పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

పృథివిన్ మర్త్యుఁ డొకప్డునీశిరముపై బిల్వీదళంబొక్కట
త్యాధికాహ్లాదముతోడ నిడ్డ నదియాహా! ఘోటకాందోళికా
రథనాగాంబరపుత్రపౌత్రవనితా రత్నాదులై యొప్పుఁబో
ప్రథితాదభ్రసితాభ్రశుభ్రయశ! భర్గా! పార్వతీవల్లభా!

60


మ.

మిము సేవించుటచేతఁగాదె చిరలక్ష్మీసంగతుల్ శౌరికిన్
నముచిద్వేషికి శాశ్వతస్థితమహానాకాధిపత్యంబు, వా
గ్రమణీభర్త కశేషసృష్టిరచనా ప్రావీణ్యముల్ గల్గె నీ
క్రమ మజ్ఞుల్ గనలేరుగాని భువి భర్గా! పార్వతీవల్లభా!

61


శా.

వాణీశాంబుజలోచనప్రముఖ గీర్వాణార్చితాంఘ్రిద్వయున్
క్షోణీభాగశతాంగునిన్ గజహరున్ శ్రుత్యంతవేద్యున్ నినున్
బాణాదిప్రమథోత్తముల్ గొలిచి మేల్పట్టూనిరౌ సంతత
ప్రాణివ్యూహమనోంబురుడ్భవన! భర్గా! పార్వతీవల్లభా!

62


శా.

దారిద్య్రంబుదొలంగు, మృత్యువెడలున్ దవ్వౌనఘవ్రాతము
ల్ఘోరవ్యాధులు గండదోషము లడంగున్ జారచోరవ్యథల్
దూరంబౌ, నహితానలగ్రహగణార్తుల్ వీడు నిక్కంబు నీ
కారుణ్యం బొకయింత గల్గునెడ భర్గా! పార్వతీవల్లభా!

63


మ.

సుత, పద్మాకర, దేవతాగృహ, వనక్షోణీ సురోద్వాహ, స
త్కృతి, నిక్షేపము లంచునెంచ నలువౌ నీసప్తసంతానముల్
హితవారంగనొనర్చుపుణ్యమెనయున్ హేలాగతిన్మర్త్యుఁడొ
క్కతఱిన్ మిమ్ముఁదలంచెనేని మది భర్గా! పార్వతీవల్లభా!

64


మ.

అమరం ద్వత్పదపంకజాతయుగళ ధ్యానక్రియాశ్రాంతసం
భ్రమలీలన్ విలసిల్లుడెంద మొరులన్ బ్రార్థింపఁగా నేర్చునే?
సుమనోనిర్ఘరిణీసువర్ణకమల స్తోమాసవాలంపట
భ్రమరం బేఁగునె తుమ్మకొమ్మలకు భర్గా! పార్వతీవల్లభా!

65