పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

మేమాఱున్ భవదీయ పావనకళావిఖ్యాత కావ్యక్రియా
సామీచీన్యహృదంతరాళ కవిరాట్సంక్రదన శ్రేణికిన్
సామర్థ్యం బొనగూర్చి మంచినుడువుల్ సంప్రీతి నొందించు వా
గ్భామారత్నము లీలమై నిలిచి భర్గా! పార్వతీవల్లభా!

6


మ.

చిరభక్తిన్మదిలో భవద్వ్రతముగాఁజింతింతు నశ్రాంతమున్
బరవాది ప్రమథద్విపేంద్రపదవీ పంచానన శ్రేష్ఠు బం
ధుర తేజోనిధి దెందులూరి కులపాథోరాశిరాకానిశా
కరునిన్ లింగయ సద్గురూత్తముని భర్గా! పార్వతీవల్లభా!

7


మ.

పులితోల్ము మ్మొనవాలు పాపతొడవుల్ భూత్యంత రాగంబు పు
న్కలపేర్లెక్కువ కన్ను నీలగళమున్ గంగావతంసంబుక్రొ
న్నెల పూవద్రిసుతా సమన్వయము విన్కీల్గంటు లేజింకయున్
గలనీమూర్తిఁదలంతు నెప్పుడును భర్గా! పార్వతీవల్లభా!

8


మ.

హర! మృత్యుంజయ! చంద్రశేఖర! విరూపాక్షా! మహాదేవ! శం
కర! భూతేశ! మహేశ! రుద్ర! మృడ! గంగాజూట! గౌరీమనో
హర! సర్వజ్ఞ! బిలేశయాభరణ! శర్వా! నీలకంఠా! శివా!
కరిచర్మాంబర! యంచు నెంతు భర్గా! పార్వతీవల్లభా!

9


మ.

జగదీశాయ నమోస్తుతే భగవతే చంద్రావతంసాయ ప
న్నగహారాయ శివాయలోకగురవే నానామరు ద్రూపిణే
నిగమాంత ప్రతిపాదితాయ విలసన్నిర్వాణనాథాయ ధీ
రగుణాఢ్యాయ యటంచు మ్రొక్కిడుదు భర్గా! పార్వతీవల్లభా!

10


మ.

వ్రతముల్ దేవగురు ద్విజార్యపదసేవల్ వైశ్వదేవాది స
త్క్రతుహోమాదులు దానధర్మములు వైరాగ్యప్రచారంబు లా
శ్రితరక్షావిధులంచు నే నెఱుఁగ నీ చిత్తంబు నా భాగ్యమే!
గతి రక్షించెదొకాని నన్నికను భర్గా! పార్వతీవల్లభా!

11