పుట:2015.329863.Vallabaipatel.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

29

యథార్థ భారత స్వరూపము గ్రామములోనే కాన్పించునని, వ్యయసాయదారుఁడు దానికిఁ గీలకమని, రైతుకు సంబంధములేని యే స్వాతంత్ర్యపథకమునకుఁ గాని, పనికిఁగాని యర్థమే లేదని, భారతజాతీయతత్త్వ ప్రథమసూత్రము తొలిగా మన దేశములో మహాత్ముఁడు ప్రవచించెను.

దీని నక్షరాల నములులోఁ బెట్టుటకుఁ దమ జీవితములను దారబోసిన వారిలో మగన్‌లాల్ గాంధి, వల్లభాయి, ఆచార్య రంగా లగ్రగణ్యులు. గురువు సూత్రమును సృష్టింపఁగా శిష్యులు దాని నాచరించు పద్ధతులు కనుఁగొని యందుకై తమ జీవితముల నర్పించిరి. అందులో వల్లభాయి రంగాలకు మఱొక సదుపాయముకూడఁ గలసివచ్చినది. వారు రైతుబిడ్డలు. ఇంతియుగాక వారిరువురు బాల్యములోఁ బొలాల యందుఁ బని చేసిన కృషీవలులు. అందుచేత నా భూపుత్రులతో వారికన్ని విధముల సంబంధముండుటచే నభిమాన మధికము.

అందుచేతనే 'యీ పృథివిలో దలయెత్తుకొని తిరుగ నర్హుఁడైనవాఁడున్న చో నతఁ డొకరైతే. అతఁ డుత్పత్తిదారుఁడు. ఇతరులందఱు పందికొక్కులవంటివా'రని పటేలనఁగలిగినాడు.

ఇఁక నసలు విషయమునకు వత్తము. 1927లో బార్డోలీలో రీసెటిల్మెంటు జరిగినది. దీనివల్లఁబన్ను నూటికి ముప్పది రూపాయలు పెరిగినది. ఇందువల్ల రైతాంగములోఁ జాల నసంతృప్తి పెరిగినది. అందుచేఁ గొంత తగ్గించిరి. కాని యంతటితో రైతులు తృప్తిపడలేదు. తమకు న్యాయము జరుగలేదని నిష్పాక్షికమైన కమిటీనివేసి విచారింపుఁడని రైతులు కోరిరి. కాని ప్రభుత్వము పెడచెవిని బెట్టినది.