పుట:2015.329863.Vallabaipatel.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

వల్లభాయిపటేల్

మహాత్యాగి. కట్టుగుడ్డలతోఁ బ్రభుత్వమువారి కండ్లలోఁ గారముగొట్టి కానిదేశముపోయి యజాద్‌హింద్‌ఫౌజును స్థాపించి, భారత స్వాతంత్ర్యమును బ్రకటించిన వీరాగ్రణి - నేతాజీ యన్న యాయన నామము సార్థకము.

మనపటేలుసోదరులలో విఠల్‌భాయిపటేలు పెద్దవాఁడు. ఆయన గొప్ప పార్లమెంటేరియనే. అఖండ ప్రతిభావంతుఁడు, గొప్పవిమర్శకుడు. విధ్వంసనములో నధికుఁడు. స్వరాజ్యపార్టీ ప్రముఖులలో నొకఁడు. బొంబాయి మేయరుగాను నాగపూరు జెండాసత్యాగ్రహములోను, నింకను బెక్కువిధముల నాయన సేవఁజేసినను భారతకేంద్రశాసనసభాధ్యక్షుఁడుగా నాయన ప్రదర్శించిన ప్రతిభావిశేషములు, స్వాతంత్ర్యనిరతి, యనన్య సామాన్యమైనవి. ప్రత్యర్థిశక్తులపై నాయనపొందిన విజయము లనంతములు. ప్రెసిడెంటు పటే లనుపేరున నాయన ప్రఖ్యాతుఁడైనాఁడు. ఆయననామము స్వాతంత్ర్యసమరచరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపఁదగినది.

పైన బేర్కొన్న సోదరత్రయములో నన్నలకంటెఁ దమ్ము లధికసేవావ్రతులు, ప్రతిభావంతులు, విఖ్యాతులుకూడ. మనపటేలు సోదరులలో, నిరువురు నిరువురే. ఒకరినిమించిన వా రొకరు. పెద్దపటేలు కోటలోఁ బ్రవేశించి పోరాడినఁ జిన్న పటేలు కోటబయటనుండి పోరాడినాఁడు. ఉభయులు సమాన శక్తియుక్తులు కలవారే. కాని భిన్న ప్రవృత్తులు కలవారు. కనుకనే భిన్నమార్గము లవలంబించినారు. మార్గములు భిన్నములైనను నాదర్శ మొక్కటే.