పుట:2015.329863.Vallabaipatel.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

వల్లభాయిపటేల్

పట్టిరో - ఆ కథవంటి విషాదవృత్తాంతమును మఱియొకటి వినఁబోము.

బార్డోలీ తాలూకాలోఁ బ్రజలు వలదు వల దనుచున్నను బ్రభుత్వమువారు, సెటిల్మెంటుచేసి పన్నులను హెచ్చించిరి. వ్యవసాయకులు నేఁ డెంత నిష్ఫలకష్టజీవులో యెల్లరకును దెలియును. తమ మొఱల నెన్నోవిధముల నధికారులకు విన్నవించుకొనిరి. డెప్యుటేషన్లు పంపుకొనిరి. శాసనసభలోఁ బ్రతినిధులచేతఁ జెప్పించిరి. కాని యేమి చేసినను లాభములేక పోయినది. రైతు లెంతకాలము పస్తు నిండుకొని యుండఁ గలరు? భూములుకూడ నంత పన్నులభారమును మోయలేక క్రుంగిపోయినవి. కాని యధికారులకు దయరాలేదు. ఆ నిస్పృహలో, నా నైరాశ్యాంధకారములో, వారి పరితప్త హృదయములు దైవమునుగూర్చి యాక్రందించినవి. భగవంతు డార్తపరిత్రాత. దయాస్వరూపుఁడగు గాంధిమహాత్ముఁడు వారిముందుఁ బ్రత్యక్షమైనాడు. కాని వాని తరణోపాయములు సామాన్యములైనవి కావు. వానిది త్యాగపద్ధతి. అహింసా పూర్వకమైన తపశ్చరణము. పన్నుల నిరాకరించి దానివలనఁ గలుగుబాధల నన్నిటిని శాంతముతో, నిగ్రహముతో ననుభవించుటకుఁ బ్రతిజ్ఞ పూనవలయునని ప్రబోధించినాఁడు.

ఈ రైతు లెక్కువ చదువుకొనినవారుకారు. వట్టి పామరులు. సంసార తాపత్రయములలోఁ జిక్కుకొనిన నిరుపేదలు. వీ రట్టి త్యాగపథమునకుఁ బూనగలరా ? బ్రిటిషు అధికారులు ప్రచండశాసనులు. వారిది కేవలము పోలీసు రాజ్యము. సామ్రాజ్యమునంతను బిగించివేయఁగల బలాఢ్యులు