పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

మరుదర్కేందు కృశాను యజ్వగగనాంభకుంభినీమూర్తి నం
బరకేశున్ శరణాగతార్తిహరణున్బాలేందుచూడామణిన్
భరణీభృత్తనయా స్తనద్వయ మిళిత్కస్తూరికాపంకసం
కరదోరంతరు నిన్ భజించెదను భర్గా! పార్వతీవల్లభా!

12


మ.

మిహిరప్రోద్భవఘోరకింకరసమున్మేషోరగశ్రేణికా
విహగోత్తంస మశేషదోషపటలీ వేదండ కంఠీరవం
బహిత క్రూరగణాటవీహుతవహం బైనట్టి పంచాక్షరం
బహహా! కల్గెను నాకు భాగ్యమున భర్గా! పార్వతీవల్లభా!

13


మ.

నృపసేవాపర కామినీ పరధన ప్రేమాతిరేకంబు లొ
క్కపుడుం గూర్పక తావకీన పదపద్మారాధ నేచ్చారతుల్
కృపదైవాఱ నొసంగి భక్తవరుగా నేప్రొద్దునన్బ్రోవుమీ
కపటారాతి నిశాట సంహరణ! భర్గా! పార్వతీవల్లభా!

14


మ.

అభవున్ శాశ్వతు నాద్యు నక్షయుని నవ్యక్తుం బరేశున్మహా
ప్రభునాద్యంతవిహీను భూతమయు సర్వజ్ఞునిన్ గుణాతీతుఁ బ
ద్మభవాండోదరు నాత్మరూపభవు నద్వంద్వుం జిదానందునిన్
రభసంబొప్పఁదలంతు నిన్నెపుడు భర్గా! పార్వతీవల్లభా!

15


మ.

తనరన్నిన్మది నెంతు నెప్పుడును నా దైవంబుగా దాతఁగా
జనకుంగాఁ జెలికానిగా గురువుఁగా సద్భందుగా నన్నఁగా
ఘన నిక్షేపముగా మహాప్రభునిగాఁ గల్యాణ సంధాయిగా
గనకోర్వీధరకార్ముకోల్లసిత భర్గా! పార్వతీవల్లభా!

16


మ.

ప్రతివారంబు శివోహమస్మి యనుచున్భావింతు గంగాధర
స్తుతులెల్లప్పుడుఁజేతు శంకరకథల్ సొంపార నాలింతు నా
యత బుద్ధిన్ జగమెల్ల నీశ్వరమయం బంచు న్విచారింతు నే
గతి రక్షించెదొ కాని నీవు నను భర్గా! పార్వతీవల్లభా!

17