పుట:2015.392383.Kavi-Kokila.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202 కవికోకిల గ్రంథావళి [స్థలం ఎనిమిది

రాణా : [కోపస్తంభితుఁడై అట్టె కొంతవఱకుచూచి] ఆ! - వీరందఱకు సంఘాతమరణము విధింపవలయును. - అందఱు స్వామిద్రోహులు - ఈవిప్లవకారులు నా నీడయందె పన్నాగించుచున్న యీకుట్రను నేనుశంకింప లేకపోయితిని. అందఱు లంచగొండెలు. అగ్బరుచే లంచములను దీసికొని నా యుప్పుపులుసునకు ద్రోహముచేసిరి ! - వీరిని ముక్కలుముక్కలుగ తఱిగించి గ్రద్దలకు వెదచల్లించినను నాకసి దీఱదు. - ఎవఁడురా అక్కడ? [పలుకరు]

[అటునిటు నాలుగుతట్టుల తిరుగుచు] ఓరీ - [పలుకరు] - ఏమీ? ద్వారపాలకుఁడును లేఁడా? నా జీవితమునం దెప్పుడును ఇటువంటి యాజ్ఞా తృణీకరణము ననుభవించి యుండలేదు. - నా కన్నులయెదుటనే నా పాలనాదండము భగ్నమై పోయినదా ? ఈధిక్కార మసహ్యము ! ఉదయపూర్ రాజ్యాధిపతి ఒక్కక్షణములో నిస్సహాయుఁడయ్యెనా ? - ఇది స్వప్నము కాదుకదా ! [కలయంజూచి] అహో! యిది నగ్న సత్యము ! - కుమార సింహా, నీవును విశ్వాసఘాతుకుఁడవైతివా ?

[కుమారసింహుఁడు ప్రవేశించును]

కుమారసింహుఁడు : మహాప్రభూ, నేను విశ్వాస ఘాతుకుఁడను గాను. స్వామి యాజ్ఞకై వేచియున్నాను.

రాణా : [అతురతతో కౌఁగిలించికొని] కుమారా, నీవొక్కఁడవే నాకు స్నేహస్పదుఁడవు. తక్కినవార లందఱు విప్లవకారులు. స్వామిద్రోహులు. అమాత్యులతోడ నందఱును వెడలిపోయిరా ? ఇది దీర్ఘాలోచితమైన కుట్రగానున్నది. వారి కంత పలుకుబడియుండుట యెప్పటికైన నపాయకరమె.

కుమా : రాణిగారిపై ఆబాల వృద్ధముగ నందఱికిని భక్తి విశ్వాసములు కలవు. ప్రజలును అట్టివారె. దివాణమున నుండిన ఎవ్వరైన మీ యాజ్ఞను నిర్వర్తింపవలసి వచ్చు నేమో యని యందఱు వెడలిపోయిరి.