పుట:2015.329863.Vallabaipatel.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

35

వారు. అట్టి యధికారధూర్వహుల నీ బీదరైతు లెట్లెదుర్కొన గలరు? మహాత్ముఁ డతిగంభీరవిశ్వాసి - ప్రకృతిలో సర్వాంతర్యామి లేనిచోటు లేదు. ప్రతి యిసుక రేణువునందు నమూల్యమైన లోహములు దాగియున్నవి. ప్రతి మొక్కలో నోషధీ గుణము కలదు. ప్రతి నరునియందును సర్వశక్తిమంతుఁడు మెలఁగుచునే యున్నాఁడు. హృదయము ప్రబుద్ధము కావలయు గాని, చీకటినుండి వెలుఁగురాఁగలదు. దౌర్బల్యమునుండి శక్తి పుట్టఁగలదు. దుఃఖమునుండి యానందము ప్రవహింపఁగలదు. మహాత్ముని ప్రబోధముచే నీ బార్డోలీ సామాన్యపామరకర్షకులు మహావీరులుగ వెలసిరి. త్యాగపథమున నగ్రేసరులైరి. బార్డోలీ తాలూకా యంతయు యజ్ఞభూమియైనది. స్త్రీజనము కూడ బద్ధకటియై యీ రణరంగమున దుమికినది. పన్నుల నిరాకరణ మను నస్త్రమును సంధించిరి. అంతటితో నధికారులు వచ్చి పడిరి. బెదరించిరి. భేదోపాయము నవలంబించిరి. వారి పూరి గుడిసెలలోఁ జొఱఁబడి యన్నము వండుకొను కుండలను సయితము లాగుకొనిపోయిరి. పిల్లలకుఁ బాలుకూడ లేకుండ బశువులను దోలుకొని పోఁజొచ్చిరి. ఆబాలస్త్రీవృద్ధముగా నందర నిండ్లలోనుండి తఱిమివేసిరి. కాని రైతులు చలించలేదు. ఏమి వచ్చినను రానిమ్మని యట్లే నిలువఁబడిరి. సత్యాగ్రహమే వారి కవచము.

వారిలో బయలు దేరిన యేకీభావ మత్యద్భుతము. ఒక్క రైతుకూడఁ జీలిపోలేదు. గ్రామోద్యోగులు రాజీనామా లిచ్చిరి. జప్తు ఆస్తులను గొనిపోవుటకుఁ గూలీలుకూడ దొరక లేదు. ఎవరును బండ్లు కట్టరు. పశువులను దోలుకొని పోవు