పుట:2015.329863.Vallabaipatel.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

47

ఖాన్‌సోదరులు సరిహద్దురాష్ట్రపు కాంగ్రెసుభక్తులు. మహాత్మునిమిత్రులు. ఈశ్వరసేవకులు. వారి కుటుంబము 1857 సంవత్సరములో జరిగిన స్వాతంత్ర్యసమరములోఁ బ్రభుత్వమున కండయై నిలచి, చేసిన పాపపరిహారార్థ మీనాటి స్వాతంత్ర్య సమరములో నా కుటుంబమంతయు నాహుతియై యధికఖ్యాతిఁగాంచినది. వారిలోఁ బెద్దవాడగు ఖాన్ సాహెబ్ గొప్ప పార్లమెంటేరియను. కేంద్రశాసనసభలో సభ్యుఁడుగను, సరిహద్దు రాష్ట్రములో సచివుఁడుగను నుండి, యాయన చేసిన సేవ విఖ్యాతమైనది. చిన్నవాఁడగు గపూర్‌ఖా నీశ్వరసేవక సంఘము నేర్పాటుజేసి, నిర్మాణకార్యక్రమములో నిరుపమాన కార్యదక్షతను జూపి యవక్రపరాక్రమశాలులైన పఠానులలో నహింసాసిద్ధాంతము నమలులోఁబెట్టి సరిహద్దుగాంధీ యని ఖ్యాతిఁగాంచిన యహింసామూర్తి. కాంగ్రె సధ్యక్షపదవి నంగీకరించని నిరాడంబరుఁడగు సేవాతపస్వి.

బోస్ సోదరులలోఁ బెద్దవాఁడగుశరత్ చంద్రబోసుకూడఁ బార్లమెంటేరియను. బెంగాలు శాసనసభలోను గేంద్రశాసనసభ కాంగ్రెసు నాయకుఁడుగను నాయన ఖ్యాతిఁగాంచినాఁడు.

ఆయన యనుంగు సోదరుఁడగు సుభాషబాబు బ్రహ్మచర్యము స్వీకరించి దేశభక్తి వ్రతమును బూని స్వరాజ్య కంకణమును ధరించిన విప్లవమూర్తి. కాంగ్రెసు బహిష్కరించిన రోజులలోఁగూడఁ బ్రజాభిమానమును జూఱగొన్న ప్రజానాయకుఁడు. ప్రభుత్వమువల్లఁ బెక్కు బాధలు పొందిన దేశభక్తుఁడు. ప్రభుత్వమునకుఁ బ్రక్కలో బల్లెమై ప్రవర్తించిన యోధుఁడు. తన జీవితమంతయు దేశమున కర్పించిన