పుట:2015.329863.Vallabaipatel.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[7]

వల్లభాయిపటేల్

49

ఆ యన్నదమ్ము లిర్వురు నొకరితో నొకరు వైరుధ్యభావముతోఁ బోరాడుచుండువారు, కాని యీ విరుద్ధభావమునకు వెనుక నొక ప్రేమవాహిని ప్రవహించుచునే యుండెను.

తండ్రికిఁ దగిన తనయ

సర్దారుకు 1905 లో నొక కుమారుఁడు గలిగెను. ఆయనపేరు దయాభాయి. ఆయనకూడ శ్రీకృష్ణజన్మస్థానమున కరిగినవాఁడే. ఆయన కుమారుని కంటె విఖ్యాతయైన దాయన కుమార్తె మణిబెన్. (1907) నిజముగా నామె మణివంటిది. ఆమె గాంధీజీని బ్రథమముగా దర్శించినప్పుడు చేతిబంగారు గాజులుతీసి బాపూజీకి సమర్పించినది. అవి స్వీకరించి "స్వరాజ్యము వచ్చువఱకు మఱల నీవు గాజులు ధరించరాదు. దేశ సేవలోనే నిమగ్నురాలవై యుండవలయు"నని గాంధీజీ హితోపదేశముచేసెను. ఆమె దానిని ద్రికరణశుద్ధిగా నంగీకరించినది. నాటినుండి యామె సిరుల నవతలకుఁ ద్రోసినది. భోగాలను వీడినది. ఇంతేగాదు. వివాహమే మానినది. బ్రహ్మచర్య మవలంబించి తదేకదీక్షతో దేశసేవచేయుచున్నది. తండ్రికిఁ దోడుగా నిలచి స్వాతంత్ర్యసమరములో ముందడుగు వేసినది.

మణిబెన్‌లోఁగల యీ దివ్యభావమును, త్యాగమును జూచి, లోకము విస్తుపోవును. ఎక్కడివా యీ పోకడలని యాశ్చర్యపడును. కాని యామె జన్మించిన వంశములోని సేవాభావమును గమనించిన నా యనుమానము పటాపంచలైపోవును.