పుట:2015.329863.Vallabaipatel.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

వల్లభాయిపటేల్

మన శక్తిసామర్థ్యములను, సంపదను, సమీకరించి దేశము నీ కష్టములనుండి గట్టెక్కించుట యెట్లో యాలోచింపవలయును. కార్మికులు, కర్షకులు, ధనికులు, నందరు నిప్పటివలెనే పరిస్థితు లీలాగే యుండినట్టయిన నిండియా సర్వనాశనము కాకతప్పదను సంగతిని గుర్తింపవలసియున్నది. ఇండియా యిప్పుడు శత్రువుల నెదుర్కొనుచున్నది.

ఇండియాకు స్వాతంత్ర్యము వచ్చినప్పుడు సేనలసంఖ్య తగ్గించి వెయ్యవచ్చునని భావించితిమి. కాని నిజమున కా సంఖ్యను బెంచవలసియున్నది. బలమైన కేంద్రప్రభుత్వము, బలమైన సైన్యము నిండియా కెంతో యవసరము. హైదరాబాదులో నా సంస్థాన ప్రధాని, మఱియొక విప్లవకారుఁడని చెప్పుకొను వ్యక్తి కలసి ప్రారంభించిన యలజడులను మన మణచివేసితిమి. ఇందుల కేది కారణమో, మనము దానిని గ్రహించవలసియున్నది.

మనకుఁ బ్రతిపక్ష ముండవలయునని ప్రజ లనుచున్నారు. అయితే ప్రతిపక్ష ముండుట కిది తరుణముకాదని, సహకార మత్యవసరమని నేను సవినయముగా మనవి చేయుచున్నాను. ప్రస్తుత మిండియా నుదృఢమై యాసియా దేశములకు సహజముగా నాయకత్వము వహించవలసియున్నది. ఆ పరిస్థితి యేర్పడిన తరువాతనే మనము పరస్పరము వివాదపడుట కవకాశ మున్నది. మీరు నా సలహాను వినకపోయిన నిండియా సర్వనాశనము కాకతప్పనట్లు కనబడుచున్నది.