Jump to content

హిమబిందు/ప్రథమ భాగం

వికీసోర్స్ నుండి

హిమబిందు

· చారిత్రాత్మక నవల ·

ప్రథమ భాగం

1. వణిక్సార్వభౌముడు

కృష్ణవేణీ ప్రవాహమున నీడ చూచుకొనుచున్న శ్రీ ధాన్యకటక దుర్గాధి లక్ష్మికి, వణిక్సార్వభౌముడగు చారుగుప్తుని మహాసౌధము శ్రవణావతంసమై విరాజిల్లుచుండెను. అచట కిన్నూరు ధనువుల దూరమందున్న మహాసంఘా రామచైత్యమును, చారుగుప్తుని సౌధమును చక్కదనమున నక్కా సెల్లెండ్రవలె నున్నవి. నున్ననై నిగనిగలాడుతూ పాలరాతిగోడలపై చిత్రించిన బుద్ధదేవ జాతక గాథలతో నలరారు చారుగుప్తప్రాసాదము కనులు చల్లజేయుచూ రూపెత్తిన శిల్పలక్ష్మివలె నున్నది.

చారుగుప్తుడానాడు వ్యాఘ్రాజినము పఱచిన దంతపుబీట పై నధివసించి, తూలికోపధానములపై నొఱగి, గోష్టపాలకుడగు నింద్రగోపునితో సంభాషించుండెను.

చారు: మన శూరనేత్ర సంజీవకములు ఉజ్జయినిలో పందెముగెలిచి, ఱేనిచే బంగారు కట్లబండిని బహుమానముగా దెచ్చినమాట నిజమేకాని, కామందక కుల పాలకముల కవి తీసికట్టే. మన జతల నన్నిటిని మా మేనల్లుడు, సమవర్తి, పరీక్షించి కామందక కులపాలకయుగళమే అన్నిటికి మిన్నయని తేల్చినాడు. సార్వభౌముని జన్మదినోత్సవము నాటి పందెములలో ఆ జతనే కట్టినచో మనకు జయము లభించునన్నాడు. మఱి, నీ యభిప్రాయమేమో!

ఇంద్ర: చిత్తము. తమ మేనల్లుడుగారా జత నిదివర కెన్నడైన బండి తోలి చూచిరా యని సంశయించుచున్నాను.

చారు: ఆ! రెండుసార్లు బండి తోలినాడు. స్నేహితుడగు శశాంక వసువుగారి మ్లేచ్ఛాశ్వముతో సమానముగ రెండు గోరుతములు[1] పరువెత్తెనట. విజ్ఞానకంఠీరవుడుగూడ సుళ్ళు, రూపురేఖలు పరిశీలించి ఉత్తమోత్తమములని నుడువుటచేతనేకదా ఈ ఎడ్లజతలకు పదునేనువందల పణాలిచ్చి, కొంటిని.

ఇంద్ర: చిత్తము. అయినచో అంత బలవత్తరమైన జతను మన సారథి నడపగలడా? చారు: నిజమే. ఇదివరకు చారుగుప్తునితో పందెమువేసి యెవ్వరును జయమొందలేదు. ఇప్పుడు ఈ కోడెల నడుపు మగటిమి గలవాడు లేక మన మోడిపోయిన తలవంపులు. సమవర్తియే బండితోలుగాక.

ఇంద్ర: కాని....

చారు: “కాని” యని మాట్లాడకూరకుండెదమేమి? అంతకన్న ధాన్యకటక నగరమున సారథి యెవ్వడు? అతని నిదివరకొక్కరైన మఱి ఓడించిరా? ఎంత పొగరుగిత్తలనైన నాతడు సులభముగ లోబరచుకొన లేదా?

ఇంద్ర: చిత్తము. దేవరకు పూర్తిగా నిష్టముండిన నా అభ్యంతర మేమియులేదు. ఇక నాకనుజ్ఞ.

అని ఇంద్రగోపుడు చేతుల జోడించి వీడ్కొని చన, చారుగుప్తుడు యేమేమియా యాలోచించు కొనుచుండెను. ధాన్యకటక నగర వర్తకులలో ముఖ్యుడును, వణిక్సంఘాధి పతియునగు చారుగుప్తునకు పందెములన్నచో బ్రాణము. అతని గజాశ్వవృషభశాలలలో, చక్రవర్తిశాలలలో నున్న మృగముల కెంతమాత్రము వెనుదీయని ప్రాణులున్నవి. అతని శకటములు దేవవిమానములు. ఆతని సేవకులు పరాక్రమవంతులగు యక్షపుత్రులే. ధనరాసులు సమకూర్పనెంతయో కష్టపడు చారుగుప్తుడు భోగముల ననుభవించుటలో ఆ ధనరాసుల నశ్రమముగా వెచ్చించును.

హిమబిందు కుమారిని మహారాజు నింటికోడలిని కావింప నెంచియున్నాడు. సౌందర్యఖనియు, ఆనందకందము, తన బహిఃప్రాణము నగు హిమబిందుకుమారి మహారాజ్ఞి కాకపోయినచో తన కుబేరవైభవము గాల్పనా? తనతనయకాక, భరతఖండాన ధాన్యకటక సింహాసనాసీనురాలగుట కింక నేబాల తగును? రాజకుమారిక లుందురుగాక! వారు తెచ్చెడిదేమి, ఇచ్చెడిదేమి! సర్వవిద్యాపరిపూర్ణ సర్వకళాశోభిత, దివ్యసుందరగాత్రయగు తన బాల, హిమబిందుకుమారి. చక్రవర్తులు కని విని యెరుగని మహానిధులతో, అతులవైభవముతో వచ్చుచుండ ఏ సార్వభౌముడు మోకాలొడ్డును! ఈ కార్యసిద్ధికై తాను రెండవ చాణక్యదేవుడు గావలసివచ్చిన వచ్చుగాక.

ఇట్టి యాలోచనలనేకములు చారుగుప్తుని హృదయాకాశాన వెలుగువలె ప్రజ్వరిల్లి పోయినవి. ఆ ఆశయే అతని తపస్సు; ఆతని యైశ్వర్య మాతపస్సాధనము; అతని జీవిత మా తపస్సిద్ధి కంకితమైనది.

చారుగుప్తుడు సన్నగా పొడువున ధనువునకొక గుప్పెడు తక్కువగా నుండును. తప్తకాంచనవర్ణమువాడు. కమ్మెచ్చులు తీసినట్లుండు అంగసంపద గలవాడు. దీర్ఘమై చివర వంగిన గరుడనాసికవాడు. అతివిశాలమగు ఫాలము గలవాడు. గరుడపక్షికి వలె నాసికామూలమున లోతులై ఆతని కన్నులు దీర్ఘములై విశాలములై తీక్షణములై ఎదుటివాని మనసు లోతుల జొఱబాఱుచుండును. పెద్దదగు నాతని బట్టతలపై, అచ్చటచ్చట తెల్లని వెండ్రుకలు లంకలలోని రెల్లుపూవుల జ్ఞప్తిగొల్పుచుండును. మెడలోని ఆణిముత్యముల పేరును, స్వచ్ఛమగు యజ్ఞోపవీతము నాతని బంగారు వన్నెకు మెరుగులు దిద్దినవి. సువర్ణదీప శోణరత్నాలు, సింహళదేశపు గరుడపచ్చలు నాతని కుండలముల మెరుగు లీనుచు కంఠరేఖలలో లీనమగుచుండును. “బాలనాగీ! బాలనాగీ! చిరంజీవను తోడ్కొనిరా” యని చారుగుప్తుడు కేకవేసెను.

చారుగుప్తుడు కూర్చుండిన మందిరాన గోడలన్నియు రమణీయచిత్ర లేఖనావిలసితములు, రత్నకంబళాచ్ఛాదితములు. నలువైపుల మణిఖచితధూప కరండాలనుండి అగరు జవ్వాజి కస్తూరి పునుగు మంచిగంధపు పొట్టు యందుగుబంక మొదలగు ధూపద్రవ్యముల పొగలు సువాసనల వెదజల్లుచు చిన్న మేఘాలరీతి ప్రసరించుచున్నవి.

ఇంతలో ఘల్లుఘల్లని బంగారు చిరుమువ్వల చప్పుడు విననైనది. అంతఃపురమున కేగు ద్వారమధ్యమునుండి పూలప్రోవు, రూపముదాల్చిన చంద్రకిరణము, ఒక్కబాలిక, కొండవాగువలె ప్రవహించివచ్చి చారుగుప్తుని యెదుట వంగి పాదాల నంటినది.

చారు: సత్వరసామ్రాజ్య సింహాసన సిద్ధిరస్తు. అమ్మా! రేపటి ఉత్సవములకు పోయెదవుగాదా?

హిమబిందుకుమారి: అత్తయ్య, అమృతలతాదేవి, రమ్మని వార్తపంపినది నాయనగారూ

చారు: వారి మండపమునకా?

హిమ: అవును.

చారు: పుణ్యాత్మురాలు మీతల్లి నిర్యాణమైన ఈమూడు సంవత్సరాలనుండి మన మండపము కళాహీనమైన పుష్పాలులేని వృక్షమైనది. తల్లీ! ఈ దీర్ఘవిచారమున కింక స్వస్తి చెప్పుదము. మన హృదయాల ఆవరించిన మేఘాలుమాయమగు శుభసమయ మరుదెంచుచున్నది. బంగారు తల్లీ! నీ యమూల్య విభూషణాలన్నియు నలంకరింప పరిష్కర్త్రి తారాదత్త కాజ్ఞ నిచ్చితిని. మన మండపమును హర్షుడను మండనకుడు అలంకరించుచున్నాడు. మా చెల్లెలు అమృతలతను నీవే యాహ్వానింపుము. నీముత్తవ ముక్తావళీదేవియు నిన్ను వెంబడించుగాక. అప్సరసలతో లక్ష్మివలె చెలికత్తెలతో నందవతరింపుము తల్లీ!

హిమ: నాయనగారూ! మనబండిని బావ సమవర్తి తోలునటకాదూ!

చారు: అవునమ్మా, అవును సమవర్తి శకటపరీక్షలో విజయ మంద గలడు. ఆ ఉత్తమ వృషభయుగ్మము శ్రీకృష్ణశాతవాహన మహారాజకుమారులకు నివేదనమగుగాక.

హిమ: నా కేదో భయము కలుగుచున్నది నాయనగారూ!

చారు: చిట్టితల్లీ, ఆ మాటలేమిటే! మనధాన్యకటక పురిని జరుగు మహోత్సవమునకుబోవ చారుగుప్తునితనయ భయపడుటేమి!

హిమ: అదికాదండీ, ఏదో భయము. మహోత్సవమునకు బోవ భయము కాదు.

చారు: వెఱ్ఱితల్లివి! వెళ్ళిపాడుకొనుము. వీణ బాగుగా వాయించు కొనుచున్నావా? నృత్యాచార్యులు నీ నాట్యము చూచి హర్ష మొందుచున్నానని వచించినాడు. నీ తల్లి ఎంత ఆనందించియుండునో!

అతని కన్నుల విచారమేఘము లావరించినవి.

హిమబిందుకుమారి తండ్రికి నమస్కరించి వెడలిపోవుచుండ నశ్రుసిక్తములగు చారుగుప్తుని కన్ను లామెను ద్వారతోరణమువరకు సాగనంపినవి.

2. శిల్పి

తని హస్తములు లలితములయ్యు శిలాశిక్ష నశ్రమముగ నిర్వహించుచున్నవి. పాలరాయితునుకలు దెబ్బదెబ్బకు ఉల్కలవలె నెగిరిపోవుచున్నవి. పాషాణధారణముపై సుత్తె అతివేగముగ, సున్నితమున వాలుచుండ, టంకగమనము నృత్య మభ్యసింపుచున్నది. క్రిందనున్న రాయి నిముస నిముసమునకు కావ్యరూపము దాల్చుచున్నది. ఆ శిల్ప మప్పటికే తెరచాటునుండి వచ్చిన వేషమువలె స్పష్టరూపము దాల్చినది. ఆ శిలాఫలక శిల్పమునం దొకటి రెండు విగ్రహములు మాత్ర మింకను పూర్తికాలేదు.

అప్పుడే కోటయం దాఱవ ముహూర్తము దెలుపు భేరీని మ్రోగించినారు. ఆ బాలకుడు లేచి వెనుకకు బోయి తన నేర్పరితనమును సవిమర్శ తీవ్రదృష్టితో కనుబొమ్మలు ముడిచికొని పరిశీలింప సాగినాడు.

ఒకచో విషయాసక్తుండగు రాజు ఉద్యావనమున అవరోధజన పరివేష్టితుడై క్రీడించుచున్నాడు. ఒక బాల రాజుతో మేలమాడుచున్నది. వేరొకతె మృదంగము వాయించుచున్నది. ఒక కృశాంగి నృత్యమున తన్మయత్వమునొంది, నిమీలిత నేత్రయైనది. ఒక చకోరాక్షి కాముకుడగు మనో నాయకుని వక్షోవిస్ఫూర్తి నవలోకించుచు నానంద పరవశయై యతని భుజమును చిగురువంటి హస్తతలముచే తాకుచున్నది.

ఈసమూహమునకు కుడిప్రక్క విజ్ఞానదము పుణ్యపురుషకథా పవిత్రమునగు దృశ్యము. బుద్ధుడు భిక్షార్థియై వీధులవెంట నరుదెంచినాడు. ఉపదిష్టధర్ములు, అష్ట మార్గావలంబకులు నగు ప్రజలు సందర్శనాభిలాషులై చేరుచున్నారు. బండివాడు, కాపు, నీరు తెచ్చు సుందరాంగి, పాలనమ్ముగొల్లది, భక్తిపూరిత నయనాల నా తథాగతుని నవలోకించుచున్నారు. వారందరితో పాటు రాజు, రాణులతో వెడలివచ్చి బుద్ధదేవుని సందర్శించుచున్నాడు. రాజు మోకరించియున్నాడు. రాణులు ఫలాదుల భిక్ష నర్పించు చున్నారు.

వ్యాఘ్రాజినముపై నిలుచుండి తదేకదృష్టితో శిల్పమును కనుంగొను నా యువకునకు పదియుతొమ్మిది సంవత్సరముల ప్రాయమున్నది. ఆతని మూర్తి సమున్నతము, కండలు తిరిగిన బాహువులు, విశాలవక్షము, తల పెద్దది, కోలమోము, సాధారణపు టాంధ్రనాసిక. అయినను ఆ బాలుని కన్నులు తీక్షణములై, నవ్వుచును సొగసులు ఒలకబోయును. ఆ కన్నులను జూచినవారు అతని మరుక్షణాన ప్రేమించి తీరవలయును. అందమున కన్నులతో నీడుజోడైన యాతని పెదవుల అరుణకుట్మలత్వము, నాసికా సాధారణత్వమును కప్పిపుచ్చి ఆతని ముఖ మంజులత్వాని కలంకారము దిద్దుచున్నది.

ఆతని కన్నులను, విశాల ఫాలమును, సుందర వదనమును వెలిగించునది. అతని భ్రూకుటి. అది యమునా గంగా సంశ్లేష పవిత్రము. అది హిమాచల సుమేరు పర్వతాలింగన సుందరము. అది కన్యాకుమారీ హృదయస్థ ప్రాక్పశ్చిమ సముద్రతరంగ సంయోగ గంభీరము.

ఆతని విశాల నయనాలు తీక్షణదృష్టులతో ఆ శిలాంతరాళమును జొచ్చిపోయినవి. ఆతడు నిట్టూర్పుపుచ్చి చేతనున్న టంకమును, అయోఘనమును ప్రక్కనున్న పనిముట్ల మందసమునందుంచెను. ఈ సాయంత్రమునకిది పూర్తి కావచ్చును. అప్పుడే ఆరు ముహుర్తములైనది. కోటలో భేరియు, స్తూపఘంటయు మ్రోగించినారు.

“రెండు మెతుకులు నోటవైచుకొని వచ్చి....” అను ఆలోచనములాతని హృదయమున పరువులిడినవి.

ఆ మందిరమం దెచ్చట చూచిననూ పాలరాతి విగ్రహములు వివిధ శిల్పావస్థలలో నున్నవి. చిత్రశోభితములై తోరణయుతములైన ద్వారకవాటములతో వర్ణమనోహరములైన కుడ్యములతో వర్ణములు కలుపుకొను పాత్రలతో, తూలికాది పరికరములుంచు మంజూషలతో, శిల్పశాస్త్ర తాళపత్ర గ్రంథములుంచిన పేటికలతో నా మందిరము విచిత్ర సౌందర్యము తాల్చినది.

మిసిమి వయస్సులోనున్న ఆ బాలశిల్పి అటుల నాలోచనాధీనుడై యుండ, ఇంతలో నొకజవ్వని ఇంటిలోనికి బోవు గుమ్మముకడకు వచ్చి “బాబూ సువర్ణ! భోజనమునకు రావా? మీ తండ్రిగారు కనిపెట్టుకొని ఉన్నారు. మీ అమ్మగారు వడ్డించుచున్నారు” అని పిలిచెను. బాలకుడు ఉలికిపడి.

“ఇదిగో, అందుకే లేచితిని, ఆరవ ముహూర్తనాదము వినబడినది ఇప్పుడే కాదా” అనెను.

“ఒక నాళిక పైగా దాటినది బాబూ!”

“ఏమిటీ! నాయనగారు బుద్దారాధనచేసి నా కొరకు కని పెట్టుకొని యుందురు. ఎంత మందమతిని! పాద ప్రక్షాళనముచేసి ఉడుపులు ధరించుకొని వచ్చెదను.” అనుచు నాతడు త్వరత్వరగా దొడ్డిలోనికి పోయెను.

ఇంతలో మహాలి మహానసగృహమునకుబోయి

“అమ్మా! కుమారుడు పాదప్రక్షాళనముచేసి శుభ్రవస్త్రములు ధరించి వచ్చుచున్నాడు. అది యెచ్చటి శిల్పదీక్షయో కాని మన సువర్ణకుమారునికి బాహ్యస్మృతియే ఉండదమ్మా!” అని పలికినది.

“అయ్యో, చిన్నతనాన వారును ఇంతే. ఆ తండ్రికి కొడుకుగాడూ! పోలిక లెక్కడికి పోవును! వారి జపమైనది, నా వడ్డనయు పూర్తియైనది. అబ్బాయివచ్చి కూర్చుండెనేమో చూడు, వానికి ఇష్టమని మామిడికాయ పచ్చడి చేసితిని.”

మహాలి భోజనాగారములోని కడుగిడి చూచి, వెనుకకువచ్చి, “అమ్మా! వచ్చి కూర్చున్నాడు. నేను పోయి, అమ్మాయిలకు స్నానాదికముల కేర్పాట్లు చేసెద” నని యామె గృహమున వేరొకభాగాన కేగెను.

తండ్రి కొడుకు లిరువురు భోజనము చేయుచుండిరి. తటాలున ధర్మనంది పుత్రుని గని, “రేపు సార్వభౌముని జన్మదిన ఖేలనోత్సవములకు వెళ్ళుదువా?” అని అడిగెను.

“చిత్తము,”

“ప్రదర్శనములో పాల్గొనుచుంటివా?”

సువర్ణశ్రీ మాట్లాడలేదు.

“పందెగాళ్ళలో నొకడవని వింటిని. బాబూ! శకటవేగ పరీక్షకు నీవు వెళ్ళుటా! నీవు ఎడ్లబండి తోలడ మెపు డలవరచుకొంటివిరా!”

సువర్ణశ్రీ కుమారుడు భోజనము చేయుటమాని బంగారుకంచా న వ్రేలు రాయుచుండెను. ధర్మనంది తన తనయుడు విద్యాసక్తితోపాటు దేహబలము వృద్ధి నొందించికొనుటయు గమనించుచునే యున్నాడు. మల్లయుద్ధవిశారదులలో మేటి, ఉప సేనానాయకులలో నుత్తముడు నగు సోమదత్తుని వ్యాయామ వనములందు కుమారుడు సుశిక్షితుడై ప్రఖ్యాతి నందుచున్నాడనియు ఎరుంగును. అయినను తన కుటుంబము పూర్వకాలము నుండియు శిల్పవిద్యయందు యశము సముపార్జించుకొనుచున్నది. ఆ దివ్యవిద్యను వదలి పామరజనోచితమగు వీరవిద్యయందు కాలము గడుపుట యంతయవివేకము! ఆత్మరక్షణమునకు ఆర్త రక్షణమునకు యుద్ధాశక్తి అవసరమగును. అంతమాత్రమే.... అయిననిప్పుడు....?

“బాబూ! నీవు దిగులుకొనకు; నిన్ను వీరవ్యవసాయమునుండి మరల్చు పిరికిమానిసిని కాను. మనవిద్య భగవత్ప్రీతికరము, సర్వోత్కృష్టము. తథాగతుని గాథలు శిల్పంలో రూపించి తనకు ద్రష్టకు నిర్వాణ మార్గ సోపానములు కట్టుశిల్పి యెక్కడ, వీరవిద్య లెక్కడ? భిక్షులువాగ్ధార బోధించిన ధర్మమునే, మనము టంకణ ధారతో ప్రసరింప చేయుదుము.”

ధర్మనందుల ధర్మపత్నియగు శక్తిమతి భర్తనుజూచి “బాబు శిల్పదీక్ష మీకు తెలియదుకాబోలు. చిన్ననాటి మీ శిల్పవ్యసనమంతా జ్ఞాపకముచేస్తూ వుంటాడు. పోలిక లెక్కడికి పోతవి! అభయబాహు మహారాజుతో మీరుచేసిన మల్లయుద్ధ వినోదాలు జ్ఞాపకము లేవూ?” అని పలికినది.

సువర్ణ శ్రీజనకుని పవిత్రభావము నిముషమున ద్యోతకము చేసికొనెను. కాని శకటాధ్యక్షులగు మహాశ్రీకి తన విజ్ఞాపనపత్రమును సోమదత్తులవారు పంపియుండిరే! ఇప్పుడు వెనుదీయుటకన్న బేలతన మేముండును?

కుమారుని మోము తిలకించుచున్న ధర్మనంది “వత్సా! సరియే, కానిమ్ము. మనకుటుంబమున వెన్నిచ్చినవా డింతవరకు జన్మింపలేదు. నీవు క్షేమముగ విజయివై వచ్చెదవుగాక!” అని నయనములు ప్రకాశింప పలికి, భోజనము పూర్తిచేసెను.

సువర్ణశ్రీ కుమారుడును పై కుబుకు సంతోషము నడంచుకొన ప్రయత్నించుచు పితృభక్తి పూరితములగు నశ్రుబిందువులు నేత్రముల దొలక భోజన మెట్లెట్లో చేసెను.


3. సేనాధికారులు

మదర్శి మధ్యమ వర్చస్వి. అయిదడుగుల ఎనిమిదంగుళముల పొడవు. కండలుదేరిన అవయవస్ఫుట రేఖలతో రాతివిగ్రహమువంటి కఠినదేహముకల పోటుమానిసి. అనేక యుద్దముల ఆరితేరిన బంటు. మదించిన మగధ మహిషమువలె మత్తిల్లియుండి, వాహినీపతులలో నుత్తముడై, మహారధుడై యిరువదిరెండువర్గాల పడుచుప్రాయంపు వీరుడై వెలయువాడు.

ఉత్తమాశ్వారూఢుడై, ఎడమచేతనున్న కళ్ళెము గుర్రము మెడమీద వదలి, మీసాలు మెలికలు తిప్పుకొనుచు, జనుల కేలుమోడ్పుల చిరునవ్వుతో నందికొనుచు ఒక నా డాతడు ధాన్యకటక నగరవీధుల హుటాహుటి స్వారి చేయుచు కోటనానియుండు యోధాగార గోపుర ద్వారముకడకు బోయినాడు. అచ్చట కావలిగాయు దళపతికి సంకేతము దెలిపి స్వారి చేయుచునే లోపలికి బోయెను. ధాన్యకటక నగరమునందు కోటలో రెండును, నగరములో రెండును, నగరము వెలుపల పదియు యోధాగారము లున్నవి. కోటలోని యోధాగారములు రెండును పెద్దవి. ఒక్కొక్కదానిలో అయిదువేల కాల్బలమును, వేయి గుర్రములును, వేయిమంది అశ్వికులును, అయిదువందల ఏనుగులును, వేవురు గజారోహకులును, మావటీలు వేవురును, అయిదువందల రథములును, అయిదువందల రథికులును, సారధి సహస్రమును, చక్రరక్షకులు వేవురు నుందురు. దళపతులు, ముఖపతులు, గణపతులు, వాహినీపతులు, చమూపతులు, ఉపసేనాపతులు, సేనాపతులు అని సైన్యాధికారులు తరతమములై యుందురు. నాలుగు ఏనుగులుగాని, నాలుగు రథములుగాని, పదిరెండు గుర్రములుగాని, ఇరువదిమంది కాల్బంటులుగానీ-ఏదియైనను దళమనబడును.[2] మూడు దళములు ఒకముఖము, పది ముఖములు ఒక గణము, మూడు గణములు ఒక వాహిని, మూడు వాహినులు ఒక చమువు. నాలుగు చమువులు ఒకసేన అని ఆంధ్ర సైన్యములు విభజింపబడినవి. ఒక్కొక్కసేనకు ఒక్కొక ఉపసేనాని అధిపతి. సేనాపతి రెండు సేనలను నడుపగలడు. సర్వ సైన్యములకు నాయకుడు సర్వ సైన్యాధ్యక్షుడు.

యోధాగారము సమచతురస్రమై, ఆవరణషట్కముతో నొప్పియుండును. నడుమనుండు ఆవరణలో సేనానాయకశాలయున్నది. ముఖపతులు సైనికులతోపాటు దళపతులు ఉత్తమ గృహములలో నివసింతురు. గణపత్యాద్యుత్తమ సేనాధికారులు నగరములో భవనములలో నివసింతురు.

సమదర్శి అట్లు ఆవరణలన్నియు దాటుచు పోయి సైన్యాధికారిభవనము ముంగిట నిలిచినాడు. అనేక సైన్యాధికారు లీతని చుట్టునుమూగిరి. పరుగిడి వచ్చిన అశ్వరక్షకుని చేతులలోనికి కళ్ళెమును విసరి, గుర్రమునుండి ఛంగున నురికి, “ఆంధ్రవీరా!” యని తన్ను సంతోషమున సంబోధించు స్నేహితుల జూచి నవ్వుచు, వారితో లోనికిజని, ఉచితాసనము నలంకరించినాడు.

“రేపటి మహోత్సవములో విజయము సమదర్శిది” యని ఆనంద వసువు వాక్రుచ్చెను.

“సార్వభౌములకు సమదర్శిపై అందుకే గదా అంతప్రీతి” యని ప్రభాతశూరుడు పలికినాడు.

సైన్యాధికారులు తళతళమను వెండిబంగారు చెక్కడపురేకు పొదిగిన తామ్ర శిరస్త్రాణములు తలలందును, మెడలో హారములు, భుజముల కేయూరములు, మొలల పట్టుకోకలు అలంకరించికొని యుండిరి. వారిలో ఆశ్వికులకు కూర్పాసములును[3], రథికులకు కంచుకమును[4], పాదచారులకు వారవానకములు[5], గజపతులకు దేహత్రాణములును, దేహమునకు విడివిడిగా ధరించు లోహపుగొట్టములు గలవు. కంఠత్రాణములు, నాగోదారికములు[6] అందరును ధరింతురు. ఆ పరాక్రమమూర్తుల నవలోకించినచో ఆంధ్రసైన్యములు సకల భారతవర్షమున నేల దుర్జయములో తెల్లమగును.

వీరలోకమంతయు వివిధాసనముల నుపవిష్టమైనది. “సమదర్శి! సర్వసైన్యాధ్యక్షుని భవనము చుట్టుప్రక్కలవారికి యుద్ధమనుమాట వినబడుచున్నదట?” అని అమలనాథుడు సమదర్శి దిక్కు మొగంబై ప్రశ్న వేసెను.

ఆనందవసువు: సమదర్శి సమవర్తే. సార్వభౌములు “సాతవాహన శత్రు సమవర్తి” అని బిరుదము ప్రసాదించినారా! చెప్పవయ్యా.

ప్రియదర్శి శాతవాహనుడు తన కొమరునకు సమదర్శియని నామకరణ మీడికొనినాడు. శాతవాహన సామ్రాజ్యము పై ఎత్తివచ్చిన ఆభీరులపైని శ్రీముఖ శాతవాహనుడు సమదర్శిని సైన్యమిచ్చి పంపినాడు. సమదర్శి ఆభీరులను పూర్తిగా ఓడించి తరిమివేసి వారి పతాకములన్నియు కొనివచ్చి సార్వభౌముని పాదములకడ నర్పించెను. అప్పుడానందహృదయుడై చక్రవర్తి “సాతవాహనశత్రు సమవర్తి” యని బిరుదమును నిండుసభలో సమదర్శికి ప్రసాదించెను. అందుచే అతని బందుగులు, మిత్రులు సమవర్తియనియు పిలుచుచుందురు.

సమ: ఏమున్నది? మొన్న బేగిరావు నాడువార్త తెచ్చుటయు మహామంత్రులవారు శీఘ్రముగ మహారాజ దర్శనమున కేగిరట. సర్వసైన్యాధ్యక్షులను పిలిపించిరట.

ప్రభాతశూరుడు: ఆవార్త మాళవమునుండి కాదా?

అమల: మాళవము తిరుగుబాటు చేసిందనే ఊహిస్తున్నాను.

ఆనంద: ఊరుకోండి మామగారూ! మొన్నకదా చండవిక్రములైన వినీతమతుల ఆధిపత్యమున మాళవమునకు సైన్యము లంపుట, అంత కొన్ని దినములకే వార్తాహరులు మాళవము శాంతముగ నున్నదని తెలుపుట జరిగినది?

ప్రభాత: ఆనంద! నీకు తెలివితేటలులేవు. ముగ్గురు సార్వభౌములకడ పనిచేసిన అమలనాథ సేనాపతులు నీపాటి ఆలోచన చేయలేదని అనుకొంటివా?

ఆనంద: చేయలేదనికాదు.

అమల: ఏమో! వృద్ధులమాటలు పడుచువాళ్ళు పాటింతురా? మా చిన్నతనమున పెద్దలకెన్నడు నెదురుచెప్పి యెఱుగము.

ఆ వీరు లొకరిమొగము లొకరు చూచుకొనిరి.

సమ: మామగారూ! కోపగించకండి. ఆనంద చనువుకొద్దీ ఏవో తెలివితక్కువ మాటలు అన్నాడు. ఆ దోషమునకు ప్రాయశ్చిత్తం మీరు విధించదగుదురు. మనలో మనకు అరమరలు కూడవని వీరలోకమునకు మనవి.

ఆనందవసువు విచారమావరించిన మోముతో అమలనాధునికడ మోకరించి “ఈ యపరాధికి దండనమే ప్రసాదము” అని తలవాల్చికొనెను.

అమలనాధు డాతని రెండుచేతులు పట్టుకొని లేవనెత్తి “నాయనా! నీవు రెండురోజులు మౌనవ్రతము దాల్చి మహాచైత్యమున ఆదిశ్రమణునకు దీప మర్పించి, ఆంధ్రమహారాజుల పతాకము సర్వదిశల విజయ కాంతులతో తేజరిల్లవలయునని ప్రార్ధించుము, కళ్ళెములేని అనవసరోత్సాహమును కనుగొనిన నాకు విచారము కలుగునుగాని కోపమురాదుసుమా” యని పలికినాడు. వీరులందరును లేచి అమలనాథుని అభినందించిరి.

అమల: ప్రస్తుత మాలోచింపుడయ్యా! రేపు మనలో వృషభశకట పరీక్షకు ఎవరెవరు నిలబడిరో సమదర్శిని చెప్పనిండు.

సమదర్శి: సార్వభౌముల పక్షమున వరాలకుడును, మా మేనమామగారి రథము నడుపుచు నేనును, కళింగదేశాధిపతి పంపిన శివస్వాతియు నుందుము. మాళవ ఘూర్జర మగధ పాండ్య చోళ కేరళ పాంచాలములనుండి దిట్టరులగు వారు వచ్చిరట. ఇంకను పెక్కుమంది యున్నారు.

ప్రభా: గెలిచినవారికి కానుకలమాట చెప్పవైతివి?

సమ: ప్రతివర్షము నిచ్చునదిగాక, ఈ ఉత్సవమున అన్ని పరీక్షలకు అదనపు కాన్కల నిత్తురట సార్వభౌములు.

ప్రభా: ఉక్షశకటపరీక్షకు అదనముగా ఏమిచ్చెదరో చెప్పుకోండి. ఇవిగో పదిపణాలు పందెం.

చాలమంది వివిధ వస్తునామము లుచ్చరించిరి. ఇంతలో ప్రతీహారియగు నొకదళపతి లోనికి విచ్చేసి నమస్కరించి “జయము జయము వీర శ్రీమంతులకు! ఉపాధ్యక్షులవారు విజయము చేయనున్నారు. వారి రథము మూడవద్వారము దాటినది” అని నిర్గమించెను.

ఆయుధపాణులగు నలువు రంగరక్షకులు వెంటరా నుప సైన్యాధ్యక్షులగు కాకుండకులు సంపూర్ణ కవచధారియై విచ్చేసిరి. ఒక్కసారిగా సేనాధికారులందరు లేచి నమస్కరించిరి. అందరికి ప్రతినమస్కృతులిడి కాకుండకు లోక దంత పీఠ మలంకరించి వారిని “కూర్చుండు”డని సంజ్ఞచేసిరి.

“రేపటి మహోత్సవమునకు శతస్కంధుడు, ప్రమానందుడు, చండకేతుడు, గుణవర్మ రథ గజ తురగ పదాతులతో రక్షకులై వచ్చునది. ముప్పది ఏనుగులు, రెండువందల రథములు, అయిదువందల గుఱ్ఱములు, మహాఖేలనా స్థలము చుట్టును విడిసి ఉండవలసినది. సార్వభౌముల ఊరేగింపు మహోత్సవమున నూరు ఏనుగులు, అయిదువందల రథములు, రెండువేల పదాతి దళము, వేయి గుర్రములు కావలికాయునది. అందులకు వలయు నాయకులను అమలనాధులవారు ఏర్పాటు చేయుదురుగాక. వారే ఆ ఉత్సవమునకు అధిపతులు. వారి నాయకత్వమున ఇంక నన్ని సైన్యములు ఊరేగింపు టుత్సవమున పాల్గొనవలసినది. కుంభీరకులు, ఉపపాదులు, అనుగ్రహులు, ఉద్ఘాటకులు యీ నలువురు సేనాపతులు చక్రవర్తికి అంగరక్షకులుగా వెళ్ళవలయునని సర్వసైన్యాధ్యక్షుల ఆజ్ఞ. అమలనాధులు ఎన్నుకొనిన ఉపసేనానులూరేగింపుటుత్సవ సైన్యములు నడుపునట్లు ఆజ్ఞ. ఆయా యోధాగారాలలో వంతు వచ్చినవారు కావలియందురు గాక. తక్కినవారు మహోత్సవమునందు పాల్గొనవచ్చును. ఈ ఉత్సవము నవదినముల నీ యాజ్ఞయే వర్తించును. తథాగతుడు మీకు రక్ష” అని కాకుండకులు యథోచితముగ వెడలిపోయిరి. 

4. విషబాల

బుస్సు” మని యా పాము లేచినది. దాని కన్నులలో నవ్వుతాండవ మాడినది. ఆ కన్య యా పాము నెత్తుకొని, కుడిచేతితో పడగనందికోని, ముక్కుతో ఆ ఫణిరాజు ముట్టెను ప్రియమార రాచినది. అది భయంకర కాలోరగము. ఆరడుగుల పొడవుతో మిలమిలలాడు నీలనీరధి కల్లోలము అర్జునుడను ఆ పన్నగేంద్రు డాయోషాతిలకమును అలmeను. నాగవల్లివలె చుట్టుకొనిపోయెను.

“అర్జునా! నీవు మంచివాడవోయీ! నీ కన్నులు వజ్రాలవలె మిలమిల లాడుచున్నవి. నీ తలమానికము తళతళ తోచుచున్నది. నీ దేహన నీలరత్నాలు మిరుమిట్లు కొలుపుచున్నవి. నీకును ఉలూపికిని ప్రణయకలహము తీరినదా? నీవు సంతోషాన నింత జ్వలించు చున్నావు? నీ నాల్కలు చాచి నా పెదవుల నంటెదవు. వద్దు! నా కెంగిలి అసహ్యము. ఈరోజున పరుగుపందెములో నిన్ను ఓడించగలనుసుమా!” అని సౌందర్య రాశియగు నాబాల పకపక నవ్వినది.

ఇంతలో మొగలిరేకువంటి శ్వేతోరగి యోర్తు ఆ బాలకడకు వేగాన ప్రవహించుచు వచ్చినది. దానిని చూడగనే అర్జునుడా కన్యకా హస్తాల నుండి నేలకుజారి, ఓంకారరూపమై ఆడజొచ్చెను. ధవళఫణియు, గ్రక్కున నా యువతిపై కెగబ్రాకి ఆమె మూర్థాననుండి ఫణము క్రిందకువాల్చి యాబాలిక ముక్కు బుగ్గలు, పెదవులు, గడ్డము, నాల్కలనంట సాగెను.

చంద్రకిరణమువలె మిలమిలలాడు స్నిగ్ధస్విన్నాంగముతో నాభుజగి ఆ జవ్వని లేతపొన్నాకు చెవికడ సంగీత స్వనాన బుసకొట్ట నారంభించినది. బాలికయు “ఏమి ఉలూపీ! భర్తపై నేరాలుమాని ప్రేమవాక్యాలు పలుకుచున్నావు! ఆహా! మూడునాళ్ళ కలహపు ముచ్చట నేటితో తీరెనేమి? ఏది! నాయెదుట ఒకరినొకరు కౌగిలించుకొను “డని కోకిల పులుగుపలుకుల కుహుకుహూలాడినది. తక్షణమే యా పన్నగి క్రిందకుజారి అర్జునుని మెలివేసికొనిపోయినది.

ఆ మందిరమునం దెల్లయెడల విషోరగములు భయంకరములై తిరుగాడుచున్నవి. పాములు నివసించుటకు గోడలపొడుగునను మట్టితో కృత్రిమ వల్మీకములు నిర్మింప బడినవి. ఆ బాలిక అందలి నాగములతో మంతనమాడుచు, నాడుకొనుచు ఒక ముహూర్తకాలము వినోదించి యా మందిరము వెల్వడినది.

ఒక కక్ష్యాంతరముదాటి యామె ఉద్యానవనవాటిక ప్రవేశించెను. అందు నాభితీగెలు కంచెలయందు దట్టముగా నల్లికొని ఎర్రని పుష్పములు పూచి యున్నవి. శృంగి, మదనబేరి, ముష్టి విపక్షీర విసబొద్ది వృక్షములు అచ్చటచ్చట తమ విషపత్రముల నాడించుచున్నవి. అది భయంకర సుందర వనవాటిక. అది మృత్యుబాలికా నృత్యరంగము.

ఆ వనాంతమున వివిధవర్ల శిలలతో నిర్మింపబడిన జలాశయము నాకృశాంగి సమీపించి విగతవస్త్రయై, యందు దుమికి, యీదులాడజొచ్చినది. ఆ నీరములందు అగ్నికీలాసదృశములు నగు వివిధ విషాదులు సమ్మళితము చేయబడియున్నవి.

ఆ తన్వంగియందు గాలికి నూగులాగు బడబానల జిహ్వవలె నీదు కొన్నది. పిల్లిమిరెములు, బల్లటీలు కొట్టినది. ఆ విష దిగ్ధనీరముల బుక్కిట బట్టి పై కెగ జిమ్మినది. మునిగి తేలినది. ఓలలాడినది.

జలక్రీడలైన వెనుక సువ్వునలేచి పదునెనిమిదేళ్ళ చుఱుకు ప్రాయంపు టద్భుతసౌందర్య మొలుక బోసికొనుచు మెట్లెక్కిగట్టునకు వచ్చి, కురుల తడియార్చుకొని ద్విగుణీకృత దేహకాంతితో వెలుగుచు, కాటువేయబోవు పామునోటి కోరవలె తళతళమన్నది.

ఆమె సౌందర్యము సువాసనాలహరు లెగబోయు తరులగర్భములోని అగ్నివంటిది. తియ్యని విషము. విద్యున్మాలినీ విలసితము, పాయము తాల్చిన వ్యాఘ్రరాణి, పదునుపెట్టిన నిశితకృపాణము.

కుంతలములను వలిపెముతో తుడుచుకొనుచు దిసమొలతో నొయారముగ నడుగులిడుచు ఆ వనవాటి నంటియున్న భవనమార్గమును జేరినది. ఆమె దేహచ్ఛాయ తప్తకాంచనము. నల్లనై విడబారు కేశభారము జానువులవరకు వ్రేలాడినది. పరువములు తొంగిచూచు ఆమె వక్షోరుహద్వయము తరుణకదంబము పూచిన తొలిపూతగుత్తులు. ముగ్ధత్వమువీడని యా బాలికా తనూరేఖలు అపశ్రుతిరహిత రాగమాలికా మోహనతరంగములు. మత్సాకారములై దీర్ఘములైన యామె లోచనాల కలలు తిరగవు. అవి నిశితసారాచ ముఖధగద్ధగితములు. ఆమె అధరోష్టములు మథురములు, కరుగని అరణ్యక బింబ ఫలములు, నాభి కుట్మలములు.

ఆ బాల యభ్యంతరగృహమునకు విసవిసజని, సన్నని దుకూలము ధరించి స్తనవల్కలము జుట్టుకొని నగలుదాల్చి నాభీగంధకదంబితమగు పచ్చి సాంబ్రాణిబంక పొగవేసుకొని కుంతలా లార్చుకొనుచుండ నామందిర కవాటము తెరచుకొని పండువంటి యొకవృద్ధతపస్వి స్థౌలతిష్యులు లోనికి వచ్చిరి. మిసమిసలాడు నా బాలికాసౌందర్యము ఆపాదమస్తకము గమనించుచు, చిరునవ్వు మోమును వెలిగింప నాతడు చేరవచ్చినాడు.

“తాతయ్యా! నాకేమి తెచ్చినారండి!” యని యామె యాతని కౌగిలిలోనికి వ్రాలినది.

“కన్నతల్లీ! నీవు నా కోర్కెలీడేర్చు దివ్యముహూర్తము సమీపించుచున్నదిసుమి. అప్పుడు నీ ఇష్టమువచ్చినట్లాడుకొని, నాశనమొనర్ప అమూల్యము, సజీవమూ నగు నాటవస్తువు నీ కర్పించెదను. ఈలోన ఇతర వస్తువులు నీకు వలయునవి ఒసగుచుంటినిగాదా!?”

“ఆ వస్తువు అందముగా నుండునా తాతయ్య?”

“ఆ సౌందర్యమునకు దేశదేశములు తలలొగ్గుచున్నవి.”

“ఎప్పుడా ముహూర్తము తాతగారూ?”

“బ్రహ్మ సరస్వతిని విద్యాతేజఃపుంజముచే సృష్టించినాడు. కమలాక్షుడు కంటకుల నిర్మూలించుటకై చక్రమును సూర్యరజముచే త్వష్ట కల్పించినాడు. పరివేదనాతప్తమగు నాహృదయతాపమువోసి నిన్ను పెంచికొన్నాను. తల్లీ! నీ కన్నులు జాజ్వల్యమాన హల హలధారలై పోవుగాక! నీవక్షోజములు ప్రళయాగ్ని స్పులింగకలశములౌగాక! నీ దేహము జృంభా విస్ఫురన్మృత్యు ముఖదంష్ట్ర యగుగాక! ఆ దివ్యముహూర్తము ఇదిగో వచ్చుచున్నది. వచ్చుచున్నది తల్లీ!”

అతని కన్నులు ఫాలము భయంకరములగు కాంతులచే ప్రకాశించి పోయినవి. వణుకుచున్న అతని చేతులు ఆమె మూర్దమును తడివినవి.

ఇంతలో “ఘణఘణ” యొక జేగంట మ్రోత వినవచ్చినది.

ఆ తపస్వికి మెలకువవచ్చి తీవ్రత తగ్గిన కంఠముతో “అమ్మా! పూజా వేళయైనది. పరమశివుడు యోగనిద్రనుండి లేచి నా పూజకై నిరీక్షించుకొనియున్నాడు. నేను వెడలెద” నని పలికి రూపొందిన బ్రహ్మవిద్యవలె నున్న యాతడా గదినుండి వెడలిపోయినాడు.

తాతగారు వెడలిపోయిన వెనుక ఆ బాలిక వేరొక కవాటమును తెరచుకొని వివిధములగు ఆటవస్తువులున్న వేరొక మందిరమునకు బోయినది.

ఆ బాలిక బొమ్మలతో నాడుకొనుచు, కూనిరాగముల తీసికొనుచు ఆ క్రీడలో మునిగిపోయినది. వ్యాఘ్ర సింహాదులు కురంగాది జంతువుల తినుచున్నట్లు, దేవి రాక్షసుల వధించుచున్నట్లు కీలుబొమ్మ లనేకములందుగలవు.

బొమ్మల పెళ్ళిళ్ళు, బిడ్డబొమ్మల గుజ్జనగూళ్ళు ఆ పాప చిన్ననాటి నుండియు నెరుగదు. ఆమె ఆట పాట లన్నిటిలో వీరభయానకరౌద్రములే మెదిపి యుంచిరి. ఆమె చూపులకు విలయపయోద నీలిమలు కాటుకలైనవి. ఆమె యూర్పులు మృత్యు నిశ్వాస భుగభుగలతో సహాధ్యయనము చేసినవి.

5. శ్రీకృష్ణశాలివాహనుడు

శ్రీముఖ సాతవాహన మహారాజు అభయభాహు సాతవాహన చక్రవర్తికి ప్రథమ తనయుడు. బౌద్ధశకము 426వ సంవత్సరమున ధాన్యకటకాన కౌశికీదేవి గర్భశుక్తి ముక్తాఫలమై శుభలగ్నమునందు జన్మించినాడు. శ్రీముఖుడు బౌద్ధశకము 453వ వర్షమున ఆంధ్రసింహాసన మధివసించి మహాప్రజ్ఞతో రాజపాలన మారంభించినాడు.

సార్వభౌముడు బంగారు ఛాయవాడు. సంపూర్ణముగ ధనువు పొడువు గలవాడు. కోలనగు మోము, చక్కని కోరమీసములు, దీర్ఘసమ నాసిక, విశాలములై, అరమూతలై నిమ్నములుకాని కళ్ళు, సమఫాలము, పెద్దనోరు శ్రీముఖుని ముఖము సర్వసార్వభౌమ జయశ్రీ విలసితము. కండలు కట్టిన దేహము, కొంచెము చిరుబొజ్జ ఆ విగ్రహానికి ఒకనిండు తెచ్చినవి.

శ్రీముఖుడు మరి మూడేండ్లకు పట్టాభిషిక్తుడగుననగా పెద్దకుమారుడు శ్రీకృష్ణుడు జన్మించినాడు. శ్రీకృష్ణసాతవాహన యువమహారాజు వెనుక, చక్రవర్తికి ఇరువురు రాకుమారికలు, ఒకరివెనుక ఒకరు నాలుగేండ్లు భేదముగా జననమొందినారు. ఆ వెనుక ఇద్దరు కుమారులు పుట్టిపురిటిలనే సందుగొట్టి చనిపోయినారు. తర్వాత రెండేండ్లకు శ్రీకృష్ణునికి పదునారు సంవత్సరముల ఈడున అతనికి తమ్ముడు మంజుశ్రీ రాకొమరుడు జన్మించినాడు. పదునారవ సంవత్సరమున శ్రీకృష్ణుడు యౌవ రాజ్యాభిషిక్తుడై ప్రతిష్టాన నగరపాలన భారము వహించెను. ప్రతిష్టాన నగర పాలకత్వము నందిన యువరాజులు మహారాజను బిరుదము వహింతురు.

శ్రీకృష్ణసాతవాహనమహారాజు ఇప్పు డిరువదిరెండు వర్షముల ప్రాయమున సింహకిశోరమువలె విస్ఫారితవక్షుడైమధ్యమోన్నత శరీరుడైయౌవన పరిమళార్ధ్ర వయస్కుడై, మహావీరుడై, శతృహృదయ విదారకుడై, ప్రతిష్టాననగరాన రాజ్యపాలన మొనర్చుచున్నాడు.

సార్వభౌముని జన్మదినోత్సవములకు మహారాజు శ్రీకృష్ణసాతవాహనుడు ప్రతిష్టానమునుండి ధాన్యకటకమునకు సేనాపరివృతుడై సర్వవైభవోపేతుడై విచ్చేసినాడు. యువరాజు ధాన్యకటక నగరానికి మూడు గోరుతము లెగువను కృష్ణాతీరముననున్న విజయస్థలిత యనుకోటలో విడిదిచేసెను. వచ్చిన మరునాడు శుభముహూర్తమున శ్రీకృష్ణుడు సపరివారుడై, మాతాపితలకు పాదాభివందన మాచరింప సార్వభౌముని మహాభవనమునకు వెడల సన్నద్ధుడగుచున్నాడు. అలంకరణ మందిరమునుండి మంజులశ్రీ మూర్తియై, కిరీటకేయూరాది సకల భూషణాలంకృతుడై, మందహాస వదనుడై బయలుదేరెను. మౌక్తికాలంకృత దుకూలాంబరావృత ధవళచ్ఛత్రముతాల్చి చ్ఛత్రవాహనుడు వెనుక నడువ, చామరగ్రాహిణులగు సుందరులు కరకంకణక్వణన మనోహరముగ నిరుదెసల వీచోపులిడుచుండ, పార్శ్వవర్తిని యగు మనోహరాంగి భుజమున ఎడమచేయినిడి, దక్షిణ హస్తమున లీలానీలకుముదము ధరించి, వేణు, కాహలాది వాద్యముల మధురగీతములు సెలగుచుండ సాయుధులగు నంతఃపుర రక్షకవనితలు పరివేష్టించి నడువ, శ్రీకృష్ణ సాతవాహనమహారాజు బయలుదేరి గుమ్మము దాటుటకు కుడిపాదముంచినతోడనే ఒక శ్వేతోరగము బుస్సుమనుచు, ఎట్టఎదుట ఆడుచు ప్రత్యక్షమైనది. భయావృతమనస్కులై ఎచటి వారచట ఆగిపోయారు. పార్శ్వవర్తిని కెవ్వున అరచి రెండుచేతుల కళ్ళుమూసికొనినది. శ్రీకృష్ణకుమారు డాశ్చర్యమున, ఒక్కతృటికాల మట్లే యుండిపోయినాడు.

ఇంతలో నీలాంబుదావృత విశాలాకాశము వెలిగించి, మాయమగు విద్యున్మాలవలె నా శ్వేతపన్నగి వారందరు చూచుచుండగనే మాయమైపోయినది.

అద్భుతాశ్చర్యహృదయులై, వారందరు శ్వేతఫణి తమతమ పాదాలను చుట్టినదేమో అని చేష్టలుదక్కి ఆ సుందర మందిర పురోభాగమున మలచిన ప్రతిమలవలె క్షణకాలము గన్పట్టిరి.

రక్షకభటులు, దౌవారికులు, పారిపార్శ్వకులు, ముఖపతులు, మంత్రు లొక్కసారి సాయుధహస్తులై యా మందిరమంతయు వెదకనారంభించిరి.

శ్రీకృష్ణమహారాజు ఆ శ్వేతపన్నగినే తలంచుకొనుచు, చిరునవ్వు వెలుగులు మరల మోమున నలమికొన, పార్శ్వవర్తినితో “మన ప్రయాణము సాగనిమ్ము” అని యాజ్ఞనిడెను.

అయిదు లిప్తలలో మరల పరివార జనము, మంత్రులు, సేనాధిపతులు యథాస్థానములకుజేరి మహారాజు కనుసన్నల ముందుకు సాగిరి.

మహారా జిట్టు దుర్గప్రవేశమొనర్చి అంతఃపురముచెంత దన పరిజనమును నిలిపి, లోనికరిగి, దర్శనసభలో సింహాసనాసీనులైయున్న తల్లిదండ్రుల పాదములకు సాష్టాంగ ప్రణామ మాచరించినాడు.

బుద్ధభిక్షులు, విప్రులు ఆశీర్వచనములు పలుక, సార్వభౌముడు, సామ్రాజ్ఞియు సింహాసనములనుండి లేచి, నయనముల ఆనందబిందువులు నృత్యమాడ, వంగి కుమారుని చేరియొక చేయిపట్టి లేవనెత్తుచు, “చిరంజీవివి, సత్వర వివాహితుడవు, సిద్ధసకలాభీష్టుడవు కమ్ము తండ్రీ” అని ఆశీర్వదించిరి.

జననీ జనకుల నోటినుండి ఆశీర్వాదము వెలువడుచున్నప్పుడు శ్రీకృష్ణకుమారుని హృదయమున తెల్లని పామొకటి ఆడుచు కనిపించినది.

సార్వభౌముని అనుమతిగొని యువరాజు తల్లితో అభ్యంతరమందిరమునకు బోయినాడు.

మహారాణి: కుమారా! ప్రయాణము కుశలముగ జరిగినదా?

శ్రీకృష్ణుడు: దేవమూర్తులైన తమ ఆశీర్వాదబలము నాకు వజ్రకవచముగదా తల్లీ!

మహారాణి: మా కడుపును పవిత్రము చేయుటకు పుట్టినమూర్తివని నేను వేయిదేవులకు సర్వదా నమస్కరించుకొందును తండ్రీ!

శ్రీకృష్ణుడు: మా తమ్ములు బంగారు తొనల బొమ్మ, మంజుశ్రీ మూర్తి జాడలు తెలియలేదుకదా?

మహారాణి: నాయనా నా కడుపులో ఆ బాధ ఎప్పుడును కుములుచునేయుండును. ఏ దుర్మార్గునకు చేతులు వచ్చినవో!

శ్రీకృష్ణుడు: ధనమునకాశించి ఇట్టిపని జరిగి ఉండదు. అమ్మా! మీరు పరిపూర్ణ ధైర్యమువహించి ఇంకను కొన్నినెలలుమాత్ర మోపికపట్టుడు.

మహారాణి: నాయనా! నేను పైకి ధైర్యమువహించినా, అసలు నా హృదయములోని బాధ ఏలాగు తీసివేసుకోగలనయ్యా! నీవు తమ్ముని వెదకి ఆరునెలలలో అమ్మగారి ఒడిలో కూర్చుండపెట్టుదునని ప్రతిజ్ఞపట్టితివని వింటిని. తండ్రీ! నా చిన్ని బాబును ఒడిలో కూర్చుండ బెట్టుకోగల భాగ్యము మాకు వచ్చునా! అందుకు మీరందరు ఏమరుపాటులేక ప్రయత్నములు చేయుచునే యున్నారు, అయిన నా అదృష్టమెట్లుండునో!

శ్రీకృష్ణుడు: అమ్మా! మీరు కంట తడి పెట్టకుడు. తమ్ములు బ్రతికి క్షేమముగ నున్నారని తెలిసికొన్నాను. ఆ సాక్ష్యము అనుమాన రహితమైనది, శుకబాణులవారే తెచ్చినారు.

మహారాణి: అవును తండ్రీ, మహారాజుగారు ఆ విషయమును చెప్పినారు. అందుకే ఈ మాత్రము ధైర్యముగ నున్నాను. నేనును, మహారాజుగారును త్రయంబకమునకు...

శ్రీకృష్ణుడు: అవును జననీ! తామును చక్రవర్తియు ఎప్పుడు త్రయింబక గౌతమీ జన్మస్థలమునకు రాగలరు?

మహారాణి: సార్వభౌముడు ఒకసారి పశ్చిమదేశాలకు రావలెనని యనుకొన్నారు. త్వరలోవారు ఏదియేని నిర్ణయమునకు వచ్చెదరనుకొందును.

శ్రీకృష్ణుడు: అమ్మా! తమ పాద సేవ చేయుటకు వచ్చుచుండ, నాకీదినమున ఒక తెల్లని తాచుపాము శకునమైనది. దానికి ఫలమేమో యని ఆలోచించుచున్నాను.

మహారాణి: ఏమిటి తండ్రీ! పామా! బుద్ధభగవానుని రక్ష, నీకు పరమేశ్వరామృత రక్ష! చిరంజీవ! చిరంజీవ! ఎచ్చట ఈ పాము కనబడినది? రాచబాటనా!

శ్రీకృష్ణుడు: లేదు తల్లీ! మహాభవనానికి పయనమై అలంకార మందిరము దాటివచ్చిననాకు మందిరాంగణమునం దది ఆడుచు ప్రత్యక్షమైనది.

మహారాణి కొమరుని శిరము పొదవిపట్టుకొని తనమోమున కాన్చి కొని మరల వదలినది.

శ్రీకృష్ణ సాతవాహనుడు ఇంచుక నవ్వుచు తల్లిమోమున చూడ్కివఱపి

“జననీ! తాము మహాంఘారామానికై కట్టించు విహారము పూర్తియయినదను కొందును. గురువులగు అమృతపాదార్హతులకు దాని నర్పించు శుభ ముహూర్తమెపుడు?” అని ప్రశ్నించెను.

“బాబూ! మీ తండ్రి గారును, నేనును సౌందర్యనిధియగు కోడలిని వరియించినాము. బాలిక చిత్రమును జూచి నీ యభిప్రాయము చెప్పవలయును. నీ వివాహమును, విహారార్పణము ఒకమారే” అని కుమారుని వైపునకు తిరిగి యా సామ్రాజ్ఞి చిరునవ్వు తెచ్చుకొనుచు పలికినది.

శ్రీకృష్ణసాతవాహనుడు నవ్వుచు “శ్వేతపన్నగ సందర్శన ఫలితమా తల్లి!” అనుచు వంగి తల్లిపాదముల నంటెను.

సార్వభౌముని దేవేరి, పుత్రుని నవ్వుచూచి, ఏదియో అవగతము చేసికొన ప్రయత్నించుచు, చిరునవ్వుతో తీవ్రాలోచనసలిపి, సుతునిశిరముపై చేయినుంచినది.

శ్రీకృష్ణసాతవాహనునకు తన తమ్ముని, మంజుశ్రీని, చోరులు తస్కరించుకొని పోవుటలోని ఉద్దేశ్య మెంత ప్రయత్నించినను అర్థముకాలేదు.

చక్రవర్తి అంతఃపురములోనికి చొచ్చుకొనిపోయి, మాయావేషములతో మహాధైర్యముతో వేయిమంది రక్షకభటుల, రక్షకస్త్రీల, కంచుకుల, ద్వారపాలుర దాసీజనముల మధ్యనుండి రాజకుమారుని ఎత్తుకొనిపోగల దిట్టరి ఎవడు?

ఇది ఒకరిపని కాదు. అత్యంత సమర్థుడైన పురుషుడు కొన్ని వేలమంది సహాయంతో, అంతఃపురములోని దాసదాసీజన సహాయముతో, కొందరు రక్షకభటుల సహాయముతో జరిపియుండుననికదా శుకబాణుల వారు అభిప్రాయ మందినారు. వారితో మహారాజును, మహామాత్యులు, సర్వ సైన్యాధక్షులు ఏకీభవించినారు.

రాజ్యమునకై ప్రయత్నమా? కసితీర్చుకొను ప్రతీకారమా? ముక్కుపచ్చలారని బిడ్డను కొనిపోవ వారి హృదయ మెట్లొప్పినది? శుకబాణుల చారులు దేశమునంతయు దువ్వెనతో దువ్వినారు. ప్రభువు అనుమానమును శుకబాణుల అనుమానమును, స్థౌలతిష్యమహర్షి మీదనే ఉన్నది. కాని ఎన్నివిధములైన మాయలు పన్నినను, అనుమానాత్మకమగు ఒక చిహ్నమైన స్థౌలతిష్యమహర్షి యాశ్రమమునందు గోచరింపలేదట. వారి ఆశ్రమములో వైద్యశాలలున్నవి. సర్పవైద్యమునకై అష్టఓషధుల తోటలున్నవట. మంత్రములకు కట్టుబడి పెద్దపులులు, సింహములు, చిరుతలు మొదలగు క్రూరమృగములెన్నేని యాతని మృగశాలయందున్నవట.

విద్యార్థులై దేశదేశములనుండి ఎందరో పండితులు, ఋషులు, కాపాలికలు, యోగులు వచ్చుచుందురు. వైద్యమునకు ముక్తికి మంత్రోప దేశములకు లక్షలమంది ఆ పవిత్రాశ్రమమునకు వచ్చుచుందురు. ఆ మహర్షి రాజకుటుంబమన్న ప్రేముడికలవాడు. తన తాతగారి సహాధ్యాయుడు సర్వతంత్ర స్వతంత్రుడు.

వారణాసిలో, తక్షశిలలో, విష్ణుప్రయాగలో, హృషీకేశములో, నవద్వీపమునందు, ధాన్యకటకమునందు, నర్మదాతీరమున, కావేరీతీరమున ఇట్టి మహాపండితుని, ప్రజ్ఞావంతుని ఎచ్చటను చూడలేము? అయినను స్థౌలతిష్యునిమాట తలచుకొన్నచో ఏదియో తనకు భయము కలుగును. శుకబాణులవారు కొందరిని అనుమానించి తనతమ్ముని మంజుశ్రీరాజకుమారుని తస్కరించుకుపోయినవారు వారేనని నిర్ధారణ చేసినారు. అయినను మూల కారణుడు స్థౌలతిష్యులవారేననియు శుకబాణుల యనుమానము. శ్రీకృష్ణుడట్లు కక్ష్యాంతరముల గడచి, చక్రవర్తియున్న సాహిత్యమందిరము చేరెను.

శ్రీముఖుడు చిరునవ్వుతో, “బాబూ, మీకు ధాన్యకటక నగరాతిథ్యము ప్రీతికరముగ నున్నదా?” యని ప్రశ్నించెను.

“మహాప్రభూ! నా విడిది యధానందదాయకమైయే యున్నది. అయిన నొక్కచిన్న సంఘటన జరిగినది. ఎచ్చటనుండియో ఒక తెల్లనిత్రాచు నేను తమ దర్శనార్థము వచ్చుచుండ నెదుటబడి, ఆడి, మరుక్షణమున మాయమైనది” అని శ్రీకృష్ణుడు జనకునకు విన్నవించెను.

ఇంతలో మాంత్రికుడగు నొకభిక్షుకు డచ్చటికివచ్చి “మహాప్రభూ! మహారాణీగారు యువరాజులుంవారికి పాము కనబడినదనియు, తత్సంబంధ మంత్రోచ్ఛాటనాదులచే యువరాజులకు ఆపద ఘటిల్లకుండ చూడవలె ననియు మహాసంఘారామమునకు గురుపాదులకు వార్తనంపిరి. వెంటనేవారు నన్నిక్కడకు పంపిరి” యని విన్నవించెను.

మహారాజు ప్రశ్నార్థకముగ నా బిక్షుకునివంక చూచుచు “దయచేయు” డని యొకపీఠము చూపించెను. ఆతడు పీఠ మథివసించుటయు,

“అది పాలవలె, వెన్నెలవలె తెల్లటిపాము” అని యువరాజనియెను.

“మహాప్రభూ! శ్వేతపన్నగములు మనుష్యుల కండ్లపడవు. పడినచో నా పురుషునకు గాని, వనితకుగానీ ఏదియో ఉత్తమశుభము చేకూరగలదని సర్పశాస్త్రము శకునశాస్త్రము చెప్పుచున్నవి. శ్వేతపన్నగ సందర్శనమునకు మంత్రతంత్రములేమియు నవసరములేదు. యువరాజులకు త్వరలో శుభము కల్యాణమగునని మా శాస్త్రము చెప్పుచున్నది” అని యా భిక్షుకుడు తేల్పినాడు.

“స్వామీ! మీ మాటలు మాకు ధైర్యమొసగుచున్నవి. యువరాజుల వారును, మేమును మహారాణియు గురుపాదులకు, తమకు ఎంతేని కృతజ్ఞులము” అని సార్వభౌముడు పలికెను. ఆ భిక్షుకుడు “బుద్ధదేవుడు మిమ్మురక్షించుగాక, ధర్మము మిమ్మురక్షించుగాక, సంఘము మిమ్మురక్షించు గాక” యని ఆశీర్వదించుచు అటనుండి మహారాణి కడకు జనియెను.

భర్తయు, జ్యేష్టపుత్రుడును తనకన్నతండ్రి దొరికితీరునని ధైర్యము చెప్పుచున్నారు. అబ్బా! ఎంతటి చిన్నబాలకుని ఆ కఠినాత్ములు కొనిపోయినారు! ధనమునకై యాశించికాదు. రాజ్యసంక్షోభము కల్పించుటకుగాదు. అందాలబిడ్డను కన్నతల్లి చేతులనుండి ఊడబెరికి, ఆ తల్లిని దుఃఖ పెట్టుటకు మాత్రము ఆ కరుణహీనులు అట్లు చేసినారు.

ఆ అయిదేడుల బాలుడు ఎన్ని కడగండ్లు పడుచుండెనో. అతని బంగారు పనసతొనలు ఎండిపోయెనో? తల్లియైన ఆ మహారాణికి కన్నుల నీరు తిరిగినది.

ఇంతలో ఒయ్యారముగ నడచుచు మహారాజు కొమరికలగు మాయాదేవియు, శాంత శ్రీదేవియు, పరిచారికలు కొలువ తల్లికడకు విచ్చేసి తల్లిపాదములకడ మోకరించిరి. ఇరువురిని చెరియొక చేతితో లేవనెత్తి, మహారాణి తన హృదయమున కత్తుకొన్నది.

“మాయాకుమారీ! రేపుమీరు సలుపు నాట్యమేమి?” అని మహారాణి అడిగినది. వర్షమువెలిసి, మబ్బులు మాయమైనవెనుక వెన్నెలవలె, ఆమెమోమున చిరునవ్వులు ప్రసరించినవి.

“మాయాదేవి జనకుని పోలిక, శాంతశ్రీదేవి అచ్చముగ తల్లిపోలిక, వారిరువురు చక్కనిచుక్కలు. రాజశ్రీవారి కన్నులలో, చంపకపుష్పనాసికలలో మందారకుట్మ లార్ధ్రములుగు పెదవులలో వెలిగిపోవుచుండెను.

వారిరువురు తల్లికి చెరియొక ప్రక్క నధివసించిరి.

మాయాదేవి: అమ్మగారూ! అన్నయ్యగారు తమ అంతఃపురములోనికి వచ్చినారటకదూ!

శాంతశ్రీదేవి: అన్నయ్యగారు మా మందిరానికి ఎందుకు వచ్చినారు కారండీ?

మహారాజ్ఞి: అరుగో ఈ దారినే యువరాజు వచ్చుచున్నారు.

అప్పచెల్లెళ్ళిద్దరు లేచి ముందుకు త్వరితముగ బోయి అన్నగారి పాదములకు నమస్కరించిరి. శ్రీకృష్ణుడు వారిరువురకు మాయామాత రక్షచెప్పి, లేవదీసి, ఇద్దరినీ చెరియొక చేతితో నడుములుచుట్టి తనకదుముకొని, వారి తలలను తన చెంపలకాన్చి, వారి ఫాలములు ముద్దుకొని, మరియు వదలెను. ఆనందదేవియు లేచి వీరి మువ్వురికడకు వచ్చెను.

“మా అన్నయ్యగారు ఈదినము మా ఇంట నాతిథ్యముపొందరా?” అని మాయ అన్నది.

“రండి అన్నగారూ, నేను వీణమీద ఇరువదియైదు మూర్ఛనలు నేర్చుకొంటిని. అవి అన్నియు పాడి వినిపింతును” అని శాంతశ్రీ యన్నది.

“నాయనా! మీరు ఈ పూట వీరి మందిరానికే భోజనమునకు పొండు. ఈ రాత్రియు, రేపుదయమునను మహారాజు మందిరమున మీకు ఆతిథ్యము” అన్నది ఆనందదేవి.

6. నాగబంధునిక

ధాన్యకటకనగరము కృష్ణానదీతీరమున నాలుగు గోరుతముల పొడవున నున్నది. నదీతీరమునుండి నగరగర్భమున ఒక గోరుతమున్నర యున్నది.

ఈ మహానగరము చుట్టును అనేక గ్రామములు వనములు, ఫలపుష్పోద్యాన వాటికలు, ధనికుల ఉత్తమ అధికారుల సామంత ప్రభువుల ఉత్తుంగకుడ్య రక్షిత భవనములు, హర్మ్యములు, మందిరములు, మహాగృహములు, సౌధములు కలవు. ఈ నగరమునకు తూర్పున కృష్ణానదీతీరమున ద్విశతనివర్తన ప్రదేశమునందు మహా సంఘారామమున్నది.

మహాసంఘారామ మధ్యమున మహాచైత్యమును, ఆ చైత్యముచుట్టు చైత్య మందిరములున్నవి. మహాసంఘారామమునకు, కులపతియగు అమృతపాదార్హ చేతుల విహారము ఇరువది ధనువుల దూరమున నున్నది. ఆ విహారమును చేరి కుడ్యరక్షిత వనాంతరమున బాలికా విద్యాలయ విహారమున్నది. ఉత్తమ విద్యాదీక్షితలగు నగర బాలికలందరునందు సర్వ విద్యాగ్రహణోన్ముఖులై, ప్రజ్ఞాపరిమితాదేవీసదృశలై, శుక్లపక్ష సప్తమీచంద్రికలవలె, వసంత నవోదయ హరివల్లభాపుష్పములవలె, రాగరంజిత పరీమళ హృదయలై, విద్యామృతాఫ్లావితచిత్తలై ఆంధ్రనగరమునకే యశము సముపార్జించు చుందురు.

ఆ బాలిక లందరిలో ఉత్తములు హిమబిందు, నాగబంధునికయును. నాగబంధునిక శిల్పాచార్యులగు ధర్మనంది కొమరిత పదునేడేండ్ల యెలప్రాయపు జవ్వని. పొడుగరి పదహారువన్నెల బంగారుఛాయగలది. వీర్యయుత దేహపుష్టికలది. పరుగులో, ధనుర్విద్యలో, కత్తిసాములో ప్రసిద్ధాంధ్ర యువకవీరుల కేమాత్రము నామె తీసిపోదు.

ఈ బాలికకు కాటుకకండ్లు. మోము ఫాలముకడ విశాలమై, చుబుకముకడ సన్నమై పవిత్ర బోధిపత్రమును తలపింపజేయును.

నాగబంధునిక కడ హోయలు గురిపించు శృంగారలక్షణములకన్న నిశితకృపాణ సదృశమగు వీరవనితాలక్షణములు పెక్కులున్నవి. ఆమె తోడి బాలికలు ప్రాచీన శృంగార గాథాపరిస్ఫురణానంద హృదయలై, అర్ధనిమీలిత నేత్రలై, నిట్టూర్చుచు, అజ్ఞాతనాయకుల కలలగాంచుచు నుప్పొంగుచుండ, నాగబంధునిక ఆంధ్రవీరగాథలు, రామాయణ భారతాది గాథలు, భూర్జపత్ర గ్రంథసంపుటముల తీక్షణదృష్టితో సర్వకాలా పోశనము చేయుచుండును. నాగబంధునికకు శిల్పము, చిత్రలేఖనము ఉగ్గుపాల విద్యయాయెను. చిన్ననాటనుండియు జనకహస్తగతశిల్ప జ్యోత్స్నాపరిపోషిత యగు నా బాలిక చిత్రకారిణి యగుటలో నాశ్చర్యమేమున్నది.

నాగబంధునిక అల్లరిపిల్ల, అన్నగారగు సువర్ణశ్రీకుమారునితో కలసి అశ్వారూఢయై నగరబాహ్య ప్రదేశాలకు విహారార్థము పోయి అన్నగారితో పందెము వేయుచుండును. ఇంటికడ వారితోటలో అన్నగారితో కత్తిసాము చేయును. చెల్లెలగు సిద్ధార్థినిక నవలీలగనెత్తి, బంతివలె నెగుర వైచి పట్టుకొనుచుండును. సిద్ధార్థినిక కేకలు వేయుచు, “అమ్మా చూడవే! అక్కనన్ను బంతివలె చుక్కలవరకు నెగురవేయుచున్నది” అని అల్లరి చేయును. వారి యన్నయగు సువర్ణశ్రీ పరుగిడివచ్చి, నాగబంధునికను భుజముపట్టి యూపి, నవ్వుచు, చిన్న చెల్లెలి నెత్తుకొని, ముద్దులు పెట్టుకొని, బుజ్జగించి, నాగబంధునిక కందకుండ వారి తోటయంతయు పరుగిడును.

ఆ రోజున నాగబంధునిక చిన్నచెల్లెలు చేయిపట్టుకొని, వయసు రాబోవు ఆడుపులివలె అన్నగారి శిల్పమందిరములోని పోయెను.

ధర్మనంది హర్మ్యము, భవనము, శిల్పమందిరము ఒక విశాల వనవాటికయందు మహాసంఘారామమునంటి, ఆ సంఘారామమున కాగ్నేయమున కృష్ణానదీతీరమున నున్నవి. కృష్ణానది పొంగి, పరపళ్ళు తొక్కుచు ప్రవహించునప్పుడు, ధర్మనంది శిల్పమందిర సోపానముల నెక్కి మందిరోత్తరకవాట ప్రాంతమునకు వచ్చి, యా యుత్తమశిల్ప విన్యాసముల నవలోకింప తొంగిచూచు చుండును.

జనకుని శిల్పమందిరమునకు ముప్పదిరెండు ధనువుల దూరమున కుమారుని శిల్పమందిరమున్నది. సంపూర్ణ విన్యస్తశిల్పమైన వజ్రభూగర్భస్థ చంద్రశిలాఫలకము పదుగురు సేవకులచే నెత్తించుచుండిన అన్నగారి కడకు నాగబంధునిక పరుగునవచ్చి “అన్నా! నీవు ఎద్దులబండి పందెమున గెలిచితీరెదవు. అట్లు జయమందినప్పుడు నాకేమిబహుమతి నొసంగెదవు?” అని ప్రశ్నవేసినది.

సువర్ణశ్రీ నవ్వుచు, తనకన్న గుప్పెడుమాత్రము తక్కువ పొడుగున్న చెల్లెలి భుజముచుట్టు చేయిడి, దగ్గిరకుతీసికొని, యామె మూర్ధముపైచేయుంచి, కేశభారము సవరించుచు “చెల్లీ! గిరిపురమునం దుత్తమలోహ కారుడు నిర్మించిన వనితాకృపాణమొకటి, అగ్ని శిఖవంటి దానిని శుక్లపక్ష విదియనాటి నెలవంకవంటిదానిని, కాన్కనీయగలను సుమా! నీకు నగలయం దభిరుచి లేదాయెను. మొన్ననే ప్రసిద్ధ వ్రాయసకాడగు గోపాలకుల వారు తాళపత్రముల లిఖించిన దివ్యగుణాఢ్య పండిత విరచితమగు బృహత్కథను కాన్కతెచ్చితినాయెను! నీవు వలదంటివి. వ్యాసభగవద్విరచిత భారతమును, వాల్మీకి విరచిత రామాయణము నెన్నిమార్లు చదువు చుందువో. ఒక్కసారియైన త్రిపీటకమును చదువవు. నీవు నాకు తమ్ముడవై ఏల జన్మింపలేదో!” అని యనుచు పకపక నవ్వినాడు.

నాగబంధునిక: అన్నా! బుద్ధభగవానుని బోధ నాకు విసుగుజనింపచేయును. అహింసయట, అష్టమార్గములట, కాలము చెల్లిన వృద్ధుల కీశ్రమణకుని బోధ నచ్చునేమో. నాకుమాత్రమూ స్థాలతిష్యమహర్షి బోధనలు ఆనందోత్సాహములు కలుగజేయును. వృషభేశ్వరుడైన కాలకంఠుడు చండ విక్రముడు, ఆయన అర్ధాంగి దుర్గ వీరధర్మస్వరూపమైన దివ్యమూర్తి. కాదుఅన్నా?

సువర్ణశ్రీ: వెర్రితల్లీ! నీ యభిప్రాయములు నాన్నగారికి తెలియవు. ఆయన అవి విన్నచో భయకంపితహృదయులు కారా?

నాగబంధునిక: నాన్నగారికి భయమా? అమ్మ కేభయములేదే!

సువర్ణశ్రీ: అవును. నీవువట్టి మాటలప్రోవువని అమ్మకు తెలియదా?

నాగ: నేను మాటలప్రోగునా? నీవు పనులప్రోగువా? నీపనులన్నియు నీ ఎదుటనే ఉన్నవి. పలుచనివి, గంభీరరాగములు లేనివి, రుచులు లేనివి, చప్పిడిభావాలు తెలియజేయు నీ బొమ్మలన్నియు నీ పనులేకావూ?

నాగబంధునిక చప్పట్లు కొట్టుచు పక పక నవ్వెను. సిద్ధార్థినిక అక్కమాటలకు వెరగుపడుచు - “అక్కా! ఇప్పటికిని నీ వాడదానివను నమ్మకము నాకులేదే” అన్నది. సిద్ధార్థినిక మితభాషిణి. తొమ్మిదియేండ్ల యీడుగల యా చిన్నబాలిక ఎప్పుడు నేదో యాలోచనముననే యుండును. ఇతర బాలికలతో కలసి యాడుకొనదు.

తల్లితండ్రులు బుద్ధపూజవేళ పాడుకొను ప్రాకృతగీతముల నాబాల యెప్పుడును తనలో తాను పాడుకొనుచుండును. ఆమెకంఠ మతి మధురమైనది. ఆమె యాటగది యందున్న బొమ్మలన్నియు బుద్ధారాధన సంబంధములైనవే. బుద్ధపాదములు, ఛత్రములు, ధర్మచక్రములు చిన్న చిన్నవి పాలరాతితో, వెండితో, దంతముతో గంధపుతరువుతో విన్యాసము చేసి ధర్మనంది తనయకు బహుమానము లిచ్చెను. ఆ గదినంతయు నవి యలంకరించుకొని యామె పుష్పములు సేకరించి, ఫలములు ప్రోగుచేసికొని, మహాలి నడిగి, ధూపవత్తియలు, సువాసనాద్రవ్యములు తెచ్చుకొని పూజలు సల్పుచుండును. అన్నగారి శిల్ప మాబాలికకు ప్రాణము. నాగబంధునిక కన్నగారి వీరవిద్య హృదయా నందకరము. అన్నగా రేనాడు కవులు రచించు కావ్యానికములు మనోహర గాంధర్వ యుతముగ పాడుకొనునో అప్పు డన్నగారికడ చేరి, యాతని యొడిలో తలనుంచుకొని పెద్దవియైన లేడికళ్ళరమూతలుగా నన్నగారి ముఖమును, ఆకాశము నవలోకించుచు సిద్ధార్థినిక వినుచుండును. అన్నగారు పాటలు పాడుకొనునప్పుడు నాగబంధునిక ఆ చుట్టుప్రక్కలకు రాదు.

అన్నగారు శృంగారరసభావపూర్ణములగు పాటలు పాడినప్పుడు నాగబంధునిక “ఛస్ ఈ శర్కరకేళిపండ్లు నాకిష్టముండవు” అని నవ్వుచు వెడలిపోవును. సిద్ధార్థినిక కప్పు డక్కపై అమితముగ కోపమువచ్చును. అన్న పాడు పాట అర్థమై కాదామె ఆనందించుట. అన్న పాటలలో దూరదూరమున యశోధరాదేవి యున్నదని యామె చిరుహృదయము, చిట్టి భావముల చిన్న ఆలోచనలతో ఉప్పొంగిపోవును.

ఈరోజున నాగబంధునిక సువర్ణశ్రీ వీపుపై ఒక గ్రుద్దు గ్రుద్ది “అన్నా! పదిక్షణము లీశిలము సంగతి మరచిపోకూడదా? రా; వృపభశాలకుపోవుదము. శైబ్య సుగ్రీవకము లేమిచేయుచున్నవో కనుగొందము. చెల్లి గిత్తలకడకు రానేరాదు. చిన్నదూడలు, ఆవులు, ఆబెయ్య లీ వెర్రితల్లికి ప్రాణము చెల్లీ! ఓ వెన్నమ్మగారూ! ఓ మామిడిపండురసంగారూ! ఓ చెరకు పానకంగారూ! ఈ వేళనైన కొన్ని మిరియములు తినవే! కొంచెము నల్లజీలకర్ర రుచిచూడవే. అల్లము లవణముతో కలిపి తినవే. రా; అన్నను పందెము నెగ్గించే కైలా సశిఖరములను చూచెదము రా; జజ్జమ్మతనము వదలు” అని నవ్వింది.

“ఓ మగక్కా! నీవు గడనెక్కి యాటలాడుము. భీమునివలె నేనుగులతో బంతులాడుము. తాటకివలె చంటిపిల్లలను మూటగట్టుకొనిపో. నిన్ను చూచిన నాకు భయము వేయుచున్నది. అన్నచాటున దాగు కొనవలెను” అని సిద్ధార్థినిక కోపము నటించుచు నవ్వసాగెను. 

7. సార్వభౌముని జన్మదినోత్సవములు

ధాన్యకటకమునకు అయిదుగోరుతముల దూరమున కృష్ణానదీ కూలమున పురబాహ్యోద్యానమునకు సమీపముననే మహాఖేలనా ప్రదేశమున్నది. అది సుమారు నూరు నివర్తము లున్నది. (నివర్తము సుమారు మూడు ఎకరములు) ఆ విశాలస్థలమున సర్వకాలములయందు మల్ల యుద్ధములు, పందెములు, ఆటలు మొదలగునవి

జరుగుచుండును. ఒకచో మల్లయుద్ధ మొనర్చుచుందురు. ఒకచో రథములు పందెముల కొరకై పరుగెత్తించెదరు. ఒకచో ధనుర్విద్య నేర్చుకొనుచుందురు. వేరొకచో గుఱ్ఱపు స్వారియుందు నిమగ్నులయియుందురు. పలువురు మల్ల ముష్టి యుద్ధాల నలవరచుకొను చుందురు. మహావీరులకు ఉనికిపట్టయిన ఆ ప్రదేశమునకు చిక్కిపోయిన బక్కవారిని రానీయరు. అచటికి వెళ్ళలేనందుకు పలువురు ఆంధ్రబాలురు ప్రాణ త్యాగమునకైన ఆయత్తులగుదురట.

మహోత్సవములప్పు డచ్చట ప్రదర్శనములు, పందెములు జరుగుచుండును. ఆంధ్ర సార్వభౌముడు శ్రీముఖుని పుట్టినదినమున ప్రతిసంవత్సరమును మహోత్సవాల నేకము లందు జరుగును.

నగరమధ్యము, సార్వభౌముని కోటకు సుమారు రెండు నూర్లధనువుల దూరమున, నగర క్రీడామందిర మున్నది. క్రీడామందిరమును చుట్టి నగర వసంతోద్యానమున్నది. వసంతోద్యానకుడ్యములనాని చిన్నక్రీడా పర్వతమున్నది.

నగరనర్తశాల యా క్రీడా పర్వత శిఖరముపై నున్నది. పర్వత పాదము నుండి ఆ చిన్ననగరము అరువది అడుగుల ఎత్తు మాత్రము. నర్తనశాలలో సార్వభౌమ జన్మదినోత్సవ సంగీత సభలు, నాట్యప్రదర్శనములు జరుగును. కోటలో నున్న రాజనర్తనశాలకు, ఆనందమందిరమని పేరు. అచ్చట ముఖ్య నాట్యప్రదర్శనములు జరుగును.

ఉత్తమగాయకులకు, నటకులకు, కవులకు, శిల్పులకు, చిత్రకారులకు భూరి పారితోషకముల సార్వభౌము డర్పించును. దేశమంతయు సంతోషమున నోలలాడును. గ్రామములు, ఘంటా పథములు, పట్టణములు, నగరములు అలంకరింప బడును. కారాగృహముల బంధితుల విడుదల చేతురు. పల్లెల, పురముల నృత్య గానకావ్యాది వినోదములు ఎడతెగక జరుగును.

విస్తారాంధ్రమహారాజ్యమందెచ్చటను, ఏవిధమగు పన్నులను నెలరోజులవరకు వసూలు చేయరు. దేశమంతయు నానందడోలికల తేలియాడి పోవుచుండును.

ఖేలనాస్థలములలో ముష్టియుద్ధ, మల్లయుద్ధ, ఖడ్గయుద్ధాది ప్రదర్శనములు, గుఱ్ఱపు పందెములు, రథముల పందెములు, ఏనుగు పందెములు జరుగును. వీధినాటకములు, తోలుబొమ్మల నాటకములు, దొమ్మరవిద్దెలు, సాముగరిడీలు, గాథాకాలక్షేపములు ఎన్నియేని జరుగును. జనులు ఆనంద పరవశులై, శుభ్ర వస్త్రములు ధరించి, భూషణాలంకృతులై, మద్యాదికములు త్రాగువారును, జూదముల పాల్గొనువారును, ఆఖేటనోత్సాహులు నగదురు. ఆంధ్రసుందరీమణులు అప్సరసలే యై నృత్యగీతాదుల వినోదించుచు, ప్రదర్శనముల పాల్గొనుచు, సర్వభూషణాలంకృతులై ఒయారపు నడకల ఏ గంధర్వ నగరమునో తలంపునకు దెత్తురు.

ఆంధ్రులకు ఎడ్లబండి పందెములు (ఈవలావల ఎడ్లు, మధ్య గుఱమును కట్టిన బండ్లపందెములు), రథ పరీక్షలు అత్యంత ప్రీతికరములు. ఈ పందెముల పాల్గొనని ఉత్తమాంధ్రు డాయుగమున ఆంధ్ర మహాసామ్రాజ్యమునం దెచ్చటను గానరాడు.

ఈ వివిధోత్సవములలో నానందించుటకు, వివిధపరీక్షల పాల్గొని బహుమతు లందుటకు ఆసేతుహిమాచలముననున్న దేశములందలి మహారాజుల, మండలాధిపతుల, సామంతుల, చక్రవర్తుల, అర్హతుల, కులపతుల, మహాభిక్షుకుల, ఋషుల, పండితుల, కవుల, గాయకుల, నటుల, వీరుల, పోటుమగల నాహ్వానింతురు. కురు, పాంచాల, సాల్వ, మద్ర, శూరసేన, మగథ, మాళవ, కుంతల, పాండ్య, చోళ, కాంభోజ, గాంధార, కామరూప, ఘూర్జర, త్రికళింగ, వంగ, లిచ్ఛవాది దేశముల కన్నింటికిని; సువర్ణ, యవ, బలి, పూర్వకాంభోజ, సింహళాది ద్వీపములకును, యవన, బాహ్లిక, తురుష్క పారశీక, రోమక, నీలకా, త్రివిష్టప, చీనాది లాతివిలాతులకును సందేశ గ్రాహకులు ఆహ్వానముల గొనిపోదురు.

ఆ యా దేశములనుండి వీరులు, పండితులు, రసజ్ఞులు, రసస్రష్టలు, ప్రభువులు ఈ యుత్సవముల పాల్గొని యానందతరంగడోలికల నూగిపోవుటకు యాత్రలుసాగి యరుదెంతురు.

వృషభశకట పరీక్షకు ఘనదారువినిర్మితరథములకు పూన్చిన కైలాసశిఖర సదృశములగు గిత్తలపూన్చి జయాభిలాషులై దేశదేశముల నుండి వీరు లరుదెంతురు.

మగథనుండి సుశర్మకాణ్వాయన చక్రవర్తి కాత్యాయనుని పంపినాడు. ఉజ్జయిని నుండి మహారధియగు పహ్లవుడు వచ్చినాడు. సౌరాష్ట్రమునుండి పొట్టివియు, బలము కలవియు, లేళ్ళవలె చురుకు గలిగిన పసరముల వివిధ వర్ణాలంకృతమగు రథమునకు పూన్చి జీవనప్రభువీరుడు వచ్చినాడు. నిడుపాటి కొమ్ములు కలిగి వాలుకన్నుల బెదరుచూపు చూచుచు, శ్రమయనునది యెరుగని నల్లగిత్తల గట్టుకొని దక్షిణమునుండి వీరత్తుణి వచ్చినాడు. ఆ రోజున నలుబదిమూడు దేశములు పందెమునకు తమతమ రధికులను పంపినవి.

తెలుగురౌతులు పదునేనుగురు పందెమునకువచ్చిరి. సమవర్తి మేనమామ బండినడుపుటకు నిశ్చయింపబడినది. శిల్పికుమారుడగు సువర్ణశ్రీ కూడ పరీక్షకై పేరిచ్చెను. పట్టణమంతయు కోలాహలముగా నున్నది.

సమవర్తి జయముగాంచునని అందరికీ దెలియును. పట్టణ ప్రజా సమూహమునకు సమవర్తియనిన ప్రేముడి యెక్కువ. లాతిదేశములకు బోయి యచ్చట జరిగిన ప్రదర్శనముల విజయమొంది ఆంధ్రగౌరవము నిలిపినది సమవర్తియేగదా! ఆతడు నడపజాలని రథములేదు, ఎక్కడ్రాలని గుఱ్ఱమునులేదు. ఆతడు చెప్పిన వినని బలీవర్ద మున్నదా?

మహాభేలనాస్థలమంతయు నలంకరించినారు. ఆంధ్రవైభవమంతయు నచట చిత్రితమయ్యెను. చిత్రవర్ణవస్త్రాలంకృతమై, వివిధాకృతమగు ప్రజ భూమి పై వాలిన మహేంద్రచాపముల తలపించెను. ఉత్తరాంధ్రదేశపు సన్నని దుకూలములు చిరుమబ్బుల వలె గాలికి తేలిపోవుచున్నవి. ఆంధ్రదేశమునకు వజ్రభూమి యని పేరు. ఆంధ్రులు రత్నాలరాజులు. స్త్రీలును, పురుషులును ఇప్పుడు మన మగవారివలె ఒక్క అందమగు వస్త్రమును పాదములవరకు రాకటి వస్త్రములు గట్టుకొందురు. ఒక వస్త్రము పైన గప్పుకొందురు. వలిపెముల కొందరు తలచీరలుగా ధరించి యుండిరి. కాళ్ళకు బంగారు కడియములు చేతులకు కంకణములు, మెడలో వివిధములగు హారములుండును. మొలనూళ్ళు ధరించిన యువతులచే నా ప్రదేశము మెరుగు లీనుచున్నది. అనేకులు రాజవంశమువారు తలపై వివిధరూపముల రత్నములు, ముత్యాలహారములు పొదిగిన కిరీటములు ధరించియుండిరి.

ప్రేక్షకస్థలమధ్యమున రాజమందిరమున్నది, అనేక దంత హేమగంథాసనములు అందమర్చిరి. మధ్యమున సార్వభౌముని సింహాసనమును, దానిం జేరియే రాణుల పీఠములును గలవు. ఆ మందిరమున కీవలావల మంత్రుల, దండనాయకుల, సేనాధిపతుల మందిరములు వారి వారి గౌరవముల ననుసరించి వెలుగుచున్నవి. సార్వభౌముని మందిరమునకు కుడిప్రక్కగా, అన్ని మందిరముల తుద సామాన్యజనము చూచుటకు తగిన పెద్ద పందిరియొక్కటి తగు అలంకారములతో నిర్మాణమొనర్చిరి.

రాజమందిరము ఎడమప్రక్కగా మూడు మందిరములావల చారుగుప్తుని మందిరము సూర్యకాంతమణివలె నా ప్రదేశమును వెలిగించుచు ఆ వచ్చిన లక్షలకొలది ప్రజల చూపుల నాకర్షించుచుండెను. మూడేండ్లనుండి వెలవెల పోవుచున్న ఆ మందిరము నేడు పూర్ణాలంకార మనోహరమై సుధర్మను పరిహరించుచున్నది. “రాజమందిరమునకు జోడగునది, ఆ మందిర మొక్కటియే” యని ప్రజ లొకరి నొకరు చూచి చెప్పుకొనిరి.

“పదునొకండవ ముహూర్తము మ్రోగించినారు. సార్వభౌముడు వచ్చువేళ అయినది” అని మహశ్రీచండకేతునితో ననియెను. వారిరువురు గుఱ్ఱముల పై నధివసించి రంగస్థలమున నిటు నటు తిరుగుచుండిరి. అంత చండకేతుడు పురమార్గమువంక చేయి నడ్డమునుండి చూచుచు “అదిగో సార్వభౌములు వచ్చుచున్నారు” అని అరచెను.

8. శకటచోదక పరీక్ష

మహాశ్రీ: ఆ వచ్చునది సార్వభౌములుకారు. ఎవరు చెప్పుమా అంతవైభవమున వచ్చుచున్నది?

చండకేతుడు: ఆర్యా! తెలిసినది, తెలిసినది! రత్నకలశధ్వజము! ఆర్యచారు గుప్తులవారు, కోటీశ్వరుల వైభవము ఒక్కొక్కప్పుడు భూమీశుల సంపదను మించిపోవును కదా!

మహాశ్రీ: అవునయ్యా! చారుగుప్తుడు సకల భారతవణిక్సార్వ భౌముడు. ఆయన ఎన్నికోట్లకు నాగదేవుల కాపుంచినాడో! ఎన్నిమందసముల రత్నరాసులున్నవో! వివిధదేశ సువర్ణము లెన్ని మందిరముల లెక్కకురాక, ప్రోవులుపడియున్నవో!

చండకేతుడు: మూడేండ్లనుండి చెన్నుదరగియున్న ఆ వర్తక చక్రవర్తి మండపము ఎంత పరమాద్భుతముగ నలంకరించినారు! ఏమి విశేషము స్వామీ?

మహాశ్రీ: విచార మెంతకాలము మానవునకు! ఆతని భార్య చనిపోయి మూడేండ్లయినది. ఇప్పుడు కొమరిత పదునారేండ్ల వయసునందినది. ఆంధ్రయోషా రత్నములలో ఆ బాలిక కౌస్తుభమే.

చండకేతుడు: ఆమె యందము తనివితీరని వేడుకతో చెప్పుకొందురు. అంత అందగత్తయా ఆర్యా?

మహాశ్రీ: ఓయి అజ్ఞానీ, అందగత్తె అనుమాటను కృష్ణానదీ గర్భమున పడద్రోయుము. ఆమె అపరాజితాదేవి. ఆమె ప్రజ్ఞాపరిమిత. ఆమె శ్వేతతార! ఆమె అనంత సౌందర్యభావోజ్వలమూర్తి!

చండకేతు: ఆర్యులు కవులగుచున్నారు.

మహాశ్రీ: దివ్యసౌందర్యాభిముఖుడగువాడు మొరకుడైనను మహాకవికాడా చండకేతూ?

చండకేతు: మీ వర్ణన విను నాకే కవిత్వము గంగోత్తరస్వరూప మందాకినీ ప్రస్రవణమై వచ్చుచున్నది, శకటాధ్యక్షులవారూ!

ఇంతలో చారుగుప్తుని రథము పరివారపరివేష్టితమై, ఆశ్విక గజవీర సంరక్షితమై, భేరీ మృదంగ శంఖ కాహళ వాద్యములు చెలగ మహాఖేలనాస్థలము దరిసినది. చండకేతుడు ముఖపతులతో, గణపతులతో, పదాతివీరులతో చారుగుప్తునకు ఎదురేగి, సార్వభౌమవాద్యమేళములు వణిక్సార్వభౌముని మేళములతో మేళకముగా సగౌరవముగ తోడితెచ్చి, చారుగుప్తుని మందిరముకడ విడియించుటయు, వారందరు రథావతరణ మొనర్చిరి. చారుగుప్తుడు ఇంద్రగోపుని చేయి నూతగొని రథము దిగెను. వేరొక రథమునుండి హిమబిందుకుమారియు, ముక్తావళీదేవియు, అమృతలతాదేవియు, చెలియగు బాలనాగియు, అలంకారికయగు తారాదత్తయు దిగిరి, వేరువేరు శకటముల నుండి హిమబిందు సేవకురాండ్రు పెక్కండ్రు దిగినారు. అశ్వికులు మండపమువెనుక కావలి కాయుచుండిరి. చారుగుప్తాదులు వివిధాసనముల నాసీనులైరి.

రథమునుండి అవరోహించుచు హిమబిందుకుమారి మేలిముసుగు తీసి, వివిధాలంకారులు, వివిధవర్ణ వస్త్రశోభితులు, కోలాహలపూర్ణులైన యా మహాప్రజలను కౌతుకముగ పర్యాలోకించినది.

ఆమె అందాలప్రోవు, విలాసములమూట. ఒయారములకుప్ప. ఆమె పరమాద్భుత సౌందర్యమునకు ముగ్ధులై, ప్రజలును దళ ముఖ గణచమూపతులు, రాజోద్యోగులు, మంత్రులు, దండనాయకులు, ప్రాడ్వివాకులు, ఒకరననేల అందరును ఆమెనే చూచుచుండిరి.

మహాకాండూరనగరపు బంగారు సరిగపూవుల లతల దుకూలము, పనుపుపచ్చ ఎరుపు వెలుగునీడల నేతచీర ధరించి, నీల చీనాంబర స్తన వల్కలము బిగించి, ఆమె పాము కుబుసముబోలు కాశ్మీరసువర్ణమృగీ రాంకవము వల్లెగా ధరించినది.

పదునారేండ్ల ఎలప్రాయమున పాటలవర్ణ జాంబూనదభాసురయగుచు పారిజాత కుసుమమును దలపించిన దా బాల. ఆమె నాలోకించిన యువకులు పురుషులు ఎందరు నిట్టూర్పులు వదలిరో, ఎందరి గుండియలు కొట్టుకొనెనో, ఎంద రెట్టి స్వప్నలోక విహారులైరో, ఎందరు సమ్మోహనాస్త్ర పీడితులైరో? అప్పుడు ప్రజలు సార్వభౌముడు ఇంద్రునివలె, బోధిసత్వునివలె అరుదెంచుటయే గమనింపలేకపోయిరి.

శంఖ వేణు ముఖవీణ కాహళాది సుషిరములు, భేరి ఢంకా మృదంగాది వాద్యములు, తాళములు, తప్పెటలు సముద్రఘోషాగాంధర్వము సర్వదిశల నావరింప యథోచితవేషుడై, సూర్యుని రథాశ్వములవలె కలశాంభోధీ వీచికోపమానములైన ధవళతురంగములు పూన్చిన సువర్ణరథ మారోహించి, అతిరథుడైన శ్రీముఖశాతవాహన మహారాజు మంత్రులు, సామంతులు, దండనాయకులు, కవులు, ఆచార్యశ్రమణకులు, ఉత్తమ గాయకులు, మహాశిల్పి ధర్మనంది, సర్వసేనాధ్యక్షుడు, ఉపసేనాధిపతులు కొలువ ఇంద్రవైభవముగ విచ్చేసి రాజ మందిరము ముందాగి రథావతరణ మొనర్చెను. వందిమాగధులు కైవారములు చేయుచుండిరి.

సార్వభౌముని రథము పరివార సమేతమై వచ్చుచున్నదనగనే మహాఖేలనాప్రదేశస్థులగు ప్రజలెల్లరు జయజయధ్వానములు సలుపుచు, లేచి నిలుచుండిరి.

సార్వభౌముడు సింహాసన మధిరోహించుటతోడనే బ్రాహ్మణులు, శ్రమణకులు సామ్రాట్టుకు ఆశీర్వాదము లొసంగిరి.

ఇంతలో శకటాధ్యక్షులు, మహశ్రీ సార్వభౌమునికడకు వచ్చి మోకరించి, నమస్కరించి, లేచి, ఉక్షశకటపరీక్షకు వచ్చినవారి నందరిని సార్వభౌముననుజ్ఞకై మందిర ప్రాంగణమునకు తీసికొనివచ్చెను. వారందరు సార్వభౌమునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి తమతమ నామధేయములు తెలిసికొని, చక్రవర్తి యనుజ్ఞనొంద, తమతమ శకటములకడకుబోయి, వాని నారోహించి ప్రారంభస్థానమున, ముందు కురకబోవు వృషభముల నయభయముల నిలువ వారింపుచుండిరి.

రథపరీక్షామార్గము విశాల సమతలము. దారి పొడుగునను దిమ్మెస చేసి, గట్టిచేసిరి. బయలుదేరిన స్థలమునుండి శకటములు ఒక గోరుతము దూరము పోయి యచ్చట నర్ధచంద్రాకృతిని కుడివైపునకు మళ్ళి, వేరొక విశాలమార్గమునవచ్చి, ప్రారంభ స్థలమునకు పోయి, మరలనట్లే ఇంకొక పర్యాయము తిరిగి గమ్యస్థానమునకు రావలెను.

ఆంధ్రు లందరకును తమవారిలో నొక్కడు నెగ్గితీరునని దృఢనిశ్చయము. శకటములు తేలికగల తరువాతి కాండముల నిర్మించినవి. లాక్షావర్ణాలంకృతములై, భూషణానేకసుందరములై, దేవవిమానముల నవి తలపించుచున్నవి.

ప్రారంభప్రదేశమందవి శ్రేణిగా నిలువబడియున్నవి. కండరములు కట్టి, లేడికాళ్ళవలె పలుచని కాళ్ళు కలిగి, పొట్టివియు, నెత్తయినవియు, శ్వేత, కపిల, శబల, ధూమ్ర, లోహితవర్ణవిగ్రహములై కొమ్ములకు వెండి బంగారు తొడుగులు, కాళ్ళకు వెండి బంగరుగజ్జెలు, నడుములకు పట్టుదట్టీలు, మూపుల వర్ణకంబళములు, కంఠముల బంగారువెండిమువ్వలు, ఘంటికలు, మూర్గముల చర్మపుదట్టీలు, బాసికపుదండలు కలిగిన కోడెలు, గోవృషభములు, ఉక్షములు - భయమున కొన్ని, గర్వమున కొన్ని, నిశ్చలత్వమున కొన్ని, రౌద్రమున కొన్ని, తొందరపాటుతో కొన్ని నిలిచి తోకలు ఇటునటు నాడించు చున్నవి. అంకెలు వేయుచున్నవి. డెక్కలెత్తి నేలను రాయుచు, కొట్టుచున్నవి. మోరలు చూచుచున్నవి. చెవులనాడించుచున్నవి. కన్నుల త్రిప్పుచున్నవి.

ఆ శకటముల నడుమ అద్భుతదారుశిల్ప సుందరమగు రథముపై పగ్గముల సడలించి పట్టి, లీలాభంగశరీరియై, చిరునవ్వున వెల్లకోడెలతో “శైబ్య! సుగ్రీవక! ఏమది? తొందరా మీకు?” అనుచు తీయతీయని మాటలాడు బాలకుని, ఆ ప్రక్కనే శకటచోదకుడై యున్న కరూరవుడు విని, కాళింగునకు కన్నుగీటినాడు.

“తెలుగుదద్దమ్మలకు తొందర ఏల అచ్చటనే యుండవచ్చునులే” అని పాలీభాషను కాళింగుడు కరూరవుని ముఖము చూచి పలికినాడు. సమవర్తి శాతవాహన వీరశ్రేష్ఠుడు సగర్వముగ ఛంగున నురికి తనకంబళివ్యాహకమారోహించి, పగ్గములుపట్టి ఆసీనుడైనాడు. చారుగుప్తుని వదనమున సంతోష హాసరేఖ లుదయించినవి.

హిమబిందు తన మేనబావ సమవర్తిని జూచి, ఆనంద ప్రపుల్ల వదనయై “సెబా” సనుకొన్నది.

9. శకట వేగములు

ప్రేక్షకులందరు తమతమ యాసనముల పై, మొదట నిశ్చల మనస్కులై కూరుచుండిరి. తరువాత వారి హృదయముల విజయలక్ష్మీ ధవుడెవ్వడగునా యను నాలోచనలు పొడసూపినవి. ఆ వెనుక సమవర్తి నెగ్గితీరవలయునని కొందరి హృదయముల, ఆంధ్రులలో నెవ్వరైనను సరియని కొందరి మనఃపథముల, కాంక్షలు మొలకెత్తి పెరిగి మహావృక్షములైనవి. అందువల్ల మాటలు, వాదనలు, కోపములు, హర్షములు, హాస్యములు వికటహాసములు చెలరేగినవి. పందె మింకను ప్రారంభముకాలేదు. ప్రజల హృదయములలో విసుగు, ఆవేగము పరువులెత్తినవి. నిశ్చలాసీనత వికలమై ఆసనములలో ఇటునటు కదలువారు, వంగువారు, వెనుకకు వాలువారు, చక్రవర్తి మందిరమువైపు చూచి, ఆలస్యమునకు కారణమేమి యనుకొనువారునై యుండిరి.

అంతలో సృష్ట్యారంభమం దుద్భూతమగు శబ్దబ్రహ్మముంబోలి, ఒక్కసారి పదునారు శంఖములు “భోం, భోం, భోం, భోం!” అని ధ్వనించినవి.

ఆ ధ్వనికి భీతచిత్తములై మాళవుని ఎద్దులు, పాండ్యుని వృషభములు అడ్డగోలుగా పరుగిడినవి. శకటములు తలక్రిందులై శతశకలములైనవి. తక్కిన బండ్లన్నియు సమవేగంబున పరువిడి వచ్చుచు, పరీక్షా పథమున నడ్డముగ పడియున్న బండ్లను తప్పుకొని, చుట్టి ముందుకు సాగినవి.

భరుకచ్చపువీరుని బండిగిత్తలు పడిపోయిన బండ్లను చూచి, ముందుకు సాగక, వెనుకకుతిరిగి, విశ్రమారామములవైపునకు పరుగిడిపోవ, గొల్లుమని ప్రజలొక్కుమ్మడి లేచిరి. అంత గజదళాధికారియగు ప్రమానందుడు అచ్చటనే యుండుటచే, నేనుగుపైనుండి పాశము విసరి ఒక్కఎద్దును పడగొట్టెను. తోడనే బండి తలక్రిందై పడినది. ఏ ప్రాణికిని అపాయము రాలేదు.

పందెపుబండ్లు. పడిపోయినబండ్లను దాటిపోవగనే పలువురు సేవకులు వైద్యులు అచటకు పరువిడి, శకటశకలములను, దెబ్బలుతిన్న వృషభములను, సారధులను కొనిపోయిరి. ఆ స్థలమును తక్కినబాటతో సమముచేసి వేసిరి.

కాళింగుడగు మల్లినాధునిబండి అన్నింటికి ముందు ఛెంగు ఛెంగున పరువిడి పోవుచున్నది. అతని వెన్నంటీ వీరత్తుణితలైయాళై తనబండిని తోలుకొనుచు అరవమున నేదియేని మాటలాడుకొనుచు పోవుచున్నాడు. వీరత్తుణికి ఎడమప్రక్క కేరళ, ఘూర్జర, వంగవీరులు రథముల పరువెత్తించుచుండిరి. ఆ వెనుక లిచ్ఛవుడు, మువ్వురాంధ్ర వీరులు సమముగ బోవుచుండిరి. వారిని వెన్నంటి సమవర్తి, సువర్ణశ్రీ, మాగథుడును, వారికి కొంచెము ఎడములో పలువురును బోవుచుండిరి.

సువర్ణశ్రీ నిర్మల నీలాకాశచంద్రమూర్తివలె నిర్వికారుడై పోవుచున్నాడు.

ఎద్దులన్నియు మోరలెత్తి ఊర్పులూర్పుచు, కనుకొలుకుల కెంపులు గ్రమ్ము, చిరునురుగులు సెలవుల ప్రసరింప, పాలసముద్రతరంగమువలె, ధవళ కాదంబినీ మాలలవలె, గంగానదీపతనములవలె గంగడోళ్ళాడుచుండ మహా వాయువేగమున పరుగు వారుచుండెను. తేలికయగు శకటము లిటునటు నాడి పోవుచున్నవి. సారథులు వంగి, ఎద్దుల నదలించుచు, పసరముల ప్రార్థించుచు, కోడెలతోటి సరసంభాషణములాడుచు బోవుచుండిరి.

మొదటిసారి సగముదూరము పోవునప్పటికి లిచ్చవుని దూడలు పరుగిడలేక ఆగిపోయినవి. మొదటి చుట్టుకడకు పోవునప్పటికి కేరళ, కామరూప, గాంధారుల శకటములన్నియు వెనుకకుపోయినవి. చుట్టి, తిరిగి సగముదూరము వచ్చునప్పటికి మిగిలినవారు కళింగుడు, మాగథుడగు శివస్వాతి, సమవర్తి, సువర్ణ శ్రీకుమారుడు, ఇంక నిరువు రాంధ్రులు, సుశర్మ కాణ్వాయనుని రథము తోలు కరూరవుడు మాత్రము.

ప్రేక్షకుల ఆలోచనలు బిగుసుకుపోయినవి. ఆ మహారంగస్థల మంతట నిశ్శబ్దత ఆవహించినది. రెండవసారి మిగిలిన శకటములన్నియు తిరిగి ముందుకు పోవుచున్నవి. చెమటలు నిండ, నాల్కలు జాపుచు, నురగలు గ్రక్కుచు, నల్లగ్రుడ్డులు క్రిందికి తిరిగిపోవ, ముట్టెల క్రిందికి దించి ఎద్దులన్నియు పరుగిడిపోవుచున్నవి.

బండ్లన్నియు తిరిగి రెండవమార్గమున నర్ధచక్రాకార ప్రదేశమునకు వచ్చుసరికి, కరూరవుని రెండుగిత్తలు గరుడము, హనుమంతము అనునవి ఫెళ్ళున విరుచుకొని పడిపోయినవి. రథము పడిపోక ఆగిపోయినది. కరూరవునకు కొంచెము గాయములు తగిలినవి.

సుశర్మకాణ్వాయనుని ప్రియసూతుడగు కరూరవుడు విషాదము నొందుట మగథప్రజానీకము ఎన్నుకొని పంపిన కాత్యాయనునకు సంతోషమయ్యెను. ఇరువురును సుశర్మకు ప్రియులే. కాని వారికి అంతఃకలహములున్నవి. కాత్యాయను డిదివరకే సిగ్గునంది వెనుకకు పోవలసివచ్చెను. కరూరవుడు తనతోడివాడగుట కాతడు ప్రార్థించిన క్షుద్ర దేవతలు అతని కోర్కెనెరవేర్చినారు.

వృషభములన్నియు నలసిపోయినవి. అన్నిటికి వెనుకవచ్చుసువర్ణశ్రీగిత్తలు అలయిక లేక సునాయాసముగ తేలివచ్చుచున్నట్లునన్నవి. పావుగోరుతదూరము ఇట్లు పరుగిడి వచ్చిన పిమ్మట సమవర్తి తన చబుకు తీసికొని కామందక కులపాలకుల వీపులపై చురుక్కున నంటించెను. ఆ యుత్తమ బలీవర్దనములు తమ బలమంతయు చూపి కాళింగుని బండి దాటివేసినవి. కాళింగుడంత ధైర్యవిహీనుడై యొక్క పెద్ద నిట్టూర్పుబుచ్చి తన యెద్దులనుగూడ వడివడిగా తోల యత్నించెను. కానీ యవి యంత కన్న, నంతకన్న నీరసించి, వెనుకవచ్చు సువర్ణశ్రీ శకటముతో కలిసికొనెను.

ఆ యువకు డంత చిరునవ్వు నవ్వినాడు. ఆతని బండి వేగము సమవర్తి బండిని వెన్నంటిపోయినది. ప్రజలందరు గొల్లున నొక్కసారిలేచి “సమవర్తీ విజయ! సమవర్తీ విజయ!” అని గొంతులు బొంగురుపోవ నరచుచుండిరి. సమవర్తి వెనుకకు చూడవీలులేదు. ఒక్కసారి వెనుకకు చూచిన, అలసట చెందియు పౌరుషము చూపుచున్న ఆ విఖ్యాత వృషభములు తప్పక కూలిపోవును. కాని పందెకాని సూక్ష్మబుద్ధి, పాముచెవుల వంటిది. తనకు కొంచెమయిన ఎడములేక ఒక డతిసునాయాసముగ దూడల తోలుకొని వచ్చుచున్నాడని సమవర్తి తెలిసికొనెను. పందెము మొదటి నుండియు ఆతడా కొత్తపిల్లవాని గిత్తల చూచినాడు. పసరముల సంగతి బాగుగా తెలిసిన సమవర్తి గుండెలా లేళ్ళవంటి గున్నల చూడగానే నదటునొందినవి. కామందక కులపాలకుల అవయవముల పొంకము వానికి లేదు. కమ్మెచ్చులు కట్టి దిమ్మచెక్కలవలె వట్రువులైయుండి కైలాసగిరి శృంగములకు మూపురములుగల తన బలీవర్దముల ముందు ఆ కొత్తగిత్త లేమి చేయగలవు? కొమ్ములింకను వచ్చీరానట్లున్నవి. తన కోడెలకు, శంకరశూలవామదక్షిణపు మొనలవలె కొమ్ములు మెరయుచున్నవి. తన వృషభరాజములేడ, ఈ చిన్నగిత్తలేడ? అని సమాధానపడెను.

మొదటనుండియు సమవర్తి ఆ వచ్చిన నలుబదిబండ్ల ఎద్దులను చూచి పెదవి విరిచికొనెను. కలకలలాడు కాటుక కన్నులతో, మామిడిపిందెల బోలు నాసికా రంధ్రములతో గంభీరములై, శ్రీవక్షములగు ముట్టెలతో, వెలిపట్టు వస్త్రపు మడతలవలె నున్న గంగడోళ్ళతో, మెరుముల వలె, అస్త్రములవలె, సన్నమై మహావేగవంతములై కన్పట్టు కాళ్ళతో ఆ యువకుని గిత్తలు మాత్రము సమవర్తిని వికలుని చేసినవి. ఇంక విజయలక్ష్మీ ఆసీనయైయున్న తావు అర్ధగోరుతదూరము మాత్రమున్నది. తన్ను వెన్నంటివచ్చు పెనుభూతపు పిన్నవాని పిప్పిచేయవలేనని సమవర్తి తలపోసెను. అతని కన్నులయందు క్రోధము ఫాలాక్షుని మూడవచూపై, ఆ సుందర ముఖమును వికృత మొనర్చినది. అతని ముక్కుపుటములు కామందక కులపాలకుల ముక్కుపుటముల వలె విస్త్రతములైనవి. అతని పసరముల ముక్కులనుండి రక్తపంబొట్టులు తొలకరి సతుంపరులవలే చెదరిపోవుచుండెను.

చారుగుప్తుడు వంగిపోయి తనపీఠము గట్టిగా పట్టుకొని గృధ్రపుదృక్కుల పరుపుచు పందెకాండ్రవైపు చూచుచుండెను. ఆతడి పెదవులు వణకుచుండినవి. అస్పష్టమై ఏవియో మాటలు పైకి వెలువడుచున్నవి. మొదటినుండియు తన వృషభములు తప్పక నెగ్గితీరునని యాత డనుకొన్నాడు. ఆ సందడిలో నా కొత్తబాలుని బండిదూడల కనుగొన్నవారు లేనేలేరు. మొదటిసారి వెళ్ళివచ్చి, మరలివెళ్ళువరకు ఎవ్వరును ఆ యువకునివైపే కనుగొనలేదు. ఇప్పుడాతడు చారుగుప్తునకు ఎక్కడనుండియో అవతరించిన విఘ్నరాక్షసునివలె తోచినాడు. ఆ బాలుడు తనకును, తన కోర్కెలకును ఎడబాటుమంత్రమైనాడని చారుగుప్తుని గుండెయందు గుభిల్లని ఆలోచన కలిగినది. ఒక్కసారి లేచి సునాయాసముగ పరుగిడివచ్చు నా కొత్తబండిగిత్తల కూల్పవలెనని యాతనికి వెర్రియాలోచన పుట్టినది.

ప్రజలందరు చెప్పగారాని ఆలోచనాభావమున తన విజయనాదములు మానివేసినారు. ఒకసారి వాన వెలిసినట్లు, నిమ్మకు నీరువోసినట్లు హృదయభీకరమగు నిశ్శబ్దత నింగి నావరించినది. అందరును చారుగుప్తుని మందిరమువైపు చూచినారు. మరల పరుగిడు పందెకాండ్ల పరికించినారు.

ఇంక పావుగోరుతమున్నది. సమవర్తి “కా-మం-ద-క! కుల-పాలక!న-డు-డు!” అని వగర్చుచుండెను. వజ్రతుల్యమగు నా శూరుని శరీరము వణకినది. కామందక కులపాలకులు ప్రజలోకమునకు విస్మయము కలుగునట్లు ఆతని పలుకుల నాలకించగనే మహాజవమున అరపావుగోరుతము కనుమూతలో గడచిపోయినవి. కాని పాడునీడవలె యా కుర్రవాని బండి ఆతని బండిని వెన్నంటియే వచ్చినది. ప్రథమమున జనులు “కామందక విజయ! కులపాలక విజయ!” అని యరచినారు. ఉత్తరక్షణముననే వెన్నంటివచ్చినయా పిల్లవాని చూచిరి. వారందరి హృదయములు నాతనిపట్ల కోపముచే క్రూరములైనవి.

10. విజయలక్ష్మీధవుడు

ఇంకను కొన్ని ధనువులు గడచినవి. సమవర్తికి తన్ను వెన్నంటు పిశాచరూపుని బండి ఇంకను కూడనున్నదనే తోచినది. ఇంతలో మెరుమువలె ఆతనికి ఒక్కసంగతి గోచరించినది. ఆతని ముఖము ప్రఫుల్లమయినది. ఆతని పెదవులపై మబ్బులు కమ్మినరాత్రి మబ్బులమాటునుండి తొంగిచూచు చంద్రరేఖవలె చిరునవ్వు కలకలలాడినది. గుండెలపైనుండి పెద్దబరువు తీసివేసినట్లయినది. కొన్ని పసరములు మంచి పరుగుగలగిత్త లైనను, తమంతట తాము దారిని పరుగిడలేవు. ఏ బండియైనను ముందుండిన తాము వెనుక నడువగలవు. ఆ ముందుబండి ఎంత వేగవంతమైన అంతవేగమున ఆ విచిత్రజాతి వృషభములు పరుగిడగలవు. అంతియ. ఈ ఆలోచన సమవర్తికి వేయి ఏనుగుల బలము నిచ్చినది. క్రుంగిపోయిన మనుష్యుడు ఒక్కుమ్మడిలేచి కామందక, కులపాలకలను ఎలుగెత్తి పిలుచుచు, “ఇదిగో గమ్యస్థానము ఒక్కఅడుగు, వెనుదీయకండి, పౌరుషము నిలబెట్టుడు!” అని అరచినాడు. ఆ ఉత్తమ బలీవర్దములును తమ శక్తికి మించిన బలమును తెచ్చుకొని పది ధనువులురికినవి.

చారుగుప్తుడు, సమవర్తి మోమును చూచినాడు. ఆతని ఆలోచనా పథము తనకును సువ్యక్తమై తోచుటతోడనే చిరునవ్వున ఆతనిమోము ప్రఫుల్లమైనది.

హిమబిందు తండ్రివదనమును, తమ శకటమును, వెనుకవచ్చు ఆ ఆంధ్ర యువకుని శకటమును, ఆ విచిత్రంపు కోడెలను, ఆ వెనుకబండ్లను ఆలోచనారహితయై, అదటువహించిన హృదయముతో పరిశీలించుచుండెను. వ్యాకుల మేఘాచ్ఛాదితమైన జనకుని వదనము ఇంతలో నిర్మలమై హాసయుక్తమగుట కనుంగొని, యామె ధైర్యమువహించి, యా నూత్నబాలకునివైపు అపహాసము పరపినది.

ఇంక నూటయిరువది ధనువుల దూరమున మాత్రమే గమ్యస్థానమున్నది. అప్పుడే ప్రజలు విజయ మెట్లయినను సమవర్తిదే యని కేకలు వేయుచుండిరి.

ఇంతలో దావానలాంతరాళమునుండి జనించి శిఖల నన్నింటిమీరి గుప్పున దుముకుజ్వాల సామ్రాజ్ఞివలె, అనేక వాయుసమీకరణోద్భవమై మహాపవనము లన్నింటి దాటి విసవిసబోవు సుడిగాలిరీతి, పూర్వాదిసమీపమున సంభవించి చదలుదాక లేచి అమితవేగమున తరలి తరలి సాధారణ కల్లోలములపై దూకివచ్చు ఉత్తుంగకల్లోలము విధాన, సునాయాసముగ వెనుక వచ్చు నా కుమారుని ఎద్దుబండి సమవర్తి శకటమును దాటి ముందునకు గడిచిపోయినది. ఆ సమయమున నా ప్రఖ్యాతవీరుడు రౌద్రమూర్తియై, గాఢక్రోధమున ఎట్లయిన తన విరోధి బండిని నిలుపు దురుద్దేశమున విడిగానున్న యొక పగ్గపుత్రాడు చటుక్కున అత్యంత నిపుణముగ తన యెదిరివాని యెద్దుల మెడలమీదికి విసరెను. అది చూచి అంద రొక్కసారి హాహాకారముల సలిపిరి. కాని మగటిమి గల ఆ కుర్ర పోటీదారుడు తన చబుకు చురుక్కున పేలించి సమవర్తి చేతిపై మేరుమువలె, బాణమువలె, నాటించి పగ్గము హస్తమునుండి సడలిపోవునట్లొనర్చెను.

సమవర్తిచేయి పట్టువీడిన పగ్గముతాడీడ్చుకొనుచునే ఆ బాలకుని బండి గమ్య స్థానమునకుబోయి నిలిచెను. ఆ గిత్తలు వగర్చుచు ముట్టెలు భూమి నాన్చి, నాల్కలుజూచి, డొక్కలెగురవేయుచు నిలిచియున్నవి.

ఇరువది ధనువులవెన్క సమవర్తి వచ్చెను. శివస్వాతియు, కాళింగుడగు మల్లినాథుడును మూడవవారుగా వచ్చిరి.

ఒక్కుమ్మడి ప్రజలందరు “ఇదిమాయ! తంత్రము! ఇంద్రజాలము! వీడు బ్రాహ్మణ మాంత్రికుడు! వీనిపట్టుడు! కొట్టుడు! చీల్చివేయుడు!” అని కేకలువేయుచు దగ్గరనున్న ఆయుధముల సేకరించి హుమ్మని విజయలక్ష్మీ ధవుడగు నా బాలకునికడ కురికిరి. అచ్చటనున్న రక్షకభటులు ఇట్టిరంగ ముద్భవిల్లునని కలనైన తలచియుండకపోవుటచే, ఆ మూకల నాపుచేయలేకపోయిరి. చక్రవర్తి అంగరక్షకులు కొందరు తమ గుఱ్ఱముల నా విజయునికడకు బరువెత్తించి ఆతని చుట్టును శూలముల జళిపించుచు నిలిచిరి. వారి నెట్లు తప్పించుకొనిరో నల్వురైదుగురు వీరులు సువర్ణశ్రీ బండిని కత్తులెత్తుకొని సమీపించిరి. ఆ బాలుడు తనకుకలిగిన ఆయాసము నడంచుకొనుచు, చిరునవ్వు మోముతో నీ గడబిడ చూచుచు, తనదూడల పల్కరింపుచు, ప్రేమచే వాని మూపురములు, గంగడోళ్ళు, ముట్టెలు దువ్వుచు, వాని ఆయాసము తీర్చుచు, తనపై దుముకువారివైపు చూచుచుండెను. ఎప్పుడీ నల్వురు కత్తులెత్తుకొని తనమీదికి దూకిరో, అప్పుడా బాలుడుచేతనున్న బంగారు కట్లుకట్టిన, మణులు పొదగిన పెద్ద పులితోలు తాళ్ళుగలిగిన, దంత కశాయుధము పట్టుకొని ముందున్న వాని మోముపై చురుక్కున నంటించెను. “హో” యని యార్చియాతడు కత్తి పారవైచి, కశాఘాతంబుచే రక్తము స్రవించు మోముపై చేతులనుంచుకొని కూలిపోయెను.

ఇంతలో అపరభీమునివలె మహాసత్వుడై పర్వతమువలె ఉన్నతుడై ఆజానుబాహుడై, అమూల్యవస్త్రధారియై, చిరుగంటలు గలిగిన పెద్దగదను ధరించి యొక పురుషుడు రాజాయము కడనుండి పరుగునవచ్చి, సువర్ణశ్రీ కుమారునికడకురికి, పిడుగుమాటలతో “ఎవ్వరీబాలుని స్పృశింప దలంతురో వారు ముందే గదాయుధంబు రుచిచూతు” రని పలికెను.

ధనుర్వేదాచార్యుండును, చండవిక్రముండును, సమస్తవీరహృదయా నందుడును, పవిత్రుడగు సోమదత్తు డానూత్న బాలునకు సహాయియై వచ్చెనని చూడగనే ప్రవాహము వలెవచ్చు ప్రజానీకము పర్వతము అడ్డమురా నాగినట్లయ్యెను. అందరును వెనుకకు తిరిగిరి. అప్పుడు సార్వభౌముని గజ తురగ రథ సైనికులు జవంబున విచ్చేసి మూకల నిటునటు తరిమివేసిరి. సార్వభౌముని కడకు విజయుని గొనిరా రాజాజ్ఞయయ్యెను.

ఈ కోలాహలమంతయు సమవర్తి జూచుచునేయుండెను. జనులు తన్నోడించిన యాబాలునిపై గవిసినప్పుడు సమవర్తిమోము హర్షప్రఫుల్ల మయ్యెను. సోమదత్తుడువచ్చి ఆ కుర్రవానిని ఆపదనుండి రక్షించునప్పుడు సమవర్తి పండ్లు బిగించి సోమదత్తునివైపు చురచుర చూచెను.

ఆ బాలుడు తన్ను రక్షింపవచ్చిన తన గురునకు పాదాభివందన మాచరించి ఆనందాశ్రువులతో నాయన మోము దిలకించెను. సోమదత్తుడు సంతోషమున శిష్యుడగు నా బాలుని బిగవుగిలించుకొని మూర్ధము ముద్దు గొనియెను. వారిద్దరు గజగమనముతో రాజమందిరము సమీపించిరి. ఈలోన ప్రజలకు కోపముతగ్గి ఎట్టి బహుమాన మా బాలుడు బడయునో, సార్వభౌముడేమి చెప్పునో ఆ బాలుడెవరో తెలిసికొన కుతూహలము కలిగి, ఎప్పటియట్లు తమ స్థానముల ఇష్టము చేతనైననేమి, సైనికుల యొత్తిడి చేతనేమి యధివసించిరి. అంతయు నిశ్శబ్దమయ్యెను. చీమ చిటుక్కుమన్న వినిపించునట్లుండెను.

సార్వభౌముని మందిరముకడ అమాత్యులు, సచివులు, సైన్యాధికారులు మొదలగు గొప్ప యుద్యోగులు, సామంతనృపాలురు, ఆంధ్రపండితులు, కవులు, వీరులు-అందరు అధివసించి యుండిరి. శ్రీముఖ సాతవాహనమహారాజు దేవేరితో గద్దెపై నధివసించి యుండెను. రాజసింహాసనము కుడిప్రక్కగా యువరాజాసనముపై చక్రవర్తి పెద్ద కుమారుడగు శ్రీకృష్ణసాతవాహనుడును, ఆ ప్రక్కపీఠికపై శ్రీముఖుని తమ్ముడగు సుధన్వ సాతవాహనుడును కూర్చుండిరి. వెనుక పరిచారికలతో అంతపుర స్త్రీలోకము మణిమయ స్వర్ణపీఠముల ఉపవిష్టమైయుండెను.

సోమదత్తు తనశిష్యుని రాజుమ్రోలకుం గొనిపోయినాడు. ఆ బాలకుడు సార్వభౌమునకు సాష్టాంగప్రణామ మాచరించి, యాతనిచే ననుజ్ఞాతుడై లేచి నిలువబడెను, అప్పుడు సోమదత్తుని మోము పరికించి చక్రవర్తి యిట్లనియె “వ్యాయామాచార్యా! సోమదత్తా! ఈ బాలకు డెవరు? ఈతని యుదంతమేమి?” అని యడిగెను.

“మహారాజాధిరాజా! ఆంధ్రసార్వభౌమా! సర్వరాజన్యకిరీటమణి ప్రభాస్నాత పాదుకా! జయ జయ! ఈ బాలుడు దేవరశిల్పియై విఖ్యాతి గాంచిన మహాభక్తుడగు ధర్మనంది తనయుడు. సువర్ణశ్రీకుమార నామధేయుడు. నా శిష్యులలో నుత్తముడు. ఉక్షాశకట పరీక్షకు మా పరిశ్రమాలయ పక్షమున నొకవీరుని పంపుట పూర్వమునుండియు ఆచారము. శ్రీ శకటాధ్యక్షులు మాకు లేఖ నంపుటతోడనే మే మొక పందెము నేర్పరచి అందు విజయుడగువాని నీ ఉత్సవపరీక్షకుపంపుట దేవరకు విశదము. ఈ సంవత్సర మీబాలుడు విజయియై ఇచ్చటకువచ్చి ఇక్కడను జయము గొన్నాడు” అని విన్నవించెను. అప్పు డొక్కసారి వందిమాగధులు పాడినారు. దుందుభుల మ్రోగించినారు. జయ జయధ్వానము లొనర్చినారు. వైతాళికులు కీర్తించినారు. మేళపతులు శంఖ కాహళ నాగస్వరాది వాద్యముల పల్కించిరి.

11. విజయ బహుమానము

సద్దుమణగినంతనే సార్వభౌముడు మహామంత్రివైపు చూచెను. మహామంత్రి ప్రధాన వైతాళికుని కన్నుసన్న జేసెను. అప్పుడు తళుకు తళుకుమను దీపలక్ష్ములు, సర్వభూషణాలంకృతలై హారతులగొనివచ్చి, పాటలు బాడి మంగళము లిడిరి. ఇరువురు బాలికలు వెంటనే వివిధ సుమమాలల గొనివచ్చి యాతని మెడను వైచిరి.

అంత వీణానాదము మృదంగము వేణుస్వనము వినవయినవి. ఈ వలావలనుండి సుందరులగు ఇరువదిమంది బాలికలు నాట్యము చేయుచు విచ్చేసి సువర్ణశ్రీ కుమారుని చుట్టును “ధర్మవిజయము”ను అద్భుతాభినయపూర్వకముగ నాట్యమొనరింప నారంభించిరి. ఆ బాలికలలో సార్వభౌముని ఇరువురి తనయులు, రాజకుటుంబములోని బాలికలు, సచివుల సేనానాయకుల కుమార్తెలు, కోటీశ్వరుడగు చారుగుప్తుని పుత్రి హిమబిందును కలరు. ఆ నాట్యమునందు పాల్గొననుత్తమవంశ సంజాతలగు యువతీ రత్నములకే అర్హత.

మంగళవాద్యములు మ్రోగుచుండెను. దేవవేషమున నాట్యగురువు ప్రవేశించెను.

ఈ విజయ గీర్తింప
ఈ వియచ్చరులెల్ల
గగన పథముల వచ్చి
కాంతితో ప్రసరించి
పూలవర్షము కురిసి
తేలుచున్నారదిగొ
ఈ విజయ గీర్తింప”


బాలిక లప్సరసలవలె నభినయించుచు,

“ఓయి యౌవనమూర్తి
ఓయి సుందరస్వామి
రావయ్య జయదామి
కావక్షుడవు కమ్ము”

నాట్యమాడిరి.

నాట్యగురువు:

ఇంద్రుడిచ్చును కీర్తి
చంద్రుడిచ్చును విద్య
వాయుదేవుడు బలము
వరుణుడిచ్చును శక్తి.

బాలికలు నాట్యము సలుపుచుండిరి.

నాట్యగురుని శిష్యుడు మారువేషమున,

“ఎవడవోరీ మానవాధమా!
ఇవ్వనవాటిని నిలుచున్నావూ?

ఇరువురు శిష్యులు అహంకారుడు, స్వార్థుడు అను దేవతలుగా పాడుచు తాండవింతును.

“లోకముకొరకై సేవనుమానుము
లోకము నిన్నేకొలుచునురా!”

మారుడు :

మారుడ నేనే, శూరుడ నేనే
మాయలకంతకు నేతను నేనే
జగము లన్నిటిని కాలనుత్రొక్కెద
జగములు నన్నే పూజలు సేయును
నన్నుకొలిచికొనువారికే విభవము,
నాకము వారికి పాదాక్రాంతము,
ఛత్రచామరము సర్వరాజ్యములు
సర్వసంపదలు వారికె దక్కును;
రారా! రారా! విజయరూపుడా!
రారా, వచ్చియు నన్ను కొలువురా!

కొందరు బాలికలు మారుని కొమరితలవలె దివ్య వేషములప్రవేశించి:

జగంబంతట వీరహృదయులు
జిఘృక్షులుగా మోకరింతురు,
మాదగు సౌందర్యమ్మును చూచి
మమ్ములనే కామించి వత్తురు.

జగం.

మనృణకినలయబాహువల్లరి
మధురముగ నిను కౌగలించును
వినముకాదిది వాతెరసుధరా
మెనవరా దేవుడై వెలిగెదవు.

జగం.

ఇంతలో రాజపుత్రికలు, హిమబిందు, రాజబంధు తనయలు, అష్టమార్గ మూర్తులవలె విచ్చేసి నాట్యముచేయ నారంభించిరి. చక్రవర్తి ప్రథమతనయ మాయాదేవి విజ్ఞానదేవిగా, ద్వితీయ పుత్రిక శాంతశ్రీ సత్యచింతనాదేవిగా, హిమబిందు ధర్మకర్మదేవిగా, నాగబంధునిక ఉత్తమాశయదేవిగా, ఇతర బాలికలు తక్కినవారుగా నటించిరి.

విజ్ఞానదేవి :

జన్మంబు మాయరా
జగమే హుళక్కిరా
సర్వభోగము లవియు
ఛాయలే ఎరుగరా,

సత్యచింతన :

జగములో ఎవ్వరికి
సలుపకోయీ హింస
పాపకాంక్షలు నీకు
చూపవుర నిజపథము.

ధర్మకర్మదేవి :

ప్రేమయే నీ కర్మ
ప్రేమయే నీ దారి
సర్వ ప్రాణులు నీవె
సర్వబాధలు నీవే!

ఉత్తమాశయదేవి :

మూడురత్నము లివిగొ
చూడరా! వేడరా!
నాల్గు సత్యాలనే నమ్మరా, ఎరుగరా!

సత్యవచనదేవి :

అనృత మాడబోకు
ఆనంద మొందరా
 కానిచో మాటయే
కంఠాన రానీకు.

న్యాయజీవితదేవి :

పరధనము వలదురా
పరకాంత వలదురా
 వలదురా పరభూమి
వదలరా వాసనల.

శీలదేవి :

 వలదు భోగము మనకు
వలదు యశములు మనకు
కలలైన జన్మాలు
గాఢశత్రులు మనకు.

ఆనందదేవి :

ఏమి లేకుండుటే
ఎరుగు నిర్వాణంబు
కర్మరహితంబైన
 జన్మరహితంబౌన
 అదియ ఆనందమౌ
 అదియె నిర్వాణమ్ము.

హిమబిందుకుమారి సమవర్తి ఓడిపోయి రెండవవాడుగా మాత్రము వచ్చుట చూచి వెలవెలపోయినది. ఆమె హృదయము క్రుంగిపోయినది.

పెన్నిధి పోగొట్టుకొనినవానివలె క్రుంగిపోయిన తండ్రిని జూచి, యామె కన్నుల నీరు తిరిగెను. ఇంతకు నా నూత్నబాలకు డెవ్వరో తన తండ్రికి దుఃఖకారణుడైనాడు. ఆతడు పిశాచి, రాక్షసుడు. ఆమె ఆ బాలకుని ఇచ్ఛామాత్రమున నాశనముచేయ నూహించినది.

విజయము నందుటకుగాని, ఓడిపోవుటకుగాని ఆ పందెమున ఎద్దులే కారణమయినను, సారథిని కారకునిగా ఎంచి నిందించువారిలో చారుగుప్తుడును చేరినాడు. ఇంతలో అతనికి జ్ఞానోదయమై, తన్ను తానే నిందించుకొనినాడు.

తా నెన్నివేల ఫణములు పెట్టి కొనిననేమి? మహోత్తమ వృషభముల కనుగొనలేక పోయినాడు. ఆ చక్కని గిత్త లెచ్చటివి? ఏ జాతివి? తన గోపాలురకు, గోరక్షకులకు తెలియకుండ నెచ్చట పెరిగినవి? అలాంటి దివ్యవృషభములు లక్షఫణములు మూల్యమిచ్చికొన్ననేమి?

తన స్వప్నములు పటాపంచలైనవి. తాను కౌశికునివలె పన్నిన మొదటి ఎత్తే విచ్ఛిన్నమైనదేమి? ఇది అపశకునమా? ఛా, ఎన్నిసారులు ఓడిపోయి చాణక్యదేవుడు జయమందలేదు? అదిగో తన బంగారు ప్రోవు, దివ్యమూర్తి. హిమబిందు తన్నుజూచి బెంగపెట్టుకొన్నది.

అనుకొనుచు చారుగుప్తుడు కలకల నవ్వుచు, “మనమును విజయునకు కాన్క నీయవలె, హిమబిందూ! హరగోపా! అలంకారికుని, కుయవుని ఇటు రమ్మను!” అని ఆజ్ఞ యిచ్చినాడు.

కుయవానందుడు అద్భుతశిల్పి, అలంకారికుడు. ఆయన మందిరము వెనుక ప్రక్కనుండి ముందునకు వచ్చి, చారుగుప్తునితో రహస్యముగ మాట్లాడి అశ్వము నెక్కిపుర మార్గమున వెడలిపోయెను.

తండ్రిగారి సంతోషము కనుంగొని హిమబిందు హర్షవదనయై నాట్యమున కలంకరించుకొన చక్రవర్తి మందిరము వెనుకనున్న నేపథ్య మందిరమునకు బోయెను.

అచ్చటనున్న యా చకోరాక్షుల, ఆ యిందీవరనేత్రల, ఆ కురంగ లోచనల నడుమ హిమబిందు మహాపద్మనేత్రయై, తారకామధ్యచంద్ర బింబమువలె కాంతులీనుచుండెను. రావి వనములోని వటవృక్షమువలె విలసిల్లెను. మొదట హిమబిందును సమవర్తి చూచుచునే యుండెను. ఆమెవదన మవనతమై సమవర్తి హృదయమును గ్రుంగజేసినది. చేయి పెట్టి కలచివేసినది. తన దురదృష్టముచే మేనమామకు అపజయము కలిగినది కదా యని యాత డనుకొనెను. ఇంతలో చారుగుప్తుడును నవ్వెను. సమవర్తి మనస్సు చకితమై వికారమునందెను. పదునారేండ్ల ఎలప్రాయపు ఆ జవ్వని తన మనస్సంకల్పమునకు, భావనేత్రమునకు ఇదివరకు గోచరము కాని పొంకముతో, అత్యద్భుతసౌందర్య రూపమున ఎదుట ప్రత్యక్షమై నప్పుడు అతనికి మరేమియు కన్పట్టలేదు. నాగస్వరము నూదు పాముల వాని అభినయముల తదేకదీక్షతో చూచు సర్పమువలె నాతడు హిమబిందుగమనము చూపులతో ననుసరించుచుండెను. చక్రవర్తి సింహాసనపాదముమ్రోల విజయపీఠిక యమర్పబడినది. సువర్ణశ్రీ కుమారుని నందధివసింపజేసి వసిష్టు డాశీర్వాదముచేసి సువర్ణా క్షతల జల్లుటయు, సార్వభౌముడు, మహారాణియు, రాజబంధువులు, శ్రీకృష్ణసాతవాహన మహారాజు, మంత్రులు, సామంతులు, వేదపండితులు, శ్రమణకులు, ధర్మనందియు నక్షతల జల్లిరి. హిమబిందుకుమారి తన యపాంగవీక్షణముల సువర్ణశ్రీ కుమారుని గాంచెను. ఆమె హృదయము ఏలనో దడదడ కొట్టుకొనెను.

ఇంతలో నొక వైతాళికుడు శంఖమూదెను. అప్పు డా చంద్రరేఖలగు ముగుదలు నాట్యము చాలించి వారి వారి పీఠముల నధివసించిరి. చక్రవర్తి పీఠమునుండి లేచుటయు, మహాసభయంతయు లేచెను. శకటాధ్యక్షుడగు మహశ్రీ సువర్ణశ్రీకుమారుని చేయి పెట్టుకొని సార్వభౌముని కడకు గొనిపోయెను. ఆ బాలకుడు చక్రవర్తికి మోకరించి లేచెను. ఒక సచివుడు ప్రతీహారి అందిచ్చు నవరత్నఖచితమై, బంగారు పనితనముగలిగి, కన్యాకుబ్జ లోహకారకులచే నిర్మింపబడి, పదునేను మడతల ఉక్కురేకు కలిగి, పదునుకడ గాలిలో మాయమై, మొరవవైపు యవగింజ పరిమాణముకలిగి, జవజవలాడు, తళుకు తళుకులాడు, మహానిశితకృపాణమును సార్వభౌముడు దుకూలవస్త్రములతో, తాంబూలములతో బహుమాన మొనర్చెను. ఒక్కసారిగా భేరీ మృదంగాది వాద్యములు భోరుకొల్పబడినవి. మరల నిశ్చలత జనింపగానే, యువరాజు ముందున కేతెంచి సువర్ణ శ్రీకుమారుని మహశ్రీ తన వెనుక తీసి కొనిరా, మందిరముకడకు సూతుడు కొనివచ్చిన యొక కాంభోజాశ్వమును- నల్లనిదానిని, సన్నని ముట్టె కలదానిని, చామరమువంటి తోక గలదానిని కెరటములవంటి మెడజూలు కలదానిని, లేడి కాళ్ళవలె పాదములు కలదానిని పంచకళ్యాణము లున్నదానిని - కళ్లెముబట్టి సువర్ణశ్రీ కుమారుని చేతికందిచ్చెను. మరల దుందుభులు మ్రోగినవి. అప్పుడు మహారాజ్ఞి పరిచారికవచ్చి, యా బాలుని సింహాసనముకడనున్న రాణికడకు గొనిపోయెను. అప్పుడా సాధ్వి “ఇది నీ వివాహమునాడు నీ భార్యకి” మ్మని రత్నమంజూష నొకటి చెలికత్తెచే నిప్పించెను. సమస్తవాద్యములు ధ్వనించినవి.

ఇంతలో చారుగుప్తుడు ముందుకువచ్చి, ధర్మనంది చేయిబట్టి సువర్ణశ్రీ కడకు గొనివచ్చి “ధర్మనందులవారూ! మీ కుమారుడు సర్వతంత్ర స్వతంత్రుడయ్యా! మీ రిట్టిబాలుని కనుటచే ధన్యులు. ఈనాడు విజయమందిన మీ కుమారునకు, నేనును చిన్నకాన్కను సమర్పించుచున్నాను” అనుచు హరగోపుడందిచ్చిన రత్నఖచిత సువర్ణపేటికను మూత తెరచి, సువర్ణశ్రీ హస్తముల నుంచినాడు. అందు దంతపుటము లపై చిత్రించిన పరమపవిత్ర వినయపీఠిక గ్రంథమున్నది. సువర్ణశ్రీ ఆపేటికను కన్నులకు, శిరమునకు నద్దుకొని తన ప్రక్కనున్న రాజసేవకునకందిచ్చెను. ఉత్సవమంతయు నైనవెనుక సార్వభౌముడు మందిరము దిగి దురోన్ముఖుడై దంతావళ మారోహించెను. విజయ సింహుడగు సువర్ణశ్రీ కుమారుని అలంకారభూయిష్టమగు అంబారీ కల యొక మదగజముపై నధివసింపజేసి ధాన్యకటకపురిని ఊరేగింప బయలుదేరదీసిరి.

12. బంధితుడు

శోణనగ మను గ్రామము వేంగీవిషయమున గోదావరీనదీతీరమునకు మూడు గోరుతముల దూరమున నున్నది. శోణనగ మనుపేరు ఆ గ్రామము ప్రక్కనున్న ఎఱ్ఱటి కొండవలన వచ్చినది. ఆ గ్రామము ఫలమంతమగు భూములచే, తోటలచే నలరారుచు నూరు బ్రాహ్మణగడపతో, రెండువందల క్షత్రియులైన రెడ్ల గృహములచేతను, ముప్పది వణిజుల ఇండ్లతోను, రెండువందల ఏబది చాకలి, మంగలి, కుమ్మరి మొదలయిన శూద్రగేహములతోను నిండియున్నది. నూరు బ్రాహ్మణ గృహములలో ఇరువది ఇళ్ళు శిల్ప బ్రాహ్మణులవి. ఆ గ్రామములోని క్షత్రియులు, శూద్రులు, వణిజులు బౌద్ధ దీక్షావలంబకులు. బ్రాహ్మణులు వేదధర్మ మనుసరింతురు. శిల్ప బ్రాహ్మణులు ఈ వైదిక సాంప్రదాయమన్నను, బౌద్ధసంప్రదాయమన్నను సమాన గౌరవము, భక్తియు గలవారు.

శోణనగ గ్రామవాసులు చైత్రశుద్ధపాడ్యమినాడు గ్రామ శృంగాటక ప్రదేశమున అశ్వత్థ నింబ వృక్షసంశ్లేష స్థల విశాలవేదికపై కూడినారు. గ్రామణియు, పూర్వసంవత్సర సంఘసభ్యులు వేదికపై తాటియాకుల చాపల పై నధివసించిరి. తక్కుంగల ప్రజలందరు వేదికచుట్టును నచ్చటచ్చట గుంపులుగా విడిగా కూర్చుండియుండిరి. గ్రామ పురోహితుడగు చంద్రస్వామి పంచాంగ శ్రవణము నొనర్చెను.

ఆపైనా సంవత్సర గ్రామపాలకులగు గ్రామణిని. పంచసంఘ సభ్యులను ఎన్నుకొనిరి. ఎన్నుకొనుట యనగా గ్రామవాసులు వారు వారు సభ్యులువారు గ్రామణులు అని పేర్కొందురు. తక్కినవారు వల్లెయని కేకలనిడుచుగాని, చేతులనెత్తిగాని తెల్పుదురు.

ఎన్నుకొనిన సభ్యులును, గ్రామణియు “దమ్మసూత్త” గ్రంథము చేత నుంచుకొని ఆ సంవత్సరము తాము శోణనగ గ్రామమును ధర్మయుతముగా, ప్రజాహితముగా పరిపాలింతుమనియు, తామాగ్రామప్రజలకు, భగవంతునికి సంపూర్ణ సేవకులమనియు వాగ్దానములు చేసిరి.

ఆ కాండ నెరవేరుటతోడనే గ్రామపురోహితుడును, తక్కుంగల బ్రాహ్మణులును వేదపనసల చదివి, వారందరి నాశీర్వదించిరి. పుణ్యాంగనలు పాటలుపాడి హారతులిచ్చి తిలకములిడిరి. వారిపై అందరు అక్షతల జల్లిరి. అచ్చటనుండి గ్రామోత్సవము లారంభమైనవి. ఆటలతో, పాటలతో, భజనలతో గ్రామమంతయు ఉప్పొంగిపోయినది. ఆంధ్రదేశమునం దాదినము ప్రతిగ్రామమునం దట్టి ఉత్సవములు, ఎన్నికలు జరుగును. రాత్రియంతయు భగవత్కథాకాలక్షేపము జరిగినది. ఆ వెనుక యక్షనాటకము ప్రదర్శింపబడినది.

కాని పురోహితుడగు చంద్రస్వామి ఉత్సవములం దేమియు పాల్గొనక, తలవాల్చికొని యింటికి వెడలిపోయెను. చంద్రస్వామి ఆపస్తంభ సూత్రుడు, కృష్ణయజుర్వేది, భారద్వాజుడు ఆతడు సాంగవేది, ధర్మశాస్త్ర కోవిదుడు, ఐతిహాసికుడు, గృహ్యసూత్రాల ఉద్దండవిజ్ఞాని. చుట్టుప్రక్కల గ్రామముల పురోహితులలో, బ్రాహ్మణులలో తలమానికము వంటివాడు. మధ్యమ వర్చస్వి బక్కపలుచని దేహపుష్టి కలవాడు. విశాలవదనము కలవాడు. ధనువునకు రెండుగుప్పిళ్ళు తక్కువ ఎత్తుతో, సమనాసికతో, చిన్న కళ్ళతో, పొడుగాటి మెడతో భుజములకంటు చెవులతో నాత డపర బృహస్పతి వలె తేజరిల్లుచుండును. ముప్పదిఏండ్ల ఈడువాడయినను బ్రహ్మచారియగుట నాతని గృహము నొక ముదుసలి మేనయత్త నిర్వహించుచుండును.

ఇంటికిబోయి దొడ్డిలోనికిజని కూపమున నీరుతోడికొని స్నానమాచరించి, సాయంకాల మూహించి, మడివస్త్రముల గట్టుకొని యాతడుసంధ్యార్చన చేయగడంగెను. సంధ్యార్చన పూర్తి చేసికొని యాతడు తన పూజాగృహము ప్రవేశించెను. మినుకు మినుకుమను అర్చనాదీపకాంతిలో మహావృషభమూర్తి, పదునాల్గంగుళముల తామ్ర విగ్రహమూర్తిగా ప్రత్యక్షమయ్యెను. ఆ విగ్రహమునకు చంద్రస్వామి సాగిలబడి ప్రార్థనా శ్లోకములు పఠించి లేచి, పద్మాసనము వేసికొని జపముచేయ ప్రారంభించెను.

మేనయత్త ఫలహారము కానిచ్చి, ఇల్లంతయు సర్దుకొని, తలుపు వేసికొని వచ్చి, దొడ్డిలో నులకమంచము వేసికొని పక్క వేసికొని నిద్దుర కూరినది.

గ్రామపు తలవరి మూడవ యామపు కేకలు వేయుచు పోవునంత వరకు చంద్రస్వామి జపదీక్షపరుడై యుండెను. జపము పూర్తి యగుట తోడనే లేచి మహేశమూర్తి ఎదుట సమాలింగిత భూతలుడై లేచి, దొడ్డిలోనికి జనెను. చుక్కలు మిన్కుమిన్కనుచుండెను. దూరమున పొలములలో నక్కకూతలు వినవచ్చుచుండెను. దొడ్డిలోనున్న వృక్షములు నిశ్చలములై దేవదేవుడగు నీశ్వరునిగూర్చి తపస్సు చేయుచున్నట్లుండెను.

“అయ్యో భరతఖండమంతయు నాస్తికుల పాలయినదే. ఎక్కడ బుద్ధుడు! ఎక్కడవేదములు. వేదములు పౌరుషేయములట. భగవంతుడే లేడట. బుద్ధుడే భగవంతుడట. అతడే తాను భగవంతుడనుకాను భగవంతుడే లేడని చెప్పినాడు. గాని ఈ భిక్కులు బుద్ధుడే సర్వసృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడు అంటున్నారు. బుద్ధునిమార్గమే అనుసరించెదరు. కొందరపరశైలవాదులట. కొందరుపూర్వశైలవాదులట. ఈ చార్వాకమతము మశూచిరోగమువలె భరతఖండమంతయు నల్లుకొనిపోయినది. భగవద్గీత, వేదాంతసూత్రములు ఎంత యుత్కృష్టగ్రంథములు! “దమ్మసూత్తము” లట; దద్దమ్మసూత్తములు కావా? జాతక గాధలట! త్రిపీఠకములట! వేదములు, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, ధర్మశాస్త్రములు, ఉపవేదములు, అన్నియు నాశనమైనట్లేనా? వినాశ కాలము వచ్చునది. ఏదియో మహా ప్రళయము ఆవహిల్ల బోవుచున్నది. చక్రవర్తులే బౌద్ధ దీక్షపరులైనప్పుడు ప్రజలగతి యేమి?

“శూద్రులందరు బౌద్ధ మతావలంబకులై బుద్ధచైత్యపూజాపరు లయ్యారు. ఏలాగు ఈ భయంకరస్థితిని మాపుట? గురుదేవులు అవతారమూర్తులు. వారే కల్కి అవతారదేవునకు వైతాళికు లగుదురుగాక!” అని ఆలోచించుకొనుచు ఇటునటు నడుచుచుండెను.

ఎవరో వీధి తలుపు తట్టినట్లయినది. “ఎవరువా” రని చంద్రస్వామి కేకవైచి ఇంటిలోనుండివచ్చి ముందరచావడి దాటి సింహద్వార కవాటము తెరచెను. కాగడాలతో కొందరు మనుష్యులు చంద్రస్వామికి కనిపించిరి. కాగడాల వెలుతురున నూత్న గ్రామణియగు శ్వితవుడు, గ్రామసంఘసభ్యులు, ఇరువురు తలారులు, కొందరు సైనికులు, నొక దళిపతియు నాయనకు గోచరించిరి.

చంద్రస్వామి “ఏమి ఇది?” యని ప్రశ్నించెను. శ్వితవుడు “అయ్యా నమస్కారములు. తాము చక్రవర్తిపై నేదియో దోష మెంచినారట. అందుకై తమ్ము బంధించి ధాన్యకటక నగరమునకు కొని తేవలయునని, మహా సైన్యాధికారి ముద్రవేసిన భూర్జపత్రముగొని యీ దళవాయి వచ్చినారు. కానీ మీ రీ క్షణముననే వీరివెంట పోవలయునని మే మందరము ప్రార్థించుచున్నాము. వీరు మీవంటి ఉత్తమ బ్రాహ్మణులను బంధిపకయే తీసికొని పోదురు” అని మనవి చేసినాడు.

వృద్ధుడగు నా క్షత్రియుని అవలోకించి చంద్రస్వామి “చక్రవర్తిపై దోషమా! నేనా!” యనుకొనుచు “చక్రవర్తి శ్రీముఖసాతవాహనుడు ధర్మమూర్తియే! ఎందరు బ్రాహ్మణుల కగ్రహారముల నాయన సమర్పింపలేదు? ఈ అఖండ మహారాజ్యము సుభిక్షమై యా ధర్మరూపుని చల్లని పరిపాలనములో సర్వ సంపదల కాకరమై రామరాజ్యమును దలంపునకు తెచ్చుచున్నదే! వారి పైన నేను దోష మేమి యాచరింపగలను?” యని పలికినాడు. అతనిమోము వైవర్ణ్య మొందినది. విషాదమేఘము లాతని నావరించినవి.

ఆ దళవాయి చంద్రస్వామిని కనుగొని “స్వామీ! మీ రనునది నిజమే! కాని, ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చును. తమ్ముగూర్చి వృద్ధశ్వితవులు ఘనముగా చెప్పియున్నారు. మీకు సకల సౌఖ్యముల నొన గూర్చుచు తీసికొని పోదుము. చక్రవర్తి జన్మదినోత్సవము లఖండముగ జరుగుచున్నవి. ఆ ఉత్సవములు పూర్తికాకుండగనే ఈ అభియోగము విచారింపబడగలదు. ఇప్పుడు జాగుసేయక తాము తొందరగ బయలుదేరినచో, మనము తెల్లవారునప్పటికి ఏ మూడు క్రోశములైన పోగలము. తమకు అందలము సిద్ధము చేయించినాము. మేము అశ్వములపై ప్రయాణము చేయుదుము. ఒక వారములోననే మనము ధాన్యకటక నగరము చేరగలము” అని మనవిచేసి నమస్కరించెను.

13. ప్రయాణము

ఆంధ్రదేశమునం దెల్లెడను మహారాజపథములు, ఘంటాపథములు, రాజ మార్గములు, బాటలు విరివిగా నున్నవి.

మహారాజమార్గము ఎనిమిది దండములు వెడల్పు (దండము = 8 అడుగులు, అడుగునకు 9 అంగుళములు). ఘంటాపథము ఆరుదండముల వెడల్పు. ఈ బాటపై ఏనుగులు ప్రయాణము చేయును. రాజమార్గము నాలుగుదండముల వెడల్పు. వీనినే రథ్యలనికూడ పిలుచుచుండిరి. సాధారణపు బాటలకు అశ్వికపథమనియు, ఖరోష్టపథ మనియు, చక్రపథమనియు పేరులున్నవి. ఆశ్వికపథమునకు ప్రక్కనే మనుష్యపథమనియు, పాదపథ మనియు మనుష్యులు నడుచు పథమున్నది. ఈ పథము రెండు అరట్నులు వెడల్పు (1 అరట్ని = రెండు అడుగులు). ఈ బాటపై మనుష్యులు మాత్రమే నడువవలసి ఉన్నది. అన్ని పథములు రాళ్ళతో, సున్నముతో తరతరము లుండునట్లుగా నిర్మింపబడినవి. గ్రామము, గ్రామము కలుపు సాధారణపథములు గట్టిగా దిమ్మెస చేయబడి, ఎడ్లబండ్ల, అశ్వముల యానమునకు ఉపయోగపడు నట్టమరింపబడియుండెను.

ఈ మార్గములన్నిటికి పై అధికారి సర్వమార్గాక్షుడను ఉత్తమోద్యోగి. సర్వమార్గములు సరియైన స్థితిలో నుంచుటయు, మార్గముల ప్రక్క ఆరు గోరుతముల కొకచోట జలగృహముల నుత్తమస్థితిలో నుంచుట, మార్గములవెంట సత్రములు, సత్రములలో భోజనగృహములు, పశువైద్యశాలలు, మనుష్యవైద్య గృహములు నుచితరీతి జరుగునట్లు పర్యవేక్షణ చేయుట-ఇవి ఈ యధికారి ధర్మములు.

ఆంధ్రదేశము ధాన్యకటకమునుండి మహారాజపథములు నాలు గున్నవి. ఒకటి ధాన్యకటకమునుండి కృష్టదాటి వాయవ్యమూలగాబోయి, సువర్ణపురము, నాగేంద్ర నగరము, పర్వతనగరము, మహానగరముల మీదుగా మంజిష్ఠానదీతీరముననున్న గంగా పట్టణమునకుబోయి యచ్చట నుండి ప్రతిష్టాన నగరమునకు బోవును.

రెండవ మహారాజపథము ధాన్యకటకమునుండి తూర్పుగా ఇంద్ర కీలాద్రి పురమునకుబోయి అచ్చటనుండి ఆగ్నేయముగా కృష్ణానదీతీరముననే భట్టిప్రోలు పోయి, యచ్చట కృష్ణ దాటి ఘంటికాశాలకును ఆ పురమునుండి శ్రీకాకులమునకును బోవును.

మూడవ మార్గము ధాన్యకటకమునుండి దక్షిణముగా ధనదపురమునకు, నచ్చటనుండి ఉదయ పర్వతమునకు, నచ్చటనుండి కాంచీ పురమువరకు పోవును.

నాల్గవమార్గము ధాన్యకటకమునుండి ఈశాన్యముగాబోయి, వేంగీ పురము, అచ్చటనుండి గౌతమీతీరముననున్న గోతీర్థముకడ గౌతమిని దాటి దక్షిణకోసల రాజధాని, పిష్టపురమును, పూర్వాంధ్రదేశ ముఖ్య నగరమగు శాతవాహనగుండము, ఆంధ్రగిరి పోయి, అటనుండి త్రికళింగ దేశము చేరును.

చంద్రస్వామిని శిబికారోహిని జేసి శాతవాహనసైన్య దళపతియు, సైనికులును రెండు దినములలో ఇంద్రకీలపర్వతము జేరినారు. ఇచ్చట కృష్ణానది ఇంద్రకీలపర్వత పంక్తి ఛేదించి, సింహమధ్యమయై, వేగవతియై సముద్రతీర భూములైన నాగవిషయమున ప్రవహించి, ప్రాచీనాంధ్ర ప్రభువగు సుచంద్రుడు, అవతారమూర్తియగు ఆంధ్రవిష్ణువు పరిపాలించిన శ్రీకాకులపురమును పవిత్రముచేయుచు, మూడుగోరుతముల దూరమున సముద్రమున జేరును. (ఇప్పుడు కృష్ణానది శ్రీకాకులపురమునుండి పదిమైళ్ళు తూర్పుగా నదిఒండ్రుచే వెనకకు జరిగినది.)

చంద్రస్వామి ప్రయాణము చేయుచు గ్రామగ్రామమున జరుగు చక్రవర్తి జన్మదినోత్సవములు చూచుచుండినాడు. ప్రజలందరు మేకల వంటివారు. వారీనాడొక మార్గము మంచిదందురు. రేపు వేరొక పథము శుభమందురు. ఎల్లుండి మరియొక్క టందురు. వారికి నిలకడ ఎక్కడ? ఈ రోజున వెర్రిభక్తితో నాగదేవులను కొల్తురు. గ్రామ దేవతలకు నరపశువునుగూడ బలియిచ్చుటకు సిద్ధమగుదురు. రేపు బౌద్ధసన్యాసి యొక్కడు వచ్చి అహింస బోధించగనే, మాంసాహారమునైన మానుదురు. కాషాయాంబరముల ధరింతురు. నగల నూడ్చివైతురు. రెండు మూడునూరుల సంవత్సరములలో ఈ పవిత్ర భూమి యంతయు నీ చార్వాకమత మల్లుకొనిపోయినదే. యాగములు పనికిరావట, చైత్యములకు పూజలట.

మనుష్యుడు దేహము వదలిన వెనుక నేమున్నది? ఖననమై భౌతి కేంద్రియము లన్నియు పంచభూతముల లీనమైపోవలెగదా! ఉపనిషన్మత విరోధముగ బోధించి దేహము మాయయని చెప్పుచు, నా దేహమున ఎముకయు, వెండ్రుకయు, దంతము, నఖముకూడా పూజనొందవలయునని శాసించిన యాతడు అర్హతుడట, బుద్ధుడట. చితిపై గట్టబడిన కట్టడము చైత్యమట, అద్దానికి పూజలట, అది త్రిరత్నముల నొకటియట!

అని యూహించుకొనుచు చంద్రస్వామి కృష్ణానదిలో ప్రాతఃకాలముననే గ్రుంకులిడి ఉదయ సంధ్యార్చన మొనర్చి, సూర్యున కర్ఘ్యమిడి పురసత్రమున వంటయొనర్చుకొని, భుజించి మరల శిబిక నారోహించి బయలుదేరెను. సాయంకాలమగునప్పటికి వారందరు ధాన్యకటక నగరము జేరిరి.

దళవాయి కోట ఈవలనున్న ఉప సైన్యాధ్యక్షుల భవనమునకు గొనిపోయి ఆజ్ఞలనంది చంద్రస్వామిని తోటలోనికి గొనిపోయి ద్వితీయ ముహూర్తపు భేరీలు మ్రోగకముందే రాజపురోహితాశ్రమమున ప్రవేశపెట్టెను. ఆ మరునాడు కోటలో ప్రాడ్వివాకసభా భవనమున చంద్రస్వామి విచారణము ప్రారంభించిరి. చంద్రస్వామికి అన్ని సౌఖ్యములు రాజపురోహితు లొసగిరి. ఉదయాస్తమయముల గాయత్రి జపించుకొనువాడు. తపస్సు చేసికొనువాడు. భగవన్నామ స్మరణానందప్రేంఖణమగు గానపరవశత్వ మందువాడు. చంద్రస్వామి భక్తుడు. భక్తులకు భయము, ప్రఫుల్లపద్మసూనంబులకు దుర్గంధము, పండువెన్నెలలకు వేడిమి యెచ్చట?

పూర్వకాలమునందు న్యాయవిచారణ నేటికన్న వేయిమడుంగులుత్తమముగ నుండెడిది. దేశమునకంతకు మహారాజసభ ప్రధాన న్యాయస్థానము. దాని వెనుక ప్రాడ్వివాకులసభ స్థానీయ, ద్రోణముఖ, ఖార్వతిక, సంగ్రహణ యనునవి పోనుపోను చిన్నవి. ఎనిమిది వందల గ్రామములకు ద్రోణముఖమును, రెండువందల గ్రామములకు ఖార్వతికము, సంగ్రహణము పది గ్రామములకు న్యాయస్థానములు. ఈ సభలు రెండు విధములు: ధర్మస్థీయము, కంటకశోధము అనునవి. ధర్మస్థీయము వ్యావహారిక ధర్మమునే విచారించును. కంటకశోథసభ వర్తకము, వృత్తి, రాజకీయము మొదలగు విషయముల ధర్మనిర్ణయ మొనర్చును. ప్రాడ్వివాకునిసభ ధర్మస్థీయ కంటక శోధ విషయముల రెంటిని విచారించును. ఆ పైన రాజే సభాపూర్ణుడై స్వయముగా న్యాయ విచారణ చేయును.

నేడు చంద్రస్వామిని కోటలోనున్న ప్రాడ్వివాకుని సభకు గొని వచ్చిరి. రాజభటు లిరువు రాతని తీసికొనివచ్చిరి. ప్రాతఃకాలోచిత కృత్యములు దీర్చికొని పిమ్మట ఉదయము రెండవ మూహూర్తఘటిక మ్రోగు నప్పటికి సభావ్యవహారము ప్రారంభింతురు. సభయందు ప్రాడ్వివాకు డొక ఉన్నతాసనముపై నధివసించియుండెను. ధర్మశాస్త్ర పండితులగు సభ్యులు మువ్వు రితరాసనములపై వేరొకయెడ వసించియుండిరి. ఒక వేదికపై నలువురు బౌద్ధభిక్షువు లొక మృదులమగు ఖర్జూరపుచాపపై నధివసించి యుండిరి. సంధ్యాపాలుడు, లేఖకుడు, గణకుడు (లెక్కలవ్రాయువాడు) వారి వారి యథాస్థానముల నుండిరి. ఏ న్యాయ సభయందును నొక్కపురుషుడు ధర్మనిర్ణయము చేయుట పూర్వకాలము నందెప్పుడును లేదు. వారుకాక నేర మెచ్చటనుండి వచ్చినదో అచ్చోటునుండి ధర్మ సహాయులు కొందరు వచ్చెడివారు. వారుగాక, ఏవిషయమున అనుమానము తటస్థించినను తమ అభిప్రాయములనిచ్చి సందేహము తీర్చుటకు ధర్మశాస్త్ర పారీణులగు భిక్షులు, బ్రాహ్మణులు కొందరు సభయం దుందురు. మహారాజే స్వయముగా విచారించినప్పుడై నను వీరందరు నుండవలసినవారే.

ఎవరి పైనైనను నేరము మోపబడినపుడు ప్రాడ్వివాకానుజ్ఞాతుడై సంధ్యాపాలుడు రాజముద్రాంకితమగు “ఆ సేద్యము” (పిలుపు) పంపును. ఆ పైన వారు వచ్చి తీరవలయును. బాలబాలికలు, ముదుసలులు మొదలగువారు మాత్రము రానక్కరలేదు. చంద్రస్వామిని రాజభటులు కొనిరా, పండితుడును యువకుడునగు నా ద్విజోత్తముని నొక చిత్రాసనమున కూర్చుండుమని ప్రాడ్వివాకుడు కోరెను. ఉత్తమకులసంజాతుడును, ధర్మశాస్త్ర పారీణుడును, సత్యవాదియు నగువాడే ప్రాడ్వివాకుడుగా నుండనరుడు.

14. నిర్దోషి

గణకుడు వచ్చి చంద్రస్వామి నవలోకించి “ఆర్యా! మహామంత్రి శ్వైత్రులవారు మీరు మహారాజుపై కుట్రలు సలుపుచున్నట్లుగా నేరము మోపినారు. దాని నిప్పుడు ఋజువు చేయబోవుచున్నారు. తాము మీకోరిన ఋజుపత్రముల నావల కొనిరావచ్చును. నేరారోపణకానిచో అనగా మీపై నేరము ఋజువు కానిచో, తమ్ము క్షమింపుమని ప్రార్థింపుచు సభవారు మిమ్ము బంధవిముక్తుల గావించెదరు” అని వాక్రుచ్చెను.

తోడనే చంద్రస్వామి లేచి ప్రాడ్వివాకునిదిక్కు మొగంబై యిట్లనియె: “ఆర్యోత్తమా! ధర్మశాస్త్రములు నేరవిచారణ త్వరితముగ నొనరింపవలయు ననియు, లేనిచో సత్యము మరుగుపడిపోయి అన్యాయముగ నొకనికి శిక్ష కలుగుననియు ఉద్ఘోషించుచున్నవి. సత్పురుషుడును, మహాయోగియగు మీ తథాగతు డట్లు బోధించెను. పీఠకములట్లు సెలవిచ్చెను. ఆర్యధర్మము లట్లుపన్యసించినవి.”

“ఓ బ్రాహ్మణోత్తమా! ధర్మశాస్త్రములట్లు ఘోషించుట నిజమే. కాని కాలమానస్థితులు నీ బంధనకు కారణములైనవి. అనవసరముగ న్యాయ నిర్ణయము చేయుట కాలసించిన మహాపాపమని శాస్త్రములు పలికినవి. ధర్మము దోషజుష్టము గాకుండ నీ పెద్దలందరును జూడగలరు. మహారాజెట్టి ధర్మ తత్పరుడో నీవు యెరుంగుదువు. బౌద్ధధర్మములైన నేమి, వేద మత సంప్రదాయములేమి అధర్మము చేయవలదని శాసించుచున్నవి. ఇచ్చట మతధర్మ విచారణ చేయ వీలులేదు. పవిత్రములు, భగవత్పూజాపరములు, నిర్వాణ సముపార్జన కారణంబులగు సమంతభద్రోపదేశములేమి, పురాతనములు, దైవస్వరూపములగు వేద మంత్రములేమి అవ్వాని విచారణ ఈసభది గాదు. మహారాజన్ని మతములయెడ సమానాదరణ కలవాడు. కాని యీ సభ వ్యావహారికసంబంధమైనది. జ్ఞానివి, విద్యా పారంగతుడవగు నీకు మే మేమియు చెప్పనవసరములేదు. విచారణ ప్రారంభించు చున్నాను” అని ప్రాడ్వివాకుడు చెప్పెను.

అంత గణకుడు నల్లచేవకర్ర పీటపై నుంచిన కొన్ని తాళపత్రములు, ఒక భూర్జపత్రము, రెండు మొగలిరేకులు గొనివచ్చి ప్రాడ్వివాకునికడ పీఠిక పై నుంచెను. “ప్రమాణములందు లిఖితసాక్ష్యమును, తరువాతి ఘటాగ్న్యుదక విషకోశ దైవికములు ముఖ్యమైనవి, ఉత్తమమైనవి. ఈ పత్రములు, చంద్రస్వామి వ్రాసిన లేఖలు, అతనికి వచ్చిన లేఖలును అని చెప్పి సభాధ్యక్షుడగు నా ప్రాడ్వివాకునకు ఒక్కొక్క లేఖయు వినిపింప నక్కడనున్న సభ్యులలో నొక్కరిని గోరెను. ఆ లేఖాపత్రముల నెవరు సముపార్జించిరో, ఏరు తెచ్చిరో తెలియదు.

“ఓ పితామహసమాన! మేరునిశ్చల! బుద్ధసన్యాసి చేసిన పాషండ బోధలు ప్రజల ముక్తిదూరుల చేసినను, మన ప్రయత్నములచే వారు దైవ భక్తులగుచున్నారు. గ్రామములు బౌద్ధమతమునుగొని దేవపూజల మట్టు పరచినని. వేదగానములు లేవు. పురాణ శ్రవణములు లేవు. హరిభజనలు లేవు. మహేశ్వరార్చనలు కానరావు. మన దేవులందరును సర్వవిశ్వరూపుడైన భగవంతుడును ఈ పాషండుని సేవకులట. మన్మథుడు మారపిశాచియై యా “దివ్యమూర్తిని భ్రమ పెట్టబోయి యోడిపోయెనట. అట్టిది నేడు మరల వేదగానములు, భగవద్గ్రంథపారాయణము వినుచున్నాము. కొన్ని యజ్ఞముల జరిపించినాము. ఇంతకును మన చక్రవర్తి బౌద్ధుడు. ఆతనికి వేద మతసంప్రదాయము బోధింపకున్నచో నేమియు లాభములేదు. ఆతనికి పాషండమత బుద్ధి నశించి, దైవభక్తి కలుగునట్లు ప్రయత్నము చేయవలయును.”

ఇట్టి లేఖలు నాలుగయిదింటిని సభ్యుడొక్కడు చదివెను. ఇంకొక లేఖలో చివర “ఆంధ్రమున బౌద్ధరాజ్యము నశించి వేదరాజ్యము ప్రబలమగు గావుత” యని యుండెను. అనేక సాక్షులను విచారించిరి. “చంద్రస్వామి వేదదేవతలను పూజించును. మహేశ్వరుడు ఆతనికి అధిదేవుడు” “గ్రామములో జరుగు నుత్సవముల కీతడు రాడు. పంచాయతీ సభ్యుల నెన్నుకొను సందర్భమున చంద్రస్వామి ఏ విధమగు నుత్సాహమును గనబరచలేదు.” “ఆతని ఇంటికి ఇతరదేశస్థులు కొత్తపురుషులు రాసాగిరి. అనేక రాజద్రోహసభ లాతని ఇంటిముందు జరుగుచున్నవని మాకు తెలియవచ్చినది.” “నేను చంద్రస్వామిచే బ్రాహ్మణమత దీక్ష గైకొంటిని.” “నాకు లేఖలిచ్చి వివిధ గ్రామములకు పంపుతారు” అని పలువురు సాక్ష్య మిచ్చిరి. “ఒకనాడు వేంగీపురమున సంచరణుని యింట నిట్టి సభ జరిగెను. నేను చంద్రస్వామితోకూడ అక్కడకు పోతిని. నన్ను వారు సభలోనికి రానీయలేదు. కాని యొక్కసారి పరధ్యానముతో నున్న నాకు మంజుశ్రీయను మాట వినబడినది” - అని చంద్రస్వామికి కొంతకాలము క్రిందట సేవకుడిగా నున్న యొకడు సాక్ష్యమిచ్చెను.

“అయ్యా! నేను మహేశ్వరానందుని సేవకుడను. శ్రీరాజకుమార మంజుశ్రీని తస్కరించుకొని పోయినవారలలో నొకడు మహేశ్వరానందుడు. ఆతడు చంద్రస్వామి, సంచరణుడు, సోమత్తరస్వామి మొదలగు వారలతో గూడియుండుట చూచితిని. అతడు శ్రీ రాజకుమార మంజుశ్రీని ఎత్తుకొని పోయెనని నాకెట్లు తెలిసెనన ఒకనాడు, అనగా ఇప్పటికి సుమారు పదునాలుగు నెలలవెనుక, అతడును ఒంకొకడును “మంజుశ్రీని మేము హుటాహుటిగా కొనిపోయినాము. అంచెల యేర్పాటు విచిత్రముగా చేసినారు మనవాళ్ళు” అన్న మాటలు నాకు వినబడినవి. అటు తరువాత వారు సన్ననియెలుగుతో మాట్లాడినారు గాన వినబడలేదు” అని యింకొకడు తెలిపెను.

పిమ్మట చంద్రసామి యీ విధముగా సభ్యులదిక్కు మొగంబై చెప్పెను. “న్యాయా న్యాయవిచక్షణులగు సభ్యులకు నేనేమియు చెప్పనక్కర లేకుండగనే నాయందు దోషయేమియు లేదని తెలియును. నా అంతరాత్మయందు ఆద్యంతరహితమై, భగవత్స్వరూపమై వెలుగు వేదములే ప్రమాణములని నమ్మకము. ముక్కోటి దేవతలును ఏకబ్రహ్మ స్వరూపముకొన, ప్రజల దైవదూరులచేసి, మహాపాపము నెలకొల్పుచు, జంబూద్వీపమునే యమలోకమొనరించు నీ పాషండ బౌద్ధమతము నశియించి ధర్మ స్వరూపమగు వేదమతము పునరుద్ధరింపబడవలెనని నా యాశయము. ఇప్పటికిని నాకోర్కెయదియ. వారణాసీపురము, తక్షశిల, పూర్వశైలము ఉజ్జయిని మొదలగు ప్రసిద్ధదేశముల తిరిగితిని. మూడు వేదముల నభ్యసించితిని. ఉపనిషత్తులు, ఇతిహాసములు మొదలగు సమస్త మహా గ్రంథము లెరిగితి. బౌద్ధమత రహస్యములు గ్రహింప పీఠకములు, ధర్మ సూత్రములు మొదలగు గ్రంథరాజములు పాటలీపుత్రమున అభ్యసించితిని. కాని బౌద్ధ మతమున నాకు ద్వేషము మెండయినది. నా జన్మభూమి కేతెంచిన నాటగోలె నా దేశమున బౌద్ధమతము నాశనముచేసి వేదమతము పునరుద్ధరింప సంకల్పము దాల్చితిని. అందుకై అనేకులకు బోధచేసితిని. అనేకులు బౌద్ధులను, వారి దీక్ష మాన్పించితిని. ప్రాయశ్చిత్తములు చేయించితిని. కాని అన్ని దేశములకన్న ఆంధ్ర దేశమున బౌద్ధమతము లోతుగా వేళ్ళుబారియున్నది. నాగవంశములవారు, క్షత్రియులు ఈదీక్ష పుచ్చుకొనినారు. కాన ప్రాబల్యముగాంచిన ఈ చార్వాకమతమును పెల్లగింప నాయొక్కనిచే గాదు. అయినను నాబోటివారు అనేకులు నాతో చేరినారు. మా యుద్యమము విజయము గాంచ సిద్ధమైయుండెను. చక్రవర్తికి ముందు మత దీక్షయీయవలె, దానికై మా ప్రయత్నము, అంతియకాని మాకు సార్వభౌమునిపై కుట్రలేల? మహారాజుకు మతదీక్ష యెట్లీయ వలయునను కుట్రతప్ప ఇతరము నేనెరుగ.

“నేనున్న సభయందు శ్రీ రాజకుమార మంజుశ్రీమాట వినబడెనని ఆ సాక్షి తెలుపుచున్నాడు. ఎవరయ్యా శ్రీ రాజకుమార మంజుశ్రీని తస్కరించుకొని పోయినది?” అని యప్పుడు మేమనుకొంటిమి, అంతియ. ఇంకొక సాక్షి శ్రీ రాజకుమార మంజుశ్రీని ఎత్తుకొనిపోయెనని యనుచున్నప్పుడు తాను వింటిననియు, వానితో నాకు స్నేహమనియు చెప్పినాడు. అది నిజమనుకొండు. అతడు శ్రీ రాజకుమారుని ఎత్తుకొనిపోయినవాడని మాకు తెలియగలదా? నా లేఖలలోగాని, నా నడతయందుగాని స్పష్టముగా శ్రీ రాజకుమార మంజుశ్రీని ఎత్తుకొనిపోయితినన్న నిర్ధారణయేది? అప్రత్యక్షసాక్ష్యము పనికిరాదని ధర్మశాస్త్రము విధించియుండలేదా? దైవాంశమగు శాతవాహనవంశము వైదికమతము నుద్ధరించుచు చల్లగా మనుగాక” అని చంద్రస్వామి చెదరని కన్నులతో, నవ్వుగదురు ముఖముతో, గంభీరమగు అభినయముతో తన నిర్దోషిత్వము నుపన్యసించెను. ఇంకొక యామము విచారణ జరిగినది.

శిక్ష విధించుటకుముందు ఇరువురు భిక్షులు లేచి “ధర్మచక్ర మీ సభాస్థానమున విలసిల్లుగాక! భగవాన్ మహాశ్రమణకు డిందు ప్రత్యక్షమగుగాక!” అని ప్రాకృతమున శ్లోకములు చదివిరి. ఇరువురు బ్రాహ్మణోత్తము లప్పుడు ముందుకువచ్చి “సభాసదుల హృదయమున సర్వవ్యాపియగు ఆదినారాయణుడు నిండియున్నాడు. కాన వారు ధర్మదేవతాస్వరూపు లగుదురుగాక” యని మంత్రములు చదివిరి.

ప్రాడ్వివాకుడు సభ్యుల యభిప్రాయ మడిగెను. అందరును ఈతడు నిర్దోషి యని నమ్మజాలమని చెప్పిరి. అప్పుడు మహాపండితుడును, సకల మత ధర్మసారము నెరిగినవాడును, సత్యాన్వేషియునగు నా ప్రాడ్వివాకుడు చంద్రస్వామి నుద్దేశించి “ఓ బ్రాహ్మణోత్తమా! నీవు దోషివికావని చెప్పలేము. కాన నీకు ఒక సంవత్సరము పాతాళ గృహవాసము విధించితిని. నేను తప్పభిప్రాయము పడిన ధర్మము నన్ను శిక్షించుగావుత” అనియాతడు లేచెను. సభవారందరు లేచి నిలుచుండిరి.

అంత తేజస్వియు, ధర్మదేవతాస్వరూపుడు నగు ఒక భిక్షుకు డా సభాభవనము ప్రవేశించెను. అందనేకు లాయనకు సాష్టాంగనమస్కార మాచరించిరి. ప్రాడ్వివాకుడు మోకరించి ఆయన పాదములబట్టి కన్నుల నద్దుకొనెను. అంత నాతడు ప్రేమవంతములై, శక్తిసంపన్నములై, తేజోవంతములగు తన దృక్కుల నా ప్రాడ్వివాకునిపై బరపి “నాయనా! ఈ కుమారుడు నిర్దోషి కాన యీతని విడిచివేయు” మని సెలవిచ్చెను. అంతవృద్ధుడగు నా ప్రాడ్వివాకుడు నా నూత్నపురుషునికడ మోకరించియే “తండ్రీ! నేను శిక్ష విధించిన వెనుక తగ్గించుటకు నా కధికారము లేదని తమకు తెలియదా?” యని ప్రశ్నించెను.

ఆ తపస్వి నవ్వి “ఓయి! వెర్రికుమారా! నాకుమాత్రము ధర్మశాస్త్రము తెలియదా? ఇదిగో సార్వభౌముని ఆజ్ఞాపత్రము” అని యొకతాటియాకు పత్రము తన కాషాయాంబరములనుండి తీసి యాతని కిచ్చెను. ప్రాడ్వివాకుడు దానిని కన్నుల నద్దికొని చూచి, లేచి, యిట్లు చదివెను. “ఏ దోషములేదని శోణనగ గ్రామకాపురస్తుడగు చంద్రస్వామిని మేము విడిచిపుచ్చుచున్నాము. ఇయ్యది ప్రాడ్వివాకునకు మా ముదల. స్వహస్త్రనామాంకిత శ్రీ కౌశికీపుత్రశ్రీముఖశాతవాహన మహాశ్రమణ శక 483 పరాభవసం.ర చైతు. సప్తమి” అని యున్నది. అప్పుడు చంద్రస్వామి ముందుకరుదెంచి ఆ భిక్షుకునకు సాష్టాంగ నమస్కార మొనర్చెను. అతని కన్నులలో నీరు సుడిగుండములై దొన దొన జారినవి.

15. శృంగార విభావము

కామవిజయ నాట్యము, కామవిజయనాట్యమే అయినది. సువర్ణశ్రీ ప్రప్రథమమున హిమబిందును ఆ నాట్యమునందు చూచినాడు.

ఎవరీ బాలిక? ఎంత అద్భుతసుందరి! ఈ బాలిక స్వప్నమూర్తియా? నిజమా? ఏ మహాశిల్పి మలచినా డీ విగ్రహమును! ఏ చిత్రకారు డీ రూపరేఖలు దిద్దినాడో?

ఆ ఆలోచన లాతనికి కొంత వ్రీడాభావ మంకురింపజేసినవి. ఆ బాలికను చూడలేడు, చూడక ఉండలేడు. అతనికి తక్కిన ప్రపంచమంతయు మాయమైనది. తనచుట్టును ఆ బాలికలు నృత్యముచేయుచు, పాడుచు, అభినయించుచుండిరి. కాని ఆతని కా ఒక్క బాలికయే నాట్యమాడుచున్నట్లున్నది! ఆమె మనోహర కాదంబినీమాలికవలె క్షణక్షణము సుందరాతి సుందరరూపముల మారుచున్నది. ఆమె పాల్కడలి వాగులవలె భంగికా మనోహర యగుచున్నది. ఆమె వివిధకరణ నిమగ్నయై కుసుమమున మంద మలయానిలయమైనది. ఉధితస్వర రాగకంఠియై ఆ బాల శారదా కరచామీకర విపంచియైనది. ఆమె భుజరేఖలు సువ్వున జారి అంగుళీ రేఖలో వికస్వరమైనవి. బాహుమూల పార్వ శోభారేఖలు వక్షోపరిసమున్నత సుందరాకృతులు తాల్చి, వక్రపతనా వేగమున డిగ్గనురికి మధ్యదేశమున నించుక కాలూని, మలుపులై నితంబచక్రముల సుళ్ళుతిరిగి ప్రవహించి, ప్రవహించి పదరేఖలు మొగ్గలు దొడిగినవి.

ఇది సౌందర్యమా, సౌందర్యమూలకారణమా? ఆతని హృదయ వేగమునకు శ్రుతియైనది హిమబిందు బాలికాచరణసువర్ణమంజీరవేగము. రెండు వేగములు? మహారభటితవృత్తులై లయించినవి.

మహావైభవమున భద్రదంతావళమున సర్వమంగళవాద్యములుమ్రోయ ప్రజానీక సేవితుడై ఊరేగి, ఇంటికి చేరినాడు సువర్ణశ్రీకుమారుడు. కాని సుందరాతిసుందరమూర్తి ఆ బాలికయే ఆతని సమ్ముఖమున ప్రత్యక్షము.

తెల్లవారునప్పటికి ఇంటికి చేరిన సువర్ణశ్రీకుమారునికి శక్తిమతీ దేవియు, నాగబంధునికా సిద్ధార్థినికలు, మహాలియు, పుణ్యాంగనలు, బంధు స్త్రీలు హారతులిచ్చి, దృష్టితీసి, లోనికి తీసికొనిపోయిరి. సువర్ణశ్రీ తలిదండ్రులకు, బందుగులకు పాదాభివందన మాచరించెను. రెండు దినములు గడచినవి. ఆతని పరధ్యానము తల్లిదండ్రులనే యాశ్చర్య పూరితుల చేసినది.

ఎప్పుడును శిల్పగృహమునందో లేక వ్యాయామప్రదేశములందో కాలము గడపువానికి బండిపందెముల గెలుపుచే నిప్పుడీ పరధ్యానమేమి అని ధర్మనంది యనుకొనెను. ధర్మనంది భార్యనుజేరి, “అబ్బాయి అట్లున్నాడేమి? కారణమేమో నీకు తెలిసినదా?” యని పలుకరించెను. శక్తిమతీ దేవి భర్తను కనుంగొని “నాకునూ ఆశ్చర్యము కలిగించుచున్నది. ఏమయియుండును? భోజనము తిన్నగా చేయుటలేదు. ఏవియో రెండు మెతుకులు నోటవేసికొని ఎక్కడెక్కడనో తిరుగుచుండును” అని ప్రత్యుత్తర మిచ్చినది. ధర్మ: ఇప్పుడు చిరంజీవికి మానసపథమున మహోత్కృష్టమగు మార్పు జరుగుచున్నదని నా తలంపు. పందెములకు బోయి నెగ్గివచ్చినాడు. బాహుబల గర్వమొందుట కంతకన్న ఏమికావలయును? దేహబలమునకు, ఆయుధవ్యాపారమునకు దగ్గరిబంధుత్వము. యుద్ధములో కీర్తిగొనుట సురాపానము నట్టిది. ఆనా డనేక బిరుదావళులు ధరించిన మేటి మగలగు శూరుల చూచినాడు. తానును జయశీలుడైనాడు. ఆ సమయము నందు వారివలె యుద్ధమున పేరుమోసి మహాసైన్యాధ్యక్షులలో నొకడేల కాకూడదు? ఈ ఆలోచన లొకపాయయై ప్రవహింప వీనికన్నిటి కతీతమై పవిత్రమై, బుద్ధదేవునకు ప్రియమై వెలుగునది, అర్హతమార్గములలో నొకటి యైనది, తానుచేయు శిల్పపుపని. ఈ రెంటికిని ఇప్పుడు సమరము జరుగుచున్నది. అబ్బాయిని మారదేవుడు పరీక్షించుచున్నాడు. ధర్మనంది ఇట్లు మాట్లాడుచు నిమీలితలోచనుడై ఒక లిప్తకాలముసర్వము మరచిపోయెను.

శక్తి: తామిట్టి సమయమం దూరకుండుట న్యాయమా?

ధర్మ: (కన్నులు తరచి) వెఱ్ఱిదానా! ఎవరియుద్ధమున వారు జయమందవలయును. “తేజోమూర్తి” కెవ్వరు సహాయము చేసినారు? చైత్యముపై నేను రచించిన మారుని కథాశిల్పము చూడలేదా? అబ్బాయికి రెండు మార్గము లిప్పుడు గోచరమైనవి. ఒకటి ప్రాపంచికము: పూలవాసనలు, సెలయేటి గానములు, నీలగిరి రూపసౌందర్యములు, కాంతామనోహరవాక్యములు, సువర్ణముల తళుకులు, నాట్యముల ధిమికిటలు, నవ్వులు హాస్యములు సుడిగాలి రీతి, సుడిగుండములవలె మనస్సును భ్రమింపజేయును. ఇంకొకటి: నిమీలిత నేత్రములు, ఆరాధనలు, ఉపవాసములు, దానములు, యాత్రలు, భిక్షులతోడి సాంగత్యము, ఇది చిత్తసమాధిగూర్చును. బిడ్డ డీ రెంటిలో దేనిని వరించునో?

శక్తి: ఎవరైన చేయూత నీయకపోయిన. అబ్బాయి పని యేమగును?

ధర్మ: ఎవరికర్మకు వారే కర్తలు. నీవు చదువుకున్నదానవు. ఈ మాత్రము తెలియదా? దశకుశలములు, అష్టమార్గములు మానవుడాచరించునపుడు, అరిషడ్వర్గముల జయించుటకు సమర్థుడు కానిచో ఏరును సహాయము చేయజాలరు. కాముడు, మోహుడు మనుష్యు నవలీలగ తమబానిస జేసికొందురు. చిరంజీవి యీ యుద్ధమున పందెములలో వలె విజయముగాంచెనా మన కులము తరించును. లేదా....

శక్తి: మన మిందు చేయదగినది లేదందురా?

ధర్మ: భగవంతుని ప్రార్థించుటయే! ఆ “విజ్ఞానస్వరూపుడు” బోధిసత్వుడు భక్తుల సంరక్షింపలేడా!

నాగ: అమ్మా! మేము మాట్లాడుటకు బోయినప్పుడు మాతోడను యథాప్రకారము పలుకలేదు. పరధ్యానము! నాల్గయిదుసారులు ఎదియోచిత్రము లిఖించబోయినాడు. అది తాననుకొన్నట్లు లేదనియో ఏమో చెరిపి వేసి ఫలక మొకమూల పారవేసినాడు.

సిద్ధార్థినిక: అమ్మా! ఒక్కబొమ్మలు వేయుటే కాదు. విగ్రహము కూడా చెక్కుట ప్రారంభించినాడు. ఒక బాలికరూపమే! కాని తృప్తి గూర్పకకాబోలు, ఆ విగ్రహమును విసుగుదలతో వేయిముక్కలు చేసినాడు.

ఇంతలో మహాలి తన చీరకుచ్చుల మడతలలో ఒక విగ్రహశిరస్సు గొనివచ్చి శక్తిమతీదేవికిచ్చి చిరునవ్వు నవ్వెను. నాగబంధునిక యా శకలవను తేరిపారజూచి “అమ్మా యీ ముఖము ఎవరిదో నేను చూచినట్లున్నది! ఎవరు చెప్పుమా?” యని తలపోయ జొచ్చెను. అప్పుడు తొమ్మిదేండ్ల బాలికయగు సిద్ధార్థినిక ఒక్క గంతువేసి చప్పట్లు “ఆఁ నాకు తెలిసినది! మీరు చెప్పుకొనండి!” అని కిలకిల నవ్వెను.

శక్తిమతీదేవి యా రాతితలను తదేకదృష్టితో తిలకించి “యీముఖము నా బాల్యస్నేహితురాలగు ప్రజాపతిమిత్ర మోమువలె నున్నది” యనెను. అప్పుడు మహాలి “ఆఁ తెలిసినదమ్మా తెలిసినది. చారుగుప్త కోటీశ్వరునితనయ, ప్రజాపతిమిత్ర కొమరిత, హిమబిందుకుమారిక మోము. మొన్న ఉత్సవమునాడు అబ్బాయికి బహుమాన మిచ్చినప్పుడు నాట్యమాడిన బాలలలో హిమబిందు కుమారిక యొక్కతె” అని సాభిప్రాయముగ నవ్వుచు నామె యేమియో చెప్పబోవుచుండ, సిద్ధార్థినిక మోము చిన్నబుచ్చుకొని కన్నుల నీరు తిరగ “నన్ను చెప్పనీయక మీరందరు చెప్పుకొనుచున్నారు. ఈ మహాలి మంచిది కాదు. మీ ఎవరి జత ఉండను” అని మూతిముడుచు కొని గబగబ పరుగిడి పోయెను.

ఆమె యట్లు శిల్పమందిరములున్న తోటలోనికిబోయి యొక కేళాకూళికడ పూలవృక్షములున్నచోట పండుకొని వెక్కివెక్కి ఏడువజొచ్చెను. ఇంతలో సువర్ణశ్రీకుమారు డామెను చూసి, చెల్లెలినెత్తి తనయొడి జేర్చు కొని, చెక్కిలి ముద్దుగొనుచు కంట నీరుతుడిచి బుజ్జగింపుచు “ఏవమ్మా చిట్టితల్లీ! ఏమిటి యీ ఏడుపు? అమ్మ కూకలువేసినదా? లేక అక్క కలత పెట్టినదా?” అని ప్రశ్నించెను. సిద్ధార్థినిక మరియు వెక్కి వెక్కి యేడువసాగెను. అన్నగారు పరిపరివిధముల బ్రతిమాలి ఎత్తుకొని తీసికొనిపోయి తాను తన చెల్లెలికై చెక్కిన యొక బాలకుని బొమ్మను, ముద్దులమూట గట్టుదానిని, కిలకిలనవ్వు మోముగలిగిన ప్రతిమను ఆమెకిచ్చి “ఇదిగో నీ అబ్బాయి బొమ్మ ఆడుకో. ఏడవకు. అక్కకు, ఎవ్వరికీ ఈయకు” అని ఇచ్చెను. తోడనే కళ్ళనీళ్ళు తుడుచుకొనుచు ఆ బాల చిరునవ్వు నవ్వుచు “ఈ అబ్బాయిని అక్కయ్యను, అమ్మను ఎత్తుకోనివ్వనులే. మహాలికి కొంచెమైనా చూపించను. నేనే నీళ్ళు పోసుకుంటాను, నగలు పెట్టుకొంటాను. మరే అన్నా! నీవు చెక్కిన బొమ్మ తలకాయ వాళ్ళమ్మాయి హిమబిందుదని నేను చెప్పబోతుంటే వాళ్ళే చెప్పుకొని నాకు కోపం తెప్పించినారు!” అని యా వెఱ్ఱి బాగుల శిశువు అన్నగారికి చెప్పెను. సువర్ణశ్రీకుమారు డామాట వినుచునే ఉలికిపడెను. చెల్లెలిని సాగనంపి అక్కడనున్న యొకరత్న కంబళిపై చతికిలబడి యదేవిధముగ నాలోచింపసాగెను. ఉజ్వల సువర్ణవర్ణుడగు నాతని కపోలము లెఱ్ఱబారెను.

16. హృదయ కుసుమపరాగము

ఆ బాలిక హిమబిందు. ఎంత చక్కని పేరు! స్నిగ్ధ శ్వేతకాంతి భాసమాన హిమబిందువా ఆ బాల! ఆ తెలుపు ఎరుపులు ఔత్తరాహికములు. ఆమెలో గాంధార రక్తమున్నది. రోమక, యవన జాతులు ఆర్యరక్త సమ్మిశ్రితములై, మహోత్తమమూర్తి తాల్చినట్లున్నవి. ఎవ్వ రాబాలిక? ఏ రాజతనయ? ఏ నందనవనమున అవతరించినదో! ఎంత హొయలున్నది యామే కదలికలో! ఆమె అద్భుతనాట్యనిమగ్నయయ్యు తన్నంతతీక్షణముగ గమనించినదేల? సాకూతములగు ఆమెచూపుల కొన్నింట ఎన్నియో ప్రశ్నలున్నవి. ఆమె కన్నులు! ఏ శిల్పియైన వానిని విన్యసింపగలడా? ఆ కన్నులలో వేయితారకల కాంతులు, ఆమె కనురెప్పలలో పదివేల గగననీలాలు, ఆ బొమలలో వేయి యమునానదీ ప్రవాహధారలు, ఆమె అపాంగములలో లక్ష కల్లోల నర్తనములు, ఆమె భ్రూభంగిమలలో కోటి ఇంద్రధనువు లున్నవి. ఆమె కనీనికలలో మహాపద్మనీల పథము లున్నవి. ఆమె ఎవరు?

తన శిల్పమున నా బాలికమోమును వారెట్లు గ్రహించిరి? తనకు పోలిక లేనట్లే కనబడెనే! ఆమె రూపమును తన అల్పశక్తి కళగట్టింప గలదా? తన కళానైపుణ్యము మంట గలిసెనా? అయోఘనము తప్పి జారి చేతికి రెండుమూడుసార్లు దెబ్బలు తగిలినవి. టంకము చేతపట్టినప్పుడు చేయి వణికిపోయినది. తద్రూపభావనామాత్రమున తనలో నింతటి వివశత్వమునకు గారణమేమి? తన వారితో కూర్చుండి సల్లాపము లాడలేడు, తానొంటిగ నుండలేడు. వేసవిని మిట్ట మధ్యాహ్నమున గాలిలేని సముయమున నిద్రయు పట్టదు. మేల్కొని యేపనియు చేయజాలడు. తన మానస పథమందు గాలివాన లేవైన రాబోవు చున్నావా? నిశ్చల శీతలమందాకినీ తుషారము లెక్కడున్నవి? గంటలకొలది ఇటునటు తిరిగినను తన హృదయమునకు శాంతి కలుగదు. గ్రంథములు చదువుటకు మనస్సుపోదు. పెద్ద చెల్లెలి వీణాగాన మాలకించుచు ఆ స్వనముతో శ్రుతిగలిపి మనోహర గాన మొనరించు దైనందినమగు అలవాటు తనకు నేడు అసహ్యమయినది. ఆతని ఆలోచనలు వాయుద్వంద్వపాతములైపోయినవి.

ఇంతకు ఎవ్వరాబాలిక? చెల్లెలి నడుగ సిగ్గు. తనకు సిగ్గెందుకు? నాగబంధునిక ఏమయిన ననుకొనునా? ఏమనుకొనగలదు!

అతడు కృష్ణ ఒడ్డున కూర్చుండి, మధుమాసవిరహకృశయగు నాధునీ బాలిక నిట్టూర్పుల నాలించుచు, దూరపుకొండల గమనింపుచు, నదీ గర్భమందెల్ల నావరించి యున్న ఇసుకతిన్నెల చూపులేని చూపులతో చూచుచు హిమబిందునే తలపోయుచు కూరుచుండెను.

ఇంతలో నాగబంధునిక వచ్చి యన్నగారి కన్నులు మూసెను. సువర్ణశ్రీ “నాగా చేతులుతీయవే!” యని విసుగుకొనెను.

“అవును! హిమబిందువే లోకమైపోయిన అన్నగారికి చెల్లెలంటే విసుగుకాదా మఱి?”

“ఏమి మాటలవి నాగా! ఇంతట చాలించు.”

“అదుగో! కోపంకూడా వస్తున్న దన్నాయికి. అంత ఉలుకయితే పోనీ మాటాడనులే.”

“అవేమిమాటలే! ఏదోవిసుగున అన్నానే తల్లీ! ఇంతలో కోపమా?”

“నాకు ఎంత కోపముగా ఉన్నదో తెలియునా? నా స్నేహితురాలు, చారుగుప్తులవారి కొమార్త, తల్లిలేని పిల్ల, ముక్తావళీదేవి మనుమరాలు ఆ హిమబిందునుగూర్చి ఇన్నాళ్ళకా మా అన్న తెలిసికొన బ్రయత్నించుట అని. మా అన్నను, ఆ హిమబిందు తలలోనిపూలతో కట్టవలెనని ఉన్నది”

“ముక్తావళీదేవికి అంత స్వచ్ఛదేహం ఉన్నది. ఆమె తెలుగుజాతి ఆడ బిడ్డయేనా చెల్లీ?”

“ముక్తావళీదేవి యవనవంశ జాత అన్నా! ఆమెపోలిక హిమబిందు. హిమబిందు తన అమ్మమ్మకన్న ఎక్కువ స్వచ్ఛమైన శరీరము, అద్భుతమైన అందమును కలది. ఆమె హృదయము మా అన్న దొంగిలించినట్లు నా అనుమానము ఎక్కువౌచున్నది, అట్లాంటి దొంగతనాలకు రాజసభలో దేశాంతరవాసము విధింపబడుచున్నది. దొంగ అన్నగారూ!”

“ఏమిటి నాగా! నీకు నిజముగా పిచ్చి ఎత్తినది. కులవైద్యులు, ప్రఖ్యాతులు, అపర ధన్వంతరులు, ఆనందులవారు నీకు మందు త్వరగా ప్రారంభించగలరు. సేవకుని పంపి వారిని త్వరగా రమ్మని వార్తనంపవలసి ఉన్నది.”

“మా అన్నగారికే మతిభ్రమణము కలిగినది. ఉత్తమశిల్పి బ్రాహ్మణ వంశజాతుడైన మా అన్న యవనవంశజాతను ప్రేమించుటేమీ?”

“ఓ భగవానుడా! నేను ఎక్కడికైన పారిపోవలసి ఉన్నది!”

“ఓ మాయాదేవీ, ఈ దీనురాలి ఇక్కట్లు తొలగింపవా?”

“చెల్లీ! నీవును, హిమబిందును కలిసి చదువుకొన్నారా?”

“ఆమెయు, నేనును కలిసి చదువుకొన్నాము. ఆమె కోటీశుతనయ”

“ఆమెలో భారతజాతి సుగుణములు, యవనజాతి సుగుణములు మేలు కలయిక పొందినట్లున్నదే!”

“అన్నా! బాలికలలో సామ్రాజ్ఞిని నా అన్న వరించవలె! జయములలో అఖండ విజయము నందవలె. ఆ దినమున నీ చుట్టూ మేమందరమూ నాట్యము సలిపినప్పుడు, హిమబిందు నీవంక అట్లు తదేకదీక్షను చూపులు పరిపినదేమి? చారుగుప్తుని బండిని సమదర్శి శాతవాహన సేనాని తోలినారు.

ఆయన నీవల్ల ఓడిపోయినారు. అందుకని ఆమె కొంచెము కించపడినది కూడ సుమా!”

“ఆమె దేవలోకమునుండి దిగివచ్చిన ఇంద్రాణివలె లేదటే తల్లీ!”

“నీవు ఇంద్రునివలె లేవా ఏమి?”

“సరి! సరి! అదేమి మాటలే?”

ఇంతలో సిద్ధార్థినిక వారిరువురు కూరుచున్న నల్లరాతి బండకడకు పరుగునవచ్చి వగర్చుచు, నవ్వుచు, “అన్నా! వచ్చినది! వచ్చినది!” అని అరచెను.

సువర్ణ: ఎవరు తల్లీ?

సిద్ధార్థినిక: హిమబిందు! హిమబిందే!

నాగబంధునిక: హిమబిందా!హిమబిందు ఎందుకువచ్చునే వెఱ్ఱి తల్లీ!

సిద్ధా: నేను వెఱ్ఱితల్లిని, నీవు తెలివిగల తల్లివి, పోనీలెండి. నా మాట ఎవ్వరును ఎప్పుడును నమ్మరు.

సువర్ణశ్రీ చిన్నచెల్లెలిని దగ్గరకు తీసికొని, “ఓసి బంగారుతల్లీ, అక్క వెండితల్లికాదూ? వెఱ్ఱితల్లి! నీమాటే నిజము! నాగా! నీ కొరకే వచ్చి ఉంటుంది. వెంటనే పో!”

నాగబంధునిక చఱ్ఱున పరువిడినది.

సువర్ణ శ్రీ గుండియలు గతులు తప్పి నడచినవి. ఏమది, ఆ దివ్య బాలిక ఎందుకు వచ్చినది? ఆ దేవీమూర్తి తన ఇంటికే వచ్చినదా? తన ఇల్లు పవిత్రమైనదా? ఓహో ఆమె వచ్చునా? నిజమా!

“అన్నా! హిమబిందు, ఆమె అమ్మమ్మ ముక్తావళీదేవి వచ్చినారు. రాగానే, హిమబిందు అక్కను అడిగినది. నాయనగారి బొమ్మలన్నియు చూడ వచ్చినదట. నన్ను కొంచె మటు తీసికొనిపోయి, “మీ అన్నగారు బొమ్మలు చెక్కునా?” యని యడిగినది.” “అలాగునా చెల్లీ!”

“అవును, నీ చెక్కడాలు చూచునట అన్నా! నాతోనే చెప్పినది. రా; నీ మందిరానికి పోదము రా, అన్నా!”

సిద్ధార్థినిక అన్నను చేయిబట్టి లాగినది. అతనికి ఏదియో భయము, ఏదియో ఆశ, ఏదియో త్రప కలిగినవి.

“చెల్లీ! నీవు పో! నేను వచ్చెదనులే!”

“అన్నా నీవు త్వరగా రావాలి.”

సిద్ధార్థినిక వెడలిపోవగనె, రేఖారహితమైన యాలోచనలు, మూర్తిరహితమగు స్వప్నములు అతని హృదయమున జన్మించుచున్నవి, మాయమగుచున్నవి.

ఆతడు వేయలేని బొమ్మలు, పాడలేని గీతాలు దూరాకాశనీలపథాలలో మేఘములై మందమందగతి పోయి మాయమైనవి.

17. హిమబిందుకుమారి

సమదర్శిశాతవాహనుడు మహారాజువంశమువాడు. సమదర్శితండ్రి ప్రియదర్శి శాతవాహనుడు. ఆతడు శ్రీముఖశాతవాహనుని తండ్రియగు అభయ భాహుశాతవాహనుని పినతండ్రి మనుమడు.

శాతవాహనులు ప్రాచీనకాలమందుననే ఆంధ్రదేశానికి ఉత్తరము నుండి ప్రయాణమై వచ్చిన బ్రాహ్మణులు. భారతయుద్దమైన వెనుక, దేశమున అనార్య జాతులవారైన నాగులు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, వానరులు, పిశాచులు, గుహ్యకులు మొదలగువారు విజృంభించి రాజ్యము లెన్నియో యాక్రమించు కొనిరి. ఆ దినములలో ఆర్య సంప్రదాయములపై అసహ్యత జనించి, సాంఘిక దురాచారాలను ఖండించి, సంఘసాంప్రదాయములందు ఎందరో మార్పులు తెచ్చినారు. అట్టి వారిలో విశ్వామిత్ర సంతతివారయిన ఆంధ్ర బ్రాహ్మణులను చంద్రవంశ క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలగువా రుండిరి. వారందరు శైవపూజాధురంధరులు.

ఇట్లు కొన్ని సంవత్సరములు గడిచిన వెనుక పరీక్షిన్మహారాజు రాజయ్యెను. ఈయన పూర్వసంప్రదాయగాఢాభిమాని. పరీక్షిత్తు చండవిక్రముడై విజృంభించి అనార్షోద్యమ భూయిష్టములగు రాజ్యముల నాశము చేసి, వైదికాచారము పునరుద్ధరించి అనేకాశ్రమములలో యజ్ఞయాగాది క్రతువుల నొనరింపజేసి, తా నొనరించి నాగాదిజాతుల పొగరణచి వైచెను.

ఆతని దాడుల భరింపలేక ఆంధ్రులు కళింగదేశము వలసవచ్చిరి. ఆర్య జాతులవారైనను వారు అనార్షవాదులైనందున పరీక్షిత్తు వారిపై దండయాత్ర సలిపి, ఓడించి, దేశమునుండి తరిమివేసెను.

తూర్పు సముద్రతీరమున నదివరకే సింధునదీ ప్రాంతమునుండి రామాయణ కాలమునకు ముందుగనే వలసవచ్చియున్నవారు అసురులు. రాజ్యములు, ఆశ్రమములు స్థాపించి, ఆ తూర్పు తీరాననే పట్టణములు నిర్మించుకొని నాగరికత వృద్ధి చేసికొని యుండిరి. అసురులు హిమవన్నగ ప్రాంతీయులైన ప్రథమార్యులు. వారు హిమ వన్నగజములైన సింధు గంగా యమునా నదితీరముల మహానగరములు నిర్మించుకొని అచ్చటనున్న పచ్చిపొలసుదిండ్లను, నరమాంసభక్షకులను దక్షిణ దేశములకు దరిమి, యాప్రదేశములను లక్ష్మీపదముల గావించిరి.

ఆ అసురులకు తర్వాత హిమశైలీయులైన ఆర్యులు దక్షిణమునకు వలస వచ్చి, అచ్చట ఇదివరకే రాజ్యములు స్థాపించియున్న అసురులతో ఘోర యుద్ధములుచేసి, వారిని సింధునదీతీరమునుండి తరిమివేసిరి. అసురు లక్కడనుండి కదలి మెసపొటేమియా, ఈజిప్టులకు, భరతఖండ ప్రాకృశ్చిమ దక్షిణ తీరములకు సముద్రయానము చేయుచునో, తీరములవెంట ప్రయాణము చేయుచునో వచ్చి వలసలుపోయి రాజ్యము లేర్పరచుకొనిరి.

పరీక్షిత్తు కాలమున తూర్పుతీరములకు వచ్చిన ఆంధ్రార్యులు అదివరకే పూర్వ సముద్రతీరమున వాసముచేయు అసురార్యులతో యుద్ధములు సలిపి, అసురరాజుల నిర్జించి తామురాజులైరి. ఆ కాలముననే ఆంధ్రవిష్ణువు గాథ జన్మించినది.

ఆంధ్రవిష్ణువు వంశమువారే ఆంధ్ర శాతవాహనులు. ఈ గాథయే బృహత్కథయందు వర్ణితమైనది.

ఆ శాతవాహనవంశమందు ప్రియదర్శి తన పెదతండ్రికొమరుడును చక్రవర్తియు నగు అభయబాహునకు దక్షిణబాహువై, చండవిక్రముడై, మహాసేనాధిపతియై ఆంధ్ర రాజ్యము పడమటి తీరమునుండి ఉత్తరమున ఘూర్జరమువరకు గొనిపోయెను. మాళవము జయించి ఆంధ్రరాజ్యములోజేర్చెను. అభయ బాహువు ప్రతిష్ఠానమున ప్రియదర్శి శాతవాహనునే తనకు బ్రతినిధిగ నుంచెను.

ఆ దినములలో కోటీశ్వరుడగు వినయగుప్తుడు అభయబాహు సార్వభౌమునకు వామహస్తమై, తన వైభవమంతయు చక్రవర్తికి దాసిని జేసెను. ఆతడు ప్రియదర్శి శాతవాహనుని ఎక్కువగా ప్రేమించి ఆతని జైత్రయాత్రలలో సర్వవిధముల బాసటగా నుండెను. ప్రియదర్శిని ప్రేమించుటతో తృప్తిపడక తన కొమార్త అమృతలత నా వీరపుంగవునకు కన్యాదాన మొసంగెను.

సమదర్శిశాతవాహనుడు ప్రియదర్శికి ఏకపుత్రుడు. అమృతలతాదేవి కుమారుని యందు గాఢప్రేమతో, మాళవయుద్ధమందు వీరస్వర్గమందిన ప్రాణేశుడగు ప్రియదర్శిని తలంచుకొని ఆంధ్రసైన్యమునందు చేర సుతుడనుజ్ఞ వేడినప్పుడు సమ్మతినొసంగ నిరాకరించినది.

సమదర్శికి పదునేడవ ఏడు వచ్చినది. ఆయేటి మహాలయపక్షములలో అన్నగారి భవనమునకు కుమారునితో బోయిన అమృతలతాదేవికి స్వప్నమందు ప్రియదర్శి ప్రత్యక్షమై, “ఆత్మేశ్వరీ! నా పేరునకు, నాజాతికి, శాతవాహనవంశానికి అపఖ్యాతి తెచ్చుచున్నావా? ఇది నీకు ధర్మమా?” అని ప్రశ్నించుచు విచారవదనమున కనబడినాడట.

అంతియ. అమృతలతాదేవి ఆ మరుక్షణమునుండి సంపూర్ణముగ మారిపోయి, కుమారునికి సైన్యమునజేర ననుమతి యొసంగుటయేగాక, స్వయముగా శ్రీముఖచక్రవర్తి కడకుబోయి సమదర్శిని వేయికన్నుల గాపాడవలసినదనియు, నాతనికి సైన్యమున ముఖ్యోద్యోగములనిచ్చి యా బాలుని తండ్రియంత వాని జేయవలయుననియు బ్రార్థించెనట. సమదర్శి మరునాడు దళపతిగా ఆంధ్ర సైన్యములలో జేరినాడు. ఒక సంవత్సరములో నాతడు ముఖపతియు, గణపతియు, వాహినీపతియు నైనాడు. మరు సంవత్సర మాతడు చమూపతియైనాడు. మొదటినుండియు ననేక యుద్ధముల వీరవిక్రముడై యాంధ్ర సైన్యములకు యశము సముపార్జించుచు నేడు విఖ్యాతినందిన ఉపసేనాపతులలో నొకడైనాడు. ఆతడు తా నెప్పుడు సేనాపతియగుదునా, ఉపసైన్యాధ్యక్షుడ నగుదునా, సర్వసైన్యాధ్యక్షుడనగుదునా, అందులకు తన మేటిమగటిమి చూపు సందర్భ మెప్పుడువచ్చునా యని ఎదురుచూచుచున్నాడు.

సమదర్శి తిన్నగా ఒకనాడు చారుగుప్తుని భవనమునకు పోయెను. తన మేనమామ కోటీశ్వరులలో కోటీశ్వరుడు. ధనము మాట యటుండ ప్రపంచమున ననన్యలభ్యమగు మహారత్నమువంటి సుందరాంగికి జనకుడు. మేనమామ కుమారిత ధర్మశాస్త్రప్రకారము తన స్వత్వము. హిమవంతుని తనయను కైలాసనాథుడు వివాహమాడినాడట. సముద్రుని పుత్రికను, సముద్రమున వసించు వటపత్రశయను దుద్వాహమయ్యెనట. చిన్న తనముననుండి తాను హిమబిందుతో ఆటలాడుకొన్నాడు. ఆమె “నాకిదికావలె” నని యనినంత తా నది తెచ్చినాడు. ఒకసారి యామె కృష్ణానది కావలియొడ్డుననున్న పచ్చ తురాయి పూలగుత్తులు పట్టుకొని రమ్మని నప్పుడు, తాను పదునారేండ్ల యీడువాడై యున్నప్పుడు, కృష్ణానది నీది ఆపూలు తెచ్చి యిచ్చినాడు. హిమబిందు తన్నెంతో మెచ్చుకొని “బావా! నీయంత గొప్పవా రెవరునులేరు నేను నిన్నే వివాహమాడెద “నని తన మెడచుట్టును బాహులతల పెనవేయలేదా? ఆనాటి కౌగిలింత యిప్పటికిని మధురస్మృతియై మరపునకురాదు. తాను బాహుబలమున అసమానుడు. తనవంశము అనేక తరములనుండియు ప్రసిద్ధికెక్కిన శాతవాహనవంశము అతిరథశ్రేష్ఠుడైన ప్రియదర్శి తన తండ్రి. తాను సేనాపతి. నేట రేపట ఉపసేనాధ్యక్షపదము, సర్వసేనాధిపత్యము, ఆ వెనుక?

ఈ ఆలోచనలు కన్నులకొక కాంతి నీయ, మోమున కొక విలాసముగూర, మూర్తికొక ఠీవి జేర్ప, గుఱ్ఱమును మంద మందగతుల నడుపుకొనుచు సమదర్శి శాతవాహనుడు చారుగుప్తుని సౌధము సమీపించెను. కోటవలెనున్న యా భవన ముఖ ద్వారము సమీపించగనే గుఱ్ఱముస్వారితో పోవుటకు మహాతోరణ వామ కవాటమును మాత్రమే ద్వారరక్షకులు తెరచిరి. స్వారిచేయుచునే సమదర్శి నిస్సరణము దాటి ద్వితీయ ద్వారము కడచి ప్రాంగణము జేరునప్పటికి అశ్వరక్షకులు గుఱ్ఱము కళ్ళెమును పట్టుకొన, సమదర్శి అవరోహణ మొనర్చుచు పగ్గపు త్రాడు వారికిచ్చి పాదరక్షలు చప్పుడుకా, మీసములు వడివేసికొనుచు, సభాశాల దాటి అభ్యంతర గృహములోనికి బోయెను.

అట్లు నడచి నడచి ప్రతిహారుల నమస్కృతులందుకొనుచు ఆ సౌధశాలలకు, అందున్న సమస్తమునకు ప్రభువునా విస విస నాతడు లోనికి జనెను. ఒక మందిరముకడ ఆగి, పాదరక్ష వదలి, యచ్చట నున్న పరిచారికతో తనరాక చెప్పిపుచ్చి అనుమతికై నిలిచియుండ ఆమె లోపలికిబోయి ఒక క్షణములో మరలివచ్చి “రావచ్చు” నని తెల్పెను.

సమదర్శిశాతవాహనకుమారుడు ప్రవేశించిన గృహము వైకుంఠమున లక్ష్మీదేవి నివసించు మందిరమువలె ప్రకాశించినది. బంగారముతో, దంతముతో, చందన తరువులతో నిర్మించిన పీఠములు, మంజూషలు, కాశ్మీర దేశపు కంబళ్ళు, సహ్యాద్రి పులుల, హిమవన్నగ శ్వేతచమరీమృగముల, వింధ్యాటవీ సింహముల, కామరూప ఖడ్గమృగముల, హిరణ్యద్వీప మార్జాలముల చర్మములతో సొగసుగా నమర్చిన మెత్తటి చర్మములు, శ్రీకాకుళ పల్యంకపురముల అద్దకములు, లిచ్ఛవీదేశ దుకూలయవనికలు, బ్రహ్మదేశమునుండి వచ్చు తళతళలాడు నొకరకము గడ్డి అల్లికలు, ఎచ్చటచూచిన కన్నులకు పర్వ మొనర్చుచుండెను. సర్జరసము, మల్లిగన్ధి, జోంగకము, శ్రీవాసము, జాయకము మొదలగు సుగంధముల తయారుచేసి యందుగు బంకతో మోటుపల్లి సన్నని వలిపములకు పులిమిచేసిన ధూపకళికలు హృదయము మత్తుగొలుపు సువాసనాధూమములను మందిరము నెల్లెడ విరజిల్లుచుండెను. ముత్యముల జాలరులు, నవరత్నములు పొదిగిన ఉపకరణము లెల్లయెడల చెన్నారుచుండెను.

18. చారుగుప్తుని ఎత్తు

ఇక అభ్యంతరమందిరమున, అమూల్యమగు నొక పర్యంకము పై తూలికల పానుపుపై ఉపధానముల నానుకొని ఊర్వశివలె బంగారుమేని జిగితో గాత్రానులేపనములు మెరుపులీన, ఒయ్యారమున హిమబిందుకుమారిక చెలులు వింజామరలు వీవ అధివసించి యుండెను. మేనబావ వచ్చుటయు దాపుననున్న నొక పీఠము పై కూర్చుండుమని సైగచేసి యా బాల “కుశలమా?” యని ప్రశ్నించెను. ఆమె కటిప్రదేశముచుట్టును అంతరీయము మనోహర నీలవర్ణముల జెలువారుచు నీటిమూట యుబుకుల మడతలలో శృంగారరేఖల కుచ్చులతో చెన్నారియుండెను. గంభీరవక్షోజములు పొగమంచులోనుండి అస్పష్టముగా గోచరించు బంగారుకొండలవలె ఊర్పులకు పొంగుచు, తగ్గుచు సుచేలవినీత బద్ధములై యుండెను. మంజీరములు కింకిణిద్వయములు నూపురములు పాదకటకములను, ఆమె పాదములకు మహత్తర హిరణ్యపూజ లర్పించినవి. వెలలేని హారములు శంఖమునుచుట్టిన ప్రవాళలతలవలె మెడను చుట్టి వక్షోజోన్నతతలముల పై వ్రాలి మిలమిలలాడుచుండెను. మణులు పొదిగిన మేఖల ఆమె నెన్నడుము క్రింద స్వర్ణదీ భాసమానమై వంకర వంకరల చుట్టి ప్రవహించు చుండెను. బాహుపురులు వేయి శిల్పవిన్యాసములతో నామె బాహువుల జుట్టి సౌందర్యతత్వోపదేశము నందుచున్నవి. నవమణివలయిత నీలరత్నలలాటికము రతీదేవి హృదయమై వలపుమంత్రములు జపించుచున్నది.

ఆమె కీ నగలున్నను, లేకున్న నొక్కటే! ఆమెయందము అకుంఠితము, అనన్యము, అప్రతిమానమునై నగలకే నగయైనది.

క్రీగన్నుల బావగారిని జూచుచు, మృదులాధరోష్ఠకాంతులు ప్రసరింప నెమ్మదిగ తాంబూలము నములుచు, విలాసముగా ముంగురుల సవరించుకొనుచు, బాలచంద్రుని శిశుకిరణములవంటి వ్రేళ్ళతో పూలచెండుల దొర్లించుచు “బావా! యుద్ధ వార్తలు చెప్పవూ?” అని ప్రశ్నించెను.

“సుందరీసామ్రాజ్ఞియైన మరదలు చెంతకువచ్చినపుడుగూడ యుద్ధ వార్తలేనా? లోకమోహనమైన నీ సౌందర్యమును జూచుచు ముగ్ధయైపోయే నా మనస్సు ఇతరాలోచనలకు చోటిచ్చుట లేదు.”

“బావా! నీవంటి మహావీరులకు, యుద్ధములని, సైన్యములని, గుఱ్ఱపు పందెములని యుండవలెనుగాని స్త్రీ సౌందర్యవర్ణనముతో ప్రొద్దుపుచ్చుట నిరర్థకులగు కవుల పని.” “ఆ! మరల మొన్నటి పందెములమాటజ్ఞప్తికి తెచ్చుచున్నావు. నే నా నాడే చెప్పితిని గదా? వాని కేవో శాంబరమంత్రాలు వచ్చియుండవలెను. కానిచో కామందక కులపాలకులకు ఓటమి యేమిటి?”

“అయితే, ఆ మంత్రం నీమీద ప్రయోగించెనా, కామందక కుల పాలకముల మీదనా?”

సమ: “అదుగో, దోషమంతా నాదేనని తేల్చుచున్నావు. రౌతుకొద్దీ గుర్రమనేమాటనిజమేగాని, బిందూ! నేనీవేళకొత్తగా సారథ్యంచేసినానా? ఇదివఱ కెన్నడైనా అపజయ మెఱుగునా నీ బావ?”

సరే నీమాట ఎందుకు కాదనవలెను? ఓటమికి నేనే కారణము. నీవంటి సౌందర్యరాశిమాట కెదురాడడం సరసత్వం కాదు.”

హిమ: సర్వ సైన్యాధ్యక్షులు కావలసిన మా బావగారింతలో ఎంత అల్ప సంతుష్టులైనారు. సరసాగ్రేసరు డనిపించుకోవడంతో తృప్తిపడతావా? బావా?

సమ: బిందూ! నీయెత్తిపొడుపు లెన్నటికీ చాలింపవా? నీకు సంతోషం కూర్చలేని శౌర్యము, పరాక్రమము, సైన్యాధ్యక్షపదవీ నాకెందుకు? చిన్ననాటి నుంచి మనమాడుకొన్న ఆటలు, పాటలు, మనము పెంచుకొన్న నెయ్యము, ఇవన్నీ ఇలా మఱచిపోయి, నాఆశలన్నిటినీ యిలా నట్టేటకలుపుతా వనుకోలేదు.

హిమ: అదుగో! నీకు కోపం వచ్చినది. నా పెంపుడు వృషభము లోడిపోయినవిగదా అనే విచారంకొద్దీ నే నేదో అన్నానుగాని, నీ శౌర్య సాహసాలు నే నెరుగునా బావా? ఆంధ్రసామ్రాజ్యవైరులకు గుండెలో బల్లెమనే కీర్తి ఇంత చిన్నతనంలోనే సంపాదించు కొన్నావు. ఆంధ్రజగతి యావత్తూ నిన్ను చూచి గర్విస్తున్నది. ఆశలన్నీ నీమీద పెట్టుకొని ఉన్న అత్తయ్య నీ వీర వినోదములు విని ఉప్పొంగిపోతున్నది. నువ్వు కాగలవాడవూ, కీర్తికాముడవూ అనియే బంధువులు, స్నేహితులమంతా ఎంతో సంతోషిస్తున్నాము.

సమ: నీకు ఉత్సాహభంగము చేసిన పిమ్మట ఎందరు సంతోషిస్తేనేమి? నా కీర్తి ప్రతిష్టలన్నీ ఏ దేవిపాదాలచెంత కానుక పెట్టుదామనుకొన్నానో ఆ దేవికి నాపట్ల అనుగ్రహంతప్పినది.

హిమ: ఎవరాదేవి, అంత నిష్టురురాలు? ఎన్నడూ చెప్పితివికావు! సమదర్శి శాతవాహనుల ప్రేమను తృణీకరించే కఠినాత్మురాలు, బావా నాతో చెప్పవూ, మా అక్కకానున్న ఆ యదృష్టవతి ఎవరో? నేను వెళ్ళి మందలించి ఆవిడను ప్రసన్నను చేసి వస్తాను. అవునుగాని మా అత్తయ్య ఎఱుగునా, కాబోయే కోడలుగారిని? అవునులే అత్తయ్యా, నువ్వూ తోడు దొంగలు. మాకు తెలియనివ్వరు. కానీలే, మీ రెంతదాచినా పెండ్లినాడైనా చూడకపోముగా. అవునుగాని నువ్వు త్వరగా పెండ్లి చేసుకో బావా! మా అత్తయ్య కోడలికోసం మొగమువాచి ఉంది. మేమంతా నీ పెండ్లి ఎప్పుడెప్పుడని కానుకలతో కనిపెట్టి కొని ఉన్నాము. ఇదిగో, మా నాయనగా రీమధ్య పదియోడలమీద సరుకులు పంపితే రోమకమునుండి రెండు లక్షల సువర్ణాలు వచ్చినవా సరుకుల విలువ క్రింద. ఆ సువర్ణములతో ఇదిగో హారం చేయించాను. మా బావ పెండ్లినాడు మా అక్కగారికి కాను కివ్వవలెనని

అనుచు ఆమె తనచేతికి అందిచ్చిన హారమును సమదర్శి గైకొనెను. తనమాట చొరనీయకుండ నా బాలిక పలికిన పలుకులెల్ల నాతనికి దిగ్భ్రమ కలిగించినవి. ఆమె మాటలు నిజమో, నవ్వులో? బండ్లపందెమున నోడితినన్న కారణమున నన్ను నొప్పించుట కిట్లనుచున్నదా? లేక నిజముగా నాయెడ విరక్తయైనదా? తన యాశలన్నియు మఱదలిపై నిడికొని, తన కెన్నటికైన దేవేరియగు నన్న నిశ్చయముతో నుండ ఇట్లు విరసము లారంభించినదేమి? కానిమ్ము. ఈ బాల నీ మాత్రమునకే జుణిగిపోనిత్తునా అనుకొని “బిందూ! పుట్టనిబిడ్డకు పేరు లెందుకుగాని, ఈ యపురూప హారము నీకే తగును. దీనిని నీ కంఠమునకే అలంకరింతును” అని చెంతకేగెను.

హిమబిందు “వద్దు బావా! నా హారం నేనే వేసుకుంటాను” అని చేతులతో నందుకొనెను, సమదర్శి చిన్నబుచ్చుకొనెను. అతనికి దుఃఖమును, రోషమును నలముకొనెను.

తారాదత్త వచ్చి “అమ్మా! నాయనగారు వచ్చుచున్నా”రని నుడివి, సమదర్శిని చురుకుచూపుల చూచి, ఏమియు నెరగనట్లు వెనుకకుబోయెను.

రక్తచందన పాదరక్షలు చప్పుడుగా, చెక్కడపుబని లేని ఎఱ్ఱజువ్వి కఱ్ఱ కేల నూతగాగొని చారుగుపుడు వీరున్నమందిరమున కేతెంచెను. ఈ వారము దినములలో నాతడు విచారమున క్రుంగిపోయెను. అతని మొదటి యెత్తు భగ్నమైనది. కాని అంతటితో తా నూరకుండవలసినదేనా? మొన్న జయశీలుడగు నా బాలునియెదుట నాట్య మాడునప్పుడు, యువరాజగు శ్రీకృష్ణశాతవాహనుడు తదేకదృష్టితో హిమబిందు చూచినాడు. చక్రవర్తి కద్భుత మొనగూర్చు కార్యము లొకదాని వెనుకనొకటి తాను ఘటింపవలెను. తనవలన నెఱవేరు సమస్తకార్యములు నాత డెరుగవలె. మొన్న తన వేగులవారు తెచ్చిన జాడనుబట్టి బ్రాహ్మణ బ్రహ్మచారి నొకని పట్టితెచ్చిరి. ఇంకను తన కావిషయమై ఎన్నియో సంగతులు తెలియవచ్చినవి. కానియీ సమదర్శి యేమిటి? పలుసారులు హిమబిందుకడ కీతడు రాజనదు. యువరాజ్యకంఠయోగ్య మగు నా రత్నహారమున కీత డర్హుడు కాడు. హిమబిందు మనస్సు ఏ దుర్ముహూర్తమునయిన నీ వెఱ్ఱి మేనల్లునిపై చనవుకొలది లగ్నమైనచో తన కలలన్నియు శకలము లగును. ఈ బాల్య స్నేహమును తెంచుటకే సమదర్శిని దేశాంతర గతుని గావించవలెను. చక్రవర్తి మనస్సును సంతోషవార్ధిలో నోలలాడించగల కులపాలక కామందకములను యువరాజునకు బసదనమీయనెంచిన నవి యోడిపోయెను. కాని ఇంత మాత్రమున అధైర్యమేల? మహత్కార్యములు నెరవేర్ప వలయును, విధిని తన లెంకలలో నొకనిగాజేసి ఆంధ్రరాజ్యమును తన చేతులలో నాడించి, చక్రవర్తితో తాను వియ్యమందవలయును. తన యీ సంకల్పము అమోఘము.

చారుగుప్తుడు గదిలోనికి వచ్చినతోడనే హిమబిందు లేచి తండ్రి కడకు వచ్చి మోకరించి, నమస్కరించి, లేచి చేయిగొని సుఖాసనముపై నధివసింపచేసి యాయనప్రక్కనే తాను గూర్చుండెను. సమదర్శి మేనమామకు పాదాభివందన మాచరించి నిలువబడి యుండ, చారుగుప్తుడు చేయియూపెను. అతడును తన పూర్వపీఠము పై నొరిగెను.

చారు: సమదర్శీ! నీకా కామందక కులపాలకములు కావలయునేమోయని మాట పంపినారు. ప్రత్యుత్తరము పంపినావు కావేమి?

సమ: మామా! అట్టి మేటిగిత్తలు నీకడనే యుండవలయును.

హిమ: నీకడ నేల నుండకూడదు బావా? చారు : ఉండుతల్లీ! నే నాతనికి సమాధానము చెప్పెదను. అవునయ్యా, నాకు వానియందు మక్కువపోయినది. ఓడిపోయినవని కోపమనుకొందువేమో, అది కాదు. నాకు కొత్త జతలపై మక్కువ. మహాకాండూర నగరమున ఈమధ్య మావాడు ఇంద్రగోపుడు అత్యద్భుతమగు జతను కొనినాడట. కతిపయ దినములలో నవి యిచ్చటకు వచ్చును. ఆర్యావర్తమునగాని, దక్షిణాపథమందు గాని అట్టి పసరము లుండబోవని స్పష్టముగ నాకు తెలియవచ్చినది.

సమ: అయినచో వానిని తప్పక చూడవలెను.

చారు: మాళవముపై కేగు సైన్యమున నీకు ఉపసేనాధ్యక్షత నిచ్చినారు. చక్రవర్తి ఆజ్ఞాపత్రము నీ కందినదా?

సమదర్శి చటుక్కున గంతువేసి లేచి “ఏమిటి మామయ్యా! నిజముగా! నీ కెప్పుడు తెలిసినది?” అని ప్రశ్నించెను.

చారు: ఇప్పుడే. కేరళపక్షులువచ్చి నా చెవిలో చెప్పినవి.

హిమ: (నవ్వుచు) వెఱ్ఱిబావా! బాబయ్యగారు చేసిన పనికి వారితో ఒకరు చెప్పవలెనా?

సమ: మామయ్యా! నీ యనుగ్రహానికి వేయివేల నమస్కారములు. ప్రయాణ మెప్పుడు? ఎన్ని సైన్యములు? అహో! నా కత్యంత సంతోషముగ నున్నది. నా కా శాసన మెప్పుడు చేరును? అయినచో నే నింటికిబోయి ప్రయాణసన్నాహమున నుండెద.

అనుచు నాతడు చారుగుప్తునకు నమస్కరించి, సంతోషస్నేహముల వెనుకనుండి తొంగిచూచు దైన్యముతో హిమబిందు ముఖముదెస గాంచి ఆ బాలికచే ననుజ్ఞాతుడై వెడలిపోయెను. చారుగుప్తు డాతడు పోయినదిక్కున బొమముడితోడి యనాదర దృష్టుల బరపి, పుత్రికవంక జూచి, “అమ్మాయీ! నీ వీతనితో చనువుగా నుండుట తగ్గించివేయుము. శస్త్రజీవనుడు” అని తెలిపెను. “లేదు, బాబయ్యగారూ! చిన్నతనపు స్నేహమున చనవు” అని హిమబిందు నవ్వుచు పలికెను.

19. రహస్యాలోచన

శ్రీముఖసాతవాహనచక్రవర్తి, మహామాత్యుడు అచీర్ణునితో, సర్వ సేనాధ్యక్షుడు స్వైత్రునితో రహస్యాలోచనమందిరమున మంతన ముండెను. శ్రీముఖుడు పొడుగరి. ఆరడుగుల రెండంగుళముల మనిషి. జబ్బపుష్టిగలవాడు. సింగముతో ఆయుధము లేకయే పోరాడునంతటి పోటుమానిసి, పచ్చని దబ్బపండువంటి ఛాయకలవాడు. జుట్టు పొడుగుగ ఉంగరములు చుట్టుకొని వీపుమీదను, భుజములమీదను పడుచుండును. ఒక్కక్కసారి వలిపెములతో ముడులుగా రచియించుకొని, శిరోభూషణములచే అలంకరింపించు కొనును. కన్నులు మధ్యమ ప్రమాణములు కలవి. నాగమణులవలె తళతళలాడుచు, తీక్షణకాంతులచే నెదుటివాని హృదయము చొచ్చిపోగలవు. నాసిక గరుత్మంతుని ముక్కువలె పొడుగై మాటలాడునపుడు వట్రువలు తిరుగు సుందరమగు పెదవులను తొంగితొంగి చూచుచు ఆ వదనమునకు అందమిచ్చును. మీసమును, బవిరిగడ్డమును, విశాలఫాలమును అతని ముఖమునకు వన్నె తెచ్చినవి.

ఆలోచన మెండయినప్పుడు శ్రీముఖుడు అస్థిరుడగును. మొలనున్న కరవాళికా సువర్ణ మేఖలలపై చేతులువేయును. ప్రక్కనున్న విశిత కౌక్షేయకోశముపై దృష్టిసారించును. కిరీటరత్నకాంతులు దశదశల పర్వ దలయాడించును. అతని మొల కొక దుకూలమున్నది. మెడను హారములున్నవి. హస్తమున కంకణములు, బాహువుల గేయూరములు కలవు. అతడు మాటలాడునపుడు మణికుండలము లూగియాడి, భుజములు, మీసములు, గడ్డము కాంతులతో నిండిపోవును. తలత్రిప్పుచు ప్రభువు అందరి మోములను చురచుర చూచును.

శ్రీముఖుడు: నా ఉద్దేశ్యము మనము ప్రథమమున పుళిందుల పైకిపోయి వారికిబుద్ధిచెప్పి, యటువెనుక మాళవముపై దండువిడసిన మంచిదియని. లేనిచో మాళవముపైకి పోవు మనవెనుక నీ పుళిందులు క్రమ్మి అడుగు సాగనీయరు. ప్రప్రథమమున పుళిందులకు బుద్ధిచెప్పితిమా మాళవము సులభసాధ్యమగును.

అచీర్ణుడు: దేవర యాలోచన లెస్సగ నున్నది. రేపటి దినమున సైన్యసంఘములకు, జైత్రయాత్రాసంఘములకు శాసనములు పంపెదను.

సర్వ సైన్యములు నాయత్తమైన వెంటనే శుభముహూర్తము చూచి రణభేరి మ్రోగించెదముగాక!

స్వైత్రుడు: మహారాజా! వినీతమతికి బాసటగా సమదర్శినడుపున ఉజ్జయినికి కొన్ని సైన్యములు పంపుట లగ్గుగదా! త్వరలో సహాయము కావలెనని క్రమేలక వార్తాహరుడు తెచ్చినవార్త. లేనిచో దుర్గము బలహీనమై సమస్తసైన్యముతో నాతడు ఆహుతి కావలసిన ముహూర్తమరు దెంచునేమో? ఆతడు పంపినవార్త దేవరకు విశదము. ఆజ్ఞ!

శ్రీముఖుడు: సమదర్శి స్వతంత్రముగా సైన్యములు నడపగలుగు పాటివాడా? వీరుడు కావచ్చునుగాని తానై సైన్యమును నడపగలవాడా యని.

స్వైత్రుడు: అందునకు నేను పూట. మహామాత్యుల ఉద్దేశ్యము దేవర కనుగొనవచ్చును.

అచీర్ణుడు: సర్వ సేనాధ్యక్షులమాట బాగున్నది. ఉపసైన్యాధ్యక్షు లార్వురిలోను వినీతమతి మాళవమున, కాకుండుకులు ఈ నగరమున, అక్షఘ్నుడు కళింగమున, అఘబలుడు ప్రతిష్ఠానమున, చిత్రకుడు దక్షిణా పథమున, జఘన్వుడు సిద్ధపురమున నుండవలసినవారు. మనకు సమదర్శియో మరొకరో క్రొత్త ఉపసైన్యాధ్యక్షుడు కావలయును. ఆ విషయమును స్వైత్రులవారే చెప్పవలయును. నా వినికిడి సమదర్శియే సేనాపతు లందరిలోను తగినవా డని.

స్వైత్రుడు: రాష్ట్రికులతో యుద్ధమున సమదర్శి ఉపసైన్యాధ్యక్షునికంటే అద్భుతములొనరించినాడు. కాన అతడే దీనికి తగును.

శ్రీముఖుడు: మంచిది. అతని నెప్పుడు పంపెదరు?

ఇంతలో ద్వారముకడనుండి పారిపార్శ్వకుడు “జయము! జయము! మహారాజాధి రాజులకు” అని వక్కాణించెను. అచీర్ణుడు “లోపలికి రా” యనుటయు, నాతడు వచ్చి యందరకు సాష్టాంగనమస్కృతులొనర్చి “జయము! జయము! దేవర యాజ్ఞానుసారము వణిక్సంఘాధ్యక్షులు చారుగుప్తులవా రేగుదెంచినారు” అని మనవి చేసెను. సార్వభౌముడు తలనూపెను. అచీర్ణుడది చూచి “తోడ్కొనిరా” యని యాజ్ఞయిచ్చెను. చారుగుప్తుడు లోనికివచ్చి యందరకు నమస్కారములు చేసి, మహారాజునకు మోకరించి నమస్కార మాచరించెను. అందరును లేచిరి, శ్రీముఖుడు చారుగుప్తుని హస్తముల బట్టి లేవనెత్తి పార్శ్వమున నున్న పీఠముపై నధివ సింపజేసెను.

శ్రీముఖుడు: వర్తకసార్వభౌమా! మాళవాధిపతి యేమి చేసెనో యెరుగుదువుగదా! ఇదివరకు మనచే విజితుడై కప్పము గట్టుచుండెను. తిరుగుబాటు చేయుచున్నాడని వినినంతనే వినీతమతిని పంపితిమి. ఆతనికి లొంగిపోయెనని వార్తాహరులు వచ్చియుండిరి. ఇంతలో ఏమరుపాటున పుళిందులచే తిరుగుబాటు చేయించి, భోజుల సహాయముగా గొనివచ్చి ఉజ్జయినిలోనున్న వినీతమతిని ముట్టడించెను. ఆతడు ధైర్యముతో కోట కాపాడుచున్నాననియు, త్వరలో సైన్యముతో సహాయము రానిచో తాను తన చమువులతో నశించిపోవలయుననియు వార్తాహరుల నంపుచున్నాడు. వినీతమతిని మాళవుడు ఓడించునట. పుళిందులు ప్రతిష్ఠాన నగరముపై దండు విడియనున్నారు. నీకు పుళిందులతోను, మాళవముతోను మహత్తరమగు వర్తకవ్యాపారమున్నది. నీ యాలోచన మా కత్యంతము ముఖ్యమైనది.

చారు: జయము దేవా! ఈ విషయమంతయు నేను శ్రద్ధగా నాలోచించితిని. కొన్ని సైన్యములను ముందు ప్రతిష్టానమునకు సహాయము పంపవలయును. మనము సర్వసైన్యములతో తరిమి నడచి మగధ పైకెత్తిపోయి అచట కాణ్వులకు, అగ్ని మిత్రుని సంతతివారికి బుద్ధిగరపి, వెనుక మాళవాధిపతిని నిర్జించి, ఆ వెనుక పుళిందుల నడంచి, భోజులపని పట్టించి వారి రాజ్యము మనము స్వాధీనము చేసికొనవలయును.

అచీర్ణుడు: అట్లయినచో పుళిందులు వెనుకనుండి మనయాత్ర సాగనీయరు గదా!

స్వైత్రుడు: చుట్టును శత్రువులు క్రమ్ముకొనియుండ మనము విరోధులపై బోవుట అపాయకరము. ఈలోపల మాళవమున వినీతమతి సంకట మధికమగును.

శ్రీముఖుడు: పుళిందు లెప్పుడును ప్రబలశత్రువులు.

చారు: మీరు తెలుపు కారణములు భయహేతువులుకావు. పుళిందులడవులు, కొండలు విడిచి సమప్రదేశములలోనికి వచ్చి శిక్షితులైన సైనికుల నెదిరింపలేరు. వారిని నడుపుటకు శిక్షితులగు సేనానాయకులు లేరు కావున వారివలన భయములేదు. మనము మగధమునకు కళింగము దారి ప్రయాణము సాగించెదము. విరోధులకు మన పోకడ తెలియవచ్చు మునుపే మగధ యందుండగలవారము. పుళిందుల నణుచుటకు ఆ అడవులలో మనకు చాలకాలము పట్టును. ఈలోన వినీతమతి దగ్ధమైపోవును. అటువెనుక ఏనుగులదండు అడవిబడినటుల, దావానలము కాంతారము చొచ్చునటుల వింధ్యాటవుల బడి పుళిందుల నుక్కడిగింపవచ్చును. పై భాగము లోబరచుకొని మనము అటునుండిరా, యువరాజు ఇటునుండి రా, మధ్య పుళిందులు చిక్కుకొనగలరు. భోజులుపూర్తిగ మాళవులకు బాసట కాకమునుపే మనము ఉజ్జయిని నుండవలయు. దీనివలన మనకు చెప్పరాని లాభ మింకొకటి యున్నది.

అచీర్ణుడు: ఏమది?

చారు: (సార్వభౌముని దిక్కు మొగంబై మధ్యమధ్య మంత్రిని, సేనానాయకుని జూచుచు) ఇది భరుకచ్చము. పశ్చిమ సముద్రపు రేవు పట్టణములలో ముఖ్యమైనది. దానిలాభము భోజులు పూర్తిగా అనుభవించుచున్నారు. ఇప్పుడు భోజరాజ్యము స్వాధీనము చేసికొని ఒక ప్రతినిధిని భరుకచ్చమున నుంచినచో, పాశ్చాత్యదీవులలో వర్తకము మచిలీపట్టణము నుండియు, మోటుపల్లినుండియు జరుగుటచే మనకు అమితనష్టము కలుగుచున్నది. కావున భరుకచ్ఛము ఆంధ్రచక్రవర్తుల స్వాధీనమందుండ వలయు.

శ్రీముఖుడు: బాగు! నీవు వర్తక చక్రవర్తి వనిపించుకొంటివి. నీవు చెప్పినదంతయు నాకు నవగతమైనది. మహామాత్యా! ఈవణిక్ శ్రేష్టుని యాలోచన లెస్సగానున్నది. సర్వసైన్యాధ్యక్షా! ఆ ప్రకారము సేనల నడుపుము. మేమును సిద్ధముగ నుండగలము. చారుగుప్తుడు మనతో వచ్చునది. కోశాధిపతికి మహామాత్యుడాజ్ఞల నంపునది. వలయునంతయు సిద్ధముచేయు యుద్ధ సంఘములకు ముదలనీయవలసినది. చైత్యాచార్యులు జయముగోరి బుద్ధ భగవానునకు పూజల సలుపునది. ప్రజాలోకము దైవారాధన చేయవలసినది. మరియు....

చారు: దేవా! తమకు అడ్డము చెప్పుచున్నాను. మన్నింపుడు. ఈ జైత్రయాత్ర కగు వెచ్చమంతయు చారుగుప్తుడు భరించగలవాడు.

20. రహస్య సమావేశము

బౌద్ధమతము విజృంభించియున్న కాలముననే వేదమతము పునరుద్ధరింప బ్రాహ్మణులు, ఋషులు, పండితపరిషత్తులు, ఆశ్రమములు ప్రయత్నము చేయుచునే యుండిరి. పండితులగు బౌద్ధ సన్యాసులకు కర్మకాండ మాత్రులగు బ్రాహ్మణులు బదులాడలేకపోయిరి. తిమిరమువలె గప్పిన ఈ పాడుమతమును నాశము చేసి, త్రయీభక్తిదేశమున నెలకొల్పుటెట్టులని వారాలోచనలు సలుపుచుండిరి. అనేక సభలు, సమావేశములు వారణాసి నైమిశారణ్యాది పవిత్రక్షేత్రముల జరుగుచుండెను, కొందరు భగవంతుడు మహాశక్తివంతుడు, ఆతడే సర్వము చక్కబరుచును అని వాదించిరి. కొందరు పురుషప్రయత్న ముండవలె ననిరి.

అశోకచక్రవర్తి నిర్యాణమందిన వెంటనే మౌర్య ప్రతిభ నానాటికి తగ్గిపోయెను. బౌద్ధ మతమును సామ్రాజ్యమతముగా నొనర్చి, యాత్రికుల, నాచార్యుల, భిక్కుల నంపి చీనా, తుర్కీస్థానము, పారసీకము, బ్రహ్మదేశము, సింహళములందా మతము నెలకొల్పి మహోన్నత దశకు తీసుకు వచ్చిన సార్వభౌముడు గతించుటనే అచ్చటచ్చట నణగియున్న వేదమతము పూర్వాచార సంప్రదాయములు తిరిగి విజృంభించెను. మౌర్యసంతతి రాజగు బృహద్రధుడు మగధ సింహాసన మధిష్టించియున్నప్పుడు పుష్యమిత్రుడను ఆతని సేనానాయకుడు రాజును చంపి తాను రాజై బ్రాహ్మణమతము పునరుద్ధరణ చేయ సంకల్పించెను. అప్పటినుండి సామ్రాజ్య సింహాసనమెక్కిన రాజులు వేదాచార పరాయణులగు వారే. పుష్య మిత్రునిసంతతిలో శుంగవంశములో తుదివాడగు సుమిత్రుని మిత్రదేవుడు వధించి రాజయ్యను. మిత్రదేవుని సంతతివారిని పదచ్యుతులజేసి మంత్రులగు కాణ్వవంశమువారు చక్రవర్తులైరి.

కాణ్వవంశమువారందరు వేదమతము పునరుద్ధరింప దీక్షవహించినవారు. అనేక పండితులీ రాజుల ప్రోద్బలమునను, పై మూడు వంశముల ప్రోత్సాహమునను వైదికధర్మనిష్టులై అత్యంత పురాతనములగు రామాయణ భారతాది గ్రంథములందు ఋషిప్రోక్తములవలె బౌద్ధమత ఖండనములను బ్రక్షేపించిరి. పురాతనములగు మనుధర్మాదిస్మృతుల దమ ఇష్టమువచ్చినట్లు మార్పు లొనర్పసాగిరి. రాజతంత్ర మందుకూడ నీ యావేశపరులు పాల్గొని వేదమత ముద్ధరింప సమకట్టిరి. గోదావరి నదికి పశ్చిమోత్తరముగా పదునేడు గోరుతముల దూరమునున్న మహావనశాల యను పట్టణమునందు క్రీస్తుశకము పూర్వము 74 వ సంవత్సరమునకు సరియైన బౌద్ధశకము 483 పరాభవ సంవత్సరమున ఫాల్గుణశుద్ధ ఏకాదశీదినంబున ఒక భవనమునందు పదమూడవ మూహూర్తమున పౌరసభాశాలవారు భేరి కొట్టకమునుపు పది పన్నెండుగురు పురుషులు సభ జేరియుండిరి. వారందరు క్రిందపరచిన రత్నకంబళులపై కూర్చుండి యుండిరి.

ప్రథముడు: కనుక వేంగీపురమునందున్న సంచరణుడు ఇప్పుడేమియు పని చేయుటకు వీలులేదని మీరంటారు. అవునుగదా, మహేశ్వరానందా?

మహే: ఏమిచేయగలడు? మన సంచరణుడు తానై ఏమియు ప్రయత్నించలేడు. ఇక్కడ చుట్టుప్రక్కలకు ప్రాణము, శక్తి, సమస్తము నయిన యాతడు ఈ స్థానబలము తప్పినంతనే రెక్కలులేని పక్షివలె నయినాడు. ఎంత బలమున్ననేమి? ఎంత సంపదయున్న నేమి? అంగ బలముండవలె గదా. చంద్రస్వామి ఉన్నంతవరకు బౌద్ధుల ఆజ్ఞల, నుప దేశముల తూ.చా తప్పక నిర్వర్తించుచు మన ప్రయత్న మత్యంతాభివృద్ధి చేసినాడు. చంద్రస్వామి కారాగృహమునకు బోగానే సంచరణుని పని అయినది.

ప్రథముడు: అయితే చంద్రస్వామి విచారణ సంగతి యేమయినది? ఎట్టి దండము విధించిరి?

మహే: మాకింకను ఆ వార్త రాలేదు. ఇప్పటికిని చక్రవర్తి దినోత్సవములు జరుగుచున్నవి. ఎద్దుబండి పరీక్షలైనవి. ఆయన విచారణ ఆపుచేయునేమోనని కోటలో ప్రతీతి. ఒకవేళ విచారణమవసరములేకయే శిక్షింతురేమోయని కోటలోనున్న మన వేగులవాడు విశాఖుడు చెప్పినాడు. ఏది యెట్లగునో?

ప్రథముడు: రాజధాని యందున్న బ్రాహ్మణు లూరకుందురా? విచారణ లేకుండ శిక్షించుట ధర్మదూరమని చెప్ప సాహసించు మతాభిమానులు లేరా?

మహే: ధాన్యకటకముగూర్చి సోనుత్తరుడు చెప్పవలసినదే.

అందరును మహాపండితుడును, ప్రతిజ్ఞానిర్వహగర్వియు నగు సోనుత్తరస్వామి వైపుచూచిరి. సోనుత్తరుడు సామవేదము పాడినట్లీవిధమున వాక్రుచ్చెను. ధాన్యకటకము నందున్న బ్రాహ్మణులందరును రాజాభిమానులు. బ్రాహ్మణ నామధేయము కలిగిన పాషండులు, చార్వాకులు పైశాచస్వరూపులు. ఒక్కడైనా మహాపండితుడనైన నన్ను గౌరవము చేయరు. లేచి నమస్కారమునైన చేయరు సరిగదా నా మొగమైన చూడరు. నాకు కోపమువచ్చి “రండి. నాతో వాదమున” కని పిలిచితిని. ఆ శుంఠలు ప్రతి చెప్పరైరి. అయినప్పటికి చంద్రస్వామిని విచారణ చేయకుండ దండించుటకు చక్రవర్తికి గుండెలేదయ్యా ధర్మాతిక్రమణం చేయుటకు. అన్నిమతములయందును గౌరవము చూపుదునని ప్రతి సంవత్సరము మహాపరిషత్సభకు చెప్పుచుండునుగదా! ఆ మాట కిపుడు తప్పినచో నేనూర కొందునా? మీకు తెలియదా?”

ప్రథముడు: ఒకవేళ చంద్రస్వామిని విడుదల చేయకపోయినట్లయిన సంచరణునకు సహాయముగా మనలో దిట్టమైనవాని నొకని ఆ చుట్టు ప్రక్కల నెక్కడనో యుంచవలయును.

మహే: ఆ సంగతి మొదటినుండియు మహాభాగులు మనతో చెప్పనే చెప్పినారు. వారి ఉద్దేశ్యము కూడా చెడుగు చేయవలెనని కాదు. మనము చేయుకార్యము ఉత్కృష్టమైనది. పుణ్యదాయకము, మోక్షదాయకము. ఆదిమీనము వేదముల నుద్ధరించుట వంటిది. వేదోద్ధరణచేయుట సర్వేశ్వరునకు మహాప్రీతికరము. దానిని, సాధించుటయే మన లక్ష్యము. తక్కిన పాపపుణ్యములతో మనకు బనిలేదు. ఒకడు: అవునుస్వామీ! ఇట్టి మహాపవిత్రకార్యము చేయుటలో కొన్ని కష్ట కార్యములు చేయవలసి వచ్చినను వెనుదీయకూడదు. మనము దురుద్దేశముతో చేయుట లేదుగదా?

చండికుడు: ఇన్ని సంవత్సరములు వేదపారాయణముచేసి, శాస్త్రములు పఠించి, ప్రతిజ్ఞగైకొని యీనాడు నేను వెనుదీయుదునా? చంద్రస్వామిలేని కొరతలేదు. మనము ముఖ్యకార్యము నడుపవలసినదే.

మిగిలినవారందరును “నిజము నిజ” మని చెప్పిరి. అందరును ఆవేశపూర్ణులై యున్నారనియు, తన కార్యమునకు తోడ్పడెదరనియు, నా సభ నడుపు ప్రధానపురుషునకు దోచినంతట నా విషయమునుగూర్చిన సంభాషణమాని “మన మిక్కడనుండి వివిధములగు మార్గముల ధాన్యకటకము చేరవలయును. మహాయోగి, పుణ్యపురుషుడు, స్థాలతిష్యులవారు వారి పని కొనసాగు శుభముహూర్త మేగుదెంచినదనియు, దానిని గమనించుటకు మనమందరము రావలెననియు ముదల పంపినారు. మీరుదప్పనింక నెవ్వరిని తీసికొని రావలదు. రేపు త్రయోదశినాడు శుభముహూర్తము” అని యతడు పల్కెను.

21. పరిత్రాణము

సమదర్శి పోటుమానిసి. చురుకుపాలెక్కువ. వెనుకముందుచూడని సాహసి. తనకిచ్చిన ఆ అక్షౌహిణీసైన్యముగొని పిట్టను వెన్నాడు డేగవలె దుర్గమారణ్యములబడి రివ్వున పోజొచ్చెను. దిగంబరులు, క్రూర సత్వులగు రాక్షసులను ఆరణ్యక జాతివారు (ఇప్పటికిని బస్తరు సంస్థానపు దుర్గమారణ్యములలో నున్నారు. వారిని మేము చూడ గలిగితిమి) ఆ అడవులలో నుండిరి. ఆ మూకల స్నేహముచేసికొని వారికెన్నియో విచిత్ర వస్తువుల కాన్కలిడుచు, వారి మన్ననల గ్రహించుచు, తనజాడ పుళిందులకు తెలియకుండునట్లు కష్టతమములగు మార్గములనే రాక్షసులు చూప నడచిపోవుచు, సమదర్శి రెండు వారములలో మాళవరాజ్యపు సరిహద్దుల చేరునప్పటికి ఒక్క పుళిందుల మూక ఆతని నడ్డగించెను. కాని అర్జునగాండీవవినుర్ముక్త మహాశరమువలె పోవునాతనికి చిన్న సైన్యమొక లెక్కయా! ఆ మూకను చీల్చి చెండాడి ఉజ్జయినికి నాల్గు గోరుతముల దూరమువరకు నాక్రమించియున్న మాళవసైన్యములపై మబ్బులేని పిడుగులవలె దూకెను. కోటలోనున్న వినీతమతికి సమదర్శి సైన్యముల నడుపుకొని వచ్చినాడని వేగు తెలిసినది.

ఉజ్జయినీకోట చాల ముఖ్యమైనది. అది దేవనిర్మితమని ప్రతీతి. శ్రీముఖ శాతవాహనుని తండ్రి, సమదర్శి తండ్రి ప్రియదర్శి సేనాపతిగా ఉజ్జయినీపట్టణమును మహాసంగర మొనర్చి స్వాధీన మొనర్చుకొనెను. అప్పుడు మాళవాధిపతి నీరసముగ నున్నను చాలకాలము అద్భుతముగా కోట కాపాడుకొనగలిగెను. కాని తినుబండారములు నాశమొందుటచే కోట సాతవాహనునకు స్వాధీనమయ్యెను.

సమదర్శి ఆలోచనయొక్కటే. కోటచుట్టునున్న సైన్యములలో చాల భాగము తన్నెదిరించిన ఏ సైన్యమునెగ్గునో భగవంతునికెరుక. పుళిందులు, భోజులు, మగధ సైన్యములు, అవంతిదళములు సహాయము వచ్చుటచే మాళవ వాహిని ఉత్తుంగతరంగ పూర్ణసముద్రమువలె నున్నది. కోటలో వినీతమతికి భోజనాదికములు తగ్గిపోవుచున్నవి. సైనికులు వేనవేలు మడిసినారు. హీనబలులగుచున్నారు. ఆయుధసామగ్రి చాలవరకు నాశనమయినది. సర్వతో భద్రములు, జామదగ్న్యములు, బహుముఖములు, విశ్వశాఖతికములు, పర్జన్యకములు, ఊర్థ్వబాహువులు చెడిపోయినవి, చెడిపోవుచున్నవి. కాన వినీతమతి తప్పక నశించును.

ఇవన్నియు స్ఫుటాక్షరముల నాతని దృగ్వీధిని నడయాడుచున్నవి. తనకడ నొక నెలకు సరిపడిన పుష్కలాహారపదార్థములు కలవు. గోధుమలు, బియ్యము, పప్పు ధాన్యములు, బెల్లము, కోళ్ళు, కౌజులు, మేకలు, గొఱ్ఱెలు, లేళ్ళునున్నవి. ఇప్పుడు కర్తవ్యమేమి? ఏది యెట్లయినను తాను కోటలోనికి చొచ్చుకొనిపోవలె, తనక్రింది సేనాధికారులు, చమూపతులు, దండనాయకులు అందరితో సమాలోచన చేసినాడు. కొందరు చక్రవర్తియే మహా సైన్యముతో వచ్చి తాకెనని బెదరించెదమనియు, కొందరు మన మచ్చటనుండియు, కోటలోనుండి వినీతమతియు తాకినచో నిరు సైన్యములు విరోధిసైన్యముల నుగ్గాడవచ్చుననియు దెల్పిరి. కాని సమదర్శియొక్కటే నిశ్చయించుకొనెను, ఝంఝామారుతముచే సముద్రము మహా భయంకరముగా నున్నను నావికుని సామర్థ్యమున ప్రమాదముగా బోవు నౌకవలె, కఱ్ఱను చీలగొట్టి చొచ్చిపోవు పరశుముఖము వలె, సమదర్శి మాళవ సైన్యముల జీల్చి కోటద్వారముకడకు బోవుటకు నిశ్చయించెను. ఏ ద్వారము కడకు తాను రానున్నాడో ఆ ద్వారముకడ సిద్ధముగనుండి గోపురద్వారము చటుక్కున తెరచి కొన్ని సైన్యములు వెలుపలికివచ్చి చీకాకుగూర్పవలె ననియు, రాత్రి అమిత వేగమున తాను వచ్చెదననియు గోటలోనికి వార్తనంపెను.

రాత్రిపండ్రెండుగంటలగునప్పటికి కోటచుట్టుచున్న మాళవసైన్యములతో సమదర్శి తలపడెను. పేరుగాంచిన ఆంధ్రమల్లులు అయిదువేల సంఖ్యవారు పంక్తికి నాల్గువందల చొప్పున కలసి ముందునడచిరి. వారి ఎడమచేత దేహమంతయు గప్పు ఖడ్గమృగచర్మపు డాళ్ళుండును. కుడిచేత తొమ్మిదిఅడుగుల పొడవుగల వాడిశూలము లుండును. మొలను చిన్నకటారి యుండును. వీరందరు శూరులు, గజసత్త్వులు, చావవలెగాని వారు వెనుకకు తిరిగిరారు. వారిని ఆంధ్ర సైన్యాధిపతులు, చక్రవర్తులు ప్రాణాపాయములు వచ్చునప్పుడే గాని ప్రయోగింపరు. అట్టి ధీరులు ఆంధ్ర సైన్యముల ఏబదివేలున్నారు. భారతీయ సైన్యములు యుద్ధము చేయునప్పుడు గజముల గజములు, అశ్వముల అశ్వములు రథముల రథములుదాకింతురు. నేడు సమదర్శి మల్లులకీవలావల అశ్వదళములుంచెను. వీనివెనుక రథములు, అన్నిటికి వెనుక ఏనుగులనుంచి యుపాయముమై మోహరము పన్నెను.

ఆంధ్రవాహిను లిట్లమిత వేగమునవచ్చి తాకుటచే మాళవ సైన్యములు చీకాకు నందెను. అటు చటుక్కున దుర్గమహాగోపురద్వారము తెరువబడి వినీతమతి సైన్యములువచ్చి తాకుటచే మాళవులు చిక్కుపడిరి. ఈ కల్లోలములో సమదర్శి సైన్యములు జవమున మాళవ సైన్యములోనికి చొచ్చిపోవుచున్నది. ఆంధ్రమల్లులు తమ త్రోవ కడ్డమైనవారినెల్ల శూలముల కెరచేయుచు మరల నా శూలము లాగుకొనుచు ముందునకు సాగిపోవుచుండిరి. వారి కిరుదెసల అశ్వదళములు పార్శ్వరక్షణ మొనర్చుచుండెను. హిమ పాతమువలె వచ్చు నా సైన్యము బారిపడి రిపులు నడపొడ మాసిపోవుచుండిరి. సమదర్శి ప్రళయ కాలరుద్రుని వలె నుండెను. మహానది ప్రవహించుచున్నట్లు పోవుచుండెను. అతని సైనికులు సింహములవలె పోరాడిరి. మాళవదళములు ఆ రాత్రి యేమరుపాటునకు వెఱుగుపాటు తోడుగా గలగుండువడి, దిక్కు తెలియక, పంచ బంగాళమై విచ్చిపోయినవి. సమదర్శి సైన్యములకు దారి యిచ్చినవి. యుద్ధారంభమైన మూడుగంటలకు సమదర్శి సేనలు చెక్కు చెదరక భోజనాది వస్తు సామాగ్రితో దుర్గములోనికి చొచ్చిపోయెను. వినీతమతి సమదర్శిని కౌగలించు కొనియెను. కోటలో విజయనాదములు భేరీభాంకారములు మిన్ను ముట్టినవి. మాళవ సైన్యములు మొగములు వ్రేలవైచినవి.

మిడుతలదండువలెనున్న మాళవ సైన్యములు మరునాడు ధైర్యవిహీనములై యుద్ధము చేయనారంభించినవి. ఇంతలో సుశర్మ చక్రవర్తిపంపిన కొన్ని సైన్యములు వచ్చిచేరినవి. వానితో శివభూతివచ్చినాడు. అతడు మాళవాధి పతిని గలిసికొని యిట్లనియె: “మహారాజా! ఆంధ్రరాజు సైన్యములలో కొన్ని విడిపోవును. ఆతని కుమారుడు యువరా జీపాటికి నిర్వాణపథమునకు జేరి, బుద్ధుని గొలుచుచుండును. ఆ వార్త ఆంధ్రులకు తెలియజేయుటకు మేమే అంచెల నుంచినాము. ప్రతిష్టానము తక్షణము మన స్వాధీనము కాగలదు. మంజుశ్రీ యువరాజు కాగలడు. కాన మనకు భయములేదు. ఆంధ్రసైన్యము లింక కొన్ని నెలలవర కిచ్చటకు రాజాలవు. ఈలోన నీమూకలనుక్కడంచి మనము జాగ్రత్తపడి యెదము గాక. సార్వభౌముని సైన్యములు తేరుకొని వచ్చునప్పటికి కళింగమున సైన్యము లన్నియు తిరుగుబాటొనర్చును. విదేహరాజ్యము మనకు సహాయము నంపును. మన మహాసైన్యము లన్నియు కలసి ఆంధ్ర రాజ్యముపై దండెత్తి ఆ దేశమును ముక్కలు చేయవలయున. మంజుశ్రీ మనచేతిలోని కీలుబొమ్మ. ఫలవంతమగు ఆ రాజ్యమంతయు మన పాలిటిదగును కాన మనకేమి భయము” అని వచించెను.

మాళవుని మొగము విప్పారెను. ఆంధ్రసైన్యములకిక బాసటరాదనియు, కోటలోని సైన్యముల హతమార్చవచ్చుననియు, ధైర్యముగా నుండు డనియు, దొంగలవలె ఆంధ్ర సైన్యములు రాత్రి శిబిరములు చొచ్చినవి కాని, లేకున్నచో పేరులేకుండ మాసిపోయి యుండుననియు సైన్యమంతట చాటిరి. జయజయనాదములు సల్పిరి. మాళవ సైన్యములు మహా సంతోషమున తేలియాడెను.

కాని శివభూతి తన పటకుటీరమున నస్థిరుడై గూర్చుండి ఇంకను ప్రతిష్టానము నుండి వార్తలేమియు రాలేదేమని మనోవేదన ననుభవించుచుండెను. “ఏమో! ఏమైనదో! ఏమికానున్నదో?” యని యాతడు పది సారు లనుకొనియెను.

22. ఆశ్రమము

కతిపయ దినంబులకు ధాన్యకటకమున కృష్ణాతీరమందు మహా చైతన్యమునకు కొలదిదూరములోనున్న స్థౌలతిష్యాశ్రమమునకు మహేశా నందాది పండితులు చేరినారు. ఆ ఆశ్రమ భవనములన్నియు రాతివి. ఆ ఆశ్రమము చాల భాగ్యవంతమైనది. అన్నియు తోటలే. తోటల నడుమ ఆశ్రమగృహాలు, సమస్త ఫలపుష్పాదులు గల యా తోటలో ఒక భవనమున్నది. వృద్ధుడును, మహాయోగియు నగు స్థౌలతిష్యుల వారందు వసింతురు.

స్థౌలతిష్యులవా రాంధ్ర బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడని పెద్దలందరు. తక్షశిలయందు, వారణాసియందు, నైమిశారణ్యమునందు పెక్కు సంవత్సరము లధ్యయన మొనర్చి, యందందు గురుత్వము సలిపి స్వగ్రామమగు కృష్ణాతీరస్థ రాజశైలమున వార్ధకము గడుపుచుండెను. ఇట్టి మహానుభావుడగు యోగి తిరిగి విచ్చేసినాడని వినినంతనే మహా రాజాధిరాజు శ్రీముఖసాతవాహనుడు స్వయముగ నచ్చటికి విచ్చేసి ఆయనకు సకల సౌఖ్యముల సమకూర్చుట కనుమతినీయ బ్రార్థించెను. స్థాలతిష్యులు శాలివాహన సార్వభౌము నాశీర్వదించి, “మహారాజా! మీరు బౌద్ధ మతావలంబకులు. వేదములు పౌరుషేయము లనియు, యజ్ఞయాగాదిక్రతువులు హింసాత్మకములనియు, కర్మకాండ దూష్యమనియు వచింతురు. కలియుగ లక్షణములు మీ పాలనమున మూర్తిదాల్చుచున్నవి. మెలకువ నొందుట శ్రేయస్కరము. ఆంధ్ర వంశోద్ధారక! శాతవాహన వంశకులతిలకా! వృద్ధుడనగు నామాట వినుము. అనాదియగు వేదముల పుట్టుక నెవరు నిర్ణయింపగలరు? మీ శ్రమణకుడు వాక్రుచ్చిన భావనలు, నీతిబోధయు వేదములయందు లేవా? వేదనింద యొనర్చు నాస్తికధర్మమూని ఈ జాతిని భ్రష్టమొనర్పకుము. మహాచక్రవర్తులగు హరిశ్చంద్రాది నృపులవలె వేదధర్మ ప్రతిష్ఠచే యశము సముపార్జించుకొనుము. బౌద్ధదీక్షను వీడి పరబ్రహ్మదీక్షను గొనుము. భారతవర్షము నుద్ధరింపుము. సకలార్యలోకమట్టి చక్రవర్తికై ఎదురుచూచుచున్నది. మీచే రాజసూయంబు సల్పించెద. ఆగ్నిసమానుడు అర్థశాస్త్రవేత్త, కౌటిల్యుడు చంద్రగుప్తుని సామ్రాజ్యాభిషిక్తుని చేసినట్టు మిమ్ము నీ జంబూద్వీప సార్వభౌమ పదమున కభిషిక్తుని జేసెదను.” ఈ ముక్కలని వృద్ధుడగు తపస్వి తేజోవంతములగు తన తీక్షణ దృష్టుల శాతవాహనుని మోముపై బరపెను.

సాతవాహనుడు చిరునవ్వు నవ్వెను. స్థాలతిష్యులు పట్టుదలగలిగిన ఆర్ష మతాభిమాని అని మహారాజెరుగును. “ప్రేమతత్వమే అహింసావ్రతోదరణమే మూల సూత్రముగదా యీ మతమున? ఇందలి పాపమేమి మహాఋషీ? బౌద్ధమతమునందు అశోకచక్రవర్తి కాలమునుండియు సామ్రాట్టులు దీక్ష వహించిరి. సమస్త మతములవారిని సమదృష్టితో పరిపాలించుచున్నారు. నే డా పద్ధతి మార్చుటకు మాకు కారణమేమియు కనబడదు. కాన మమ్ము క్షమింపుడు. స్నేహభావముతో మెలగితిరి. మహాభాగా! ఈ విషయమున మీతో తర్కింపజాలను. మమ్మనుగ్రహింపుడు” అని చక్రవర్తి వేడుకొనెను.

సోనుత్తర చండికాది పండితులు వచ్చిన యీదినమందు స్థౌలతిష్యుని భవనమునం దొక్కమందిరమున నందరును సమకూడిరి. ఆ భవనమునందు విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, ప్రజాపతి, మహేశ్వరి, గజలక్ష్మీ మొదలగు దేవతల విగ్రహములు కలవు. లింగమూర్తి పానవట్టమునం దొకచో ప్రత్యక్షమై యుండెను.

స్థౌల్యతిష్య మహర్ష్యాశ్రమమునందు శిలామందిరాలలో తాపసులు, పండితులు, వేదవేదాంగ పారంగతులు, సర్వశాస్త్రవేత్తలు కుటుంబములతో నివసించియుండిరి. విశాలభవనములలో, మండపములలో, వృక్షచ్ఛాయాపీఠములలో బ్రహ్మచారులు దీక్షతో సర్వశాస్త్రములు అభ్యసించుచుండిరి. వారితోపాటు ఆశ్రమమున వేరొకచోటనున్న బాలికావిద్యా మందిరములో అనేకులు బాలికలు సర్వవిద్యలు నేర్చుచుండిరి. ఖేదనము, అశ్వారోహణము, రథచోదనము, గజ విద్య మొదలైనవి నేర్పుచుందురు. ఆశ్రమ మధ్యభాగమున కృష్ణానదీతీరమందు యజ్ఞయాగాది క్రతువు లొనరింపబడుచుండును. స్థౌలతిష్యులు సర్వవిద్యా మహార్ణవ స్వరూపులు. వేదము లాయన ముఖమునందు ప్రజ్వరిల్లుచుండును. వేదభాష్యము లాయన ఫాలమున తేజరిల్లును. ఉపనిషత్తులన్నియు ఆయన చూపులలో తాండవించును. ప్రస్థానత్రయ మాతని హృదయము. అధర్వణవేద మాతని యూడిగపుగత్తె. ధన్వంతరివలె ఆతని దక్షిణహస్తమున అమృతకలశమున్నది. తక్షకునివలె ఆతని వామహస్తమున విషకుంభమున్నది.

స్థౌలతిష్యుని ఆశ్రమమునందు పురాణశ్రవణము, వేదాంతచర్చ, ధర్మశాస్త్రగోష్టి, సాహిత్యవిచారణ, ఆయుర్వేద, జ్యోతిష విచారణములు జరుగుచుండును.

సార్వభౌముడీ ఆశ్రమమునకు వలయు సౌకర్యములు అర్పించుచుండును. స్థాలతిష్యమహర్షి “నీ అర్పణయే నీకు నాశనము కాగల” దనిచిరునవ్వు నవ్వుకొను చుండును.

స్థాలతిష్యుని పూజామందిరమున ఎందరో పండితులు, మండలాధిపతులు, భూస్వాములు, మునులు, రాజకీయోద్యోగులు ఆ త్రయోదశినాడు చేరియుండిరి.

స్థాలతిష్యమహర్షి కృషభేశ్వరునియెదుట అలంకార రేఖావర్ణ సుందరమగు కాంకూరపత్ర కంబళిపై నధివసించి తపస్సు చేసికొనుచుండును. మండపమున చేరినవారందరు భక్తితో వివిధ కృష్ణాజినాద్యా సనములపై నధివసించియుండిరి.

స్థౌలతిష్యుడు తపస్సు చాలించి, నీరాజన సమర్పించుచు, అచ్చట నున్న సువర్ణఘంటికను దక్షిణహస్తమునగొని క్వంక్వణ నినదము చేసెను. ఆ మందిరమున పూజాపీఠమునకు ఎడమవైపున నున్న ద్వారమున విషబాల ప్రవేశించినది.

తోడనే పీఠముదాపుననున్న నలుగురు భక్తులలో నొకడు శంఖము నూదెను. ఒకడు జేగంట గణగణ వాయించెను. ఒక డొక భాంకారముపై “భం భం” నినాద మొనర్చెను. ఒకడు ఉచ్చైస్వనంబున సూక్తపాఠ మారంభించెను. పలువురు భక్తులాతని కంఠముతో దమ కంఠములు మేళవించిరి.

23. అభిచారము

అచటనుండి స్థౌలతిష్యమహర్షి ఆ మందిరముననే వేరొకయెడ ప్రజ్వలించుచున్న హోమకుండము కడ ఉత్తరాభిముఖుడై వ్యాఘ్రాజినముపై నధివసించి, గంభీరోచ్ఛాటనలతో అభిచారహోమము ప్రారంభించెను. ఆ అభిచార హోమము శత్రుమారణరూపమైనది.

“ఓ అగ్నివాయు సూర్య చంద్ర జలములారా!
మమ్మెవ్వడు ద్వేషించుచున్నాడో,
ఎవ్వని మేము ద్వేషించుచున్నామో,
అట్టివానిని మీ తాపశక్తిచే తపింపజేయుడు,
మీ దీప్తిశక్తిచే మండింపజేయుడు,
మీ దుఃఖదాయకశక్తిచే శోకింపజేయుడు,
మీ తేజశ్శక్తిచే నిస్తేజస్కునిగా జేయుడు.”
“ఓ విషశక్తీ! నీవు ఈ భయంకర సౌందర్య నారీరత్నమునందు
సంపూర్ణవేగముతో కూడుదువుగాక
ఓ కాలకూటవిషమా! నీవు లోకాలను దహింతువు. నీ దహనశక్తి మా
శత్రువును దహించివేయుగాక
ఓ దంష్ట్రాకరాళ మృత్యుమూర్తీ! నీ వీ బాలికయందు ప్రవేశింపుము.

ఓ సౌందర్యనిధులైన దేవతలారా! ఈ బాలిక ప్రతి అవయవము నందు,
ప్రతి ఇంద్రియమునందు, ప్రతి శక్తియందు ఆవేశింతురుగాక
ఓ ఉషోదేవతా! నీ వీ బాలిక ముఖమగుదువుగాక
ఓ చంద్రమూర్తీ! నీ వీ బాలిక వపువగుదువుగాక
ఓ మిత్రావరుణులారా! మీ రీ కన్య రెండు నేత్రము లగుదురుగాక
ఓ అగ్నీ! నీ వీ బాల కన్నులలో వెలిగెదవుగాక
ఓ మేరుపర్వతమా! నీ వీ యువతి స్తనముల శోభింతవుగాక
ఓ నదీ దేవతలారా, మీ రీ బాలిక నూగారులగుదురుగాక
ఓ శచీదేవీ! నీ వీ బాలిక పెదవులపై నర్తించెదవుగాక
ఓ ఆకాశమా! నీ వీ సుందరి నడుమునందు చేరుము
ఓ మరుద్దేవతలారా! మీ రీ యువతి ఉచ్చ్వాస నిశ్వాసములయందు మసలుదురుగాక
'ఓ మంత్రమా! నీవు మహాశక్తిచే మా విరోధుల నీ బాలికకడకు ఆకర్షింపుము.
నీవామె వాక్కులో, చూపులో, పెదవులలో, ఆమె స్తనములలో చేరుము.
ఈ బాలిక శరవేగ యగుగాక
ఈ సుందరి శ్రీకృష్ణ శాతవాహనుని అగ్ని శలభము నాకర్షించి నట్లు ఆకర్షించుగాక
ఈ బాలిక శ్రీకృష్ణశాతవాహన విగ్రహమునకు వలయగుగాక
ఈ సుందరి శ్రీకృష్ణసాతవాహనుని మృత్యువగు గాక
ఈ యువతి శ్రీకృష్ణసాతవాహనుని దగ్ధముచేయుగాక!”

అనుచు నభిమంత్రించుచుండ నా బాలిక మైమరచి, ఊగిపోవుచు, పద్మాకృతియగు రంగవల్లిలో నిలిచియుండెను.

ఆ బాలికపై స్థౌలతిష్యుడు మంత్రజలము జల్లినాడు. ఆమెను చుట్టి ప్రయోగహస్తము పట్టినాడు.

మధ్యాహ్నమార్తాండునివలె తేజరిల్లు మోముతో స్థౌలతిష్యుడప్పుడు సభ్యులదిక్కు మొగంబై,

“ఈ బాలిక దివ్యాస్త్రము
ఈమె ప్రయోగింపబడిన మృత్యువు
స్వచ్ఛమై స్నిగ్ధకాంతులలో మెరయు
నక్షత్రము లామె కన్నులు.

“అందు వెడలు చూపులు మృదులసువాసనాలహరీపూర్ణములగు మనోజ శరములు కావు, భయంకర దావాగ్నికీలలు.

పక్వబింబము లా యధరములు, ప్రవాళకాంతులు, కల్యబాలా పరమ సౌందర్య నర్తనములు, అవి సుధానిధానములు కావు, తక్షకవదనదంష్ట్రాయితములు.

సమస్తజీవరాసులకు ప్రాణరస మర్పించు పావననదీనదంబులకు పుట్టినిళ్ళు ధరాధరములా? మదగజకుంభములా? ఈ సుందరీవక్షోజములు, ఇవి దుగ్ధాంభోధి మథనసంజాతామృతకలశములు కావు, కాలకూటవిష కుంభములు.

ఆ దేహమున జాంబూనదరజఃపరాగములు రేగుచున్నవి. ఏమిమార్దవము! తరుణకేతకీ కోమలమగు నిది అగ్నితప్తకనక క్రకచము. రూపెత్తిన యీ పరమాద్భుతశిల్పాశయము, యీ మనోహర మృత్యువు, యీ సమ్మోహనశాపము, యీ రమణీయాగ్ని కీల, యీ మహోజ్వలవిద్యుజ్జిహ్వ యీ బాలిక!”

స్థౌలతిష్యుడు కంపితహస్తము చాచి “పండితులారా! ఈమె నాముద్దుల మనుమరాలు. నా కుమారున కీమె యొక్కతే సంతానము. నేను నా పుత్రు నెట్లు ప్రేమించియుంటినో, నా ప్రేమకు పాత్రుడై యాతడెట్లు శుశ్రూష చేసెనో అది లోకమున కెరుక.” స్థౌలతిష్యులకు కన్నుల నీరు తిరిగినది. బొటనవ్రేలిచే నాతడు బాష్పముల విదిలించెను. “అట్టి మహాపండితుడు, సుకుమారరత్నము దివంగతుడైనాడు. మహాపతీవ్రత నా కోడలుపతి చిహ్నతో సహగమనము జేసినది. తల్లిదండ్రుల ప్రేముడికి దూరమైన ఈ శిశువు మదేకగతి; ఈ వృద్దుడు తదేకగతి. ఈమెను మనయజ్ఞమునకు ధార పోసితిని. ఈమె దేహ ప్రాణములు, మౌనము అంతయు జగద్ధాత్రి లోక పావని యగు మహాశక్తికి అర్పించినాను. తండ్రి చంద్రబాలయని నామకరణముచేసెను.” స్థాలతిష్యుని కన్ను లంత జాజ్వల్యమానమై “ఈమెను పరమేశ్వరుని కంకిత మిచ్చితిని. నా నిధానమును వైదిక ధార్మాగ్నిలో కల్పితిని. ఈమెయే మన సర్వవాంఛలను దీర్చు కల్పవృక్షము. ఈమెయే ఈ పుణ్యభూమిని పవిత్రమొనరింపజన్మించిన కామధేనువు.”

ఆతని తెల్లని గడ్డము, ఊర్ధ్వశిఖ రచించిన ధవళ జటాజూటము, పండువంటి దేహచ్ఛాయ ఇటునటు ఊగిపోయినవి.

24. శలభము

అంత నందరును జూచుచుండగనే చళుకవిషయపుగోడెవలె బలసియున్న పడుచువాడును, నాగవిషయమున గృధ్రమండలాధిపతియు నగు మలయనాగప్రభువు సోమపానము చేసి మత్తిల్లిన క్రతుకర్తవలె లేచినాడు. కండలు కట్టిన తన రెండుచేతులు ముందుకు చాచి, కెంపెక్కిన చూపులు విషకన్యకమోమున నిలిపి, ఉన్మత్తుడై అగ్నిని కౌగలింపబోవు శలభమువలె, వ్యాఘ్రమును జూచి మృత్యువశమున దద్వివృతాస్యమున నులుకు లేడివలె ఇతరులు అడ్డుపడులోపల ఆ బాలవంక పరుగిడిపోయి యామెను కౌగిలించి యామె పెదవులు ముద్దిడబోయినాడు.

ఆ బాలిక భుజములు రెండును గట్టిగా నదిమిపట్టినాడు. మృదుల వల్లికామ తల్లికవలె నున్న యా విషకన్య యా కర్కశహస్తపీడనమున కోరువ జాలక, ఆతని చుంబనమున కేవగించుకొని తల వెనుకకు వంచినది. ఆమె నిశ్వాసములు భయంకర భుజగిపూత్కారములై మలయనాగుని నాసికారంధ్రములలోనుండి, తెరచియున్న నోటిలోనుండి లోనికి బోయినవి. సభాసదు లింతలో నా దురాచారుని చేతులనుండి బాలికను విడిపించిరి.

మలయనాగుడు ఆ విషవాయువుల పీల్చినలిప్తలో కనులు తిరుగ, నోట నురుగులు గ్రమ్మ చాపచుట్టవలె నేలపై విఱచుకపడెను.

సభ్యులందరు గొల్లుమనిరి. చంద్రబాల క్రోధరూపిణియై రోజుచు ఇటునటు ఊగిపోవుచుండెను. ఆ బాలికకేశపాశము ఊడిపోయి, మేఘములు క్రిందికి దిగునట్లు సువ్వునపడిపోయెను. తప్తజాంబూనదకలశముల వంటి ఆమె వక్షోజములు పైకి ఉబుకుచు తగ్గుచున్నవి. ఆమె మహాప్రళయము, భయంకర కాళికాదేవి, ఆమె శివత్రిశూలము, ఆమె చక్రధార!

సభ్యులందరు భీతులై వైవర్ణ్యమొందిన మోములతో దావానలము జూచు అరణ్యమృగములవలె వణకిరి. స్థౌలతిష్యులు వికృతానందముతో కలకలలాడు పెదవుల నొకశంఖ మొత్తుటయు, పలువురు సేవకులు విచ్చేసి యా శవమును తరలించిరి.

మలయనాగుడు ఆంధ్రదేశములో నివసించు కొన్ని నాగవంశములకు ప్రభువు. ఆంధ్రార్యులకంటె ముందుగనే ఆంధ్రదేశమునంతను నాగులాక్రమించుకొని యుండిరి. ఉన్నతశరీరులు, శ్యామలాంగులు నగు నాగులుత్తరభూములనుండి వచ్చి దక్షిణాపథమును రామాయణ కాలానంతరమందాక్రమించిరి. అంతకుముందే స్వల్పసంఖ్యాకులగు నాంధ్రర్యులు కృష్ణవేణి ముఖప్రాంతమున నివసించియుండిరి. పాండవకాలము నాడార్యులు విరివిగా వచ్చి నాగదేశము జొచ్చి నాగులతో సంబంధబాంధవ్యముల నెరపు చుండిరి. ఉలూపి కథయు, పురుకుత్సుని గాథయు నిట్టీవియే.

నాగులకు సామంతరాజ్యము లుండెను. అట్టివారిలో మలయనాగు డొకడు. నాగులందరు బౌద్ధమతావలంబకులే. కాని పట్టుదల కలిగిన బ్రాహ్మణులు కొందరు వీరికి ఆర్యదీక్షల నిచ్చి తమవైపునకు త్రిప్పుకొని వారిచే మిక్కుటమగు సహాయము నందుచుండిరి.

సభ్యులలో భయ మిసుమంతయు తగ్గలేదు. మహావనశాల గ్రామమున సభా కార్యక్రమము నిర్వర్తించిన వ్యక్తి లేచి భక్తియు, భయమును గదిరిన కన్నులతో స్థౌలతిష్యుని దిక్కు మొగంబై యిట్లనియె. మహా ఋషీ! మలయనాగుడు నాగులలో నుత్తమవంశ్యుడు. ఆతడు మాయమగుట ప్రజలకును, ఆంధ్ర రాజునకును తెలిసినచో మన జీవయాత్రలు ధాన్యకటకపాతాళగృహంబుల గడుపవలసినదే! ఇప్పుడు మనకు దారియేరి?”

స్థౌల: ఓ శివస్వాతీ! నీవు మాగధుడ వగుట తెలిసిపోయినది. మలయనాగుని దేహము ఓషధీరసంబుల చెక్కు చెడకుండును. ఏ భక్తునకు ఫాలనేత్రుడు, సర్వసృష్టి కారణుడు, మహాలింగమూర్తి సర్వవిషశక్తుల నిచ్చెనో యాతని కా పరంజ్యోతి వాని విరుగుడుల ప్రసాదింపడా? హాలాహల విషంబుల నవలీలగ ద్రావిన లోకేశ్వరుడు విషనివారణ మంత్రముల నాతని పాదముల భజించు భక్తులకు సమకూర్చడా? అప్పుడే మలయ నాగుని శరీరము ఓషధులచే తడుపబడెను. మహా విషపూరితయగు నా బాల నా ప్రాణములకు ప్రాణము, నా కోర్కెలకు నిధానము. చంద్రబాల యొక్క నిశ్వాసముల వడిని తగ్గింప ఒక వారము దినములు పట్టును. అంతవరకు నా తుచ్ఛుడటుల పడియుండవలసినదే.

ఆ వృద్ధుడు కన్నుల విస్ఫులింగములు రాలుచుండ, ఉచ్చైస్వనమున నిట్లనియె: “సభాసదులారా! మీరే యిట ధర్మవ్యవహర్తలు కండు. నా బాలను పరమేశ్వరున కంకిత మొనర్చితిమి. పవిత్రవేదమత పునరుద్ధరణ మహా కార్యమునకు నియోగించిన యీ శుభాంగియెడల పాతక మొనర్ప నెంచిన ఈ కర్మ చండాలుడు జీవింపవలసినదేనా? జీవమిచ్చినపక్షమున దైవాయుధమగు నీ బాలయందు మరల మరులుకొని మన ప్రయత్నములు భగ్నముచేయడా?”

మహేశ్వరానందుడు: స్వామీ! ఈతని మరణ మెట్లు కప్పిపుచ్చగలము? స్థౌల: రెండు దినములలో నొక రథము ఈతని శరీరమును ఈతని పురమునకు గొనిపోగలదు. ఊరిబయట చేత నొక కత్తితో నీతడు పడియుండును. ప్రక్కనే నాకడనున్న పామొకటి రెండు తుండెములై కాలికడ పడియుండును. అతని కాలిమీద పాముకాటు స్పష్టముగ కనబడును.

అక్కడనుండు సభ్యులకు దేహము జలదరించెను.

వికృతహాసముచే బీభత్సమగు తాతగారి మోము చూచుచు చంద్రబాల చటుక్కున వచ్చి యాతని పాదములకడ మోకరించి వానిపై మోముంచి కన్నుల నీరు వెల్లువలు గానిట్లు పలికెను: “తాతయ్యగారూ! ఈ తుచ్ఛుడు నిజముగా మరణించినాడా? నావలననే వీనికి జావు మూడినదా? నేనే వీనిపాలిటి మృత్యువునైతినా?” అని వాపోయెను.

స్థౌలతిష్యుడు విసుగుదలతో నామెను లేవనెత్తెను. ఈమె ఓర్వలేకపోవుట యేమి? ఈ బాలిక తనచేతిలోని - కాదు, విధిచేతులలోని - శస్త్రము. నాశనముచేయుట, నాశనము చేయకపోవుట ఆ పని దీనిది కాదు. చిన్నతనము నుండియు నీమెకు హృదయము నశించునటుల తానొనర్చినాడు. ఈమె సుకుమారాంగములందు, మానసమునందు క్రూరత్వము నింపినాడు. మృత్యువును పూరించినాడు. పసితనమునందు లేగదూడల, హరిణముల ప్రాణములు హరించి ఆటగా కిలకిల నవ్వెడిది.

ఈ బాల కిప్పు డీ జాలి యేల పొడమెను? స్థౌలతిష్యుని భ్రూయుగ్మము దరిచేరినది. ఆతని విశాలఫాలమున దున్నిన భూమియందువలె ముడతలు వేనవేలు జనించినవి. ఈ కన్యకాహృదయమున కింకను క్రూరత్వమే పోసెదగాక యని యాత డాలోచించుకొనెను.

“ఓ విషకన్యా! నీవు అగ్నికీలవు, విషకలికవు, మృత్యుధారవు. నీ దేహము కౌగలించిన పాపి నరకమునకుబోవును. నీవు ఉన్నతకులమున జన్మించిన మహాశక్తివి. ఈశ్వరార్పితవు. పరమపవిత్రవు. ఈ నీచుడునీపై చేయి వైచి కలుషమొనర్చినాడు. మహాగ్నికీలను గౌగిలించినవాడు బ్రతుకునా? ఆవితథమైన విధియెత్తికోలున కడ్డముపడి యీ నిర్భాగ్యుడు హతుడైనాడు. వీని నెవ్వరు రక్షింపగలరు? ఈశ్వరనివేదితమును ముట్టిన యీ కుక్కకై వగవకుము. వీనిపాపమే దీనికి మిత్తియైనది. సదాశివగర్భాలయమున వెలుగు దీపార్చివలే నీవు పరమపవిత్రవు. నీపావిత్య్రము రక్షించు కొనుము.”

చంద్రబాల ఆతని మరణమునుగూర్చి యాలోచించుచు మిన్నకుండెను. సభ్యులు భయము గదురు హృదయములతో తలలూపిరి.

స్టౌలతిష్యులంత “ఈ ముహూర్తమున దోష మున్నది కాన వేరొక్క ముహూర్తము నిర్ణయింపబడును” అనెను. ప్రాయశ్చిత్తార్చన జరిగినది. పారాయణ మొనర్చిరి. దీపారాధన అయినది. నైవేద్యార్పణ జరిగెను. స్థౌలతిష్యులా పుష్పముల విషబాలమూర్ధమున నుంచి గాన మొనర్చెను.

“చండమహానల ఫాలవిలోచన!
కాలకాల! ఖలగర్వవిదారణ!
అండజవాహనమిత్ర! శుభంకర!
హర! హర! హర! హర! యీశ
మహేశ మహేశ మహేశ!”

25. సమావేశము

హిమబిందుకుమారి తన ఇంటికి వచ్చినదని తెలిసిన వెనుక సువర్ణశ్రీ కుమారుడు ఆ బాలికకు కనిపించుటకు సిగ్గుపడినాడు.

పాపము, వారిబండి వెనుకబడిపోయినది. తనగిత్తలు అద్భుత వేగము కలవి. సమవర్తిసేనాపతి తోలిన బండి ఆ సుందరిదని తెలిసినచో తాను రెండవవాడుగా వచ్చియుండునే! ఇప్పుడామెను చూచితీరవలయును. ఆ దివ్య సౌందర్యము చూచినంత మాత్రమున తనజన్మ మంతయు పవిత్రముకాదా!

కాని తా నె ట్లామెయెదుట బడగలడు? ఆమె తనను మొరకు వానిని, సౌందర్య హీనుని, వట్టి బొమ్మలు చెక్కుకొనువానిని ఆ దీర్ఘవినీల పక్ష్మముల నెత్తియైన చూచునా?

అవి కన్నులా, లోక మోహన నిశ్చల యామినీ మాయలు కాని! ఆ కన్నులలోని చూపులు, నిర్మల రాకాసుధాకర కళాకోటి! ఓహో తా నెట్లు ఆ చూపులలో అమృతత్వ మొందగలడు?

సువర్ణశ్రీ చల్లగా తన శిల్పమందిరమునుండి వినిర్గమించి, కృష్ణయొడ్డునే యెటకేని పోయినాడు.

అతడట్లు పోయి పోయి, ఎటుల పోవుచున్నదియు తెలియక, కోటి దీప కళికాప్రజ్వలమై దివ్యరూపమైన మహాచైత్యముకడ కరుదెంచినాడు.

ఆ చైత్యమును బౌద్ధశకము నూటపదునారవయేట మహాభక్తుడగు హిరణ్య వ్యాఘ్రపాదశాతవాహనుడు అప్పటి ధాన్యకటక నగరమునకు దూరమున కృష్ణాతీరమునకు కొలది దూరములో ప్రారంభించెనట.

అశోకచక్రవర్తి కాలమునకే ధాన్యకటక చైత్యము పేరునకు వచ్చి యుండెను. అప్పుడశోకుడా చైత్యమును పునర్నిర్మాణ మొనరింప శాతవాహన చక్రవర్తిని కోరి యుండెను. అశోకునకు సమకాలపు ఆంధ్ర ప్రభువు అజితదత్త శాతవాహనుడు. అత డా చైత్యమును ఇంకను పెంచి పెద్దదిగ నొనర్చెను.

అభయబాహు శాతవాహన చక్రవర్తి కాలమునాటి కా చైత్యము పూర్ణరూపము నంది బౌద్ధక్షేత్రమని పేరందెను.

శిల్పచక్రవర్తియు, శిల్ప బ్రాహ్మణవంశములో మహోన్నత యశో విరాజితుడును అయిన ధర్మనంది ఆ చైత్యమును దివ్యమొనర్చి ధర్మ చక్రములు, చతుర్ముఖములు, ఆయక స్తంభములు నిర్మించెను. ప్రదక్షిణాపథ మేర్పరచెను.

ప్రదక్షిణపథమును చుట్టి ప్రాకారరేఖ ధర్మనంది రచింప నారంభించి, శిష్యులచే ఊర్ధ్వస్తంభములు, సూచులు, ఆబంధికములు,ఉష్ణీషములు నిర్మించ ప్రారంభించినాడు.

బుద్ధధర్మము మహాస్థవిరవాద మనియు, మహాసాంఘికవాదమనియు రెండు మార్గముల ప్రవహించినది. మహా సాంఘిక వాదమున ఆంధ్రులు తమకున్న కళారక్తిచే, కళావేశముచే మహాచైత్యవాదము నిర్మించిరి.

ఈ శిల్పవాదము భారతవర్షమంతయు నిండి, యీ జంబూద్వీప మంతటి నుండియు శిల్పుల, ఆచార్యుల, శ్రవణకుల, భిక్షుల ఈ మహాపథ ప్రస్రవణ స్థానమైన ధాన్యకటకమునకు శిష్యులుగా పంపుచున్నది. ధర్మనంది మహాచైత్యవాదమునకు ముఖ్య శిల్పాచార్యుడు. అతని పవిత్ర హస్తము రచించిన త్రిరత్నములయిన పద్మములు, బోధివృక్షములు, చైత్యములును ప్రజ్ఞా స్వరూపములైన జాతక గాథలును లోక విఖ్యాతి నందినవి.

ఆ సంపూర్ణ జోత్స్నాకాంతిలో సువర్ణశ్రీ తన తండ్రిగారి శిల్ప చాతుర్వమును జూచుచు, ఉప్పొంగిపోవుచు, తన శిల్పపుంబనుల గమనింపుచు, ఆ పనులలో తక్కిన శిష్యుల పనితనముకన్న ఎన్నియోరెట్లు మిన్నయగు పనితనమున్నను, తన తండ్రిగారి పనితో పోల్చిచూచిన, తన పనితనములో ఏదో అపరిణతి యున్నదని యనుకొనెను.

ఈ ఆలోచనలచే మై గుబాళింప, ఆతడు ఆ పవిత్రచైత్యము ఎదుట సాష్టాంగపడి లేచి మోకరించెను. తన జనకుని మహోత్తమ రచనా ప్రజ్ఞ ధారణచేసిన ఒక బాలికా రూపముకడ నాత డధివసించి తన తల్లి శక్తిమతీదేవి పోలికలనందు గుర్తించినాడు. ఈ విచిత్రరహస్యము ఇంతకాల మెట్లుదాగున్నది?

ఆర్యకస్తంభ చూళికా వ్యాజమున దేవీప్రతిమగా తన తండ్రి యౌవనవతియైన తన తల్లి శిల్పచిత్రమును రచించినాడు. త్రిభంగియై కుబేరాక్షీ వృక్షము నానుకొని లతవలె వంగి, ఎడమచేత లేతకొమ్మ విలాసముగ బట్టుకొని, కుడిచేత లీలాపాటలీపుష్పము ధరించి హృదయము లీలగా స్పృశించుచు, జటాశిఖ ధరించి, సర్వాలంకారయై, యా బాలిక తోరణశిఖావాతాయనాంతర్గతాలంకార శిల్పరూపమున విన్యసింపబడి యున్నది.

సుందరీమణులగు లతాంగులకును, శిల్పమునకు నుండు అద్భుత సమయ రహస్యములు సువర్ణశ్రీకుమారున కెన్నడు ప్రత్యక్షము కాలేదు. ఇప్పుడాతని సర్వశిల్ప శాస్త్రమంత్రము లొక్కసారి పవిత్రగానశ్రుతులై స్పందనమొనర్చినవి. ఆ విగ్రహమును తదేకదీక్షతో గమనించుచు సువర్ణశ్రీ లేత రావి చెట్టువలె నిలుచుండిపోయినాడు. సమున్నత శరీరియైన యా బాలకుడు స్వర్గమునుండి దిగివచ్చిన దేవకుమారునివలెనున్నాడు. ఆతని హృదయములో శిల్పశక్తి ఊర్మికలై, ప్రవాహములై ఉప్పొంగి మహాప్రళయమైనది. ఆతడు సర్వము మరచినాడు. ఆ శక్తి ప్రవాహములు ప్రవహించి, వేరొకపుణ్యభూమి నుండి ప్రవహించి వచ్చిన సురదీర్ఘకానదీమతల్లియైన ప్రేమశక్తితో సంగమమైపోయినవి. ఆ ద్విప్రయాగ మూర్తియగు నొకదేవి యచ్చట దర్శనం బిచ్చినది. మనోహరగంధ మలయ పవనములు సువర్ణుని చుట్టివేసినవి.

ఆ దివ్యమూర్తి నాట్యదేవతవలె ప్రత్యక్షమై, వివిధాంగహార మనోజ్ఞ రేఖా విలాసినియై, సంపూర్ణరాగరంజిత మనోజ్ఞ గీతికాగానాభినయ కంఠియై, విద్యున్మాలినీహార చలిత పీనవక్షయై తోచినది.

ఆ మూర్తి నాట్యము చాలించి ఎదుట నిలిచినది. సువర్ణశ్రీ ఆ స్వప్నసుందరివైపు బలపూర్ణములై, మహానాగములవలె శక్తివంతములై, మనోహర ప్రౌఢరేఖాసమన్వితములైన తన రెండుచేతులు చాచి మోకరించినాడు.

“ఓ శిల్పదేవీ! సకలమనోజ్ఞ భావపరిపూర్ణరూపా! సర్వరాగనర్తిత కల్యబాల! పరీమళ పుష్పాలంకార వైభవోపేత పారిభద్రతరుమూర్తీ! నీవు ఈ వెన్నెలలో నాకు ప్రత్యక్షమైనావా?” అని అస్పష్టవాక్కుల నమస్కరించినాడు.

పులకితానందశిరీషవృక్షమగు నాతని విగ్రహ మా వెన్నెలలో శ్రుతియై మంజుశ్రీ మూర్తివలె తేజరిల్లి పోయినది. ఆతని కంఠము ఇంకను స్పష్టత తాల్చినది. మధురాభిషేకోచిత శంఖ వినిర్గత స్వనములై యాతని మాటలు వెలువడినవి.

“హిమబిందువా నీవు! ప్రపుల్లనీరేజహృదయస్థ ప్రాతఃకాల తుషార బిందువువా నీవు!”

అంత నాతని యా స్వప్న మధ్యమునుండి “బాలనాగీ దారి ఇమ్మనవే!” యన్న మాటలు వినవచ్చినవి. ఆతడులికిపడి తలయెత్తి స్వప్నలోకము పటాపంచలై మాయము కా, నెదుట హిమబిందుకుమారి నిజముగ నిలుచుండుట గమనించి సిగ్గునంది, చటుక్కున లేచి వెనుకకు తిరిగి పారిపోయినాడు.

26. రాగారుణచ్ఛాయలు

సువర్ణశ్రీకుమారుడు తన సౌధమున కెట్లెట్లో చేరెను. ధర్మనంది యిల్లు చతుశ్శాలాంతరమైన హర్మ్యము. ఈ హర్మ్యమునకు రెండు మేడలున్నవి. ఒకమేడ శుద్ధాంతజనము వసించునది. ఆ మేడ వెనుక స్త్రీజనాశ్రయమైన మండపగృహమును, సూతికాగృహమును ఉన్నవి. మేడల మీదకు పోవుటను రెండు సోపానపంక్తులు కలవు.

సువర్ణశ్రీకుమారుడు దక్షిణ సోపానపంక్తి నెక్కుచు సౌధములోని తన మందిరములోనికి పోయి యా మందిరముననున్న శయనాగారము చేరి పర్యంకమున బోర్లగిలపరుండి మహాచైత్యమందలి దివ్యదర్శనమును స్మరించుకొనుచు, భయపడుచు, ఉప్పొంగుచు వివిధాలోచనాధీనుడై జాగర స్వప్నవశుడైనాడు.

తనమాట ఆమె విని యున్మత్తునిగ భావించలేదుగదా! తా నట్లు చేసినాడేమి? తన ఇంటికి వచ్చిన యా బాలిక యింతటిలో నచ్చటి కెప్పుడు వచ్చినది? నిజముగ నామె యచ్చటికి వచ్చెనా? తలలోని కాంక్షయే యట్లురూపెత్తి వచ్చినదా? నిజముగ నామెయే వచ్చియుండవలయు. ఏలనన, యామెకు కొంచెము ఎడముగ వెనుక వేరొక్క బాలిక కనంబడినది. ఇంకను వెనుక దూరముగ నిరువురు వృద్ధ స్త్రీలమాటలు విననైనవి. తా నట్లు స్పష్టముగ ఉచ్చరించిన వాక్కుల విని యా దివ్యసుందరి నిజముగ తన్ను మతిహీనునిగ నెంచియుండును.

ఆమె పండు వెన్నెలలో పోతపోసిన స్వర్ణవిగ్రహమై సాక్షాత్కరించినది. ఆమె ఏమనుకొనిన నేమి? పూజా ద్రవ్యములే చెంతనున్నచో అట్టి యతిలోక సౌందర్యమునకు షోడశోపచారము లర్పించియుందునుగదా!

ఆమె యెక్కడ? తా నెక్కడ? వర్తకసామ్రాట్టయిన చారుగుప్తుని తనయ యేడ, దరిద్రశిల్ప బ్రాహ్మ కుమారుడైన తా నేడ?

మరల తన కా బాలిక సందర్శన మిచ్చునా? అతిలోక సౌందర్యమును పూజాపీఠిక నెక్కింపగోరని శిల్పియుండునా! ఆ దివ్యసౌందర్యము ఈ బీద యింటియందు వాసము చేయగలదా!

ఇంతలో అతనికి మహానసగృహమునుండి గంట విన్పించినది. తండ్రి గారి అర్చన పూర్తియైనదనుకొనుచు సువర్ణశ్రీ లేచి మేడమెట్లు దిగి స్నాన గృహమునకు పోయినాడు. పనికత్తె అచ్చట వేడినీళ్ళు తొలిపి పెట్టి యుంచినది. అంగ సంస్కారకుడు వచ్చి దేహమంతయు మార్జన నలంది ఉద్వర్తన మొనర్చి స్నానము జేయించినాడు, నాగబంధునికవచ్చి “అన్నా, యింత యాలస్యము చేసినావేమి, ఎచటకు పోయితివి? అట్లు మాయమై పోయినావు! నీ శిల్పగృహమునకు వారందరు వచ్చిరి. నీవు లేవైతివి. నీ కొరకు తోట యంతయు, దొడ్డియంతయు చెల్లి వెదకినది. నీవు అదృశ్యుడవైతివి. పాపము, నా స్నేహితురాలు కొంచెము భిన్న మైనదిసుమా! పలాయనమంత్రపారాయణ కథానాయకుడ వైతివేమి!” అని మేలమాడెను.

“నీ వేళాకోళముల కేమిలే!”

“నావి వేళాకోళములు; తాను పారిపోవుట వీరవిక్రమమట. ఇంటికి చుట్టములు, స్నేహితులు వచ్చినచో పారిపోవు పెద్దమనిసితనము మా అన్నగారిది. ఆ శిల్ప మట్టిది, యీ శిల్ప మిట్టిది అని నీవు చెప్పనక్కర లేదా?”

“ఓ మగవీరుడు చెల్లీ, నీకు తెలియదా! నీ వేల చెప్పవైతివి? ఎవరో శుద్ధాంతకాంతా జనము వచ్చిరట! నేను వారియెదుటబడి యిది యిది, అది అది అని చెప్పవలెనట!

“ఎవ్వరికిని ఏమియు చెప్పనక్కరలేదులే శుద్ధాంతకాంతాజనము, వీరవిక్రమ విహారజనము ఎవరైన వచ్చినప్పుడు మా అన్నగారు లేడి పిల్లవలె బెదరి, చెంగున నురికి పొదలలో మాయమైపోవునట. ఈ ధైర్యమే కాబోలు మొన్న శకటపందెములో నెగ్గించినది.”

ఇంతలో సిద్ధార్థినిక వీరున్న తావునకు వచ్చినది.

సిద్ధా: అన్నా! నీ వెచ్చటికి పోయినావు? హిమబిందును, ఆమె అమ్మమ్మయు, ఆమె మేనత్తయు నాయనగారి బొమ్మలును, నీ బొమ్మలును దీక్షతో గమనించినారు. హిమబిందు అక్కను, నన్ను ఎన్ని ప్రశ్నలు వేసినదని! అక్కయెంతో చిత్రముగ మాట్లాడినది.

నాగ: నే నేమి చిత్రముగా మాట్లాడినానే? ఇంత వెఱ్ఱిదానవు. నాకు చెల్లెలివై పుట్టినా వేమే! హిమబిందు నిన్నట్లు ముద్దు పెట్టుకొనినప్పుడు నీ వంత సిగ్గుపడితివేమి?

సువర్ణ: ప్రపంచములో అందరును నీకు సిగ్గుపడువారే.

సువర్ణ శ్రీకుమారుడు భోజనమునకై దుకూలము ధరించి, అలంకార గృహమున కేగి యచ్చట మార్జనకునిచే తల దువ్వించుకొని, ముడి రచియింపించుకొని, పైన చీనాంబరమును కప్పుకొని తిలకము దిద్దుకొని, యీవలకు వచ్చునప్పటికి మహాలియు, శక్తిమతీదేవియు, సిద్ధార్థినికయు, నాగబంధునికయు ప్రత్యక్షమైరి.

నాగ:అమ్మా! అన్న భయపడి పారిపోయినాడే.

సిద్ధా:అన్న భయపడుటేమి! ఎవరో ఆడవారు వచ్చినారు గదాయని ఎచ్చటికో వెళ్ళినాడు.

నాగ: అవును. బెదరిన లేడివలె వెళ్ళినాడు.

శక్తి:ఊరుకోవే తల్లీ! కొత్తవారి యెదుటపడుటకు అన్నకు కొంత సిగ్గువేసిన, దాని నంతగడబిడ చేసెదవేమి?

నాగ: అన్న శిల్పములు చూచుటకు వారు వచ్చిరాయెను. పోనీ, నా స్నేహితురా లీయనకు క్రొత్తా? తన చుట్టును మేమందరము నాట్యము చేసితిమి కదా!

మహా:ఉండవమ్మా తల్లీ! అన్నగారి నట్లు దుయ్యపట్టుకొంటి వేమి? నీవు లేవా, అన్నియు చెప్పుటకు? వారు సువర్ణుని చూచుటకు వచ్చిరా, బొమ్మలు చూచుటకు వచ్చిరా?

సిద్దా: అమ్మా, అక్క యెప్పుడును నన్ను, అన్నను యీ విధముగానే వేళాకోళములు చేయుచుండునే. నాకు ఎప్పుడో కోపమువచ్చును. నేను నాన్నగారితో చెప్పితీరెదను. సువర్ణ: అందరు ఇచ్చట చేరినారు. అచ్చట నాయనగా రీపాటికి జపము చాలించి యుందురు. పదండి భోజనములకు. అమ్మయు, మహాలియు వడ్డనమాటే మరచిరి.

తండ్రిగారును, సువర్ణశ్రీయు, ముప్పదినలువురు విద్యార్థులును భోజనము చేసిన వెనుక సేవకుడు కరదీపిక చూపించుచుండ, వారందరు ధర్మనంది శిల్పవిద్యాగారమునకు బోయినారు. అచ్చట దంతాసనముపై కృష్ణాజినముపై ధర్మనంది వసించెను. చుట్టును కుడ్యములనంటియున్న శాద్వలాసనములపై విద్యార్థులును, సువర్ణశ్రీయు నధివసించిరి.

ధర్మనంది గ్రంథపీఠముపై భూర్జపత్రశిల్ప శాస్త్ర గ్రంథమునుంచి, అదిచూడకయే బాలుర కుపదేశింప నారంభించెను. భరతనాట్య సూత్రములు, శిల్పసూత్రములు, రూపరచనా ప్రమాణము, అంకము, ధారణము, రూప ప్రతిరూపములు, మాన ప్రతిమానములు, దేవతా మనుష్య గుహ్యక వానరాదిప్రమాణములు, ఉత్తమపురుష లక్షణములు, స్త్రీల యాకారములు, పద్మ సుఖ వీర యోగాది వివిధాసనములు, అభయ, వరద జ్ఞానాదిముద్రలు, లంబ లీల లోలాది హస్తములు, సమద్విత్రి అతిభంగాది భంగిమములు, పద్మ పద్మపత్ర మత్స్య కురంగ చక్రవాకాది లోచనభేదంబులు, గరుడ సమ శుక తిలపుష్పికాది నాసికాభేదంబులు - ధర్మనంది గంభీరకంఠమున ఆ పవిత్ర సమయమున శిష్యుల కుపదేశించెను.

ఈ పాఠము జరుగుచున్నంతసేపును సువర్ణశ్రీకుమారుని మనస్సు హిమబిందు తన యింటికి వచ్చుట, తాను పారిపోవుట, స్థూపముకడ మరల నా బాలికను సందర్శించుట, ఏవేవో పిచ్చిమాటలు తాను పలుకుట, ఆమె “దారి యిమ్మనవే!” యనుట ఈ దృశ్యములన్నియు నాతని మనోనయనాల ఎదుట ప్రవాహతరంగములరీతి ఒకటి వెంటనొకటి వచ్చి మాయము కాసాగినవి.

27. వసంత సౌరభము

పదునారు సంవత్సరములు నిండి పదునేడవ సంవత్సరము రాబోవు తరుణ వయస్సున బాలికలకు వసంతోదయ ప్రారంభము. ఆ వసంతము నందు సౌరభము లలమికొన ఉప్పొంగి వికసించబోవు మల్లికాకుట్మలము హిమబిందు.

చిన్నతనమునుండియు మహారాజకుమారికలకు జరుగని వేడుకలు, లాలనలు, ముద్దులు, మురిపెములు హిమబిందునకు నెల నెలకు జరిగినవి.

హిమబిందుతల్లి ప్రజాపతిమిత్ర. ఈమె సర్వభారతీయ దేశములతో వర్తకమొనర్చు కీర్తిగుప్త వణిక్సంపన్నుని కుమార్తె. కీర్తిగుప్తుల వారు ధాన్యకటకనగరమునందు విశాలమైన రాజవీధిలో తన భవనము నిర్మించుకొని వర్తకము చేయుచుండెను. ప్రతిష్ఠానమునందు, పాటలీపుత్రమునందు, ఉజ్జయిని యందు, పిష్ఠపురము, దంతిపురము, కాంచి మధుర, తాత్రలిప్తి, భరుకచ్ఛము, కౌశాంబి, మహాశకవతి, కన్యాకుబ్జము, పురుష పురము, ప్రయాగ, పుష్కలావతి, కాశీ, తపిక, తక్షశిల మొదలైన ప్రసిద్ధనగరములందు తన వర్తకస్థానముల నేర్పరచుకొని మహోత్తమ వణిక్సంపన్నుడని పేరుపొందినాడు.

ఆ దినములలో గాంధారమున యవనులు రాజ్యము చేయుచుండిరి. యవన వర్తకుడైన డెమిత్రియసును, కీర్తిగుప్తుడును గాఢమిత్రులైనారు. వీరి వస్తువులు వారు, వారి వస్తువులు వీరు వర్తకమునకై మార్చుకొనుచుండిరి. వర్తకమున కంతయు వ్యవహార మనుచుండిరి. వస్తువులు వర్తకమునకై మార్చుకొనుట, వస్తువులు పణమునిచ్చి కొనుట, మూల్యమునకై అమ్ముట క్రయవిక్రయ మందురు. వ్యవహారమును పణమందురు. ఎగుమతి దిగుమతులు మొదలైనవన్నియు వ్యవహారమే. అమ్మకమునకు, కొనుటకు గల వస్తువులన్నియు పణ్యములు. వస్తువులు వర్తకమునకై అమ్మువారు, కొనువారు వణిజులులేక వణిక్కులు. ఈ వ్యవహారములుసల్పు వారిలోకుల, మత, జాతి బేధములన్నియు నున్నవి. కాని భారతదేశమునందు యీ వ్యవహారము చేయువారు ముఖ్యముగ వైశ్యులు. వీరిలో వ్యవహారము చేయువారు వ్యావహారికులనియు, పాశుపాల్యులనియు, క్షేత్రసంస్కారు లనియు మూడువృత్తు లవలంబించు వైశ్యులున్నారు.

వ్యవహారము సలుపువారలలో క్రయవిక్రయులు వస్తువిక్రయ శాలలు పెట్టుకొను వారు వశ్నికులు వడ్డివ్యాపారస్థులును, పెట్టుబడిదారులును. సంస్థానికులు యితర దేశములతో నెగుమతి దిగుమతి లొనర్చువారు. వీరినే సార్థవాహులు, సార్థకులు అనియు పిలుతురు. ఈ వణిక్కులలో ప్రభువులపక్షమున గనులు త్రవ్వించువారును, ఆటవిక వస్తువులను సేకరించువారుగ రెండువిధములవారున్నారు.

నిమి యను రాజు వర్తకశాస్త్రమును రచించినాడట. ఆ శాస్త్రమును చదివి వర్తకులు వైదేహులను పేరును సముపార్జించుకొనిరి. వర్తకులకు వర్తక సంఘములున్నవి. వానిని సంస్థానములందురు. సంస్థానికము లనియు పేరు గలదు.

కీర్తిగుప్తుడనేక జనపదములందున్న సంస్థానములలో సభ్యుడు. కొన్నింటికి అధ్యక్షుడు.

ఆంధ్ర వర్తకులలో కాశ్మీరముతో వర్తకము చేయువారు కాశ్మీర వణిజులు, గాంధారముతో చేయువారు గాంధారవణిజులు. కీర్తిగుప్తుడు నానా దేశవణిజు డని పేరుపొందినాడు. అతనికడ కౌశికులు, మాద్రులు, కాశ్మీరులు, గాంధారులు, మాళవికులు మొదలైన వర్తకులు ఎందరో యుండిరి.

కీర్తిగుప్తుడు గాంధారమునుండి ఔత్తరపథమున పారశీక, బాహ్లిక, తురుష్క వనాయు, కాంభోజ, కశ్యపసముద్ర, యవన దేశములతో వర్తకము చేయుచుండెను. అతనికి సర్వభాషలు గళగ్రాహములు. అన్ని దేశములవారాతని తమ దేశపువా డనియే భ్రమించియుండిరి.

ఈనాడు కీర్తిగుప్తులవారికి డెబ్బది రెండు సంవత్సరములున్నవి. ఆయనకు ఆంధ్రదేశములో వివిధప్రదేశముల ఉద్యానవనములు, ఫలవనములు లెక్కలేనన్ని యున్నవి. ఆర్యావర్తమునందు, దక్షిణాపథ మందు ప్రతిముఖ్యనగరమునందును కీర్తిగుప్తునకు వణిక్శాలలు, భవనములు ఉన్నవి.

కీర్తిగుప్తుడు ముప్పది సంవత్సరముల ఈడువాడై యున్నప్పుడు ప్రయాణము లొనరించి తక్షశిలానగరముచేరి తనభవనమునకు బోయెను. కీర్తిగుప్తుడు ప్రసిద్ధవర్తకు డగుటచే నాతనిరాక వచ్చిన మరుఘటిక యందే వర్తక లోకమున కంతయు దెలిసిపోయెను. నాలుగు గుఱ్ఱములు పూన్చిన రథము నెక్కి రాత్రి మొదటి యామములోనే స్నేహితుడగు డెమిత్రియసు అతితొందరగ పరువిడి వచ్చినాడు. వారిరువురు ఒకరి నొకరు కౌగిలించు కొనినారు.

డెమిత్రియసు వెంటనే కీర్తిగుపుని యాతనిభవనములో భోజనము చేయనీయక తన ఇంటికే కొనిపోయెను. ఆ యవనవర్తకుని భవనము భారతీయ భవనములరీతిగా నుండలేదు. ఆ భవన మొక అద్భుత వనాంతరమున నున్నది. ఆ వనమందు అపఫల, అలివ, యవననారంగ, అంజీర ఖర్జూర, దాడిమ, ద్రాక్ష, బాదమాది యవన ఫల వృక్షములు; లికుచ, రసాల, జంబు, పనస, ఐరావత, బదరీ. రాజాదన, బిల్వ, రంభాది భారతీయ ఫలవృక్షములు, నున్నవి. కరవీరాది అనేక పుష్పజాతు లున్నవి. వన మంతయు కేళాకూళులు. వాని మధ్య వేదికలపై పాలరాతి యవన దేవతా విగ్రహములు కలవు.

ఆ విశాలభవనమున అనేకమందిరములున్నవి. మద్యశాలలో శృంగార సరస్సులున్నవి. అపొలో యను సూర్యదేవుడు, అర్టెకమిస్ అను చంద్రదేవత, అప్రొదితీ గ్రీకు శృంగార రసాధి దేవత, జ్యూసు, జూనో ముఖ్య దేవదంపతులు, విజ్ఞానదేవి యగు ఎధీనీ, కామసుఖదేవు డగు బాఖస్, లోకవార్తాహరుడు హెర్మిస్, దేవకన్యలు మొదలగు పాలరాతివిగ్రహములు, యవన కలశములు అందందు అలంకరించబడి యుండెను. ధూపకరండములనుండి సువాసనధూపము లెగయుచుండెను.

ఇరువురు మెత్తని పరుపులపై సుఖోపవిష్టులైరి. పారశీక సేవకులు జలకలశముల హస్తప్రక్షాళన జలప్రతి గ్రాహకములు తెచ్చుటయు, వారిరువురు హస్తముల కడుగుకొనిరి. కొందరు బాహ్లికసేవకులు రెండు భోజన పీఠముల గొనివచ్చి వారిరువురి ఎదుట నుంచిరి.

భారతీయేతరమగు మ్లేచ్ఛదేశముల బానిసత్వ మప్పుడు విరివిగ నున్నది. కొందరు బానిసబాలికలు సౌందర్యదీప్తలగువారు వచ్చి, గ్రీకు వాద్యములపై వాయించుచు. యవన, బాహ్లిక, హీబ్రు, పారశీకాది భాషలలో పాటలు పాడుచు నాట్యమొనరింప నారంభించిరి. భారతీయ నాట్యమునకు నా నాట్యములకు ఎంతయో భేదముండెను. కీర్తిగుప్తున కివియన్నియు గ్రొత్తవి కావు.

అప్పుడు బానిసలగు న్యూబియాబాలికలు మోయు ఆందోళికపై యూద బాలికలు వింజామరలు వీవ, పారశీక బాహ్లికసుందరులు గొడుగులు తాల్ప, అత్యంత సుందరి యగు నొకజవ్వని వీరిరువురునున్న కడకు వచ్చెను. బానిసలగు సేవకులు కొందరు దంతసింహాసన మచ్చట నుంచిరి. అందలము దిగి ఇరువది వరముల ఎలప్రాయంపు నా మిసిమి మిఠారి వొయ్యారముగ నడచివచ్చుచు నా సింహాసనముపై నథివసించెను.

డెమిత్రియసు కీర్తిగుప్తునిచేయి పట్టుకొని యామెకడకు గొనిపోయి ఎరుక పరచెను. ఈమె “పెర్లా” నా చెల్లెలు, ఈతడు “కీర్తిగుప్తుడు” నా స్నేహితుడు అని ఒకరికొకరి నెరుకపరచెను.

అది మొదలు కీర్తిగుప్తుడు “పెర్లా” (ముత్యము) దేవికి తన హృదయము, తన సర్వస్వము ధారపోసెను. పెర్లా కాతడు ముక్తావళీదేవి యని నామముంచుకొనెను.

రెండు మూడు నెలలలో వారిరువురికి వివాహము జరిగెను. ఆ దంపతుల జీవితము సకలానందపూరితమై మహారాగమైనది. కతిపయ మాసములలో వారు ఆంధ్ర దేశము తరలివచ్చిరి. ముక్తావళిగర్భమున ప్రజాపతిమిత్ర ఉద్భవించెను. ప్రజాపతిమిత్ర యవన భారతీయ సౌందర్యములను, సుగుణములను రెంటిని తనలో సంగమ మొనరించుకొనినది. ఆమె చిన్నతనమునుండియు ఏలోకమునుండియో వచ్చినట్లు తనలోనే తానై, ఇతరులతో కొలది సంభాషణమే జరుపుచు తా నొక్కరితయు ఆడుకొను చుండెదిది.

“వెఱ్ఱిది, విచిత్రమైనది” అను మాటలు చుట్టములు, పక్కములును, “ఏప్పటిపిల్లనో కొనివచ్చి చేసికొనిన వెర్రి సంతానము పుట్టదటమ్మా!” యని కీర్తిగుప్తుని అక్క చెల్లెండ్రును అనువారు. ప్రజాపతిమిత్రకు యౌవన మంకురించి దేవలోకమునుండిదిగివచ్చు మూర్తివలె నయినది. చదువులో మొదటిబిడ్డ, సంగీతములో ప్రథమ బాలిక, నాట్యములో ఊర్వశి. ఆ పరమసుందరాంగిని జూచి చారుగుప్తుడు ఆమె పాదములమ్రోల తన ప్రాణము, ఆత్మ పూజాపుష్పముల జేసినాడు. కోటీశ్వరుని తనయుడైనను సర్వవిద్యాపారంగతుడై, బలసంపన్నుడై, రసగ్రహణపారీణుడైన చారుగుప్తునే వరించినది ప్రజాపతిమిత్ర.

ప్రజాపతిమిత్ర కాపురమునకు వచ్చినప్పటినుండియు చారుగుప్తుడు ఇతరము సర్వము సంపూర్ణముగ మరచిపోయినాడు.

28. స్వర్ణ ప్రతిమ

ప్రజాపతి కాపురమునకు వచ్చిన రెండేండ్లకు వారిరువురకు హిమబిందు ఉద్భవించినది.

ప్రజాపతిమిత్ర ఆనందముకు మేరలేదు. చారుగుప్తుడు సీతదొరికిన జనక మహారాజుకన్న ఎక్కువ ఆనందము నందినాడు. వారిరువురు ఉమనుగన్న మేనా హిమవంతులకన్న ప్రకాశించిపోయినారు.

కోటీశ్వరుడైన వినయగుప్తుడు శ్రీకాకుళమునుండి, కావేరి పట్టణమునుండి, తామ్రలిప్తినుండి, భరుకచ్ఛమునుండి, సువర్ణద్వీప, బలిద్వీప, యవద్వీప, సింహళద్వీప, రాక్షసద్వీప, మలయద్వీప, నీలద్వీప అను ద్వీపాది ద్వీపానేకములనుండి నారికేళ, ప్రవాళ, మౌక్తిక, శోణరత్న, లవంగ, జాయక, ఘనసార, చంద్రబాలా, కోరంగి మొదలైన వస్తువులను తెప్పించును. బంగారము, వెండి, రాగి, ఇనుము, కత్తులు, కరవాలములు, ఛురికలు, వర్మములు, దర్పణములు, నగలు, నాణెములు, విగ్రహములు మొదలగు వస్తువు లెన్నియో దిగుమతులు చేయుచుండెను. ఆతనికి వందల ఓడలున్నవి. కీర్తిగుప్తుడు సార్థవాహుడు, వినయగుప్తుడు సాయంత్రికుడు. సాయంత్రికులను పోత వణిక్కులనియు నందురు. ఇరువురు వియ్యమందుట సముద్రుని తండ్రియైన వరుణదేవుడు, గంగాదేవి తండ్రియైన హిమవంతుడును వియ్యమందుట యని దేశము లాడికొని ఆనందము నందినవి.

చిన్న మనుమరాలు పుట్టినప్పుడు కీర్తిగుప్తుడు, వినయగుప్తుడు హిమబిందున కెన్ని సుందరక్రీడావస్తువులు సమర్పించినారో, ఎన్నియలంకారములు, ఎన్ని భూషణములు, ఎన్ని వస్త్రాదికములు తెచ్చినారో! హిమబిందు క్రీడామందిరముల నెన్నియో సాలభంజికలు, లక్కబొమ్మలు, దంతపు శిల్పములు, గంధపు ఆటసామానులు, ముత్యపుచిప్పల పెట్టెలు, వివిధరకముల శంఖములు, గవ్వలు, పవడముల చందుగలు, పళ్ళెములు, అమూల్య రత్నములు, శిలలుదొలిచిన బరిణెలు, సింహ, శార్దూల, వ్యాళ, ఖడ్గమృగ, మృగాది జంతువుల చర్మము లున్నవి. పూసల పేర్లు, కోటుల ఫణములు విలువచేయు ఎర్ర ముత్యముల హారములు, నవరత్నహారములు, బంగారునగలు, రత్నఖచితహారములు, కేయూరములు, శిరోభూషణములు, మేఖలలు, మంజీరములు, లోలకములు, కర్ణభూషలు, చీనా దుకూలములు, బాహ్లిక పారశీకాది దేశ రాంకవములు, నీలదేశవల్కలములు లెక్కలేనన్ని ఆమెకై మందిరములు, మందిరములు నింపినారు ఇరువురు తాతలు. తన మేనకోడలిని చూచుటకు డెమిత్రియసు ఆంధ్రదేశమున కెన్నిసారులో వచ్చినాడు. చెల్లెలిని మేనకోడలిని తన బావ కీర్తిగుపుడు తక్షశిల కొనివచ్చునప్పు డెంతయు యానందమందినాడు. మేనకోడలు ఆతనికి ప్రాణమైనది. తన కొమరుడు హెరాక్లియసు ప్రజాపతిమిత్రను పెండ్లియాడి తీరవలయునని పట్టుపట్టినాడు.

ప్రజాపతిమిత్ర చారుగుప్తుని పెండ్లియాడనున్నదని శుభలేఖ వచ్చినప్పుడు హెరాక్లియసు డెమిత్రియసు లిరువురు కొంచెము హృదయ బాధకు లోనైరి. కాని వారు యాత్రలు సాగించి, మహదాంధ్రముచేరి, ధాన్యకటకమునకు బోవునప్పటికి వినయగుప్తుని వైభవము వారికన్నుల మిరుమిట్లు గొల్పినది. వారి గాథలలో ధనమునకు ప్రసిద్ధికెక్కిన క్రోసియసురాజు వినయగుప్తునికడకు అప్పుకు రావలెను అనుకొనిరి. చారుగుప్తుడు వినయగుప్తునిమించి, యౌవనములోనే అనేక సముద్రయానములు చేసి సాహసియని కీర్తిగొన్నాడు.

అప్పుడా యవనజనక కుమారులకు చారుగుప్తుని ప్రజాపతి యెందుకు ప్రేమించినదో అర్థమయినది. డెమిత్రియసు ఆంధ్రాచారమున ప్రజాపతిని బంగారుతట్టలో మోసి కల్యాణమంటపమునకు గొనివచ్చినాడు. డెమిత్రియసు భార్య సెలినేదేవి ఆంధ్రాచారముల గమనించుచు, అక్కజంపడుచు. తానును ఆంధ్రాంగనావస్త్రాలంకార శోభితమై ముక్తావళీదేవిచే, వినయగుప్తుని భార్య గుణవతీదేవిచే ఎన్నియో మన్ననల నందినది. చిన్నతనములో యవనభూమియగు గ్రీసులో తా నెరింగిన పెర్లాదేవి వేరు, ఈనాటి ముక్తావళీదేవి వేరు.

హిమబిందు పదమూడవఏడు జరుగుచున్నప్పుడు వృద్ధుడగు డెమిత్రియసు దేవతల జేరినాడు. ఆమెకు పదునాల్గవఏడున ప్రజాపతిమిత్ర వ్యాధిగ్రస్తురాలయినది.

చారుగుప్తుడు మతిలేనివాడైపోయినాడు. దేశదేశముల ప్రసిద్ధి నందిన వైద్యులు చారుగుప్తునిచే నాహ్వానితులై వచ్చినారు. ఆంధ్రధన్వంతరులు, చరక శుశ్రుతాది మహాశాస్త్రకోవిదులు దివ్యసుందరి యగు నా సుశీల ప్రజాపతిమిత్ర రోగముచే ననేక విధముల పరిభవింపబడినారు. ఆమె ప్రజ్ఞాపరిమితాదేవిలో ఐక్యమైపోయినది.

చారుగుప్తుడు, వినయగుప్తుడు, కీర్తిగుప్తుడు మువ్వురును మంచము పట్టినారు. ముక్తావళీదేవికి కన్నుల నీరింకిపోయి యొకపక్షముదినములామె చైతన్యరహితయై పడియుండెను.

హిమబిందునకు తల్లి మాయమగుట యను భావ మర్థము కాలేదు. ఇతరులు ఏడ్చినప్పుడామె దుఃఖించినది. దినములు గడచినకొలదియు ఆమె బెంగచే కృశించి పోయినది. బాలిక దుఃఖము చూచి మువ్వురు వణిక్చక్రవర్తులూ దుఃఖమాపుకొనిరి. ముక్తావళీ దేవి తెలివినంది, తన ప్రజాపతి హిమబిందులో నున్నదని ధైర్యముచెంది యా బాలను దివ్యప్రేమచే చుట్టివేసినది. ఏడులు గడచినకొలది హిమబిందు తేరుకున్నది. కాని ఆమె తల్లి ప్రతిరూపము తన పూజామందిరమున నుంచుకొన యౌవనారూఢయైన హిమబిందు ఆశించినది. చారుగుప్తుడు భార్య నూత్నవధువై తన ఇంటికి వచ్చినప్పుడు, ధర్మనంది బావమరిదియు ప్రఖ్యాత స్వర్ణాదిలోహ శిల్పియునగు అమరనందులవారిచే భార్యా ప్రతిమను చిన్న స్వర్ణమూర్తిగా రచింపచేసినాడు.

ప్రజాపతిమిత్ర హిమబిందును చంక కెత్తుకొను రోజులలో శక్తిమతీదేవి ధర్మనందులవారిచే బాలనెత్తికొనిన మాతృమూర్తిని ధవళశిలా శిల్పముగ విన్యసింపఁ జేసెను. చారుగుప్తుడా రెండవప్రతిరూపము తన పూజామందిరమున నెలకొల్పెను భార్య దివంగతురాలైన రెండవసంవత్సరమున అమరనంది, ధర్మనంది ఇరువురు ఇదివరకున్న ఆమె ప్రతిమల విమర్శించి, తమ స్మృతి శక్తిని సహాయముగొని ప్రజాపతి మిత్రను పద్మాసనాసీనగా, ప్రజ్ఞాపరిమితాదేవిగా నిండు బంగారు విగ్రహముగ పోతబోసినారు. విగ్రహము హిమబిందు పూజాగృహమున పూజాపీఠ మలంకరించినది.

హిమబిందుకుమారి దినదినము ఉదయముననే స్నానాదికము లాచరించి సర్వాలంకారయుక్తయై శుభ్రవసనముల ధరించి మాతృవిగ్రహమును పూజసేయును, తన హృదయమంతయు తల్లితో నివేదింపని దినమామెకు లేదు. పూజయంతయు సలిపి, ఒకనా డాబాలిక ఆ స్వర్ణదేవి కడ మోకరించెను. ఆమె రెండుచేతులు తల్లి బంగారు తొడలపైనిడి మోమామె పద్మాసనముపై నుంచెను.

“అమ్మా! పలుక వేమి?”

29. తల్లి అనుమతి

“అమ్మా, నీవు ఎక్కడున్నావు? ఎక్కడనుండి వచ్చితివి. అక్కడికే పోయితివి. నన్ను నీ గర్భమున గంటివి. అంత చిన్నతనములో నన్ను వదలి మాయమైపోతివి.”

ఉత్కృష్టశిల్పరూపమగు ఆ జాంబూనద విగ్రహము హిమబిందు మాటలకు ఏమి ప్రతి వచింపగలదు!

హిమబిందునకు చిన్నతనముననుండియు దూరమున తోచు ఏదియో ఆశ. అది ధనము కాదు, సంపదకాదు, వైభవముకాదు. మహారాణులు కనీ విని యెరుగని నగలామె మందసముల నున్నవి. మానవమాత్రు డూహింపజాలని విచిత్రవస్త్రాదికము లామె పేటికలలో పాముకుబుసములై, పలుచని మబ్బుల మడతలై, పుష్పపుటములై, స్వప్నములై, శ్రీమద్రామాయణ శ్లోకములై జాలువారుచున్నవి. చారుగుప్తు డాబాలిక ఊహకందని పూవుజాతులు దేశదేశమునుండి సేకరించి క్రీడావనముల పెంచుచున్నాడు. అవి జపాకుసుమజాతులు, ఇవి నీలనదీతరంగడోలార్ధ్ర సహస్రదళకమలములు. ఇవి మల్లికలు, అవి సంపెంగలు. ఇవి శేఫాలికలు, అవి కబంధములు. అక్కడ సూర్యకాంతములు, ఇచ్చట పారసీకమునుండి వచ్చిన గులేబకావళులు. ఇవి సంపూర్ణదాడిమీ పుష్పములు, అవి చీనాదేశమునుండి వచ్చిన అరుణచేరులు. ఇచ్చట కరవీరములు. అవి నాగ లింగములు, ఇవి వకుళములు. ఇవి మాలతీలతలు, అవి మాధవీలతలు.

తన చెలులకు పుష్పవనవాటులు చూపి హిమబిందు పొంగిపోయెడిది. పదునేడేండ్ల మిసిమి వయస్సున నున్న హిమబిందునకు నేడు పుష్పవనవాటులు, నగలు, నాణెములు, ఆటలు, పాటలు ఆనందము సమకూర్చ లేకపోయినవి.

ఒకప్రక్క ఆప్రొదితీదేవి భౌతికవాంఛలు, గాఢకాంక్షలు, ఉడుకు రక్తములు, తీరని కోర్కెలు ఆమెకు వరమిచ్చినది. వేరొకప్రక్క సాధుమూర్తియై చతుర్విధ పురుషార్థ ప్రదాయినియైన మాయాదేవి శాంతమును, శ్రద్ధాభక్తులను అరణమిచ్చినది. ఈ రెండు మహాశక్తులు చిన్ననాటనే ఆమెకు తెలియక ఆమెలో మహత్తరగంభీర సుడిగుండముల జన్మింపజేసినవి. ప్రేమయన నెట్టిదో యెరుగని మొదటిదినాలలో తాను సమవర్తిని ప్రేమించితి ననుకొన్నది. ఆమెకు ప్రేమోదంతములు రహస్య కాంక్షలు అవ్యక్తాందో ళనమును కలిగించెడివి. గ్రీకు బాలికలు పురుషవాంఛలు తీర్చు దివ్యసౌందర్య మూర్తులు. పొంకములు తిరిగిన వారి యవయవముల ప్రత్యణువు పురుషస్పర్శ కాంక్షించును. భారతీయ బాలికలు పురుషులను ఉత్తమపథాలకు నడుపుకొని పోవు దేశికలు. ఇట్లు గ్రీకు యువతీ గాఢకాంక్షలు భారతీయాంగానాశేముషీసంపన్నతయు, స్వాతంత్ర్య భావ జనిత గాఢాభిలాషయు ఆమె హృదయ పథముల ప్రతిస్పందనము కలుగ జేయుచునే యున్నవి.

ప్రజాపతిమిత్ర పూర్ణభారతీయాంగన. ముక్తావళి పెంపుడు భారతీయ లలన. అయినను ఆమె యవనస్త్రీయే.

హిమబిందు తనకు తెలియరాని ఆవేదన తన్ను పొదివికొనినప్పుడు చిన్నతనములో తల్లికడకు పర్వెత్తి, ఆమెఒడిలో తలదూర్చి వెక్కివెక్కి ఏడ్చునది. ఆ అతిలోక సుకుమారాంగి తన కొమరిత మూర్ధము పై చేయి నిమురగనె హిమబిందున కారాటము తీరిపోయి ఏదియో దివ్యానందము ముంచి వేయునది.

నే డా బాలిక తల్లికడకు పర్వెత్తినది. తల్లి సువర్ణవిగ్రహము. హిమబిందు ఆ తల్లి వక్షమున మోమును పొదివికొని “అమ్మా! నా కీవేదన ఏమిటే? నాయనగారిని ఓడించి దేవతామూర్తివలె ఆ యువకుడు విజయసింహాసన మధిష్టించియుండ నేను వెఱ్ఱిదానివలె అతనిచుట్టు నాట్యముచేసితిని. అది తప్పా అమ్మా!” అని వాపోయెను.

ఆ బాలిక కన్నుల గిర్రున నీరు తిరిగిపోయినది. మోమెత్తి తల్లి మోమును చూచుచు “నాకిట్లు ఆతనిచూడ యీ విపరీతపుకోర్కెలేమి అమ్మా! ఆతని చూడకపోయిన నేను బ్రతుకలే నను భయము కలుగుచున్నది. అది తప్పు కాదూ? ఏమియో నాయనగారి ఆలోచనల కాతడు అడ్డమువచ్చినాడని నా నమ్మకము. అమ్మా, అతని గురించి ఆనాటి నుండియు నే నాలోచింపని క్షణ మొక్కటియు లేదే! అది ఎంత తప్పు!”

మరల హిమబిందు కన్నులనుండి ముత్యములు స్రవించి, కరిగి పాటలములగు ఆమె కపోలములనుండి దొర్లిపోయినవి.

“నే నేమిచేయవలెనో చెప్పవా అమ్మా?” తల్లి ముఖమును తదేక దీక్షతో చూచు ఆ బాలికకు ఆ విగ్రహము పెదవుల కదిపినట్లు తోచినది.

“నీవు పో తల్లీ, అంతయు శుభము జరుగగలదు” అని తనతల్లి చెప్పినట్లమెకు స్పష్టముగ కాకలీస్వనములు వినబడినట్లయినది.

మరుసటి క్షణమున ఆ బాలిక గంతువైచి లేచి మాతృవిగ్రహమునకు సాష్టాంగనమస్కృతులిడి కలకలనవ్వులు పూలగుత్తులవలె యామె మోమున ప్రత్యక్షముగా నాట్యమాడుచు పూజాగృహమును వీడి, “బాలనాగీ” యని కేకలువేయుచు పర్వెత్తినది.

ఒక్కచిటికెలో బాలనాగి వచ్చి యెదుట నిలిచినది.

“మా అమ్మమ్మ ఎక్కడ నున్నదే?” అని హిమబిందు అడిగినది.

“భోజన మైనప్పటినుండియు వారు విశ్రమించియున్నారు” అని బాలనాగి యుత్తరమిచ్చినది.

హిమబిందు విసవిస తన ముత్తవ గదిలోనికి పోయినది. ఆమె యప్పుడే లేచి మొగము కడుగుకొనుటకు స్నానగృహమునకు చనినది. హిమబిందు బాలనాగి వెంటరా నా గృహంబునకు పోయినది. ముక్తావళీదేవి పన్నీట మొగము కడుగుకొని పరిచారిక లందిచ్చు శుభ్ర వసనములచే తుడుచుకొనుచు నొక పీఠముపై నధివసించియుండెను. ఆమె మాటలలో యవనాపభ్రంశోచ్చారణ కొంచెము కానవచ్చుచుండును.

“అమ్మమ్మా, అమ్మమ్మా” అని ఇంతలో హిమబిందు వచ్చినంతట మొగము తుడుచుకొను వస్త్రము తీసి ముక్తావళీదేవి మనుమరాలిని చూచి....

“అమ్మడు! ఇదేమి? యిటుల వచ్చితివి? ఆ పరుగులేమి? నీవెప్పుడును అల్లరిపిల్లవు. నీకు ఒక్కక్షణము నిలకడలేదాయెను. ఏ మంత తొందర” యని ప్రశ్నించినది.

హిమ: అమ్మమ్మా, నీవు శక్తిమతీదేవిని ఎరుగుదువా?

ముక్తా: ఎరుగుదునమ్మా. నా కన్నతల్లియు, ఆమెయు చిన్నతనమున అతి స్నేహమున మెలగువారు. వారిరువురకు సంగీతమున, నాట్యమున, సాహిత్యమున గురువులందరు నొకరే. శక్తిమతియింటికి నా కన్నతల్లి పోవునది. మా యింటికి శక్తిమతి వచ్చునది. అవియన్నియు యెప్పటికిని మఱపురావు.

ముక్తావళి కన్నులనీరు గిఱ్ఱున తిరిగినది. ముక్తావళీదేవి కిప్పుడు యేబది తొమ్మిది సంవత్సరములు మాత్రమే యెనను, తలయంతయు కొమరితపోయిన గాఢవిచారమున ముగ్గుబుట్టవలె నెరసిపోయినది.

హిమ: అమ్మమ్మా, యీ దినమున మన మా శక్తిమతీదేవిగారి యింటికి పోవలెనే. వారి అమ్మాయి నాగబంధునికయు, నేనును చదువుకొంటిమి. శక్తిమతీదేవిగారి భర్త నెరుగుదువా?

ముక్తా: ఆ, ఎరుగ కేమి తల్లీ! ధర్మనందులవారు మహోత్తమ శిల్పి. మా గ్రీసుదేశపు శిల్పములకన్న వీరిశిల్పములం దేదియో విచిత్రత, ఏదియో మహోన్నతి నాకు తోచును.

హిమ : అవి అన్నియు చూడవలెనే.

ముక్తా: తల్లీ! యీ మూడేండ్లనుండియు ఎచ్చటికైన కదలుచుంటిమా మనము?

హిమ: అమ్మమ్మా, మనము వెళ్ళితీరవలెను. నాకు అమ్మజ్ఞాపకము వచ్చి ఈ దినమున అతి బెంగచే బాధపడిపోయినాను. మన మెక్కడి కైనను వెళ్ళకపోయినచో నాకు మతియే పోవును.

ముక్తావళి హృదయమున గజగజలాడి “అలాగునే అమ్మా. అమ్మాయి అమృతలతకు వార్త పంపెదను, మీ తాతగార లిరువురును సంఘా రామము విడిచి రారాయెను. అన్నగారు వినయగుప్తులవారు బౌద్ధ దీక్ష తీసికొనెదరని అందరును చెప్పుకొనుచున్నారు. ఈ దినము సాయంకాలము మనము మువ్వురము బాలనాగిని తీసికొని శక్తిమతీ దేవిగారి యింటికి పోదములే” అన్నది.

30. శిల్పసందర్శనము

హిమబిందు కేలనో భయము వేసినది. ఏమియు తోచదు. అలంకారికురాలగు తారాదత్తను పిలువనంపి తనకున్న మంచివస్తువులను, వస్త్రములను తీయుమన్నది. పాము కుబుసములబోలు సన్నని దుకూలములు చిత్రచిత్రవర్ణములు జెలువొందినవి యామె దూరముగా ద్రోచినది. వలిపెములు సముద్రవీచికాఫేన సదృశములై జిలుగుల తళుకు మనునవి నచ్చలేదన్నది. మిలమిలలాడు మడతల కులుకులీను అంబరములు గని పెదవి విరచినది. ఎట్టకేల కామె బంగారువన్నె ఆంతరీయము ధరించినది. వివిధవర్ణ సురేంద్రచాప సౌందర్యముగ సుచేలకము కటిభాగ మలంకరించినది. రత్నతారకలు పొలుపారు సువర్ణమేఖల నొయారంబుగ నెన్నడుము క్రింద మొలనూలు తాల్చినది. వక్షోపరిసానువుల మేఘ మాక్రమించునట్లు ఆచ్ఛాదనోత్తరీయము నీలరుచుల వెలుగుగా సొబగుచేసినది. తుల్యరహిత హారపంక్తులు ఎత్తుపల్లముల ప్రవాహములుగా రచించినది. చంద్రబింబముపై రోహిణివలె రోహితలలాటికము తాల్చినది. వేణీభరమును ఆంధ్ర స్త్రీ లెప్పుడు నూహింపజాలని విధమున రచింపించుకొన్నది. వేణీరచయితలు మార్జనికలు, అలంకారికలు ఆమె యలంకారమగునప్పటికి నలిగిపోయినారు.

హిమబిందు ఠీవితో నొరులకడ గంభీరతవహించి సంచరించినను, చనవున్న వారికడ లో నడంగియున్న బాలికానందము మఱుగపరచలేదు. చంటి పిల్లవలె గంతులు వేయును, కలకల నవ్వును, ఆటలాడును. చిరు గాలులవలె సంతోషముమై సంచరించును, నెచ్చెలులతో హాస్యమాడును. చిన్నతనమునుండియు పిల్లలులేని చారుగుప్తుని కొమారిత బాలునివలె పెరిగినది. బాలికా విద్యతోపాటు బాలుర విద్యలును నేర్చినది.

నాల్గు ఉత్తమాశ్వములు పూన్చినరథము తెల్లకంబళి ఛత్రముగా గప్పబడినది. చిత్రశిల్ప కౌశల్యము కలిగి మెరుగులీనునది, ధర్మనంది మహాభవనముకడ ఆ సాయంకాలము పదమూడవ మూహూర్తనాదము పట్టణములో ననేక ప్రదేశముల ప్రతిధ్వనించునప్పటికి వచ్చి యాగెను. అందు స్త్రీ జనముండిరని తెలియుట తోడనే లోనుంచి పరిచారికలు వచ్చి వారి నెదుర్కొనిరి. తోరణముకడ మహాలియు, శక్తిమతియు ఎవరు? వీరా! యని యాశ్చర్యమందుచు ఎదుర్కొని తెలిసికొనిరి. సేవకురాండ్రు రజత పాత్రంబుల సుగంధజలంబుల నర్పించ కాళ్ళుగడిగికొని లోనికిపోయిరి. పరిచారికలు శుభ్రవసనముల వారిపదము లద్దిరి.

వారందరు అభ్యంతరమందిరములకు పోయిరి. అచ్చట సుఖాసీనయై వివిధవార్తల ముచ్చటించుకొనిరి. కొమార్తెను తలంచుకొని ముక్తావళీ వాపోయెను. అందరును కండ్లనీరు పెట్టుకొనిరి. ముక్తావళీదేవి శక్తిమతిని పిల్లలెంతమందియని యడిగెను. ఏమి చేయుచున్నారనెను. వారిరువురు యెరిగియున్న కాంతలగూర్చి మాట్లాడిరి. ఈలోన సిద్ధార్థినిక వీరువచ్చిరని అక్కతో అన్నతో చెప్పుటకుపోయినది. నాగబంధునిక సత్వరము వచ్చి హిమబిందును కలసికొన్నది. హిమబిందును నాగబంధునికయు నెయ్యముతో ముచ్చటించుకొనిరి, నవ్వుకొనిరి. నాగబంధునికకు హిమబిందు నే డేల యింత విచిత్రముగ, యింత సౌహార్ధముగ తమయింటికి వచ్చి తనతో మాట్లాడుచున్నదో అర్థమైనది.

అందరును ఇల్లు చూచుటకు బయలువెడలిరి. వైభవమునకు, వైశాల్యమునకు, ఔన్నత్యమునకు చారుగుప్తుని మహాభవనముతో ధర్మనంది సౌధము సరిపోకపోయినను సౌందర్యమునకు దానితో నేమాత్రము తీసిపోదు సరిగదా మించియుండును. హిమబిందు కళానిధి యగుట నా మందిరములు చూచి ఆనందించెను. ముక్తావళీదేవియు, అమృతయు, శక్తిమతియు వెనుకబడుటచే నాగబంధునికయు, హిమబిందు ముందుబోయిరి. హాస్యములాడుచు కెవ్వున నవ్వుకొనిరి. చప్పట్లు కొట్టుకొనిరి. అట్లా మందిరము లన్నియు తిరిగి బాలికలు సిద్ధార్థినికతోకూడి తోటలోనున్న శిల్పమందిరమునకు జనిరి. అచ్చటి మహా శిల్పభవనములు విశ్వబ్రహ్మలోకములే! ఆ మందిరముల ఎన్ని సభాభవనములున్నవో వారు విభ్రమమంది గమనించ లేకపోయినారు.

ఆ విశాల శిల్పశాలలలో స్తంభములు గుండ్రముగ నునుపులైన పద్మశిరోపరి భాగముల పటములను మోయుచున్నవి. స్తంభములపై, పటములపై, చిత్రికలపై చిత్రలేఖనములు సహస్రమూర్తియుతములై, వివిధ వర్ణికాభంగసమ్మోహనములై, లలితాంగహారాంకితములై, సకలచిత్రలేఖన కళాలంకారశిల్పరూప మృగ్రపక్షితరులతా పుష్పసమన్వితములై, రసజ్ఞుల వివశులచేయుచున్నవి.

ఆ మందిరముల ఎందరో విద్యార్థులు పనిచేయుచున్నారు. చిత్రములు లిఖించుచున్నారు. రాళ్ళు సరిచూచుచున్నారు. శిల్పకర్మకు ఉచితములైన శిలల శాస్త్రవిధానమున సరిచూచుచున్నారు, చెక్కుచున్నారు. కొలతలు చూచుచున్నారు. నునుపు చేసిన రాలపై చెక్కుటకు బొగ్గుచే రూప విన్యాసము చేయుచున్నారు.

ధర్మనందులవారు కొందరి శిల్పముల సరిచూచుచున్నారు. సరియైన రాల నేరి పరీక్షించుచున్నారు. విన్యాసములు సరియై యున్నదియు లేనిదియు కనుగొనుచున్నారు. కొందరికి శాస్త్రమునుండి సూత్రముల వివరించి, ఇది యిట్లు, అది అట్లు అని చెప్పుచున్నారు.

అతిథులై వచ్చిన యా ఉత్తమాంగనల తనభార్య కొనిరా ధర్మనందియు, బాలకులు లేచి నిలుచుండి వారికి గౌరవమొనర్చిరి.

ఆ బాలకులందరు హిమబిందు అందము చూచి, పనిమాని గురువుగారు చెంతనున్న మాటయే తలపక తదేకదీక్షతో నామెవంక చూడసాగినారు. ఈ దృశ్యము చూచి ధర్మనందియు నాశ్చర్యమందెను.

హిమబిందు తనముత్తవ మేనత్తలతో బాటా శిల్పపుంబనుల గమనించి యాశ్చర్యమందినది. లోన ఉబుకు ఆరాటమునకు కారకుడైన విజయి యగు నా బాలశిల్పి యేడి యని యాశ్చర్య మందినది. సిద్ధార్థినిక ఆ బాలికతో నడుచుచు తనతోటలో నున్నాడని చెప్పినది.

వారంద రా మందిరములలోని అనేక స్థితులలో నున్న శిల్పము, చిత్రలేఖనము లన్నియు తోటలో పరిశీలించినారు. ఆ మందిరములనుంచి వినిర్గమించి వేరొకచోట నున్న సువర్ణశ్రీ శిల్పమందిరములు చూడ బోయిరి.

అచ్చట హిమబిందునకు పరవశత్వమే కలిగినది. ఏమి ఈతని పనితనము! అవి అతని శిల్పములా, అవి చిత్రలేఖనములా!

అదేమిటి! ఆ గోడపై త్రిభంగిగా నిలుచుండిన బాలికామూర్తి ఎవరు? తానే! తా నేల? ఓహో! అందరును ఆ బొమ్మను గుర్తించిరి. హిమబిందును చిత్రలేఖనముగా రచించుట సువర్ణశ్రీ కేమి యవసరము? అని ముత్తవ ముక్తావళి అనుకొన్నది. ఎంత అందముగా నున్నదా బొమ్మ! అచ్చముగ హిమబిందు. ఆమెను అచ్చట నొక దేవీమూర్తివలె రచించినా డీ బాలుడు.

అమృతలతాదేవికి తన మేనకోడలిని ఈ బాలకుడిట్లు లిఖించుట ఇష్టము లేకపోయినది. హిమబిందు పొందిన ఆశ్చర్యమునకు మేరయేలేదు. ఎందు కీ బాలుడు తన చిత్రము లిఖించినాడు? ఎంత పనితనము! ఏమి యా చిత్ర చమత్కృతి! ఆ వస్త్రాదికములు, ఆ నగలు పందెముదినమున నాట్యసమయమున తాను ధరించినవే.

ఆమె హృదయము రాగములు పాడినది. అమృతలత అందరిని ఆలస్యమైనదని కేకలువేయుచు త్వరితముగ బయటకి కొనివచ్చినది. హిమబిందున కెంతమాత్ర మట్లు పోవుటకు ఇష్టములేదు.

సువర్ణశ్రీ యెచ్చటను కనబడడేమి? దాగుకొనినాడా ఊర లేడా? ఎక్కడికైన ప్రయాణమై పోయినాడా? ఆమెకు ఆరాటము ఇనుమడించినది. ఒక అదనున ఆమె సిద్ధార్థినికను “మీ అన్న యేడి?” యని చెవిలో రహస్యమున నడిగినది. సిద్ధార్థినిక పరుగెత్తిపోయి హిమబిందును, ఆమె చుట్టములును, వచ్చినారని అక్కతో చెప్పుటకు వేగమున వెళ్ళినప్పుడు కృష్ణాతీరమున వారిరువు రుండుట చూచి యక్కడకు బోయి యక్కతో చెప్పి పంపించి మరల తాను వచ్చినది. అన్న అక్కడ యుండు ననుకొని ఇప్పుడు నామె యచ్చటకు బోయినది. అత డక్కడ లేడు.

తోటయంతయు వెదకినది. తోటమాలీల నడిగినది. వారిచే వెదకించినది. తన భవనముల వెదకినది. సేవకులచే వెదకించినది. సువర్ణశ్రీ ఎచ్చటను లేడు. ఏమైపోయినాడు?

ఆమెవచ్చి హిమబిందు చెవిలో అన్న ఎచ్చటకో పోయినాడని చెప్పినది. హిమబిందునకు ఆశ్చర్యము, కోపము, విసుగు, విచారము వచ్చినవి.

ఇంక నామె కేమియు తోచలేదు. తొందర తొందరగ అన్నియు చూచుట ముగించి “వెళ్ళెద” నని శక్తిమతితో నామె యనినది.

నాగబంధునికయు, శక్తిమతియు వారిని ఇంకను ఉండుడని కోరిరి. ముక్తావళీదేవి శక్తిమతితో నింతవరకు తనతనయను గూర్చి ఎన్నియో చెప్పి వాపోయినది. ఆమె కన్నుల అశ్రుధారలు ప్రవాహములై పోయినవి. శక్తిమతియు దన స్నేహితురాలి సుగుణముల వేనోళ్ళ పొగడుచు కన్నుల నీరునిండ విచారించినది. అందరికిని అశ్రుధారలు వాకలైనవి.

అమృతలతాదేవి వేగిరముచేయ వారు మువ్వురును బాలనాగియు బయలుదేరిరి.

కస్తూరిచే సమ్మిళితమగు కుంకుమబొట్టు శక్తిమతీదేవి ముక్తావళీ దేవికిని, హిమబిందునకును మోమున నుంచినది. నాగబంధునిక వారి పాదములకు లత్తుక నలదినది.

పద్మరాగమున నెఱ్ఱవారి, చిరుతామర మొగ్గలరీతి మంజులములై ఆర్ధ్రములై నవకంబులీను వేళ్ళతో, ముక్తావళి హిమబిందుల ఇరువురి పాదంబులు తన చేతికాంతులతో వియ్యమొందునప్పుడు నాగబంధునిక ఆపాదద్వితీయ సౌందర్యమునకు నాశ్చర్య మందినది. హిమబిందు పాదములు తన యన్నగారి శిరస్సును, సత్యాదేవి పాదములు శ్రీకృష్ణుని శిరస్సునువలె తాడన మొనర్ప తగునని యామె యాలోచనల మునింగినది.

గంధ మలంది, సువాసనద్రవ్యము లర్పించి, చూతఫలములు, నారంగములు, ఖర్జూరములు, దాడిమాదిఫలములు, బాదమిపప్పు, చారపప్పు మొదలయిన పప్పులు; లవంగ, దాల్చిన, ఏలకీ, జాజి, జాపత్రి మొదలయిన సువాసనద్రవ్యములు, సుందర వస్త్రములు ముక్తావళీ హిమబిందులకు శక్తిమతీదేవి యర్పించినది. సిద్ధార్థినిక లోనికిపోయి అయిదు లిప్తలలో పరుగునవచ్చి హిమబిందునకు సువర్ణపాత్ర నొకటి అత్యంత మనోహర శిల్పవిన్యాసము కల దానిని తన తండ్రిగా రిమ్మనినారని చెప్పుచు సమర్పించినది. ఆ పనితనమునకు ఆ బాల ఎంతయో ముదమందినది.

వారందరు తమ స్యందన మారోహించి తమ భవనమునకు బోవుచుండ హిమబిందున కేమి తలంపు కలిగినదో, “అమ్మమ్మా, మహాచైత్యమునకు బోయి, ఆరాధన చేయవలె” నని యన్నది. ఆ మాటలకుముత్తవ ప్రతి అడకుండగనే సూతునకు రథము మహాచైత్యముకడకు పోనిమ్మని ఆజ్ఞ యిచ్చినది.

ఏ మథురభావఫలశ్రుతి నాశించి హిమబిందచ్చటకు పోగోరెనో అది అచ్చటనే ఆమెకు సిద్ధించి సువర్ణశ్రీ దర్శనమిచ్చినాడు. అది ఏమి విచిత్రమో తన కాతడు మోకరిల్లినాడు.


***

 1. సుమారు 1260 ధనువులు,
  ఇప్పటి 12 అణాల వెలగల వెండి నాణెము.
 2. ఒక ఏనుగు = 1 రథము = 3 గుర్రములు = 5గురు బంటులు
 3. నడుము వరకు నుండు ఇనుప చొక్కా
 4. మోకాళ్ళవరకు కప్పు గొలుసుల కవచము
 5. చీలమండలవరకు వ్రేలాడు కవచము
 6. చేతులకు తొడుగుకొను ఇనుపచేయి