పుట:2015.370800.Shatakasanputamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     నీ పెన్ముద్రలు దాల్చితిన్ భుజములన్, నీవింక నన్నేగతిన్
     బ్రాపై ప్రోచెదొ కాని పూని రఘువీరా! జానకీనాయకా!46
మ. తపముల్ చేసినఁ బోనిపాపములు మంత్రంబుల్ సమర్థంబుగా
     జపముల్ చేసినఁ బోని దోషము నదీస్నానంబునం బోని ఘో
     రపుఁ గర్మంబులు వాయు నొక్కమఱి శ్రీరామా యనే మాట క
     ర్ణపుటం బించుక సోఁకెనేని రఘువీరా! జానకీనాయకా!47
మ. కంపింతున్ మును దండధారికిని మత్కాయంబు వీక్షించి శం
     కింపం గారణ మేమి నాకిఁక నినున్ గీర్తించుచున్నాఁడ; బల్
     దుంపల్ గట్టిన ఘోరపాపముల సంధు ల్గోసివేయంగ బల్
     ఱంపంబైనది నీ చరిత్ర రఘువీరా! జానకీనాయకా!48
శా. నీ మంత్రంబు సదా సదాశివుఁడు పత్నీయుక్తుఁడై కాశిలో
     నేమం బొప్ప జపించె నంచు [1]శ్రుతులన్ని న్నిన్నె వర్ణింపఁగా
     నేమా నిన్ను నుతించువార మయినన్ నిన్నెంతు నోరారఁగా
     రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా!49
శా. నీ మంత్రంబు జపించు మానవులకున్ నిశ్శ్రేయ మౌ నర్థముల్
     హేమంబు ల్గొడుగుల్ తురంగములు మత్తేభంబు లాందోళికల్

  1. శ్రుతులు న్నిన్నెన్ని