పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

కేదారాదిక పుణ్యభూముల కశక్తిం బోవఁగారాదు; బల్
పేదర్కంబున దానధర్మవిధులోలిం జేయఁగారాదు గా
కేదే నొక్కతఱిన్ సమస్తభువనాధీశున్ నినుం గొల్వఁగా
రాదో? కానరుగాక దురాత్ములు భర్గా! పార్వతీవల్లభా!

54


మ.

తరుణీశుంభదురోజకుంభములపై ధమ్మిల్లబంధంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలములపైఁ గందోయిపై మోముపై
నిరతంబున్ విహరించు చిత్త మెపుడున్ నీయందొకప్డేనిఁ జే
ర్పరుగా మూఢులదేమిదుష్కృతమొ? భర్గా! పార్వతీవల్లభా!

55


మ.

మిమునొక్కప్పుడుఁగొల్వనేరక వృథామిథ్యాప్రచారంబులం
గములై వాఁగులయందునెల్ల మునుగంగాఁ బుణ్యముల్సేరునే!
తమి నశ్రాంతము నీటఁగ్రుంకులిడి యేధర్మంబు లార్జించెనో
కమఠగ్రాహఢులీకుళీరములు! భర్గా! పార్వతీవల్లభా!

56


మ.

హరి దైవంబు; విరించి సర్వభువనాధ్యక్షుండు బృందారకే
శ్వరుడాఢ్యుండు హుతాశనుండుపతి భాస్వంతుండు వేల్పండ్రు
లో నరయన్నేరరుగా శివాత్పరతరం నాస్తీతివాక్యార్థమే
కరణిం గోవిదు లైరొ కాని మఱి! భర్గా! పార్వతీవల్లభా!

57


శా.

వేయేమాఱు పురాణముల్ సదివినన్ వేదాంతముల్ గన్న నా
మ్నాయంబుల్ పరికించినన్ స్మృతులువేమాఱుల్ విమర్శించిన
న్నీయందాఢ్యతదోఁచుచున్నయదివో నిక్కంబుభావింపఁగా
గాయత్రీపతివై తనర్చుటను భర్గా! పార్వతీవల్లభా!

58


శా.

ఆఘంటాపథపద్ధతిన్ శివ శివే త్యాలాపసంశీలులై
రేఘస్రంబులుద్రోచుపుణ్యతములుర్విన్ బ్రహ్మహత్యాద్యనే
కాఘౌఘంబులు వాసి తావకపదప్రాప్తిన్ విడంబింతురౌ
ద్రాఘిష్ఠప్రభుతాగుణోల్లాసన! భర్గా! పార్వతీవల్లభా!

59