పుట:2015.329863.Vallabaipatel.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

వల్లభాయిపటేల్

బార్డోలీ తాలూకా రైతుసభ జరిగినది. ఆసభలోఁ బన్నుల నిరాకరణమునకుఁ దీర్మానించుకొన్నారు. పటేలు సహాయమును గోరిరి. ఆయన వారితో "మీరు ప్రభుత్వమును ధిక్కరింపఁ బోవుచున్నారు. వా రధికబాధలు పెట్టెదరు. అనేక కష్టనష్టములకు గుఱికావలసివచ్చును. ఇవి యన్నియు నాలోచించుకొనవలసిన'దని రైతుల ప్రతినిధుల సభలోఁ జెప్పి (1928 ఫిబ్రవరి 4 వ తేది) యాలోచించుకొనుటకు వారి కెనిమిది రోజులు గడువిచ్చెను.

వా రాలోచించుకొని తమ ప్రధమ నిర్ణయమునే మఱలఁ జెప్పిరి. 1928 ఫిబ్రవరి 12 వ తేదిన తాలూకా రైతు సభ జరిగినది. రైతులందరు వచ్చి సత్యాగ్రహము చేయుటకే సమ్మతించిరి. అంతట నాయన తాలూకా యంతటను సంచారము చేసి వేలకొలది స్వచ్ఛంద సైనికులను జేర్చి చేయవలసిన యేర్పాట్లన్నిటిని జేసెను. ప్రతి గ్రామమునకు నొక నాయకుఁడు. తాలూకా యంతట నైదుగురు నాయకులు. వీ రందరకు సర్దారు సర్వసేనాని. సత్యాగ్రహకార్యాలయము స్థాపించి "సత్యాగ్రహ సమాచార్" అను దినపత్రికకూడఁ బ్రచురింప బడుచుండెను. ఆనాఁ డాయన యాజ్ఞ లేకుండఁ ప్రభుత్వాధి కారులకుఁ జిట్టెడుప్పుకూడ దొరుక లేదనిన నతిశయోక్తికాదు. బార్డోలీలో బ్రిటిషుప్రభుత్వము నశించిన దని టైమ్సుఆఫ్ ఇండియా ప్రతినిధి ప్రకటించెను.

ఫిబ్రవరి 12 వ తారీఖు పన్నులకు గడువు. కాని ప్రభుత్వపు బొక్కసమున కొక్క పైసగూడఁ బోలేదు. అంతట వారు జప్తులు చేయసాగిరి. దానికిని రైతాంగము లొంగలేదు.