పుట:2015.329863.Vallabaipatel.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

87

ఘనవిజయములు సుసాధ్యమైనవి. ఇవి యన్నియు మే మెదుర్కొనుచున్న కష్టములు. అందువల్ల మా మనోవ్యధకు మేర లేకుండఁ బోవుచున్నది. ఈ లోపములను సవరించుకొనుటకు మేము గట్టి ప్రయత్నము చేయుచున్నాము. కాని యిందుకుఁ గొంతకాలము పట్టఁగలదు.

ప్రతిపక్షమునకుఁ దరుణముకాదు

మేము కంట్రోల్సును రద్దుచేసి యందువల్ల నేర్పడిని పరిస్థితులను బరిశీలించితిమి. దొంగలాభములు పోసికోఁదలచిన వారు తమకుఁ గావలసిన దంతయు సంపాదించినారు. వీరిలోఁ గొంద రాదాయపన్నుగూడఁ జెల్లించలేదు. ఆదాయపు పన్ను చెల్లించవలసి వచ్చునను భయముతో వారు తాము దాచిపెట్టుకొన్న సంపదను బయటపెట్టుటకు సాహసించుట లేదు.

ఈలోగా ధరలు పెరిగిపోయినవి. కార్మికు లెక్కువ జీతము లడుగుచున్నారు. ప్రభుత్వోద్యోగులు నిదే పాట పాడుచున్నారు.

ఈ సంగతు లన్నింటి నాలోచించి, యిండోనీషియాలో, చైనాలో, మలయాలో, బర్మాలో నేమి జరుగుచున్నదో, దానితోఁ బోల్చిచూడుఁడు. ఈ దేశములగతియే మన దేశమునకుఁగూడఁ బట్టినట్లైన మనము సాధించిన స్వరాజ్యము నిష్ఫలము కాఁగలదు.

ఈ సమస్య లన్నింటికి మన మొక పరిష్కారమార్గమును గనుగొనవలసియున్నది.