁగలదు. కుమారా, నీవు విశ్వాసపాత్రుఁడవని నే నెఱుంగుదును. నాయాజ్ఞను నిర్వహింపుము. నీవె నాకుఁ గడపటి పట్టుగొమ్మవు. మీరాకు మరణదండన పత్రమును వ్రాసితెమ్ము.

కుమా : రాణిగారిని శిరచ్ఛేదన మొనరించుట కొక్క కటికవాఁడైన నొప్పుకొనఁడు.

రాణా : నీవో -

కుమా : [వెఱగుపడి ఒకయడుగు వెనుకకు పెట్టుచు] నేనా? -

రాణా : అట్లయిన మీరాయె స్వప్రాణ హంతకి కావలయును. అటులనే వ్రాసితెమ్ము.