పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ భర్గశతకము

శ్రీకైలాస మహీధర శిరఃశృంగాట కాంచన్మణి
ప్రాకారాంతర చంద్రకాంత రజతప్రాసాద శుద్ధంత సిం
హాకారోన్నత హేమపీఠమునఁ గొల్వైయుండు ని న్నెన్నెదన్
రాకాచంద్ర నిభప్రభాకలిత! భర్గా! పార్వతీవల్లభా!

1


మ.

క్షితినంభోనిధి కర్ఘ్యమిచ్చుక్రియ భక్తి న్బద్మినీ భర్తకా
రతి యర్పించుతెఱంగున న్బహుతర బ్రహ్మండ సంత్రాతకున్
శతకంబొక్కటి గూర్చి నీ కొసగెద న్సంరూఢిఁగైకొమ్ము నా
కృతి సంస్తుత్యలసద్గుణాభరణ! భర్గా పార్వతివల్లభా!

2


మ.

శుక శాండిల్య మృకండు జాత్రి కలశీసూనుల్ భరద్వాజ శౌ
నక వాల్మీకి వసిష్ఠ గర్గభృగు మాండవ్యాజ సంభూత కౌ
శిక కణ్వాది మహర్షిశేఖరులు నిన్ జింతింపఁగాలేరు, కొం
కక నేనెంతటివాఁడ నిన్బొగడ భర్గా! పార్వతీవల్లభా!

3


మ.

వరకౌండిన్య సగోత్రపాత్రుని యశోవర్ధిష్ణునిం గుక్కుటే
శ్వర కారుణ్యకటాక్ష లబ్ధ కవితాసామ్రాజ్య ధౌరేయునిన్
స్థిరపుణ్యుండగు గంగమంత్రి సుతునిన్ దిమ్మప్రధానేంద్రునిన్
గరుణన్బ్రోవుము కూచిమంచికులు భర్గా! పార్వతీవల్లభా!

4


మ.

ప్రచురత్వంబుగ నెంతునాత్మనెపుడు న్బ్రత్యూహసంశాంతికై
విచలత్కర్ణ సమీరదూరిత మహా విఘ్నాంబు భృజ్జాలునిన్
రుచిరాస్వాంబురుహ స్రవన్మదజల ప్రోత్సాహలీలాముహుః
ప్రచురద్భృంగకులున్ గణాధిపుని భర్గా! పార్వతీవల్లభా!

5