పుట:2015.370800.Shatakasanputamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్‌ హనుమంతుఁ డార్తి సో
     దరుఁడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్‌
     గరుణఁ దరిల్ప మానవులఁ గావఁగఁ బన్నిన వజ్రపంజరో
     త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!31
చ. హలి కులిశాంకుశ ధ్వజ శరాసన శంఖ రథాంగ కల్పకో
     జ్జ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
     కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
     తలవునఁజేర్చి కావగఁదె దాశరథీ! కరుణాపయోనిధీ!32
చ. జలనిధిలోనదూఱి కులశైలముమీటి ధరిత్రిగొమ్మునం
     దలవడమాటి రక్కసుని యంగము గీటి బలీంద్రునిన్‌ రసా
     తలమునమాటి పార్థివకదంబముగూర్చిన మేటి రామనా
     తలఁపుననాటి రాఁగదవె దాశరథీ! కరుణాపయోనిధీ!33
ఉ. భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో
     దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌
     రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా
     డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే
     దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!34