పుట:2015.370800.Shatakasanputamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     గైకొని భక్తి చేనుడువఁ గానరు గాక విపత్పరంపరల్
     దాకొనునే జగజ్జనుల దాశరథీ! కరుణాపయోనిధీ!26
ఉ. రామ హరే కకుత్ స్థకులరామ హరే రఘురామ రామ శ్రీ
     రామహరే యటంచు మది రంజిల భేకగళంబలీల నీ
     నామము సంస్మరించినజనంబు భవం బెడఁ బాసి తత్పరం
     థామనివాసు లౌదు రట దాశరథీ! కరుణాపయోనిధీ!27
ఉ. చక్కెరలప్పకున్ మిగుల జవ్వనికెంజిగురాకుమోవికిం
     జొక్కపుజుంటితేనియకుఁ జొక్కిలుచుం గనలేరు గాక నే
     డక్కట రామనామమధురామృత మానుటకంటె సౌఖ్యమా
     తక్కిన మాధురీమహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!28
ఉ. అండజవాహ నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్
     కొండలవంటివైన వెసఁగూలి నశింపక యున్నె సంతతా
     ఖండలవైభవోన్నతులు గల్గక మానునె మోక్షలక్ష్మి కై
     దండ యొసంగకున్నె తుద దాశరథీ! కరుణాపయోనిధీ!29
ఉ. చిక్కనిపాలపై మిసిమిఁ జెందిన మీఁగడ పంచదారతో
     మెక్కినభంగి నీవిమలమేచకరూపసుధారసంబు నా
     మక్కువ పళ్లెరంబున సమాహితదాస్యమనేటిదోయిటన్
     దక్కె నటంచు జుర్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధీ!30