పుట:2015.392383.Kavi-Kokila.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204 కవికోకిల గ్రంథావళి [స్థలం ఎనిమిది

కుమా : [స్వగతము] రాజాజ్ఞ అనుల్లంఘనీయము. [నిష్క్రమించును.]

రాణా : [సంక్షుబ్ధ చిత్తుఁడై గద్గదస్వరముతో] మీరా, నీవు చావవలయునా ? నీ కీ దుర్బుద్ధి పుట్టకయున్న నీ విట్టి చావు చావవుగదా ! భర్తయే భార్యకు మరణదండనము విధించుట ! హా ! ప్రళయం కరోద్యోగము. అసహ్యమైన మానసిక సంఘర్షణము! - నేను రాక్షసుఁడను. - [దు:ఖించును.]

[ఇంతలో కుమారసింహుఁడు ఆజ్ఞాపత్రము వ్రాసికొని తెచ్చి, నిలుచుండి వేచియుండును.]

రాణా : [కొంతసేపటికి తలయెత్తి స్వప్నములోవలె] తెచ్చితివా?

కుమా : [ఆజ్ఞాపత్రమును చేతికిచ్చును.]

రాణా : [చేవ్రాలు చేయఁబోవునప్పుడు, చేయి వడకును, కొన్ని యక్షరములు వ్రాసి నిలుపును. ఎట్లో చేవ్రాలు పూర్తిచేయును.] ఈ పత్రికను మీరాహస్తమునఁ బెట్టుము. ఎంత వేడికొన్నను నాదర్శన మిప్పింపకుము. ఆ కాంత ప్రాణపరిత్యాగము గావించుకొనువఱకు నీ వంగరక్షకుఁడవుగ నుండుము. పొమ్ము.

కుమా : [స్వగతము] అకటా ! నే నీ సతీతిలకముయొక్క యాత్మహత్యకు సాక్షిగ నుండవలయునా ? ఘోరము ! ఘోరము! [నిష్క్రమింపఁబోవును]

రాణా : ఏదీ, పత్రిక నిటుదెమ్ము. చక్కగ చేవ్రాలు చేసితినో లేదో చూతము.

కుమా : [ఇచ్చును.]