Jump to content

హిమబిందు/ద్వితీయ భాగం

వికీసోర్స్ నుండి

(ద్వితీయ భాగం)

1. ముట్టడి

మవర్తి యుద్ధమున ఆరితేరిన బంటు. కాని వినీతమతికి సర్వ విధముల తోడగుటయేగాక, ఆత డుపశమించునప్పుడు తానే అధిపత్యము వహించి లగ్గల కెగబ్రాకు విరోధుల తోలివేయుచుండెను. కోటగోడలకు కందకమునకు దూరముగా విరోధిసైన్యముల అఖండయంత్రప్రయోగ వృష్టిచే తరిమివేయుచుండెను.

ఒకనాడు సమవర్తి గుఱ్ఱముపై నధివసించి, కోటగోడలకు, బురుజులకు, ద్వారములకు బోవు రహస్యపుదారులన్నియు గలియు మూలప్రదేశమున నిలిచి, తనకడనున్న చారులతో మాట్లాడుచు నాలోచించుకొనుచుండెను.

ఒకడు: స్వామీ, మనకడనున్న భోజనసామాగ్రులు కొంచె మెచ్చు తగ్గుగ అయిపోయినవి. శత్రువుల రహస్యచారులు మనము త్రాగునీళ్ళలో రెండుసార్లు విషము కలిపినారు. ప్రయత్నము విఫలమైనను ఎప్పటికప్పుడు భయముగా నున్నది.

ఇంకొకడు: ఆర్యా! ఉన్న నాలుగు సర్వతోభద్రములు (రాళ్ళు విసరునవి) చూర్ణములైనవి. పదునాలుగు జామదగ్న్యములు (వివిధబాణముల పరపు యంత్రములు) పాడై ఒక్క యంత్రము మాత్రము ఉత్తరద్వారముకడ పని చేయుచున్నది. ఆరు దేవదండములు (అనేకములగు పెద్ద మేకులతో వాడిగా నున్న దూలములను విసరునది), పదునొకండు విశ్వశాఖలికములు (బరువువస్తువులను వేగముగా విస్తరి విరోధుల పిప్పిచేయు యంత్రములు), శతఘ్నులు, వరాహకర్ణములు, కనాయములు, కల్పణములు మొదలగు ఉపకరణము లయిపోనున్నవి.

మూడవయతడు: ఇంతవరకు పదిదినములనుండి మన వేగులవారు పైనుండి లోనికి వచ్చుటగాని, లోనుండి పైకి పోవుటగాని జరుగుటలేదు. మూడు రాత్రులలో పదునలుగురు చారులను పంపినాము. కాని విరోధులు వారిని గ్రహించి కారాగృహముల నుంచి నిజమునరయుటకు వారిని బాధించు చున్నారని తెలియుచున్నది. ఎంతమంది వెళ్ళినారో అందరి పేరులు తెలియజేసినారు.

నాల్గవదళవాయి: వీరోత్తమా, శస్త్రవైద్యుల మందులై పోయినవి. గాయములు తగిలినవారు అదృష్టవంతులైనచో జీవించవలయును. లేనిచో దివంగతులు కావలయును.

సమవర్తికన్నులు మిరుమిట్లు గొలిపినవి. అతనికి భయమనునదిలేదు. శత్రువులు తన్ను పెట్టు బాధలు అతనికి మరింత ఉత్సాహము కలుగ జేయును. మీసములు మెలి పెట్టుచు “ఆంధ్ర సైన్యముల నన్నింటిని నురుమాడినను, వారి అస్త్రముల నుగ్గుచేసినను, వారి ఆత్మలు విజయమొందును. మన కేమియు భయములేదు. చక్రవర్తి నా వెంటనే శుభదినమున బయలు దేరియుండును. వారు అడవులవెంట రారు. సైన్యము లనేకము లగుట కళింగమునుండి వచ్చెదరు కాని, ఇచటికి చేరుటకు ముప్పది అయిదు దివా రాత్రములు పట్టును. నేను వచ్చి యిరువది యేడు అహస్సులయినది. కావున నింక నొక పదునాలుగు దినంబులు మనము మహారణంబు సలిపి చక్రవర్తికై యెదురు చూడవలయును. శాతవాహన పతాకంబగు “సింహము” ఉజ్జయినీ కోటగోడలనుండి పారిపోవునాడు కొనయూపిరితో సార్వభౌమునికై యెదురుజూడదా? ఇది నాయాజ్ఞగా తెలుపుడు. ఒక్క చారుడును ఉజ్జయినికోట వీడవలదు. వరితవుడుగంజి కాచి ప్రతివారును మధ్యాహ్నము త్రాగవలయును. యవధాన్యపుముద్ద ఒకపూటను, బియ్యపు ముద్ద రెండవపూటను ఉపయోగింపవలయును. విరోధుల ఆయుధములు వ్యయము కానిండు. ముఖ్యావసర మగునపుడే మనయస్త్రముల నుపయోగించెదము గాక! కోటబురుజులలో కొలది గాయము తగిలిన వెంటనే వేరొకడా స్థలము నాక్రమింపవలయును. ముఖ్యావసరములై నప్పుడుమాత్రము సగము బలముతో యుద్ధము సలిపెదము” అని మేఘగర్జనముల నాత డాజ్ఞాపనల నెరుకజేసెను. అందరును మహోత్సాహముతో “విజయ! సమవర్తవిజయ!” అని జయపెట్టిరి. శంఖముల నొత్తిరి. భేరీనినాదములు బయల్వెడలెను.

విరోధు లీ జయధ్వానములు విని నివ్వెరగందిరి. చక్రవర్తి వచ్చుచున్నాడేమోయని భయపడిరి. అప్పుడు మాళ్వాధిపతియు మంత్రులు తదితరులు నొక సభ కావించుకొనిరి. వారి కేమియు తోచుటలేదు. ఏ వార్తలు తెలియుటలేదు. ఒకవేళ చక్రవర్తి వచ్చుచున్నాడేమో! ఏది యెట్లయినను రెండు రోజులలోపల ఆంధ్రుల నుగ్గుచేసి కోటజొరబడి స్వాధీనము చేసికొనకున్న తమ ముందుగతి ఏమగునో?

2. జైత్రయాత్ర

శ్రీముఖసాతవాహనుని సైన్యములు ఆంధ్రరాజ్యరత్నమగు ధాన్యకటకనగరమున కృష్ణానదియావల మహాసైన్యస్థానమున విడిసియున్నవి. మహాసైన్య స్థానము - పది గోరుతముల పొడవున నున్నది. వెడల్పు మూడు గోరుతములు.

ఆ స్థలమంతయు మహానగరమువలె నేర్పాటు గావింపబడినది. చక్కని వీధులు, రాజమార్గములు, శృంగాటకములు, వీధుల పొడుగున శిబిరములు, వైద్యశాలలు, వర్తకవీధులు, క్రయ విక్రయశాలలు, వినోద మందిరములు, మదిర మందిరములు విశ్వకర్మ ఒక రాత్రిలో నిర్మించిన ఇంద్రనగరమువలె ఆ సైన్య స్థానము వికసించినది.

ఒకయెడ గజయూధముల భాగము. అచ్చట రెండువేల గజము లున్నవి. దేనినైన హింస యొనర్చిన ఊరకుందురేమో కాని, అడవిలోనైన గజమును ప్రబలకారణములేక చంపినవారికి మరణమే దండనము. గజముల పట్టుకొనుట, వానిని పెంచుట, వాని భోజనము, మావటి వాండ్రు, గజాలంకారములు, కవచములు, తోత్రకములు, నిగళములు, ఆలానములు, అంకుశములు, వరత్రములు, అంబారులు-ఇవి అన్నియు గజాధ్యక్షుని యధికారములో నుండును. ఒక్కొక్క ఏనుగునకు నలుగురు మావటీ లుందురు. ఇద్దరు పదాతులు, ఇద్దరు సేవకు లుందురు. భద్రదంతావళమునకు ఇద్దరు ఆలంకారికులు, ఎనమండుగురు మావటీలు, నలుగురు సేవకులు. అధివసించువాడు గజసాహిణి. అతనికి కవచరక్షకుడొకడును, ఆయుధకు డొకడును ఉందురు. భద్రగజమునకు రక్షణగా సాధారణగజములు రెండు ఈవలావల నుండును.

ఆంధ్రులు విదేహమునుండి అత్యుత్తమమైన ఏనుగులు కొనుచుండిరి. తమదేశములోని దశార్ణ, అపరాంతములనుండి మధ్యజాతి ఏనుగుల సముపార్జించెదరు. సురాష్ట్రమునుండి హీనజాతులు వచ్చును. సురాష్ట్రగజములు, సరకులు, శిబిరములు మోయుటకు మాత్రము పనికి వచ్చును. భద్రజాతి దంతావళము లన్నియు విదేహమునుండి వచ్చును.

సైన్యశిబిరములలో గజములకు శాలలు లేకపోయినను, సైన్యము రాజధానీ నగరమున నున్నప్పుడు వానికి శాలలున్నవి. శాల ఏనుగు పొడుగు ఎంత యుండునో అంత ఎత్తుండవలెను. ఏనుగు ఎత్తులో సగము శాలవెడల్పు. మగ ఏనుగు లన్నిటికి శాలలు వేరు, ఆడ ఏనుగులశాలలు వేరు. శాలకు వెనుకగా ఏనుగు నిద్రబోవు స్థలముండును. ఏనుగు దేనినైన యానుకొని నిద్రబోవును. కావున శాలవెనుక ఎత్తయిన ప్రదేశము నిర్మింతురు.

ఏనుగులకు శిక్షకులు వేరు, మావటివారు వేరు. శిక్షకులు గజశాస్త్రజ్ఞులు. మావటివారలలో ప్రథమశ్రేణివారు యుద్ధకాలమందు ఏనుగులను నడుపుదురు. వారికి గజయుద్ధపు మెలకువలన్నియు కరతలామలకములు. ఏ విధమైన అస్త్రము వచ్చినను దానిని తప్పుకొనునట్లు ఏనుగును నడప వలెను. గజవేగమును కాలమునకు తగినట్లు వృద్ధి చేయవలెను. ఏనుగునకు వంటవండువారు వేరు. సాధారణపు మావటివాండ్రు ఉదయమున నేనుగును నదికిగాని సరోవరమునకుగాని తీసికొనిపోయి కడుగవలయును. దినాంతమందు, మూడవయా మధ్య మందు మరల కడుగవలయును, యుద్ధ గజములకు తక్కిన యూధముతోబాటు నడచుట, పరుగిడుట, పక్కకు తప్పుకొనుట, యెదురుగ ముఖమునుంచి మూలగా ముందుకుసాగుట, చటుక్కున వంగుట, తొండముతో గజ గదాదండము పుచ్చుకొని గజమును రథమును ఆశ్వికుని తాడించుట, మూర్ధములతో గజముల రథముల తాకుట, వేగముగపోయి తాకుట, మూర్ధములకు బిగించిన శూలముతో తలవంచి దేనినైన తాకుట, రెండుకాళ్ళు పైకెత్తి నిలుచుండి కాళ్ళతో మర్ధించుట, తొండముతో గజముమీదనుండి రథముమీదనుండి గుఱ్ఱముమీదనుండి వీరుల లాగిపార వేయుట, కోటగోడల గోపురద్వారముల మూర్ధముతో తాకుట, గజ గదలతో మహా దండములతో తాకి పగులగొట్టుట, తనవారిని ఎత్తుకొని కంఠమున మావటివానికి అందిచ్చుట, చప్పుడుచేయక నడచుట, కాళ్ళతో మర్దించుచు ఉరుకుట, ఈదుట, అగ్నిబాణముల పట్టుకొని మట్టిలో దూర్చి నీటిలోముంచి ఆర్పుట, తిరిగి విరోధులపై విసరివేయుట అగ్నిదండముతోడ విరోధుల కాల్చుట-ఇవి యుద్ధగజములు నేర్చుకొన వలసిన యుద్ధతంత్రములు.

ఏనుగులకు వైద్యము చేయువారును, భూతవైద్యులు నున్నారు. ఆంధ్రసైన్యముల గజహారము కొలత - ఒక ద్రోణము బియ్యము, అర్ధ ఆఢకము నువ్వులనూనె, మూడు ప్రస్థముల నేయి, పదిపలముల ఉప్పు, ఏబది పలముల నారి కేళములు అరటికాయలు, రెండు ఆఢకముల పెరుగు, పదిపలములబెల్లము, ఒక ఆడకము మదిరము, రెండు ఆఢకముల పాలు, రెండు భారముల యవగడ్డి, రెండుంగాలు భారముల ఆకుపచ్చగడ్డి, భారము లో ఆరవవంతు వట్టిగడ్డి ఆకు పప్పు దినుసుల మొక్కలును.

గజసైన్యము వెనుక ముఖ్య యుద్ధాంగము రథము. రథములలో నాలు గుఱ్ఱములు పూనిన రథములు, రెండు గుఱ్ఱముల రథములు, ఏకాశ్వ రథములు అని మూడు రకములున్నవి. ప్రయాణమునకు, విలాసవిహారమునకు రథములు వేరు. యుద్ధరథములు వేరు. విలాస రథములకు ఎనిమిది గుఱ్ఱములుకూడ ఒక్కొకప్పుడుండును. యుద్ధరథములు తేలికయైన గట్టిదారువులతో నిర్మింపబడును. చక్రములు బరువైన గట్టిదారువుతో నిర్మింపబడును. రథనిర్మాణము, వానిని మంచి స్థితిలో నుంచుట, వానియం దుంచవలసిన ఆయుధములు, రథసూతులు, రథాశ్వములు, వారి పోషణఅంతయు రథాధ్యక్షుని అధికారమున నుండును.

రథము వెనుక అశ్వ సైన్యము ముఖ్యమైనది. దేశములోని గుఱ్ఱము లన్నిటి విషయము, వాని జాతి, సుడులు, వాని ఈడు, గుణగణములు మొదలైన విషయము లన్నియు ఒక గ్రంథములో వ్రాయుదురు. జాతినిబట్టి లక్షణములనుబట్టియు గుఱ్ఱముల యుద్ధములో జేర్చుకొందురు.

వేగ, మధ్యవేగ, మందగతిగలవి; తీష్ణ, మధ్యమ, శాంతి స్వభావములు గలవిగా గుఱ్ఱముల వేరుచేయుదురు. అవి ఉద్భవించిన దేశములబట్టి వానిని వివిధనామముల పిలుతురు. కాంభోజ, సింధు, ఆరట్ట, వనాయు, బాహ్లిక తురంగ, సౌవీర, సాపేయ, తైతల, పారసీకము లని వాని పేర్లు.

వీనిలో కర్కశములగు అశ్వములే రథములకు పనికివచ్చును. పారసీక ననాయుజ తురంగ జాతులు ఆశ్వికులకు మంచివి. కాంభోజ, సైంధవ ఆరట్టజ బాహ్లికాశ్వములు రథముల కుత్తమమైనవి. కులీనములు ఆజానేయములు చక్రవర్తి రథములకు ప్రత్యేకింప బడును.

మంచిజాతి అశ్వముఖము ముప్పదిరెండు అంగుళము లుండవలెను. అశ్వము పొడవు ముఖము పొడవునకు అయిదురెట్లుండవలెను. జంఘలు ఇరువది అంగుళములు, ఎత్తు ఎనుబది అంగుళములు, వక్షము చుట్టు నూరు అంగుళములుండవలెను అని ఏర్పరచిరి. రెండవజాతి గుర్రములు కొలతలలో మూడంగుళములు తక్కువ యుండును.

విరోధులు గుర్రములకు విషమిచ్చి చంపించుచుందురు. కావున వాటి శాలలు విశాలముగ కట్టుదిట్టములు కలిగియుండును. శాలలలో కోతులు ఆరోగ్యము కొరకు, పిల్లులు, మయూరములు, ముంగిసలు, జింకలు పాముల చంపుటకు రక్షకులనుంచుదురు. చిలుకలు, మైనపుగోరు వంకలు, పికిలిపిట్టలు విషము పరిసరముల నున్నపుడు అల్లరిచేయును. కోకిలలు విషము ప్రాంతములనున్న చనిపోవును. కౌజుపిట్టలకు విషాఘ్రాణముచే కన్నులెర్రపడును. 

3. మహాసభ

ఆంధ్ర సైన్యములలో అశ్వముల కిచ్చు యుద్ధశిక్షవర్తనము, కృప వేణుక వర్ధమానకము, యమకము, నీచైర్గతము, ప్రకీర్ణక, ఊర్నిమార్స, త్రితాళ, శరభప్లుత, శరభక్రీడిత, సింహాయత, కపిప్లుత, భేకప్లుత, ఏకప్లుత, ఏక పాదప్లుత, కోకిలసంచారి, హ్రస్వ, బకచారి, ఘోరణకి, మయూర, నాకుల, వారాహ, సంజ్ఞాప్రతీకార, మార్గవిక్రమ, భారవాహ, ధారా, ఉపకంఠ, ఉపజవ, మొదలగు గతులతో, నడకలతో కూడియుండును.

అశ్వము ఎట్టిధ్వనికైనను బెదరకూడదు. అశ్వికుడు లేకపోయినను యుద్ధభూమిని వదలరాదు! ఉత్తమాశ్వము పన్నెండు యోజనములకన్న ఎక్కువ పరుగిడకూడదు. (ఇప్పటి ఆరు ముప్పాతిక మైళ్ళు) సాధారణముగ పదియోజనమున్నర పరుగిడవలెను. వృద్ధాశ్వములను పనిచేయించక ఆహారమిచ్చి పెంచెదరు. అశ్వసూతులు గుర్రమును బాగుగా తోమి కడిగి చందన మలందవలెను. రోజును రెండుసార్లు క్రొత్తపూలదండలు వేయవలెను. ప్రతి గుర్రమును గురించి భూతములకు ఫలాదు లర్పించవలెను. ఉత్తమ బ్రాహ్మణులు వచ్చి అశ్వినీదేవతలకు వేదమంత్రములు చదువవలయును.

ఆంధ్రపదాతిదళములు నాలురకము లున్నవి: ఎప్పుడును చక్రవర్తికడ జీతములు పుచ్చుకొనుచుండువారును, మాండలికాదిసామంతులకడ సర్వకాలము నుండవలసిన చమువులును, జైత్రయాత్రకై యితరదేశముల నుండి భత్యములకైవచ్చు దళములును, యుద్దకాలమునందుమాత్రమే చేరు సాధారణ ప్రజానీకము.

పదాతిదళములలో సైనికులు వారి ఆయుధములనుబట్టి నాలుగు తరగతులక్రింద విభజింపబడియుండిరి. విలుకాండ్రు, దుర్గభేదకులు, శూలికులు, యాంత్రికులు.

విలుకాండ్రకు శిరస్త్రాణము, వక్షఃకవచము, హస్తపాదఫలకములు నుండును. వారు నడుమున, కటిభాగమున, వీపున, శిరస్సున అంబులపొదులను కట్టుకొందురు. ప్రతి విలుకానికి నాలుగు ధనుర్దండములు, పదునారు వింటి తాడులును, ఎడమచేతికి అంగుష్ఠ రక్షలు నుండవలెను. వారి నడుమునకు రెండు చురకత్తియలును, ఆయుధములు కూడ ఉండవలెను. శూలికులకు ఒకశూలము, మూడు శూలముఖములు, ఫలకఖడ్గము, ఛురికయు ఉండవలెను.

యాంత్రికులు సర్వతో భద్రాదియంత్రములు ఉపయోగింతురు. వానిని రక్షింతురు. వానికి తగిన పరికరములన్నియు సేకరింతురు. వలయునెడల కత్తిపట్టి పోరాడగలరు. దుర్గభేదకులు దుర్గములకు సొరంగములుచేయుట, లగ్గలకు తాటినిచ్చెనలువేసి ఎగబ్రాకుట, కందకముల నీదుట, కందకములకు వంతెనలు కట్టుట, దుర్గభేదకయంత్రము లుపయోగించుట, దుర్గరక్షణ చేయుట-వీనిలో అత్యంతకౌశలము కలవారు.

మహారాజగు శ్రీముఖశాతవాహనుడు తాను జైత్రయాత్ర కరుగుటకు మహాసభను పిలిపించెను. వివిధ విషయములనుండి సభ్యులు విచ్చేసిరి. గ్రామాణులు, దళనాయకులు, శతనాయకులు, వివిధ సమితి సభాధ్యక్షులు, వివిధ శాఖాధ్యక్షులు, మంత్రులు, బౌద్ధభిక్షుకులు, భిక్షిణులు, పండితులు, వణిక్సమూహాధిపతులు, వివిధశ్రేణి సంఘాధ్యక్షులు, చిత్రకారకులు, శిల్పులు ఆ మహాసభలో సభ్యులు. అందరకు రాజాజ్ఞలు అందగనే అధిపతి సలుపబోవు నుత్కృష్టకార్యమునకు అనుమతి నీయుటకుగాని, వీలు లేదని త్రోసిపుచ్చుటకు గాని విచ్చేసిరి.

విశాల మగు సభాభవనమున మహారాజు సింహాసనాసీనుడై యుండెను. సభికులు కొలువుదీరి యుండిరి. ప్రధానామాత్యుడగు అచీర్ణుడులేచి సభ్యుల దిక్కుమొగంబై ఈ విధమున నుడివెను: “మహాసభ్యులారా! మాళవాధిపతి మనరాజ్యమునుండి విడివడి, మహారాజుపై యుద్ధము ప్రకటించి, యుజ్జయినీకోటలో వినీతమతిని ముట్టడించినాడు. మాళవునికి సహాయముగా భోజులు, పుళిందులు, వైదేహులు, మాగధులు వచ్చి చేరినారట. ఆంధ్ర రాజ్యము గొడ్డుపోయినదా? గౌతమీ కృష్ణవేణి పవిత్రాంబువులు మీ రక్తాల ప్రవహించుట లేదా? ప్రియదర్శి యగు నశోకచక్రవర్తికి లోబడక సమముగా రాయబారముల నడిపి స్వతంత్రపూరితమై ఒరులకు తల యొగ్గక విశాలమై ఆంధ్రపతాక మగు సింహధ్వజభీషణారాహంబుల దశదిశల పర్వజేయు మనదేశము నేడు మాళవునిచే పరాభవింపబడవలెనా? ఉజ్జయినిలో మాళవుడు విజయ మందును. ఆ సైన్యముతో మనదేశము పై విడియును. ధాన్యకటకము కృష్ణలో కలియవలెనా? ప్రతిష్ఠానము గౌతమిలో లీనమై పోవునా? కాకుళము సముద్ర తరంగములలో మాయమైపోవునా? ఆంధ్రరాజ్యలక్ష్మీ ఫాలమునుండి సౌశీల్యతిలకము మాసిపోవునా? లేక ఆంధ్రసైన్యములు మహారాజు స్వయముగా నడుపబోయి, విజయ యాత్రసలిపి విరోధుల నడంచి ఆంధ్రపౌరుష మెల్లయెడల చాటిరావలయునా? తెలియజేయుడు. ఇంకొకటి ఈ జైత్రయాత్ర కగు వ్యయము మహాభాగుడగు చారుగుప్తులవారు భరించెద మని వాగ్దానము చేసినారు.”

ఇటులనే సర్వసైన్యాధ్యక్షుడు ఉపన్యాసము సలిపెను. అనేకవేల జనులు ప్రోవైయున్న యా మహాసభ జయజయధ్వానములుసలుపుచు, మహారాజు ఈ జైత్రయాత్ర విషయమై ఏమి యొనరించినను వల్లెయని యొప్పుకొనిరి.

ఆంధ్ర సైన్యములు బయలుదేరినవి. శతాబ్దములనుండి ఆంధ్రవాహినులు భరతభూమిని ప్రసిద్ధిగాంచినవి. చంద్రగుప్తుని కాలమున ఆంధ్రులు సర్వస్వతంత్రత గలిగిన పరాక్రమపూరితములగు మహాసైన్యముల కలిగి యుండిరి. అశోకునికి మిత్రులైరి. అశోకునివెనుక భరతభూమిలో ఆంధ్ర సైన్యముల బలము వేరొక రాజ్యమునకు లేదు. రెండువేల ఏనుగులు, ఆరువేల అశ్విక సైన్యము, రెండువేల రథములు, రెండులక్షల పదాతిదళములు బయలుదేరినవి. ఎనిమిది వృషభములు, నాల్గువృషభములు పూన్చిన బండ్లు సామగ్రులను, సేవకులను, దాసదాసీ జనంబులను కొనిపోవు చుండెను.

ముందు అరువదివేల సైన్యములు బయలువెడలినవి. పదికోశముల తరువాత అరువదివేల సైన్యములు సాగినవి. అవన్నియు కృష్ణానది దాటి, వ్యాఘ్రదేశము కడచి, గోదావరికడకు పోవునప్పటికి తక్కిన ఎనిమిదివేల సైన్యములు పోయినవి. గోదావరికడ పడవలు వేలకువేలు సిద్ధముగానుండెను. రేవుస్థలములదాటి సైన్యములన్నియు ఆవలియొడ్డుకు బోయినవి. దక్షిణకోసలము గడచినది. కళింగము వెనుకబడినది. తెలివాహానది వారికి శీతలోదకములు ప్రసాదించినది. ఉప్పెనవలె, ఎడారులలో వీచు భయంకరమగు ఇసుకగాలులవలె ఆంధ్ర సైన్యములు కతిపయప్రయాణంబుల సాగిపోవుచునే యున్నవి.

4. చైతన్యోదయము

స్థౌలతిష్యుని మహావిద్యవల్ల ఆ బాలికలోని మానవత్వము నెమ్మది నెమ్మదిగ వెనుకకుపోయి పశువులలో ఉత్తమమైన గోవు స్థితికిపోయినది. ఆ వెనుక ఆమె ఏనుగుస్థితికి దిగినది. ఒక్కొక్కవర్షము గడచినకొలది ఆమె శునకజాతికి పోయినది. మార్జాలజాతికి దిగినది. శార్దూలమైనది. ఈ నాడామె భయంకరశార్దూలోరగము.

స్థాలతిష్యుని అఖండ ఆయుర్వేద పాండిత్యము అమృతబాల కావలసిన ఆమెను కాలకూటవిషసన్నిభను చేసినది.

గుజ్జనగూళ్ళలో నామెకు గరళము తిలబీజ దశభాగము నిచ్చువాడు. ఆమె పాలలో నాభి యవగింజలో త్రింశతి భాగము కలుపువాడు. చంద్ర బాలకు మూడవయేడు వచ్చునప్పటికి సౌరాష్ట్రకము తిలప్రమాణ మామె ఆరగింప గలిగినది. ఆమె కైదవయేడు వచ్చునప్పటికి శాక్లికేయము యవగింజ తినగలిగినది. దారదము, వత్సనాభము ఆమెకు ఫలహారములైనవి. చంద్రబాలకు పన్నెండవయేట తొమ్మిదిరోజులు జపతపాది హోమంబులు చేసి, స్థౌలతిష్యులు మహావిషమైన కాలకూటమును, దక్షిణ దండకాటవీ మహానాగ దంష్ట్రాంచిత కాకోలమును చంద్రబాలయందు ప్రవేశింప జేసినాడు. ఆ భయంకర ముహూర్తమునుండియు ఆమె విషకన్యకయైనది.

ఆనాటినుండియు ఆమె స్పర్శయే, ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసములే, ఆమె పరిసరమే దారుణమృత్యుస్వరూపమైపోయినది. ఆ ముహూర్తము నుండియు పెద్దపులులును ఆమెకడకు వచ్చుటకు భయపడును. ఆమెచేతిలో సాధారణ విషములు అమృత ప్రాయములు.

స్థౌలతిష్యునిశిష్యులు ప్రతినిమేష మా బాలకు క్రౌర్యము పాఠముగ జెప్పుచుండిరి. మృత్యురూపమగు లాలనజేయుట, కులుకులుసూపుట, దరికి జేరుట, నశింపజేయుట యివి అనుదినము నామె నేర్వవలసినదే. ఆమె వివిధ భాషలతో మాటలాడుటయందుత్తీర్ణురాలైనది. ఆమెకు చక్కని సంగీతము నేర్పబడినది.

ఎట్టి శ్రీశుకుడైనను ఆమెను దర్శించిన మాత్రమున, ఆమె హోయలు కనినంతమాత్రమున, ఆమె తీయనిపాట వినినంతమాత్రమున కరగి ముగ్ధుడయిపోయి ఆమె భయంకరాద్భుత సౌందర్యములో మగ్గి మసి యైపోవలసినదే.

మలయనాగుడు ఆమెకు ఆహుతియైన పిదప ఆ బాలయు తన నివాసము చేరినది. ఆమెకు నేదియో విషాదము, ఏదియో ఆవేదన. ఆమె హృదయాకాశమునందు కాలమేఘములు ఎచ్చటనో పొడసూపినవి. తన్ను తాతగారు ప్రయోగించిన దినమున విషకన్య తనచుట్టునున్న సభ్యులను జూచినప్పుడు వీరందరు నుసియగుదురో యను ఆలోచన పొడమినది.

చిన్న తనమునుండియు తనలాలనలచే మగ్గిపోయిన కురంగశాబక శవములను చూచి నవ్వునది. హస్తస్పర్శచే మాడిపోయిన మల్లికాది సుమములగని కిలకిలలాడునది. తనచుంబనములచే హతమారిన శుక శారి కాదుల చూచి గంతులువేయునది. మృత్యు వామెకు చెలియలు. అగ్ని యామెకు చుట్టము, కాళరాత్రి యామె అధిదేవత. అమావాస్య ఆ బాలిక ఆటలాడుకొను కాలము. అట్టహాస మామె విలాసము, భయంకర తాండవ మామె ప్రియనాట్యము.

మత్తిల్లిన పురుషు డుచితానుచితజ్ఞత కోలుపోయి, నిండుసభలో భయ మిసుమంతయులేక, ఆ సమయము పవిత్రము అను ఆలోచనయే లేక తన్ను కామించి తనకడకు పరువిడి వచ్చినాడు. మరుసటి నిమిషమున విగత జీవుడై పడిపోయినాడు.

ఈ సంఘటన ఏమియు నా విషబాల కర్థము కాలేదు. ఆమె కామమే ఎరుగనిది. ఆమె సంపూర్ణయౌవన. ఆమె దేహము, నరనరము, ఆమె వనితాత్వచిహ్నిత విచిత్రాంగములు విద్యుచ్ఛక్తిచే మేఘములు విలసిల్లినట్లు జ్వలించుట ప్రారంభించినవి.

స్త్రీ పురుషసంబంధ మన నేమో ఏమాత్ర మామే ఎరుగదు వానిని గూర్చి ఏరును చెప్పలేదు. వానినిగూర్చి యామె చదువనులేదు. పాములు, పిట్టలు సంగమించుట రెండు మూడు లామె చూచినది. ఆమె శిశు హృదయ మా విషయమై తాతగారి నడిగినది.

రెండు ప్రాణులు ఒకటికడ ఒకటి యుండుట కిష్టపడుననియు, అప్పుడవి చాలదగ్గరగ వచ్చుననియు, ఒక్కొకప్పుడా రెండు ప్రాణులు దేహము దేహముకూడ పెనవేసికొనిపోవుననియు, దానిని “ప్రేమ” యందురనియు స్థౌలతిష్యు డామెకు చెప్పినాడు. స్థౌలతిష్యుని ఘోరవ్రతము సమాప్తినొందవలె నన్న యా బాలికకు స్త్రీ పురుష సంయోగరహస్యము కొంతయయినను తెలియవలెను. కాబట్టి ఆతడామెను దూరదూరము నుండి జంతువులలో, పక్షులలో ఉన్న కలయిక దర్శింపజేయుచుండెను.

మహాతంత్రీవాద్యములలో ఒక తీగ స్పందించిన, ఆ స్వరమునకు శ్రుతియగు స్వరములన్నియు నొక్కసారి ప్రతిస్పందన మొనర్చును. అలాగుననే మృగవ్యాజంబున స్త్రీ పురుషుల సంయోగరహస్యము దర్శన మాత్రమున ఆమెకు నేర్పబడుచుండెను.

ఆమెకు ఆడుమగ భేదము స్థౌలతిష్యుడు కొంచెముకొంచెముగ నేర్పినాడు. ఆ కారణముననే విషబాల పాములతో ఆడుకొనినప్పుడెల్ల వానిని ఒకటినొకటి కౌగిలించు కొనుమని కోరునది.

ఒక్కొక్కమాసము వచ్చినకొలదియు నామె జీవితము వెనుక నీడవలె మానవత్వము వచ్చుచున్నది. అది మరియు నామెను తారసిల్లినది.

మలయనాగుడు ఏ క్షణికమున అతికామాంధుడై తన భుజముల అదిమిపట్టి ఆ బాల సర్వదేహమును తనలో లయించుకొన వాంఛించెనో ఆ నిమేషమున ఎచ్చటనో దాగికొనియున్న ఆమె స్త్రీత్వమునకు చురుక్కుమను స్పందనము కలిగినది.

ఆ స్పందనముచే నిదురపోవు పామును పాములవాడు నాగసొర బుఱ్ఱ మొనతో పొడిచినట్లయినది. ఆ స్పందనము వేసవికాలమున భూమిలో నడగియున్న బీజమును ఆషాఢ ప్రథమ వర్షబిందువు చుంబించునట్టిది. ఆ స్పందనము ఆకురాల్చిన చెట్టుకొమ్మలో దాగుకొనియున్న లేచిగురును మధుర వసంత మంద మలయానిలములు మునివేళ్ళతో దాకినప్పటిది.

ఈ దినములలో ఆమె కప్పుడప్పుడు ఒడలు ఝల్లుమనుచుండెను. ఆమెకళ్ళు అరమూతలు పడుచుండెను. ఒకచోట నిలువలేదు. నిద్దురపట్టదు. పట్టినచో ఏవేవో కలలు! స్వప్నాలకన్నిటికి చివరిభాగమున మలయ నాగుడు చేతులుచాచి తన్ను వేడికళ్ళతో, మత్తుచూపులతో కౌగిలింపవచ్చుచున్నట్లు కనబడును. ఆమెకు దేహమంతయు నుప్పొంగును. ఏదియో తీయని బాధ వచ్చును. ఆతడు కౌగిలించిన ఏమి జరుగును? అని ఏదో వాంఛతోకూడిన ఎదురుచూపు. అతడు సమీపించును. ఆమెకు ఎంతయో భయమువేసి “ఆ, హో” యని కేకలువేయుచు లేచును.

ఆమె చెలికత్తెలగు యోగినులలో గగనియో, కాశ్యపియో, అగస్తియో ఎవరో ఒకరు చటుక్కున ఆమెకడకు పరుగిడివత్తురు. ఆమెపై చేయివైచి “అమ్మా చంద్రా! ఏమమ్మా కలవచ్చినదా?” అని లేపివైతురు.

ఆమె రోజుచు మేల్కొనును. “ఏడి ఆ దుర్మార్గుడు?” అని ఆమె కన్నులు తెరచి, భయమున కోపమున అడిగి ఇటు నటు చూచును.

గగని: ఎవరు తల్లీ!

విషబాల: మలయనాగుడు.

గగని: వాడు చనిపోయినాడు. నీకు కల వచ్చినదా?

విషబాల: కలా? కాబోలు! అమ్మా! నిజమైనట్లే ఉన్నది. వాడు నన్నెందుకు ముట్టవలె?

గగని: నిన్ను ముట్టడు. వాడు నీ శక్తివల్ల నాశనమైనాడు.

విషబాల: నాశక్తియా? ఇటుల ఆ బాలికకు రెండు మూడు కలలు వచ్చినవి. ఆమెలో పరిమళములు గుబులుకొనుచున్నవి. ఆమెలో తేనెలు చేరుచున్నవి. ఆమెలో మార్దవములు అలముకొనుచున్నవి.

5. నేనును ఆడుదాననే!

స్థౌలతిష్యాశ్రమమందు ఆ మహాఋషి పూజామందిరశాలలనంటి విషకన్యక గృహములు, వనమును ఉన్నవి. ఆ గృహములకు దారి స్థౌలతిష్యముని మందిరము నుండి మాత్రమే యున్నది. ఆయన ఆజ్ఞలేనిదే ఏరును ఆ గృహములలోనికి బోవుటకే వీలులేదు. విషకన్యకారామములను వనమును చుట్టి ఎత్తైన కుడ్యమున్నది. ఉత్తరమున, తూర్పున ఆ గోడ కృష్ణానది నంటియున్నది. స్థౌలతిష్యుని మందిరమునంటి యొకశాలలో మంత్రానంద తంత్రానందులను ఇరువురుద్దండులైన శిష్యులు నివసించు చుందురు. వారు మహావిషవైద్యులు, మంత్ర శాస్త్రవేత్తలు, మహాయోగులు. వారెరుగని విషములుగాని, ఆ విషములకు విరుగుడులుగాని ఈ లోకమునందు లేవు. విషకన్యకను పెంచుటలో, నామెను దారుణమృత్యు కీలగా నొనర్చుటలో ఈ శిష్యులిరువు రామెకు దాదులైరి.

ఆ మందిరములోనికి విషకన్యకామందిరశాలలనుండి ఒకరజ్జువున్నది. ఆ రజ్జు వొక ఘంటికకు ముడివేయబడియున్నది. ఆ రజ్జువున కావలికొన విషకన్యక నిదురబోవు మందిరమున నున్నది.

వీరిరువురుకాక స్థౌలతిష్యునికి ముగ్గురు కాపాలికలు శిష్యురాండ్రున్నారు. వారును మంత్ర తంత్ర శాస్త్రములందు ప్రవీణలు, విషవైద్యమున సిద్ధహస్తలు. వారు మువ్వురు విషకన్యకకు స్నేహితురాండ్రుగా, చెలికత్తెలుగా, గురువులుగా నుందురు. ఏ యవసరము వచ్చినను వారు గాని, విషకన్యగాని ఆ తాడు లాగుదురు. వెంటనే మంత్రానంద తంత్రా నందుల గదులలో గంటలు మ్రోగును. ఒకసారి గంటమ్రోగినచో మంత్రా నందుడు పోవును, రెండుసారులు మ్రోగినచో తంత్రానందుడు పోవును. నాల్గయిదుసారులు మ్రోగినచో నిరువురు నేగుచుందురు.

మలయనాగుడు చనిపోయిన మరునాడు విషకన్యక ఏదియో మనోవేదన పాలయ్యెను. స్నేహితురాండ్రయిన యా కాపాలిక లెన్నివిధముల ననునయించినను ఆమె యూరడిల్లలేదు. ఆమెకన్నుల బొటబొట నీరు కారుచునేయుండెను.

“విషబాలకంట అశ్రు లేమి? ఆమెకు హృదయమున బాధ ఏమి? ఆమెకు హృదయ ముండునా?” అని కాశ్యపి యను యోగిని తనతోటి యోగిని గగని యను నామెను ప్రశ్నించినది. మూడవయామె అగస్తి విషకన్యకతోపాటు తోటలో నొక కేళాకూళికడ కూర్చుండి యా బాలికతో మాటలాడుచుండెను.

గగ: సోదరీ! ఆమె హృదయమును సంపూర్ణముగా కుదించి, వెనుకకు తీసికొనిపోయి భయంకరశార్దూలికున్న హృదయమును చేసినాము. ఈ శార్దూలి హృదయము మానవశార్దూలి హృదయము. మానవ మాంసభక్షణమును మరగిన శార్దూలము అన్నిజిత్తు లెరుగును. ఆ శార్దూలము మానవియైనచో నెటులనో అటులనే ఈ బాలికను మనము పెంచితిమి. కాశ్య: ఆర్యా! గగనీ! నా కేదో భయము వేయుచున్నది. మన విద్యలో నెచ్చటనో దోషమాపాదిల్లినది. నీ వొక కృపాణమును చేసితివి, పదనుబెట్టితివి. ఆ కత్తి నీ వెటుల ఉపయోగింతువో అటుల పనికివచ్చును. ఆ కత్తి “నేను వానిని ఖండించను” అనిన నీ వేమి చేయుదువు?

గగ: అవును సోదరీ, అవును. మనగురుదేవులగు స్థాలతిష్య మహర్షి గురు పరంపరలో రెండవవా రగు మహాదేవ దేవసోమోత్తర మహర్షి విషకన్యనొనర్చి చాణక్యదేవున కర్పించెనట. ఆ విధానముననే మనము మంత్ర తంత్రాలన్నియు ఉపయోగించితిమి.

అక్కడ కేళాకూళికడ విషబాలయు, అగస్తియు మాటలాడు చుండిరి. విషబాల నీళ్ళలో తన ముఖప్రతిబింబము చూచుచు ఎదుటనున్న యోగిని ముఖము చూచుచు కన్నుల నీరు తుడుచుకొనుచుండెను. ఆమె నగస్తి అనునయించుచుండెను. అగస్తి హృదయమునను “ఏమిది?” అని ప్రశ్న యుదయించినది.

అగస్తి: నీవును నేనును ఒకటి కాదు.

విష: (కన్నుల నీరు తుడుచుకొని ఆశ్చర్యమందుచు) మీరు మువ్వురు బట్టలు లేకుండ స్నానము చేయునప్పుడు నేను చూచితిని. మన కందరకు అవయవములన్నియు ఒక్కరీతిగ నున్నవే?

అగస్తి: కావచ్చును. ఉలూపియు, అర్జునుడును పాములేకదా!

విష: అవును.

అగస్తి: అవి రంగులలో భేదముగా నున్నవా, లేదా?

విష: అవును. ఆలాగుననే మీరును నేనును రంగులలో భేదించి యుంటిమి. అయినను మనము ఒక్కజాతివారము.

అగస్తి: ఏ జాతివారము?

విష: ఏమో?

గగనియోగినివలన నాహూతుడై స్థౌలతిష్యుడంత నచ్చటికి వచ్చెను.

స్థౌల: చంద్రా!

విష: చిత్తము! తాతయ్యగారూ!

స్థౌల: నీకు కంట నీరు వచ్చినదట?

విష: వచ్చినది.

స్థౌల: ఎందుకు తల్లీ?

విష: తాతయ్యా! నేను, అగస్తియు ఒక జాతివారమా, కాదా?

స్థౌల: అవును! అయినా కొన్ని బేధము లున్నవి.

విష: నీకును నాకును సంబంధ మేమిటి?

స్థౌల: నీకేమి తోచినది?

విష: నాకా? ఉలూపికి పిల్లపాము లెన్నో పుట్టినవి, ఆలాగుననే నేనును నీ కడుపున పుట్టితిని.

స్థౌల: నా కడుపునా?

విష: లేకపోయిన నే నన్న నీ కంత ఇష్ట మెందుకు? తన చిన్న పాములన్న ఉలూపికి ఎంతో ఇష్టము. ఇతరపాములను వానివైపునకన్నా రానీయదు. అర్జునునికూడ రానీయదు. ఆ పాములు కొన్ని తెల్లవి, కొన్ని నల్లవి. ఆలాగుననే నేనును నీ కడుపున పుట్టియుందును.

స్థౌల: ఈ ఆలోచనలతో కంట నీరు వచ్చినదా?

విష: అవును తాతయ్యా! ఇంకను ఏవో ఆలోచనలు వచ్చినవి. ఎవ్వరు నన్ను ప్రేమించి వచ్చినది మొన్న పూజార్పణవేళ? అట్లుచేయుట ప్రేమయంటిరికదా మీరు. వా డట్లు నన్నదిమిపట్టుకొన నా కేదియో జల్లు మన్నది కోపము వచ్చినది.

స్థౌల: కోప మన ఏమిటి?

విష: చంపివేయవలే ననుకొనుట.

స్థౌల: నీకు తరువాత కామమునుగూర్చి, ప్రేమనుగూర్చి చెప్పెదను. కాని ఇప్పుడు నీకు కోపమే రావలసియున్నది. నీ వొకరిని చంపి వేయవలయును

విష: మీరు చంపివేయకూడదా? ఈ అగస్తిగాని, గగనిగాని, కాశ్యపిగాని చంపకూడదా?

స్థౌల: తల్లీ! నీవు మా అందరిని మించి పుట్టినావు. నీవు కారణ జన్మవు. నేను చేయుపని వేరు. అగస్తియు, గగనియు, కాశ్యపియు చేయు పనులు వేరు. నీవు చేయుపని మనలనందరిని కడుపునగన్న భగవంతునిపని. అట్టిపనులు నేనుగాని, యీ యోగినులు గాని చేయలేము. ప్రేమించువారే చంపివేయువారు. నీవు ప్రేమించవలెను, చంపి వేయవలెను. ఉలూపి అర్జునుని ప్రేమించును. అయినను అర్జునుని చంపుట కెన్నిసారులు ప్రయత్నించి మానలేదు. తన బిడ్డలలో రెండు మూడింటిని మింగివేయుట నీవును చూచితివికాదా!

విష: అవును తాతయ్యా! నన్ను మీరు ప్రేమింతురు. నన్ను మీరేల చంపరు?

స్థౌలతిష్యుడు హృదయమున వడకెను. ఆయన యొక్క నిమేష మాత్రమూహించి, “తల్లీ! తొందరపడకుము. భగవంతుని ఇచ్ఛ ఎట్లున్న నట్లగును నీవు సంతోషముగ నాడుకొనుము. మనమందరము కొలదిరోజులలో ఇంకొక ప్రదేశమునకు బోవుదము. అచ్చట ఎన్ని చిత్రములో ఉండును. నీవు చూచెదవు. గోదావరినది, అడవులు, కొండలు, అనేకవిధములగు పూవులు, చెట్లు, ఇంక ఎన్నో వింతలు, ఆటబొమ్మలు గలవచట.

విష: అవునా తాతయ్యా! అన్ని ఆటవస్తువులా! ఓహో! నాకు ఆడుకొనుటకు ఒక... ఒక... ఆ చచ్చిపోయినవానికన్న అందంగా ఉండే బొమ్మను ఈయవా?

స్థౌల: ఇచ్చెదనమ్మా! ఇచ్చెదను. ఆడుకొనుటకు బొమ్మను కాదు ప్రేమించుటకు మంచి పురుషునే ఇచ్చెదను.

ఆతని కళ్ళవెంట స్ఫులింగములు రాలినవి. ఆ కళ్ళలోని తేజస్సును కనుంగొని ఆ ముగ్గురు యోగినులు గజగజలాడిరి. విషబాల నవ్వుచు, చప్పట్లు కొట్టుచు ఆ వనములోనికి పరుగిడిపోయినది. ఆ వనమంతయు దిరిగి, యా భయంకరాద్భుతసుందరి సాయంకాలమునకు తన మందిరము చేరి యా ప్రక్కశాలలోనున్న గగనికడకు పోయి, “గగనీ! నేనును ఆడుదాననే” యనినది.

6. సుశర్మ

పాటలీపుత్రమున రాజభవనమునందు సుశర్మచక్రవర్తి సుఖాసీనుడై యుండెను. సుశర్మ రూపసంపదగల్గిన బ్రాహ్మణుడు. కాని ధనువునకు అయిదంగుళములు తక్కువయుండు నాతని నా కాలపువారిలో పొట్టివాడనియే చెప్పికొనువారు. చంద్రగుప్త మౌర్యసార్వభౌముని, అశోకచక్రవర్తిని తలంచుకొనియు, వైదికమార్గనిష్ఠులగు నాదిభూపతుల వైభవము భావించుకొనియు భారతదేశమంతటి నొక్కయేలుబడికి గొనిరావలెనని సుశర్మ ఉఱ్ఱూతలూగుచుండెను. ఆతని భావమున జంబూద్వీపమంతయు దన క్రీడాస్థలమై గోచరించినది. ఆతని రథచక్రధ్వానములు హిమవన్నగముల దాకి వెనుకకు ప్రతి ధ్వనుల నంప నవి వింధ్యగిరికందరముల బలుకరించి పోయి పోయి నీలగిరి సానువులతో జెలికార మొనర్చినవి.

ఆ సుశర్మప్రభువు సర్వకాలముల దేవజాతత్పరుడై వేలుపులకు మ్రొక్కుకొను చుండును. ప్రాణుల బలి యొసంగుచుండును. బౌద్ధమతము నశించి బ్రాహ్మణమతము వ్యాపించవలె నను ఆశయు, ఒక్క చక్రవర్తి, ఏక పరిపాలన, ఒక్క న్యాయము, ఒక్కమార్గము అను దృఢాభిలాషయు ఆతని ఎముకయెముకకును పట్టి పోయెను. బ్రాహ్మణుడు ఏమి చేయకలుగును? సైన్యాధిపతియై తన అక్షౌహిణులను విజయాశ్వముల నడుపుటకు శక్తి లేదు. నలుగురిని గూడకట్టికొని వచ్చుటకు దగిన వ్వక్తిత్వము చాలదు. మహామేధావి, ప్రతిజ్ఞానిర్వాకుడు, యశోవిశాలు డగు చాణక్యునంత వాడు కాడు. కాని సుశర్మకు బుద్ధిబలము లేకపోలేదు. బాహుబలద్వితీయమైన బుద్ధిబలము ప్రకాశించును. చాణక్యునికి చంద్రగుప్తుడు కావలయుగదా!

సామ దాన భేదోపాయముల సర్వకార్యంబుల నీడేర్చుకొన సుశర్మ సంకల్పించు కొనెను. పాటలీపుత్రంబున బౌద్ధ భిక్షువుల సంఘారామంబులకు బ్రతిగా బ్రాహ్మణ పరిషత్తుల ప్రారంభించినాడు. అవ్వాని కన్నింటికి నగ్రహారము లొసంగెను. పండితులు, శాంతస్వభావులగు భూసురుల కనేకుల కాశ్రయమిచ్చి వారిచే భారత రామాయణాది గ్రంథములలో బౌద్ధమతఖండనల ప్రక్షేపింపజేసి, అనేక ప్రతుల సృజించి దేశమున వెదజల్ల నారంభించెను. షట్చక్రవర్తుల చరిత్రలను సమకూర్పించిన దీతడే. అంతకు మున్ను అచ్చటచ్చట నలుడు, హరిశ్చంద్రుడు, సగరుడు మొదలగువారల కథలు, చరిత్రలు చెప్పుకొనువారు. నేడు వారి కథలు పురాణేతిహాసముల నందగించినవి.

బౌద్ధమత ప్రతిపక్షులగు బ్రాహ్మణులనేకులు తలలెత్తిరి. ప్రతి దేశమునకు వారు ప్రచ్ఛన్నులై చని అచ్చట వైదికధర్మాభినిష్టుల నెలకొల్పి వారిసహాయమున ప్రజలకు వేదమతమును క్రొత్త కొత్త వ్యాఖ్యానములచే నుపదేశింపసాగిరి. బౌద్ధుల పై కత్తిగట్టించు చుండిరి. సుశర్మ మహారాజిదియంతయుజూచి సంతోషించుచు హాసపూర్ణవదనుడగు చుండును.

మౌర్యుల కాలమునుండియు భారతసార్వభౌమత్వమునకు పాటలీపుత్రమే నెలవైనది. పాటలీపుత్రసింహాసనాసీను డగువాడే చక్రవర్తి అను భావము రూఢమైనది. బలవంతులగు రాజుల నందరి నోడించి సామంతుల చేసికొని, ఒడ్డోలగంబున నుపవిష్టుడనై జయజయ ధ్వానములు సెలగ నింద్రవైభవమనుభవించు టెప్పుడు సమకూరునా యను గాఢతృష్ణ సుశర్మను వెఱ్ఱివానిని చేసినదాయెను.

పరశురాముని తలపోసికొని, ఆ మహావీరుని విగ్రహముకడ సుశర్మ ఏకలవ్యునివలె తపమొనర్చును. అత్యంతపురాతనమై, బంగారుపిడియు, వజ్రశిరోభూషణమును గలిగి, సుందరమై, వేదఘనపాఠమువలె విపులముఖమగు మహాపరశువును సుశర్మ నేపాళము నుండి సముపార్జించెను. త్రిచక్రమార్గములు అష్టాదశవక్రములు, నవవిధ ప్రహారములు, యేకవింశద్యుప ప్రయోగములు సుశర్మ సునాయాసముగ గ్రహించెను. ఏ యాయుధపు వ్రేటునైనను ముప్పదిమూడు విధంబుల రక్షించుకొన శక్తికలవాడయ్యెను.

ఆనాడు సుశర్మచక్రవర్తి సుఖాసీనుడైయుండెను. ఆతనితో శివస్వాతియు మరి యిర్వురు క్రొత్తపురుషులును మంతనంబు సల్పుచుండిరి.


సుశర్మ: శివస్వాతీ! పేరువడసిన పోటుమగడవు, నీ వేల నోడిపోతివో?


శివ: చిత్తము. మహారాజాధిరాజుల కేమని విన్నవింతును? ఆంధ్రులు మంత్రవేత్తలు. మాయకాండ్రు. వారు మా పసరములకు పంపిన తృణ తిలపిష్టక లవణ యవ క్షీరసురాఘృత శృంగిభేరాదుల నే మందులు గలిపిరో. నేనతి జాగ్రత్తగనే ముందా దేశపు పసరములకు కొన్నింటికి రుచిచూపుచునే యుంటిని. ఆయినా లాభమేమి? ఆ మందులు నా కోడెలకు జవము తగ్గించినవి. త్వరగా నలసిపోయినవి. ఆంధ్రుల నొక్కనాటికి నమ్మరాదు.


సుశర్మ: ఆంధ్రులంత మాయకాండ్రా?


శివ: దేవా! ఇంతవరకు మారాజును కన్నుకప్పి సర్వకార్యముల నొనరించు కొనుచున్నారు. నెమ్మది నెమ్మదిగ గౌతమీనదీకూలములు దాటి కళింగమును జొచ్చుకొని వచ్చుచున్నారు. ప్రభువు నిజవంశ ప్రతిష్ట నేమఱ జనదు. పుష్యమిత్రనృపతి నోడించిన ఖారవేలసార్వభౌముని ప్రతాప మేమయిపోయినదో? అశోకచక్రవర్తి సైన్యములకు చెలియలికట్టయై అనేక సంవత్సరములు లక్షలకొలది వీరుల బలిచేసి ఆ మహాత్ముని స్నేహము గొన్న సుమపాల భూపతి పౌరుష మేమయ్యెనో? నేడు మా చిత్రశిఖ మహీధవులు తెరపై చిత్రప్రతిమలవలె నాంధ్రు లెటులాడించిన నటులాడు చున్నారు.


క్రొత్త పురుషుడు: మా శివస్వాతి శకటపరీక్షకుం జనినప్పుడు ఆంధ్రరాజ్యపు గుట్టు మట్టులన్నియు గ్రహించివచ్చినాడు. ప్రమత్తులు, అలసులు నగు ముసలిరాజులు, వారి వంశములు కాలమున లీనమైపోయి నూత్న ప్రభుమంత్రోత్సాహశక్తులు పొడచూపవలెను. ఈ మహాకార్యము సాధింప శివస్వాతి ప్రతిన బూనినాడు. మా ప్రజలందరు జీనపక్షపాతులు. కాళింగులు జైనులు. ఈ జినస్వామిబోధలచే వీర జాతులన్నియు నీరసించుచున్నవి. పురుషకార శూన్యమై చెడుచున్నవి. ఆనంద దాయకమై, పుణ్య ప్రదమై సత్యస్వరూపమగు వేదమతము భారతభూమిలో పునః ప్రతిష్ఠితము కావలెను. ఈ మహాకార్యమును తమరు పైనవేసికొన్నచో మేమందర మనుసరింతుము. మహారాజా! ఆర్యధర్మమును దిక్కుమాలినదాని నొనర్పకుడు.


సుశర్మ: రాజకుమారా! నిజము చెప్పుము. తా మింతవరకు నెవ్వరి చేత నోడింప బడలేదని ఆంధ్రులకు గర్వము. వారికున్న సైన్యములు, ప్రతాపములు జంబూద్వీపమున నేరికిని లేవని అంద రనుచున్నారు. అట్టివారు కళింగ మాక్రమించుకొన్నచో మాళవ విదేహగ్రమ నేపాళ కాశ్మీర పాంచాలాది దేశముల జయించినచో ఆశ్చర్యమున్నదా? వారిఢాక కెదిరి నిల్చువా రెవరు?


శివస్వాతి: ప్రభూత్తమా! దేవర వచించినది నిజము. మనమందర మాడువారమై యూరకున్నచో నట్లేయగును. ఈ యువకుడు కళింగాధిపతికి మేనల్లుడు. మాసహోదరి నీతని కిచ్చిరి. రెండవయాతడు విదేహాధిపుని తమ్ముని కుమారుడు. ఔఘల నామధేయుడు. ఇదివరకే నావేగువలన దేవర కంతయు విశదమై యుండగలదు. కళింగమున నా అధికారమున రెండక్షౌహిణుల సైన్యములున్నవి. ఇంక ననేకదళముల ప్రోవుచేయగలను. నా పెదతాతగారి మనుమడగు కళింగాధిపతి ఆంధ్రరాజునకు స్నేహితుడననుకొని సామంతుడై యున్నాడు. ఔఘలరాజకుమారుడు విదేహముననున్న సర్వసైన్యముల నవలీలగ మనపక్షమునకు త్రిప్పివేయగలడు. ఈ యుభయపక్షముల బడుచువాండ్రందరు మాకు బాసటగా నున్నారు. ఆంధ్రభాను డస్తమించు సమయ మాసన్నమైనది. భారతభూమి యందలి యువజనమంతయు మిమ్ము నాయకునిగా వరించుచున్నది. ఆంధ్రులన మీ కేపాటి? అటు విదేహమున నౌఘలుడు, యిటు కళింగమున నేను రాజతంత్రము వశీకరించుకొని మిమ్ము భరతవరచక్రవర్తి నొనర్తుము. వేదధర్మస్వరూరూపులగు మీరు మగధసామ్రాజ్యమునకు తొల్లింటివైభవము సమకూర్చి జగద్రక్షకులు కాగలరు.

సుశర్మ: మంచిది. స్థౌలతిష్యుల యత్న మేమైనదో చెప్పవైతివి. మనము కేవలము శౌర్యమునే ఆశ్రయించుటకంటే ముందుగా ఈ భేదమార్గముల నరయుట మంచిది. మీ రింక విశ్రమింపుడు. నేటి రేయి మా సేనాపతులతో, అమాత్యులతో సంప్రదింతుము. ఆ వేళకు మీరుగూడ వచ్చి కార్యనిశ్చయము చేయవచ్చును.

మరల దర్శనము చేయుదునని ఆతడు పనివెను. సుశర్మ అభ్యంతర మందిరములకు బోయెను. అశోకచక్రవర్తి కట్టించిన యా యద్వితీయ సౌధ పంక్తి, ఆ మందిరములు, ఆ భవనములు ఆ విభవము దేవతాసార్వభౌమునకు గూడ దుర్లభములు. సుశర్మ యట్లు ప్రతీహారిణులు దారిచూప నొక భవనమున ప్రవేశించెను.

7. ఆనందమహారాజ్ఞిదేవి

నందమహారాజ్ఞి ఐక్ష్వాకుల ఆడుబడుచు. వారి రాజధాని ధనదుపురము. ఐక్ష్వాకు డగు ఈశానదత్తమహారాజు శాతవాహనులకు ముఖ్య సామంతుడుగ, మహాసేనాపతిగ నుండి అభయబాహుసార్వభౌమునికి సర్వవిధముల చేదోడువాదోడుగ నుండెను. తన యనుగుగూతు నానంద దేవిని యువరా జగు శ్రీముఖుని కిచ్చుట యతని తపఃఫలం బయ్యెను. ఆనందదేవి కాపురమునకు వచ్చిన రెండవయేటనే శ్రీకృష్ణశాతవాహనుడు జన్మించెను. మరల నామెకు సంతు అయిదేడులవరకు కలుగలేదు.

శ్రీముఖునకు ఆనందదేవి యన గౌరవము, గాఢప్రేమయును. ఆనందమహారాణి గర్వ మిసుమంతయు ఎరుగదు. రాజతంత్రములను సునిశితబుద్ధితో విచారణ చేయగలదు. భర్తను, బిడ్డలను హృదయమార ప్రేమించు ఉత్తమ గృహిణి. ఆంధ్రమహా సామ్రాజ్యమునకు చక్రవర్తిని అయ్యు నిరాడంబరమై, ఆస్తికురాలై ప్రజలనందరను దన కన్నబిడ్డలుగ చూచు రాజ్ఞిమాతయైనది.

ఇంతలో అంతఃపురముల నాడుకొను మంజుశ్రీ మాయమైనాడు. ఐదేండ్లబాలుడు. మాటలునేర్చి తనవారు, పరులు అని గురు తెరిగినవాడు. విద్యాభ్యాస మైనప్పటినుండియు అష్టాధ్యాయినే ప్రారంభించినవాడు. ఎటుల మాయమయ్యెను?

అన్నగారగు శ్రీకృష్ణుడు ధీకుశలుడు, రాజ్యతంత్రజ్ఞుడు అతిరధుడు. శత్రువులయెడ దాక్షిణ్యమిసుమంతయు కనబరచువాడు కాడు. ఆ యన్నకు దమ్మునకు గుణవైరుధ్య మెంతేని గలదు. ఆ బాలుడు నీచ సేవకునైన కోపపడి యెరుగడు. సార్వభౌమ శుద్ధాంత మహామందిరములలో పరిచారికగాని, కంచుకిగాని... దౌవారికుడుగాని, ప్రతీహారిగాని, దాసీలుగాని, చెలికత్తెలుగాని, అంగరక్షక వీరాంగనలుగాని ఆ చిన్నబాలకుని ప్రేమింపని వారు లేరు. అట్టియప్పుడు ఎవరి చేతులు ఆడెనో ఆ బాలుని తస్కరించుటకు? ఏమి కారణము? తన ముద్దుబిడ్డడు మొన్నమొన్నను పాలువిడిచిన పసికూన! ఎవ్వ డా కఠినాత్ముడు? ఎవ్వతె యా పాషాణహృదయ బిడ్డను తల్లియొడినుండి యెడబాపినది? ఆనందదేవి దుఃఖమునకు మేరలేదు.

ఆ మహాసామ్రాజ్యమునందున్న చారులు, రక్షకభటులు, ఉద్యోగులు, సేనాధికారులు, సాధారణప్రజలు మంజుశ్రీ రాజకుమారుని పోకడ తెలియుటకు ప్రయత్నించనివారు లేరు. జాలికుడు మహామంత్రము ప్రయోగించినట్లు మాయమై పోయినాడు. ఆ విశాలాంధ్రసామ్రాజ్యమునం దెచ్చటను యీషణ్మాత్రము జాడ దొరకలేదు. ప్రజలు తమలో దా మేవియో గుసగుసలుపోవుటే కానీ ఎవరికిని ఇదమిత్తమని యీగడ తెలియరాలేదు. చారశాఖాధ్యక్షుడగు శుకబాణుని ప్రజ్ఞ యించుకయు కొఱగాలేదు. ఇంతలో యుద్ధోపద్రవము వచ్చిపడినది.

హృదయాంతరముల నెట్టిబాధచే కుమిలిపోవుచుండెనో శ్రీముఖుడు మాత్రము నిండు రాజసభలోగాని, అవరోధజనమధ్యమునందుగాని తన ముద్దు బాలకుడు మాయమై పోయినాడను కించ యింతైనను వ్యక్తము కానీయలేదు. ఆ బాలకుడు మాయమైన సంవత్సరమునగూడ సార్వభౌముని జన్మదినోత్సవములు జరుగనే జరిగినవి.

సాధారణప్రజలోకమునకు మంజుశ్రీ మంత్రించినట్లు మాయమైనాడను వార్త తెలియనేలేదు. అది తెలియకుండునట్లు కట్టుదిట్టము చేయబడినది. ఒక భయంకర సంఘటన జరిగినప్పుడు దానికి ప్రతివారును కర్తలుగానే గోచరింతురు. ఎంత సన్నిహితులైనను వారిని గురించి అనుమానములు తక్కినవారి హృదయముల తలలెత్తు చుండును.

శ్రీకృష్ణశాతవాహనుడుగూడ నీ యనుమానములకు గురియయ్యెను. శ్రీకృష్ణునకు తెలియకుండగనే ప్రజ్ఞావంతులగు గూఢచారులు ఆతని సర్వవిధముల గని పెట్టి చూచుచుండిరి. కాని శ్రీకృష్ణునికిమాత్ర మేమి తెలియును?

కౌశికీపుత్ర శ్రీముఖశాతవాహనమహారాజు తన రెండవపుత్రుడు రాజకుమార శ్రీమంజుశ్రీ అంతవిచిత్రముగ రాణివాసమునుండి తిరస్కరిణీవిద్యచే తిరోధానమైనట్లు అగోచరు డగుటకు మొదట ఆశ్చర్యము నందెను. తర్వాత నాతడు గాఢవిషాదము పాలయ్యెను. అంత మహాక్రోధ మానసుండయ్యెను.

పుత్రునిగురించి ఎన్నివిధముల వెదకించినను ఆతడు బ్రతికియుండి విరోధుల హస్తముల నున్నవాడను సూచనలు తక్కవేరుజాడలేమియు కన్పింపవయ్యె. పామరులబోలి మహారాజులు ఎట్లు వాపోవగలరు? శ్రీముఖశాతశాహనుడు తనమహారాజ్యమంతయు అప్రమత్తుడై కనిపెట్టి యుండవలె. రాజ్యము చతుస్సముద్రవలయితయు చేయవలె. ధర్మము నాల్గుపాదముల నడపింపవలె. ఆంధ్రదేశమును, ఆర్యావర్తనమును సుభిక్షమై సకల సంపదాకరమై ధర్మపూర్ణమై, పుణ్యవంతమై స్వర్గధామములకు తుల్యము కావలెను. సర్వకాలమును శ్రీముఖునివాంఛ యది. ప్రజావ్యసనము ముందు, ఆత్మవ్యసనము తరువాత.

ఆనందదేవి భర్తకు తోడునీడయైన ఉత్తమ సహధర్మచారిణి, గృహిణి, మహారాజ్ఞి, ముఖ్యరాజసభయం దామె భర్తతోపాటు అర్ధసింహాసనమున నధివసించుచుండును. శ్రీముఖు డామె అభిప్రాయముల నడుగు చుండును. సమయోచితముగ ఆమె తనభావము వెల్లడిచేయుచుండును.

ఆమె అతిలోకసుందరి కాకపోవచ్చును. కాని జవ్వనమున నామె ముఖములో దివ్యప్రసన్నత, స్పష్టరేఖారచిత నాసికాద్యవయవ సౌకుమార్యము శోభిల్లుచుండెను. మహారాణులకు, స్వర్గకాంతామణులకు తూచాలుదిద్దు సహజగాంభీర్య మామె సొమ్ము. సర్వాంగోపాంగస్వరమేళనముచే సుభగ మగు మంజులతాశ్రుతి ఆనాటియువతులలో నామెను సాటిలేని దానిని జేసెను. శ్రీముఖుడామెను గాఢముగా ప్రేమించినాడు. ఒండొరుల ప్రేమించి చేసికొన్న వారివివాహము స్వయంవరమే యనుకొని రందరును. ఆ నాటి ప్రేమ నేటివరకును ఇసుమంతయు తొణకక, తగ్గిపోక, స్నేహవాత్సల్యమిళితమై దినదినాభివృద్ధి గాంచుచు పెరిగినది.

సామంతులు, పరదేశప్రభువులు ఎందరో రూపగుణసంపన్నలగు తమ బాలల నిత్తుమని రాయబారము లంపిరిగాని శ్రీముఖుడు వలదని నిస్సంశయముగ దెలిపి నాటి మహారాజులలో ఏకపత్నీవ్రతుడని పేరందెను.

ఆనందదేవి కా దినముల హృదయమున కలత మరియు పెరిగినది. బాలకుని తస్కరించి పదునేనుమాసములైనది. ఆతనిజాడ లేదు. అప్పుడే వ్రాయనేర్చిన యాతని ముద్దుటక్కరములతో భూర్జపత్రలేఖలు మాత్రము నెలకొకటి వచ్చుచున్నవి. ఎక్కడనుండి వచ్చుచున్నవో, ఎవరు తెచ్చి దేవీపూజాపీఠమునం దుంచుచున్నారో ఎవరికిని తెలియుటలేదు.

ఉత్తరములరాకను గుర్తించుటకు నియుక్తులగు గూఢపురుషులు షండులు, చారిణులు ప్రయత్నించి ఒకదాసిని పట్టుకొనిరి. ఆమె కాయుత్తరము నిచ్చినయత డామెకు వలపుమగడు. ఆ విటునియింటి కెవ్వరోముసుగువైచికొని వచ్చి, ధనము ధారపోసి, ఆ యుత్తరము దేవీపూజా పీఠికపై నాలుగైదునాళ్ళలో నుంపగోరిరట. ప్రమాదములే దని వారిరువు రందుకు సమ్మతించిరట. వారిరువురిని రాజభటులు కళింగమునకు బంపి వేసినారు.

ఇంతలో అపసర్పులు కొందరు చాలసంగతులు సేకరించిరి. చాలవరకు కుట్ర తెలియవచ్చినది. అందులో స్పష్టరూపముతాల్చిన పురుషులు సోనుత్తరుడు, సంచరణుడు, మహేశ్వరానందుడు, చంద్రస్వామియు. వారిలోకెల్ల ధర్మశీలుడు చంద్రస్వామి అని అపసర్పాధికారి తెలిసికొని, మహామాత్యుల ఆజ్ఞపై చంద్రస్వామిని పట్టించి విచారణకు బెట్టెను. కానినిజ మింతయు దెలియలేదు. సోనుత్తరాదులు సంపూర్ణముగ మాయమై పోయినారు.

మహారాజ్ఞికి చక్రవర్తి ఎప్పటివార్తల నప్పుడే యందజేయుచుండెను. ఆ తల్లి ధైర్యమిసుమంతయు వీడకపోయినను విషాదముమాత్రమెట్లు పారద్రోల గలుగును? తుదిబిడ్డడు, అందాలపాపడు. పెద్దకుమారుని యందామెకు ప్రేమ తక్కువకాదు. కాని ఒరులసహాయమాపేక్షింపనిమేటి యని యామె కాతని శిశుదశనుండియు భావము. భీమునిగూర్చి కుంతి ఆరాటము పడినదా?

బాలకుడు మాయమైనాడను విషాదముతోపాటు ఆమెకు నెలలు గడచిన కొలదియు నీ యుద్ధము లెందుకు అని బాధ మొలకెత్తినది. ఎందుకు ఈ హింసలు, ఈ ప్రజానాశము? మహారాణి ఒక శుక్రవారము సాయంకాలము పరివారజనముగొలువ మహాచైత్య సంఘారామమునకు బోయినది. ఆమె రథము తోరణముకడ డిగ్గి పాదచారిణియై అమృత పాదార్హతాచార్యుల పటకుటీరమునకు బోయెను.

8. కులపతి

మృతపాదార్హతులకు కొంచె మెచ్చుతగ్గు ఏబదియేండ్లవయసుండును. శాంతమే రూపముపూనిన తేజోరాశి, విజ్ఞానసముద్రుడు, వేదవేదాంగ పారంగతుడు. త్రిపీటకములు, బౌద్ధదర్శనములు, జైననికాయములు, ఛప్పన్నభాషలును ఆ ఆచార్యునకు ముఖస్థములు.

ఐనను అమృతపాదులకు పదునేడు సంవత్సరముల పూర్వము నడిచిన తన చరిత్ర ఏమియు తెలియదు. ఆయన తల్లిదండ్రులెవ్వరైనది ఆయనకు తెలియదు. తన పేరెరుంగడు. తనగ్రామ మెరుంగడు. ఉపవీతమును, తక్కుంగల వేషమును ఆయన బ్రాహ్మణ జన్ముడని ఆయనను రక్షించిన బౌద్ధసన్యాసులకు తెలియ చెప్పినవట.

కుసుమపురమునకు పదునాలుగు గోరుతముల కెగువను గంగాతీర మున బుద్ధుని ప్రియశిష్యుడగు ఆనందుడు నెలకొల్పిన మహాసంఘారామ మొకటి యున్నది. ఆ సంఘారామవాసు లగు బౌద్ధసన్యాసులు కొందరు ఒక నాడుదయమున కాలోచిత స్నానము లాచరించుటకు వెడలియుండిరి. ఇంతలో ఒక భిక్షుడు “ఒహో” యని యరచి నీటిలో తన చేతికి దొరికిన యొక శవముజుట్టు పట్టుకొని యొడ్డునకు లాగుకొనివచ్చెను. తక్కిన నల్గురును ఆ కళేబరము నెత్తి నీటికి దూరమున పరుండబెట్టిరి. కాని ఆ శవమును పరీక్షించినకొలది వారి యాశ్చర్యము మిన్ను మట్టినది. అది శవము కాదు. లంబికాయోగముదాల్చి జలస్తంభన విద్యచే గాబోలు నీటియందు మునిగి, యా పురుషు డెవ్వడో నీటి మట్టమునకు దిగువ కొట్టుకొనివచ్చు కొన్ని తుక్కుపదార్థములలో చిక్కుపడి, ప్రవాహవేగమున వచ్చుచున్నాడు. ఆ దేహమునందున్న తేజస్సుచేకాబోలు మత్స్యాదికము లేవియు ఆ దేహము నంటలేదు. దేహము వెచ్చగనున్నది. నాడిలేదు. ఉచ్ఛ్వాసనిశ్వాసములు లేవు. కన్ను అరమూతలుపడి లోనివైపునకు తిరిగియుండెను. శిరముపై ఎదియో పెద్దగాయము తగిలి పుఱ్ఱె ఎముక పైన చర్మమును, కండయును పగిలియుండెను. పుఱ్ఱె ఎముక స్పష్టముగ కన్పడుచుండెను.

పవిత్రములు, అమృతముతో సమములు నగు గంగాజలములు ఆ గాయమును శుభ్రపరచి అందే దోషమును బ్రవేశింపకుండ కాపాడినవి. ఆ భిక్కులలో ఆయుర్వేద ప్రజ్ఞానిధియైన యొక సన్యాసి సప్తనాడులను పరీక్షించి హృదయస్పందన మాగిపోయినను రక్తము ప్రవహింపుచునేయున్న దని నిర్ధారణ చేసినాడు.

కాని ఆ పురుషుని ఆత్మశక్తి దేహమును రక్షించుకొనుచు మహా ప్రవాహమై ప్రవహించుచుండెనట.

ఆ భిక్కులు ఆ శరీరమును ఆశ్రమములోనికి గొనిపోయిరి.

ఆనంద సంఘారామమునకు పెద్ద యగు కులపతి మహాయోగి యగుటచే లంబికాయోగముచే స్థాణుత్వమునందిన యా పురుషునకు చైతన్యము కలుగజేయు మంత్రములు పఠించి ఓం! ఓం! ఓం! అని ప్రణవోచ్చారణ ప్రారంభించెను. ఓం, ఓం,

ఓం శుద్ధ చైతన్యమై జడమై సర్వము నిండియుండు పరమాత్మ యిచ్చచే జాగృతమై మహాసృష్ట్యున్ముఖమైనట్లు ఆ ప్రణవనాదము ప్రథమమున అపశ్రుతియై, అటువెనుక శ్రుతి స్వరూప మంది విజృంభించి, దివ్యరాగమై, అవరోహణమై ప్రసరించి ప్రసరించి గంభీరతలు పొంది మహాతేజ స్వరూపమైనది. లోకమున విస్తరించియున్న యా పురుషుని చైతన్యము విశ్వములోన ప్రతి అణువున ప్రతిధ్వనించి, ఆవర్తము లందుచు, సమీకృతమై, యింకను దగ్గరకుజేరి అతని దేహములో క్రమ్ముకొన్నది. అప్పుడాచిచ్ఛక్తి స్పందితమై ఆ దేహమున నణువణువున ప్రసరించినది. ఆ పురుషుడు కన్నులు తెరచి చూచినాడు.

ఒక భిక్షుడు: “స్వామీ, మీ రెవ్వరు?” అని ప్రశ్నించెను.

నూత్నపురుషుడు వారివంక నేమియు గ్రహింపనివానివిధమున తెల్లబోయి చూచెను.

భిక్షుడు స్వామీ, యీ మందు సేవింపుడు.

ఆ నూత్నపురుషుడు వలదని చేయి యూపెను. ఆతని బొమలు ముడివడెను. అప్పు డాతని ఆకారరేఖలు ఏదియో మరచిపోయినవాని విధమును సూచింపుచుండెను. ఆతనికి చైతన్యమువచ్చుటకుమున్నే వైద్యవిశారదుడైన భిక్కుడు కొన్ని ఓషధులు ఆ గాయము పైనుంచి శుభ్రవలిపమొండు కట్టుకట్టినాడు. ఆ నూత్న పురుషుడు చేతిచే తలకు కట్టినకట్టును తడవి చూచుకొని, యిది యేమని కన్నులతో ప్రశ్నించెను.

భిక్షుడు: “స్వామీ, మీకు నీరసముగా నున్నదా? అయినచో యీ రసాయనము సేవింపుడు” అని అనునయించెను.

నూత్నపురుషుడు ఏమియు లేదన్నట్లు తలయూపి, తానెవరని అడిగినట్లు కన్నులు విప్పి వారిని తీక్షణముగ చూచినాడు.

ఒక భిక్షుడు, “నీవు మాకు స్నానముచేయుచుండగ దొరికినావు. ఎక్కడనుండియో, కొట్టుకొనివచ్చుచుంటివని తెలిపినాడు. ఆ నూత్న పురుషుడు తన కేమియు నర్థమగుటలే దను భావమును స్ఫురింపజేయు విషాద యుతము లగు చూపుల ప్రసరింపజేసెను.

వృద్ధుడును, మహాతపః సంపన్నుడును అగు ఆ ఆశ్రమకులపతి ఆతని కానాటి నుండియు ఏమియు నెరుంగని చంటిబిడ్డకు నేర్పునట్లు జ్ఞాన ముపదేశింప నారంభించెను.

ఆ నూత్న పురుషుని పూర్వవాసన లెవ్వియో ఎవ రెరుంగగలరు? అవి మహోత్తమములై యుండవలయును. ఆరునెలలలో ఆతనికి విద్య లన్నియు వచ్చినవి. సర్వభాషలును వచ్చినవి. అయినను తా నెవ్వరో అతడెరుగడు.

స్నానము చేయునప్పుడు పాదములకు తగిలినకారణమున ఆ నూతన పురుషునకు అమృతపాదులు అని పేరిడినా రా ఆశ్రమవాసులు.

అమృతపాదులు మూడేండ్లయిన వెనుక భిక్కుధర్మమైన సన్యాస దీక్ష స్వీకరించెను. నీటినుండి పైకితీయబడినప్పుడే అతడు బ్రాహ్మణుడని మాత్రము వారు గ్రహించిరి.

సన్యాసమునందిన ఐదేండ్లలో అమృతపాదులు, అర్హతులైనారని కులపతి యాతని నాశీర్వదించి బుద్ధ సేవ చేయుమని ఆదేశమిచ్చి లోకములోనికి పంపించెను. అమృతపాదులు గురువును స్మరింపుచు, బుద్ధదేవుని ఆరాధింపుచు భూమండలమంతయు పరిభ్రమించి, పరివ్రాజకత్వము దాల్చిన నాల్గేండ్లకు ధాన్యకటక సంఘారామమున ప్రవేశించెను. జలమునం దాతడు దొరుకునప్పటికి అతనికి ముప్పది, ముప్పదిమూడు సంవత్సరము లుండునని యాతని గురువు ఊహించినారు. ధాన్యకటక సంఘారామ కులపతియైన విశుద్ధలక్ష్యార్హతులు అమృతపాదులను తన హృదయానికి అద్దుకొని వేయిదేవతలబలము వచ్చినట్లు సంతోషించెను.

విశుద్ధలక్ష్యార్హతులకు యెనుబదిమూడేండ్లున్నవి. తాను నిర్యాణ మందిన వెనుక కులపతి తగినవాడు లేనిచో సంఘారామశిరోరత్నమైన ధాన్యకటకాశ్రమము బుద్ధమహాధర్మకము నిర్వహింప లేదని యా వృద్ధాచార్యుల భయము. నే డా భయము తీరిపోయినది.

శ్రీముఖ శాతవాహనచక్రవర్తి తమ వృద్ధ గురువును దర్శించుటకు వచ్చి, అమృతపాదుల దర్శించి వారికి దాసానుదాసుడై పోయినాడు.

అమృతపాదులు ధాన్యకటకమునుచేరిన రెండవయేట విశుద్ధలక్ష్యార్హతులు నిర్యాణ మందినారు. అనాటినుండియు అమృతపాదార్హతులు మహా చైత్యసంఘారామమునకు కులపతి యాయెను.

9. మాతృ హృదయము

హారాణి తన పాదములకడ మోకరిల్లినప్పుడు అమృతపాదార్హతులు ఆమె నాశీర్వదించి “అమ్మ! భర్తగారివెంట నీవును యుద్ధమునకు పోవుచున్నావని విన్నాను. పురుషులు స్వభావముచేతనే కఠినులు. వారికి యుద్ధము తప్పని పని. స్త్రీసహజ మగు భయముచే భర్తకొఱకు ఆందోళనపడుచున్నావు. భయములేదు. తల్లీ! సర్వము శుభపరిణామము చెందును.”

మహారాణి: స్వామీ! యుద్ధ మనిన ఆడువారికి భయము. స్త్రీ, అందును బిడ్డలతల్లి ప్రాణనాశమున కెప్పుడును ఒప్పుకొనదుకదా! ఈ భయం మావారికొరకే కాదు. యుద్ధములో నెందరో చనిపోవుదురు. ఎన్ని కుటుంబములో దుఃఖభాజనము లగును.

అమృత: నిజము తల్లీ! ప్రియదర్శియైన అశోకుడు కళింగదేశముపైకి దండెత్తి పోయినాడు. కాళింగులు పరాక్రమమున నాతని ఎదిరించిరి. ఘోరమైన యుద్ధము సంభవించినది. లక్షలకొలదిజనులు రణదేవతకు బలియైరి. అశోకుని యుద్ధములలో నంత జననష్ట మెప్పుడును వాటిల్లలేదు. అది యంతయు అశోకుని నిర్వేద మయ్యెను. అప్పుడాతనికి తథాగతులబోధ అర్థమైనది. ఆతడు భిక్షుమహారాజయినాడు. మహా శ్రమణకుని బోధలచే జగత్తునే కాంతిమంతము చేసెను.

మహారాణి: స్వామీ! యుద్ధమున దక్క మనుష్యులు తమ కాంక్షలను, వివాదములనువేరువిధమున తీర్చుకొనలేరా? చక్రవర్తుల ఈ రాజ్య తృష్ణ పాపపుణ్యము లెరుంగని దేవమూర్తులైన పసిపాపలపై విరుచుకొనిపడునుగదా!

అమృత: తల్లి! నీ మాతృ హృదయ మట్టిది. మంజుశ్రీని తస్కరించినవారు ఆ బాలునియందు దోష మెంచి అటుల చేయలేదు. ఆ బాలుని చక్రవర్తి బిడ్డవలెనే సాకుచున్నారు. ఎత్తుకొనిపోయినవారిహృదయము నాకిప్పుడవగతమైనది. ప్రజలొకప్పుడు మానవ ధర్మములు మరచిపోయి రాక్షసత్వము వహింతురు. కామదేవుడు వారికి ఎన్నియో ఆశలు ప్రత్యక్షము చేయును. వారాతని బానిసలై పోదురు. అప్పుడు అవతారమూర్తి యొకడుద్భవించును. తన జీవితముచే లోకసంగ్రహము చేయును, లోకము తరించును. సృష్టిచక్రమిట్లే సర్వకాలము తిరుగుచుండును.

మహా: ఆ సృష్టిచక్రమును త్రిప్పుటకు యుద్ధములే కావలయునా తండ్రీ? అమృత: యుద్ధము లవసరములేదు. అట్టి సత్యయుగము ముందు తప్పక వచ్చితీరును. మహారాజు నేడు జైత్రయాత్ర సాగించుట శత్రుమారణమునకు, రాజ్యసంపాదనకే గాదు. ధర్మరక్షకు, కుమారరక్షకు గూడ.

మహారాణి: నేను కఠినాత్మురాలను తండ్రీ! యీ నాలోని గట్టితనమునకు నేను వెగటుపడుచు నన్ను నేను గర్హించుకొనుచున్నాను. నా బంగారు తండ్రిని, నా పెన్నిధానమును నేను పోగొట్టుకొనియు మొండిజీవము ధరించియున్నాను. ఒకవంక బిడ్డకై భగ్నహృదయనయ్యు ఈయుద్ధ మహా మారణ కర్మమును కనులార గాంచనున్నాను. నన్నీ యవస్థలో డించిపోలేక సార్వభౌములు వెంట గొని పోవుచున్నారు.

మహారాణి కన్నుల నీరు బొటబొట కారినవి.

అమృత: అమ్మా! ఊరడిల్లుము. మనకందరకు ఏడుగడ బుద్ధదివ్య పాదార విందములు గాని మరేమి కలవు! చదువుకొన్న ఉత్తమ గృహిణి, విజ్ఞానవతివి. ఈ విశ్వమునం దేది శాశ్వతము? ఇది యంతయు నొక చిదాభాసము. ఈ అభాసమునే నిజ మని నమ్మెదవా? ఇది క్షణికము. నశ్వర మని యెరుగుటయే దుఃఖనాశనకారి. ఈ సంసారప్రవాహమున నీదులాడు జీవులకు నిత్యము యోగవియోగములు కలుగుచునే యుండును. ఎవరి కని దుఃఖింతుము, దేని కని సంతోషింతుము? ఈ సుఖదుః ఖములు రెండును బంధకారణములే. కావున నిర్మమత్వము నాశ్రయింపదగును. లోకమున అన్ని ప్రాణులవలెనే నేను, నా వారలు పుట్టి గిట్టుచుందురు. ఈ సంసారభావము నెరుగుటయే సంసారికి తరుణోపాయము తల్లీ!

మహారాణి: అవును మమత్వము తగ్గిన కొలది దుఃఖము తగ్గుచుండును కానిచో ఇంతమంది మృతికి కారణమగు నీ యుద్ధమునకెట్లు సమ్మతింతుము?

అమృత: మహాశ్రమణకబోధ అమృతజ్యోత్స్నకదా! ఆ వెన్నెల భరింపలేని వ్యతిరేకాత్ములు కొందరు బుద్ధధర్మమునే నాశనముచేయ సంకల్పించినారు. ఆ ప్రయత్నముల నరికట్టవలసిన విధి చక్రవర్తి పై నున్నది. ఆ యజ్ఞమునకే చక్రవర్తి యీ జైత్రయాత్ర సంకల్పించినారు. రాజధర్మమున కీ నిష్ఠురత తప్పదు. సమంతభద్రునిబోధ విషప్రాయముగ నెంచు ఆ హతభాగులెవ్వరో మీశిశువు నెత్తికొనిపోయినారు. ఈయుద్ధం వలన జననష్టముండదు. మీ హృదయమునకు అమృతశాంతి చేకూరు శుభదినము లరుదేరనున్నవి. శుభాసంశయే శుభప్రదము తల్లీ!

మహారాణి ఆ దివ్యజన్మునకు సాష్టాంగనమస్కారము చేసినది. చైత్యాభిముఖురాలై వెడలిపోయినది. మహారాణి తనతో కొనివచ్చిన వందలకొలది పండ్లతట్టలు ఆ మహాపరిషదాచార్యులకును, విద్యార్థులకును అర్పించెను.

మహారాణి యచ్చటనుండి విసవిస నడచిపోయి మహాచైత్యము చుట్టును మూడుసారులు ప్రదక్షిణముచేసి ఆయకస్తంభములయెదుట నామె సాష్టాంగ పడినది. “బుద్ధప్రభూ! అమృతహాసముల నీ ప్రజలందరిపైనను ప్రసరింపజేయుము. నీ దివ్య హాసములలోని త్రసరేణువు నా బాలకుడు. ఆతని రక్షింప నీవే దిక్కు. నా ముద్దు బాలకుడు నాకు దొరికిన మరునాడు ఈ మహాచైత్యమునకు లక్షదీపము లర్పింతును. ఈ యుద్ధమున అందరికిని భద్రత చేకూర్పుము. నా ఆత్మేశ్వరుడు నీకు పరమభక్తుడు. వారును నేనును కలసి తిరిగివచ్చి నీ భక్తులైన శ్రమణకులకు ఎనిమిది విహారములు కట్టింతుము. బుద్ధదేవా! నీవేరక్ష” అని ప్రార్థించినది.

మహారాణి లేచినది. ఆమె వెనుక అమృతపాదులు, చంద్రస్వామి చేయి పట్టుకొని నిలిచియుండి “మహారాణీ! ఈతడు చంద్రస్వామి. ఉత్తమ బ్రాహ్మణుడు. నీ బిడ్డ నివిషయమంతయు నీకు అవగతము చేయును. ఈతని తమజైత్రయాత్రలోకూడ తీసికొని పొండు. చదువు కొనినవాడు. తన జ్ఞానముచే తమ కుపశమనము చేయును” అని తెల్పినాడు.

మహారాణి చంద్రస్వామికి నమస్కరించినది.

“దీర్ఘసుమంగళీ భవ, మహాసామ్రాజ్యప్రాప్తిరస్తు, నష్టపుత్ర పరిష్వంగప్రాప్తిరస్తు” అని ఆశీర్వదించినాడు. గణగణ స్థూపఘంటికలు మ్రోగినవి.

10. పేరంటము

చారుగుప్తుని భవనమున హిమబిందు తన అభ్యంతరమందిరములో వృషభములు, నెమిళ్ళు, మామిడిపిందెలు చెక్కిన సువర్ణఖచితపర్యంకముపై పరుండి కనుమూసుకొని సువర్ణశ్రీ కుమారుని భావించుకొన్నది. ఆ దినమున నాతడు తనకు మోకరిల్లినాడు. అత డెంత అందగాడు. ఆ మనోహరమూర్తి నిలువబడి యున్నప్పుడు ఆతనిమూర్తి ఎంతగంభీరమై, ఎంత తేజోవంతమై కనుపించినది. బోధిసత్యమూర్తివలె వెలిగిపోయినాడు. ఆతని మాటలు విన్నప్పుడు, రూపము తలచినప్పుడు తన కేల గుండె కొట్టుకొనును? ఏమి యాతని విశాలవక్షము.

సువర్ణశ్రీకుమారుడు వట్రువలు తిరిగిన బాహువులతో ఏనుగు కుంభమువంటి మూపుతో, ఉన్నత శరీరముతో, నూనూగు మీసములు సొబగులీను సుందరవదనముతో ఆమె మనోవీధుల మందహాసములతో మసలినాడు.

ఇంతలో నొకచేటిక వచ్చి “అమ్మా తేరు సిద్ధమైనది. పట్టణములోని కరుగుటకు చెలులు సిద్ధముగనున్నారు. వారు రా ననుజ్ఞా?” అని యడిగినది.

హిమబిందు శక్తిమతీదేవిగారిభవనమునకు పోయివచ్చిన నాలుగు రోజులైనవెనుక మరల నాగబంధునికను, సిద్ధార్థినికను కలుసుకొనవలయునని ఆమెకు గాఢవాంఛ కలిగినది. అందుకై యామె వసంతపూజ యని పేరుపెట్టి, నగరమున నున్న ఉత్తమ కుటుంబాలవారి బిలువ సంకల్పించినది.

చెలి చెప్పుమాట వినియు, అటు చూడక హిమబిందు పరధ్యానమున తలయూప నా చేటిక నమస్కరించి వెడలినది. ఇంతలో నలుగురు చెలు లామెకడకు వచ్చిరి. వారందరితో హిమబిందు పట్టణములోనికి పిలుపునకు బయలువడలెను.

తక్కిన పిలుపులన్నియు నెటుల నెరవేర్చుకొనినదో తిన్నగ స్యందనమును సాయంకాలము మూడవయామభేరీలు మ్రోగునప్పటికి హిమబిందుకుమారి తేరును శక్తిమతీదేవి భవనమునకు పట్టించినది.

అచ్చట వారికందరికిని కుంకుమసుమసమ్మిళిత మగు పసుపుబొట్టు నొసటనుంచి, సాయంకాలరోచిస్సు లపరదిశ వెలిగించునప్పటికి తన మందిరమున వసంతపూజ వాయనము లందుకొన పిలిచినది. అంత నాగబంధునికయు, సిద్ధార్థినికయు, హిమబిందుకుమారియు నవ్వుచు, ఆడుచు బాలికల క్రీడామందిరమునకు బోయిరి.

ఆ క్రీడామందిర మొక ముద్దులమూట. సాగరవీచికామందిరము. మహావనానంద మయము.

“మన మిక్కడ నాట్యమాడెదమా నాగబంధునిక?”

“ఉపకరణములు”

“మనగజ్జియలే!”

“సిద్దార్థినిక శ్రుతియు, తాళమును వేయునులే”

వారు నాట్యమాడసాగిరి. వసంతసుమసౌరభములు దిశల పర్వినవి. ఒక్క సాయంకాలము వింధ్యపర్వత సానువుల, శైవాలినీకన్య లిరువురును ఆటలాడుచు, గాన మాలపించుచు సౌందర్యక్రీడాభిర్తలై మిసమిసలాడునప్పుడు వారి సొబగుమేనిత్రుళ్ళింతల నర్తించు ఇంద్రధనస్సులవలె ఆబాలిక లిరువురునృత్యము మొదలిడిరి. సిద్దార్థినిక చిరునవ్వు నవ్వినది. సిద్ధార్థయశోధరా సందర్శనము వా రభినయించుచు అవ్యక్తమధురస్వనముల పాటపాడసాగిరి.


హిమబిందు:

(యశోధరగా)
ఈ వనములో నాకు ఏమిదొరుకును శాంతి!
ఈ పూలలోనువెదక నేమి దొరకును భ్రాంతి!


సిద్ధార్థినిక:

 (చెలిగా)
మేఘాంచలములందు మేళవించెను హాయి
ధవళిమాక్రాంతమై పద్మరాగచ్ఛాయ.


హిమబిందు:

 (యశోధరగా విచారమున)
రాగమేలేని హృది మూగతనమే, సుమప
రాగమ్మలదునే భృంగపతి గరులపై


సిద్ధార్థినిక:

(చెలిగా)
వ్యోమగంగోర్మికాపులకిత మ్మగు హేమ
పద్మమ్ము వాంఛించె ధవళదంతావళము.


నాగబంధునిక:

(సిద్ధార్థుడుగా)
ఈ వనములో నింత వెలు గేల వచ్చెనో,
దివ్యసౌరభాల్ పర్వెనో,
మథురరాగాలు కూడెనో.


సిద్ధార్థినిక:

 (చెలిగా)
హిమవన్న గాంచలము ఎరుపెక్కెచూడవే!

సిద్ధార్థినిక పాడుటమాని గుమ్మముకడ నిలిచియున్న సహోదర సుందరమూర్తిని దరహాసముతో గమనించెను. చిరుగజ్జియల నిక్వణమును, మనోహర సంగీతమున తేలియాడి వచ్చు పాటవాగును ఆ యుద్యానవనమున నొంటిమై సంచరించుచు సువర్ణుని చకితుని చేసినవి.

“ఏమే బాలనాగీ, దారి యిమ్మనవే”

అను సాకూత వాజ్మాధుర్యము నేడాతని పులకింపచేసినది. “సువర్ణా! అల్లిబిల్లిగ నల్లికొన్న పచ్చని పొదలలో విడిపోయిన సకల గుణచాంపేయసౌరభము దిలకించెదవుగాక, కమలినీ సౌశీల్యము, మల్లికా శిశుత్వము, మాధవీలతా మాధుర్యము, దమన మరువ కౌషధీ సౌభాగ్యము దండకూర్చెదవుగాని ర” మ్మని వీణాపాణు లాతనిచెవికడ రహస్యముల తెలిపిన ట్లయినది.

సువర్ణుని చూచి హిమబిందు అట్లే నిలిచిపోయినది. ఏ సందర్శనమునకై ఇన్నినాళ్ళు తపం బొనరించుచున్నదో, ప్రయత్నపూర్వకముగ నుపాయములు వెదకినదో అది రూపొందినతోడనే ఆమెకు చెప్పరాని వివశత్వము కలిగినది. మలయ పవనాంకురములు తీగలై శరీరము నలుముకొనినవి. సుగంధవీచిక లామెపై విరిగి పోయినవి.

నాగబంధునిక గడుసుదనమున “అన్నయ్యా! ఈ అమ్మాయిని ఎరుగుదువుగా? చారుగుప్తదేవుని కుమార్తె, స్నేహితురాలు” అనినది.

11. సంకేతము

సాయంకాలమున ధాన్యకటకనగరమందున్న హిమబిందు భవనమునకు పెద్ద పెద్ద కుటుంబముల పుణ్యస్త్రీలు పేరంటకమునకు వచ్చిరి. సభామంటపమున కాశ్మీర కంబళులు పరచియుండిరి. సుగంధకరండములు మనోహరధూపముల వెదజల్లుచుండెను. ఒక మరకతమున దొలువబడిన గిన్నెలో పరిమళద్రవ్యములతో బాంధవము సలుపు మంచిగంధమున్నది. బంగారముతో, దంతముతో మలచిన అపురూప దారుపీఠముపై పూలపళ్ళెము లుంచిరి.

పుణ్యస్త్రీల పాదములకు చెలులు లత్తుకపెట్టిరి. తాంబూలము లిచ్చిరి. కలపము లలదిరి. పూవులనీరు జల్లిరి. పుష్పములు, ఫలములు మొదలగునవి వాయనమిచ్చిరి. కోకిల స్వనముల కొందరు చెలులు రాగము లాలపింప కొందరు మృదంగముల వాయించిరి. కొందరు వీణెల మీటిరి. అయినను హిమబిందు ఆ సంతోష సమయమున పరధ్యానయై యుండెను. సాయంతనమున కెవరిభవనములకు వారు యానములపై వెడలిపోయిరి. హిమబిందు తన అభ్యంతరమందిరమున నొంటిగా పవళించియున్నది.

ఆమె యెట్లయినను సువర్ణకుమారుని మరల చూడవలెను. ఆతని కన్నులలో తనప్రతిబింబ మెట్లుండునో! ఆతని నెట్లు చూచుట? ఆతని గనుగొనకుండ నుండలేదు.

ఆ మోహనాకారుని హస్తము తన భుజమున కంటినతోడనే యొడలు జల్లు మని మధురత్వ మేదో తన్ను ముంచివేసినది.

హిమ: బాలనాగీ, ఒకసారి యిటు రావే! అనతిదూరమున నున్న బాలనాగి పరుగున వచ్చినది. హిమబిందు ప్రేమ వైవశ్యమును, స్నేహప్రసన్నతయు చూపుల నుట్టిపడ “నా ప్రాణములు నీ చేతిలో నున్నవి” అని దాని భుజముపై చేయివేసెను. బాలనాగి నిమిషమున ఆమె భావము అర్థము చేసికొన్నది.

బాల: అమ్మా! నే నవశ్యము ఒక కార్యము నెరవేర్చెదను.

హిమ: ఏ మది?

బాల: మీ రూరకుండుడు. సాయంకాలము క్రీడోద్యాన విహారము.

***

సువర్ణునిహృదయమున చందన మలిమిపోయినది. చల్లని మలయ పవనములు ప్రసరించినట్లయినది. తన శిల్పములు, చిత్రములు అన్నియు ఆనా డామె మరల నెంతో మోదముతో తిలకించినది. ఆమె కన్నులు ఎండలోని హిమబిందువులవలె మిలమిలలాడి పోయినవి. తనప్రక్క ఆమె నడుచునప్పుడు, తా నామెను శైబ్యసుగ్రీవకములకడకు గొనబోవునప్పుడు, వాని నామెకు కాననిడినప్పుడు, ఆ కాన్క నామె వల దనుచు మంద హాసమున నెట్ట కేల కంగీకరించినప్పుడు తాను లోకమే మరచినాడు. ఆనందమే తానయినాడు. హిమబిందు శిల్పము విన్యసించుచున్నాడు. సౌందర్యాధిదేవత ఆ శిల్పమున వెలయుచున్నది.

ఇంతలో నాగబంధునిక అక్కడికి వచ్చినది. “అన్నయ్యా! సంజ చీకటివేళ కృష్ణానదీకూలమున చారుగుప్తులవారితోటలో ఉత్తరపుగున్న మావికడ కూర్చుండి కృష్ణానది ప్రవహించుట కనుగొన్నచో ఎంత సుందరము, ఎంత విచిత్రము” అని యూరించినది. సువర్ణకుమారుడది అర్థము చేసికొన్నాడు. చెల్లెలి చెక్కిలి పుణికి ముద్దుగొన్నాడు. ప్రయణదేవతావశులకు పండితుల కర్థముకాని మాటలు మంచినీటి ప్రాయముగ పరిస్ఫుటము లగును.

***

హిమబిందుసౌధముపై నిలిచి, చిడిముడివడుచు సాయంతనమెప్పు డగునా యని వచ్చినచోటికే వచ్చుచు, పోయినచోటికే పోవుచున్నది. ఆమె వదనము ప్రఫుల్లమై రాబోవు సౌఖ్య మెదురుచూచుచున్నది.

కృష్ణవేణి యానాడు తన జడ నీటి పై తేలియాడుచుండ మందహాసంబున నిజముఖంబు కాంతులీన పవనకుమారునితో మేలమాడుచు, లేత మావిచిగుళ్ళు మెక్కుచు కోకిలపాడు పాటను వినుచు కృశాంగియై ప్రవహింపుచున్నది.


కోకిల:

కుహుకుహూ కుహుకుహు
కుహుకుహూ కుహుకుహు
కొసరుపాటల తేనె
పసరుమొగ్గల వగరు
ముసుగు గప్పిన నగవు
త్రస రేణువులపైన
అలరారే సంజవేళన్ (కుహు)



కుహుకుహూ కుహుకుహూ
ప్రణయకోమలి నీకు
ప్రణతు లిచ్చెడు వనము
తృణశూన్య పుష్పాల
తృణనీల పక్షాలు
వణికాడు గీతికలతో (కుహు)


పికాంగన:

శారదావల్లకీతంత్రీస్వనము నేను
నాకంఠగత సుధానాదాలలో సుళ్ళు
నందబాలుని వేణునాదాల చెల్లెళ్ళు


కృష్ణానది:

ఔనే వనప్రియా!
నా నీలవేణి కానైగనిగ్యమ్ములో
నాగమన వేగాల నవ్యనటనమ్ములో
తలచూపె నీరూపు
మొలకెత్తె నీ పాట!


భృంగము:

జుం జుం జుం ! భం భం భం !
ఏ నాటివో మనసులో నాటె వాసనలు
అవని సర్వము వసంతారామమై
వన్నె వన్నె పూలై, పైడిదొన్నెలై
తేనియులక్రోవులై
నను బిలచె
ఆరగింతును గొదదీర, మనసార!


సంధ్య:

కృష్ణవేణీ నీలిమలు, కో
కిలలగొంతుల తీయనలు, అళి
కుల గరుత్తుల మిలమిలలు, నా
వెలుగునీడల, వన్నెవన్నెల
విలసనమ్ముల గలసి యాడును
తొలకి పాడును.


12. కృష్ణవేణీ తీరము

సువర్ణశ్రీకుమారుడు హృదయము దడదడ కొట్టుకొన సమశ్రుతి నందిన సంధ్యాకాశమును, నదీప్రవాహమును చూచుచు ఆ వనము ప్రవేశించినాడు. కృష్ణవేణి వినీల జలంబుల నెరసంజ ప్రతిఫలించుట నాతడు చూచెనో, లేదో! కోకిలామధురగీత మతడు వినలేదు. మల్లెలు, శేఫాలిక, హేమపుష్పము, అతి ముక్తము, జాజి, మాలతి, మాధవి, నవమాలిక, కుందము, కరవీరము విరియబూచి యున్నవి. ఆతడు వానిదెస చూడలేదు. అతనికోర్కె ఎఱ్ఱనైనది. అతనిగండఫలకములు చిరుచెమ్మటలు వోసినవి. ఒక్క పొదరింట నాతడు చతికిలబడినాడు. ఆతని విశాలవక్షము పొంగి పోవుచున్నది. వనమున విహరించు వసంతునివలె ఆ ప్రదేశమున ప్రణయ కాంతులతో తేజరిల్లి పోయినాడు.

చీకటి మందమంద తమోహాసముల తనబాహుల జాచి కదలి వచ్చుచు విపుల వృక్షముపై నెల్లర నిదురింపజేయ తలంపుగొని తూర్పున నుదయించినది. ఆ సమయంబున నిరువురు బాలిక లొయ్యారపునడకల నా వనవాటికలోని కరుదెంచిరి.

ప్రేంకణిత తనులతతో విస్ఫారిత నయనములతో నిటునటు చూచుచు వెనుకాడుచు వచ్చుచున్న హిమబిందు వికసించిన పుష్పమైపోయినది.

ఘల్లుఘల్లు మను చప్పుడు చెవి నెటులసోకినదో సువర్ణశ్రీకుమారుడు సముద్ర తరంగమువలె లేచినాడు. ఒక్క యుదుటున వారికడకు పోవువాడై అంతలో కొంచెము సంకోచించెను. “ఎట్టకేలకు, ఎట్టకేలకు” అని వాని యెడద పెదవులు తడిసికొన్నది. ఎక్కడ హిమబిందు! తా నెక్కడ! సుందరాంగులలో సుందరాంగియై, వైభవమున మహాలక్ష్మియై, తారాదేవి యైన ఆమె తనకడకు వచ్చుచున్నది. సంకేత ప్రదేశమున కా బాలిక లిరువురు వచ్చినారు. సువర్ణకుమారు డచ్చట మన్మథాకారుడై నిలిచియుండెను. హిమబిందు ఆగిపోయినది. కొన్నినిముషము లెవరును మాటలాడలేక పోయిరి.

ప్రేమకు మాటలు రావు. పరస్పరము వలచిన పడుచుజంటల తొలి సమాగమము. అది యెక మధురానుభూతి. ప్రేమపూర్ణమైన హృదయములలో తలపులకు, మాటలకు చోటెక్కడ? వా రిరువు రొకరినొకరు చూచుకొన్నారు. చూచుకొనుచు నట్లే కొంతతడవు నిలిచిరి. చూపులకు మాటలు వచ్చునేని వారా ముహూర్తమున ఎన్నివేల గ్రంథమో మాటలాడిరి. వారి హృదయములు పలుకరించుకొన్నవి. చేతులు పెనవైచి గాఢాశ్లేషసుఖ మనుభవించినవి. ఆ వైవశ్యమున వారిరువురు గనులుమూసిరి. మోడ్పుగనులతో నొండొరుల విలోకించుకొనిరి. ఆ యంధవీక్షణములు రెండును ఒక్కటియై ఇరువురను ఒక్కటిగా చూచినవి. ఆ యొక్క వస్తువును వెలుపలిదిగా చూడలేదు. రెండవ వారిని తమలోనే చూచిరి. ఆ చూపులో తుదకుతాము కనిపించక రెండవవారే తామై కనుపించిరి. ఆ క్షణమున సువర్ణశ్రీ, హిమబిందు అను నిరువురు లేరు. ఆ విచిత్రానుభవము నుండి తెప్పిరిలి, కన్నులుతెరచి చూచునప్పటికి హిమబిందుకు విశ్వమంతయు సువర్ణశ్రీమయమై తోచెను. సువర్ణశ్రీకి సర్వము హిమబిందువై కాన్పించెను. ఆ విచిత్రలోకమున బాలనాగి పలాయనము చిత్తగించెను.

ఆవల నిశ్చలమై, నిరంతరమై సాక్షీభూతమైన కృష్ణాప్రవాహము, పైన వినీలాకాశము తారకానేత్రము అప్పుడే విప్పుచున్నది. చెంతను తమపై శాఖాబాహువులు చాచి పుష్పషాతల సల్లుచున్నగున్నమావి. అపుడు వార లొకరినొకరు చూచుకొనిరి. ఇరువురు నొక్కసారి మందహాస మొనర్చుచు చేతులు సాచిరి. చెట్టలుపట్టి ఆ గున్నమావిక్రింద నొరసికొని కూరుచుండిరి. చిఱుగాలికి గున్నమావి యాకులు గుసగుసలువోదొడగెను. కృష్ణవేణి తటమున చిఱు కరళ్ళు జిలిబిలిపలుకు లాడజొచ్చెను. “బిందూ! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు? ఎచట నుంటివి ప్రాణమా, యిన్నియుగములు? నీ కొఱ కెంతవెదకీతిని? ఎంత తపించితిని?” అనుచు సువర్ణశ్రీ యా జవరాలినెమ్మోమును మరల తనివోని చూపుల జూడజొచ్చెను. హిమబిందు ఆతని చూడ్కులు గాంచి “అదియేమి, శ్రీ! అట్లువింతగా జూచెదవు?”

“కాదు, దేవీ! నీవు నీవేనా యని చూచుచున్నాను. నాపూజా పీఠముపై మలచికొన్నది నిన్నా, లేక నీలోనున్నది నాయారాధ్యదేవతయా అని చూచుచున్నాను.”

“మీకు నే నిన్నివిధముల కనిపిస్తున్నానేమోగాని, నేను మాత్ర మొక్కతెనే. మీరును నా కొక్కరే.”

“నిజమా నీ మాట బిందూ! నే నంతటా నిన్నే చూచుచున్నాను. నీ వొక్కతవే ఇన్నిచోట్ల ఇన్ని కాలముల నెట్లుంటివి?”

“అవును. మీ రున్న చోటెల్ల నే నున్నాను.”

“నేను లేనిచోటనో?”

“మీరు లేనిచోటు లేదు.”

మరల వారొకసారి కిలకిల నవ్వుకొనిరి. పరస్పరము చూచుకొనిరి. గున్నమామిపై నున్న కోకిల మొకపరి కుహూ యున్నది. వారిరువురును నులికిపడిరి. కృష్ణవేణి వెలినురువు నగవు లొలుకబోసికొనుచున్నది, సువర్ణశ్రీ యా బాలికకరము గ్రహించి, “బిందూ! నా భాగ్య మేమని చెప్పను! ప్రేమసర్వస్వమగు నీమృదుబాహువల్లరి నాకు నేటికి చిక్కినది. ఇవి యూతగా నేడు ఈ దేశములను, కాలమును గడచిపోగలను” అనుచు బ్రియమార నా చివురుకెంగేలు ముద్దుగొనెను.

యవనవంశ పరంపరాగతమైన ఆమె ఉడుకురక్తము పొంగి పరవళ్ళెత్తినది. వారిరువురు లేవబోయినప్పుడు ఆమె వివశయైతూలి ఆతని హృదయమున వ్రాలినది. సువర్ణశ్రీహృదయమున వాంఛయు నొక్క ఉరుకున పైకి విజృంభించినది. అప్రయత్నముగ ఆతని బాహువు లా బాలికను చుట్టివేసినవి. ఆత డామెను గాఢముగా తన హృదయమున కదిమి కొనినాడు. దేశకాలములు ఊపిరిబిగబట్టి నిలిపోయినవి.

బాలనాగి దవ్వులనుండి “అమ్మా! ప్రొద్దుపోయినది” అనెను. వారిరువురు ప్రకృతిస్థులైరి.

ఆమెయందు శాంతమై ప్రవహించు ఆర్యత్వము గాఢవ్రీడాభావ ముదయింప చేసినది.

“రే పీ వేళకు... ఇక్కడ...” అనుచు ఆమె పరువిడిపోయినది.

13. ప్రేమ కలశాంభోధి

ప్రేమికులిరువురు మరునా డా సంకేతస్థలముననే కలసి కొన్నారు. బాలనాగి ద్వారముకడ రక్షకభటురాలైనది.

హిమబిందు మాటలాడలేక త్రపాహృదయియై తలవాల్చి “ఆర్యా! నేనును మీరు నిట్లు కలిసికొనుట తగదు. నేటితో సరి మన ఏకాంతము” అని పలకినది.

సువర్ణశ్రీ కుమారుడు: ఏమి యీ మాటలు? తన్వంగీ! మన మిక్కడ గాకున్న ఎక్కడనైన కలసికొనవలసినదే. రమణీయమగు విశ్వమంతయు మనకు సంకేతస్థలమే. మన మిక కలసికొనకుండు టెట్లు?

హిమబిందు హృదయమున కేమియు తోచుటలేదు. సువర్ణశ్రీకుమారుని తాను ప్రేమించినమాట నిజము. నిజము! ఆమెది రాజసప్రకృతి. ఏ రసావేశమైన నా బాలలో

 గాఢముగ ప్రవహింపవలసినదే. ప్రణయ మననేమో ఆమె నేటికి ఎరిగినది. ఆమె నలయించు అస్థిరతకు జాలు దొరకినది. నిండారి. నిర్దుష్టమై. నిర్వక్రమై ఒంటివారు సువర్ణశ్రీకుమారజీవిత ప్రవాహమున నామె ప్రవేశించినది. ఏల తా నాతని ప్రేమించినదో యా కుమారికి తెలియదు. ఆతని సోయగము మచ్చలేనిది. బలమున నాతడు మంజుశ్రీయే. మరి? అతనికి సోగమీసములు లేవు. కన్నులలో కెంపు వెలుగు లేదు. పెదవుల చివర గుండె లదురచేయు లఘుహాసము లేదు. ఓహో! ఆతడు దేవతామూర్తి.

సువర్ణశ్రీది నూత్నయౌవనము. రాగరక్తిమ లలము శుభముహూర్తమది. సౌందర్యా రాధకుడగు నాతని అచ్చహృదయమున భగవదతీత సుందరభావ ముదయించినది. దాని నాతడు శిలలో, రంగులలో రూపెత్తించుచుండ, నది సజీవమై హిమబిందున సాక్షాత్కరించినది. అంతటితో నవతుషారార్ధ్ర మగు నరవిందమువోలె నాతని హృదయము విరిసినది. ఆ కమలముపై హిమబిందు అధిష్టించినది. ఆ దేవి తన్ననుగ్రహించినది. బహుజన్మ తపఃఫల మాతని ననుసరించినది. ఆ దేవిసేవయే ఆతడు కోరునది. ఆ సేవలో నాతనికి సృష్టి యంతయు రసమయ మగుచున్నది. దైహికము లగు పరిష్వంగాదు లా సేవా కలాపము.

సువర్ణ: బిందూ! మాటాడవేమి?

హిమ: నాకు మాటలు రావు.

సువర్ణ: నీపేరంత మధుర మేమి?

హిమ: మీ పేరులో అంత బంగార మేమి?

సువర్ణ: ఇన్నిరాత్రులు సృష్ట్యాదినుండి వెళ్ళిపోయినవి. ఈ రాత్రియంత అందముగ నుండినదా?

హిమ: ఆ కోకిల అంత అందముగ పాడగలిగినదా ఇదివరకు? కృష్ణానది నన్ను చూచుచున్నది. నాకు సిగ్గువేయుచున్నది.

సువర్ణ: అయినచో నా యీ హృదయమున దాగుకొనరాదా?

హిమ: శిల్పులహృదయములో రాళ్ళు, రప్పలు ఉండును. అదిగో! అంత దగ్గరకు మీరు రాకూడదు.

సువర్ణ: పోనీలే! నేను దూరముగనే కూర్చుండెదను.

హిమ: మీకు దగ్గరయు, దూరము నొక్కటేకదా!

సువర్ణ: నిజమేకాని, నీవు నా కారాధ్యదేవతవు. నిన్ను చేతులార నేను పూజించుకొనవలెను.

హిమ: ఆ పూజలు మీయింట నున్న విగ్రహమునకు జేసికొనుడు. నేను బాలికామాత్రను. చారుగుప్తులవారి కూతురను. నన్ను మీరు పూజింపనూ రాదు, అంటనూ కూడదు.

ఈ మాటలు విని సువర్ణశ్రీ ప్రకృతిస్థుడైనాడు. కుబేరవిభవు డగు చారుగుప్తుని తనయను తానిట్లనదగునా? తనవంటి నిర్భాగ్యుల కట్టిదేవత యెట్లు లభ్యమగును?

అతని కళవళపాటును హిమబిందు గ్రహించినది. “ప్రొద్దుపోవు చున్నది” అనుచు లేచి అతనిచేయిపై కెంగేలు వైచినది.

వేయి పరీమళములు వికసించు స్వర్ణ దీతరంగలాలిత దివ్యకమలము ఆతని స్పృశించినట్లయినది. కరడుకట్టిన మహాశిల్పికాంక్షపోలె కృష్ణాతీరమున సౌందర్యశ్రీ మూర్తియై కోటియౌవన తపఃఫలంబులు వోలె విలాసరూపయైన ఆ దేవత నాత డాఘ్రాణించి హృదయమున జేర్చుకొనెను. ఆమె పాదములకు బ్రణమిల్లెను. ఆమె చీనాంబరపుచెరగులో మోము కప్పకొని, తలవంచి, మోకరించి, యామె పాదములపై మోము నుంచి, నందనవనవాటికా వికసిత మందారపుష్ప దళములవలె నున్న ఆమె పాదాంగుళుల ముద్దుగొన్నాడు. ఆమెమీగాళ్ళ పెదవులు చేర్చినాడు.

హిమబిందు ఆనందపులకితయై, చకితయై, పరవశయై, కన్నులు మెరసిపోవ, అశ్రుబిందువులు తిరిగిపోవ, శ్వేత తారహార సుందరము లగు హస్తముల ఆ భక్తునితలపై నిమురుచు, ఆతని మో మెత్తి, కన్నుల ముద్దిడికొని, యాతని పెదవుల దనమనోరాగమును ముద్రించి, “రేపువద్దు, పై శుక్రవారము” అనుచు త్వరితముగ నడచి యా చీకటులలో మాయమయ్యెను.

14. గౌతమి

త్య్రంబకేశ్వరజటాజూటనిర్గత యగు గౌతమీకుమారి నాసికా సంఘారామ క్షేత్రమునకు వచ్చునప్పటికే శైశవము వదలి బాలిక యైనది.

ఆమె ఆటలలో అనంతకాలనర్తనము లున్నవి. ఆమె పాటలలో శబ్దబ్రహ్మానంద తరంగములు ఊగిపోవుచున్నవి. సహ్యాద్రిసానువుల నెన్నియో యలంకరణము లామె సమకూర్చుకొని యా లోయలలో విహరించుచు ఎందరినో శైవలినీ బాలికల తనలో లీనము గావించుకొనుచు, ప్రతిష్ఠాన నగరముకడకు వచ్చునప్పటికి యౌవనవతియై, హొయలు మెరయు క్రీగంటి చూపులతో, కులుకు నడలతో మందగమనమై నడచి పోవుచున్నది.

ప్రతిష్ఠా నగరమునకు కొలదిదూరమున గోదావరీనదీతీరమున స్థౌలతిష్యమహర్షి యాశ్రమ మొకటి యున్నది. స్థౌలతిష్యునికి సకలభారతావని యందును ఇరువది ఏడు ఆశ్రమము లున్నవి.

ఒకనాడా ఆశ్రమమునకు ఆంధ్రసామ్రాజ్యయువరాజు శ్రీకృష్ణశాతవాహనుడు క్రీడారథమెక్కి నలుగురు చక్రరక్షకులు వెంటరా నరుదెంచి, గోపురముకడ రథము నాపి అందుండి అవరోహించెను.

***

సార్వభౌముని జన్మదినమహోత్సవములన్నియు నైనవెనుక ఒక శుభముహూర్తమున యువరాజు ప్రతిష్టా నగరమున కేగ తల్లిదండ్రుల యనుమతిగొన సార్వభౌముని దర్శనమునకై యనుజ్ఞవేడినాడు. ప్రతీహారిణులు వచ్చి “దేవా, ఇటు, ఇటు” అని దారిచూపుచు సార్వభౌముడున్న శ్రీమందిరమునకు గొనిపోయిరి.

“జయ! జయ! చతుస్సముద్రవలయిత జంబూద్వీపాధినాథా! జయ! ఐక్ష్వాకు, బృహత్పలాయన, ఆనంద, సాలంకాయన, మాఢార, నాకాటకాది మహామండలేశ్వరరాజిత మహాసఖా! పూజితమహాశ్రమణపాదుకా! సర్వ ధర్మరక్షణ బిరుదాంకితా! శ్రీ శ్రీ కౌశికీపుత్ర శ్రీముఖశాతవాహన సార్వభౌమా! జయ! మయ! మాళ్వాభీరానర్తకొంకణాది సర్వదేశ విజేతలు శ్రీ శ్రీ ఆనందీపుత్ర శ్రీకృష్ణశాతవాహన మహారాజులంవారు దర్శనార్ధము వేంచేసినారు” అని వారు విన్నవించినారు. మెత్తని హంసతూలికాపధానముల జేరగిలి మేనువాల్చియున్న సార్వభౌముడు సువర్ణ మఞ్చమునుండి లేచి, త్వరితముగ మందిర కవాటము కడకు వచ్చి, పాదాభివందన మాచరించిన పుత్రుని భుజములుపట్టి ఎత్తి, హృదయమున కదిమికొని వేరొండు సువర్ణాసనముపై తనయు నధివసింపజేసి తా నధివసించెను.

“కుమారా! మీరు ప్రతిష్ఠానపురము పోవుటకు ముహూర్తమును కార్తాంతికులు ఏర్పాటు చేసిరట కాదా!”

“సర్వసైన్యములు సిద్ధముజేసి యుంచుకొనుడు. మహారథి విశ్వసేని నాగమహారాజును సైన్యాధిపతి చేయుడు. మన రథికులకు వ్యాఘ్రనదీ రాజపథమువెంట ఉజ్జయినికి సహాయముపో నాజ్ఞయిండు. మీరు నాగసైన్యములును, ఆంధ్రసైన్యములను తీసికొని, ఆభీరులను దాకి భరుకచ్చము బట్టుకొనుడు. అచ్చట కొన్ని సైన్యములతో అఘబలమహారాజును కాపుంచి మీరు ఉజ్జయినికి రండు.”

“చిత్తము. మహాప్రభూ! అటులనే చేయుదును.”

అంతటితో సార్వభౌమునకును, మహారాజప్రతినిధికిని జరుగవలసిన తంతు నడచినది. ఇంక వారిరువురును తండ్రికుమారులు.

“తండ్రీ! నీవు జాగ్రత్తగా ఉండవలయును సుమీ! మీ యమ్మయు నేనును మా కన్నులు నీమీదనే పెట్టికొనియున్నాము. దేశములో కొంతమంది చేయు కుట్రలన్నియు తెలియవచ్చినవి. స్థౌలతిష్యమహర్షి మన వంశమునకే విరోధిగా మారినారు. మీతమ్ముడు మంజుశ్రీని ఎత్తుకొని పోవుటలో ఆ మహర్షి ప్రోద్బలమున్నట్లు తెలియుచున్నది. ఆయనకు ప్రతిష్ఠానములో వేరొక ఆశ్రమమున్నది. మొన్ననే ఆయన తన శిష్యకోటితో, భక్తగణముతో ప్రయాణములు చేయుచు ఆ ఆశ్రమము చేరినారట.”

ఇంతలో ప్రతీహారి “జయ! జయ! సార్వభౌములకు!” అని వినయమున ద్వారముకడ పలికెను. సార్వభౌము డా దిక్కుచూచి “ఏమి?” అని ప్రశ్నించెను.

“ప్రభూ! మహాదేవి దేవరవారిదర్శనార్థము అనుమతి కోరినారు.”

“ప్రవేశపెట్టుము.”

శ్రీకృష్ణుడు ఆసనమునుండి లేచి, త్వరితముగ గుమ్మముదాటిపోయి, వచ్చుచున్న మహారాణి పాదములకు మోకరిల్లి నమస్కరించెను.

ఆనందమహారాణి చిరునవ్వుమోమును వెలిగింప పుత్రుని ఆశీర్వదించెను. ఆతడు, లేవగనే ఆమె గుమ్మముదాటి, లోని కరుదెంచి, భర్త పాదములకు నమస్కరించినది. శ్రీముఖుడు దేవిని తనప్రక్క సువర్ణ మఞ్చముపై కూర్చుండ బెట్టికొనెను.

వారంద రధివసించిన వెనుక ఆమె కుమారుని కనుగొని “తండ్రీ! నీపై నా ప్రాణమంతయు పెట్టుకొంటిని. మీ నాయనగారు వీరులు మరల యుద్ధము సంకల్పించినారు. నీవును యుద్ధమునకు బోకతీరదా?”

శ్రీకృష్ణ: అమ్మా! రాజబ్రాహ్మణడనై పుట్టి యింట కూర్చుందునా? అధైర్యపడకుడు. యుద్ధములో నాకు వచ్చిన భయము లేదు.

శ్రీముఖ: అబ్బాయి ప్రతాపమును శత్రుల కిప్పుడే చవిచూపినచో ముందుముందు రాజ్యము నిష్కంటకమగును. నువ్వు అధీరవు కావలదు.

దేవి: ప్రభూ! మీ రెప్పుడు అలాగుననే యందురు. నా మంజు ఏడీ? శ్రీముఖ: నేను మనచిట్టిబాబును నెలదినములలో నీ అంకమున చేర్చితీరెదను.

శ్రీకృష్ణ: నేనును నాయనగారితోపాటు ప్రతిజ్ఞ చేయుచున్నాను. జననీ!

***

శుభముహూర్తమున శ్రీకృష్ణశాతవాహనుడు ప్రతిష్ఠానమునకు బయలుదేరి వచ్చెను.

ఆనాడట్లు స్థౌలతిష్యాశ్రమమున బ్రవేశింపగనే మహర్షులు, పండితులు మహారాజును గోపురముకడనే ఎదుర్కొని, ఉచితోపచారముతో లోనికి తీసికొనిపోయిరి. శ్రీకృష్ణశాతవాహనుని వారట్లు కొనిపోయి ఆశ్రమమునందు పూజామందిరమున ముఖ్యప్రదేశమున వ్యాఘ్రాజినముపై నధివసింపజేసిరి.

ఇంతలో స్థౌలతిష్యమహర్షి శ్రీకృష్ణశాతవాహనునకు దర్శనమీయ నా పూజామందిరమునకు లోనుంచి వచ్చుటతోడనే యాయన లేచి యా మహర్షికి సాష్టాంగ వందనమాచరించెను.

ఎదుట సాష్టాంగపడిన బాలుని అనాలోచితముగ స్థౌలతిష్యుడు “దీర్ఘాయుష్మాన్ భవ” అని యాశీర్వదించినాడు. వెంటనే ఆ ఆశీర్వాద భావ మాయన మనోవీధిని బొడసూపినది. అంతటి మహాజ్ఞానియు గడగడ వణికినాడు. ఆయన కోపము మిన్ను ముట్టినది. కన్ను లెఱ్ఱవారినవి. పెదవులు వణకినవి. మహర్షి కొంతవడికి తన క్రోధాదికముల నడంచుకొని, లేని చిరునవ్వు మోమున దెచ్చి పెట్టుకొని,

“మహాప్రభూ! లెండు. ఎప్పుడు దయచేసినారు?” అని ప్రశ్నించెను.

“నిన్ననే వచ్చినాను మహాఋషీ!” అని శ్రీకృష్ణుడు ప్రతివచనము చెప్పుచు, లేచి స్థౌలతిష్యునితోబాటు తనయాసనము నధివసించెను.

మహాగ్నిశిఖలై ఆంధ్రభూమిని గప్పుచున్న సాయంకాలపు వెలుగులు త్రియంబకేశ్వరుని జటామకుటమునందు పొడసూపినవి.

15. వెలుగు నీడలు

స్థౌలతిష్యుడు: (శ్రీకృష్ణ శాతవాహనుని తేరిపారజూచి) మహారాజా! తమరువచ్చి రెండుదినములైనను కాలేదు. సంపూర్ణముగ శ్రమతీరకమునుపే తాము మా ఆశ్రమమునకు విజయము చేసినారు.

శ్రీకృష్ణ: మహర్షీ! పని యేమియులేదు. నేను యిచ్చటకు జేరుదినమునకు మూడు దినముల ముందటనే ఈ ఆశ్రమమునకు తమరు వచ్చినారని నా మంత్రి యెరిగించినాడు. తమ ఆశీర్వాదము పొందుటకును, ఇదివరకు మీరీ యాశ్రమమునం దున్నపుడెల్ల నేను చేయు సేవను మరల చేయ అనుమతి నడుగుటకును వచ్చియుంటిని. ఆశీర్వాదము నందితిని. నేనును, ఈ మహదాంధ్ర దేశమును తమ సేవ కెప్పుడును సిద్ధము.

స్థౌలతిష్యుడు వెడనవ్వు నవ్వుచు, “మహారాజా! ఈ వినయసంపద తమ కెంతయు తగియున్నది. కాని శాతవాహనులకు శ్రవణకాశీర్బలమే సర్వాభీష్టములను సమకూర్ప జాలియుండ, ఈ బడుగుబాపలకై తమరెందు కింత శ్రమ పడుట? ఈ యాంధ్రభూమిలో బ్రాహ్మణుల కీ మాత్రము నిలువ నీడ నిచ్చుచున్నారు. మా కదియే పదివేలు” అనియెను. “సార్వభౌములు ఉభయధర్మ సేవకు లగుట తమ రెఱుగనిది కాదు. ఉభయుల ఆశీర్వాదములు మేము తల ధరింతుము. విశేషించి తమవంటి తపస్సంపన్నుల అనుగ్రహమునకు బాత్రుడ నగుట నా భాగ్యము” అనుచు శ్రీకృష్ణశాతవాహనుడు మహర్షియనుజ్ఞ పొంది రథమెక్కి తన కోటలోనికి వెడలిపోయెను.”

శ్రీకృష్ణ శాతవాహనుడు వెళ్ళిపోయినప్పటి నుండియు స్థౌలతిష్యాచార్యునకు ఆశ్చర్యము, కోపము, అనుమానము, విషాదము ఒక్కసారిగా క్రమ్ముకొన్నవి.

సింహ మున్న గుహ జొచ్చు లేడివలె నీ బాలుడు తనయాశ్రమమునకు వచ్చినాడు. ఈ రాకలోని భావమేమి? ఇతడేమైన ననుమాన పడినాడా? అప్పుడప్పుడు తన యాశ్రమమునకు శ్రీముఖుడును, శ్రీకృష్ణుడును వచ్చుట కలదు. మొన్న జరిగిన చంద్రస్వామి విచారణలో సోనుత్తరాదులను గురించి సాక్ష్యములందు వక్కాణింపబడెనుగదా! సోనుత్తరాదులకును, తనకును గల సంబంధము సార్వభౌముని గూఢచారులకు తెలిసినదా? ఇచట మంజుశ్రీజాడ యేమైనదొరకునని యీతడు వచ్చి యుండునా?

తనకు రాబోవు విపత్తు నెఱుగక తమ్మునికై దేవులాడుచున్నాడు పాప మీతడు! తా నట్లాశీర్వదించినాడేమి? తనవాక్కు అనృత మగుట ఎట్లు?

అనాలోచితముగ, అప్రయత్నముగ అనినమాటలే నిజమగునందురు. ఇంత మాత్రముచే దనసత్య ప్రతిజ్ఞ అసత్యమగునా? తానెంత అవివేకియైనాడు! ఉత్తమ బ్రాహ్మణునకు సర్వకాలములందు జాగర, స్వప్న, సుషుప్తుల యందును నేమరపాటు కూడదు. ఎంత ప్రయత్నము చేయుచున్నను జాగరూకతలేని వాడు హతభాగ్యుడు. పరమేశ్వరకార్యము సలుపు భక్తులకు ఎట్టి ఏమరు పాటు ఆవహిల్లగలదు?

తనలో ఏమి దోషము గల్గినది? తనదీక్షలో నేమి అధర్మమున్నది? వేద ప్రామాణ్యమును, ఈశ్వరభక్తియు సకలజంబూద్వీపము నందు నెలకొల్పుటకు తనతపస్సు, తద్యోగ పవిత్రములై, తన్మంత్రపరములై, తద్దీక్షావశములైన తనమాటల కీ స్ఖాలిత్య మేల కలిగినది? శాపాక్షరములు వెడలవలసిననానోట అమృతోపమానములై ఏ మహా సంకల్పముచే నేడట్లు “దీర్ఘయుష్మాన్భవ” యను స్వరము వెడలినది!

తన మంత్ర ప్రయోగములు శక్తిహీనము లగునా? తన అభిచార హోమములు నిస్తేజములై చల్లబడిపోవునా? వేదధర్మ ప్రతిష్ట ఈశ్వరప్రీతికరము కాకపోవు టెట్లు? ఏమైనను ఈశ్వరార్పణబుద్ధితో తనకర్మ దాను నిర్వర్తించవలెను.

స్థౌలతిష్యుడు తిన్నగ లోనికిపోయి గంగాజలములు కలిపిన జలములందు మరల స్నానమాడి, ప్రాయశ్చిత్తవిధి నెరవేర్చి, జప నిమగ్నుడై ఆ దినమంతయు నుపవాస ముండి రాత్రి రెండవయామమునకు కన్నులు తెరచినాడు.

శ్రీకృష్ణశాతవాహనుడు తన యభ్యంతరమందిరముల చేరుట తోడనే పనికత్తెలు మహారా జెప్పుడైనను బయటకు వెళ్ళివచ్చినంతనే స్నానముచేయుట యలవాటు గాన వారిని స్నానాయత్తుల జేసిరి.

మార్జనికలు స్నానగృహమునకు గొనిపోయి ఉష్ణ సుగంధజలముల యువరాజును స్నానమాడించినారు. పన్నీరుపూల అందాల మెత్తని వలిపెముల తడియొత్తి, సువాసన ధూపములు వైచి, శుభ్రవస్త్రములు కట్టి అలంకరించినారు. మహారాజంత విద్యా గృహంబున కేగి, మెత్తలు పరచిన దంతపల్యంక పీఠమున అధివసించి రక్షక స్త్రీలకు, తక్కిన సేవకురాండ్రకు పొమ్మని కనుసైగజేసినాడు. చిత్రితకుడ్యవిరాజితమై బహుగ్రంథపేటికాసనాథమై, శిల్పవిన్యాస యుక్తమైన యా విశాలమందిరమున ఆత డొక్కడు ఆలోచనాధీనుడై యుండెను.

ఆతని కేదియో భయమును, ఏదియో ఆనందమును, వేదనయు, సుఖమును వెలుగు నీడలవలె హృదయస్పర్శ గావించుచుండెను. శ్రీకృష్ణ శాతవాహనుడు తండ్రికన్న కఠినహృదయము కలవాడు. శ్రీముఖుడు సంపూర్ణబౌద్ధభావానందుడు. శ్రీకృష్ణునకు ఒకవైపున ఆర్షధర్మాసక్తి, ఇంకొకవైపున బౌద్ధరక్షణ విజ్ఞానాభిరతి; ఒకవైపున శత్రునిర్మూలనో త్సాహము, ఇంకొకవైపున ఇదియంతయు మాయ యను నైరాశ్యభావము.

ఆతడు సంపూర్ణయౌవనుడు. వీరవిక్రమోపేతుడు. ముగ్గురు బంగారు కన్నెలాతని హృదయతాపమునకు పన్నీటి కలశములవలె వేచియుండిరి. వారు మువ్వురు ఉత్తమకులసంజాతులు. మహారాణికాదగిన ఆత్మేశ్వరి ఇంకను అతనికి ప్రత్యక్షముకాలేదు.

ఒక ప్రక్క క్షత్రియుడు, ఒక ప్రక్క బ్రాహ్మణుడు. ఆతని రాజ భోగప్రాభవము పలువురు సుందరాంగనల గోరును. ఆతని బ్రాహ్మణత్వము సహధర్మచారిణి యగు వధువునే వాంఛించును.

ఎందరో మహారాజులు తమబాలల భావ్యాంధ్రసామ్రజ్ఞినిచేయగాఢ వాంఛాయుతులై యున్నారని తెలియును. పిల్ల నిత్తుమన్న వలదనుట ప్రభు ధర్మము కాదు. ఒకభార్య యున్న కాదనవచ్చును. తన ఊహాపథాంచలాల దాటి ఒక మహాశ్వేతపన్నగాసన యగు బాలిక రెండు మూడునెలలనుండి తోచును. తద్వ్యంజనారూప మగు భావములు ఆషాడమేఘములవలె తన స్వప్నాకాశము నావరించుచున్నవి. తనయౌవనవాంఛలకు శాంతి నీయగల రనుకొన్న మూవురుత్తమకులజ లగు బాలల అద్భుతసౌందర్యమూర్తుల కోరికొని తెచ్చుకున్నాడు. వారు రాణులుకాలేదు తనకామప్రవృత్తి వారిలో ప్రతిఫలము కోరలేదు. వారు కన్యాత్వచెర వీడలేదు. వారు మువ్వు రాతని హృదయవేదన గ్రహించినారు. ఆతనికి తమ అద్భుతాంధ్రగానము అమృతము కురిపించినారు. నృత్యవిద్యానందము కాన్కలిచ్చినారు? అనేక గాధా కావ్యరస గంధములు కలపము లలదినారు. వారు దినమున కొక అలంకారము కైసేసికొన్నారు. ఆతని సరసోక్తులచే, మేలపుమాటలచే చెనకినారు. శృంగారహావభావవిలాసముల నిలువుపూజ లర్పించినారు.

శ్రీకృష్ణశాతవాహనుని మనోవేదన కుపశాంతి కలుగదాయెను. ఆ కన్యలతోడి శృంగారవిహారము లాతనిలో మేల్కొన్న యౌవనోరాగము నాడించి జోకోట్టజాల వయ్యెను. వారికన్యాత్వపుచెరలు మాత్రము విడలేదు.

16. స్వప్నభంగము

హిమబిందు కలలుకనుచు కూరుచుండినది. ఆహా! తన మనోనాయకుని రసభావములు రూపెత్తునది శిల్పములలో, సౌందర్యములు మూర్తించునది చెక్కడములలో, సర్వలోకములోని ఆనందము ప్రత్యక్షమగునది బొమ్మలలో. మహావేగముతో, అత్యంత కల్పనాచమత్కృతిలో, అద్భుత విన్యాసమహిమతో విగ్రహములు, ప్రతిరూపములు, దివ్యస్థూపములు, పవిత్ర త్రిరత్నములు, లతలు, పక్షులు, మృగములు తనమనోహరుడెంత సునాయాసమున శిల్పమును అల్లివేయగలడు! ఆతడెంత సౌందర్యమూర్తి! ఆతని కన్నులలో ఎన్ని మహాభావములు నాట్యము చేయుచున్నవో! ఆతని చూపులలో తాను శిల్పింపబోవు ఎన్ని మహత్తర కళారూపములు దర్శనమిచ్చుచున్నవో! ఆతని కనురెప్పలలో ఎన్ని చిత్రలేఖనములు రూపముదాల్చినవో! అతనిదీర్ఘ సమనాసికలో ఎన్ని రసాస్వాదనలు పుంజీభవించియున్నవో! ఏమి యాతని పెదవులు! ఆ ఆలోచనతో ఆమె వివశయైనది.

స్త్రీ లెక్కువ అందగత్తెలని యందురే! నిజముగ పురుషులలోనే అందము లన్నియు నెలకొన్నవి. తన పెదవులు సృష్టిలోని సర్వసౌందర్యములు సేకరించుకొని యుండవచ్చును కాని తన ఆత్మేశ్వరుని పెదవులలో సృష్ట్యతీత మగు సౌందర్యము అమృతత్వసిద్ధి నందినది.

ఆమె ప్రతి నిమేషమును ఆతనిస్పర్శను స్మరించుకొని కనుమోడ్చును. ఆతని హస్తస్పర్శచే ధన్యమైన యొడలు గాంచి మురిసికొని ముద్దాడును. తనకును ఆతనికిని జరిగిన విచిత్ర ప్రథమసమావేశము భగవదుద్దిష్టము. తన తండ్రి కోటీశ్వరు డగుగాక! శ్రీముఖశాతవాహన చక్రవర్తి దక్షిణబాహువగుగాక! విశ్వామిత్రునివలె, అపరబ్రహ్మవలె సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన సుందరాతిసుందరమూర్తి తనమనోనాయకుడైనాడు. ఇంతకంటే ధన్యత ఏమి గలదు? ఈ దైవము నెత్తికోలు నెవరు మాన్పగలరు?

హిమబిందు బాలికయైనను విద్యావతి. సమ్యగ్విచారశీల యయ్యు నపుడపుడు బాల్యచాపలాధీన యగును.

అల్లారుముద్దుగ పెరిగిన బిడ్డ. సంకల్పములు జనియించుటయే తడవుగ సిద్ధి నందించుకొనజాలిన తనయ. తమ కనుసన్నల రాజ్యచక్రములు త్రిప్పగల కోటీశ్వరులకు మనుమరాలు. గగనకుసుమములుగూడ నామెకు దుర్లభములుగావు. అట్టి యప్పు డామెకోర్కెవెల్లువలు వెన్నెలకరుళ్ళు గాకుండుటెట్లు? లోకములోని సర్వధనములు వాకలు కట్టించుకొని ఆంధ్ర దేశమునకు తరలించుకొని వచ్చు స్వర్ణదీ భగీరథుడైన చారుగుపుడు తనయను సామ్రాజ్ఞినిచేయ సంకల్పించినాడు. రాజ్యవైభవము చేకూరని ఐశ్వర్యము వ్యర్థము. ఆంధ్ర సామ్రాజ్యమును, ఆంధ్రకోటీశ్వరేశ్వరుల వర్తకమును యమునాగంగా సంగమమై నడుచుచున్నది.

సామ్రాజ్యాభివృద్ధికి ధనము దోహదమా? ధనాభివృద్ధికి సామ్రాజ్యాభివృద్ధి దోహదమా? ఎవరు చెప్పగలరు! వెనుక మౌర్యాది రాజ్యములలో కోటీశ్వరు లుండెడి వారేమో! నే డొక్క ఆంధ్రవణిక్కు ఆ ఔత్త రాహవణిజుల సంపదనంతయు దానే దక్కించుకొన గలిగినాడు. ఆంధ్రచక్రవర్తి జంబూద్వీపచక్రవర్తి యగుగాక! ఆంధ్ర వణిక్సార్వభౌముని తనయ సర్వజంబూద్వీపసామ్రాజ్ఞి అగుగాక! ఇరువురు చక్రవర్తులు వియ్యమందుదురుగాక! శ్రీకృష్ణశాతవాహనుడు చారుగుప్తుని అల్లుడు - చారుగుప్తుని మనోరథ మిట్లున్నది. దైవసంకల్ప మెటుల నున్నదో!

హిమబిందు ఆలోచనామృతపూరముల ఏ లోకములకో తేలిపోవుచు ఏ ఆనందములకో వశీభూత యగుచు ఏ మాధుర్యములనో కరిగిపోవుచు, పర్యంకముపై పరుండియున్నప్పుడు చారుగుప్తుడు రక్తచందన పాదరక్షలచప్పుడుతో కొమరితయున్న కడకు వచ్చినాడు.

ఒక్కనిమేష మాతడు పాల్కడలిలో శయనించిన బంగారులక్ష్మీవలె ఆ హంసతూలికా తల్పమున నొరగియున్న త్రిభంగ్యాకృతివిలాసముల ప్రోవు, వయ్యారముల కుప్ప, సౌందర్యముల నిధియైన తనయను తనివార చూచుకున్నాడు. “అమ్మా, ఏ మట్లు పండుకొంటివి? దేహమున సుఖముగ నున్నదిగదా!”

హిమబిందు ఉలికిపడినది. తండ్రిని చూచి మనోరధ ప్రవాహమును, మంచమును విడిచి లేచి ఆయన పాదములకు నమస్కరించి తలవంచి నిలుచున్నది. ఏదియో అద్భుతకాంతి, ఏదియో అమృతానందము ఆ బాలఫాలమున, నాసికను, లోచనముల, పెదవుల తాండవమాడుట చూచి, ఏదియో అపరిమితానందము సమకూర్చు సన్నివేశము జరిగియుండవలె నీ బాలికకు - అనుకొని యామెను హృదయమునకు జేరదీసికొని మనస్సున నాశీర్వదించి,

“అమ్మా, నీ వా మంచముపై కూర్చుండుము. నే నీ యాసనమున కూర్చుందును.”

“నాయనగారూ, ఎప్పుడు మీ ప్రయాణము?”

“ఆ విషయాలన్నియు మాటలాడుటకు వచ్చినాను కన్నతల్లీ!”

“నాయనగారూ! సమదర్శిబావ ఉజ్జయినిలో క్షేమముగ నున్నాడా?”

చారుగుప్తుడు తనయ మాటలకు లోన కొంతభయమంది, యామెముఖము నిపుణముగ పరిశీలించెను. తన బాలిక సమదర్శిని ప్రేమించు చున్నదా? సమదర్శి మేనల్లు డగుగాక! అయిన నేమి? తనతనయ ఆంధ్ర సింహాసనయోగ్య.

“క్షేమముగ నున్నాడు. అక్కడ ఇంతవరకు సేనాపతులెవ్వరికి ఆపత్తులు జరుగలేదు. తల్లీ! ఆంధ్రసామ్రాజ్యము తూర్పుతీరమునుండి పశ్చిమసముద్ర తీరానికి రెండువందల యోజనముల వెడల్పున్నది. ఉత్తర దక్షిణములకు ఇప్పు డంత యున్నది. ఇంక రెండు వందల యోజనములు వృద్ధినొందితీరును. దానికి నీ బాబయ్యయే కారణమగుచున్నాడు.

హిమబిందు ఆశ్చర్యపూరితహృదయమున తండ్రిమాటలు వినుచుండెను.

“తల్లీ! ఈ విశాలసామ్రాజ్యమునకు నీవు సామ్రాజ్ఞివి కాబోవుచున్నావు. చారుగుప్తుని తనయ జంబూద్వీపసామ్రాజ్యసింహాసన మధిష్టించి మహారాణులు వింజామరలు వీవ, మహామాండలిక రాణులు పాదములు కడుగ, మాండలిక పత్నులు పదము లద్ద మహాసామ్రాజ్యాభిషేకము నందబోవుచున్నది.

హిమబిందున కేదియో భయము మబ్బువలె ఆక్రమించినది. తండ్రి మాట అర్థము చేసికొనలేకపోయినది. మాట లుడిగి నిశ్చేష్టయై తండ్రి మాటలు వినుచున్నది.

“యువరాజు శ్రీకృష్ణశాతవాహనుడు ఎంత అందమైన బాలుడు! ఎంత విక్రమోపేతుడు! తండ్రినిమించిన వీరుడు, సకలభారతావనిలో అతని మించిన సుందరు డింకొకడు లేడు. అతని కతడే సాటి. అట్టి కొడుకును కోరికోరి నేనును మీ అమ్మయు తపము లాచరించినాము. నోములు నోచినాము. దివ్య చైత్యముల కెన్నిటికో మొక్కు కొన్నాము. నా దురదృష్టముచే మీ అమ్మయే....”

హిమబిందుకన్నుల నీరు తిరిగినది. కొమరిత కంటినీరు చూచి, చారుగుప్తుని కన్నులలో నీరు తిరిగినది. హిమబిందు వెంటనే తండ్రికడకు గబగబవచ్చి, యాతని హృదయమున వాలి వెక్కివెక్కి ఏడ్చెను.

చారుగుప్తుడు తాను వచ్చినపని భంగమగునని సమ్మాళించుకొని, తనయ నుపశమిల్లజేసి చెంతనిడుకొని, నెమ్మోము పుడుకుచు నిట్లువచించెను.

“తల్లీ! మీ అమ్మతో నిన్ను నా ప్రాణములకన్న ఎక్కుడుగ సంరక్షింతునని వాగ్దానము చేసియున్నాను. లోకములో నుత్తమునకు ని న్నిత్తునని మ్రొక్కుకొన్నాను. నే డా కాలము వచ్చినది. విష్ణునకు సముద్రుడు లక్ష్మీనర్పించినట్లు, నిన్ను శ్రీకృష్ణశాతావాహన మహారాజుకు అర్పింప సంకల్పించుకొన్నాను. సంకల్పమును పెద్దలందరు ఆమోదించినారు.”

17. నాయికా నిర్వేదము

చారుగుప్తుడు తన కొమరిత వెలవెలబోవుట జూచినాడు. ఆమె నిశ్చేష్ట అయినది. విప్పారిన పూలమాలవలె తన చేతులలో నున్నది యున్నట్లే ముడుచుకొని పోవుచున్నది.

చారుగుప్తుడు “బాలనాగీ” అని పెద్ద కేకవేసెను.

ఇంతలో మెఱుమువలె బాలనాగి యచ్చట కురికి హిమబిందును జూచి, “అమ్మో! అమ్మాయిగారూ!” అని హిమబిందు దగ్గరకు పరువిడెను.

చారుగుప్తుడు “వెంటనే పన్నీరు పట్టుకురా, వైద్యుని పిలిపించు” అని కేకవేయుచు, తనయ శరీరము నిమురుచుండెను.

బాలనాగి ఒకనిమేషమున పన్నీరము మంచునీటిలో సుగంధజలముల కలిపినది తెచ్చి చారుగుప్తుని చేతి కిచ్చి, అచ్చటనున్న ఘంటికను గబగబ మ్రోగించెను.

పలువురు సేవకురాండ్రు పరువిడివచ్చినారు. బాలనాగి “వైద్యుడు” అని ఒక్క కేకతో వారివైపు తిరిగి అన్నది.

చారుగుప్తుడు పన్నీరముతో హిమబిందు మోము తడుపుచుండెను. ఆమె కన్నులు విచ్చి సన్నని యెలుగున “ఏమి జరిగినది నాన్నా! ఏమిటీ గడబిడ” యని అడుగుచు లేవబోయినది.

చారుగుప్తుడు “తల్లీ లేవకుము. నీకు కొంచెము పైత్యముచేసి కన్నులు తిరిగినవి. కొంచెము విశ్రమించుము” అనుచు కొమరితను బుజ్జగించుచు తలపై పన్నీటిని నెమ్మదిగ శుభ్రవస్త్రములతో నద్దుచుండెను.

పది విఘడియలలో మహావైద్యుడగు ఆనందులవారు చటుక్కున లోనికి విచ్చేసినారు.

చారుగుప్తుడు లేచి అత్యంత వేదనాభరమైన చూపులు వైద్యునిచూపులతో వియ్యమందించినాడు. ఆనందులవారు నవ్వుచు హిమబిందుకడకు బోయి యామె మంచముపై కూరుచుండి యామెఎడమచేయి తీసికొని వ్రేళ్ళువిరిచి, నెమ్మదిగ నామె నాడిని పరీక్షచేసెను.

అంత నానందులవారు లేచినారు. వెనువెంట శిష్యుడొకడు కొని వచ్చు దంతపు బెట్టెను తనకడకు తీసికొనిరమ్మని సైగచేసి, యా పెట్టితెరచి, యందుండు బంగారపు కండరములలో నొక చిన్న బరణి తీసి, తమలపాకును, తేనెను తెమ్మని బాలనాగితో చెప్పెను.

ఆ బరణియందున్న చూర్ణమును చిరుదంతపు పుడకతో తీసి, యది తమలపాకుపై వైచి, తేనెబొట్టు లిరువది లెక్కపెట్టిపడనిచ్చి, యా చూర్ణమును తేనెతో రంగరించెను. రంగరించిన తన యనామికను తమలపాకుపై తుడిచివైచి, హిమబిందును లేచి కూర్చుండుమని కోరి ఆ ఆకును ఆమె చేతికిచ్చెను. ఆ బాలిక మందును సేవించి, ఆకును బాలనాగిచేతి కొసగ నామె దానిని ముక్కలుగ చింపి, ఆవల పారవైచి వచ్చెను. ఆ మందు పుచ్చుకొనుటతోడనే హిమబిందునకు ఎంతయో బలము వచ్చినట్లయినది.

ఆనందులవారు: అమ్మాయీ! నీ వే విషయమునను బెంగ పెట్టుకొనకుము, నీ కేమి కావలయునన్న అవిఅన్నియు మీ తండ్రిగారు నీకు సమకూర్చలేరా?

హిమ: బాబయ్యగారూ! నా కేమియు బెంగలు లేవు. నాయనగారు యుద్ధయాత్ర కేగుదురన్న బెంగ ఒకటిమాత్రము కలచి తల తిరిగినది. ఆ వెనుక ఏమి జరిగినదో నాకు తెలియదు.

చారు: తల్లీ! నే నెన్నిసారులు నెల, రెండు నెలలుగూడ ఇతర దేశములకు యాత్రలుచేసి రాలేదు?

హిమ: నాన్నగారూ! మీరు వెనుకవెళ్ళినది వర్తకమునకు. నేడు వెళ్ళునది యుద్ధమునకు. ఆ ఆలోచనచే తల తిరిగినది.

ఆనందులు: (నవ్వుచు) మీ రిదివరకే ఆ అమ్మాయికి చెప్పియుండవలసినది. చటుక్కున చెప్పుటచే స్త్రీ సహజ మనోవికారము కలిగినది. ఏమియు భయములేదు. తల్లీ! మా తమ్ముడు శ్వేతకేతుడు మీతండ్రిగారివెంట బోవుచున్నాడు. మా అన్నగారు అపరధన్వంతరి మూర్తిమంతుల వారు సార్వభౌమునివెంట నుందురు. నే నిచ్చటనే నీయోగక్షేమము లారయుచుందును.

హిమ: బాబయ్యగారూ! మీ రుండ నాకు భయములేదు. నాయన గారు చక్రవర్తితో వెడలవచ్చును. అదిగో మా అమ్మమ్మ వచ్చుచున్నది. అత్తయు వచ్చుచున్నది.

ముక్తావళీదేవి గబగబ గడబిడచేయుచు నా తల్లి కెట్లున్నది, “నా తల్లి కెట్లున్నది” యనుచు నచ్చటకువచ్చి, హిమబిందును కౌగలించుకొని ఘొల్లున నేడ్చినది.

అమృతలత వెనువెంటనే వచ్చి “అత్తగారూ! మీఏడ్పుతో పిల్ల మరియు భయమందును. తండ్రి యుద్ధయాత్ర పోవుచున్నాడని దుఃఖించి మూర్ఛపోయినది. అవును, మాఅన్నయ్య తా నెందుకు యుద్ధమునకు సిద్ధమగుట? తన కేమి పని?” యన్నది.

చారు: ఉండు అమృతా! నీ కేమి తెలియును? ఆడవారికి రాచరికపుగొడవ లెందుకు?

ఆనందులు: మీ రంద రావలికిబోయి వాదించుకొనుడు. ఇచ్చట బిడ్డ సంగతి మరచిపోయినట్లున్నారు. బిడ్డ కేమియు భయము లేదు. చారుగుప్తులవారు నిర్భయము యుద్ధయాత్రకు బోవవచ్చును. హిమబిందు భారము నాది.

హిమ: నాన్నగారూ! నాకు భయములేదు.

ఆనందులు: మీ రందరు ఆవలికి వెళ్ళుడు. కొంచెము భోజనదోషమున అమ్మాయికి పైత్యాభివృద్ధి అయినది. అందుపై చారుగుప్తులవారి వాక్యముల నామెతల తిరిగినది. నేను మందు లిచ్చుకొనెదను. మీరు మీపని మీద వెళ్ళుడు చారుగుప్తులవారూ!”

“చిత్త” మని చారుగప్తుడు వెడలిపోయెను.

* * * *

సాయంకాలము చక్రవర్తియు, మహారాణీయు, చారుగుప్తుడును కొన్ని సైన్యములతో ఉత్తరదిశగా మహారాజపథమువెంట గోదావరీ తీరమునకై మహావైభవమున ప్రయాణమైపోయిరి. ప్రయాణమునకు ముందు గుర్రములకు, ఏనుగులకు కర్పూర నీరాజనము లీయబడెను. నారికేళములు బలిగా అర్పింపబడెను. బ్రాహ్మణులకు గోవులు, భూములు దానము లీయబడెను. మహాచైత్యమున కోటిదీపారాధన జరిగెను. చైత్యఘంటికలు నాదములు చేయుచుండెను. భిక్షుకులు, బ్రాహ్మణులు ఆశీర్వాదములు సలిపిరి. అంతకు తొమ్మిదిరోజులనుండియు బ్రాహ్మణులు జయయజ్ఞములు సలిపిరి. ఆ పురోడాశము చక్రవర్తికి ప్రసాదమిచ్చినారు ఋత్విజులు. నాగపూజలు, గ్రామదేవతల భజనలు జరిగెను.

భేరీ భాంకారాది మంగళవాద్యములు సెలగ చక్రవర్తి మహాగజము సర్వాలంకార భూషితమై, హిమాలయోత్తుంగశిఖరమువలె సాగిపోయినది.

అందధివసించినవారు చక్రవర్తియు, చారుగుప్తుడును. చారుగుప్తుడును దివ్యకవచధారియై అర్జునునిప్రక్క నున్న శ్రీకృష్ణునివలె వెలిగిపోయెను.

హిమబిందు రాజకుమారికలతోపాటు చక్రవర్తిగజమునకు ఆరతిచ్చినది. ఆమెలో నా ఉదయకాలపు విషాదముకాని, నిర్వేదముకాని ఏమియు లేదు. ఆమె తక్కిన బాలలతో బాటు నవ్వుచు కలకలలాడుచున్నది. చారుగుప్తుడది చూచి యూరటనంది, సంతుష్టుడై దూరమునుండియే యామెను “చిరంజీవ, ఇష్టకామ్యార్థసిద్దిరస్తు” అని అశీర్వదించుకొనెను. ఆమె కామ్యార్థము?

18. అల్లరి పిల్లలు

సార్వభౌముడు సైన్యముతో వెడలిపోవు శుభముహూర్తమునందు ఆ మహోత్సవము గమనించుటకు సువర్ణశ్రీకుమారుడును వచ్చియుండెను. సార్వభౌమునితో ధర్మనందియు, అమృతపాదార్హతులు, మహారాజపురోహితులు, శ్రమణకులు, బ్రాహ్మణులు, మహామంత్రి ఆచీర్ణులవారు వెడలినారు.

నాగబంధునిక, సిద్ధార్థినికయు, శక్తిమతీదేవియు, మహాలియు కొందరు పరిచారికలు రథములపై కోటలోనికి వచ్చి ప్రయాణోత్సవముల దిలకించిరి. నాగబంధునికయు, సిద్ధార్థినికయు మహారాజు గజమునకు సింహపతాకవాహయగు మహదాంధ్ర శాతవాహ దంతావళమునకు, ధర్మనందులవారు అమృతపాదార్హతులు ఎక్కిన భద్రదంతికి హారతులు సమర్పించిరి.

నాగబంధునికకు తన అన్నయు, హిమబిందును రెండుసారులు హిమబిందు క్రీడావనమున కలిసినారని తెలియును. హిమబిందును, సువర్ణశ్రీయు నొకరినొకరు గాఢముగ ప్రేమించుకొనుచున్నారని స్పష్టముగ నామె కవగతమైనది. ఆమె ఈ పవిత్ర సంఘటన మూహించుకొని పొందిన యానందమునకు మేరలేదు. ఆ రెండుసారులు సమావేశానంతరము సువర్ణశ్రీ రాత్రి ఇంటికి వచ్చినతోడనే నాగబంధునిక అన్నగారిని ఆతనిమందిరమున ఏకాంతమున కలసికొనినది. ఈ నాడు,

“అన్నా! ప్రాతర్హిమబిందులు ఉదయారుణకాంతిచే సువర్ణశ్రీకలితములగుట నిజమేనా?” అని నవ్వినది.

“ఓహోహో! శ్లేషకవిత్వం చెప్పుచున్నదండీ మాచెల్లాయి! గెలిచితివి గనుక సార్వభౌములూ, సరసాంగులూ నీకే చేస్తారు సత్కారాలు! బహిరంగ సత్కారాలూ, అంతరాంగార్పణలూ అన్నీ నీకే జరుగు చుండెగదా!”

“అంత యీ సెందుకమ్మా, చెల్లీ! కావలెనంటే నీకుమాత్రం సత్కారలోపం ఉంటుందా? నాన్నగారు తిరిగిరాగానే వారితో చెప్పితే నీకు గూడా అంతరంగార్పణ చేసేవారిని క్షణంలో వెదకి తీసుకువస్తారు. కొంచె మోపికపట్టు. నువ్వుకూడా ఈ దిగ్విజయానికి బయలుదేరి వెళ్ళుతా వనుకున్నాముగాని, ఊళ్ళోముచ్చటలన్నీ విచారిస్తూ కూరుచుంటావనుకోలేదు.”

“చాలులే అన్నయ్యా, నీ మాటలు నీవును! అంతరంగార్పణకోసం నీవలె అందరూ తహతహపడుచున్నా రనుకొందువు. అంతే! నీవంటి వీర పుంగవులందరు ప్రమదావన విహారంచేస్తూ వెన్నెలకుప్పలూ, దాగిలి మూతలూ ఆడుకొనుచుండ మాకు ఇచట ఏమి పని యింకా? మా సావాసకత్తెలనుగూడా కండ్లకు గనిపించకుండ చేసితివికదా! ఇక యుద్ధాలకు వెళ్ళక ఏమిచేయవలెను మేము?”

“నీవు అంతటిదాన వౌదువుగాని, నీసావాసకత్తెలను నేను దాచితినటే చెల్లీ, నీకు గనిపించకుండా?”

“దాచకున్నచో ఎందుకు వచ్చుటలేదు హిమబిందు మనయింటికి? అదివరకు చీటికీమాటికీ ఏదో సాకుమీద వచ్చెడిది యిప్పుడెందులకురాదూ మరి.”

“ఇది మరియు బాగున్నది. హిమబిందు ఎందులకు రాదో నా కేమి తెలియును?”

“ఔను, మా అన్న వట్టి నంగనాచి. ఏమియు నెరుగడు. నోటిలో వేలు పెట్టిన కరవనుగూడ లేడు. ఔనా? పిల్లి పాలుత్రాగుచు తన్నెవరు చూడలే దనుకొనుట! ఆ కళ్ళతళతళలు, ఆ చిరునవ్వులు, ఆ పెళ్ళికొడుకు కులుకులు, ఆ ఉప్పొంగిపోవుటలు ఎవ రెరుగరు? పోనీ. ఇది అంతయు వట్టిదని నాలుకతో ముక్కందుకో అన్నయ్యా, నీవు.”

“అది సరికాని, ఊళ్ళోవార్తలన్నీ తెలుసుకోవలెనని ఒకమ్మాయి కింత ఆతురత ఎందులకు?”

“ఒక అమ్మాయితండ్రి ఊరువిడిచి వెళ్ళిపోవుచున్నాడుగదా ఇంక ఆ ఇల్లు దోచుకొనవచ్చునని ఒక అబ్బాయికి అంత సంతోష మెందుకు? దారిలో ముళ్ళకంచెలు ఉన్నవని ఎరుగడుకాబోలు!”

ఇంతలో సిద్ధార్థినిక అక్కడకు పరుగిడివచ్చి “అమ్మా! ఇద్దరు దొంగలూ ఏదో ఆలోచించుచున్నారా? ఇంత తోడిదొంగలు ఎవరి ఇంటిలో దొంగతనము చేయదలచు చున్నారు!?”

నాగ: ఒసే చెల్లీ! అన్న దొంగతనముచేసి రాగా, ఆ సంగతి తెలిసి అన్నను చివాట్లు పెట్టుచున్నాను. నీవుకూడ తప్పనిచెప్పు. అన్న దొంగతనము సంగతి విని అమ్మయు, నాన్నయు ఏ మందురు? చుట్టములలో తలవంపు


సువర్ణశ్రీ:

 (విరగబడి నవ్వుచు)
పట్టుడి దొంగ నో ప్రజలార మీరు!
కట్టుడీ కొట్టుడీ కట్టిడివాని!


సిద్ధా: నాకు చెప్పవా అన్నా ఆ విచిత్ర మేమిటో?

నాగ: ఉండవే చెల్లీ; నీవు చిన్నబిడ్డవు. నీ కెందుకే ఈ విషయము లన్నియు?

సిద్దా: అన్నా చూడు! నాగ: నీవు అమ్మదగ్గరకు పోయి, అమ్మఒడిలో పండుకో. పెద్ద వారి సంగతులు నీ కెందుకే?


సువర్ణ:

 ఓ హో హో
పెద్ద ఒకతె వచ్చెనండి
సద్దు చేయరాదు పొండి
వడ వడ వడ వణికిపోవు
ముడతలైన దేహముతో
ఓ హో హో పెద్ద ఒకతె వచ్చెలెండి.


సిద్ధా:

 (విరగబడి నవ్వుచు, చప్పట్లుకొట్టుచు)
ఓ హో హో!
ముసలి అవ్వ వచ్చె రండు
ముసలికథలు చెప్పరండు
ఊఁ! ఊఁ! ఊఁ! ఊఁకొట్టుచు
ఓ హో రండు! బాలలెల్ల
ఓహో రండు బాలురెల్ల!


సువర్ణ: నాయనగారు ఈపాటికి ఎంతదూరము పోదురు?

నాగ: విదిశాలిపురము.

సిద్ధా: గోదావరికడకు.

నాగ: (వణుకుచున్నట్లు నటించుచు) విదిశాలికి, గోదావరికి ఎంత దూరము మనుమరాలా?

సిద్ధా: అమ్మమ్మా! ఆరుక్రోశములు.

నాగ: (వణకుచునే) నీకు లెక్కలు సరిగా వచ్చునా?

సువర్ణ: మా అమ్మాయి బాగుగా చదువుకొనుచున్నది అమ్మమ్మా

నాగ: ఒరే పసికుఱ్ఱ! నీవు మాటలాడకు. క్రోశ మనిన ఏమిటి పసిదానా?

సిద్దా: గోరుతము.

నాగ: అర్థము సరియే! లెక్క చెప్పుము.

సిద్ధ: అలాగునా, అమ్మమ్మా! ఇరువదినాలు గంగుళము లొక హస్తము. ఎనిమిదివేల హస్తములొక క్రోశము. రెండుక్రోశము లోక గవ్యూతి. రెండు గవ్యూతు లొక్క యోజనము. నాలుగుహస్తము లొక ధనువు. వేయిధనువు లొక గోరుతము.

సువర్ణ: బయలుదేరిన యామములోనే గోదావరీతీరమునకు బోవుదురు గాబోలు! నాయనగారింటికడ లేరు. ఈ గృహయజమానిని నేను. బాలికలారా! మీ మీ మందిరములు చేరుకొని ప్రార్థనలు చేసికొనుడు. నేను అర్చన చేసికొనవలయును.

నాగ: ఓసి చెల్లీ! అన్న హిమబిందు హృదయము తస్కరించుకొని వచ్చినాడు. తలవరులకు తెలిసిన ఏ మందురు?

సిద్ధా: ఏ మందురు?

సువర్ణ: మీ ఇద్దరికీ నోటితాళములు వేయుదురు.

సిద్ధా: అన్నా! ఏదీ హిమబిందుహృదయము చూపెట్టవూ మాకు? సువర్ణ: ఈ అల్లరిపిల్లల బాధ పడలేకున్నాను, భగవాన్ నన్ను రక్షింపుమయ్యా!

రక్షింపుమయ్య రమణిరాక్షసుల బారి నుండి

వీక్షింపుమయ్య వేదనపడుపురుషుల దయతో!

నాగ: శిక్షింపుమయ్య చేడెలహృదయము ముచ్చిలించు చెనటుల,

శిల్పులైన నేమి వారు....

సువర్ణశ్రీ యచ్చటినుండి పారిపోయెను. నాగబంధునిక పాట నాపెను.

సువర్ణశ్రీ పోయి స్నానమాచరించి మహానస గృహమునకు ప్రక్క భోజనశాలకు బోయి, ఎట్లెట్లో రెండు మెతుకులు నోటవైచుకొని, తన శయనమందిరము చేరెను. నిద్దురపట్టదు. హిమబిందు తన ఆత్మేశ్వరి యగుట నిజమా? అది ఎట్లు సాధ్యమగును? మహారాజుల తనయలైనను తనబోటివారిని క్రీగంట చూడ నంగీకరింతురేమో కాని చారుగుప్తుని కొమరిత?

ఇది యంతయు భ్రాంతి కాదుగదా! ఒకవేళ.... ఒక వేళ.... ఆ బాలిక వారి శకటమును, ఎద్దుబండ్ల పందెమున నోడించినందుకు తన్ను పరాభవము చేయదలంచి ఈ విచిత్రనాటక మాడినదా?.... అయినచో నుత్తమవంశ జాతి యగు బాలిక తనకౌగిలి ఎట్లుచేరును? “నీవు నా ప్రాణమ”వని బాసలాడ గలదా?.... కాదు, కాదు. ఏ మహత్తర విధి సంఘటననో యా బాలిక తన్ను ప్రేమించినమాట వాస్తవము. కల్లకపటము లెఱుగని ఆ ప్రేమతరంగిత వీక్షణములు చూచియు, నా హృదయాధిదేవత నింకను సంశయించుట మహాపరాధము. అతిమాత్ర మగు నాభాగ్యమును నమ్మలేని దుర్బలుడనై పోవుచున్నాను. నిజము దేవీ! ఈ దీనునకు నీవు ప్రసన్నవైతివి. నిజము.

ఈ విషయము తల్లికి చెప్పవలెను. నాగబంధునిక నిజమంతయు తెలిసికొన్నది. ఆమెవలన మాతృశ్రీ యీ విషయము వినుగాక! తండ్రిగారు ఊరలేరు. చారుగుప్తులవారును లేరు. ఆయన ఎట్లు ఒప్పుకొనును? కాని అల్లారుముద్దుగ బెంచిన బాలకోర్కె నాత డేల చెల్లింపడు?

“ప్రేమదేవతా స్వరూపిణీ! సహస్రకోటి చంద్రకళామూర్తీ! ఆత్మేశ్వరీ! నా శిల్పకమలాలయా! ప్రసన్న వగుము. సేవాభాగ్యము ననుగ్రహించి నన్ను ధన్యునిజేయము.” మూడవయామపు కుక్కటములు కృష్ణయావలిపల్లెలో నరచినవి.

19. శుక్రవారము

“అమినతీ దైవ్యానివ గతాని ప్రమినతీ మనుష్యాయుషాని

ఈయుషీనా మసమా శశ్వతీనా మాయతీనాం ప్రథమోషావ్యశ్యాత్.”

“దేవత సంబంధములగు వ్రతములను అనుకూలింపజేయుచు, మనుష్యులకు సంయోగవియోగములను కల్గింపుచు, ఇదివరకు కడచిపోయినట్టి, ముందు రాబోవునట్టి ఉషస్సులకు సాటియై యీ దినమునకు మొదటిదైన ఉషోదేవత మిగుల ప్రకాశించుచున్నది.

ఆంధ్రరాజ్య రమారమణి సర్వదిశలను ఆక్రమించుచున్నట్లు ఉషోదేవి మందహాసారుణకాంతులు ఆశాంచలముల వ్యాపించుచున్నవి. ప్రతి శుక్రవారపు ఉదయమునను హిమబిందు చతుర్విధపురుషార్థ దాయిని అయిన మహాలక్ష్మికి పూజ సేయును. ఏ ధర్మము లెటుపోయినను వణిక్కులు మహాలక్ష్మీపూజ మానరు.

మహాలక్ష్మీ వణిజులయింట నెన్నడో వెలసినది. ఆ దేవి వణిజుల యాడుపడుచు. హిమబిందు శుక్రవారము ఉదయమున లేచును. చంపక, మల్లిక, దమనక, వకుళ, కేతకీ ప్రముఖ తైలములతో, పుప్పొళ్ళనలుగులతో పరీమళ జలంబుల నభ్యంగన మాచరించి, సుదీర్ఘకుంతలముల చిక్కుతీయించుకొని, వదులు వాలుజడ వేయించుకొని, పూజావస్త్రములు ధరించి, బంగారు పూలసజ్జతో తోటలోనికి బోవును.

మహాలక్ష్మీపూజకు ఆమెయే పూవులు, పత్రి కోయవలెను. ఈ శుక్రవారపు టుదయమున ఆమె బాలనాగిని వెంటగొని పుష్పోద్యానమునకు బయలు దేరినది. శుక్రవారము ఉదయము ఆ ఉద్యానవనమునకు రమ్మని బాలనాగి సువర్ణశ్రీకి సందేశ మంపినది. తానేమి చేయవలెను? “ఓ మహాశిల్పీ! దివ్య సుందరమూర్తీ! నీకును నాకును ఇంతటితో చుట్టరికము చెల్లిపోయినది” అని చెప్పవలయునా? ఈ బాలకుని, ఈ మనోహరుని, ఈ దేవతామూర్తిని ప్రేమింపక తాను బ్రతకలేని మాట నిశ్చయము. తన హృదయమప్పుడే స్థాణుత్వము వహింప నారంభించినది. ఈ రెండు మూడు దినములలోనే తాను చిక్కిపోయినది. భోజనము సహ్యమగుటలేదు. దేహమునకు, మనస్సునకు, ఆత్మకు ఈశ్వరుడైనవాని వదలి పరపురుషుని ఏ స్త్రీ స్పృశింపగలదు? నాయకునిగా భావింపగలదు? అతడు మహారాజగుగాక, చక్రవర్తియగు గాక, భగవంతుడే యగుగాక!

తండ్రి యాజ్ఞను తాను జవదాటలేదు. ప్రత్యక్ష భగవంతుడు తండ్రి గాదా! తన జీవితమున కాధారభూతుడు జనకుడు. అతని ప్రతిరూపము తాను. ఆయన ఆజ్ఞ తనకు అనుల్లంఘనీయము! అయిన నేమి? ఎవరి మనస్సువారిది. ఎవరి ఆత్మ వారిది. తనతండ్రి యాజ్ఞచే తాను మహారాజ శ్రీకృష్ణ శాతవాహనుని ప్రేమింపగలదా? అయినను తండ్రికీ వెఱ్ఱి యేమి?

ఎట్లు సువర్ణశ్రీని విడిచి తా నుండగలదు? అతనికన్నులలో తన చూపులు విరియింపక, ఆతని దేహకాంతులలో తనజీవకాంతులు మలచివేయక, ఆతని మాటలకు తన హృదయమును శ్రుతిచేయక, ఆతని ఆత్మలో తనాత్మ లయింపక మందభాగ్యయై ఎట్లు మనగలదు? జనకుని యాసలన్నియు తనపై నున్నవి. ఈ కుబేరసంపదయు, ఈ మహదైశ్వర్యము చాలదా తనకు తనభర్తకు? మహారాజమహిషినై ఇంకను బ్రామి కొనునది యేమి? సువర్ణశ్రీ విముఖమై, వాడబాఱి, ఎండిపోయిన తనహృదయమునకు మహారాజప్రాభవ మేమి రుచించును? అయ్యో! తండ్రికీ విషయమంతయు చెప్పుటెట్లు? తన ఏకపుత్రిక ఆంధ్ర సామ్రాజ్యసింహాసన మధిష్ఠించునని పుట్టెడాసతోనున్న ఆ వృద్ధుని హృదయము తననిశ్చయము విన్నచో భగ్నముకాక నిలుచునా? మదేకగతియై, నన్ను బూవులలో నుంచి పెంచుచున్న ముదుసలి తండ్రి మాట కెదురాడి, ఆయనకు బ్రాణాం తకమైన ఘాతుకకృత్యము నే నెట్లు చేయగలను? తండ్రి జీవితమునకిక మిగిలినది తన వివాహ సంతోష మొక్కటియే కదా! నా సౌఖ్యమునకై తండ్రిహృదయము భగ్నము చేయజాలను. బుద్ధదేవా! నీవే శరణు. నన్నును, నా జనకుని ఎట్లు రక్షింతువో!

అక్కటా! తన సౌఖ్యము, తనతండ్రి సంతోషమేగాని తనహృదయాధినాధు డగు సువర్ణసుందరుని మాటయే మఱచినది. తన్ను విడిచి తన స్వామి యొక ముహూర్తమైన జీవింపగలడా? దుర్విధీ! తన్ను గోటీశ్వరుని తనయ నేల చేసితివి? కోరిన వరుని జెట్టపట్టలేని నిర్భాగ్యురాలికీ యైశ్వర్యమంతయు నేటికి? తన్ను పరమదరిద్రురాలినైన జేయుము; తన స్వామినైన జేర్పుము. ఈ యాంధ్రసామ్రాజ్య వైభవము, ఈ జైత్రయాత్రలు తనకొఱకే కల్పితములైనట్టు లున్నవి. దైవముగూడ తండ్రి సంకల్పమునకే తోడై ఆంధ్రసామ్రాజ్యమున కీ విజయపరంపరలు సమకూర్చవలెనా? ఈ యాంధ్రసామ్రాజ్యము గాని, చారుగుప్త ఐశ్వర్యముగాని ఏ మహేంద్రజాలముచేనైన గొంతతడ వస్తంగతమగునేని తనకీ సంకటము తప్పిపోవును.

“బుద్ధదేవా! నీవేశరణు. అబలను, అల్పబుద్ధిని నాకు మార్గము జూపుము, నా స్వామిని రక్షింపుము తండ్రిసంతోషమా, మా యిరువురి సౌఖ్యమా?”

ఈ దీర్ఘ విచారమువలన నేమి ప్రయోజనము? ఏది యెట్లు కానున్నదో అట్లగును.

తుదిసారి ఆ పవిత్రమూర్తిని, ఆ యకలంక సుందరుని, చిరుమబ్బుముంగురులు మూగు నుదుటివానిని, సర్వదిశలే మూర్తీ భవించి సర్వకాంతులే పుంజీభవించి వెలుగు కన్నులవానిని, శిల్పదీక్షితుడగు ఆ మనోహరు నొక్కసారి దర్శించి ఆతనిపాదములు కన్నులకద్దుకొని, కడసారి కడసారి చూపు చూచి, అతనికడ సెలవుపుచ్చుకొందును. తరువాత భారము తండ్రిది, భగవంతునిది.

ఆమె మెల్లమెల్లగా తోటలోనికి అడుగులిడినది. పూవులు అంద ముల నొలుకబోసుకొనుచున్నవి. వసంత, గ్రీష మధ్యస్థమగు ఆ దినములు మృదు మధురములై మత్తిలజేయుచున్నవి. కలలోవలె ఆ తోటలో చరించుచున్నదాబాల. బాలనాగితో మాటలాడదు. ఏదియో పూవు గోయును. అది బంగారు సజ్జలో వైచును.

ఇంతలో సుడిగాలివలె, గ్రహణమువీడిన సూర్యుని కాంతివలె, వేసవి సాయంకాలమున చుటుక్కున తిరిగిన సముద్రజంఝానిలమువలె, నిధుల దెరచిన రత్నముల కాంతివలె నెచ్చటి నుండివచ్చెనో సువర్ణశ్రీ కుమారుడు హిమబిందును బిగియార కౌగిలించుకొని తనహృదయమున కదిమివేసికొనెను.

అప్రయత్నముగా హిమబిందుచేతు లాతని చుట్టివేసినవి. దివ్యసురభిళగాఢ పరిష్వంగములోవారిరువురును సర్వమును మరచిపోయిరి. బాలనాగి చల్లగనొక పూలపొదరింటిమాటున నిలుచుండిపోయినది. తండ్రిమాటలన్నియు మాయమైపోయినవి. ఆ పవిత్రక్షణ మొక విశ్వమే అయినది. ఇంతలో ఆ మధురాతిమధుర వైవశ్యమునుండి ఆమెకు మెలకువ వచ్చినది. ఆమె చటుక్కున ఆతనికౌగిలి సడలించుకొని దూరముగబోయి కన్నులవెంట జలజల బాష్పబిందువులు ఒలికిపోవ నవనత వదనయై నిలిచినది. పూలసజ్జలోని పూలన్నియు నేలపై నొలికిపోయినవి.

సువర్ణశ్రీ అత్యంతాశ్చర్యము నొంది యామె గాఢవిషాదమును పరికింపుచు “ఏమిది హిమా!” అని దగ్గరకు చేరి యామెభుజముపై చేయివైచెను. ఆ స్పర్శతో ఆమెకు మరల మెలకువ వచ్చెను. ఆతని చేతులు నెమ్మదిగ భుజములనుండి తీసివేసి వెనుకకు జరిగి “ఈ జన్మమునకు ఇది తుదిసందర్శనము. ఏ పాపపు విధి బలవత్తరాదేశముననో యీ విషాదసంఘటన మన కిరువురకు సంభవించినది” అని యెలుంగు రాలుపడ పలికి శోకావేగమున మారు మోమైనది.

“ఏమి, హిమా! నీవు నాతో మేలమాడుచున్నావా? నన్ను పరీక్ష చేయుచుంటివా? సర్వభూతములు, సర్వదేవతలు సాక్షిగ చెప్పుచున్నాను. జన్మజన్మలకు నీవే నా ఆత్మేశ్వరివి. జన్మపరంపరాంగతమైన మన యీ బంధము సనాతనము, నిత్యము. మనకింక వియోగమెట్లు? అత్మాంబుజ తరణివి, సౌందర్యాధిదేవతవు, శిల్పరాజ్య రమవు, నా దేహ మనఃప్రాణములకు ఏడుగడవు నాకు నీవు ఒక్కతెవు -”

ఇంతలో బాలనాగి వారిని దరిజేరి “అయ్యవారూ, అమ్మాయి గారితో చారుగుప్తులవారు నిన్ను శ్రీకృష్ణశాతవాహనమహారాజునకు మహారాణిగా నొనర్ప దలచినా”నని జైత్రయాత్రకు వెడలిపోవుముందు చెప్పి ప్రయాణమైపోయినారు. మీరు చిన్నలయ్యు గుణముల పెద్దవారు. ఈ యమ్మ తండ్రిచాటు బిడ్డ. మీరు తొందరపడక ధైర్యముగా నుండుడు. రేపే మగునో మనకు తెలియదు. ఈ కష్టము లిట్లే యుండవు. మీరిరువురు సమ్మాళించుకొనవలెగాని సాహసము తలపెట్టకుడు” అనుచుండ హిమబిందు తటాలున దానిచేతిలోని పూలసజ్జగైకొని “బాలనాగీ! ఇంచుక నిలువవే. నా మనోనాథుని కడసారి పూజింతును. ఈ జన్మమునకు నాకిదియే చరితార్థత” అనుచు నా పూవులతో సువర్ణశ్రీపాదములు పూజించెను. అందు రెండుపూలు కనుల కద్దుకొని కీల్గంటున దురిమికొనెను.

సువర్ణశ్రీఅట్లే మ్రాన్పడి నిలిచియుండెను. హిమబిందు చూపులతో ననుజ్ఞ వేడి, బాలనాగీసహితయై గృహాభిముఖియై అల్లనల్లన నేగెను.

ఆతని కొడలు తెలియునప్పటికి ప్రొద్దుపడమర తిరిగినది. శూన్య విలోకనముల నా వనమెల్ల నెవరికొరకో వెదకుచు నాతడు అచ్చోటు కదలి యేగెను.

20. ఆనందులువారు

హిమబిందు ఎట్టు చేరినదో తన మందిరము. బాలనాగి ఆమెను ఎత్తుకొని నడచినది. చెలులంద రా విషయము తెలిసి పరుగిడివచ్చినారు. ఆమెను పూవుల ప్రోవునుబలే ఎత్తుకొని శయనమందిరము జేర్చి తల్పమున పరుండబెట్టిరి. వికారము లేమియు లేకపోయినను ఆ బాలిక చైతన్యరహితయై పడియున్నది.

వార్త అందినవెంటనే ఆనందులవారు తేరెక్కి పదినిమేషములలో వాలినారు. ఈలోన బాలనాగియు, ముక్తావళీదేవియు పన్నీరముతో హిమబిందు నుదుటిని తడుపుచు ఉపచారముల జేయుచునే యుండిరి.

ఇటుల జరుగునని ఆనందులవారికి దెలియును. ఆ బాలిక జీవితములో ప్రణయాధ్యాయము ప్రారంభించినదని ఆమెనాడిని పరీక్షించిన మొదటి నిమేషముననే ఆయన గ్రహించినాడు. ఆమెను మహారాజ్ఞిని జేయ నిశ్చయించితినని చారుగుప్తుడాయనకు జెప్పెను. శ్రీకృష్ణశాతవాహనుడు ఈ వణిక్సార్వభౌముని జామాత యగును. ఆ బాలకుడు సుందరమూర్తి, ధీరోదాత్తుడు. అట్టియువకుని ఈ బాల ఏల ప్రేమించలేదు! ఆడువారిచిత్త వృత్తులన్నియు గూఢతిగూఢములు, చిత్రాతిచిత్రములు.

ఆయన వచ్చియు రాగానే మంజూషనుండి స్ఫాటిక కరండుకతీసి, చిటికెడు నస్యము నామెనాసికారంధ్రములకడ నుంచెను. ఆ గాలి లోనికి బోయి వెంటనే పెద్దపెట్టున తుమ్ముచు హిమబిందు లేచి కూర్చుండినది.

“ఏ మిది బాబయ్యగారూ?”

“ఏమియు లేదు తల్లీ! బాలనాగీ! అత్తగారు! మీరంద రావలికి పొండు.”

అందరును వెడలిపోయినారు. ఆనందులవారు, తమ మంజూష సర్దికొనుచు, అలవోకగా “తల్లీ! ఆ బాలకుడు ఏ మనినాడు? ఆతడు ఎక్కడికైన పోవలసివచ్చినదా?” యని ప్రశ్నించెను.

హిమబిందు నీరసపు చిరునవ్వు మోమున ప్రసరింప “బాబయ్యగారు! మీదంతయు ఒక చిత్రము. ఏదియో తలతిరిగినది, పడిపోయినాను. నాయనగారు వెళ్ళినారన్న దిగు లింకను నన్ను వదలలేదు. రెండు మూడురోజులలో భయము తీరిపోవును” అని బదులు పలికినది.

“ఓసి వెఱ్ఱితల్లీ! ఎవరిదగ్గరనైనను దాగునుగాని నీ రహస్యములు నాకడ దాగవు. నీనాడి ప్రణయనాడి. అదియుగాక, నీ చిత్తవృత్తి తెలుసుకొనుట వైద్యునకు ముఖ్యావసరము. బాలనాగి నీకు ఆంతరంగిక సేవకురాలు. ఆమెనీగోడు వినును. నీబాధకు శ్రుతిగ ఆమెయు బాధపడును. అంతియే కాని ఆమె నీకు సహాయ మేమి చేయగలదు? నేను ఒక్కవైద్యుడనేనా నీ విషయమంతయు నీతండ్రికి తెలియదేమోకాని, నేను నీ వింతయున్నప్పటి నుండియు సంపూర్ణముగా నెరుగుదును. హిమ! నీవు ప్రేమించు బాలకు డెవ్వరు? ఆతడు నిన్ను తిరిగి ప్రేమించుచున్నాడని నీలోని ప్రతియణువు స్పందించు చున్నదా? నీవు శ్రీకృష్ణశాతవాహనుని ప్రేమించుటలే దని నేను స్పష్టముగ చెప్పగలను. నీవు వేరొకబాలకుని గాఢముగ ప్రేమించుచున్నావు. వట్టిప్రేమయే కాదు తల్లి, ఆబాలుని నీవు ఆత్మనాథునిగ, ప్రత్యక్షదైవముగ పూజచేయుచున్నావు. కాబట్టి నా కాబాలు డెవరో చెప్పుము. నాకితరులు చెప్పుటకంటె నీవే చెప్పరాదా?”

హిమబిందు ఎంతయో సిగ్గుపడినది. వెలవెలబోవు నామెమోము మధురకాంతులచే వెలిగిపోయినది. దరహాసము లామె యధరోష్ఠాంచలముల కాశీరత్న కుసుమములవలె నృత్యములాడినవి.

“బాబయ్యగారూ! ధర్మ....నం....దు....ల....”

“ధర్మనందులవారి అబ్బాయి సువర్ణుడా? ఈ జంబూద్వీపమునందటి అందకాడు లేడని నామతము. మహాశిల్పి. ధర్మనందిని మరపించును. తల్లీ! ప్రస్తుతము మనమున నెట్టి యాలోచన లుంచుకొనకుము. భగవంతునిపై భారము వైచి నిశ్చింతముగా నుండుము. నీకు వచ్చిన భయములేదు. నేను నీపక్షమున ఉన్నాను. భగవత్సంకల్ప మెటు లున్న నటు లగును” అని చెప్పి, ఆనందులవారు ఏదో రసాయనమును మాత్రలుకట్టి యామెకు అపస్మారహారకముగా, చిత్తశాంతికి, నరముల పుష్టికి ఇచ్చెను.

హిమబిందునకు కావలసినది మందులు కాదు. ఆమెకోరిక నెరవేరుటయ! అదియే అమృత మామెకు. చారుగుప్తునికోరిక అవితథమైనది. అతడు కొన్నిసంవత్సరము లాలోచించి ఈ నిర్ణయమునకు వచ్చియుండును. అందుకై ప్రయత్నము లెన్నియో చేసియుండును. అతనిలో యుగంధర శక్తియు, చాణక్య ప్రతిజ్ఞయు రెండును ఉన్నవి. యౌగంధరాయణుడు అతనికడ పాఠము నేర్వవలయు.

ఆనందులును, చారుగుప్తుడును, ధర్మనందియు, వినీతమతియు చిన్ననాట నుండియు ఎంతో స్నేహమున మెలంగెడివారు. చారుగుప్తుడును, ధర్మనందియు వియ్యమందుట లక్ష్మీసరస్వతు లేకమగుటయే! కూతును రాజ్యలక్ష్మినిచేయ ప్రతిజ్ఞ బూనుకొన్న చారుగుప్తుని మనస్సేరు త్రిప్పగలరు? అది యటులుండ ఈ బాలిక మహారాణి కానెంచక, ఇంత బేలయై యీ పేదశిల్పిని వరించినదేమి? వైచిత్ర్యమా! నీవ స్త్రీజాతివి. ఈ పరిణామ మెట్లు సంభవించినది? ఇది దైవఘటన! చారుగుప్తుడేమి, శ్రీముఖశాతవాహను డేమి! ఎవరు ఆ దైవఘటనకు ఎదురేగ గలరు! ఈ బాలికను ప్రజ్ఞాదేవి లీలాపద్మమువలె కాపాడవలయును. విధివిధాన మెట్లున్ననట్లగును.

అని ఆలోచించుచుండగనే హిమబిందు “బాబయ్యగారూ! నేను మీ ఇంటికివచ్చి పదిదినముల పాటుందును. మీ అమ్మాయి నాగనిక మొన్న మా ఇంటికి పేరంటమునకు వచ్చినప్పుడు తనతో నాలుగునాళ్ళుండు మని మరియు మరియు వేపికొని తినినది. అది కాపురమునకు వెళ్ళినతరువాత ఇప్పుడేకదా పుట్టింటికి వచ్చుట, త్వరలో చక్కని పాప నెత్తికొనును. బాబయ్యగారూ! నాగనికకు అంత దూరపుసంబంధముచేసినారేమండీ?” అని యడిగినది.

“తల్లీ, ఆతడు చోళమాండలికునితో ఇక్కడకు వచ్చినాడు. కంచీపురవాసి. ఉత్తమ బ్రాహ్మణవంశమువాడు. వారి ముత్తాత శ్రీకాకుళము నుండి కాంచీపురము వలస పోయి అచ్చట ఆయుర్వేదాశ్రమము నిర్మాణ మొనర్చినారు. ప్రసిద్ధవైద్యులు. అశ్వినీదేవత లిరువు రొకరై జన్మించిన మహాశక్తి సంపన్నులు. ఈ బాలు డింకను శిశువుగ నున్నప్పుడు ఈతని తండ్రి అడవులకు ఓషధులకై పోవగా ఉన్మదదంతావళ మొకటి ఆయనను మడియించినది. అంతట మా ఇంటి కాతడు శిష్యుడై వచ్చినాడు. అతని నాగనిక ప్రేమించినది, నాగనిక నాతడు ప్రేమించినాడు.”

“నాగనిక అదృష్టవంతురాలు. మా బావగారు వచ్చినారా, బాబయ్యగారూ?”

“రాలేదు. వేసవికాలమువెళ్ళిన వెనుక వచ్చునట. ఇక్కడ ఎండ లెక్కువగాదా తల్లీ! ముక్తావళీదేవి అత్తగారును, నీవును రేపు ఉదయము మంచిది. అప్పుడు రండు. ఈ సాయంకాలము నాగనికయు, మీ పిన్నియు నిక్కడకు వచ్చెదరులే.”

ఆనందులవారు వెడలిపోయినారు. ఆనా డాంధ్రమహాసామ్రాజ్యము నందు ఆయుర్వేదము మహోచ్చదశయందుండెను. త్రాచుపాముకాటు నందిన వానిగూడ వైద్యముచే బ్రతికించుట ఆనాటి వెజ్జులకు మంచినీళ్ళ ప్రాయము.

ఆనందులవారు అఖండకీర్తి గడించిన మహావైద్యులు. ఆయన ఎట్టి వ్రణమునైన శస్త్రచికిత్సచే మాన్పగలరు. ఎముకలు కట్టగలరు. మెదడునకుగూడ శస్త్రచికిత్స చేయగలరు. ఆయన కుదర్చలేని వ్యాధిలేదు. ప్రాణము పోయలేని దొకటే ఆయన లోపము.

21. ప్రణయ భంగము

సువర్ణకుమారుడు విహ్వలచిత్తుడై చుక్కానిలేని నావవలె తిరిగినాడు. ఆతనికి మతిలేదు. ఆతడేమి చేయవలెను? బాలికలవలె కన్నులనీరు సంతత ధారగా ప్రవహింప, ఆ ధారతో మేళవించి ప్రాణాలు ప్రవహించి పోవునందాక కృశించుట ధీరస్వభావము గాదు. వెడనవ్వుతో, వెర్రివెర్రి మాటలతో, చెదరిన జుట్టుతో, అస్థిమితహృదయముతో నున్మత్తుడగుట లఘుమనస్కునికి జెల్లును. ఆశాభంగముచే రౌద్రమూర్తియై విలయావతారు డగుట కాతడు సాత్త్వికుడు.

పవడములై, మసృణములగు ఆతని వేలి గ్రోళ్ళు పల్లవ కోమలములగు పాణితలముల క్రూరముష్టులచే గాయము లొనరించినవి. ముత్యములై సొబగునవ్వుల పూలమొగ్గలై, చంద్రకిరణముల సైదోడులగు ఆతనిదంతములు జపారుణము, కిసలయకోమలము నగు వాతెఱను నెత్రు లురలజేసినవి. బోనున పెట్టిన అరణ్య మృగములలె ఆత డిటునటు తిరుగాడ జొచ్చినాడు.

సైన్యములు బయలుదేరిపోయినవి. భేరీభాంకారములతో నీ సరికి గౌతమిని జేరియుండును. ఆ సేనలవెంటబోయి భగ్నము, శూన్యము నగు హృదయమును వీరరసమగ్న మొనర్పవలయు నను కోర్కె ఆతనికి బొడమినది.

సువర్ణశ్రీ గంభీరుడు. ఆతని హృదయము ప్రేమరసపూర్ణ మయ్యును హావభావములను వ్యక్తము కానీయదు. ఆతడు హితమితభాషి. ఎన్నడైన ప్రియులతో సుకుమారముగా మేలమాడును. చిన్ని చెల్లెండ్రతో మాత్రము అరమరలేక చరించును. ఆతనినెయ్యమునకు, దియ్యమునకు జెల్లెండ్రే ఆలంబనములు. గురులయెడ వినీతుడు. తన వృషభములు, శిల్పపుం బనిముట్లే ఆతనిలోకము. రసభావ వశంవదుడై తద్రుపసిద్ధికై తన్మయత్వమున దిరుగు నా భావుకునకు నేడీ సంకటము గలిగినది.

బొమ్మలపై మనసుపోదు. వృషభశాలకుపోయి తాను పెంచు చిన్న గిత్తలను, కోడెదూడలను గదిసి, వానితలతో దలనాని దుఃఖభారమును వానికి గొంత పంచిపెట్ట జూచెను. చెమ్మగిలిన కనులతో నవి యాతనిదెస గాంచి యూరకొన్నవి. శిల్పమందిరమున కేగి ఉపాస్య మగు దేవీమూర్తి కడ ప్రణమిల్లి, చేతులు మొగిచి “దేవీ! అనుగ్రహించినదాన వింతలో మాఱుమోమిడితి వేమి? ప్రసన్నవై, కరావలంబనమిడవా?” అని వేడి కొన్నాడు. “నీ సేవ మఱచెదనని తలంచితివా?" ఏ పనిచేసినను నీ సేవయే అనుకొన్నాను. సర్వకర్మలను నీ సౌందర్యముతో నింపవలయునను కొంటిని. సమస్తమున నిన్ను, నీయందు సమస్తమును జూతు ననుకొంటిని. నీ వింతలో ఈసుచెంది ఆగ్రహింతు వనుకోలేదు. నా ప్రేమభావమున కందితివని పొంగిపోవుచుండ నింతలో క్రుంగదీసితి వేమి? కానిమ్ము, దుఃఖముమాత్రము నాకెందుకు మార్గముకాదో చూచెదను. విరహాగ్ని పుటపాకమున నీ కింకను వన్నెలు దిద్దుదును. నీ యగాధసౌందర్యతలములు స్పృశించుట కిదియే మార్గమేమో!”

శక్తిమతీదేవి కుమారునిమార్పు చూచినది. ఆతడు పరధ్యానమున నుండుట వాడినమోము, యెర్రవారిన కన్నుకొలకులునై భోజనమునం దభీష్టము లేకుండుట గమనించినది. విద్యావంతురాలును, సాధుశీలయు, నిండు గుండెయునగు నామె ఆతడు హిమబిందును ప్రేమించుచున్న విషయము ఎరుగును. హిమబిందు తన యింటికి వచ్చినప్పుడు తనయం దెంత సౌహార్దము చూపినది! చనవు ప్రియమార సంచరించినది. సువర్ణ, ఆమెయు కలిసికొని స్నేహమున మాట్లాడిరనియు, దృఢనురాగపాశబద్ధులై రనియు నాగబంధునిక చెప్పినది. ఇప్పుడు వీనికి మరల నీ విచారమేమిటి? కృశించిపోవుచున్నాడు బిడ్డ, ఆమె నాగబంధునికను ప్రశ్నించినది.

శక్తి: సువర్ణ మనస్సు పాడుచేసుకొనుచున్నాడేమీ తల్లీ!

నాగ: నాకూ తెలియదు. అడిగినా మాట్లాడడు. ఏదియో పని వంకతో ఎక్కడికో పోవుచుండును. ఒక చిత్రము లిఖింపడు. శిల్పశాలకు పోడు.

శక్తి:మహాలిని పిలు. నాగబంధునిక మహాలిని కొనివచ్చెను.

శక్తి:బాలనాగితో మాట్లాడినవా మహాలీ?

మహా: మాటాడినానమ్మా సువర్ణశ్రీకుమారుడే హిమబిందుకు ప్రాణమట. ఆతడు లేనిదే జీవింపలేనంతస్థితికి వచ్చినదట. వారితోటలో కృష్ణాతీరాన కలిసినారట. తండ్రి ఏదియో ఆదేశము నిచ్చినారట. గుండె వ్రయ్యలగునట్లు విచారమున మునిగి మూర్ఛబోయినదట. అతికష్టముమీద మరల సువర్ణుని తుదిసారి కలిసికొన్నదట. అదిమొదలు భగ్నహృదయముతో పడియున్నదట.

శక్తి: ఏమది! ఈ విచిత్రసంఘటన ఏమైయుండును?

మహాలి: ఏమోనమ్మా! చారుదత్తులవారి ఆనతి వీరి అభీష్టానికి తీరని ప్రతిబంధమైనదని బాలనాగి అంటుంది. హిమబిందు తండ్రికి వ్యతిరేకముగా సంచరింప నిష్టములేక బెంగపెట్టుకొని కృశించుచున్న దనియు చెప్పినది.

నాగ : హిమబిందు తండ్రిమాట జవదాటదు. మరి అన్నయ్యగతి ఏమగునో! నన్నుగూడ మొగ మెత్తిచూడడు. చెల్లాయి చెంతకువెళ్ళితే చేరదీసి పలుకరించడు. అదికూడా బెంగ పెట్టుకొన్నది.

శక్తి : భయపడకు వెర్రితల్లీ! అన్నిటికి బుద్ధదేవుడే కలడు.

22. శ్రీకాకుళ ప్రయాణము

శిల్పులు పిచ్చివారు. ఏదో ఆశయము కల్పించుకొని, ఆ ఆశయసిద్ధికై వేదనపాలగుదురు.

ఏ చోట నున్నావొ?
ఏ వీట నున్నావొ?
నీ వెలుగు ధ్యానించి నిలువెల్ల కరిగితినె.
నా హృదయమున వెలుగు
ఊహదాటినమూర్తి
ఎన్ని జన్మలు గడిచె, ఎన్ని యుగములు నడిచె?
వెర్రికాదే నీవు
వెలసితివి నే డనుట?
ఆశయసాఫల్య మంద దీ చేతులకు.
సాధనయె తనవంతు, సిద్ధి తనయది కాదు,
సిద్ధు లెవ్వారొ?
ఆ సిద్ధి తానెట్టిదో!

అని పాడుకొనుచు ఆశయసిద్ధికై ఎంత తపించినను అది లభ్యము కాదు. లభ్యమైనట్లు భ్రమకలుగు నొకప్పుడు. అది వట్టి మరుమరీచికయే.

ప్రేమభంగము సాధారణమానవులకు ఉత్తమగురువు. అందు రసస్వరూపులు, శారదామూర్తులగు కావ్య, శిల్ప, చిత్ర, గాంధర్వపతులకు మహోత్తము గురువు. హిమబిందుప్రేమ నవయౌవనదశపరిణతిమాత్రము. అది మరల సరికూర్ఫరాకుండ భగ్నత

నొందినది. వారిప్రేమ భగ్నమయినంతనే సువర్ణుని బాల్యమంతయు, విడిచిన వస్త్రమువలె జారిపడి పోయినది. ఆత డిప్పుడు ప్రపంచము నెదుర్కొను మనుష్యుడైనాడు.

హిమబిందు తనది గాదు. మనము ప్రేమించిన ప్రాణి మనది యేల కావలయును? ప్రేమ యింత స్వార్థకలుషితమేమి! తాను ప్రేమించి ప్రేమమయు డగుట చాలదా? ప్రేమకు యింతకుమించిన సిద్ధి యేల కావలయును? నాగబంధునిక, సిద్ధార్థినిక తన కూరిమి చెల్లెండ్రు. చెల్లెండ్రనుండి తా నేమి ప్రతిఫలము గోరును? అన్నా! యని నోరార వారు పిలుచుట చాలదా? రేపు తనచెల్లెండ్రకు బెండ్లియగును. వారు భర్తృగృహముల కేగుదురు. అందులకు దన యభ్యంతర మేమి? తనకు బాధ యెందులకు? తమ యన్నాసెల్లెండ్ర ప్రీతి కందువలన గొలతగలుగునా?

హిమబిందు శ్రీకృష్ణశాతవాహన మహారాజునకు దేవేరి యగును. ఆంధ్ర సామ్రాజ్య సింహపీఠ మధిష్టించును. తనకు సామ్రాజ్ఞి యగును. తా నా రాణికి భృత్యుడు, సేవకుడు, నమ్మినబంటు నగును. ఆ దేవి తన సేవ లందుకొనును, తన్న నుగ్రహించును. ఇంతకంటే తన కేమి కావలయును?

ఆంధ్రసామ్రాజ్ఞిని దాను శిల్పించును. కత్తి చేబూని ఆంధ్రసామ్రాజ్యము విస్తరిల్లజేసి, ఆ దేవిపాదములచెంత దాను కానుకపెట్టును. సువర్ణా! నీప్రేమ కింతకంటే నేమి కావలయును?” నేను రసభావప్రబోధితుడనై, రసపరతంత్రుడనైనపుడు సృష్టి యేల సేయవలయును? నాలో నేను ఆనందించి తృప్తిచెందరాదా? అట్లు కాదు. నా రసభావమూర్తిని నేను చూచుకొని, నాదియని చెప్పికొని మురిసిపోవలెను. ఎందరో శిల్పులు రచించిన శిల్పములుగాంచి నే నానందింతును. కాని నా కంతటితో తృప్తిలేదు. నాయానందమును నాశిల్పమున జూచుకొనవలయును. నా ప్రేమమును నాసంతానమున బ్రత్యక్షము జేసికొనవలెను.

“ప్రేమయే ఆనందము. ఆనందమే ప్రేమ. ప్రేమకు బరిపూర్ణత దాంపత్యమునందే సిద్ధించును! ఆనందమే సృష్టికి కారణ మగునేని ప్రేమ కంటే సృష్టికర్త మరియెవరు? నాశిల్పసృష్టి సృష్టియే కాదు. నాకు సాధనములైన శిలలు, వర్ణములు, టంకములు, శబ్దార్థములు నావి కావు. వానిని నావిగా నెంత మలచుకొన్నను వాని స్వభావము మాఱదు. వానిలో నాయానందచ్ఛాయలుమాత్రమే కనిపించునుగాని నేను గాన్పించను.

ప్రేమానుగృహీతుడ నగుదునేని నేను నిజముగా సృష్టికర్త నగుదును. భావైక్యము ఐక్యము గాదు. మరియొక శరీరముతో, ప్రాణముతో, మనస్సుతో నే నైక్యము సంపాదించవలెను. ఆ యైక్యావేశమున మాయిరువురివ్యక్తులు లీనమై ఆనందమున గరగిపోవలెను. ఆ యానందఫలమే సృష్టి. సువర్ణా! నీ వా భాగ్యమునకు నోచుకొనలేదు. పరమపవిత్రము, అత్యుదారము, సర్వోత్తమ మగు మధురభావము నీకు దూరమైనది.

“మనోవాక్కులచే నాతో నైక్యమందిన దేవిని నేను విడనాడు టెట్లు? వెర్రివాడా! సువర్ణా విడుచుటకు, విడవకుండుటకు నీ వెవడవు? ఆదేవి పరమానుగ్రహ మెట్లున్నదో!

“నిజము, దేవీ! మహారాజ దేవేరి యగుటయే నీ కభిమతమేని, పిత్రాజ్ఞానువర్తనమే నీకు శాంతినిడునేని నీ శాంతిసౌఖ్యములకు నే నడ్డురాను. నిన్ను శిల్పించుకొని, సేవించికొని నీకటాక్ష లేశమున కర్హుడనగుదు నేని నా కదియే స్వర్గము. నాసన్నిధానము, నా సామీప్యము, నాసేవ నీ శాంతికి భంగము గూర్చునేని నా కదియును వలదు. దేవీ! ఆజ్ఞాపింపుము. ఏ మారుమూలనో తలదాచుకొందును. నీయెదుట బడను, నీవీక్షణ చంద్రా తపము జొఱరాని చీకటిగుహలలో వసింతును. నాకళాపీఠమున నున్న నీమూర్తియే నాకు జాలును. నాదేవికి మందిరమగు నా మనోగుహలోనే నేనును వసింతును. నా కా ఏకాంతము చాలును. అచటి నాదేవి నాది!”

ఇట్లు మనోరథప్రవాహముల మునిగితేలుచుండ శక్తిమతి కుమారుని కడకు బోయి “నాయనా! అన్నము తినుట మానినావు. ఏమిటి నీ హృదయమున బెంగ? మీనాయనగారు నిన్ను తక్కినవిద్యార్థులకు సహాయముచేయుమని ఆజ్ఞయిచ్చినారు. శిల్పగృహముల సమీపమునకే వెడలవు. శూన్యహృదయుడవై అటుల పండుకొనియుందువు. ఆనందుల వారికి వార్త నంపెదనన్న వలదందువు. కళ్ళు గుంటలుపడినవి. ఇంకను ముక్కుపచ్చలారని చిన్నవాడవు. ఎందుకు బాబూ నీ కింతబాధ? నామాటవిని నాలుగు దినములు కాకుళము చిన్న మామయ్యగారి ఇంటికి పోయిరాకూడదూ? సముద్రపుగాలి నీకు పడును, మీపిన్ని కంటకశాలకు రమ్మని ఎన్నిసారులో పిలువనంపినది. మీపిన్ని కొడుకు ఒక నెలదినములు అన్న వచ్చి కంటకశాలలో ఉండకూడదా? నాకు కొన్ని శిల్పమర్మములు చెప్పకూడదా? అని కమ్మ వ్రాసినాడుకద. అక్కడకుపొమ్ము. నీవిట్లు బెంగపెట్టుకొని కూర్చుండుటవలన నాకు మతిపోవుచున్నది. వరప్రసాదమువలె నీ వొక్కడవు నా కడుపున పుట్టితివి. నీస్థితిని జూచి నాకు దడవచ్చుచున్నదిరా బాబూ!” అన్నది.

“నాకు ఒంట్లో ఏమీ జబ్బులేదు, బెంగ లేదు. ఎందుకు నీవు దిగులు పడతావు అమ్మా!”

“నాకు అన్నియు తెలియవచ్చినవిరా బాబూ! అన్ని విషయములు భగవానుని ఇచ్చచొప్పున జరుగును. సుఖములు, దుఃఖములుకూడ మనలను పరీక్షించుటకే వచ్చును. ఈ జగమే దుఃఖము. ఈ జన్మ దుఃఖము. ఇచటి సంఘటనలన్నియు దుఃఖములు కావా? నాన్నా! ఈ కామదేవుని పరీక్షలో నెగ్గినవాడే భక్తుడు. నీవు తప్పక శ్రీకాకుళమునకు పొమ్ము.

“సిద్ధార్థినికను తీసికొని పోయెదను.”

“సరే, అది ముందే ప్రయాణమగును. అన్నగారిమీద ఈగ వాల నీయదు. నిన్ను గురించి అక్క సెల్లెండ్రిద్దరు ఒక్కటే వాదన. మంచి ముహూర్తము చూచి బయలుదేరి వెళ్ళండి బాబూ!”

మరునాడు సువర్ణశ్రీ చెల్లెలు సిద్ధార్థినికను తోడ్కొని, శకటము నెక్కి ధాన్యకటకము నుండి రాజమార్గమున ప్రయాణము సాగించెను. ఆ బండికి నాలుగు ఎద్దులు కట్టినారు. అది చిన్నగదియంత యుండెను. ఆ బండిగూటికి వాతాయనము లున్నవి. ఆ బండిలో కూర్చుండుటకు తూలికాసనము లున్నవి. పండుకొనుటకు ఈవ లావల పరుపులున్నవి. మధ్య పెద్దకరండములలో పళ్ళు, శక్తిమతీదేవి స్వయముగచేసిన తినుబండారము లున్నవి.

బండివెనుక రెండుజతల ఎడ్లు, ఇరువురు గోపకులుకూడ బయలు దేరిరి. ఎడ్లకు వలయు, జొన్న, చొప్ప, కందిపొట్టు, ఉలవలు, తిలపిష్టము మొదలైనవి బండి అడుగున నున్న యరలలో నుంచిరి.

ఆ ఉదయము ధాన్యకటకమున బయలుదేరి రెండవయామము సగము జరుగునప్పటికి బండినాగగ్రామము వచ్చినది. అచ్చట వారు సత్రమున దిగిరి. సువర్ణుడు సన్నని బియ్యము అన్నమువండెను. కూడ కొని వచ్చిన కాకరకాయలతో కూరవండెను. కూడవచ్చిన బుద్దగోపుడు గ్రామము లోనికి పోయి కత్తికితెగని పెరుగు పట్టుకొనివచ్చెను, ఈలోన గోపకులకు చిత్రగోపుడు వంటచేసెను. సువర్ణశ్రీ పచ్చి పులుసు చేసెను. ఉప్పును, మిరియముల పొడిని వేసి సుగంధపు బొడిని జల్లిన ఆ పులుసు సిద్ధార్థినికకు గోపకులకు అమృతోపమానమై యుండెను. తల్లి ఇచ్చిన పచ్చడులను నంజుకొనిరి.

భోజనము లైనవెనుక ఎండ మిక్కుటిముగ నుండుటచే వారంద రాసత్రమున సాయంకాలమువరకు విశ్రాంతితీసికొని, గాలి తిరిగి చల్లపడ గనే, ప్రొద్దు మూడు గడియ లున్నదన ప్రయాణమును మరల సాగించిరి. అక్కడనుండి రాత్రి జాముపొద్దుపోకుండగనే పాటలపురము (గుంటూరు కడ చేబ్రోలు) చేరినారు. ఆ రాత్రి అక్కడ విశ్రమించి, ఉషః కాలముననే బయలుదేరి మధ్యాహ్న భోజనమునకు ధనదుపురము చేరినారు.

ధనదుపురము చేరునప్పటికి సముద్రపుగాలి ఎత్తివేయుచుండెను.

ఆ మారుతములు సువర్ణశ్రీకుమారునికి హృదయవేదన మరింత ఇనుమడింప జేసినది. అచ్చట దగ్గరచుట్టములు చాలమంది యుండుటచే సువర్ణశ్రీయు సిద్ధార్థినికయు ఆ మహానగరమందు మూడురోజులుండిరి.

ధనదుపురము (చందవోలు) ఇక్ష్వాకులమండలమునం దున్నది. గొప్ప వర్తక కేంద్రము. అనేకులు కోటీశ్వరు లక్కడనున్నారు. అచ్చట రెండు ఇంద్రాలయములు, ఒక మహేశ్వరసర్వతో భద్రాలయము నున్నవి. అవి యన్నియు సువర్ణశ్రీ చూచినాడు.

ధనదుపురమునుండి ఇక్ష్వాకులరాజధాని యగు ప్రతీపాలపురవ (భట్టిప్రోలు) చేరినారు. ఇచ్చట నొకమహాచైత్యమున్నది. ఆ చైత్యమునకు పూజలు సలిపి, సాయంకాలమునకు కృష్ణదాటి పయనించి శ్రీకాకుళపురము జేరినారు.

శ్రీకాకుళపురమును జేరినవెంటనే వారి అమ్మమ్మ వారిరువురకు దృష్టితీసి లోనికి తీసికొనిపోయినది. చిన్నమేనమామ ఆరితేరిన లోహకారుడు. ఆంధ్రదేశమున అంత ఉత్తమలోహకారుడు లేడని పేరు పొందినాడు.

23. సముద్రతీరము

సముద్రయానము సలిపి ద్వీపాంతరములనుండి కృష్ణానదీముఖమున గొనివచ్చిన వివిధ తరణులను, కూపకముల జూచుచు, వానికిగట్టు రజ్జులు గమనించుచు, వస్తువులతో దోనెకడుపులు నింపుకొని ప్రయాణ సన్నాహమున నున్న నౌకలను గమనించుచు సువర్ణశ్రీ కాలముగడప దొడగెను.

శ్రీకాకుళమునందనేక దేశములనుండి వచ్చు వర్తకులు, నావికులు, వీరులు, వింత చూడవచ్చినవారు కాపురములు చేయుచుందురు. వచ్చుచుందురు, వెళ్ళుచుందురు. ఆ మహాపట్టణమున నెన్నియో సరకులగృహములు, వర్తకశాల లున్నవి. మంచి నేతశాల లున్నవి. వలువలకు వన్నెలద్దువారి గృహములున్నవి. ఆ దినములలో శ్రీకాకుళమునకు నిద్రలేదు. చిత్తమునకు శాంతిలేదు” అను సామెత ఆంధ్రదేశమునందు వాడుకయైనది.

ఆ పట్టణమున వినవచ్చిన భాషలు కాశిలోనైన వినరా వందురు. ద్రావిడము, సింహళభాష, సువర్ణాది ద్వీపముల భాషలు, మాగధి, అర్ధమాగధి, పాలి, చీనాభాష, యవన, రోమక, జెండవిష్ట, తురష్కాదిభాషలు ప్రతివీధి యందును వినబడును. ఆ పట్టణమునందుండు కైవర్తదాశరధులు సముద్రమునందవలీలగ నెంతదూరమైన నీదగలరు.

చిన్నచిన్న నావలలో ద్రోణులలో కైవర్తులు సముద్రములోనికి వరువాతనే వెడలిపోయి, వలలు వేసి చేపలుపట్టి సాయంకాలానికి తిరిగివత్తురు.

సువర్ణశ్రీ అట్టి పడవలలో నొక యుదయమున బయలుదేరి సముద్రములోనికి పది గోరుతములవరకు పోయినాడు. అలల కా ద్రోణి ఇటునటు ఊగినప్పుడు మొదట సువర్ణశ్రీకి కొంచెము వికారము పెట్టినది. కాని అత డది మనోబలముచే తగ్గించుకొని, సముద్రములోనికి నిర్భయముగ వెడలిపోయెను. ఒక ముహూర్తము గడుచునప్పటికి తూరుపున ఎర్రని చిరువెలుగులు కాననైనవి. అనంతమువలె దృశ్యమైన సముద్రమును, దెసలును, ఆకాశమును! ఈ ఆనంత్యమధ్యమున తా నీ చిన్నద్రోణిలో! ఎవరికివారు ఆనంత్యమధ్యస్థులే. ఆనంత్యము ప్రతి ప్రాణిని చుట్టియుండును.

అనంతవిశ్వమున ప్రాణి ఎటు పోవుచున్నాడు? ముందునకా, వెనుకకా? ఈ యాత్రకు అవధిలేదు. ప్రాణము ఈ యాత్రనుండి తప్పికొని, నిర్వాణానందము నందుటయే అంతమా?

ఈ యాత్ర దుఃఖమా, ఆనందమా? ఆనందమునకు మార్గముమాత్ర మానందముగాక దుఃఖమెట్లగును? దుఃఖముకూడ ఆనందమునకు వేరొక రూపమా? వెలుగులో చీకటి యున్నది. చీకటిలో వెలు గున్నది.

సూర్యునివెలుగు ఆనంద మనుకొన్న ఆ వెలుగు భాగించిన సర్వ వర్ణములు వచ్చుట విచిత్రము. ఈ సర్వవర్ణములు (గిన్నెలలో కలిపి) మిశ్రముచేసిన నలుపు వచ్చును. అవి కలుపగా కలుపగా తెలుపువచ్చును.

ఇవియన్నియు బ్రత్యక్షములు. యీ సత్యమును గురుతించువారే మానవులు. తక్కినవారు కనులున్న గ్రుడ్డివారు.

హిమబిందు ఏల తన జీవితప్రాంగణము ప్రవేశించినది?

ఇంతలో అరుణకాంతుల పెదవులతో, కమలరక్తుల కపోలములతో దివ్యసుందరి యగు ఉషస్సు ఆకాశమున ప్రత్యక్షమైనది.

ఆ ఉషోబాలను సందర్శించగనే హిమబిందామెచెలియలువలె సువర్ణునకు తోచినది. ఆతని గంభీరవియోగమున ఆ క్షణము గాఢబాధా పూర్ణమై పోయినది. ఆ బాధ భరింపలేక ఆ సుకుమారుడు కండ్ల నీరు కెరటములై పోవ నావలో బిగుసుకొని పోయినాడు.

అప్పుడొక కైవర్తుడు “అదేమిదొరా! మీ కన్నీరు నీటిలో గలియు చున్నది” అని ప్రశ్నించెను.

ఆ శిల్పి వెడనవ్వు నవ్వుచు “ఏమియు లేదు. ఈ అందముచూచి, ఆనందముచే కన్నులనీరు తిరిగినది” అని ప్రతివచన మిచ్చెను.

“అవునండి బాబూ! నిత్తెంచూచే మాకే ఈ పొద్దు చాల అందంగా ఉంది.”

“అటులనా! ఈ పాట వినుము.
ఆడవే! కల్యబాలా!
ఆకాశరంగమున, అరుణయవనికపైన
ఆడవే కల్యబాలా!
తుంబురుడు నారదుడు తోచిరే ఇరుదెసల
బంభర సునాదములు జృంభించె తంత్రులన్
ఆడవే కల్యబాలా!

ఏ అనంతార్థములో ఏ క్షణిక భావములో
నీ అంగహారముల నృత్యాభినయము లగు
ఆడవే కల్యబాలా!
వచ్చితివి, ఇంతలో చొచ్చితివి నాబ్రతుకు
మెచ్చుచుండగ గచ్చు విచ్చౌదువే బళీ!
ఆడవే కల్యబాలా!

“పాట బాగుంది దొరా. ఈ తళుకు లంతలో వెలిసిపోతవి.”

“అడుగో సూర్యభగవానుడు. కలలు కల్లలుచేసే దైవము.”

ప్రేమ క్షణికమూ, బాధ నిత్యమూ నగునా? కాదు. ప్రేమయే ఈ బాధగా నిలిచినది. కనుకనే యీ బాధ యింత మధురము.

వారి పడవ ఇంకను సాగిపోయినది. అంతులేని పడవయాత్ర చింతలేని బ్రతు కెటు లగు?

ఆ కల్లోలములో, ఆ తెరచాప పొంగులో, ఎరుకవీడక నావ నడుపుకొనుచు, మిలమిలలాడు చేపలను వలవైచి పట్టుకొను ఈ బెస్తలే నిజమగు తత్వజ్ఞులని సువర్ణశ్రీ యనుకొనినాడు.

సాయంకాలమునకు ద్రోణి తిరిగి కృష్ణాతీరము చేరినది.

24. పరివర్తనము

విషబాలయు, స్థాలతిష్యుడును, తక్కినవారు ధాన్యకటకమునుండి ప్రతిష్టా నగరమునకు బోకముందు ఒక విషయము జరిగినది. ఆశ్రమమునకు కృష్ణాతీరమునం దున్న కుడ్యముప్రక్క ఒక చిన్నతోట యున్నది. అందొక కర్షకుడు కాయగూరలు పండించు చుండును.

ఆంధ్రదేశమునందీ దినములలో నేమి పంటలు పండించుచుండిరో ఆనాడును ఆ పంటలే నేటి వ్యవసాయ విధానములనే పండించుచుండిరి. కృష్ణవేణ్ణా గౌతమీ నదుల మధ్యనున్న శాలిభూములు, ఈవ లావల నున్న భూములు వరి, జొన్న మొదలగు పంటలచే నిండియుండెను. సెనగలు, పెసలు, కందులు, మినుములు, నువ్వులు, ఆవాలు, ధనియములు, మిరియములు, ప్రత్తి, గోధుమలు, అలచందలు, కొర్రలు, అవిసెలు, యవలు, చెఱకు విరివిగ పండుచుండును. మనుష్యుడు కృషి చేయు భూములేగాక దేవభూము లనునవి కలవు. అందు విత్తులునాటుట తరువాయిగ ధాన్యము విరివిగ వివర్తనమునకు రెండు మూడు ద్రోణములు (పుట్టులు) పండెడివి.

ఆంధ్రదేశమునం దున్న ధాన్యపుబంట జంబూద్వీపమునం దెచ్చటనులేదు. అందుకే ఆంధ్రరాజధానికి ధాన్యకటక మని పేరు వచ్చినది. వరిచేలు కోత అగుచుండుట తడవుగ జనుము చల్లువారు. వరులు మనుష్యుని ఎత్తు పెరిగెడివి. జను మంతకన్నను విరివిగ పెరిగెడిది. ఆంధ్రులకు కూరగాయలన్న నెంతయో ప్రేమ. అరటులు విస్తారముగ పెంచుచుండిరి. ఆంధ్రదేశమునం దా దినముల నున్న అరటి జాతులు మరెచ్చటను లేవు. వార్తకకి (ములగ) నాగబలము (బీర) పడోలకము (పొట్ల) దార్వికము (బెండ) బింబ (దొండ) వాటకము (బుడమ) దృక్షగన్ధ (బొద్ది) సోమవల్లరి (పొన్నగంటి) అంబష్టము (పులిచింత) సహస్రవేది (పుల్లప్రబ్బలి) జీవని (పాలకూర) పలాండము (నీరుల్లి) లశునము (వెల్లుల్లి) కారవేల్లము (కాకర) కులకము (చేదుపొట్ల) కుష్మాండము (గుమ్మడి) కర్కటి (దోస) తుంబి (సొర) కందగండీరము (వంగ) లంబనము (తీగబచ్చలి) ఉపోదకి (దుంపబచ్చలి) మూలకము (ముల్లంగి) హిలమోచికము (చిలుకకూర) వాస్తుకము (చక్రవర్తికూర) నారికేళము - ఈ కూరలన్న ఆంధ్రులకు ప్రాణము. ఆ నాడును ఆంధ్రులు కర్ణికారము (గోగు) ను ప్రియమార భక్షించువారు. కందమూలములలో కంద, పెండలము, చామ విరివిగ తినువారు.

కృష్ణయొడ్డున ఆ తోట పెంచు రైతు చిన్నవయసువాడు. ఆతని తోటలో అరటిచెట్లు, పొట్ల, బీర, దొండపాదులు, అలచందజాతులలో చేరిన పెద్దచిక్కుడు పాదులు విరివిగ నుండెను. ఆతోట అర్థనివర్తనమునకు తక్కువగనే యున్నది. అతని పేరు దుర్గయ్య. దుర్గసామి అనియు బిలుతురు. అతని భార్య కాపురమునకు వచ్చి కొన్ని మాసములైనది. ఆమె పేరు బాపనమ్మ. బాపిశ్రీ యనియు పిలుతురు. కర్షకుల బాలికలందరు అందకత్తియలు. అందు బాపనమ్మ మరియు నందకత్తె.

దుగ్గ సామి ఇల్లు వారితోటలోనే యున్నది. భార్యయనిన యాతని ప్రేమ కృష్ణవేణి పొంగులవలె గట్లుపొర్లి ప్రవహించుచుండును.

ఒకనాడు భార్యాభర్తలిరువురు సాయంకాలము సరససల్లాపము లాడుచుండిరి. దుగ్గసామి గంభీరమైన కంఠమెత్తి,

అణ్ణాస ఆ ఈఁరేంతీ తహసుర ఏహరిస
విహసి ఆ కవోలా
గోసేవి ఓణ అముహి అహసేత్తిపి ఆం
ణ నధథిమో (గాథాసప్తశతి)*[1]

అని నవ్వినాడు. బాపిశ్రీకి కోపమువచ్చి ఇంటిలోనికి పారిపోయినది. చీకట్లు విసవిస పైకెగబాకి వచ్చినవి. భర్త పాటపాడినట్లు ఆమెకు పగలు అమితమగు సిగ్గు. వంచినతల ఎత్తిఎరుగదు. భర్త మాటలాడించినను మాటలాడదు. అత్తగారిమాటలకు అస్పష్టముగ ప్రతివచన మిచ్చును.

దుగ్గసామి అల్లరిపిల్లవాడు. అందకత్తెయగు నిల్లాలిని వదలిఉండ లేడు. ఏదేని వంకతో తనకడకు పిలుచును. ఇటునటుచూచి ఆమెబుగ్గపై ముద్దిడును. ఆమె కోపమున విదిలించుకొని పారిపోవును. పగలంతయు ఆమె మూతి ముడుచుకొనియే యుండును. అతడు మరియు నామెను అల్లరిచేయును. ఆమెకు కోపము పెరిగిపోవును. రాత్రియగుటయు నామె మారిపోవును. ఆమె ఆనందమూర్తి యగును. శృంగార రసాధిదేవత యగును. ఆ దంపతుల ఆనందము దేవతలకే కనులపండువై వికసించి పోవును.

అది వేసవిదిన మగుటచే తోటలో వకుళవృక్షపునీడలో భార్య నులకమంచముపై పక్కవేసి, స్నానముచేసి, శుభ్రవసనములు ధరించి రా వెడలిపోయినది. దుగ్గన్న సోగ మీసములు త్రిప్పి, మందహాసముచేసి, మంచముపై పాదములు ముడుచుకొని గాఢనిద్ర నభినయించుచుండెను.

ఇంతలో బాపిశ్రీ తెల్లనిచీర[2] ధరించి, పూవుల ఉపవీతము[3] వలెవాటువైచికొని, స్తనవస్త్రము చుట్టి, మల్లెపూలు జడముడిని తురుముకొని, వెండి బంగారు నగలు తాల్చి రూపొందిన మోహదేవతవలె నాతనికడకు వచ్చినది.

ఆతడు గాఢనిద్ర యందుండెను. మంచమున నా పడుచు పండు కొనుటకు స్థలము లేదు. ఆమె మంచముదాపుననిల్చి, అతనిపై వంగి ఒక పదినిమేషముల కాలము పరిశీలించెను. ఆమె తమిపట్టలేక అతని బుగ్గపై రెండు ముద్దుల నాటినది. ఆతని ఒళ్ళు ఝల్లుమన్నది కాబోలు, ఆమె మందహాసము చేయుచు.

“ఆళి అపసుత్త అవిణీ మీళి అచ్ఛ
దే సుహ అమఝ్ఘ ఓ ఆసం
గండపరి ఉంబణాపుల ఇ అంగం
ణపుణాచిరా ఇస్సం”

,

(గాథాసప్తశతి)*[4]

అని కోకిలకంఠమున తీయగా పాడినది. ఆ పాటకు కరిగిపోయి, దుగ్గసామి గబుక్కున లేచి, భార్యను కౌగలించుకొని, మంచము పైకి లాగి ఆమె మోముపై ముద్దులవర్షము కురిపించినాడు.

***

ఈ దృశ్యమంతయు గోడప్రక్క వటవృక్ష మెక్కియున్న విషకన్యక పరిశీలించుచునే యున్నది. ఆ యాకుజొంపములలో ఆమె నెవ్వరు కనిపెట్టలేదు.

సాయంకాలమగునప్పటికి దినదినము ఆశ్రమగృహమునుండి ఆమె మాయమగునది. ఆగస్తియు, గగనియు, కాశ్యపియు ఆమెకై ఎన్ని సారులోవెదకి వేసారినారు. ఏమైనది? ఆమెకు తిరస్కరణీవిద్య యున్నదా? ఆమె తిరోధానమొందు విషయము స్థౌలతిష్యునకు వారిరువురుకూడ చెప్పలేదు. అట్లు మాయమై రాత్రి మొదటి యామము ముగియలోపలనే ఆమె పామువలె చప్పుడుకాకుండ నా కొమ్మలనుండి జారి ఏ లాగున పరువిడి వచ్చునో ఆశ్రమగృహములకడ ప్రత్యక్షమగును.

దుగ్గసామి బాపిశ్రీల ప్రణయగాధ ఆమెహృదయమున హత్తుకొనిపోయినది. రాత్రియంతయు ఆమె కనులుమూసి కదలికలేక నిద్దుర నటించుచు మేలుకొనియే యుండును విచ్చీవిచ్చని ఆమెమనస్సును ఆ పడుచుదంపతుల ప్రేమ విప్పారుచున్న కుసుమముల సువాసనలవలె పొదివికొన్నది. శీతలవాయువులు చేమంతికొమ్మలకు పులకరము కలిగించి మొగ్గలదొడిగించును. మలయానిలము మల్లెపొదలకు స్పందనము కలిగించి తెల్లనికుట్మలముల వరమిచ్చును. చంద్రుని చల్లని జ్యోత్స్నలు కలువకన్నెహృదయ ముప్పొంగజేయును. విషబాల హృదయమున విషము విరిగిపో నారంభించినది.

తానును ఆ బాపనమ్మవంటిదే. ఆ కాపుబడుచు ఉలూపి అర్జునునితోవలె దనపురుషునితో అలమికొనిపోవుచున్నది. తానును అట్టిదేకదా! తన కెట్టి పురుషుడు వచ్చునో!

ఇంతలో ఆమెకు చల్లనివస్తువులమధ్యనిప్పు దాగుకొనియున్నట్లు ఒక భయంకర విషయము జ్ఞప్తికివచ్చినది. ఆ కర్షకబాలిక కౌగలించినట్లు తాను దనపురుషుని కౌగిలించినచో ఆతడు దగ్ధమైపోవలసినదేకదా!

చా వనిన ఏమో ఆమె యెరుంగును. తాను మృత్యురూపము. మనుష్యులను నాశనము చేయుటకే తానుద్భవించినదికదా! ఆమె గజగజ వణికిపోయినది.

25. చైతన్యశక్తి

విషబాలిక ప్రతిష్ఠానము చేరుకొన్న నాటినుండియు మాటలాడదు. నవ్వు ఆమె ముఖమున నృత్యము సేయదు. ఆమె కన్నులలో ప్రసన్న రేఖలు ప్రత్యక్షముకావు. ఆమెలో కుములుచున్న బాధ నెమ్మదిగా రాజు కొనుచున్నది. ఆమె కన్నులలో ఏవియో మబ్బులు ఆషాఢమేఘములవలె ఆవరించియున్నవి. ఆమె పెదవులలో పండని బింబఫలములో, పూచని కాశీరత్నములో, ఉదయించని ఉషస్సులో తొంగిచూచుచున్నవి.

విషబాల ఒకచోట ఒదిగి కూర్చుండును. ఆమె మోకాళ్ళు ముడిచి వానిపై మోముంచి, రెండుచేతులు మోకాళ్ళకు చుట్టి, కన్ను అరమూతలు వైచి, చైతన్యరహిత మగు బొమ్మవలె నాళికలు నాళిక లట్లు కూరుచుండును.

గురుదేవులు స్థాలతిష్యులవారి సంకల్పము విషబాలను మహామారణ యంత్రము నొనరించుచున్నదని, గగన్యాదికాపాలిక లూహించుకొని భయావృతహృదయలైరి. తాముకూడ ఆమెను దరిచేర నలవితప్పి, గురు ప్రభావమున ఈ బాలిక మృత్యుదేవతా విస్ఫారితభయంకరవదన యగుచున్నదని ఆ కాపాలికలు నిశ్చయించుకొనినారు.

ప్రతిష్ఠాననగరాశ్రమమునకు వచ్చిన మరుదినము మధ్యాహ్నము విషకన్య గోదావరీతీరమునకు బోయి, రాళ్ళు విరజల్లినట్లున్న యా గట్టుదిగి, నదీగర్భమున బండరాళ్ళమధ్యమున సెలయేరువలె ప్రవహించు నా నదీమతల్లిచేరువ నొకశిలపై కూరుచుండి, నీళ్ళలో కాళ్ళుంచి, ఇటు నటు ఆడించుచును, నీలములై, స్వచ్ఛములై ప్రవహించునా నీటిలోతుల పరిశీలించుచు నాలోచనారహితయై యుండెను.

ఆ నీటిలో నంత నొక విగ్రహ మామెకు ప్రత్యక్షమైనది. ఆ విగ్రహము కిరీట, కేయూర, కర్ణకుండల, హార, కంకణాది భూషణభూషితము. ఆ మూర్తి సమున్నతము. ఆ మూర్తిముఖముమాత్ర మామెకు గోచరముకాలేదు.

ఆ సమయముననే స్థౌలతిష్యుడు శ్రీముఖసాతవాహనుని నాశనము గోరి జపించుచున్నాడు.


ఇంతలో ఆమె కా నీలజలములం దా మూర్తి కరగిపోవుచుండుట కనుపించినది. ఆ మూర్తిని వెన్నంటి యౌవనతుషారార్ధ్రమును, ఉత్తమాలంకారధగద్ధగితమును, పరిపుష్ట పరీమళితాంగ సుందరమునైన వేరొక్క విగ్రహము ప్రత్యక్షమైనది. ఆ మూర్తి మోముమాత్ర మస్పష్టము.

ఇంతలో మహాగ్నికీలయొకటి గుప్పుగుప్పున మండుచు ఆ మూర్తిని చుట్టివేసినది. తత్కీలామధ్యమున మహానాగినీజిహ్వారూపమై, ప్రళయదిన మధ్యాహ్న చండభాను వినిర్గతభస్తియై తనమోము తోచినది. కొంతవడికి అన్నియు నిర్మలనీలప్రవాహసంక్లిష్టములై మాయమైపోయినవి.

ఆమెకు భయమువేసినది. కొంచెము వణకినది. ఇంతలో తామరమొగ్గలవలె పాటల వర్ణసుందరము లగునామె వేళ్ళను పరిశీలించుటకు కొన్ని మత్స్యములు వచ్చినవి. అవి ఆ విషకన్యపాదముల స్పృశించినవో లేదో వెంటనే గిజగిజలాడి ప్రాణములు విడిచి వెల్లకిలగా తెల్లగా తేలి కొట్టుకొనిపోయినవి. ఆ దృశ్యముచూడగనే మానససరోవర సంచరద్రాజ హంసికాకంఠమృదుల మగు నామెసువర్ణకంఠము బిగుసుకపోయి, పొడియారిపోయినది. ఆమె చటుక్కున పాదములు తీసికొన్నది.

ఆమెకన్నులు అత్యంతవిస్ఫారితములై భయరూపము తాల్చినవి. ఆ చిన్నిచేపలు చచ్చిపోయినవి. అవి ఎంత అందమైనవి! అవి ఎంత చిన్నవి! అవి మిలమిలలాడుచు, చిట్టితోకల నాడించుచు, ఇటు నటుతుర్రున పరుగిడుచు, రాత్రికాలముల తన కానంద మొసగు తారలకన్న అందములై ఆడుకొనుచుండినవి. ఇంతలో నవి మంత్రించినట్లు మడిసి పోయినవిగదా!

తాను ఎక్కడికిపోయిన అక్కడ అగ్నిశిఖలు బయలుదేరునా? తానును అర్జునుని వంటి భయంకరవిషోరగమా? తన్ను ఇతరులను చంపుటాకా తనతాతగారు పెంచినారు.

....ఆ నాడు కృష్ణవేణ్ణానదీతీరమున చూచిన ఆ పురుషుని ఆ బాలిక కౌగిలించినట్లు ఏ పురుషునైన తాను....చేతులతో చుట్టివేసిన.... అతడు ఈ చిన్ని చేపలవలె, మలయ నాగునివలె, చ.... ని.... పో.... వల.... సినదేనా?

ఆ బాలిక పేరు బాపిశ్రీ అనివిన్నది. బాపిశ్రీవలే ఒక పురుషుని తానును కోరుచున్నది. మలయనాగుని కౌగిలిఁ దాను కోరలేదు కాని తనకు ప్రియమును సమకూర్చు నందగాని దాను కోరి కౌగలించినను ఆ ప్రియుడు నిలువున కూలిపోవునా? ఆతనినేమి చేతురు? మలయనాగుడు మరల కనబడలేదు.

ఆమె ఇంక ఆలోచింపలేకపోయినది. ఎవరో తరుముకొని వచ్చుచున్నట్లు ఆమె అతి వేగమున మహానాగినివలె ఆశ్రమమునకు పరువిడి వచ్చినది.

“గగనీ! గగనీ! నాకు భయమువేయుచున్నది,”

“నీ కెందుకమ్మా భయము?”

“నేను ముట్టికొన్నవారు వెంటనే చచ్చిపోదురు. తాతగా రనినట్లు నాశనమైపోదురు.

“అదేమి తల్లీ అట్లందువు! నేను నిన్ను ముట్టుకొనినను నాశన మగుటలేదే?”

“నీవు నావలెనే ఆడదానవు. అందుకని నాశనముకావు.”

“మీ తాతగారు మగవారు! మరి వారు నిన్ను ముట్టుకొనుటలేదా?” “మా తాతగారు ఎప్పుడును నాశనముకారు. నేను ముట్టుకొనిన గోదావరినీరు నాశనమగునా? నేను కౌగిలించిన ఆ కొండలు నాశన మగునా? అట్లే మాతాతగారును.

“ఆ కొండలు, ఆ నదులు మాట్లాడవు. మీ తాతగారు మాట్లాడుదురు!”

“ఓ వెర్రిగగనీ!ఆ గగనము నాతోమాత్రము మాట్లాడును. నీవు అందరితోడను మాట్లాడుదువు. కనుక మాట్లాడుట ముఖ్యము గాదు. మా తాతగారు పురుషులు కారు, స్త్రీలును కారు, వారు దైవము.”

“దైవమంటే?”

“మాతాతగారు నీవు, అగస్తి, కాశ్యపి మొదలగువారు పూజ సేయుదైవము.”

“దానికేమిగాని, ఎవరు నాశనమగుదు రందువు?”

“పురుషులు. నాబోటి బాలకలను గట్టిగా గుండెలకు అదుముకొను నూనూగు మీసములపురుషులు. మలయనాగునివంటివారు.”

“అమ్మయ్యో! ఇది ఎట్లు నీకు తెలిసినదమ్మా? ఎవరు చెప్పిరి?”

గగని ఒడలు జలదరించినది. ఆమె కన్నుల భయము నిండినది. ఆమె ఇటు నటు పారచూచినది.

“నేను చూచితిని. వారిరువురు ఎంతో సంతోషముగా నున్నారు. గగనీ! నిన్నెవరైన అట్లు కౌగిలించారా? స్త్రీ పురుషులు పెనవైచికొనుట అంత సంతోషమా? మొన్న బండ్లమీద ఈ యూరు ప్రయాణముచేయు నప్పుడు మనము ఇక సెలయేటి ప్రక్కను అగినాము కాదూ!”

“అవును, అక్కడ ఏమి జరిగినది!”

“అక్కడనొక పొలము, అందు రెండు నేరేడుచెట్లు చూడలేదా!”

“చూచితిని.”

“ఆ నేరేడు చెట్లనీడ ఒక పొలముకాపు, అతని భార్యయు, ఒక చిన్న బాలుడు, రెండెడ్లబండి చూడలేదా?”

“నేనంత పరిశీలించలేదు.”

“వారంద రక్కడ సంతోషముగా నున్నప్పుడు వారిని చూచి మన బండివాడొక పాట పాడినాడు. అది వింటివా?”

“లేదమ్మా! నా గొడవ నాది. ఏమని పాడినాడు?”

“విను,

పాఅపడిఅస్స పఇనో పుఠ్ఠిం[5]
పుత్తే సమారుహత్తమ్మి
దడమణ్ణుదుణ్ణిఆయే విలాసో
ఘరిణీయే నేక్కంతో

(గాథాసప్తశతి) ఆ పాటలు విని, ఆ పురుషుని, ఆ స్త్రీని, ఆ పాపని చూచి ఎంతో ఆనందమైనది. గగనీ! నాకును అట్టిపాపడు పుట్టి నాతో ఆడుకొనునా? నా ఒడిలో ఒక పురుషుడు వాలిపోవునా?”

26. ఉజ్జయిని

ఉజ్జయినీనగరము భారతభూమియం దున్న సప్తమహాక్షేత్రములలో నొకటి. ఆ మహానగరము అభయబాహువు శాతవాహనమహారాజు కాలములోనే ఆంధ్రులచే జయింప బడినది.

ఆ పురముచుట్టు నున్న కోటగోడలు శత్రువులకు అభేద్యములు. కందకములు అగాధములు. పురమధ్యమున మహారాజు నివసించు దుర్గమున్నది. శత్రువులు నగరము ప్రవేశించినచో సైన్యములు దుర్గములోనికిబోయి రక్షించు కొనవచ్చును. నగర కుడ్యముల కన్న దుర్గకుడ్యములు మరియు బలమైనవి. ఉజ్జయినికోట పట్టుకొనవలయునన్న రెండే మార్గములున్నవి. ఒకటి: నగరములో తిండిలేకపోవుట, రెండు: నగరరక్షక సైన్యమునకు ధైర్యము నశించుట.

సమదర్శిశాతవాహనుడు అన్నివిధముల తండ్రిపోలిక. ప్రియదర్శి అవక్రవిక్రమము సంపూర్ణముగ నాతని నాశ్రయించినది. తనతండ్రి జయించిన మాళవమును తాను రక్షింపజాలకుండుట ఎట్లు?

సమదర్శి యువకుడైనను సేనానాయకులలో ఉత్తముడని వినీతమతికి దృఢవిశ్వాస మున్నది. ఆతడు ప్రియదర్శికుమారుడు. ఆ సర్వ సైన్యాధ్యక్షునికడ ముఖపతిగా, చమూపతిగా, సేనాపతిగా పని చేసినాడు. ఉత్తమయుద్ధ నీతి చూపుచున్నాడు. ఆయినను ప్రియదర్శిశక్తి పూర్ణముగ, నీతనియందు ప్రదర్శితమౌనాయని యాలోచించుకొనెను. అట్టి ప్రియనాయకునిపుత్రునిపై సర్వభారము నుంచి తానుతోడుపడుట ధర్మమనే యాత డనుకొనెను.

శాత్రవపరివేష్టితమై ఉజ్జయినీనగరము మహాసముద్రమధ్యమున నున్న దీవివలె నున్నది. ఉజ్జయినిని ముట్టడించిన మాళవ, మగధ, పుళింద, విదేహ, శక, సౌరాష్ట్ర సైన్యములు ఎటుచూచినను గోరుతములు గోరుతములు వ్యాపించియుండెను.

కోటను పడగొట్టుటకు ఒక్కొక్కనాడు ఒక్కొక్క సైన్యము ప్రయత్నించుచుండెను. ఆ ప్రయత్నము విఫలముకాగానే యా సైన్యము వెనుకకుతగ్గి, దూరముగనున్న గుడారముల లోనికి పోవుచుండెను

అప్పుడప్పుడు ఎనిమిదివైపులను ఎనిమిది సైన్యములును కుడ్యములను తాకుచుండెను. ఆ దినము పోరు మహాఘోరమైపోయి ఎన్నివేల మందియో చనిపోవు చుండిరి. గోడల పై, బురుజులపై, గోపురద్వారములపై యుద్ధ యంత్రములు, ఏనుగులు మాఱొడ్డుచుండెను.

మాళవ సైన్యముల నెందరు హతమారుచున్నను ఆ సైన్యముల కంతులేదు. కాని కోట రక్షించుచున్న కొలదిమంది ఆంధ్రులు భయంకర యుద్ధము చేయుచుండిరి. అట్టి సమయముల సమదర్శి సమవర్తియే. ఆతని నాయకత్వము అజేయము. అందరికి అన్నిరూపులై, ఒక్కసారిగా అని చోట్లను కనపడుచు అతడు చేయు యుద్ధమును దేవతలేవచ్చి చూచుచుండిరి. మాళవసైన్యనాయకుడైన శివస్వాతియు, మగధ సేనాధిపతియు, పుళిందరాజును, సౌరాష్ట్రసేనాధిపతియు ప్రతిరాత్రియందు మాళవరాజు సువర్ణశిబిరమున మాళవాధిపతిని దర్శించుచు, యుద్ధవిధానము నిర్ణయించి దాని ననుసరించుచుండిరి.

నగరములో కొద్దిసైన్యమున్నపుడే త్వరలో నిర్షించి, కోట స్వాధీనము చేసుకొన లేకున్న, ఇక ఆంధ్రసైన్యములన్నియు వచ్చినచో ఈ రెండు మహాగ్నులమధ్యనుండి మగ్గిపోవలసినదే మాళవాదులు.

సమదర్శికి ఇంతవరకు చక్రవర్తికడనుండి వార్తలేమియు జేరలేదని కొంచెము ఆతురత కలిగినది. ఆయుధములు తరిగిపోవుచున్నవి. లగ్గల మీద కరిగించిపోయు సీసము నిండుకొనుచున్నది. ఆయుధములను, యంత్రములను నిర్మించుటకు లోహాదులు చాలుటలేదు. నగరప్రజలలో చాలమంది ఆంధ్రులకు వ్యతిరేకులు. తన సైనికులకు భోజనము, నగరప్రజలకు భోజనము చూచుట బ్రహ్మప్రళయ మగుచున్నది. ధైర్యమే ఆయుధములై, యంత్రములై ఎంతకాలము ఉపకరించగలదు? విరోధులు ధర్మయుద్ధము పరిత్యజించి రాత్రియనక, పగలనక, ఒత్తిడి తగ్గించక, ముట్టడి సాగించు చున్నారు.

అందమైన యా నగరమున ప్రజలందరు సరియైన తిండిలేక నిద్రలులేక ప్రేతములవలె నున్నారు. కవులతో, పండితులతో, గాయకులతో, వర్తకులతో, భక్తులతో, వేదాంతులతో, భిక్కులతో నిండియున్న యా మహాపురము భయంకర రోగానిష్ఠుడగు మహాపురుషునివలె నిస్తేజమై వెలవెలపోవుచుండెను.

ఇంతలో నొకనాడు సాయంకాలము నగరములోనికి రహస్య చారు డొకడు చిత్రముగా వార్త నంపినాడు. ఆత డాంధ్రచారదళములలో నద్భుత ప్రజ్ఞావంతుడు. ఆతడు వేయలేని వేషము లేదు. మాటలాడని భాషలేదు. ఒక రోజున శివస్వాతి మహావేగమున అశ్వమెక్కి ఉజ్జయినికున్న అష్ట గోపురమార్గములలో నొకదానికడకు వచ్చెను. కళింగసైన్యములలో కొన్ని యచ్చట యుద్ధము చేయుచుండెను. ఉపసేనానాయకు లతనికి వీరనమస్కారము లర్పించిరి.

అతడు వారితో యుద్ధరహస్యములెన్నియో మాటలాడి, స్వయముగ ఆజ్ఞల నిడి, కోటగోడలపైకి సైన్యముల నెసకొల్పెను. కోటగోడపై మహా విక్రముడైన సమదర్శి నిలబడి ఆంధ్రధనుర్ధరులచే చాపములు చెవికంట లాగించి పుంఖానుపుంఖములుగ బాణములు విడిపింప చేసెను. ఆంధ్రులు ధనుర్యుద్ధమం దసమానులు. వారి బాణము లెట్టి కవచములనైన అవలీలగ ఛేదించుకొనుచు గుండె దూసిపోగలవు. ఆంధ్ర విజయములకు ప్రధాన కారణము వారిధనుర్విద్యాపాటవము. ఆ బాణము లమితధ్యోమములు.

శివస్వాతి సమదర్శిని చూడగనే ఆకుపచ్చని ఈకలతో ఎఱ్ఱని చువ్వతో గోళశిరస్సుగల బాణమును సువ్వున ధనస్సులాగి అతివేగమున వదలెను. శివస్వాతి ఆ నమస్కార బాణము వదలుట కళింగదళముల వారెవ్వరు కనుగొనలేదు. ఆ బాణము రివ్వునవచ్చి సమదర్శి పాదములకడ పడెను. ఆ బాణమును చూడగనే సమదర్శి సంతోషమున నొక గంతువైచి, వంగి, ఆ బాణమును తీసికొని, తనపరశు ముఖముతో గోళము బద్దలుకొట్టుటయు, నందుండి యొక భూర్జపత్రముపైకి వచ్చెను. వెంటనే సమదర్శి పత్రము విచ్చి యిట్లు చదువుకొనెను.

“సేనాపతీ! ప్రణామములు. సింహము అరణ్యములందు తానున్న గుహవదలి తిన్నగ ఆ వృద్ధసింహ మున్న గుహకడకు పోవుచున్నది. ఆ సమయమున కొన్ని సింహశాబకములు తాము వేటాడిన జింకల బట్టుకొని మూలుగుచున్న ఆడసింహముకడకు కొనివచ్చుచున్నవి. ఏనుగు లేమి చేయును, నక్క లేమి చేయును? అమృతపాదసాక్షిగ అవసరములు ఆరవ యామమున ఆరవలోయలో ఆ ఆడుసింహమునకు దొరకగలవట. నేను నాదారిలో చూచిన దృశ్యము. పచ్చరేకు చిలుకముక్కున దొండపం డుండలేదు. ఒక పద్య మున్నది.”

అని వ్రాయబడియుండెను. తిరిగిచూడ అచట శివస్వాతి మరి కాన్పించలేదు. చిలుకయే వచ్చినది. ఇక ఆంధ్ర సైన్యములకు వేయిరెట్లు బలము వచ్చును. తిండి వచ్చుచున్నది. చక్రవర్తి ఇంక కొన్ని నెలలు ఆలస్యముచేసిన భయ మేమి? ఆరవలోయ, ఆరవనగరగోపురము, ఆరవ యామము (రాత్రి రెండవయామము). ఆతడు విసవిస నడచుచు మహావేగమున వినీతమతికడకు బోయి శుకబాణుని లేఖ చూపించెను. వినీతమతి ఆనందమునకు పరిమితియే లేదు. సమయమునకు తగిన సహాయము చక్రవర్తి పంపినాడు. ఆ మహాభాగుని వంటి దూరాలోచనాపరులు మరిలేరు.

ఆరవగుమ్మముకడ కళింగసైన్యములు సంభ్రమాశ్చర్యములలో మునిగి మహా యుద్ధము చేసినవి. ఇంతలో కోటగుమ్మము తెరువబడి మెరికలవంటి ఆంధ్రవీరులు ఒక వేయిమంది ఛంగున అక్కడకు వచ్చి కళింగుల దలపడిరి.

“జై అమృతా” అనుచు వేయిమంది కళింగులు ఆంధ్రసైన్యముల తలపడిరి. ఆంధ్రులు పారిపోయిరి. వారిని వెన్నంటి ఆ కళింగాశ్వికులు, ఇరువది కళింగ గజములు, పదాతులు, పది రథములు ఆంధ్రులను తరుముకొనుచు కోటజొచ్చిపోయినవి.

ఆంధ్రు లంత త్వరితముగ పారిపోవుదురని తక్కిన కళింగసైన్యములనుకొనలేదు. వారికి శివస్వాతియే నాయకుడై సైన్యముఖమున నుండెను. గుమ్మముజొచ్చిన తమ సైన్యమువెంట తక్కిన కాళింగులు వెళ్ళ సాగినంతనే, ముందున్న కళింగ గజవీరులు గజముల పైనుండి ఒక్కమాటు తమమీదనే బాణములు పరపిరి. “జై శ్రీముఖశాతవాహన మహారాజా” అనుచు ఆ గజవీరులు తమ గజముల వెనుకకుద్రిప్పి, అగడ్తపై నున్న వంతెనమీదనుండి తమ్మంటివచ్చు ఇతర కళింగసైన్యముల నిలువరించిరి.

సంభ్రమాశ్చర్యములతో కళింగసైన్యములు ఆగిపోయినవి. గజములు వెనుతిరిగి లోనికి బోయినవి. మహాద్వారములు మూసుకొనిపోయినవి. లగ్గల పైనుండి అగ్నివర్షము, బాణవర్షము మహాథారులైనవి. కళింగులు వెనుకకు పారిపోయినారు. శివస్వాతి “ఎంత మోసము జరిగినది” అనుచు దలవ్రేలవైచెను.

27. గ్రీష్మాతపము

నిప్పులు చెరుగుతున్నది రోహిణీకార్తె తన్నిదాఘమాస బ్రథ్నదేవ మహోష్ణము భరింపలేక, తన పాతివ్రత్యధర్మమునైనతలంపక సంజ్ఞా దేవియే బాడబియై సముద్రము చొచ్చినది.

ధాన్యకటకనగరవీధులయందు మధ్యాహ్న మొక్క ప్రాణియైన గోచరించుట లేదు. తోటల చెట్లన్నియు చిగురించి కొత్త ఆకుల దొడిగినవి. పొలమున నొక పచ్చమొక్క అయిన కనబడుటలేదు. కృష్ణాదేవి, మహాతపస్సు నొనరించు పార్వతివలె ఆ సైకతముల నొదిగిపోయినది.

వట్టివేళ్ళ తెరలు, పన్నీటి జలములు, కురువేరు విసనకర్రలు, గంధకుటి, పుండలీకము, అంజనకేళి మొదలగు సుగంధద్రవ్యములు కలిపిన మంచిగంధము నాగరులు విరివిగ వాడు దినములవి. మేడలపై ఆకాశమే వితానముగ శయనించు రాత్రులవి. సుగంధ పానీయములు, ద్రాక్ష సారాయములు, వివిధ మధువులు మధుశాలలో విరివిగ విక్రయించు సాయంకాలము లవి.

ధాన్యకటకనగరమున కృష్ణాతీరప్రదేశముల పూవులతోటలమధ్య పానశాల లున్నవి. ఒక్కొక్క పానశాల యొక్కొక వనమునం దున్నది. ఆ పానశాలలో రెండు ఉత్తమ కుటుంబముల వారికి, ఒకటి విదేశీయులకు, ఒకటి సాధారణులకు ఆంధ్రమద్యశాలలు, నర్తనశాలలు, కళామందిరములును, పూలవితానములమధ్య వట్టివేళ్ళతెరలలో మెత్తని శయ్యలతో కూడిన మంచములపై, మృదులములగు ఉపధానములపై వ్రాలి, అచ్చరలను మించు పువుబోడు లర్పించు రజతపాత్రలనుండి వివిధపానీయముల గోల నాంధ్రుల కిష్టము. కాకలీస్వనయుక్త వివిధజంత్రసమ్మేళన మధురాతిమధుర గాంధర్వము లాలపింతురు గాయనీపరభృతకంఠులు.

ఆ మద్యశాలలను రాజోద్యోగులు సర్వకాలముల పరిశీలించుచుందురు. ఎక్కువ మత్తుగొలిపించు మద్యము లుండకూడదు. పరిచారికలు, నర్తకీసమూహము, గాయనులు తక్క వేరుస్త్రీ లక్కడకు రాకూడదు. అసభ్యవర్తన మచ్చట పనికిరాదు. ఆ మందిరములు పూజామందిరముల వలె నుండవలయును. ధూపకరండములనుండి పరిమళధూపము లెగయుచు నా మందిరమెల్ల క్రమ్ముచుండును. మల్లెలు, మొల్లలు, కుందములు, చంపకాది, పుష్పములు ప్రోవులు ప్రోవులుగా ఆసనములపై చల్లబడుచుండును.

మాధవకము, కురువేరు గంధసమ్మిశ్రితము కావలెను. మైరేయము వట్టివేళ్ళ పరిమళము నీయవలయును. ఆసవము కుందసురభిళిమై యుండ వలయును. సుగంధము లగు పానీయము లందు సిద్ధముగ నుండును. ద్రాక్షసారాయములు వివిధ సుగంధయుక్తములై చిత్రవర్ణోజ్వలములై తపస్విమనస్సునైన ఎలయించి నోరూరించు చుండును.

హర్షగోపు డొక మధుశాలయందు సుగంధపూరితమును, అమృత సమానమగు ద్రాక్షమధువు గ్రోలుచు సుఖాసనమున నధివసించి యాలోచించుకొనుచుండెను. ఇంద్రగోపుని తమ్ముడు హర్షగోపుడు. హర్షగోపుడు బాలనాగిని ప్రేమించియుండెను. హిమబిందునకు పెండ్లియైనగాని బాలనాగి యాతని పెండ్లియాడుటకు వీలులేదు.

చారుగుప్త గోకులపతి యగు హర్షగోపుడు ధనవంతుడు. ఆతడు మహాచైత్యమున కొక ధర్మచక్రమును స్వయముగా నర్పించుకొనినాడు.

ఆ మధుర సుగంధయుక్తసురామధ్యమున బాలనాగి నవ్వుమోము నాతడు దర్శించినాడు. ఆతనికి కొంచెముమత్తు ఎక్కినది. కొలదిదూరమున వినంబడు రావణహస్తవాద్యముతో శ్రుతిగలిపి, ఒక గాయని మధురముగ బాడుచున్నది.

“ఏలరా ఈ వేదన?
బేలరా అది బాలరా!
చాలురా నీథూర్తత-ఏలరా ఈ వేదన?

హర్షగోపుడు బాలనాగిని తలచుకొనెను. ఆ బాలిక మాట్లాడదు. ఆ ముద్దరాలికి దనపై ప్రేమయున్నదని చెప్పక చెప్పినది. ఆమె హిమబిందుకుమారిని ఈమధ్య వదిలియే యుండుటలేదు అనుకొనుచుండెను.

“నిను తలచి ఏ వేళలన్
కనుమూయ దా చిన్నదీ!
అనిమిషత్వముచెంది పోనో-ఏలనో ఈ వేదనా?”

బాలనాగియు తన్ను తలచుకొనుచుండును. ఆమెయు ఇటులనే బాధ పడుచుండునా? ఎక్కడిమాట!

ఇంతలో ఆ మదిరశాలాధికారి యొకడు మోమునకు చిరునవ్వు దెచ్చుకొని హర్షగోపునికడకు వచ్చి “ఇంద్రగోపుడు క్షేమముగనున్నాడా?” అని ప్రశ్నించెను.

“సుఖముగ నున్నాడు. చారుగుప్తులవారి ధనదపురగోశాలను పరీక్ష చేయబోయినాడు.”

“అమ్మాయిగారు హిమబిందుకుమారి కొంచె మస్వస్థతగ నున్నదని వింటిని. ఎట్లున్నది?”

“జబ్బేమియు లేదు. తండ్రిగారు యుద్ధమునకుపోయినారని ఆమె బెంగ పెట్టుకొన్నది.”

“అంతేనా! వారిచుట్టము లెవ్వరు రాలేదా?”

“ఆ! కోటీశ్వరులకుటుంబములలో ఎవరిపని వారి కుండును. అందరును ఒకసారి వచ్చి చూచినారు. వినయగుప్తులవారు మనుమరాలికి ధైర్యముగ నుండుటకు ఇంటికడనే వసించుచున్నారు. కీర్తిగుప్తులవారు ఒక నిమిషము మనుమరాలి నెడబాయుటలేదు. వా రిరువురు తమ యాత్రా విశేషములు కథగా చెప్పి ఆ బాలికకు సంతోషము గొలుపుచున్నారు.”

“హిమబిందుకుమారి సౌందర్యము ఏ రాచకన్నెకును లేదు.”

“అవును. మే మెవ్వరము తలయెత్తియైన యామెను చూడలేము. ఆమెకుదృష్టి తగులునేమో యని మాకు భయము. ఆ తల్లి దేవత.”

“ఇంటిదగ్గర ముక్తావళీదేవియు, అమృతలతాదేవియు నున్నారట కాదా?”

“అవును. ఎంతమంది యున్నను ఆ తల్లి కేదో విచారమే అని చెలికత్తెలందరు చెప్పుకొందురు.”

హర్షగోపుడు బాలనాగిని తలచుకొనుచునే వెడలిపోయెను.

అతడు చారుగుప్తునికోటగోపురము చేరునప్పటికి సూర్యుడస్తమించి నాళికపైన దాటినది. ఎటుల బాలనాగిని చూచుట? ఆమె తన ఇంటికి రాణిగా రాజ్యముచేయుచుండ ఆమెను బంగారునగలలో, రంగారు దుకూలములలో దేవకన్యనుగా తాను మార్చివేయ లేడా? ఆ తల్లి హిమబిందుకుమారితో తనబాధ చెప్పికొనిన ఆమె తనపై జాలిగొనునేమో?

అనుకొనుచు నాతడు అంతఃపురముదెసకు బోయి, అమ్మాయిగారితో హర్షగోపు డేదియో మనవిచేసికొన వచ్చినా డని వినతి పంపెను.

హిమబిందును, బాలనాగియు తోటలో నున్నారని వార్త వచ్చినది. ఒక చెలి హిమబిందుకుమారితో విన్నవించుటకు వెడలినది. హిమబిందు ఏదియో ధైర్యము వహించియే యుండెను. సువర్ణశ్రీ తనకు పరపురుషుడై పోయినాడా? అతనిపై ప్రేమ నెట్లు నాశనము చేయగలదు? ఆనందుల వారంతగా ధైర్యము చెప్పినా రేమి? వారిమాటల కర్థమేమి? ఆ బాలకేమియు పాలుపోవుట లేదు, ఎటుల నా దివ్యవిగ్రహమును తన హృదయమునుండి చెరిపివేయగలదు? తాను చిత్రములు లిఖించుట నేర్చుకొన్నది. కాని ఫలకముపై లిఖించిన చిత్రము నెవ్వరు తుడిచివేయగలరు? ఆ చిత్రముపై సున్నము పూయవలెను. ఆ సున్నముపై వేరొక బొమ్మ వేయవలయును. కాని వెనుక అణగియున్న చిత్ర మేమగును?

హృదయమున అణగియున్న చిత్రము మరియు సన్నిహితమై జీవితమునే దుర్భరముచేయును. ఏల యాతడు తనజీవితనాటకరంగమున నాయక పాత్రగా ప్రవేశించినాడు? తను మహారాణి యగునా? అరాజక మగు హృదయరాజ్యంతో తానే రాజ్యమునకు రాణి యగును? తనరాజ్యము సువర్ణశ్రీమయము. నాగనిక సంతోషము అద్భుతానందము. తనకు సువర్ణుని మరియు సన్నిహితునిగ నొనరించినది.

తన కుబేరవైభవము కాల్పనా? ఆ వైభవము తనకేమి యీగలదు? అది తన సువర్ణుని దూరము చేసినది.

హిమబిందు నాగబంధునికను పదిసార్లు రప్పించుకొన్నది.

“నాగూ, నేను మీ ఇంటికిరాలేను నన్ను మా తండ్రి మహారాణి నొనరించునట. నామీద ఒట్టు. ఎవ్వరితో నా రహస్యము చెప్పకు. నేను బ్రతికి ప్రయోజనము లేదు.”

“వెఱ్ఱిదానా! నీవు నావదినవు. కొనఊపిరితో నయినా నీకును, నీ కయిష్టమగు మహారాజ్ఞిత్వానికి నేను అడ్డుపడెదను. నా అన్న మహారాజుల కన్న అధికుడు. అతడు మంజుశ్రీ దేవుడే. ఆతడు నిన్ను పూజించును. నీమాట ఆతనికి మంత్రమైనది. అన్నయ్య నీ దిగులుతో సగమగుట చూచి, మా చిన్న మేనమామగారి ఇంటికి మా అమ్మ పంపినది. వెళ్ళి అక్కడ నేమియూ తోచలేదని మరియు చిక్కి నిన్ననే మాచెల్లితో తిరిగి ఇంటికి వచ్చినాడు.”

“బొమ్మలు వేయుచుండెనా?”

“బొమ్మలు లేవు, బూడిదలులేవు. పైన లోన నాతనికి దారుణపు వేడి!”

“మా తల్లి నన్నుకన్న రెండేడులకు నిర్యాణమందినది. పుణ్యాత్మురాలు. నా కా పుణ్య మెప్పుడో!”

“చాల తెలివైనదానవుకదూ! ఇదా నీయవనరక్తపు ధైర్యము!మా భారతాంగన లట్టి వెడగుమాట లనరు. బాణునికొమరిత అనిరుద్ధుని తెచ్చికొన్నది. నీవును నీ అనిరుద్ధుని తెచ్చుకొమ్ము. ”

కొంతసేపు వారట్లు మంతనమాడిన వెనుక నాగబంధునిక వెడలి పోయినది.

హిమబిందు బాలనాగితో తోటలోనికి బోయెను. ఇంతలో చెలియకర్తుకవచ్చి “అమ్మా! హర్షగోపులు తమదర్శనము కోరుతున్నారు” అనెను.

హిమబిందు మోమున విషాదపూరిత మగు దరహాస మొదవినది.

“నాజన్మ మెట్లును దుఃఖభాజనమైనది. బాలనాగీ నీ వైన సుఖ పడవే!” యన్నది.

బాలనాగి మోమున సంతోషము, విషాదము, కోపము అన్నియు తెర ఎత్తిన నాటకపాత్రలైనవి.

28. సైన్య వేగము

ఆంధ్ర సైన్యములు తరిమి నడచుచున్నవి. ధాన్యకటకమునుండి శుభ ముహూర్తమున నా సైన్యములు బయలుదేరినంతనే, ఒకవంక పాటలీ పుత్రమునకు, రెండవవంక ఉజ్జయినికి శత్రుచారులు వేగు తీసికొనిపోయిరి.

స్థాలతిష్యుని అపకృష్టులు వారికి వార్త గొనిపోయిరి. చోళ, చేర, పాండ్యాధిపతులకు స్నేహవార్తలు వెళ్ళినవి. వారును ఆంధ్రచక్రవర్తి మాళవమునకు బోవుచున్నా డనియే భావించిరి.

కళింగము ఖారవేలునియనంతరము ఆంధ్రసామ్రాజ్యమునకు సామంత రాజ్యముగనే పరిగణింపబడుచుండెను. కళింగులు ఆంధ్రచక్రవర్తికి కప్పము మాత్రము కట్టరు. వర్తకాదిస్వామ్యము లన్నియు ఆంధ్రులవే.

కళింగదేశాధిపతికి శ్రీముఖసాతవాహనుడు అత్యంతరహస్యమగు సందేశము నొండు తన మంత్రిసత్తములం దొకనిచే నంపెను. అందు చక్రవర్తి కళింగముదారిని మాళవమునకు బోవును గాన కళింగరాజ్యమున బోవు ఆంధ్ర సైన్యములకు దారి సుగమముచేయ సార్వభౌముడు కోరియుండెను. అది ఆజ్ఞతో సమానము.

మాళవరాజధానియగు నుజ్జయినికి బోవుమార్గమున ప్రతిష్ఠాననగర మున్నది. ప్రతిష్ఠాననగరమునుండి తిన్నగ నుత్తరముగ ఉజ్జయినికి రాజపథ మున్నది. ఆ పథమువెంట ప్రతిష్ఠానమునుండి ఉజ్జయిని ముప్పది అయిదు యోజనములుండును. కాని దుర్గమము లగు కాంతారములు, పర్వతము లుండుటచే రెండులక్షల పుళింద సైన్యము నా మార్గమున ఆంధ్రుల నడ్డుతగులుటకు మాళవులు సిద్ధముచేసినారు. లోయల కీవ లావల కొండలలో, నదులదాటు ప్రదేశములలో, అడవులలో పుళిందులు బెబ్బులులవలె పొంచియుండిరి. వారికి బాసటగ ఘూర్జరులు, ఆభీరులు, పారశీకులు, మాళవులు-పోరుల గాకలుతీరిన చండవిక్రము లుండిరి.

ఉజ్జయినికి దుర్గమభయంకరాటవులగుండ రెండవమార్గ మున్నది. గోదావరీ తీరమునుండి పోవుచు వరదానది గౌతమియందు సంగమించు శబర రాజధానియగు శ్రీగ్రామమునకు (సిరిమంచ) బోయి, యచ్చటనుండి వరదానది తీరముననే నాగదేశము జొచ్చి వాసుకీనగరము (నేటి నాగపురము) చేరి, యచ్చటనుండి మాళవదేశము చొరవలయును. ఆ దారిని సామాన్యముగ ప్రయాణము చేయుటమే కష్టము. యుద్ధ యాత్రకు మొదలే తగదని చెప్పఁబనిలేదు.

మూడవమార్గము దక్షిణకోసలమునుండి విదేహముచేరి, విదేహము నుండి శోణానదిని దాటి, శోణాతీరముననే ఎగువకు దక్షిణముగా బోయి, వింధ్య పర్వతపాదము ననుసరించి యా శ్రేణి ప్రక్కగనె అవంతిమీదుగా మాళవము చేరవలయును. కాని అది చుట్టుదారి.

ఏ దారిని వెళ్ళునో ఆంధ్రచక్రవర్తి పోకడ ఏరికిని అర్థమగుట లేదు. గోదావరి తీరమునకు బోయినచో, నొక్క ఆంధ్రవీరుడైన ఉజ్జయిని చేరుటకు మిగులడు. చుట్టుదారిని చేరుటకుమున్ను ఉజ్జయిని శత్రుహస్తగత మగును. సైన్యము బయలుదేరుటకు గొన్ని దినములముందే మెరికలవంటివేయి మంది యదార్హవర్ణులు, మాయావర్తనులు సంశప్తకులు ఉజ్జయినీ సైన్యములకువలయు ముఖ్యసామగ్రిని సేకరించి, మందులవారివలె, కాపాలికులవలె, జైనసన్యాసులవలె, బ్రాహ్మణయాత్రాపరులవలె, బిచ్చగాండ్రవలె బండ్లతో, ఏనుగులతో, అశ్వములతో బయలుదేరిపోయిరి. ఏదారిని ఎవరు ఎట్లువచ్చిరో! వారందరు ఉజ్జయినిని ముట్టడించు శివస్వాతి కళింగ సైన్యమున చేరిపోయిరి.

సముద్రమున గురిసిన వానతుంపురులవలె, తెల్లవారుఘడియల శాద్వలములజేరిన హిమబిందులవలె, నారికేళముల జేరు జలబిందులవలె కళింగసైన్యమున గలిసిపోయిరి.

ఇంతలో వారు నాటకమాడినారు. ఆంధ్రాపసర్పనాయకుడు శుకబాణుడు శివస్వాతి వేషము వేసినాడు. ఆతనికి చిలుకయని పేరు. ఆతని గుర్తు ఆకుపచ్చ ఈకలు, ఎర్రని చువ్వగల బాణము. ఆతనిచారసైన్య మతినిపుణము. ఈ చార సైన్యము ఆడిన కపట నాటకముచే ఆహారవస్తువులు, మందులు, ఆయుధములు, వస్త్రములు, గజతురగాదులు కోటలో ఎట్లుచేరినది పఠిత లెరుంగుదురు.

ఆ చేరినవార్త చక్రవర్తికి వెనువెంటనే అందజేసిరి.

చక్రవర్తి తాను యుద్ధయాత్రకు బయలుదేరుచు శ్రీకృష్ణశాతవాహనునకు గమ్మయొకటి పంపినాడు. శ్రీకృష్ణశాతవాహనుడు చక్రవర్తి ఏర్పరచిన మంచి ముహూర్తమున వేటకు బయలుదేరినట్లు బయలుదేరవలయు ననియు, ఆతని సైన్యములు వేయి, రెండువేలమంది జట్టులుగా విడిపోయి, మహారధిరాష్ట్రము, రధిరాష్ట్రము, కుంతల దేశము తిరిగినట్లు నటించుచు త్రయంబకేశ్వరపర్వతముకడ చేరవలయుననియు నచ్చటనుండి ఆభీరులు కన్నుమూసి తెరచులోపల నొక లక్షసైన్యము భరుకచ్చము పోయి యది పట్టుకొనవలయుననియు, నచ్చట ఏబదివేల సైన్యముంచి, తక్కిన సైన్యముతో శ్రీకృష్ణశాతవాహనుడు ఉజ్జయినిని ముట్టడించిన రిపుల దాకవలయుననియు, ఆ సమయముననే చక్రవర్తి విదేహముదారిని ఆరువదిఅయిదు యోజనములు ప్రయాణము చేయించి రెండు లక్షల సైన్యము పంపుమనియు, కోటలోనివారు, ఈ రెండు సైన్యములు ఉజ్జయినిని రక్షింప గలవనియు వేగు పంపినారు.


దారిపొడుగునను చంద్రస్వామి సామ్రాజ్ఞి ఆనందదేవికి వేదాంతము, పురాణములు చెప్పుచుండెను. బౌద్ధజాతక గాథలు మనోజ్ఞవిధానమున ఉపన్యసింపుచుండెను. బుద్ధుడు విష్ణుని యవతార మని యాతని భావము. ఆ యవతారభావ మాతనిహృదయమున బ్రవేశపెట్టినది అమృత బాదార్హతులు.

చారుగుప్తుడు దారిపొడుగున చేసిన ప్రయాణసౌకర్యములు పరమా ద్భుతములు. రెండు లక్షల సైన్యము ఇంచుకంతైన శ్రమనందక ధాన్యకటక నగరమున నున్నట్లే సౌఖ్యములనందుచు బాణవేగమున సాగిపోవు చుండెను.

శ్రీముఖశాతవాహనుడు చారుగుప్తుని దూరాలోచనకు, ప్రజ్ఞకు, ఆతని తరుగని సంపదకు ఆనందము, నాశ్చర్యము నందుచుండెను.

కుంతిపురము ముహాచైత్యమున ప్రార్ధనలు సలిపిరి. సర్వసైన్యాధ్యక్షులగు స్వైత్రులవారు సార్వభౌముని బంగారుగుడారమునకు బోయి జయ నాదమొనర్చి సార్వభౌమునిచే చూపబడిన ఆసనమున అధివసించి, “మహాప్రభూ! మనము కళింగము పొలిమేర చేరునంతవరకు శత్రువులు మనపోకడ కనిపెట్టలేరు. కాని అక్కడనుండి విదేహమున కేగక ఉత్తరముగ బోయినచో వారికి నిజము తెలియదా” యని మనవి చేసికొనెను.

ఇంతలో మహామంత్రి అచీర్ణులు, చారుగుప్తుడు అచ్చటికి వచ్చి అనుమతినంది, యథోచితముగ బ్రవేశించి ఆసనము అలంకరించిరి.

స్వైత్రులవారు తమ అనుమానము వారికి వెల్లడించిరి.

చారు: తమకు అనుమానమెందుకు మహారాజా! వారిని నిజము తెలిసికొననిండు. పాటలీపుత్రమునందు ఏబదివేల సైన్యముమాత్ర మున్నదని మన వేగుకదా?

అచీర్ణుడు: ముట్టడించిన మనసైన్యమును, సుశర్మస్నేహితులు వచ్చి తాకరా?

చారు: అవుగాక, అందువలన భయమేమి? మన సైన్యముముందర ఆ వచ్చు సైన్యము లేపాటి వగును?

శ్రీముఖుడు: నిన్న ఉజ్జయిని వార్తనుబట్టి మనవేగులవారిదళములు కోటలోనికి చేరినవని తెలియవచ్చినది. పదునేనుదినములవరకు భయము లేదని శుకబాణుని వార్త.

29. ప్రయోగభంగము

“అగ్నిమీ ళే పురోహితం యజ్ఞ స్య దేవ మృత్విజమ్
హోతారాం రత్న ధాతమం.”

ఇట్టి మంత్రములతో అగ్నిని అర్చించి, ఇంద్రాదిదేవతలను ప్రార్థించి, స్థాలతిష్యుడు విషబాలను శ్రీకృష్ణసాతవాహనునిపై ప్రయోగించు హోమములు సలిపెను. ఆమె పద్మాసన పీఠముపై కూర్చుండియుండ మంత్రములతో ఆమెకు షోడశార్చన స్థాలతిష్యులు జరిపెను.

ఆమెలోనికి సర్వమృత్యువులు ఆహ్వానింపబడెను.

“నిన్ను జూచినంతనే జీవములు హత మొందును గాక.”

“నిన్ను స్పృశించినతోడనే మనుష్యులు బూదియైపోవుదురుగాక.”

“నిన్ను పొందుటతోడనే విగతజీవులై మనుష్యులు నశింతురుగాక.”

అను నర్థముగల మంత్రములు పఠించుచు స్థౌలతిష్యు డామెను ప్రయోగించ బోవుచుండ, ఆమె చివ్వున లేచినది.

“తాతగారూ! ప్రయోగించకుడు. నేను ఒప్పను. నేను మృత్యువును కాను” అని అరచినది.

ఆమె కన్నులలో గాఢవిషాదరేఖలు మబ్బులరీతి ప్రసరించినవి. ఆమె సుందరమైన పెదవులు వణకిపోవుచుండెను. ఆమె పిడికిళ్ళను గట్టిగా ముడుచుకొని హృదయమున కద్దుకొనియున్నది. శార్దూలమును జూచిన హరిణమువలె, పామును చూచిన కప్పవలె ఆమె గజగజ వణకి పోవుచుండెను.

ఈ ప్రయోగము జరుగు పూజామందిరమున, ఆ ప్రయోగపు తంతుకు వలయు బ్రాహ్మణులు మాత్రమున్నారు. గగని మొదలగు కాపాలికలున్నారు. ఇతరు లెవ్వరు నా మందిరమునలేరు. విషబాలమాటలు వినగానే స్థౌలతిష్యులు ప్రళయకాలరుద్రునిభంగి ఒక్కుమ్మడి లేచి జేవురించిన కనులతో క్రోధకంపితగాత్రుడై కాలా దేశమువలె దీర్ఘ మగు బాహువు చాచి,

“ఏమంటివి ఉత్పథచారిణీ!” అని లోకము లదరునట్లు కేక వైచినాడు.

“తాతగారూ! నన్ను ప్రయోగింపకుడు” అనుచు భయమును, దిరస్కారమును దోప విషబాల జాలిగొలుపుచు బలికినది.

“నేను ప్రయోగించెదను నీవు నాశనముచేయుదువు.”

“నన్ను నాశనముచేయుడు తాతగారూ!"

“మాటలాడకుము” ఆ స్థౌలతిష్యునికేక మిన్నుముట్టెను.

విషకన్య నిర్భయముగ నిలిచి, దండతాడిత భుజంగమువలె తాతగారి కేకకు మరియు నాగ్రహము నంది,

“తాతయ్యగారూ, నేనును మీవంటి మనుష్యబాలికను. నాకును కోపము, తాపము, ప్రేమ, జాలి, అన్నియు ఉన్నవి” అని ఆమె స్ఫుటాక్షరములుగా పలికినది.

కాపాలిక, గగనియు, అగస్తియు, కాశ్యపియు ఆ బాలికదగ్గరకు పరుగిడి వచ్చి“తల్లీ, తాతగారి ఆజ్ఞను పరిపాలించుము. ఈ కార్యములు మనుష్యు లొనరించునవి కావు. దైవకృతములు. దైవప్రీతికరములు. మనము వీని నడ్డ తగదు” అనిరి.

విషకన్యక వారిని విదలించుకొని పద్మపీఠమునుండి దిగి, గబగబ పరుగిడిపోయి “యీ సర్వమును సృష్టించిన ఓ భగవంతుడా, ఓ మహేశ్వరుడా, నీ ప్రీతికొరకా నేను మనుష్యులను చంపవలసినది! నీవు పుట్టించిన మనుష్యులను నీవే చంపి తిందువా? ఈ యకార్యమునకు సాధనమగుటకు నే నేమి జడమునా? నేను ప్రేమించగలను, ద్వేషించగలను. నావలచిన పురుషుని నేను స్పృశింపగూడదా! స్త్రీజన సామాన్యమగు యీ సుఖమునకు నేను దగనా! ప్రేమించిన పురుషుడు నన్ను ముట్టుకొన నొల్లను. నాపై దురాక్రమణము సేయువాడు హతుడైన నగుగాక. ఎవరో శ్రీకృష్ణ శాతవాహనుని చంపుటకు నన్ను ప్రయోగముచేయుచున్నారట. ఆతడు నన్ను ముట్టుకొనుటకు నాకు ఇష్టము అగునో, యిష్టముకాదో? నాకిష్టమైనను అతడు నన్ను ముట్టుకొని చచ్చిపోవును గదా! ఆతని నేను వలతునేని నీవే యాతనికి రక్షకుడవు గమ్ము.”

ఆమె కన్నుల నీరు నీలి కలువపూవులలో నిలచిన హిమబిందువులైనవి.

“నీవు ఫాలలోచనుడవు. నీవు నీ ఫాలలోచనముతో దుర్మార్గులను భస్మము చేయుదువట. అబలయగు బాలికచే మనుష్యులను చంపుట కంటె నీకు మార్గమేలేదా? నాగొంతు గోసినకాని యీ దారుణకర్మము నెరవేరదా? ఉమాపతీ! నాకు బతిభిక్ష పెట్టుము. నన్ను పాషాణమునైన చేయుము లేదా నాస్త్రీత్వమును సార్థక మొనర్పుము. నాకు భర్తను, బిడ్డలను అనుగ్రహింపుము.”

విషకన్యక వెక్కి వెక్కి ఏడ్చినది. స్థౌలతిష్యుడు మారుమాటాడక గగని మొదలగు వారిని వెనుకకుపొండని సైగ నొనర్చి విగ్రహము మ్రోల బడియున్న విషకన్యకపై మంత్రజలములు చల్లి “శ్రీకృష్ణశాతవాహన నాశనమునకై యీ బాలికను ప్రయోగించు చున్నాను” అనుచు అగ్ని హోత్రమున సమిధలు, నేయి హోమమొనర్చెను.

మహేశ్వర విగ్రహ సమీపమం దున్న దీపములన్నియు ఒక్కసారి ఆరిపోయినవి. ఆరిపోయిన దీపపు కొడులనుండి పొగలొక్కసారిగా పైకెగసినవి. స్థౌలతిష్యుడు రిచ్చవడి నిలిచెను, పూర్ణాహుతిని మంత్రవేత్తలు అర్పించిరి. మంత్రాగ్నికిని, భగవంతునకును నీరాజనము సమర్పింపబడినది. జేగంటలు మ్రోగినవి. స్థౌలతిష్యుడు అచ్చటినుండి వెడలిపోయెను.

విషకన్యక చైతన్యరహితయై సర్వమును మరచి ఆ విగ్రహము మ్రోల పడియుండెను. ఆమె చేతులా శివలింగమును చుట్టియున్నవి. భయంకరుడైన మృత్యుదేవునకు భయపడిన బాలకుడగు మార్కండేయునివలె విషకన్య కాల కాలుడైన శివునే శరణుజొచ్చినట్టయినది.

యుగయుగాలనుండి వచ్చు ఆర్యర్షి ప్రతిభా ప్రవాహమున పుట్టి పెరిగిన కమల మా బాలిక. ఆమెలోని చైతన్య మొక్కపరి స్పందించినది. వ్యక్తావ్యక్తమై ఆమె జ్ఞానము వికసించినది. సర్వభూషణాలంకృతయై, దుకూలాంబర ధారిణియై, విరచితద్వివేణియై, దహింపబడిన మన్మథునిసతి రతీదేవివలె ఆమె అచ్చట పడియుండెను.

తమోమయమైన ఆమె అంతరాకాశమునందు చీకట్లు కదలినవి. దూరదూరమున ఎచ్చటనో మిణ్కుమిణ్కుమను కాంతి కన్పించినది. ఆ వెలుగు పెరిగి పెరిగి శీతలప్రసన్న ద్యుతులు వెదజల్లుచు తనగర్భమున దాగియున్న బాలేందు శేఖరునిమూర్తిని స్పష్టమొనరించినది. అతడు తియ్యని మాటల,

“చంద్రబాలా! నీవు నాశరణుజొచ్చితివి. నీవు నేటినుండి అమృత కలశవిగాని మృత్యుశిలవు గావు. బుద్ధుడేమి, వీరుడేమి ఎవరైనను నా ఛాయలు మాత్రమే. ఇవియన్నియు నావిలాసములు. అనుగ్రహింపబడితివి పొమ్ము” అనుమాటలు ఆమెకు వినంబడి నట్లయినది.

విషకన్య చటుక్కున లేచినది. చిరునవ్వు ఆ మోమున శాంతద్యుతు లీనినది. ఆమె లేచి తలవంచుకొని బసలోనికి నడచిపోయినది. ఆమె వెను వెంటనే గగనియు కాశ్యపియు వెడలిపోయినారు.

30. పరాస్కంధము

సువర్ణశ్రీ మనస్సునకు ఊరటలేదు. వేదనాదోదూయమానమగు మనస్సులో, బుద్ధిలో, హృదయములో ప్రళయకాల ప్రభంజనములు, ఎడతెరిపి లేని బడబానల దావానలములు నెసరేగుచున్నను మహాగ్నిగర్భమగు పర్వతమువలె పైకి శాంతుడై నిర్వికారునివలె తిరిగి ఇంటికి విచ్చేసెను.

ఆ గ్రీష్మదినమున ధాన్యకటకము మరియు మండిపోవుచున్నది. సాయంకాలమైనను మలయానిలములు తిరుగలేదు. నగరవాసులందరు గృహముల నుండలేక నదియొడ్డుకు పోవువారును, ఉద్యానవనముల కేళాకూళులకడ గూర్చుండు వారును, శీతలోపచారములు చేసికొనువారు నై యుండిరి.

క్రిందటిదినముననే ధాన్యకటకముచేరిన సువర్ణశ్రీ సాయంకాలమున కృష్ణా తీరమున సంచరింపుచు ఇంటికిపోవు హర్షగోపుని దూరమున జూచినాడు. ఆ హర్షగోపుని బిలిచి మాటలాడవలయు నను కాంక్ష సువర్ణునకు పొడమినది గాని సిగ్గుపడి అటులనే నడచిపోయినాడు. మరునాడు ఉదయమున సువర్ణశ్రీకుమారుడు లేచి పెఱుగులో వెన్న తీయించుచున్న తల్లికడకు వెళ్ళినాడు.  “అమ్మా చిన్నమామయ్య ఒకటి, రెండు నెలలో సముద్రప్రయాణము చేసి సువర్ణ దీపముదాటి యవద్వీపమునకుపోవునట. అచట జయశ్రీ శాతవాహన మహారాజు ఒక మహాచైత్యము నిర్మింపజేయ నున్నాడట. ఆ చైత్య నిర్మాణశిల్పి కులపతిగా చిన్న మామయ్యను సగౌరవముగ మహారాజు ఆహ్వానించెనట. నేను మామయ్యతో యవద్వీపముపోవ సంకల్పించు కొన్నాను.”

“అమ్మయ్యో, సముద్ర ప్రయాణమే! మా తమ్ముడు వెళ్ళుటయే? వాడు వట్టి వెఱ్ఱివాడు. వెళ్ళవద్దని మీ అక్క ఆజ్ఞ యిచ్చుచున్నదని చిన్న మామయ్యకు తక్షణము లేఖ వ్రాసి గజవార్త పంపుము.”

“సముద్రయానమంటే అంతభయ మేటి కమ్మా? దివ్యశ్రీ సంఘ మిత్రా దేవి ధర్మము దిశలన్నియు ప్రసరింపజేయ సింహళాది ద్వీపములకు పోలేదా?”

“బాబూ! యీ వెఱ్ఱిమాటలు మాటలాడకు. నీకు దేశములే తిరుగ వలయునన్న గయాది క్షేత్రములకు పొమ్ము.”

“మెట్ట ప్రయాణము ముసలమ్మ చేయగలదు. ఓడ ప్రయాణము భయమా? ఏదో ఒకటో రెండో తప్ప తక్కిన ఓడలన్నియు సురక్షితముగ ప్రయాణము సాగించుటలేదా అమ్మా!”

“నిన్నమీనాయనగారు పంపిన ఉత్తరము చూచినావుకదూ నాన్నా?”

ఇంతలో మహాలి వేగమున వెల్లనగుమోమున అచ్చటకు పరువిడి వచ్చినది, ఆమెకు మాటరాలేదు. “హిమబిందు.....” అని కేకవేసినది. శక్తిమతియు, సువర్ణశ్రీ కుమారుడును ఇరువురు నులికిపడిరి. సువర్ణుని గుండె కొట్టుకొన్నది. ఏ మది! ఆమె వచ్చుచున్నదా?

శక్తి: హిమబిందు....

మహాలి: దొంగలు ఎత్తుకొనిపోయినారు.

సువర్ణ: (పెద్దగొంతుకతో) ఎవరిని?

మహాలి: హిమబిందును!

శక్తిమతి: ఎవరినీ?

మహాలి: హిమబిందునమ్మా! చారుగుప్తులవారి కూతురును!

సువర్ణ: ఓసి నీ ఇల్లు బంగారముకానూ! వెఱ్ఱి వెఱ్ఱి మాటలు మాటాడక తిన్నగా చెప్పు.

మహాలి: కాదమ్మా, నిన్నరాత్రి యెనిమిదినాళికలు మ్రోగినప్పుడు.... ఎలా వచ్చారో.....హిమబిందుకుమారికను దొంగలు ఎత్తుకొనిపోయినారట!

శక్తిమతి: ఆఁ! ఆఁ! ఎంత విడ్డూరం!

మహాలి: ఆమెను, ఆమె ముత్తవతల్లినికూడా ఎత్తుకొనిపోయి నారట.

శక్తిమతి: బాబూ! అది యేమిటో తిన్నగా కనుక్కురా! ఏమిటో అంటుంది. అక్కడ సువర్ణశ్రీ కుమారుడు లేనేలేడు.

శక్తిమతి: అప్పుడే తుఱ్ఱున మాయమయినాడు. చెప్పినది నిజమేనా?

మహాలి: ఒట్టుతల్లీ! పట్టణమంతయు గోలగా చెప్పుకుంటున్నారు.

సువర్ణశ్రీ కుమారుడు చారుగుప్తునిభవనమున నొక్కయంగలో వ్రాలినాడు. జనులు ఇసుకరాలనట్లు అక్కడ మూగియుండిరి. రక్షకభటులు కావలియున్న చారుగుప్తుని భవన మెట్లు చేరిరని కొందరు, కక్ష్యాంతరము లన్నియు గడచి వారు లోనికెట్లు వెళ్ళిరని కొందరు, నగలు నాణెములు ధనధాన్యములతో తులదూగు నాభవనముల చారుగుప్తుని కుమార్తెను, ఆమె ముత్తవను తస్కరించుట కడు విచిత్రమని మరికొందరు, ఇది ఆంధ్ర రాజ్యశత్రువులు సల్పిన కుట్రయని కొందరు, చారుగుప్తునికడ వెల లేని ధనముల సంగ్రహింప మేధావులగు చోర శిఖామణు లొనరించిన కార్య మిదియని కొందరు, చారుగుప్తుని విరోధులెవ్వరో రచించిన మాయ యిది యని కొందరు పరిపరి విధముల చెప్పుకొనుచుండిరి.

పట్టణము కాపాడుచున్న ఉపసైన్యాధ్యక్షుడు కొందరు చమూపతులతో, చారులతో వచ్చియున్నాడు. సువర్ణశ్రీ కుమారుడు నెమ్మదిగా జన సమ్మర్థము ఒత్తించుకొనుచు భవనగోపుర ద్వారముకడకు చేరినాడు. లోనికి వెళ్ళుటకు ప్రయత్నింప ద్వారమున కావలిగాయు సైనికులు అడ్డగించిరి. అతనికి కోపము వచ్చినది.

“ఉపసైన్యాధ్యక్షులతో ధర్మనందులవారి పుత్రుడు సువర్ణశ్రీ వచ్చినాడని చెప్పుడు.”

భటుడు: ఇపుడు వీలుపడదు. కొంచెము తాళుడు. లోన నేమి జరుగుచున్నదో చూచుటకు కుతూహలము పడుచున్న జనులందరు సువర్ణశ్రీ కుమారుని చుట్టును మూగి లోనికి పోనిండని కేకలిడిరి.

ఈ గడబిడ విని యచ్చట తిరుగాడుచున్న దళవాయి యొక డక్కడకు వచ్చెను. అతడు సువర్ణశ్రీకుమారుని గని గురుతుపట్టి లోనికి తీసి కొనిపోయెను. సువర్ణశ్రీకుమారుడు కక్ష్యంతరములు గడచి బాలనాగితో నుపాధ్యక్షు లగు కాకుండకులవారు మాట్లాడుట చూచెను. బాలనాగి యేమో చెప్పుచుండెను.

బాల: మేమిద్దరము చాలాకాలము మాట్లాడుకొనుచు ఆ తోటలో నుంటిమి. ఇంతలో రివ్వుమని నలుగురుమనుష్యులు వచ్చి గుడ్డలు మాముఖములగప్పి నోట గుడ్డలు కుక్కినారు. నాకు మతి తప్పిపోయినది. మరల మెలకువ వచ్చి చూచునప్పటికి నేనా ప్రదేశముననే పడియుంటిని. నా నోట గుడ్డలున్నవి. కన్నులువిప్పి చూతునుకదా హిమబిందుకుమారిక చుట్టుప్రక్కల నెక్కడను లేదు. తూర్పు తెలతెలవారుచున్నది. భయముతో బెద్దకేకలు పెట్టితిని. తోటపనివారు, రక్షకభటులు, కొందరు దాదులు పరుగెత్తుకొని వచ్చినారు. వారితో హిమబిందు కుమారిక ఏదని అడిగితిని. వారు “నీకు మతిపోయినదా! పడకగదిలోనే యుండును. ఏల నీ వీ కేకలు పెట్టుచున్నా” వని అడిగిరి. పరుగుపరుగున అభ్యంతర మందిరమునకు పోయితిని. ఆమె అచ్చటలేదు. వేసినపక్క వేసినట్లే ఉన్నది. పరుగెత్తుచునే రాత్రి జరిగిన సంగతులందరికి చెప్పుచుంటిని. దాదు లిటునటు పరుగెత్తిరి. ఆమె యెక్కడను లేదు. ముక్తావళీ దేవిగారును కన్పింప లేదు. వారితో చెప్పుటకు వగర్చుచు వారి శయనాగారమునకు పోవ అక్కడ తెరలు చిందరవందరగా నుండెను. రత్నకంబళిపై బురదతో ఉన్న అడుగుల చిన్నెలు కాన్పించినవి. ఇరువురిని చోరు లెత్తుకొని పోయినారని గగ్గోలు బయలు దేరినది.

కాకుం: భవనోద్యానవనములో నే వైపున ఇది జరిగినది?

బాల: ఉత్తరమున మాలతీలత పొదరిండ్లకడనున్న చంద్రశిలావేదిక పక్కనున్న లతామంటపములో కూర్చుండియుంటిమి.

సువర్ణశ్రీ కుమారుడచ్చటికి బరువిడెను. అచ్చట చిందరవందరగా అడుగుల జాడలు కాన్పించినవి. అయ్యవి కోటగోడవలెనున్న భవన బాహ్యకుడ్యములవరకు నున్నవి. అచ్చట హిమబిందు వస్త్రమునుండి చిరిగినముక్క కన్పించినది. అప్పు డక్కడ కొందరు భటులు నొకమంత్రియు నుండిరి. సువర్ణశ్రీ అమితవేగమున సింహద్వారము వెంబడి భవనకుడ్యములచుట్టి, యెచ్చటనుండి చోరులు గోడ దాటిరో అచ్చటకు వచ్చెను. అచ్చట జనములు ప్రోవైయుండిరి. ఆతడు నెమ్మదిగా అడుగులజాడ తీయుచున్న ఒక వర్తకశ్రేష్ఠుని, ఒక చమూపతిని సమీపించి వారిరువురు అనుకొన్న మాటల వినియెను.

చమూ: ఈ జాడలు కృష్ణ ఒడ్డువరకు నున్నవట.

వర్తక: అంచె గుర్రములమీద హుటాహుటిగా పోయి యుందురు.

చమూ: మహామాయాధురంధరు లగు వేగువాండ్రు జాడ నరయుటకై సాగిపోయినారు. చారుగుప్తుని అశ్వశాలలో ప్రసిద్ధాశ్వముల నెక్కి దళవాయులు కొందరు వారిని వెంబడించినారు.


31. చంద్రస్వామి

చంద్రస్వామి స్వచ్ఛహృదయము గల వ్యాఘ్రదేశాంధ్ర బ్రాహ్మణుడు. త్రయీపాఠి. దార్శనికుడు. వేదాంతి.

చంద్రస్వామి హృదయమును స్థౌలతిష్యమహర్షి చూరగొన్నాడు. ఆ మహర్షి మహత్తర సంకల్పము చంద్రస్వామిని ఉత్తేజితునొనరించి, స్థౌలతిష్యుని అనుచరులలో నాయకుని చేసినది. స్థౌలతిష్యునకు చంద్రస్వామి గుణగణములు తెలియును. ఆతని మనస్సు మెత్తనయనియు, రహస్యములు దాచుకోలేని దనియు ఆయన గ్రహించినారు. కావున చంద్రస్వామి పండితులను స్థౌలతిష్యులు అత్యంత రహస్యాలోచనలకు రానిచ్చువారు కారు.

చంద్రస్వామి స్థౌలతిష్యమహర్షి మహాత్మ్య మెరుగును. జంబూద్వీపమున గల బ్రాహ్మణులు ఆ మహర్షిని శంకరావతారమనియే ఎంచుకొనుచుండిరి. ఆయన పేరు వివిధ ఋష్యాశ్రమముల వివిధనగరగ్రామ బ్రాహ్మణగృహముల అత్యంత భక్తితో స్మరింప బడునది. స్థౌలతిష్యుని శిష్యులు దేశదేశముల మహోద్ధండపండితులై, వివిధవేదాశ్రమముల కులపతులై, ఆ మహర్షి బోధనల, ప్రచారముచేయుచుండిరి. ఒక్కొక్క అర్హతుని ఒక్కొక్క మహాపండితుడు తారసిల్లి బౌద్ధధర్మము నిరసింపుచు, వాదనకు వారిని పురికొల్పి నిరుత్తరులను చేయుచుండెను.

చంద్రస్వామి స్థౌలతిష్యమహర్షి ఆజ్ఞలు గాఢాభిమానమున శ్రద్ధతో నిర్వహించు చుండెను.

చంద్రస్వామిని అనార్షవాదులతో వాదనకై మాత్రము స్థౌలతిష్యుడు నియమించెను. అతని అనుమానించి ఆంధ్రాపసర్పులు మహామంత్రికి నివేదించుటయు, వారు చక్రవర్తికి తెలిపిరి, చక్రవర్తియు చంద్రస్వామిని బంధించి, అతనిపై నేర మారోపించి శిక్షవిధింప వలయునని ముదల నిచ్చిరి.

చంద్రస్వామి ద్రోహి యని మనచక్రవర్తికి నమ్మకము కుదరలేదు. చక్రవర్తి అమృతపాదులకడకు పోయి తమ యనుమానములు తెలిపినారు. అప్పుడా అర్హతలు చంద్రస్వామి చరిత్రనంతయు ఆకళించి ఆతడు నేరస్థుడు కాడనియు చక్రవర్తి అతనిశిక్షను రద్దుచేయించవలయు ననియు దెలిపిరి. ప్రాడ్వివాకులు శిక్ష విధించుటయు, అమృతపాదులు వచ్చి చక్రవర్తి ఆజ్ఞాపత్రముచూపి చంద్రస్వామిని తీసికొనిపోయినారు.  చంద్రస్వామి ప్రాణమునకు భయపడలేదు, కారాగారవాసమునకు భయపడలేదు. అమృతపాదులను చూడగనె చంద్రస్వామికి స్థౌలతిష్యులను జూచిన గురుభక్తి కలిగినది.

అమృతపాదులు ధాన్యకటక మహాచైత్య సంఘారామమునకు చంద్రస్వామిని గొనిపోయిరి.

ఎవరీ మహాపురుషుఁడు! మూర్తినందిన శాంతతేజస్సున ఈ బౌద్ధాచార్యులు అపరబుద్ధ దేవునివలె నున్నారు. ఈ పుణ్యపురుషుని చూచిన తన గురుపాదులగు మహర్షిని చూచినట్లున్న దేమి! వీరికిని వారికి పోలికలున్నవి. ఎత్తు, మోముతీరు, కనులు, కంఠస్వరము, రూపము ఇంత పోలికలున్న మేమి! మహాపురుషులు ఆర్షధర్ములైననేమి, బౌద్ధధర్ములైన నేమి - ఒకే రూపమున నుందురు గాబోలునని చంద్రస్వామి తలపోసెను.

కులభేదములేని బౌద్ధాశ్రమమున చంద్రస్వామి భిక్కులతో కలిసి భోజన మాచరింపక తనవంట తాను చేసికొనుచుండెను. చంద్రస్వామికిని అమృత పాదార్హతులకును దీర్ఘమగు వాదోపవాదములు జరుగుచుండెను. చంద్రస్వామి బోధిసత్వునిజీవిత మొక్కపరి సంపూర్ణముగ పరిశీలించి చూచెను. శాక్యవంశోద్భవుడై, కపిలవస్తునగరమున రాజగు శుద్ధోదనునకు మాయాదేవివలన జన్మించిన దివ్యపురుషుడు. మాయాదేవి సుప్రబుద్ధుని తనయ. సిద్ధార్థుడు జన్మించిన ఏడవదినమున మాయాదేవి నిర్యాణ మందినది. ఆ బోధిసత్వుని అత్యంత జాగరూకతగ మేనయత్త ప్రజాపతి గౌతమి పెంచినది. అతని పదునారవఏట తనయీడుది, జగదేకసుందరి కొలిరాజ్యాధిపునితనయ యశోధరను బోధిసత్వునికి వివాహము సలిపిరి. బోధిసత్వుని ఇరువదవఏట రాహులుడను పుత్రుడాయన కుద్భవించెను.

ఇరువది ఐదవఏడువచ్చు నంతవరకు సిద్ధార్థుడు భార్యతో, తనయునితో సర్వసౌఖ్యముల నందుచుండెను. కాని విధివశమున ఆ మహాపురుషుడు ప్రపంచబాధలును, దుఃఖమును తన కండ్లారచూచి అనంతవిచారము నందెను.

ఆయన హృదయమున దివ్యసందేశము వినవచ్చినది. సూతుడగుచెన్నుని సహాయమున ఆ దివ్యమూర్తి అభినిష్క్రమణ మొనర్చి, వైశాలిచేరి, పండితుల నాశ్రయించి సృష్టి రహస్యముల నెరుగజొచ్చెను. ఆచటి కాలామ పండితులు కపిలమహర్షి ప్రతిపాదించిన సాంఖ్యవాదమును బోధించిరి.

ఆయన పాదములకడ సంఖ్యము చదివి బోధిసత్వుడు ఉద్రకరామపుత్రమహా పండితుల శిష్యుడయ్యెను. రామపుత్ర పండితులు కాణాద వైశేషికము బోధించిరి.

అచ్చట వైశేషికమంతయు నభ్యసించినవెనుక బోధిసత్వుడు గయకడ ఉరు బిల్వాశ్రమము చేరి, ఆ ఆశ్రమకులపతి యగు కౌండిన్యమహర్షి శిష్యుడై యోగము నేర్చుకొన నారంభించెను.

ఆయన యోగసమాధులలో ఉండునప్పుడు నైరంజన నదిలో స్నానము చేయుచు అధిక నీరసముచే మూర్ఛపోవునంత పని అయి ఒడ్డుకు వచ్చి సొమ్మసిలి పడిపోయెను. అప్పుడే సుజాత బోధిసత్వుని రక్షించెను. అప్పుడు బోధిసత్వు డాయోగవిధానము విసర్జించెను.

ఆ ఆశ్రమప్రాంతమందొక రావిచెట్టున్నది. ఒక దివ్యాతిదివ్య ముహూర్తమున ఆ రావిచెట్టు క్రింద పద్మాసనబద్ధుడై బోధిసత్వుడు పరమ సత్యముల కనుంగొనెను.

చంద్రస్వామి ఇట్లు బుద్ధచరిత్రయంతయు తెలిసికొనెను.

32. ఆంధ్ర బ్రహ్మర్షి

స్థౌలతిష్యులవారు చంద్రస్వామి విషయమంతయు ఎప్పటికప్పుడు తెలుసుకొనుచు నేయున్నారు. చంద్రస్వామి బౌద్ధశ్రమణకులకడ బౌద్ధ ధర్మములు నేర్చుకొనుచు, ఆర్షధర్మము విడనాడకయే మెలగుచుండె నని తెలిసికొనెను.

స్థౌలతిష్యుడు ప్రతిష్ఠానపుర ప్రాంతాశ్రమము చేరుకున్నను ప్రియశిష్యుడగు చంద్రస్వామిని గూర్చియే యాలోచించుకొనుచుండెను.

స్థౌలతిష్యుడు పదిసంవత్సరములలో ఆర్యావర్తము, దక్షిణాపథము, సువర్ణద్వీపము, గాంధార, బాహ్లిక, తురష్క పారశీకాది దేశములన్నియు సంచారము చేసి, కాశ్యపుల, కౌండిన్యుల, పారాశర్యుల ఓడించి వారినందరిని అద్వైతవాదుల నొనరించి, ఆశ్రమముల స్థాపన మొనరించి, పండితోత్తముల కులపతుల నొనర్చెను.

చంద్రస్వామి బౌద్ధ గ్రంథముల కంఠపాఠమొనర్చెను గాని, హృదయస్థము గావించుకొనలేదు. బౌద్ధధర్మముల నిరసింపవలయు నని ఆతని పూనిక. అమృతపాదార్హతుల ఆశ్రమము ప్రవేశించి బుద్ధధర్మతత్వము నెరుంగ జొచ్చిననాటినుండియు ఆతని దృష్టి మారిపోయెను.

“పండితులవారూ! మీగురు వగు స్థౌలతిష్యమహర్షి తమధర్మము సత్య మనియు పరధర్మము భయావహ మనియు ఎంచుటచేతనే పరధర్మావలంబుల జయించి తనధర్మము నెలకొల్పనెంచెను.”

“స్వామీ! ఒక క్రూరమృగము, గోవు మొదలగు సాధుమృగముల చంపబోవుచుండ మనము చూచితిమి. ఆ క్రూరమృగమును మనము నిర్జింపవలయునా, వలదా?”

“మీరు క్రూరమృగమును నిర్జింప నవసరము లేదు. మనుష్యుడు సంపూర్ణముగ అష్టమార్గావలంబియైనచో ఆతని ప్రేమ క్రూరమృగములోని క్రూరత్వమును నాశనము చేయగలదు.”

“అందరు అష్టమార్గావలంబన చేయగలరా స్వామీ?”

“ఎందుకు చేయలేరు? తక్కిన మ్లేచ్ఛదేశములకన్ననిచట సంస్కారము, జ్ఞానము, దయాసత్యశౌచాదులు ఎక్కువగా నున్నవి కాదా?”

“జంబూద్వీపమున ఇంకను ఋషులసంతతు లున్నవికదా?”

“ఇతర ద్వీపములవారు ఎవరిసంతతి? ఆస్తికులందరును భగవంతుని సంతతియేకదా?”

“అందు భగవంతుని ముఖమునుండి జనించినవారు బ్రాహ్మణులు!”

“మ్లేచ్ఛులు స్వేదమునుండియో, పాదనఖములనుండియో జనించిరి కాబోలు నేమి?"

“కావచ్చును.”

“కావచ్చునా పండితులవారూ? ఒకసారి బ్రహ్మముఖమునుండి ఇంతమందియని లెక్కప్రకారము బ్రహ్మర్షులు జన్మించినారు కాబోలు! వారు ఇతర ధర్మములపాలయినచో పాదజులయి పోవుదురు కాబోలు? శుద్ధ బ్రహ్మము రూప, నామ, గుణాతీతముకదా, ఉపనిషన్మత ప్రకారము? అట్టిది బ్రహ్మయేమి, విష్ణువేమి? వీ రెటుల వచ్చిరి? కావున బ్రహ్మవాద మటులుంచి ఉన్న యీ దుఃఖమయప్రపంచముననున్న దుఃఖము సమసి పోవుటకు అష్టమార్గము తథాగతు లుపదేశించిరి.”

“స్వామీ! బుద్ధధర్మమునందును సాంఘిక, స్థవిర, చైత్యాదివాదములు వచ్చిన కారణమేమి?”

“ప్రపంచమున ఇట్టివాదములు సర్వకాలముల నుద్భవించుచునే యుండును. సమన్వయము చేసికొనుటయే మానవునివిధి. సర్వధర్మములకు మూలమగు కార్య కారణభావములు గ్రహించినవారికి భేదదృష్టియుండదు.”

ఈ విధము లగు వాదనలు అమృతపాదార్హతులతో సలిపి సలిపి, అష్ట మార్గములలో ప్రేమ అత్యంత శక్తివంతమైనదని నమ్మి సర్వభావములకు, సర్వ ధర్మములకు ఆతడు సమన్వయముచేయ సంకల్పించెను.

బ్రహ్మపదార్థము నొప్పుకొనని వైశేషికము అర్థముకాలేదా? వైశేషికము, సాంఖ్యము, ఉత్తర పూర్వమీమాంసలను ఆర్షధర్మవాదులు సమన్వయము చేసికొనిరికదా? శ్రీకృష్ణ భగవానుడు గీతలయందదియే యుపదేశించెనుగదా? వివిధములైన ఇట్టి యాలోచనలు చంద్రస్వామి నావరించెను. స్వభావ విహితమే స్వధర్మ మనియు, తద్విరుద్ధము పరధర్మ మనియు నిశ్చయించెను. ఆతడు చక్రవర్తికి, సామ్రాజ్ఞికి క్రమముగా సన్నిహితుడై పోయెను.

స్థౌలతిష్యమహర్షికి చంద్రస్వామిచరిత్ర ఎప్పటికప్పుడు తెలియుచునే యున్నది. చంద్రస్వామి అమృతపాదార్హతుల బోధనలకు లోనై తన కర్మకాండలో కొలదిగ మార్పులు తెచ్చుకొనుచున్నాడని తెలియవచ్చెను. చంద్రస్వామి బోధనలచే బౌద్ధసన్యాసుల హృదయములును కొంత కొంత మారుచుండవచ్చును. సద్భావసౌజన్యము లున్నచో అన్నియు సమన్వయ మగును గాబోలు.

ఈ ఆలోచనలతో నా మహర్షి కృష్ణాజినముపై అధివసించి యుండెను.

ఆతనిమహాదృష్టిలో ఆర్షధర్మవ్యతిరేకు లగువారు నాశనమై, ఆర్ష ధర్మము నాలుగు పాదముల నడచును. వైదికధర్మాచరణముచే మనుజులే దేవతా స్వరూపులగుదురు. అట్టి ధర్మప్రచారమే ఆతని తపస్సు. అనార్ష ధర్మనాశనమే ఆతనిదీక్ష.

గంగోత్రి, యమునోత్రి, సింధునదీ జన్మస్థానము, మానససరోవరము, కైలాస పాదములమ్రోల తాను పెక్కు సంవత్సరములు తపస్సు చేసినాడు. నేడు తనసంకల్పము ఈడేరకుండుటెట్లు? జంబూద్వీపమునకు పరిత్రాణము కాకుండు టెట్లు?

చారుగుప్తుడెట్లు బంగారు రాసులు కొండలు కట్టించెనో, స్థౌలతిష్యుడట్లు తన సంకల్పసిద్ధికై కొండలు త్రవ్వించి బంగారమును ప్రోవుచేసెను.

ఆతడు త్రివిష్టపమునను, గంగోత్రిప్రాంతమునను బంగారుగనులు త్రవ్వించెను. కైలాస ప్రాంతీయులైన యక్షు లాతనితో బంగారువర్తకము చేయువారు భక్తులగు వణిక్ శ్రేష్ఠులు, మహారాజులు స్థౌలతిష్యుని వివిధా శ్రమముల ధనరాసులు పోయుచుండిరి. ఈ లెక్కలేని ధనసహాయముచే నాతని యాశ్రమముల మనుష్య, పశువైద్యములు నిర్విరామముగ నడచుచుండెను. ధాన్యకటకమున నమరేశ్వరునకు ఉత్తుంగదేవాలయము నాతడు నిర్మించెను. ఆంధ్రదేశ మెల్లెడల నూతన దేవాలయముల బ్రతిష్టచేసెను. బహుళ మగు నిట్టి ధర్మస్థాపన కార్యముల చేయుచుండినను స్థౌలతిష్య మహర్షి ఆలోచనలన్నియు తనమనుమరాలు విషబాలిక పైనే యున్నవి. ఆ విషబాలిక తండ్రియగు తనకొమరుడు అకాలమృత్యువశు డాయెను.

విషకన్యక ఏ మహాకార్యమునకై తనయజ్ఞమున సమిధ కానున్నదో యా కార్యము సఫలమగునా? ఈ ప్రశ్నయే యా మహర్షి హృదయమున జాగరిత మగుచుండెను.


33. నాగబంధునికా హృదయము

నాగబంధునిక సంపూర్ణారోగ్యసమన్వితయై నయోషారత్నము. ఆమె కృష్ణానదిని వరదలుపొంగి పరవళ్ళెత్తిపోవుచున్నను అన్నగారితో సమముగ నీదగలదు. గుఱ్ఱపు పందెమున అన్నగారితో సమముగ పరుగెత్తగలదు. తమ ఇంటనే పెరుగుచు తనకు చిన్నన్నవలె నున్న మహాబల గోండు యువరాజుకడ ఆటవిక విద్య నాగబంధునిక అభ్యసించి, అడవులలో సంచరించు మృగములజాడ తీయుటలో, పక్షులకూతల వైచిత్రములన్నియు నవలీలగ చెప్పుకొనుటలో మేటియైనది. అన్నగారితోబాటు చిత్రలేఖనము నేర్చుకొన్నది. సంగీతమున గాత్రగాన మనిన ఆమెకు ఎంతయో ఇష్టము. వీణాదులు తాను వాయింపననియు, అన్నయ, సెల్లెలును వాయించుచుండ విని సంతసింతుననియు నా బాల వచించుచుండును.

మిక్కిలి కోలమోమున విశాల నేత్రములు, సమనాసిక, గంభీర చిబుకము గాంచినచో సువర్ణశ్రీయే పురుషవేషము వేసినా డను భ్రమ కల్పించును.

ఆ బాలిక సూక్ష్మబుద్ధి. ఆమెకు మైత్రేయి, గార్గి, సంఘమిత్రలనిన గౌరవము, సత్యభామ యనిన పరమప్రీతి. స్త్రీ కత్తిపట్టిన గాని లోకమున దుఃఖము నశించ దనును. అన్నతో వాదులాడుచునే ఆ బాలిక పెరిగినది.

స్త్రీ ప్రేమించును. తల్లి యగును. కాని ప్రేమమాత్రజీవన యగు బాలిక స్త్రీ మాత్ర మగునని ఆమె అన్నతో వాదించును.

“స్త్రీవంటి పురుషుడు, పురుషునివంటి స్త్రీయు రోతపుట్టింపరా చెల్లీ!”

“ఓయి వెఱ్ఱి అన్నా, పురుషు డన కారము తినువాడును, స్త్రీయనిన వెన్న తినునదియు అని నీ అభిప్రాయముకాబోలు!”

“అదికాదయ్యా చెల్లిగారూ! స్త్రీ యన పెద్దపులియు, పురషుడన పిల్లియు కావలె నని నీ భావము కాబోలు!”

“అవునుకాబోలు! కాబోలో అనబోలో కాని, ఆడుపులి ఉండకూడదా? వృషభము ఉండకూడదా?”

“అన్నియు ఉన్నవి.”

“కనుకనే స్త్రీయందు కొంత కర్కశత్వ ముండవలయు నని నామతం. మనదేశమునందు స్త్రీలు అలంకారప్రియులు మాత్రమే. పురుషుడు మాత్రము వీరవిహారముల కర్హుడగు నని తలంచుట అనర్ధదాయకము కాదా అన్నా?”

ఇట్టివాదనలు చెల్లెలికి అన్నకును ఎప్పుడును జరుగుచుండెడివి. ఆ స్థితిలో నాగబంధునిక సమదర్శిశాతవాహనుని అన్నతో బండిపందెముల సమయమున చూచినది. సమదర్శిశాతవాహనుడు ఆంధ్రవీరు డని, ఉత్తమ పురుషు డనియు నామె తలంచినది. అన్నబండి నాతడు రజ్జువుచే పడవేయ సంకల్పించినాడు. అది అందరును కనిపెట్టలేక పోయిరి. కాశీఘాతముచే అన్న సమదర్శి ఆగడము మాన్పుటయు నామె గమనించెను. అప్పుడామెకు సమదర్శి యనిన మిక్కుటమగు కోపము కలిగినది. తాను పందెముల రంగస్థలములలోని కురికి యా వీరుని కండతుండెములుగ నరికి వేయవలయునని బుద్ధి కలిగినది.

అన్నగారి విజయోత్సాహమున నామె ఉప్పొంగిపోయి సమదర్శిపై కోపము మరచినది. సమదర్శి తాత్కాలికమగు తన నైరాశ్యము నుజ్జగించి, యథారీతి సంతోషిత స్వాంతుడై ద్వితీయ గౌరవములు, బహుమతులు అందుకొనుట నామె గమనించుచునే యుండెను. ఆమె హృదయము వేగమువహించినది. ఆమెకన్నులు ఆర్ధ్రత వహించెను. ఆ విశాలలోచనాల వెన్నెల వెలుగులు ప్రసరించినవి.

“సమదర్శి శాతవాహన ప్రభువు ఎవరు?” అని మహాలి నడిగి ఆ సేనాపతి పుట్టుపూర్వోత్తరములన్నియు తెలిసికొనెను.

విజయి యగు సువర్ణశ్రీ చుట్టును నాట్యముచేయు బాలికలను సమదర్శి గుర్తించుచు, హిమబిందు నాట్యమాధుర్యమును ఓర్వలేనితనమున జూచుచు, తన్ను ఒక విధమగు లజ్జతో, ఒక విధమగు సాభిప్రాయముతో జూచు నాగబంధునికను గమనించుచు, ఎవరీ బాలికయని ఆతడు మనస్సున ప్రశ్నించుకొనెను.

నాగబంధునికను ప్రణయ మలముకొన్నది. గంభీరహృదయకావున నేరికిని తనభావములు వెల్లడిచేయలే దామె! నిట్టూర్పులు, తోచక ఇటు నటు తిరుగుట, తాపోప శమనము చేయించుకొనుట మొదలగు విరహిణీకలాపము లా బాలకు నసహ్యములు. ఎటులైన తాను పాటలీపుత్ర మహాయుద్ధమునకుబోయి, అచ్చట పురుషవేషమున తనపరాక్రమాదులు చూపి సమదర్శి హృదయము చూరగొనవలయును అని ఆ యోషామణి నిశ్చయమునకు వచ్చినది.

సమదర్శి ఉజ్జయినిని సంరక్షించు వినీతమతికి సహాయముచేయ వెడలిపోయెను. అటుల నాతడు వెడలు నని హిమబిందుకుమారియే తనతో చెప్పినది. “సమదర్శిబావ విపరీతకాంక్షకలవాడు నాగబంధూ! అతనికి స్వలాభాపేక్ష మెండు!”

“వట్టి స్వలాభపరాయణు డనా నీయుద్దేశము?”

“అదికాదు. ఆతడు ఉత్తముడు. ప్రాణములకైన వెనుదీయడు. అయినను తనకు జరుగవలసిన గౌరవములు జరిగితీరవలయు నను పౌరుషముకలవాడు.”

“అది తప్పేమి? సంపాదించునప్పుడు మనము యుగములు బ్రతుక గలము అని సంపాదింపవలయునట. వెచ్చించునపుడు రేపు నశింతుము అని యెంచవలయు నందురుకదా!”

“అది నిజమే! కాని మాబావను ఎందుకు ఉజ్జయిని పంపుచున్నారో తెలియునా?”

“నా కేమి తెలియును బిందూ!”

“మానాన్నగారే ఆతడు ఉజ్జయినికి వెళ్ళుటకు కారణభూతులు.”

“మేనల్లునికి సర్వవిధముల సహాయముచేయవలసినదేకాదా?”

“నిజమేకాని నేను మా బావను, మాబావ నన్నును ప్రేమింతుమన్న భయముచే నాన్న సమదర్శి బావను ఉజ్జయినికి పంపించినారు.” “మీ బావగారు నిన్ను ప్రేమిస్తున్నారా?”

“అదేమిప్రశ్న నాగబంధూ! ప్రేమమాట యేమో కాని నన్ను వివాహము చేసికొనవలయునని ముచ్చటపడును. ఒక్కొక్క యువకునకు ఒక్కొక్క యువతిని ఒక్కొక్క యువతికి ఒక్కొక్క యువకుని విధి ఏర్పాటుచేసియుండు నని నా నమ్మకం.”

“అయిన పురుషుడేల ఇరువురు మువ్వురు భార్యలను చేసికొనును బిందూ”

"స్త్రీ పురుషులు మూడు జాతు లుందురు నాగబంధూ, ఉత్తమ, మధ్యమ, అధమ అని. ఉత్తమశ్రేణి వారి విషయములో నేను మాటలాడు చుంటిని.”

“అర్జునుడు ఉత్తముడా, మధ్యముడా?”

“ప్రేమవిషయమున మధ్యముడే!”

“ఇతర విషయము లెట్లున్నను ప్రేమ విషయముననే నీవు నిర్ణయించిన ఈ మూడుజాతులు అన్నమాట!”

“అవును.”

నాగబంధునికకు హిమబిందునకు ఈ సంభాషణ జరిగిన ఎనిమిది దినములకు హిమబిందును ఎత్తుకొనిపోయినారు.

అన్నవెనుకనే నాగబంధునిక హిమబిందు ఇంటికి పోయి అమృత లతాదేవిని ఊరడించి, బాలనాగిని అడిగి అన్నివిషయములు తెలిసికొన్నది.

అన్న సంరంభమంతయుచూచి యా బాల హిమబిందును వెదకుటకు అన్న వెడలుననియు, అప్పుడు తానును అతనివెంట సహాయముగ వెడలినచో బాగుండు ననుకొనినది. మహాబలగోండు ప్రభువు తన అన్నగారికి సహాయము చేయునని యామెకు దెలియును. అన్నగారు ఆతని సహాయ మడుగునని యామె యూహించినది.

ఈ సమయమున ఉజ్జయినిలో సమదర్శి ఏమి చేయుచుండెను?

***



తృతీయ భాగం



1. బెదరింపు

కనాడు సమవర్తి చెంత శత్రువులకడనుండి ఒక రాయబారి వచ్చినాడు. వినీతమతియు సమవర్తియు మంతనము సలిపిన వెనుక సమవర్తి రాయబారిని తన మందిరములోనికి రావించెను. ఆ రాయబారి-

“ఓ సేనానాయకా! వీరాగ్రణీ! నేను నీకు కొన్ని పరమరహస్యముల నెరింగించెదను. నాకు అభయమిచ్చినచో మనవిచేసెదను” అనివాక్రుచ్చెను.

“ఓయీ! రాయబారము నిండుసభలో సలుపవలయును. అయినను నీవు కోరినందున ఏకాంతమనుమతించితిని. రాయబారి ప్రాణ మెప్పుడును సురక్షితము. తుచ్ఛులగు నితరులు ధర్మమునకు దూరు లగుదురేమో కాని ఆంధ్ర వంశము మాది. నేను సాతవాహనుడను. మే మట్టి యవినీతి ఎన్నడును సలుపము. నీ ప్రాణము నీయదియ, చెప్పుము.”

“సమవర్తీ! ఓ నరోత్తమా! మీరు సాతవాహనవంశజులు. చక్రవర్తి కాదగినవారలు. మీకు తెలియని ఆలోచన ఒండెద్దియు లేదు. ప్రతిష్ఠానమున యువరాజు నెవరో నిర్జీవుని చేసినారని మాకు వేగు వచ్చినది. నిజ మరయుటకై అంచెలపై చారులను పంపినాము. రేపు నిజము తెలియగలదు.”

“శాంతం పాపం! ఈ అబద్ధపు వేగు తెచ్చినవాని నాలుక వేయి చీలికలు చేయదగును. ఓయి వెర్రివాడా! ఎవరురా శ్రీకృష్ణసాతవాహనుని సమయించుటకు దెగించినవారు?”

“ప్రభువులు ఆగ్రహింపకుందురుగాక. మా రాయబారము గడముట్ట నడపనిండు. ధనకటకమున ఈ వార్త తెలిసినది. ఆంధ్రప్రభువు యుద్ధ యాత్రకై బయలుదేర సంసిద్ధుడై యుండియు నాగిపోయెను. మీకు సహాయము రాడు. నాల్గుదినములైన వెనుక మీ సైన్యము సమస్తము రూపు మాసిపోవును. మా సైన్యము దినదినాభివృద్ధి గాంచుచున్నది.”

“అయిన నే మందువు?”

“వినుడు, మీరు వీరాగ్రేసరులు, యౌవనవంతులు. మీరు మాలోన జేరిపొండు. మీకు మా రాజభయమిడుటయేగాక ఆంధ్రరాజ్యము సమస్తము జయించి మీ కాధిపత్యము కట్టంగలవారు. మా యొడయనికి స్నేహితులై సేనానాయకులై మీరు ఆంధ్రభూమి పాలించెదరుగాక! మీ రిరువురు ఉత్తర దేశముల జయింతురు. వేదమతోద్ధారకులై రాజసూయమునందు పాల్గొందురు. ఆయన చక్రవర్తి యగును, ఆయనకు మీరు కుడిభుజ మగుదురు గాత.”

“ఏమి ధైర్యము! అటు తరువాత?”

“మీకు రెండు దినములు గడువు ఇచ్చినారు. ఇంతలో మీ సైన్యములు కోట దాటిపోవలయును, ఆయుధములు దిగవిడిచి వెడలవలెను. ఆహార పదార్థములు ఒక్క దినమునకు సరిపడునవి మాత్రమే తీసికొని పోవలయును. మీరు మీ దారిని పొండు, లేదా మాళవేశ్వరునికడకుబోయి అగ్ని సాక్షిగా మిత్రత్వము నెరపుడు.” “ఓరి వాచాలుడా! ఆంధ్రులలో పిరికిపందలు, రాజద్రోహులు మందునకై ననులేరు. మీరాజు చక్రవర్తియా? నే నాంధ్రరాజు నగుదునా? ఏమి యీ చాతుర్యము! కౌటిల్యుని యుక్తిని మించిపోవుచున్నది. పో! ఇంక నీ రాయబారము నాకు వలదు. ఆంధ్రులలో ఒక్కనికైన ప్రాణమున్న ఆతడుకూడ తనబాహుబలము రుచిచూపి మరియు అంతరించును. చక్రవర్తి వచ్చుచున్నాడు. మాకు వేగువచ్చినది. శుకబాణబలమే వచ్చినది. మీ సైన్యములు నామరూపములులేక నశించిపోవును. ఇప్పటి కైన నా మాళవుని, తదితరనాయకులను ఆయుధములు వదలి మా కోటలోనికి శరణార్థులై రా నిండు. మీ సైన్యములు విడిపోయి చెల్లా చెదరు కానిండు. మీ నాయకులకు ప్రాణదానము చేసెదము. లేదా ఒక్కనినైనను కొనయూపిరితోకూడ పోనీయము. ఆంధ్రసింహనాదము మీగుండె లవియజేయును. ఆంధ్ర మృగేంద్ర నిశిత నఖములు మిమ్ము వచ్చి వందరలాడును. పో! ఇదియే నీ రాయబార మున కుత్తరము. మీకు ఒకదినము గడువిచ్చినాము. ఆలోచనచేయుడు.

నే చెప్పినట్లు చేసి ప్రాణములు దక్కించుకొనుడు. కాకున్న ప్రాణము లఱచేత నిడుకొని యుద్ధమునకురండు” అని సమవర్తిమోము జేవురింప కన్ను లుజ్వలింప నుత్తరువిచ్చెను. అతనిచేయి కరవాలపు బిడిపైననే తాండవ మాడుచున్నది.

“సైన్యాధిపా! ఆగుడు, అంత్యసందేశ మున్నది. అయ్యది తమకు మనవి చేసి మరియు పోయెదను. చారుగుప్తుడను వర్తకరాజు మీకు మేన మామయట!”

“అగును.”

“సౌందర్యనిధి యగు హిమబిం దాయన కూతురట!”

“అగుచో?”

“చారుగుప్తుడు ఆంధ్రసింహాసనమున కాదిశేషువట.”

“ఏమిరా నీవాచాలత మీరు చున్నది?”

“ఆ హిమబిందుకుమారి తమకు మిక్కిలి బ్రియతమ యట!”

సమవర్తి మాటాడక తీక్షణదృష్టుల నా రాయబారిని గమనించుచు, తన గుండెలు అటుల కొట్టుకొనుచున్నవేమా యని ప్రశ్నించుకొనియెను.

“ఆర్యా! ఆ బాలిక ఇప్పుడు మాకు బంది అయినది. ఆమెను మీ దేశస్థులే ఎవరో ఎత్తుకొనివచ్చి మాకు ఒప్పగించినారు. మీ సైన్యము లీ దినమున కోట విడిచిపోవలయును. లేనిచో హిమబిందును ఒక కుష్టువానికిచ్చి వివాహము గావించెదము. రేపటికిని మీరు వదలనిచో ఆమె కొకకన్ను, ఒక చేయి నశించును. ఆమె కన్యాత్వము ఏరును అనుమానింపకుండ ఆమె ముత్తవనుగూడ ఆమెతో బాటు బంధించుకుని వచ్చినారట. ఇదియ నా రాయబారము. పనివినియెదను. నమస్కారము. మేము చెప్పిన ఆజ్ఞలు పాలింప మీ సైన్యముల కిచ్చలేనిచో మీ రొక్కరైన మా శిబిరములకు వచ్చివేసి, మా ప్రభునకు మిత్రులు కండు. ఆర్యా! నమస్కారము” అని ఆ రాయబారి వెడలిపోయెను. సమవర్తికత్తిని యొరనుండి తీసినాడు. కోపముచే వణకు దేహముతో, రౌద్రముచే దుమారము కప్పిన మనస్సుతో సమవర్తి వినీతమతి కడకు మహా వేగమున వేడలిపోయి రాయబారపుటుదంత మంతయు వాక్రుచ్చెను.

వినీతమతి ఆశ్చర్యనయనములతో సమవర్తిని కనుంగొని “ఓయీ, నే నా మాటలను ఏ మాత్రము విశ్వసింపను. అంతయు కల్ల. వారికి కోటలోని సంగతి తెలిసికొన ఊహ కలిగి వీనిని పంపినారు. అదియే నిజము.” “ఆర్యా! నేను జాగ్రత్త పడియే యుంటిని. కోటగుమ్మ మావలనే ఆతని కన్నులు కట్టి సభాభవనమున కట్టు విప్పినాము. వెడలిపోవునప్పుడు కోటగుమ్మమునకు వెలుపలనే కట్టువిప్ప ఆజ్ఞ యిచ్చినాను.”

“మంచిపని చేసితివి! అయిన ఈ రాయబారమునుగూర్చి నీ వేమందువు? హిమబిందును పట్టుకొనుట వీరి కెట్లు సాధ్యమగును?”

“నా కేమియు నమ్మకము లేదు.”

ఇంతలో శుకబాణు డచ్చటకు వచ్చెను.

సమవర్తి శుకబాణునకు సమస్తము వినిపించి వానియభిప్రాయ మడిగెను.

శుక: ఇప్పటికి పదిదినములవెనుక హిమబిందుకుమారిని చోరు లెత్తుకొని పోయినారనియు, ఆ చోరుల వెంటనే కొన్ని దళములు తరుము కొనుచు పోయెననియు వార్త వచ్చినది. ప్రతిష్ఠానమునుండి మహారాజు రెండు మూడు దినములలో వేట నెపమున బయలుదేరెను. సైన్యములు నాసిక కనియు, అటు వాతాపినగరమున కనియు బయలు దేరినవి. చక్రవర్తి మహా సైన్యములతో దంతిపురము దాటి, మహానదిని దాటి విదేహ రాజ్యము చొచ్చినాడు. మగధరాజధానిలో నున్న సైన్యములు తక్కువ కాబట్టి ఒక సైన్యము మన సైన్యములనుండి విడిపోయి ఉజ్జయిని వైపు తిరిగినది. మూల సైన్యమునే యడగించుటకు ఔఘలుడు విదర్భ సైన్యములతో, కొన్ని కళింగ సైన్యములతో మహానదికడ అడ్డగించినాడట. ఏనుగు తామరతూళ్ళను చిందరవందరచేసి కాసారము చొచ్చునటుల, దావాగ్ని కాంతారమును దహించుచు విజృంభించునటుల ఆంధ్రసైన్యములు ఆ సైన్యముల నాశనముచేసి, ముందుకు చొచ్చుకుపోయి పాటలీపుత్రము వైపుకు బోవుచున్నవి. ఇంక పదిదినములవరకు మన కోటకు భయము లేదని నిస్సంశయముగ చెప్పగలను.

వినీ: “అవును. కాని హిమబిందువిషయము....” అని వినీత మతి ఇంకను ఏమియో చెప్పబోవుచుండ, ఒక సైనికుడు లోని కేతెంచి వారికి ప్రణామమిడి “జయము! జయము! ఆ రాయబారి వెడలిపోవుచు “నేను సమవర్తి సైన్యాధ్యక్షునకు తెలిపిన యుదంతమునకు సాక్ష్యములివిగో, వీటిని వారి కందజేయుడు” అని యీ మంజూష మా కిడినాడు. ఇందేమున్నదో యచ్చటనే పరిశీలించి మరియు కొనివచ్చినాము. ఇందు ద్రోహమేమియు లేదు. అధిపతులు పరీక్షింతురుగాక” అని యా చిన్న పెట్టె వారి మ్రోల నునిచెను. వారా మందసము తెరచుటయు నందున్న భూషణముల చూచి సమవర్తి హాహాకార మొనర్చెను. నవరత్నఖచితములై మెరయు నా యాభరణములు హిమబిందు కుమారికారత్నము ధరించునవియె. వానికడ నొక మొగలియాకు పై లిఖించిన లేఖయున్నది. అది అందుకొని సమవర్తి యిట్లు చదివెను.

“శ్రీ మహారాజశ్రీలు, వీరాగ్రేసరులు, మేనబావలు నగు సమవర్తి సైన్యాధ్యక్షులకు హిమబిందు నమస్కారములు. నన్ను వీరు మా ఇంటినుండి హరించి మా అమ్మతోగూడ కొనివచ్చినారు. ఇది యే ప్రదేశమో తెలియదు. ఇందు మమ్ము బంధించినారు. మమ్ము వీరు గౌరవముగా జూచుచున్నారు, మేము ధైర్యముగా నున్నాము. కాని మమ్మేలనో వీ రనేకవిధముల బెదరించుచున్నారు. మీకు కమ్మ వ్రాయ మని కోరగా వ్రాసినాను. ఇంతవరకే వీరు నన్ను వ్రాయనిచ్చినారు.

చిత్తగింపుడు,
హిమబిందు”

అక్షరములు హిమబిందువే! ఇక నమ్మకుండుటెట్లు! వినీతమతికి మోము వైవర్ణ్య మొందెను. “హిమబిందు ప్రాణము రాజ్యములతో సంబంధించియున్నది. జంబూద్వీప వర్తక చక్రవర్తి యగు చారుగుప్తున కామె యొక్కతియు కుమారిత, అత డామె కెంతమాత్ర మాపదవచ్చినను ప్రాణములు విడచును. అతడాంధ్ర సామ్రాజ్యమున కేడుగడ. ఇక నే మున్నది?” అని వినీతమతి మతిలేని మాటలు వణంకుచు బలుకజొచ్చెను.

సమవర్తి స్థితి నుడువనక్కరలేదు. ఆతని నాశికాపుటములు విస్తరించెను. ఆతడు తనవిశాలవక్షము నింకను విపులముచేసినాడు. మృగ మొక్కటి పరిసరమున సంచరించుచుండ అపుడ పసిపట్టు సింహమువలె ఆతడు గర్జిల్లినాడు.

అయినను అస్థానకోపమువలన లాభమేమి? ఏమి చేయగలుగును? తాను ఆమెకై యుజ్జయినీదుర్గము వీడిపోయిన తనరాజ్యమునకు, ప్రభువునకు తీరరాని అగౌరవము తెచ్చి పెట్టినవాడగును. హిమబిందు తనకు ప్రాణాధిక. అది యటులుండ అబల, ఆర్త. తా నెట్లు పేక్షింపగలడు? ఒకవంక ప్రభుకార్యము, ఒకవంక ప్రియారక్షణము. సమవర్తి కామవశుడై రాజద్రోహముచేయునా? రాజవశంవదుడై ప్రేమదేవతకే విద్రోహము చేయునా? ఓహో చారుగుప్తతనయా రక్షణముమాత్రము రాజకార్యముకాదా? అవునని నే నెట్లు స్వతంత్రింతును?

“వినీతమతి సేనానాయకా! శుకబాణులవారూ! ఇప్పుడు మీరు నాకేమి యాలోచన చెప్పెదరు? మీ రనినట్లు హిమబిందు ప్రాణముతో, గౌరవముతో, మన సామ్రాజ్య గౌరవము లీనమైయున్నది” అని సమవర్తి తలవంచుకొని ముఖము హస్తములచే కప్పుకొనెను.

అట్లే, “ఈ యుజ్జయినీకోటతోగూడ మనసామ్రాజ్యప్రతిష్ఠ ముడి వేసికొనియున్నది. ఈ కత్తెరలో చిక్కుకొనియున్న మన మేమి చేయవలయునో” అని వినీతమతి యనెను.

శుకబాణుడు తీవ్రాలోచనలతో వారిమాటలు వినిపించుకొనియు వినిపించు కొననట్లు నిలుచుండిపోయెను. 

2. అన్వేషణ

సువర్ణశ్రీ వెంటనే చారుగుప్తునిభవనములనుండి మరలి ఇంటికి పోయినాడు. తల్లిని కలుసుకొని హిమబిందును ఎత్తుకొనిపోయినమాట నిజ మనియు, ముక్తావళీ దేవి గారినికూడ ఎత్తుకొనిపోయిరనియు ఇంతలోనే వారు దొరికితీరుదురనియు, భయపడ నవసరములేదనియు చెప్పి లోనికి బరువిడి, వెంటనే కవచాదులు ధరించి, తిలకము తీర్పుమని నాగబంధునిక యున్న పెరటిలోనికి అంగలువేయుచు వెళ్ళెను. ఆ బాలిక అదిరిపడి ఎవరా యని చూచినది.

అన్నగారివేషము చూచి నాగబంధునిక “అన్నా, ఇది ఏమిటి? ఎక్కడనో దాచి ఉంచిన నాయనగారి చిన్న నాటికవచము తీసినావు? ఎవరోయని భయమందినాను. వేషమువేయుచున్నావా లేక ఉత్సాహము పుట్టినదా, మతిపోయినదా?”

 “కన్న చెల్లీ! నాకు తిలక ముంచుము. చిన్న చెల్లి ఏదీ? ఎవరక్కడ? అమ్మాయి సిద్ధార్థినికను పిలువుడు. త్వరగా లోనికి వచ్చి తిలకము పెట్టుము!”

“అన్నా! తిలక మెందుకు? యుద్ధమునకు రమ్మని నాన్నగారికడ నుండి ఆజ్ఞవచ్చినదా? లేక సేనానాయకు లెవరైన ఆజ్ఞ ఇచ్చిరా?”

“అన్నియు చెప్పుచుందును. నీవు ముందు నాకు తిలక ముంచవలయును, రమ్ము.”

“అమ్మా!” అని నాగబంధునిక కేక వైచెను. తల్లి పూజాగృహము నుండి నిష్కుటములోనికి వచ్చినది. ఆమెయు కుమారుని జూచి, ఎవరో ఏమోయనుకొని, దిగ్భ్రమనంది, యట్లే నిలుచుండిపోయినది. నాగబంధునికయు, సువర్ణశ్రీయు పకపక నవ్విరి. అప్పుడు పుత్రు నాలవాలుపట్టి “ఇది ఏమిరా నాయనా?” యని యామె వా రిరువురికడకు వచ్చినది.

సువర్ణశ్రీ: అమ్మా! నేను యుద్ధమునకు బోవుటలేదు. హిమబిందును వెదుక బోయెదను. కొందరు సేనాధికారు లపుడే ఆమెను వెదుక బోయిరి. నేనును పోయెదను. హిమబిందునింట శ్రీ ఆనందులవారు కనబడినారు. నన్ను వెంటనే బయలుదేరి పొమ్మని ఆజ్ఞఇచ్చినారు. వెళ్ళు చున్నాను. చెల్లీ, తిలకముదిద్దవే, ఆరతితో అమ్మగారి ఆశీర్వాదము పొందవలెను. జాగు చేయకు.

శక్తి: వెదకుటకు ఈ వేషమంతయు వేసినావు, పోరాటము ఏమైన జరుగునా ఏమి? అంతమంది వెళ్ళుచున్నప్పుడు నీ వెందుకురా బాబూ?

నాగ: అమ్మా! నీకును మతిపోయినదా? అన్నను వెళ్ళనీ! ఇక్కడ ఏమియుతోచక మతిపోయినవానివలె నున్నాడు. వీరులైన ఆంధ్రయువకులింటి దగ్గర కూరుచుండు సమయమా? అన్న తీసికొని వెళ్ళునేని నేనుగూడ సిద్ధము.

శక్తి: నీ వెంతకైన తగుదువు! మగవీరుడవు.

ఇంతలో మహాలియు, సిద్ధార్థినికయు, పలువురు పనికత్తెలు, కొందరు చుట్టములు, సేవకులు అచ్చటకు పరుగిటివచ్చిరి. చిరుగాలివలె వచ్చిన చిన్నచెల్లెలిని సువ్వున నెత్తికొని సువర్ణశ్రీ యామెను ముద్దిడు కొని, క్రిందకు దింపి, “తల్లి నాకు ఆరతి ఈయవలయును, తిలక మిడవలెను, రా, లోనికి” అని ఇంటిలోనికి సాగినాడు.

యుద్ధములోనికి వెళ్ళుచుండెనేమో యని పనివారంద రనుకొనిరి. మహాలికంతయు నర్థమై, లోనికిబోయి, దేవతాగృహమునుండి బంగారు పళ్ళెము, దీపపుకుంది, కర్పూరము, అక్షతలు, పూవులు, అగరునూనెయు, తిలకకరండము సిద్ధముచేయుచుండ నచ్చటి కందరు వచ్చిరి.

బుద్ధభగవానుని పంచలోహవిగ్రహ మందున్నది. ఆ విగ్రహమున కీవలావల పంచానన బ్రహ్మవిగ్రహ మున్నది. క్రొత్త పూజ లెన్ని వచ్చినను శిల్ప బ్రాహ్మణులు అనాదియగువారి పంచముఖవిశ్వ బ్రహ్మపూజ మానరు. ఆ పీఠముప్రక్క వేరొక్క పూజాపీఠముపై మాయాదేవి విగ్రహమును, శారదాదేవి విగ్రహమును, పార్వతీదేవి విగ్రహము నున్నవి. ఆ పూజాపీఠము శక్తి మతీదేవిది.

శక్తిమతీదేవి నిర్ఘాంతపడి మాటలాడక, తన పూజాపీఠమునుండి కాశ్మీరపుష్పమిశ్రిత మగు తిలకము తానే యాతనినొసట నుంచి, కొమరితలతో కూడి ఆరతినిచ్చి, మోకరించు కొమరుని ఆశీర్వదించుచు అక్షతలు జల్లెను. ఆమె కన్నులు గిఱ్ఱున నీరుతిరిగినది. సిద్ధార్థినిక కేమియు నర్థము కానందున వెక్కివెక్కి ఏడ్చినది. నాగబంధునిక చిరునవ్వుమోమున ప్రసరింప, కన్నులు విస్ఫారితముగా, ప్రభాకలితవదనయై అన్నను జూచి,  “అన్నా! నీవు క్షేమముగా వెళ్ళిరా. మాఅన్న వీరుడని చెప్పుకొన ఎంతో ముచ్చట నాకు. హిమబిందును రక్షించుకొనుము. ఆ పని ఇంక ఎవ్వరును చేయలేరు. నేను నీకు తమ్ముడనైనచో, ఈ విపత్తులో నీ వెను వెంట వచ్చియుందును. ఆంధ్రశత్రువుల నాశనము చేసి నీ ప్రియురాలిని నీవే తీసికొనిరా” యనినది.

శక్తిమతి తలవంచియున్న పుత్రుని శిరస్సుపై చేయినిడి “మహాశ్రమణకుడు నిన్ను రక్షించుగాక! నాయనా! జయశ్రీ శోభితుడవై యశో విరాజితుడవై తిరిగిరా. అనవసరముగ ప్రాణములు బలిగొనకుము. శరణార్థుల విడిచిపుచ్చుము. నీ శిల్ప బ్రాహ్మణ వంశమర్యాద మరువకు. ఈ రక్షరేకును నీ హృదయమున ధరించుకో, పోయిరా!” అని గద్గదికమున బలికినది.

అశ్వము సిద్ధముగానున్నదని ఇంతలో వార్త వచ్చినది. సువర్ణశ్రీ నాగబంధునిక వీపుపై తట్టి, సిద్ధార్థినికను ముద్దుపెట్టుకొని తల్లికి నమస్కృతులిడి, మహాలి మొదలగువారికడ సెలవునంది, సర్వాభరణభూషితము, సార్వభౌమ బహుకృతమునగు ఉత్తమాజానేయము కడకుబోయి సూతుడందిచ్చు ఖలీనము నందుకొని, చివ్వున నా ఆశ్వముపై నధిరోహించి సేవకుడందిచ్చు బాణములపొదియు, విల్లు నంది పుచ్చుకొని, పొది స్కంధమునకు బిగించుకొని కేడెము వీపున బిగించుకొని, ధనుస్సు ఎడమభుజమునకు తగిలించుకొని, శూలము, శూలశిరస్సులు, పరశువు, ఆహారపుసంచి, ధనపుసంచి, వస్త్రపుసంచియు జీవనమునకు గట్టిగా సేవకుడు కట్టినది పరిశీలించి “వెళ్ళివచ్చుచున్నా” నని కేకవైచి గుఱ్ఱమును నడిపించెను.

ఎవరీ సుందరుడని ప్రజలు అక్కజంపడ రేవుకడ కృష్ణలో సువర్ణశ్రీ గుఱ్ఱమును దింపెను. లంకలపై నడచుచు, అక్కడక్కడ సెల యేళ్ళవలె ప్రవహించు కృష్ణపాయలను ఆ గుఱ్ఱముపై పదిక్షణములలో దాటెను.

అతడు ఫ్లుతగతితో ప్రొద్దు నెత్తిమీదకు వచ్చునప్పటికి మహారాజ పథమున పదిగోరుతముల దూరము పోయెను. అక్కడ నొక సత్రమున నాగి స్నానాదికము లొనరించి, భోజనముచేసి పదిముహూర్తము లచ్చట విశ్రమించెను. గుఱ్ఱమును సేదతేర్చి, ఆహారమిచ్చి, ఒడలంతయు రుద్ది, అశ్వారూఢుడై ప్రయాణము సాగించెను.

అతడు రాత్రి మొదటియామములో మహాగ్రామము చేరెను. 

3. మహారణ్యము

నాలుగు రోజులలో సువర్ణశ్రీ మహారణ్యప్రవేశ మొనర్చెను. ఆతనికిముందు ఆంధ్రచమూపతులు ఇటు వెళ్ళిరి అటు వెళ్ళిరి అనువార్తతక్క హిమబిందుజాడగాని, చోరులజాడగాని ఇంతయైన తెలియలేదు. మంత్రకల్పమునవారందరు ధాన్యకటక పరిసరములనే మాయమైపోయిరా? లేక ఆంధ్రచారులను మించిన మాయాధురీణులా ఆ చోరులు? ఏమైపొయినారు? ఆ దివ్యమూర్తిని వారు తమకర్కశహస్తములతో అంటిరి కాబోలు ఆమె ఎంతబాధ పడుచున్నదో, ఎంత భయమందినదో? ఆ సుందరోజ్వలమూర్తి వడలిన పూపువలె సొమ్మసిల్లిపోయి వుండును. చిన్ననాటనుండియు కష్టమెట్టిదో ఎరుంగని ముక్తావళీదేవి ఎంత అలమట చెందుచున్నదో? ఎంత పని చేసి రీ దుర్మార్గులు!

 చారుగుప్త సర్వస్వము సపహరించుకొనిపోయిన ఈ దుష్టులు చోర మాత్రులు గారు. ధనరాసులు దిగవిడిచి బాలికల నపహరింతురా చోరులు? వారికి ముక్తావళీదేవితో నేమి పని? ఇందేదియో రాచకార్యమున్నది. ఇది యంతయు శత్రువుల కుతంత్రము. ఔరా! ఆంధ్రరాజధాని యేమి, రాజ దుర్గముకంటెదుష్ప్రవేశ మగు వణిక్సార్వభౌముని ప్రాసాదము చొచ్చుటేమి ఎంత అరాజకమైపోయినది. శత్రువుల కాంధ్రరాజధాని యింత అలుసై పోయిన దేమి! దేశద్రోహులగు ఆంధ్రు లెవరో, ఇంటి దొంగలవలే ఇంత పని చేసిరికాని శత్రువు లెన్నిగుండెలతో ధాన్యకటకమున గాలిడగలరు?

ఆ బాలిక పరీమళజలముల ఉదయమున స్నానమాడునది, తూలికా మృదు వస్త్రములు ధరించునది, సుగంధము నలదుకొనునది, మసృణకిసలయ సదృశము లగు పర్యంకముల పరుండునది. అయ్యబల శత్రువులచే నెట్టి ఇడుమలపాలైనదో! తానేమి చేయగలడు? ఎచట వెదుకగలడు? తనకు దూరదృష్టి, దూరశ్రవణాసిద్ధులు, ఆకాశ గమనాది విద్యలు తెలియవాయెను.

ఎంతమంది నడిగినను ఇసుమంతయైన జాడ తెలియుటలేదు. ఆ బాలిక బ్రతికియుండునా? “ప్రభూ మహాశ్రమణకా! ఆమెను రక్షించుము. ఆమె క్షేమముగ నున్న చాలును. జంబూద్వీపస్థము లగు మహాచైత్యము లన్నిటికి శిల్ప సేవ గావించుకొందును.”

సువర్ణశ్రీ ఇట్టి ఆలోచనలతో ఒక్కడు ఆ మహాశ్వముపై నవలీలగ క్రోశములు, క్రోశములు గడచి ముందునకు పోవుచుండెను.

పూవు ఎన్ని యోజనముల దూరముననుండిన నుండు గాక. దాని పరీమళములు పసిపట్టి సూటిగా భృంగబాలుడు ఆ పూవుకడకు పోవును. ప్రేమికులకు ప్రియురాలి జాడను ప్రణయమధుర పరీమళములు పసిపట్టి యిచ్చును. సువర్ణునకు చోరులజాడ నెవ్వరినడిగినను దెలియరాలేదు. అయినను క్షణక్షణము ఆమె అక్కడ ఉన్నది. ఆమె ఇటు పోయినది అని ఆతనియంతరంగమున స్పష్టమున తోచుచుండెను. దివ్యదృష్టి నిచ్చును గదా ప్రేమ!

సువర్ణశ్రీ కుమారుడు గుఱ్ఱమును నందపురము (నందిగ్రామము), గిలనకేర (గార్ల), మంత్రకూటము (మంథెన) దారిని పోనిచ్చి అచ్చట గోదావరీనదిని దాటిపోయెను.

నాగులలో జాతిభేదము లెన్నియో యున్నవి. ఆర్యనాగులు నాగపూజ చేయుదురు. పన్నగులనువారు మద్రజాతి నాగులు. వారిని ఆర్యా నార్య మిశ్రజాతి అందురు, అనార్య సంపర్క మెక్కువయున్నవారిని గూఢపు లందురు. వారే గోండులు. గోండులుండు కాంతారములకు గోండువనమని పేరు.

గోండులు ఆర్యబ్రాహ్మణ ప్రభువులగు సాతవాహనులయెడ పరమ భక్తులు. దక్షిణ కోసలమునకు బడమటనుండు దండకాటవిభాగమున శబరు లుండిరి. వీరు గాంధర్వ పన్నగ మిశ్రజాతికి జెందినవారు. పన్నగవంశములవారు నాగరపధములందే నివసించుచు, ఆంధ్రసాతవాహనదేశమున శూద్రులైరి. వారు మంగలి, చాకలి, ఉప్పరి వృత్తు లవలంబించియుండిరి.

శబరులకు, గోండులకు ఎప్పుడును ప్రబలశత్రుత్వ ముండెడిది. శబరులు ఆంధ్ర చక్రవర్తులకు భయముచే లోబడియుండిరిగాని భక్తిచేగాదు. శబరులు మాయావులు. వారు మంత్రవిద్యను గంధర్వులకడ నేర్చినారు. ఆ శాబర మంత్రతంత్రములకు భయపడి గోండులు ఆర్యఋషుల నాశ్రయించి యుండిరి.  కాని గోండులు బహుపరాక్రమవంతులు. గోండుయువకుడొంటియై సింహమునే ఎదుర్కొనును. గోండుమహాప్రభువు వీరమల్ల గోండమహారాజు సాతవాహన సామంతేశ్వరుడు. ఆతని పుత్రుడు మహామల్లగొండ యువరాజు ధాన్యకటక మహా సంఘారామ పరిషత్తునందు విద్యనభ్యసించినాడు. అప్పుడే సువర్ణశ్రీకిని ఆతనికిని గాఢస్నేహము కలిగినది. మహామల్లుడు సువర్ణశ్రీ ఇంటనే వాసముచేయువాడు. వారి ఇంట భుజించువాడు.

ధర్మనందియు, సువర్ణశ్రీయు దేవతలని వారి శిల్పములు చిత్ర లేఖనములు జూచి మహామల్లు డనుకొనువాడు. గోండు భాషలో తీయని పాటలు బాడుచు, అవి సువర్ణశ్రీచే బాడించుచు, చిన్నబిడ్డ యగుసిద్ధార్థినికను ఒక్క నిమేషమైన క్రిందకు దింపక ఆడించుచు, శక్తిమతీదేవికి రెండవ కొమరునివలె మెలగినాడు.

సువర్ణశ్రీ బయలుదేరు నప్పుడే మహామల్లుని తలచుకొన్నాడు. అత డప్పుడే యొక ఉత్తమ గోండసామంతునితనయను వివాహమైనాడనియు, యువరాజ పట్టాభిషేకము నందినాడనియు సువర్ణునకు దెలియును.

తనకు వార్తలంపు విధానము సువర్ణునకు మహామల్లుడే తెలిపినాడు. గిలనకేరపురము పుళిందరాజ్యమునకు దక్షిణమున నున్నది. పుళిందులు ఆంధ్ర సాతవాహనులకు దాసులయ్యు, నేడు స్థౌలతిష్యుని మహిమవలన వారికి విరోధులై ఆంధ్ర సామ్రాజ్యమును విచ్ఛిన్నముచేయ సంకల్పించియుండిరి. కాని పుళిందులలో కొన్ని జట్టులనాయకులు శుకబాణుని అనుయాయులు. వారును గోండునాయకులును రహస్యముగ నెప్పటివార్త లప్పటికి శుకబాణునకు తెలియజేయుచుండిరి.

తన స్నేహితుడగు పుళిందయువక నాయకు డొకడు గిలనకేరపురమున నుండుననియు, నాతడు తనకువార్త పంపగలడనియు, తాను గోదావరి కావల ఉత్తరమున మూడు యోజనములు దూరముననున్న నగరిగ్రామమున కలుసుకొందుననియు మహామల్లగోండుడు తాను ధాన్యకటకనగరము వీడునప్పుడు తెలిపియుండెను. ఆనవాలుగా తన దండకడియము సువర్ణశ్రీ కిచ్చినాడు.

గిలనకేరపురమున నాగినప్పుడే ఆ పుళిందనాయకుని గలుసుకొని సువర్ణుడు మహామల్లుని దండకడియము సందేశ మంపినాడు. నగరి గ్రామమున రెండు దినములు విశ్రమించినాడు. దీర్ఘ ప్రయాణముచే అలసట నొందిన ఆతని ఉత్తమాశ్వమునూ అలసట తీర్చుకొని పదనుపట్టిన కరవాలమువలె మెరసిపోయినది.

మూడవనాటికి మహామల్లుడు పుష్కలమహా మేఘమువలె గజయూధ పతివలె వచ్చి సువర్ణుశ్రీని కౌగిలించుకొనెను.

“అన్నా! ఏమిది, ఈ అడవుల సంచారము చేయుచున్నావు? భగవంతుని శిల్పము, చిత్రలేఖనము దర్శింపవచ్చినావా?”

“మహాబలా! నేనొకనాడు నీ రాజ్యమున నిన్ను దర్శించెదననలేదా? నేడు వచ్చినాను. కాని, సంతోషయాత్రాభిముఖుడనై కాదు. పవిత్రకార్య దీక్షాపరుడనై వచ్చినాను. నీవు తప్ప ఇంక నేరును నాకీ దుర్ఘటకార్యమున సహాయము చేయలేరు.”

సమున్నతరూపుడు అతిరధుడు నగు సువర్ణుడును, మహాబలావతార మగువాడును, మధ్యమోన్నతమూర్తియు నగు మహాబలగోండుడు బిగియార కౌగిలించుకొన్నారు. 

4. శాపాభయముద్రలు

శ్రీకృష్ణసాతవాహనకుమారుడు మరునాడు ప్రభాతకాలముననే ఆఖేటనావ్యాజమున యుద్ధయాత్ర సలుపువాడై, రాత్రిద్వితీయయామమధ్య కాలమువరకు సంగీతలోలుడై యుండెను. ఒక సుందరి విపంచి మేళవించి మధురగీతముల నాలపించినది. వేరొక పాటలాధరి మురళిపై తరళరాగపూర్ణ కీర్తనల మ్రోయించినది, పద్మహస్త యోర్తు కాంస్య తాళములు చఱచినది. కలకంఠి యొకరిత మనోహరగానామృతశైవాలిని యైనది.

రెండవయామము పూర్తియగునప్పటికి రాజకుమారుడు లేచినాడు. సుగంధ తైలపోషితకరదీపికల దీపాంగనలు దారిచూప నాతడు శయనమందిరమున కేగి కలశాంభోధి సదృశ మగు తల్పముపై మేనువాల్చెను. ఆతడు వెను వెంటనే తీయని నిద్దురలో కనుమూసి ఒడలు మరచెను.

చీకట్లు ద్రవించి యామినీఫాలమున అలకలై, యమునావీచికలై మిన్నుమన్నా క్రమించి పరవడులెత్తినవి. చీకట్లురూపముమారి చైతన్య పూరితములై, మహిషములై, ఖడ్గమృగములై, కాల కరియూధములై పేరెములువారినవి. అవి యన్నియు మాయమైనవి. చీకట్లన్నియు కలిసి ఒక్కటే చీకటియైపోయినవి. ఆ చీకటి బరువు శ్రీకృష్ణసాతవాహనుని వక్షముపై ఆవహించి, ఆతని ఎదఱురొమ్ము ఎముకలు పిప్పియగునట్లు బరువెక్క నారంభించినది. నిర్మల నిద్రపరవశుఁడై యన్న ఆ యువకునికి భయంకర స్వప్న మొక్కటి ప్రత్యక్షమైనది.

కర్కోటక నాగేంద్రుడు తన శతవదనములనుండి నిప్పులు గ్రక్కుచు, కన్నులు భయంకర జ్వాలలుగా మహావేగమున శ్రీకృష్ణుని వైపు రాసాగెను. వీరుడగు నా రాజకుమారుడు ధనస్సు నెక్కిడబోయెను. అది ఎచ్చటను కనబడదు. ఖడ్గము దూయబోయెను. వట్టియొర మాత్రము దొరకినది.

ఆ భీషణోరగముబారినుండి తప్పించుకొనబోయి, పరుగిడలేక యాతడు పడిపోయెను. ఓ, ఓయను యార్తనాదము కంఠపుముడులలో మాత్ర మాగిపోయి గురగురలైనది. ఆతనికి చెమటలు పట్టి మెలకువ వచ్చినది. ఆ మందిరములోని సుగంధ తైలముల వెలుగు దీపములలో రెండు తక్క తక్కినవన్నియు నారిపోయినవి. సగము మందిరము చీకట్లమయమైనది. ఆ గుడ్డి వెలుగులో కాలసర్పమొక్కటి బుసలుకొట్టుచు ఎటుల శయన మందిరములోన ప్రవేశించినదో శ్రీకృష్ణసాతవాహనుని తల్పముకడకు చేరవచ్చుచుండెను. అ సర్పము కలలోనిదా, లేక నిజమాయని శ్రీకృష్ణుడాలోచించెను. భయమనునది ఎరుంగని యా రాచబిడ్డ నేడు గజగజవణంకెను. నోటమాటరాదు. పెదవులు, నాలుక, గళము పొడియారిపోయినవి. ఆ పాము కొట్టు బుసలలో అగ్నిశిఖలు కనిపించిన వా మహారాజునకు. ఆ క్రూరపన్నగము పన్నెండుపదముల పొడుగున నల్లనై, మహాకాళికావేణి వలె, మృత్యుపాశమువలె మిలమిలలాడుచు నాతనితల్పముకడకు వచ్చినది.

విభ్రాంతుడై చేష్టలుడిగి యా మహారాజు తల్పముపై నటులనే కూర్చుండి పోయినాడు. ఆ పాము చుట్టవేసికొనిపోయినది. అక్కడనుండి పడగ హస్తమున్నర పైకిఎత్తి నాల్కలు చాచుచు బుస్సనుచు కాటువేయ బోవుచు ఆడిపోవుచున్నది.  శ్రీకృష్ణసాతవాహనుడు దీపమును జూచు శలభమువలె నట్లేకదల లేక ఆ పాము ఎట్లాడిన నటువైపునకు తల త్రిప్పుచున్నాడు.

అంతకన్న అంతకన్న ఆ పామునకు కోప మెక్కువైనది. ఆవేశముచే పాము ఇటునటు ఊగిపోవుచుండెను.

ఒక్కసారిగా ఆ భయంకర కాలవిషధరము మహావాయువైనట్లు, సర్పాస్త్రమైనట్లు, ఇటునటు పరువులెత్తి, ఇంకను మంచముదాపునకు వచ్చి ఒక్కపెట్టున తోకపై లేచి మంచముపై కురికినది.

అంతపెద్ద పర్యంకముపై ఏ పామురకగలదు అన్న ధైర్యముతో నున్న కతమున నా పన్నగ ఉరుకునకు శ్రీకృష్ణుడొక పెద్ద హాహాకారము సలిపి వెనుకకు పడిపోయెను.

ఆ వెంటనే తెల్లని మొగలిరేకువంటి, గంగోత్తరకడ భాగీరథీ ప్రవాహమువంటి, మహర్షి దీవనవంటి, దేవతల పాణితలముల జగన్మోహినిపోయు అమృతపుధారవంటి శ్వేతోరగి ఒకర్తు మంచముపై కురికినది. శ్రీకృష్ణసాత వాహనునిపాదమున కాటువేయబోవు ఆ కాలసర్పము వెంటనే ఆగి పడగెత్తి ఆడుచు కదలక బొమ్మవలె నైపోయినది.

ఆ పాము నెదుర్కొనిన యాధవళపన్నగి కోపమెరుగని నిశిత సత్యమువలె మిలమిలలాడుచు పడగెత్తి యాకాలనాగము నెదుర్కొని కదలక, మెదలక ఒక్కసారి మాత్రము రామబాణమువలె, మహేశ్వర వీణానాదమువలె “గస్” అనిమాత్ర మనినది.

భయపడి, సిగ్గుపడి, ఓటమిని సూచించుచు తల ముడుచుకొని యా కాలనాగము మంచమునుండి క్రిందికి జారిపోయి ఎటుల మాయమైనదో మరల శ్రీకృష్ణున కది గోచరముకాలేదు.

శ్వేతపన్నగిమాత్రము ఒకసారి శ్రీకృష్ణసాతవాహనునివైపు తల త్రిప్పిచూచి యదియు మంచమునుండి యురికి మాయమైనది.

భయము ఒక ముహూర్తకాలమువరకు శ్రీకృష్ణసాతవాహనుని వదలలేదు. కొంతవడి కాభయముతీరి, వీరుడగు నా మహారాజు ఒక్కుమ్మడిలేచి మంచమునుండి యురికి, దాపున ఉన్నతపీఠముపై నుంచిన బంగారుగంట గణగణ వాయించెను. చెంతనున్న ఒరనున్న కరవాలము చర్రునలాగి, గుమ్మముకడకు బోవునప్పటికి బిరబిర తలుపులు తెరచి రక్షకస్త్రీలు లోనికి ప్రవేశించిరి. వారందరి హస్తముల కత్తులు తళతళలాడు చుండెను.

క్రోధపూరితనయనుడై కరవాలము ధరించి ద్వారముకడ తమకెదు రైన ప్రభువునుజూచి వారు సంభ్రమము నందిరి. ఇంతలో సేవకు రాండ్రు ద్వారపాలకులు, కంచుకులు శయనమందిరముకడకు వచ్చిరి.

శ్రీకృష్ణసాతవాహనునికి మెరుపువలె ధాన్యకటకమున జరిగిన శ్వేత పన్నగ దర్శన సంఘటన జ్ఞప్తికి వచ్చినది.

నిమిషమున మనస్సు త్రిప్పుకొని, యాతడు చిరునవ్వు నవ్వుచు,

“ఓయీ! అంతఃపురపాలకునికి వెంటనే ప్రయాణసన్నాహము చేయ మా ఆజ్ఞగా తెలుపుడు. స్నానార్థము మేము పోవుచున్నాము. శుభముహూర్తము కెంత కాల మున్నది?”

“ప్రభూ! ఇంకను మూడు గడియలు వ్యవధి యున్నది” యని కంచుకి మనవి యెనర్చెను.

5. మృగపథము

గోండువన యువరాజగు మహాబలగోండుడును, సువర్ణశ్రీయును మహా వేగమున అడవులన్నియు గడచిపోవుచున్నారు. “అటవీ సంచరణము ఒక మహావిద్య. శత్రువునకు తెలియకుండ ప్రయాణముచేయవలెనన్న నీవు అటవీ మృగమైపోవలెను. ఆకులో ఆకువై, కొమ్మలో కొమ్మఅయి పోవలెను. నీవు పక్షివలె ఎగిరిపోవలెను. ఉడతవు, ఉడుమువు, పామువు అయిపోవలెను. నేను వెనుకనే నీకు ఈ విద్య చాలావరకు నేర్పితిని. నేను చెప్పినది చేయుము సువర్ణా!” యని మహాబలు డనెను.

“మనకు హిమబిందు వార్త ఎప్పుడు ఎక్కడ తెలియగలదు?”

“మా గోండు అరణ్యములు తక్క, తక్కిన అరణ్యములన్నియు ప్రస్తుతము విరోధులగు కిరాత జాతులతో నిండియున్నవి. వారికి తెలియ కుండ మావాళ్ళు మనకు సర్వవిషయములు తెలియజేయవలెను. మీ హిమబిందును వారీ అరణ్యములోనికే కొనివచ్చియున్న యెడల మన కా విషయము తెలియగలదు. ఆ గుఱ్ఱమువలన మనకు ఎక్కువ ప్రమాదము సంభవించునని, గుఱ్ఱమును నగరి గ్రామమునుండి గోండుమార్గమున గోండువనము పంపించుట మంచిదే అయినది.”

“గుఱ్ఱమునుబట్టి యానవాలు పట్టరా?”

“గుఱ్ఱము రంగు మార్చివేసినాము. కావున నీ గుఱ్ఱము నానవాలు పట్టలేరు. మే మా గుఱ్ఱమును ఎచ్చటనో తస్కరించి తీసికొనిపోవుచున్నామని మన ఎదిరికక్ష వా రనుకొనునట్లు చేసినాము.”

“నీవు నా మిత్రుడవని తెలిసిన వెంటనే నిన్ను వారు బాధలనొనరించెదరేమో యని భయపడుచున్నాను.”

“ఓయి వెఱ్ఱివాడా! నన్ను బాధలుపెట్టగల ఆటవికజాతి యున్నదా? మాకు భక్తులైన రాక్షసులజాతి యొకటి యున్నది. ఆ జాతివారు దండ కారణ్యగర్భమందు, కటిక చీకటి నాట్యమాడు ప్రదేశాలలో ఉందురు. వారి జోలికి వెళ్ళుటకు ఆటవిక జాతులలో నాగరికపుజాతులవారికి భయము. నాతో మనకు కనబడక నూరుగురు రాక్షసులు గట్టివా రున్నారు.”

సువర్ణశ్రీ మహాబలుడు మూడుదినము లా విధముగ ప్రయాణము చేసిరి. సువర్ణశ్రీ గోండు వేషము ధరించియుండెను. ఆతడు గోండు స్త్రీలద్దిన రంగు రంగుల కౌపీనమును ధరించియుండెను. రంగురంగు పూసల హారములు మెడను వ్రేలాడుచుండెను. దేహమంతయు వివిధవర్ణములతో విచిత్రాలంకరణ చేయబడెను. మోము పెద్దపులి ముఖము వలె వర్ణము లద్ద బడెను. చేతులకు వెండి దండ కడియములు, ఔషధీ మూలముల తాయెత్తులున్నవి. వక్షమున చిరుతపులి తోలు వలెవాటయ్యెను. తలపై రంగు రంగుల పక్షి ఈకెలు, రంగురాళ్ళు, గవ్వలు పొదిగిన ఎలుగుబంటితోలు కిరీటమునుండి పైకెగసి యాడుచుండును.

ఇంతలో వేగు గొనివచ్చిన పరిచారకునితో మహాబలగోండుడు మటలాడి, “అన్నా, హిమబిందును, ఆమె అమ్మమ్మను తూర్పు దండకాటవి దారినే తీసికొని పోయిరట” అని సువర్ణశ్రీ కెరిగించెను. “ఏమీ, దండకాటవికే! నేను భయపడినట్లే అయినది. ఎంతపని చేసినారు! వా రింకా ఎంతదూరాన ఉన్నారో! ఎచ్చట నున్నారో! క్షేమముగా నుండిరా? మన మచ్చోటికింక నెపు డేగెదము?”

“తొందరపడకుము. వీరుడు కోపమున కఱ్ఱ నిప్పును దాచుకొనినట్లు తనలో దాచుకొనును.”

“నాకన్నియు చెప్పుము తమ్ముడూ! మనమచ్చటికి త్వరితముగ పోవలెను.”

“వారిని ఎత్తుకొనిపోయినది సాధారణాటవికులు కారు. వారట్టి పనులు చేయరు, చేయుట చేతకాదు. నగరవాసు లన్న నే మాకు భయము. నగరమును జూచిననే మేము ముడిచికొని పోవుదుము. వారిని ఎత్తుకొని పోయినది ఎవరో చక్రవర్తి విరోధులట.”

“మాగధులా?”

“మాగధులో, వందులో వారి నిరువుర నెత్తికొనిపోయి, ధాన్యకటక నగర ప్రాంతమున దాగికొనియున్న శబరులకు అప్పగించిరట!”

“నే ననుకొనినంతయు నైనది. వారికేమియు ప్రమాదము కలుగ లేదు గదా!”

“వారిని నర్మదాతీరమున నున్న స్ఫటికశిలాపర్వతములవైపు తీసికొని పోయిరట.”

“నడు, మన మచ్చటికే పోదము.”

“అచ్చటికే పోవుదము. ఈలోన మా నాయనగారికి గోండు సైన్యము నుండి సింహములవంటివారిని ఏరి మన సహాయమునకు పంపపలయు నని వార్త పంపినాను.”

“అటులనే అన్నా!”

ఆ ఉదయమున వారొక సరోవరముకడ వంట చేసికొని భుజించి, మరల ప్రయాణము సాగించిరి. ఎంత వేగముగ నడచినను ఒక్క ఆకు కదలిన చప్పుడైన కాదు. మహాబలగోండుడు అనుమాన మేమైన తోచినప్పుడు, సైగచే సువర్ణుని ఆపి ముందునకు బోయి పరిశీలించి, అచ్చట చిన్న పక్షి ఈలవేయును. సువర్ణు డప్పుడు ముందుకు సాగిపోయి, యాతని గలిసికొనును. వా రిరువురు ముందుకు సాగిపోదురు.

మహాబలగోండునకు పాము చెవులు. ఎంత చిన్న చప్పుడెంత దూరముననుండి వినిపించినను ఆతని కర్ణములకు సోకును. ఆతడు ముక్కుపుటములు విస్ఫారితముజేసి, ఎట్టివాసననైన పసిపట్టగలడు.

వారట్లు మహావేగమున బోవుచుండ నొకమధ్యాహ్నము వారి ఎదుట నొక బాణము వచ్చి పడినది. గోండుడు వెంటనే ఆగి, భూమిపై వాలిపోయెను. సువర్ణునిగూడ భూమిపై వ్రాలమని సైగచేసెను. ఆతడును, సువర్ణుడును పాకికొనుచు, దట్టమైన యొకపొదలోనికి దూరిపోయిరి.

మహాబలుడు సువర్ణుని చెవికడ వదనముంచి మనలను విరోధులగు పుళిందులు కనిపెట్టినారు. ఆ బాణమే ప్రశ్న. నీవును గోండుడవు అని వారికి తెలుపవలె. లేనిచో మనలను బాణములచే చెండివేసెదరట. ఆ బాణము వచ్చిన విధమునకు, నా ముందర పడుటకు, ఆ బాణమునకు కట్టిన ఈకలకు అర్థమది” అని తెల్పెను.

“అయిన నిప్పుడేమి చేయవలెను?”

“నీ వూరక చిత్రము చూచుచుండుము” అని చెప్పి మహాబలు డప్పుడు పెదవులు మూసి పామువలె బుసకొట్టినాడు. వెంటనే దూరమునుండి వేరొక మహానాగము బుసకొట్టినది ఆకాశములో చిన్న చిన్న ఈటెల వంటివి వేలకువేలెగిరినవి. “కో” యని,  “హో” యని పది, పదిహేను అరపులు వినబడినవి. తర్వాత నంతయు నిశ్శబ్దము. పాముబుస దీర్ఘమై విననైనది. మరల నిశ్శబ్దమా వహించినది.

సువర్ణున కిదియంతయు భయాశ్చర్యముల గొలిపినది. “అన్నా! మన విరోధులందరు మాసిపోయినారు. ఆ శవముల రాక్షసులు భక్షింతురు అని మహాబల గోండుడు పలికినాడు.

సువ: ఛీ! ఛీ ! నరమాంసభక్షణమే? బుద్ధం శరణం గచ్చామి.

మహా: నరమాంసభక్షణము మాకు మాత్రము ఇష్టమా! రాక్షసుల పాలబడినవాని గతి అంతియ. మహాబలగోండు నేమి, మఱి ఏ ఒక్క గోండునేమి శబరుడు, పుళిందుడు యుద్ధమున కాహ్వానించుట చావును తెచ్చుకొనుటే. రాక్షసులు గోండుల ఆజ్ఞచే వచ్చిరని తెలిసిన మరలగోండువిరోధి ఈ అడవుల నుండునా? రాక్షసుల నోడింపగలవా రొక్క గోండులే!

సువ: అబ్బ! నా హృదయమున వెర పింకను పోలేదు తమ్ముడూ!

మహా: నన్ను క్షమింపుము. నీకు నే నీ విషయము తెల్పియుండకూడదు. నీవు వీరుడవు. శిల్పిమాతృడ వేయైన అడవుల కేల వత్తువు? హిమబిందును తలచుకొనుము.

సువ: అన్నియు భగవంతుని చిద్విలాసములు. కానిమ్ము. విచారించుటకు నే నెవడను?

మన మొక్క ఘడియ ఆలసించినకొలది హిమబిందు, ముక్తావళీదేవుల ఇడుమలు ఒక్కొక్కటే అధికమగు నని నా భయము.

వా రంతట ఇంకను వేగముగ సాగిపోయిరి. 

6. నాగరాజు

స్థౌలతిష్యుడు ఓషధీ ప్రభావముచే విషబాలకు గాఢనిద్ర కల్పించెను. విషవైద్య విశారదులగు కొందరు సేవకులు ఆమెను ఏనుగుపై అరణ్య మధ్యమునకు గొనిపోయిరి. శ్రీకృష్ణసాతవాహనుడు వేట నెపమున మాళవమునకు యుద్ధాభిముఖుడై వెళ్ళుచుండెనని యాత డూహించియుండనోపు.

శ్రీకృష్ణసాతవాహనుడు వెళ్ళుదారికి ఒక క్రోశము దూరమున నిబిడమగు నొక కాంతారభాగమున విషబాలను వదలిలేసినారు.

“నీరము లా చుట్టుప్రక్కల కొన్ని క్రోశములవఱకు నుండవు. ఫలములు కానరావు. కంటకావృతమై, ప్రాణరహితమై, బీభత్సమగు దుర్గమారణ్యమున వొంటి విడచి రండు. ఈమె ఇతరులకు మృత్యు వగుగాక!” అని స్థౌలతిష్యుని యాజ్ఞ.

విషబాల కన్నులు దెరచి చూచినది. కర్కశస్థలమున నామె పడియున్నది. ఒక పెనుబా మామెపై ప్రాకుచు చోద్యము చూచుచున్నది. ఆమె ఉలికిపడి లేచి నిలుచున్నది, ఉన్నతములగు చెట్లు, మహోరగముల బోలు తీగలు, కంటకావృత్తము లగు పొదలు, కఠినశిలలతోనిండిన భూమి. ఆమె కన్నులు నులిమికొన్నది. విహ్వలచిత్తయై యామె కెవ్వున నార్చినది. ఆమె కేక ఓ ఒ! ఒ! ఓఓఒ! అని మారుమ్రోగినది. ఆమె పూర్తిగా వివస్త్రయై యున్నది. ఏమి శిక్ష! విషకాంతుల వెలిగిపోవు ఆమె దిగంబరదేహము భయముచే, బిడియముచే ముడుచుకొనినది. ఆ ఉదయమున మలయపవనములు హాయిగా వీచి ఆమెను సేదదీర్చెదమని వచ్చినవి. కాని ఆచ్ఛాదనా రహితమగు నామెతనువు నవి సోకగనే ఆమెకు గజ గజలాడు చలి వచ్చినది. ముడివేసియున్న జటాభారము నామె విదలించి నది. అందమగు మంచు శిఖరమును కప్పివేయు నీల మేఘములవలె ఆమెతలకట్టు పాదములవరకు నల్లగా ప్రవహించి ఆమెను ముంచి వేసినది. ఒత్తుగా తన శిరోజముల నొడలంతయు గప్పుకొని ఆమె నిశ్చేతనయై కూలబడినది.

మరల మెలకువ వచ్చునప్పటికి సూర్యకిరణములు తీక్షణముగా నా యాకు జొంపముల నుండి లోనికి జొచ్చివచ్చి యామె నాస్వాదించు చున్నవి. ఆ బాలిక లేచి కూర్చుండి “నే నిక్కడనున్నానేమి? ఏల వచ్చినాను? ఎప్పుడు వచ్చినాను? ఎవరు తీసుకొని వచ్చినారు? నే నో వేళ చనిపోయినానేమో! ఇది యమలోకములో నొక భాగము కాబోలు! పూజ్యపాదులగు తాతయ్యమాటకు ఎదురాడినాను. వారి కోర్కె నెరవేర్చలేదు. వారి శాపమే నాకిట్లు తగిలినది. అప్పుడే యమకింకరు లీ యమలోకమునకు గొనివచ్చినారు. నే నిప్పు డేమి చేయుదును? అదిగో ఆ పెద్దనాగు బాము పడగయెత్తి ఆడుచు కరుణామయమగు చూపులు నాపై బరపు చున్నది. ఓ అయ్యా! నీ వెవరవు? నీవునూ ఈ యమలోకమున నొక బంటువా? ఇక్కడకూడ సూర్యుడు వెలుగునా? ఈతడు యమలోకపు సూర్యుడు కాబోలు. పూర్తిగా తన కిరణముల వెదజల్ల లేకున్నాడు” అని యామె వెర్రిమాట లాడుకొనుచున్నది.

ఆమె ఇటు నటు చూచినది. అక్కడ నాడుచున్న పామును సమీపించి బుజ్జగింపసాగినది. పాములతో ఆట నామె కలవాటేకదా! ఆ పామును చెంతకు తీసికొని కౌగిలించినది. ఆ పన్నగేంద్రము ఆమెను మెలివేసికొనిపోయినది. “ఓ నాగరాజా! నీవును శిక్షపడి ఈ యమలోకమునకు వచ్చినావా?” అని ఆమె ప్రశ్నించెను.

నాగరాజు కన్నులు: అమ్మా! నిన్ను స్పృశించిన కాలకూట విషా నందమూర్తివలే తోచుచున్నావు. సముద్రమున జనించిన హాలాహలమే నీలకంఠుని గళమునుండి యిట్లు నీ రూపు తాల్చెనేమో?

విషబాల: ఓ ఉరగాధిపా! నీపై నెవరికి కోపమువచ్చినది? నీ కీ భయంకర పాపలోకముల బాధనొందుమని ఎవరు శాపమిచ్చినారు? నీకును తాతగారున్నారా?

నాగరాజు ఫణిపాదములు: ఓ సౌందర్యగాత్రీ! శ్రీకృష్ణుని పాద రజమువలె సాక్షాత్కరించినావు. నీ దేహమున హిమశైతల్యము, దావానలోష్ఠిమ వియ్యమందుచున్నవి.

విషబాల: ఓ వాయుభక్షకా! నీ కాకలి దహించుకొనిపోవుటలేదా? నీ గృహ మెక్కడ? నీ గృహముకడ పావనోదకములుగల నదీమతల్లి పారుచున్నదా? అందు చల్లని నీరములు కడుపునిండ త్రావుచుంటివా?

నాగరాజు చుట్టలువీడి, ఆ డొంకలలో నటు నిటు ప్రాకజొచ్చెను. విషబాల లేచి కచభారము సర్దుకొని యా దిక్కునకు పోవ ఒక్కవాడి ముల్లు కసుక్కున పాదమునకు గ్రుచ్చుకొనుటచే కెవ్వున నార్చెను. తెల్లబోయి యా పాము వెనుక కమితవేగముతో వచ్చి యామె కాలు చుట్టి చుట్టి చూచెను. విషబాల నెమ్మదిగ నా కంటకము నూడబెరకుకొనెను. పాములదారి బాలలకెట్లు సరిపోవును? ఎటుచూచినను ఆమెకు దారి కనబడ లేదు. ఆ పాము నాలుగువైపుల తిరిగివచ్చినది. కాని దాని హృదయమునకుగూడ మనుష్యస్త్రీ నడచుదారి ఏమియు కానరాలేదు.

ఉస్సురనుచు విషబాలిక కూలబడినది. స్థౌలతిష్యుని అనుచరులు ఆ చుట్టునున్న దారులన్నియు ముండ్ల డొంకలతో కప్పి మరియు వెడలి పోయిరి.  ఆమె నాల్క ఆరిపోయినది. దాహమని ఆమెనాలుగువైపుల మోముత్రిప్పి కనుగొన్నది. పాపము ఆపాము చేయునది లేకకాబోలు అంతర్థానమైపోయెను.

అత్యంత పిపాసార్ధితయై దిగంబరియగు నా బాల తన తలకట్టే పక్కగా ఒక లెరుంగక నిద్రపోయెను.

మెలకువ వచ్చి చూచునప్పటికి సూర్యుడు నడినెత్తిపై నున్నాడు. ఆమె కాకలి దహించుకొనిపోవుచున్నది. దాహము! ఈ నిర్జనాటవిలో తన గోడెవరాలకింతురు? ఆ పాముజాడకూడ లేదు. మానవుడు వీడిన యా యనాథబాలను క్రిమికీటకాదులుకూడ వీడిపోయినవా? ఇంతలో బుస కొట్టుచు నెచ్చటినుండియో యా పా మచ్చటకు వచ్చెను. దాని నోట ఒక కప్ప యున్నది. విషబాలిక కా పామాహారము కొనివచ్చినది కాబోలు!

విషబాల పక్కున నవ్వినది. “ఓ ప్రాణ స్నేహితుడా! నా కాహారము కొనివచ్చినావా? కాని నీ ఆహారము నాకు సరిపడదే! నీ ప్రేమయే నా కాహార మగుగాక! ఈ యది నరక మని నాకు తోచుటలేదు. గాఢారణ్యమై యుండు ననుకొనియెదను. అయిన నే నిచ్చట కెట్లు వచ్చితిని? అయ్యో! మా తాతయ్య ఇచ్చట దిగవిడిచి చనలేదుకదా! అమ్మో! నా ఒడలు వణకుచున్నది. నే నేమి చేయుదును? నాకు దిక్కెవరు?” అని గాఢవిషాదమున ఆమె అతికరుణముగా ఏడ్చినది. ఆమె మరల నొడలు మరచి పడిపోయెను.

ఆమెకు జ్ఞానము వచ్చుసరికి సాయంకాలమైనది. ఎల్లయెడల కారుచీకట్లు క్రమ్మినవి. కీకురుకీకురు మని కీచురాళ్ళ చప్పుడు, అడవి మెకముల అరపులు దూరమున వినబడుచున్నవి. విషబాల యిప్పుడున్న అడవి భాగమునకు వన్యమృగములుకూడ రా వెరచును. అక్కడ చుట్టుప్రక్కల రెండామడలవరకు నీరములు లేవు. ఆకాశమువరకు పెరిగిపోయి, పాతాళమునుండి నీరుత్రావు పెద్ద పెద్ద వృక్షములు, వర్షకాలమున చిగిర్చి పెద్దవియై తరువాత ఎండిపోవును. కీటకములకుగూడ దారి యీయని కంటక నికుంజములుతప్ప అచ్చట నేమియు గానరావు.

ఆ నాగుబా మీ దినమున అడవిలో తిరుగుచు మనుష్యుల అడుగుల జాడ కన్పించి భయపడెను. మానవు డెచ్చటను కానరాలేదు. ఆ అడుగుల వాసనలచే నా భుజంగము ఆ పాదములజాడనే ధనువులు, క్రోశములు గడిచి యా విషబాలను కనుగొన్నది. మానవస్త్రీని చూడగనే భయపడి వెనుకకు బారి, భయము కలిగించు వాసనకొట్టనందున ఆ పన్నగము మెల్ల మెల్ల బాలికను సమీపించినది.

ఆకలిబాధ చేతను, దాహముచేతను ఆ విషబాలిక నిశ్చేతనమగు గాఢమూర్చలో మునిగినది. ఆమె రాత్రియంతయు నట్లే పడిపోయియుండెను. మరల తెల్లవారినది. ఒక యామము గడచినది. ప్రకృతియే యామెను సేద తీర్చినది. ఆకలిబాధ ఎట్లో మందగించినది. దాహముకూడ ఏ విధముననో తగ్గినది. కాని కదలలేనంత నీరసస్థితిలో ఆమె అట్లే పడియున్నది.

మరల నిద్రపోయినది. మధ్యాహ్నమగువేళ విషబాలకు మరల మెలకువ వచ్చినది. ఆమెకు కన్నులు విప్పుటకుగూడ శక్తి చాలలేదు. కాని తానొక్కతెయే యచ్చట లేదను నభిప్రాయ మామెకు కలిగినది. నరకలోకము వీడి దేవలోకము వచ్చిన ట్లామెకు భావ మొండు కలిగెను. కన్నులు విచ్చి చూచెదమా యని కోర్కె, కనులు విప్పనీయని నీరసము. ముక్కుపుటముల, గళమును, వాయకోశముల నార్పివేయు విషవాయువులు వీచు నీ ప్రదేశమున సువాసనాపూరితములై వీచు నీ తెమ్మెర లెక్కడివి? అనుకొనుచు ఆమె కన్నులు తెరచినది.  ఎట్టఎదుట మబ్బులు గ్రమ్మియున్న యామె చూపులకు తలపై వంగిచూచు ఒక పురుషునిముఖము మిరుమిట్లు కొలిపినది. ఆమె మాట రాకపోవుటచే నోరు మెదపి మరల కన్నులు మూసివేసుకొనెను. ఇంతలో ఆమె పెదవులపై తీయని, పుల్లని శీతల మగు సుగంధపూరితములగు రసబిందువులు పడినవి. ఆమె నోరు చప్పరించెను. మరల రసబిందువులు వొలికినవి. ఆమె నాలుక జాపినది. అందుపై ప్రాణము లేచివచ్చు నాగరంగఫలరసము నెవ్వరో పిండినారు. 

7. ఆచ్ఛాదనము

వేట రాజుల వ్యసనము. బ్రాహ్మణ ప్రభువులకుగూడ వేట తప్పదు. బుద్ధభగవానుని ధర్మము నాశ్రయించినను రాజులకు వేట ఏల తప్పును?

మృగయావినోదియై శ్రీకృష్ణసాతవాహనమహారాజు పరివారసమేతుడై వెడలినాడు. వేటకుక్కలు, డేగలు, గరుడులు, చిందుగులు, ఏనుగులు, కిరాతులు, సామువాండ్రు కూడ బోవుచుండిరి. వారితో శుల్బములు మృగబంధనములు, భారయష్టులు, డప్పులు, వృక్షాదనములు, క్రకచములు, మృగబంధనములు, భారయషులు, డప్పులు, నారాచములు, త్రిశూలములు, ఔషధములు, కాగడాలు, శిబిరములు, మంచములు, ఆసనములు మొదలగు పరికరము లెన్నియో తెచ్చుచుండిరి.

విషవైద్యులు, కార్తాంతికులు, భిషక్కులు, వంటవారు, ఆఖేటన విద్యాచతురులు తోడరా మహారాజు సేనాపతిద్వితీయుడై చనుచుండెను.

చిందుగులు వేటాడుటయందు ప్రసిద్ధినందిన జంతువులు. చిందుగులను సివంగు లనియు బిలుతురు. అడవి ఎర్రకుక్కలను కూడ చిందుగులవలె బోనులలో పెంచి మృగములను వేటాడించువారు ఆంధ్రులు.

ఆంధ్రశాతవాహనులు బుద్ధపదారాధనాతత్పరులయ్యు, సంధ్యార్చనాదికముల మరవరు. క్రతువుల నాచరింతురు కాని వానిని హింసాపూర్వకముగా జేయరు. శ్రీకృష్ణ శాతవాహనమహారాజును రేపకడనే స్నానమాచరించి సంధ్యార్చనాదికముల నిర్వర్తించి కవచము ధరించి సకలాయుధోపేతుడై శుభముహూర్తమున విప్రాశీర్వాదములు చెలగ ఏనుగు నెక్కబోవుచుండ దూరమునుండి తీయని ఒక బాలికాకంఠము తెల్లవారుగట్ల పాటపాడుచు వినంబడినది.

రాజజ్యోతిషికుని తనతో భద్రదంతావళము నెక్కగోరి శ్రీకృష్ణుడు గజారోహణ మొనర్చెను. గజమును కదలినది. వేటపరివారమంతయు గదలినది. శ్రీకృష్ణుడు జ్యోస్యునితో తన కలయంతయు తెలిపి దాని ఫలితము వినిపించ ప్రార్థించినాడు. ఒక యరనిమేషము ఆలోచనాధీనుడై యా కార్తాంతికుడు శ్రీకృష్ణుని జూచి,

"ప్రభూ! తమ స్వప్నమును, తాము ప్రాయాణోన్ముఖులై నప్పుడు వినిపించిన యా మధురగీతాలాపన పరమార్థమును సమన్వయించిన, తమకు కొన్ని చిక్కులు వివాహవిషయమై రాగలవనియు, అవియన్నియు తీరి పరమానందముగ వివాహమగుదు రనియు, తమకీ ప్రయాణమున అఖండ విజయము, ఆ విజయమునకు ముందు వివాహాదివిషయమువలెనే కొన్ని చిక్కులు, ప్రాణాపాయస్థితులు సంభవించుననియు, నాకు తోచుచున్నది” యని మనవి చేసెను. “స్వప్నమువలన నట్లు చెప్పవచ్చునా? ఈ జ్యోతిష్యాదులు నిజమా? యన్న ప్రశ్నలు నాలో నప్పుడప్పు డుద్భవించును. ఈ ప్రపంచమంతయు మాయ యందురుకదా! ఈ ప్రపంచమెంతయున్నది? దీని కాధారము మేరు పర్వతమేనా? ప్రపంచమధ్యమున జంబూద్వీపమా? ఆ ద్వీపములో నవవర్షములు. అందు మనము నివసించు భారతవర్షము అనంతమైన జగత్తులో మనమేపాటి? మనస్వప్నము లేపాటి?”

“ప్రభూ! తాము సెలవిచ్చినది సత్యమే. మహత్తత్త్వమువలన ఈ సర్వ భూమండలము పరిభ్రమింపవచ్చును. లోకాలోకపర్వతము వరకు పోవచ్చును. మనవారు జంబూద్వీపాంతరములకుబోయి సువర్ణద్వీపములు చూచి రాజ్యము లేర్పరచుకొన్నారు. యవనరాజులతో వర్తకములు చేయుచున్నారు. అనేక వర్షములలో చిత్రచిత్ర మనుష్య జాతులను, మృగజాతులను జూచుచుండిరి. ప్రపంచమెంత విశాలమైనను సనాతనమైన ధర్మమొక్కటే దీనిని ధరించుచున్నదికదా!”

“అవును, మహాశ్రమణకుని బోధకు, ఆర్యఋషుల బోధకును సర్వవిషయముల నొకేభావము ద్యోతకమగుచున్నను, నిర్వాణాది విషయములందు, సత్యదర్శనమందు కొలది భేదములు మాత్రము కనబడుచున్నవి. సర్వప్రపంచమిట్లు ప్రత్యక్షమై రాజ్యములకై, సంపదకై దారాపుత్రాదులకై సంతోషాదులకై మనమిట్లు తాపత్రయముల బడుచుండియు, నిదియంతయు భ్రమ అనుకొనుట ఏల?”

“మహారాజకుమారా! అంతమాత్రమున జగత్తు సత్యమగునా? మనమును సత్యము కాము. ఒక మహాకర్మమున నేమియులేని శుద్ధానందములో నుండి వికృతినంది మన మీ విచిత్రనాటక మాడుచున్నాము. దానికి ద్రష్టలమును మనమే అయ్యు అహంకార మమకార వశుల మగుచున్నాము. అదియే దుఃఖనాటకము.”

ఇట్లు సంభాషించుచు మహారాజు సపరివారుడై అటవీ మధ్యము జొచ్చెను.

ఆ దినమంతయు వేట జరిగినది. అనేకమృగములు హింసింపబడినవి. అరణ్యమంతయు గగ్గోలుపడిపోయినది.

ఆరాత్రి మహారాజు చిన్నపట్టణమునకు సరిపడు తన పరివార జనమందరితో నొక శైవాలినీకూలమున శిబిరముల వేయించి విశ్రమించెను.

యామములు యామము లాతనికి ఏదియో ఆవేదన. యుద్ధమెట్లుండునో? భరుకచ్చము పట్టుకొనుట, ఆభీరులతో యుద్ధము, వివాహము! ఈ ఆలోచనలు ఆషాఢ మేఘములవలె అతని మనఃపథమున సంచరించినవి.

కొంతకాలమునకు యౌవనశ్రీసుభగుడు నా శాతవాహన కుమారుడు తన మృదుపల్యంకమునుండి లేచి క్రిందికి దిగి మెత్తని పాదరక్షలు తొడుగుకొని మైనపువత్తి దీపములు వెలుగు దీపస్తంభముకడకు పోయి, యా దీపములకొడులన్నియు సరిచేసి, యక్కడనొక ఆసనముపై కూరుచుండి, తన్ను కలచివేయు వివిధాలోచనముల జెదరగొట్టుచుండెను.

ఎన్నిసారులు దూరముగ త్రోసిపుచ్చినను మరల మరల తన వివాహవిషయము అతనికి ప్రత్యక్షమగుచున్నది. ఏమి వివాహము? ఎవరితో? మహారాజుల కొమరితలు తనకు వలదు. వారు తనపుత్రులకు తల్లు లగుదురేగాని తనమనోవేదన తీర్చశక్తి కలుగు వారగుదురా? వారలలో కొందరు అందకత్తియలు నున్నారట. అందచందములు జంతువులకు మాత్రము లేవా?  తమ మాండలికులలో అద్భుతసౌందర్యముగల యువతు లున్నారని ఎన్నియో సంబంధములు వచ్చినవి. తండ్రిగారు తన భావ మేమని కోరినప్పు డా ప్రస్తావనకు తాను ప్రతియీయలేదు. వివాహ మేమి? కామ నిర్వహణమునకు తనకడనున్న బాలికలు చాలరా? అనాఘ్రాత పుష్పములై కుసుమపేశలదేహలై, పరీమళోచ్ఛ్వాసనాసికాసుందరులైన యా బాలల కన్న తన కామాగ్ని కింధనము లగుటకు వేరు వనిత లేల? అయిన వారిని తా నంటినదియు లేదు. వారి యౌవనామృతరసము నాస్వాదన చేసినదియు లేదు. తుచ్ఛానందము దేహసంయోగమాత్రమున జనించును. గాఢమై, గంభీరమై, అనంతమై, అత్యంత గోప్య మగు మానవప్రకృతి కాసౌఖ్యము తృప్తినీయగలదా? కురూపులై భరింపరాని దుర్గంధముల నోలలాడు ఈ కిరాతులలో స్త్రీ పురుషులానందమొందుటలేదా? ఈ దేహసౌఖ్యమాత్రమునకు అందముగూడ నెందుకు? సాధారణ వృక్షములును మహౌషధులు నన్నియు గుసుమించి ఫలించుటలేదా? బీజధర్మ మంతట నొక్కటియే కదా!

శ్రీకృష్ణశాతవాహనుడు పోయి మంచమున మేనువాల్చి నిదుర గూరెను. వేకువనే వైతాళికులు ఉషోదయగీతికల బాడిరి.

వేటజనమంతయు లేచెను. సర్వము సిద్ధముచేసికొని వేటసాగింప బయలుదేరెను, మహారాజు శ్రీకృష్ణశాతవాహన కుమారుడు.

ఏనుగుపై నెక్కి కొంతదూరము సాగెనో లేదో ఎదుట నొక గిరినాగు ఏనుగునకు కొలదిదూరములో కానవచ్చినది. గిరినాగము లన్న ఏనుగులకేమి, సింహములకేమి, మనుష్యులకేమి యన్నింటికిని భయమే. గిరినాగము కంటబడినవాడు దానిబారినుండి పారిపోలేడు. మంత్రవేత్తలు, పాములవాం డ్రానాగములవైపునకైన పోవరు.

“మనుష్యునకు కనంబడని యీ పాము నేడింత నిర్భయముగ నడవుల సంచరించుచున్నదేమి?” యని వారందరు సంభ్రమాశ్చర్యముల నందిరి.

అప్పుడొక పాములవాడు ముందునకు వచ్చి, మహారాజు గజము వైపు తిరిగి చేతులు జోడించుకొని “మహాప్రభూ! ఈపాము దేవరవారిని ఎక్కడకో రమ్మని అడుగుచున్నది. ఈ పాములమాట మే మెవ్వరము జవదాటి ఎరుంగము” అని మనవిచేసికొనెను. 

8. మహావిష సాన్నిధ్యము

ఆ మహానాగము ముందు, వెనుక శ్రీకృష్ణశాతవాహనుడు కతిపయ పరివారము తోడను అమితవేగమున వెడలజొచ్చిరి. ఉత్తరాభిముఖమై ఆ పొదలలో, నిబిడ వృక్ష సమూహములలో, నల్లనిబండరాళ్ళలో ఆ పర్వత నాగేంద్రుడు వారిని కొనిపోయినాడు.

శ్రీకృష్ణసాతవాహనుని మత్తగజము లెక్క సేయక వేగమున బారు నా పన్నగేంద్రు ననుసరించి పోవుచుండెను. వెనుక ఏనుగులు, గుర్రములు, బండ్లు, ఎద్దులు వచ్చు చుండెను.

యువరా జెక్కిన మదగజముపై మంత్రగురువు, విషవైద్యుడు, పాములవాడును ఎక్కిరి. వారట్లు రెండుక్రోశములదూరము పోవునప్పటికి దారి దొరకుటయే కష్టమగు భయంకరారణ్యము చొచ్చిరి. ఆ ప్రదేశము మృత్యుదేవత విహరించు ఉద్యానవనభూమివలె నుండెను. భయ మనునది ఎరుగని శ్రీకృష్ణసాతవాహన భద్రదంతావళము “మందరాద్రి” యను పేరుగలది ముందునకు అడుగువేయుటకు జంకి ఆగిపోయెను. ఏనుగు లన్నియు నాగిపోయినవి. శ్రీకృష్ణసాతవాహనున కేదియో వివశత్వము కలిగినది. మావటీల నాయకుడగు మంద రాద్ర్యాధోరణుడు ఏలనో గజగజ వడంకెను.

విషవైద్య, మంత్రవైద్యులు వెంటనే తమ గజము నాపి, తాము దిగిరి. మంజూషలో నుండి విషవైద్యుడు ఒక కరండము తీసి, యందు కొన్ని చూర్ణములు వడివడిగా బోసి, చెకుముకి వెలిగించి యా చూర్ణమంటించెను. ఆ కరండమునుండి నల్లటి దూపములు ఘాటైనవి పొగమంచువలె పై కెగసినవి. ఆ కరండమును బట్టుకొని యా విషవైద్యుడు ఎండిన యా ముళ్ళపొదలో ఎటులనో దారిచేసుకొనుచు ముందునకు దూలుచున్న భద్రదంతావళము కడకు బోయెను. అందరికి తుమ్ములు, దగ్గులు వచ్చినవి. ఆ ప్రదేశమంతట నావరించియున్న భయంకర విషవాయువు ఈ పొగలచే సమసిపోయినది. మందరాద్రియు, మావటివాడును, శ్రీకృష్ణసాతవాహన మహారాజును మత్తుతెలిసి ప్రకృతిస్థులైరి.

మహారాజు: ఏమి ఈ విచిత్రము?

విషవైద్యుడు: ప్రభూ! ఈ ప్రదేశమంతయు భయంకర విషగంధ సమ్మిశ్రితమై యున్నది. సర్వవిషనాశకమగు ఈ దివ్యచూర్ణ మొక్క హాలాహల కాలకూటవాయువులదక్క తక్కినవిష వాయువుల నన్నిటిని సమయించును. తామును, మావటీడును, తమ మహాగజమును తూలిపోనారం భించితిరి. నాకును ఆ విషవాయువు తగిలినది. వెంటనే మా ఏనుగుపై వారమందరము “అమృతరస” మను నీ మందును మాత్రలుగా సేవించి, ఏనుగు నాపి, దిగి ఈ పనిని చేసితిని.

అప్పుడా భద్రదంతావళము భూమిపై నధివసింపజేసి శ్రీకృష్ణసాత వాహనుడును గజావరోహణ చేసెను. ఇంతలో పాములవాండ్రు, కిరాతులు మొదలగువార లనేకులా ప్రదేశముకడకు వచ్చుచు దూరముననే యాగిపోయిరి. అందొక్క పాములవాడు “హో” యని కేక పెట్టి యుచ్వైసనమున నిట్లు చెప్పినాడు.

“ఏలినవారు ఉన్నది మహావిషపుగాలులు వచ్చే ప్రదేశం. ఆ చుట్టు ప్రక్కలనే, అదిగో ఆ విధముగ ఆగి, వింతబడి చూచుచున్న ఆ పాపఱేని నివాసము ఉండి ఉండవలె. లేకపోయిన దొరా! అంత చావుగాలి రాదయ్యా” అని చెప్పినాడు.

“ఇప్పుడేమి చేయవలె?” అని విషవైద్యు డరచినాడు.

“స్వామీ! ఆ పొగలు బాగుగా వేయండి. మేమందరము అచ్చటికే వచ్చుచున్నాము” అని ఆ పాములవారిలోఁబెద్ద పెద్దకేక వేసి చెప్పెను. వారంద రచ్చటికి దారిని సరిచేసుకొనుచు వచ్చిరి. ఈలోన ధూపకరండము లయిదారింటిలో విషనాశక చూర్ణము పొగలువేయబడినది. రాజకుమారుడు, పాములవాండ్రు, కిరాతులు, విషవైద్యగురువు, మంత్రవైద్యుడు మాత్రము కాలినడక నా పన్నగేంద్రమును వెంటనంటిరి.

“అమృతద్రావక” మను ఒక మందు స్ఫటికశిలలో దొలచిన కలశములో నుంచిన దానిని విషవైద్యుడు వలిపెములపై పోసి తడిపి, ఆ వలిపెముల ముక్కలు అందరి ముక్కులకు కట్టి తానును కట్టుకొనెను.  అప్పటికే సూర్యుడు చండకిరణుండై మధ్యాహ్న సింహాసనము నాక్రమింప వేగమున బోవుచుండెను. అందరికిని నాల్కలు తడియారి పోవుచున్నవి. చిరుచెమ్మటలైన వారి దేహముల నుద్భవించుటలేదు. దాహముకాకుండ వైద్యుడు యష్టిమధుకాదుల భావనచేసిన మాత్రల నెల్లవారికి నిచ్చెను. అవి ఒక్కొక్కటియే వారు నోటిలో వైచుకొనుచుండిరి. వారి దాహము కొంచెము తగ్గజొచ్చినది.

ఇంతలో ఎదుట విగతజీవివలె పడియున్న యొక దివ్యసుందరి విగ్రహము! ఆ విగ్రహము దిగంబరమై ఒరనూడ్చి పడవేసిన కృపాణమువలె నున్నది.

ఆ విగ్రహపు దీర్ఘవినీలకుంతల భారము చెదరి, యామెపై ఆచ్ఛాదన వస్త్రమువలె పడియుండెను. ఆ విగ్రహము అమరత్వముదాల్చిన రూపమే. అయినను ఏ మహావిధి సంఘటనవల్లనో వాడిపోయిన నందనవన పారిజాతకుసుమమువలె నున్నది.

ఆ నాగుబాము విషాదముతో, ఆ పడియున్న విగ్రహముచుట్టు బుసలు కొట్టుచు వీరందరు నిలుచుండియున్నవైపు చూచుచు, తిరుగుచు తొక్కట పడుచుండెను.

ఈ దృశ్యమేమి? ఆ బాలిక ఎవరు? ఆమె ఎక్కడిది? ఆమె బ్రతికియున్నదా, చచ్చిపోయినదా? యని యాలోచన లందరిహృదయముల నొక్కసారి జనించెను. ఆ వైద్యగురువు పడియున్న బాలికను దూరమునుండియే ఒక నిమేషము తీక్షణదృక్కుల పరికించి “మహాప్రభూ! ఆ బాలిక బ్రతికియున్నది. కొనయూపిరితో నున్నయది. ఆమెకు వెంటనే చికిత్స సేయకపోయినచో ఆమె చనిపోవును. కాని.... కాని....” అని తొందర తొందరగా మాటలాడెను.

“కాని ఏమి! వెంటనే ఆమెను రక్షింపవలెను. రండు పోవుదము”

విష: ఆగుడు మహారాజా! ఒక్క అడుగు ముందుకు వేయకుడు! ఆమె ఏ మహత్తరవిషమో సోకి అట్లయియుండవచ్చును. ఆమెదగ్గరకు పోవుటే మృత్యువదనమున బడుట.

మహా: మఱి కర్తవ్యమేమి? వ్యవధి లేదు. ఆ దేవాంగన చనిపోవును. మీరు రానిచో నేను పోయెదను. ఏదిరా ఆ గొడ్డలి?

అని శ్రీకృష్ణసాతవాహనుడు ముందు కురకబోయినాడు. ఋషితుల్యడగు నా విషవైద్యుడు మహారాజుకడకు పరుగెత్తి వారిని నివారించి, “ప్రభూ! ఒక్క అడుగు ముందుకు వేసితిరా, తథాగతునిపై నాన! తొందర పడకుడు. నేను ఇంకొక మహావిషమును సేవింతును. ఈ విష మా విషమును విరచును. ఇది సేవించినవారు మూడుదినములావల వేయి గజనిమ్మ పండ్లు సంపూర్ణముగ భక్షింపవలయును! ఆ భయంకరవిషము ఈ విషమును నాశనముచేయుచు తాను నశించును. ఇప్పుడు నేను పోయి, ఆ విషమును నా సంచిలోనున్న గజనిమ్మపండును ఒలిచి ఆ రసముతో రంగరించి, ఆ బాలికనోటిలో పిండెదను. మీరంద రిచ్చటనే యుండుడు. ఆ వ్యాళగ్రాహియు, నేనును పోయెదము” అని వేగముగ బల్కెను.

వారందరట్లు చూచుచుండగనే, విషవైద్యునికడ విషము ఆ ఇరువురు భక్షించి, ముళ్ళకంచెలు గొడ్డలిచే ఛేదించుచుపోయి యా బాలికను చేరిరి. విషవైద్యుడు వెంటనే యామెపై తన ఉత్తరీయమువైచి యామె దిగంబరత్వమును కప్పెను. 

9. ప్రణయా వేదన

విషవైద్యుడు విషబాల నాడిని పరీక్షించి, యా నాడిబలమున కచ్చెరు వంది, ఆమె పెదవులపై గజనిమ్మపండు రసమును పిండినాడు.

ఆ తీయని, పుల్లని, శీతల మగు సుగంధపూరితములగు రసబిందువులు అమృతరసబిందువులై పడినవి. ఆమె నోరు చప్పరించెను. మరల రసబిందువులు ఒలికినవి. ఆమె నాలుక జూపినది. అప్పుడా విషవైద్యుడు తన సంచిలోనుండి నాగరంగఫలము నొకదానిని తీసి ఒలిచి ప్రాణము లేచి వచ్చు ఫలరసమును ఆమె నాల్కపై పిండినాడు.

విషబాల “దాహము, దాహ” మని లేచినది. పాములవా డామెను “తల్లి! నువ్వు కదలకు; అన్నీ మేము చూచుకొందుము” అని అనునయించుచు, తన తలపాగాతీసి ఆమె తలకు దిండుగ నమర్చి, తనపై గొంగళిని పక్కనమర్చెను.

ఇంతలో విషవైద్యుడు పరుగున సేవకులకడకుబోయి తోలు తిత్తులలో నున్న జలమును ఒక కలశమున సేకరించి, విషబాలకడకు వేగముగ వచ్చి, యామెమోముపై నీరములు చల్లి, చేతులు పాదములు జలముల గడిగి, చల్లని ఆ నీటిని కొంచెము కొంచెముగ ఆమె తలయెత్తి తనయొడిలో పెట్టుకొని త్రావించెను. పాముల వాడామెకు ఎండతగులకుండ ఛత్రము నొకదానిని తెచ్చి అడ్డము పట్టెను.

శ్రీకృష్ణసాతవాహనుడు ఆశ్చర్యమున నిశ్చేష్టుడై, యా విషబాల వైపు తదేకదృష్టితో జూచుచుండెను. ఆమె భయంకర జగన్మోహనాకారము, ప్రళయతాండవేశ్వరదృత సంచార సంచలచ్చరణోద్భూతైకాదశ రుద్రమండల మహాగ్నిస్ఫులింగములవలె ఆమె మెరసి పోవుచుండ తన చూపులు, ప్రాణము, మనస్సు, హృదయము, ఆత్మయు ఆమె కర్పించి వేసెను.

విపులమై, భారమై, సుదీర్ఘమైన ఆమె కైశ్యశ్రీ నిర్మలశర్వరీ నిశ్చలాకాశమువలె ఆమె అనంత చైతన్యసౌవర్ణపాటలత్వమును కప్పుచున్నది.

ఇంతలో ఆమె దిగంబరయైయున్నదన్న భావ మాతనికి మెరపు వలె స్ఫురించినది. వెంటనే యా మహారాజు తన నడుమున కట్టియున్న దుకూల బృహతికను ఆమె కంతరీయముగ నిమ్మని యా యహితుండిక వృద్ధున కిచ్చెను.

“ఓ వైద్యగురూ! ఆమె సేదతీరినంతనే వలయురక్షకుల నేర్పాటు చేయుడు. నా అంతఃపుర బాలికల నిరువుర నా మెకడ కంపుదునా?”

“చిత్తము ప్రభూ! ఆ ఏర్పాటు లన్నియు నొనర్చెదను. ఈ ప్రదేశమంతయు సూర్యకిరణములు చొరగానిది. దుర్మార్గు లెవరో ఈ బాలను ఇట దిగవిడిచి ఇటునటు బోకుండ ముళ్ళకోట కట్టినారు.”

"అవును. ఆమెను ఎవరో మునుష్యులే ఇక్కడ క్రూరచిత్తులై దిగవిడిచిపోయినారు. ఇంతవరకు ఆమె శాపగ్రస్తయై భూమికి అవతరించిన ఏ దేవియో యను భ్రమలోనుండి, మానవులకు ఆమెకు సంబంధము ఊహించనైతిని. ఆమె నాగలోకవాసిని కాదుగదా!”

“ప్రభూ! ఆ గిరినాగము గడబిడలో ఏమైనదో కనిపెట్టలేకపోతిమి. మీ రనునది నిజమేమో? కానిచో ఈ బాల ఇంత విషయుక్తయయ్యు, ఎట్లు బ్రతుకగలిగినది?"  “విషయుక్తయా? అది యేమి?”

“ప్రభూ, ఈమెయందు మహావిషము కూడియున్నది. ఆమె కను కొలకులు పరీక్షించితిని. నఖములు పరీక్షించితిని. నాలిక చాపినప్పు డా జిహ్వము తీక్షణముగ పరిశీలించితిని. ఆమె పెదవులు, చెవుల తమ్మెలు, భ్రూయుగ్ముము, ముక్కుపుటములు అత్యంత నిశితముగ పరిశీలించితిని. మహారాజా! ఈ బాలికయందు సర్వవిషములు జీర్ణించియున్నవి. అవి ప్రస్తుతము విజృంభించియున్నవి. ఆ విషములే మనల నందర నంత చికాకు పరచినవి.”

“అయిన నీ బాలిక ఎట్లు బ్రతికియున్నది? ఆమె ఇంతలోనే చనిపోవునా? ఆమెను బ్రతికించు ఉపాయములు లేవా? మీ శాస్త్రముల కాపాటి శక్తి చాలదా? ఏ దుర్మార్గులు, రాక్షసులు, పిశాచులు ఈ బాలిక నిట్లుచేసిరో వారిని వేయి ఖండములుగ నరికివేతును వారిని బ్రతికియుండగానే ఇటులనే తిండి పెట్టక, నీరమియ్యక, ఇట్టి మరుభూమిలో మాడ్చి, గ్రద్దలకు, రాపులుగులకు బలిచేయుదును!”

శ్రీకృష్ణశాతవాహనుని కండ్లు స్ఫులింగశకములైపోయినవి. ప్రచండ సూర్యగోళము లైనవి. ఆతని కుడిచేయి కరవాలమును దృఢతర ముష్టి బంధమున పట్టుకొనినది. ఆతడు ప్రళయకాలరుద్రునివలె మండి పోయినాడు.

ప్రక్కనున్న మంత్రగురువు ఎదుటికి వచ్చి, “శాంతింపుడు, మహారాజా! శాంతము ఎట్టికష్టములనైన నివారించునుగదా! ఇప్పుడు కర్తవ్య మాలోచింపవలయునుకాదా? ఆ బాలికకు ప్రాణాపాయ మేమియు నుండదు....” అనెను.

శ్రీకృష్ణ: మీ రెట్లు చెప్పగలరు?

విషవైద్యుడు: ఆమెకు ప్రాణాపాయ మేమియు లేదని నేను నా వైద్యశాస్త్ర జ్ఞానమంతయు నాధారముగ ప్రతిజ్ఞచేసి చెప్పగలను ప్రభూ!

మంత్ర: ప్రభూ! నేను నా మంత్రశాస్త్ర ప్రమాణముగ ప్రతిన చేయగలను.

శ్రీకృష్ణ: మనకందరకు ప్రాణభయము కల్పించునంతటి విషము లామెకు ఇచ్చినా రంటిరి. ఆమె ఎట్లు బ్రతుకును? మీ మాటలు నమ్ముటెట్లు?

విష: మహారాజా! అదే విచిత్రము. కారణ మిప్పుడు నేను చెప్పలేను. కాని ఎంతటి విషమునైన ఈమె హరించుకోగలదు.

శ్రీకృష్ణ: నాకు మీ యిరువురి మాటలవలన మతిపోవుచున్నది! ఈ లోన ఆ బాలిక ప్రాణము పోకుండ చూడుడు. ఆ బాలిక ప్రా-ణ-ము-పో-యె-నా, సర్వదేవతలు సాక్షిగ నాప్రాణములు మరుక్షణమున నా బొంది నుండవు!

ఇది యేమి యని చకితులై మంత్రగురువును, విషవైద్యులు నొకరి నొకరు చూచుకొనినిరి. వెంటనే మంత్రగురువు....

“ప్రభూ! ఈ విషగాలులు తమ నరములను క్షోభింపజేసినవి. తాము పోయి, గజ మారోహించి కొంచెము విశ్రాంతినందుడు” అని విన్న వించెను.

“నా కింతటినుండి విశ్రాంతి యనునది లేదు. ఈ బాలిక జీవితము ఏదియో మహత్తర విధివశమున నాబ్రతుకుతో అత్యంతగాఢసంశ్లేషత నందినది. ఆమెకు ప్రాణము నిలిచినది అన్నమీదట నా ప్రాణము తనంత నిలుచును” అని మహారాజు వచించెను.

విషవైద్యుడు భయముగదురు హృదయముతో చేతులు వడక, విషబాలకడకు బోయి, మరల నతిశ్రద్ధగ నామె ఉచ్ఛ్వాసనిశ్వాసములు, కన్నులు, కపోలకంఠ హస్తతల  మణిబంధకూర్పరపాదగుల్నోరుపజిహ్వాదినాడులన్నియు బరీక్షించెను. అత డంత లేచి, మహారాజుకడకు బోయి “ప్రభూ! ఈ బాలిక బ్రతికియున్నది. ఆమెయందు మహాసర్పనాడి వ్యాప్తమై యున్నది. అయినను ఆమెలో భోజనము, నీరము గైకొనని నీరసముతప్ప వేరొండు దోషమేమియు లేదు. ఆ దోషములైనను ఇప్పుడు కొలదిగ మాత్రమున్నవి. ఆమె ఇప్పుడు నిద్రపోవుచున్నది. మహావిషదిగ్ధయగు నీ బాలిక ఇతిహాసములలో, విష శాస్త్రములలో చెప్పినట్లు ఈ.....బా....లి.....క....“వి......ష......క......న్య.....క...” యని వణంకుచు చెప్పి తలవంచుకొనెను.

శ్రీకృష్ణ: విషకన్యకయా!

సింహగర్జనవలె ఆ ప్రదేశముల మారుమ్రోగ నిట్లడిగిన యువరాజు వదనమాలోకించి,

“చాణక్యదేవుడు పర్వతకుని పై విషకన్య ప్రయోగముచేసెనని వినరా మహారాజ కుమారా!” అని మంత్రవేత్త పలికెను.

శ్రీకృష్ణ: అట్టి బాలిక ఇక్కడ నెట్లు పడియుండును?

విషవైద్యుడు: ప్రభూ! ఆమె నాశనము గోరి ఎవరో ఇచ్చట వదలి యుండవచ్చును.

శ్రీకృష్ణ: కార్తాంతికులవారిని పిలువనంపుడు.

వెనుక వేరొక గజముపైవచ్చు కార్తాంతికు డచ్చటికి విరుగుడు మందులు సేవించి కొలదికాలమునకు వచ్చెను.

శ్రీకృష్ణశాతవాహను డాయనవైపు తిరిగి “పండితులవారూ, ఎవరు ఈ బాల? ఈమె నా కంటబడిన ఫల మేమి?” అని యడిగెను.

కార్తాంతికు డంతట తనలో నొకింతసేపు గుణించుకొని “మహారాజా! ఈ బాలిక రెండు మూడు సంవత్సరములు ఈ స్థితిలో నుండును. ఈమె సత్కులవంశజాత. ఈమె జాతకము పరమోత్కృష్ఠము. ఈమె మహారాజ్ఞి యగును. మీ జీవితమునకు ఈమె జీవితమునకు ఏమియో సంబంధమేర్పడు సూచనలున్నవి. ఈమెను వెంటనే వలయు నుపచారములతో, కట్టుబాటులతో మనతో గొనివచ్చు ఏర్పాటులు చేయుడు. ఒక శిబికపై ఈమె ప్రయాణము చేయును. ఈ మహావైద్యు లీమె రక్షణకై వలయున వన్నియు నిర్వర్తింతురు” అని మనవిచేసెను.

విషవైద్యుడు, “ప్రభూ! తాము నా అనుమతిలేనిదే రెండునెలల పాటు ఈమెను సమీపింపనని మాట ఇచ్చినచో నే నీ భారము వహింపగల” నని విన్నవించెను. 

10. నర్మదానదము

నర్మదానదము ఎంత శ్యామలమో అంత ప్రసన్నము. ఎంత గంభీరమో అంత సుందరము. సింధునది మహాశక్తిమతి. ఆమె అనాది చరిత్రకలది. ఆమె వేదములతోడనే ఆవిర్భవించినది. ఆమె అదితిదేవి. దెస దెసల ఆవరించు వెలుగు వాకలై ప్రవహించు మహానది ఆమె. ఆమె గర్భమున దేవనదులే ఇమిడిపోయినవి. ఆమె కాళికారూపిణి. ఆమె సర్వమతములు తనలో జీర్ణించుకొన్నది. ఆమె దస్యులకు, అసురులకు, యవనులకు ఆశ్రయమిచ్చినది.

నర్మదానది నవోఢ. ఆమె భారతవర్ష దేవికి మణిమేఖల. ఆమె పాత్ర పూరితారుణ రాగరంజితావనతవదన. యమునాదేవి గంభీరచరిత్ర. ఆమె తరళనయన, ప్రేమ ప్రేంఖణిత మానస, కృష్ణభక్త్యంకిత, వినీల జలజనయన.

నర్మద అల్లరిపిల్ల. ఆమె నాట్యమాడును. కిరాతకన్యలతో ఆ అడవులలో దోబూచులాడును. అడవిపూలే అలంకరించుకొనును. అడవిలతల మేఖల నొనరించును. తీయని స్ఫటిక జ్యోత్నలలో, ఆ అడవిదారుల వనపత్రవస్త్రాలంకృతయై దీర్ఘకుంతలములు విరియబోసికొని, పురుకుత్సునకై వియోగ గీతికల బాడుకొనును. గంగానది మహావేగవతి, త్రిపథగామిని. పవిత్రాంబుపూరయై మానవజీవితములనే పూత మొనర్చును. ఆమె స్నిగ్థసితాంగ. ఆమె పుట్టుకయే మహారహస్యము. ఒకనాడు విష్ణుపాదముల జనించును. వేరొకనాడు మహేశ్వరజటాజూటస్థ యోగనిద్రపరవశ. ఒక దినమున జాహ్నవి, మరు దినమున భాగీరథి. ఆమె సాగరసింహాసన పట్టాభిషిక్తమహాసామ్రాజ్జి. వరణుని దేవేరి.

నర్మద భర్తనుజేరు దివ్యసంగమస్థలముకకు డెబ్బది యోజనముల దిగువను గౌతమి ఉద్భవించినది. ఆమె నర్మదను చెల్లీయని పిలుచును. కృష్ణ గౌతమినే చెల్లి ఏమి చేయుచున్నదని ప్రశ్నించును. వారి పెద్దక్కసింధునది. వార్తలు నర్మదయే గౌతమికి వినిపించును. సరస్వతీనది సంగీతమును వేసవిరాత్రులందు నర్మదా గౌతమీ కృష్ణా భీమరధీ తుంగభద్రావేణీ కావేరినదులు ఆలకించును. ఆమె వీణాస్వరముల మేళవించి తీయని గీతికల పాడును. గంగా యమునా శోణా బ్రహ్మపుత్రికా మహానదులు తన్మయురాండ్రై విందురు.

ఆనాటి రాత్రి వైశాఖపూర్ణిమ. వెన్నెలకరుళ్ళు విశ్వమెల్ల ప్రవహింపుచున్నవి. సువర్ణశ్రీ కుమారుడు గోండువేషముతో నర్మదానది తీరమున ఆ తెల్లని రాలలో రాయియై, నీడలలో నీడయై, నదీజలమువంక చూచుచు నదీకంఠ మహా సౌందర్యము గమనింపుచు గూరుచుండెను.

మహాబలగోండుడు, హిమబిందు నింతవరకు విరోధులు గొనివచ్చి ఇచ్చట మాయమైనారని సువర్ణునకుజెప్పి రాక్షసులచే నా ప్రదేశమంతయు, గాలించి వెదకింపనెంచి యాతని సప్రమత్తుడై యుండగోరి మాయమయ్యెను. ఇన్నాళ్ళ నుండియు మహాబలుని స్నేహమువలన ఆటవీ సంచరణ విద్య సువర్ణునకు చాలవరకు అభ్యస్తమయ్యెను. ఆతడు ఎంత ప్రమత్తతతో నున్నట్లు కనబడుచుండెనో, అంత జాగరూకతతో అన్ని సవ్వడులను వినుచుండెను. సర్వదిశలు పరిశీలించుచుండెను.

“హిమబిందూ, శిల్పదేవీ! నీ వేమైతివి? నీ వెట్టికష్టముల నందుచున్నావో? ఆగర్భ శ్రీమంతురాలవు, వర్ణనాతీత సుందరశ్రీ మూర్తివి. శిల్పులు నీ యందమును మూర్తింప గలరా? కవులు నిన్ను కావ్యమున బాడగలరా? దేవీ! ఏ మహావిధి మనల నిద్దర గూర్చినది. నీవు నాకడ లేకున్న నా హృదయము సౌందర్యదూరమగును. ఏ బాలికనో పెండ్లియాడి బిడ్డలగనుచు జీవితమును సముద్రతీరపు పఱ్ఱనేలవలె పరచి యుంచువానికి శిల్ప మెందుకు? కవిత్వ మెందుకు? గాన మెందుకు?” అని లోలోన అస్పష్టవాక్యముల గొణుగుకొన్నాడు సువర్ణశ్రీ.

 “ఈ యాత్ర నీకునై, ఈ మాహాటవిలోన,
ఈ గవేషణఫలము ఈవు నా కౌదువే?"

ఆమెకు దనకు నేమి సంబంధము? ఆకాశమున దివ్యదర్శనము దోచినది. అప్పుడే మాయమైనది.

తానట్టి సన్నివేశము కోరెనా? ఏల తనకా దివ్యదర్శనము కావలెను? దూరదూరము నుండియే పవిత్రాద్భుత సౌందర్యమును, రసజ్ఞ తపఃఫలమైన దానిని పూజించుకొను చుండియుందునే? తనకడ కామె నన్ను ఏల రానిచ్చినది? ఏల ప్రేమించినది? ఇంతలో నీ ఎడబాటేమి?

లోకములో సౌందర్యానేకశ్రుతులు శిల్పి సమీకరించుకొనును. ఒకచోట కన్నులు, ఒకచోట మోము, ఒకచోట హస్తములు, ఒకచో పాదములు, ఊరువులు, కటి, వక్షము వేరువేరు స్థలముల సుందరులయందు ప్రత్యేకముగ శిల్పి పరిశీలించును. దోషములు త్రోసివేసి వానిని ప్రమాణములు చేసికొనును. అటులుండ ఏ అపశ్రుతియులేని మొక్కవోని అపరాజిత సౌందర్య మొక యెడ భాసింప, నా దేవి స్వప్నగతజీవి యగుశిల్పికి ప్రత్యక్ష మగుటయా? అతడు రాశీభూతమైన ఆ అలౌకికసౌందర్యము సన్నిహిత మొనర్చుకొనలేక పోవుటా? “సువర్ణా! నీ వెఱ్ఱికాని ఆంధ్ర సింహాసన మెక్కదగిన ఆ దేవి యెక్కడ? శిల్పిమాత్రుడవు నీ వెక్కడ? ఆ దేవిసౌందర్యశ్రీని వేభంగుల శిల్పించుకొమ్ము. లోకమెల్ల నా సౌందర్యముతో నింపుము. నీ జన్మమున కదియే చరితార్థత” అనుకొని అతడు నిట్టూర్పు విడిచెను.

హిమబిందు తా నెటులైన వెదకి, యామెను శత్రువుల బారినుండి రక్షించి వణిక్సార్వభౌముడు చారుగుప్తున కప్పగించు పుణ్యము లభించునా? సార్వభౌముని సైన్యము లీయడవులలో నాశనమైనివో, వెనుకకుబోయినవో ఇంకను యుద్ధము చేయుచు ముందునకు వచ్చుచున్నవో?

చారుగుప్తున కా సౌందర్యనిధిని అప్పగించి తాను హిమాలయములకు పోవుట మంచిది. శాక్యసింహజనన పవిత్ర ప్రదేశముల దర్శించి, ఆ పవిత్రహిమాలయములలో నివసింపనిచో నా యారాధ్యదైవతము నారాధించి, రూపెత్తించు మనస్సమాధి తనకు లభింపదు. ఆ దేవిని గండరింప గన్నచో మహోజ్వల మూర్తికి భరతఖండమంతట నీరాజనము నెత్తింపగన్నచో, నపుడుకదా ఆ దేవి తన్ననుగ్రహించినదానికి ఫలము లభించుట, ఆ దేవి తన కింక నేమి వరమొసంగగలదు! తద్వారస్వీకృతికి అర్హత సంపాదించు కొనుటయే తనపని.

ఇంతలో, ఆ ఆలోచనామధ్యమున నీటిలో అస్పష్టధ్వను లొనరించుచు కొండచరియ క్రీనీడలో ఒక పడవ చనుచున్నట్లు చప్పుడు విననయ్యెను. సువర్ణుని యాలోచనలన్నియు ఆ ధ్వనివైపు తీక్షణతో ప్రవహించినవి. అతడు నెమ్మదిగా భూమిమీద వ్రాలిపోయెను.

ఆ పడవ నది ఈవలి వైపునకు దాటి, సువర్ణశ్రీయున్న కొండచరియ గట్టు క్రింద నాగిపోయెను. నెమ్మది నెమ్మదిగ సువర్ణశ్రీ జరిగి జరిగి పది హస్తముల దూరముననున్న నదీకూల శిలాతలమునకు బోయి, నదిలోనికి తొంగిచూచెను. క్రింది పడవగాని మనుష్యులు గాని కనబడలేదు. ఇంద్రజాలముచే వలె వారందరు మాయమైపోయిరి.

ఏమిది ఈ చిత్రము? ఏమైపోయిరి తనకు కలవచ్చినదా, లేక భ్రాంతి కలిగినదా? ఏమి జరిగెను? ఆతడు కన్నులు చిల్లులుపడ ఆ చీకటి లోనికి చూచుచుండెను. రెండు ముహూర్తములట్లు జరిగిపోయెను. ఇంతలో నా పడవ ఆ కొండచరియ గోడలనుండి వచ్చినట్లు బయలుపడు చుండెను. అందు ఇరువురు మనుష్యులుండిరి. వారు చల్లగ నా పడవను నడిపించుకొని పోయిరి. ఆవలి ఒడ్డున కరిగి ఆ గుట్టలలో, రాళ్ళలో చరియలనుండి నీటికడకు వ్యాపించు తీగలలో, వృక్షములలో, క్రీనీడలందు ఆ పడవ మాయమైపోయెను.

సువర్ణశ్రీ దడదడలాడు గుండెలతో ఆ గుట్టలలో నేరికి గనపడ కుండ ప్రాకుచుపోయి కొంచెము వీలయినచోట నదిలోనికి దిగజారెను. అక్కడ మొసళ్ళుండునేమో యను భయ మాతనికి కలుగలేదు. లోతులుండునో, వడులుండునో, ప్రచ్ఛన్నశిల లుండునో, ఒడ్డునకు మరల చేరుటకు వీలుండునో ఉండదో యని యాత డాలోచింపలేదు.

అతడు నెమ్మదిగ ఈదుకొనుచు ఆ పడవ యాగినదని తాను నిర్ణయించుకొన్న ప్రదేశముకడకు పోయెను. నీటివడి ఎక్కువగ నున్నది. అయినను వీరుడగు నా బాలకుడు మత్స్యతరణవిధాన ముపయోగించుచు నెమ్మదిగ నా ప్రదేశమంతయు గాలించెను. ఆ పడవ యెచ్చట మాయమైనదో ఆతనికి గ్రాహ్యము కాలేదు.

ఇంతలో పెద్దస్ఫటిక శిలప్రక్క నొకగుహవంటి ద్వార మా శిలాతలమున నీటిమట్టమున గాన్పించినది. దానిని గుహాముఖమని ఏరును కనిపెట్టలేనంత విచిత్రముగ నచ్చట శిలాశిఖరములు నీటిలోనుండి తలలెత్తియుండెను. వాన కాలపు వరద లెంతవచ్చినను ఆ గుహలోనికి పడవ కటాకటిగ పోవచ్చును.

సువర్ణశ్రీ యా గుహలోనికి ఈదుకొని పోయెను. అచ్చట పడవ యాగుటకై ఎత్తయిన వితర్దికయు, ఆ వితర్దికనుండి వ్రేలాడు తా డొకటియు నాతనికి గోచరమైనవి. అత డా త్రాడు పట్టుకొని నీటిలోనుండి వెడలివచ్చు చప్పుడు కొంచెముకాగా ఆ వితర్దికపై కెగబ్రాకి, యందు కొంతకాలము చప్పుడుకాకుండ పండుకొనియుండి బల్లివలె ముందునకు కటిక చీకటిలోనికి ప్రాకుకొని వెడలిపోయెను. 

11. మహా గుహాంతరము

ఆ గుహాముఖమున అడుగడుగునావుండు రక్షకభటులలో మొదటి వంతు వారప్పుడే భోజనముకు వెళ్ళిరి. రెండవవంతువారు అప్పుడే వచ్చి వెళ్ళిన ఆగంతుకులు తెచ్చిన వార్తల విషయమై ఇతరులతో జర్చింప నేగి కొంత ఆలస్యమొనర్చిరి. ఆ తరుణముననే సువర్ణశ్రీ గుహలోనికి సగము వరకు బల్లివలె ప్రాకుచు పోయెను.

ఇంతలో మనుష్యులు మాట్లాడుకొనుచు తనవైపువచ్చు సవ్వడి విని సువర్ణుడు చైతన్యమును వదలి, రాయిలో రాయియైపోయెను. గోడకు ఒదిగిపోయి ఊపిరియేనియు వదలలేదు. మాటలాడుకొనుచు ఇరువురు రక్షక పురుషులు సువర్ణుని ప్రక్కనుండియే నడచివెళ్ళిరి. వా రట్లు నడచి నడచి గుహాద్వారమునకు వెడలిపోయిరి. వెంటనే సువర్ణుడు తథాగతుని ప్రార్థించి ముందునకు బ్రాకుచు సాగిపోయెను. ఆతడు ఇరువది ధనువు లట్లు పోవుటయు గుహాంతము దూరమున తోచినది.

ఎట్టి ప్రాంగణమునకు కొనిపోవునో యా గుహ, గుహవెలుపల వెన్నెల వెలుగు తెల్లని పూలప్రోవువలె కన్పించుచుండెను. అచట నొక వీరుడు విచ్చుకత్తులతో నిలువబడి యుండెను. సువర్ణశ్రీ పదినిమేషములు తీవ్రాలోచనలో మునింగి కర్తవ్యము నిశ్చయించుకొనెను. అతడు ఇటునటు తడవినంత రెండుచిన్న రాళ్ళు దొరకినవి. తన నడుమునకు కట్టియున్న చురకత్తియను వదులుచేసికొని, ఎడమచేత దృఢముష్టిని ధరించి, కుడిచేత నా రాయిని నేల పైగొట్టి “టికటిక” చిన్న చప్పుడు చేసెను.

గుహాముఖమున నున్న ఆ రక్షకభటుడు స్తంభించిపోయెను. ఇటు నటు పరిశీలించి యాతడు నెమ్మదిగ సువర్ణశ్రీ వైపునకు వచ్చెను. ఆ కటికచీకటిలోగూడ సువర్ణశ్రీ చూపు మార్జాలదృష్టివలె నైనది. అది అటవీ సంచరణ విద్యాఫలము.

సువర్ణశ్రీ లేడిపై నురుక పొంచియున్న శార్దూలమువలె సర్వావయవములు పొంగ ఛెంగున విరోధిపై నురుక సన్నద్ధుడైయుండెను. అజానుబాహుడైన యా రక్షకభటుడు తనతో నొక దివిటీ తీసికొనిరాక పోవుటయే దోషము.

తన ప్రక్కనుండి యాతడు పోవుచున్నప్పుడు చప్పుడుకాకుండ సువర్ణశ్రీ ఆ రక్షకభటుని వీపుపై ఉరికి కుడిచేత విరోధినోరు గట్టిగమూసి ఎడమచేత నా మనుష్యుని చుట్టి నొక్కిపట్టుచు, కుడిచేయి మణికట్టు గట్టిగ నొక్కిపట్టెను.

తనగురువు సోమదత్తాచార్యులు నేర్పిన మల్లయుద్ధపు నేర్పు నుపయోగించి విరోధిముద్దయై ఒరుగునట్లు మోకాలు డొక్కలో నొక్కి వేసెను. వాని చేతులు బంధించియే బొటనవ్రేల మెడరక్తనాళము గట్టిగ నొక్కుటయు, అయిదు నిమేషములలో స్పృహతప్పి ఆ మనుజు డొరగి పోయెను. క్రిందకు బడిపోవు ఆతని కత్తిని వెంటనే వేగమున పిడితో పట్టుకొని, వానిని క్రింద చల్లగ బరుండబెట్టి, వాని నడుమునకు బిగించు కొనిన కాసెకోక వదలించి, నెమ్మదిగ లాగి, ఒక చివర ఆతని నోటిలో కుక్కి కిక్కురుమనకుండ బంధించి వేసెను. తన నడుమునకు చుట్టియున్న త్రాటితో ఆ మనుష్యుడు కదలకుండ గట్టిగ కట్టివేసినాడు. అచ్చటినుండి త్వరితముగ తన అలంకరణవిధ మంతయూ నూడ్చి యా రక్షకభటుని గోండునుజేసి, తా నా రక్షకభటుని వేషము వైచికొనెను.

ఒక అరగడియలో సువర్ణశ్రీ మాళవ సైనికుని వేషమున నిర్భయముగ లేచి గుహ వెలుపలికి వెడలిపోయెను.

అక్కడ సువర్ణశ్రీ సందర్శించిన దృశ్యము పరమాద్భుతమైనది. అది వింధ్య పర్వతములో ప్రకృతి ఏర్పరచుకొనిన చక్రాకారమగు లోయ చుట్టును మనుష్యుడు ప్రాకలేని ఎత్తయిన శిఖరములు పెట్టని కుడ్యములై ఆకాశము నంటుచుండెను.

ఆ విశాల చక్రాకార కందరాప్రదేశము ఎనుబది ధనువుల వెడల్పు నూటఇరువది ధనువుల పొడవు నున్నది. ఆ భృగుకుడ్యము చుట్టును ముప్పది, నలుబది బిలము లున్నవి. కొన్ని గహ్వరము లయిదారు ధనువుల ఎత్తున నున్నవి. ఎత్తయిన యా బిలములకు పోవుటకు మెట్లున్నవి.

ఈ పర్వతాంతరస్థలమునకు వచ్చుటకు సువర్ణశ్రీ వచ్చినమార్గము తప్ప వేరొండు లేదనియే యాతనికి తోచినది. ఆ ప్రదేశమునందు మూడు నాలుగు వందల జను లుండవచ్చును. అందు బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆటవికులు, నాగరజనులు అనేకులు కనబడిరి. కొందరు అక్కడక్కడ నులకమంచములపై పండుకొనియుండిరి. కొందరు తన గుహాప్రాంగణముల ప్రక్కలు వైచుకొనియుండిరి. అన్నింటికన్న మధ్యగానున్న గుహ యొక్కటి సువర్ణుని దృష్టి నాకర్షించినది. ఆ కందరము ఎత్తుగా అందముగా నలంకరింపబడియున్నది. అచ్చట పలువురు స్త్రీలు నడయాడుచుండిరి. అందు కొంద రాంధ్రస్త్రీలవలె కాననయిరి. సువర్ణశ్రీ గుండెలు తోడనే దడదడకొట్టుకొన నారంభించెను. ఎప్పుడు తాను కట్టివేసిన మనుష్యునివంతు మార్చుటకు కొత్త రక్షకభటులు వచ్చెదరో? దీర్ఘ కందరాగతుడై పడియున్న తన బందీని ఎవరైన గుర్తించెదరేమో? తా నేమి చేయవలసియుండునో?

ఇంతవరకు తన్నిక్కడకు కొనివచ్చిన యదృష్టదేవతయే తన్ను రక్షించుగాక యని సువర్ణుడు ప్రార్థించుకొనెను. తాను కానరాక మహాబల గోండుడేమి అలమటచెందునో యనియు నాతడు భయపడెను.

కొంతకాలమునకు మనుష్యులందరు సద్దుమణగుచుండిరి పోత పోసిన విగ్రహమువలె సువర్ణుడచ్చటనే నిలుచుండి యాలోచించుచుండెను. ఇంతలో ముక్తావళీ దేవి కంఠము స్పష్టముగ వినవచ్చినది. “ఎన్నిదినము లీ చీకటి గుహలో మా కీ నిర్బంధము?” అను ఆమెమాటలు ఆ నిశ్శబ్దతలో మారుమ్రోగినవి.

సువర్ణశ్రీ మ్రాన్పడిపోయెను. అతనికి సంతోషము, విషాదము, కోపము ఒక్కసారి ఉప్పొంగిపోయినవి. తాను వారి దగ్గరకు పోవుట మంచిపని కాదు. ఈ చాటుచోటు నెట్లయిన పట్టుకొని తీరవలయును. ఈ స్థలమును రక్షించు సైనికులు నూరు, నూట ఏబదికన్న ఎక్కువయుండరు. యుద్ధముచేసి ఈ స్థలము పట్టవలయు నన్న హిమబిందుదేవి కేమి కష్టము వాటిల్లునో? ఎవరో ఒక విరోధి ఈ స్థలము తెలిసికొన్నాడని వారికి తెలిసి పోయినచో నేమి మొప్పము వాటిల్లునోయని యాతడు తీవ్రాలోచనలో మునింగి “ఇప్పుడే వారిని రక్షింపవలెను. తరువాత కథయంతయు తారుమారు కాగలదు” అను నిశ్చయమునకు వచ్చెను.

ఆలోచన పొడముట ఏమి, అపుడపుడే వెన్నెల కొండశిఖరములపై దాటి యవతలకు ఒరిగిపోయిన కారణమున చిరువెలుగుతో నిండి యున్న యా ప్రదేశములోని కాతడు నడచిపోవుట యేమి?

ఒక రిద్ద రీతనివైపు చూచిరికాని గుహాముఖమున కావలికాయు మనుష్యుడిట్లు వచ్చుచున్నా డని వా రనుకొనలేదు. ఎవరో రక్షకభటుడు ఆ క్రొత్తగ వచ్చిన ముసలమ్మను మందలించుటకును పోవుచున్నాడని భావించిరి.

అతడు తిన్నగ ముక్తావళీదేవి కేకలువిన్న గుహకడకు బోయెను. ఆ గుహ యందెన్నియో మృగచర్మములు పరచియున్నవి. అచ్చట ఇరువురు రక్షక స్త్రీ లాయుధపాణులై కావలిగాచుచు నిలిచియుండిరి. సువర్ణశ్రీ అనుమానమేమియు లేనివానివలెనే నిర్భయముగ నటకు బోయెను.

కాని అతని ప్రాణము లరచేత నున్నవి. 

12. పునస్సందర్శనం

కంఠధ్వని మార్చుకొని, కొంచెము బొంగురుపోయిన గొంతుకతో సువర్ణశ్రీ మాగధిలో “ఏమి ఆ ముసలమ్మ కేకలు వేయుచున్నది? అని ప్రశ్నించెను.

“ముసలమ్మా! ముసలమ్మ కేకలు పెట్టదా మరి! మేము మనుష్యులము అనుకొంటిరా, పశువుల మనుకొంటిరా?” అని ముక్తావళీ దేవి కెంపులుగ్రమ్మిన కన్నులతో వణకుచు కేకలు వేసినది. “ఏమి కష్టము వచ్చినది మీకు?”

“ఏమికష్టము వచ్చినదా? దుర్మార్గులారా, మీరందరు నాశనమై పోదురు. ఎక్కడి ధాన్యకటకము, ఎక్కడి యీ ప్రదేశము? బోనులో జంతువులను పట్టుకొని వచ్చినట్లు మమ్మిచ్చటకు కొనివచ్చెదరా?”

"ఊరుకో ముసలమ్మా! కేకలు పెట్టకు. మా కార్యము నెరవేరిన తోడనే మిమ్ము మీ స్థానములకు బంపివేసెదము.”

సువర్ణశ్రీ ఆలోచనలు మెరుపులవలె ప్రజ్వలించి మాయమగు చుండెను. ఇంక కొంతతడవు వారితో మాట్లాడుచున్నచో, సహజ జిజ్ఞాసతో ఆ యా గుహలలోవారు, అచ్చటచ్చట తిరుగాడువారు ఇచ్చట చేరవచ్చును. అంతటితో ఎట్టి ఆపత్తయిన ఘటింప వచ్చును. వారికి దనరాక నెఱింగించు టెట్లు? వారు ఏమియు గడబిడ చేయుకుండు టెట్లు? ఏలాగున వారిని తప్పించుకొనిపోవుట?

ఈ ఆలోచనలు మహావాయుసంచలితసముద్రతరంగములై ఒక దానిపై నొకటి ఓరసి దొర్లుకొనిరా, దలయూపుకొనుచు వెనుకకుబోయి, తిన్నగా నా గుహావలయములో నంత్యగుహ కావలనున్న విశాలస్థలమున కేగి యచ్చట నొక రాతిప్రక్క గూరుచుండెను.

ముక్తావళీ దేవియు, హిమబిందును వసించు కందరమునకు కావలి కాచు రక్షక స్త్రీలు ఆ వచ్చిన రక్షకభటుని మాటలలో అధికారధ్వని గ్రహించి, యాతడు మారువేషముననున్న రాజాధికారి ఎవరోయైయుండునని యూహించుకొనిరి. వారు మాగధస్త్రీలని వేషభాషలను బట్టి సువర్ణశ్రీ చేసిన ఊహ సరియైనదే! వారును అతనినొక మాగధవీరునిగ నెంచిరి.

అతని నడకలో, మాటలో, ముఖమున అధికారము ప్రజ్వలితమగు చున్నది. అతనిమాటను తెరవెనుక మంచముపై ఒరగిపండుకొనియున్న హిమబిందు వినినది. బొంగురుగనున్నను ఆ మాటలలో ఎక్కడో వినిన ధ్వని యామెకు అస్పష్టముగ తోచినది.

ఎక్కడ నా మాటలు వినిపించినవి? ఎవరివి? ఆలోచించినకొలది ఆమెకు ఏదియో అనుమానము, ధైర్యము కలిగినది.

ఎవరును “మిమ్ము మీస్థానమునకు పంపివేసెదము, అని ఇంతకు మున్ను చెప్పలేదే? ఆ మాటల యర్థమేమై యుండును?” అని యాబాలిక ఆలో చింపజొచ్చెను.

సువర్ణశ్రీ కుమారునివెంట ఆరక్షక స్త్రీల చూపులు వెంబడించినవని యాతడు గ్రహించినాడు. ఇటులకాదటుల అని ఎన్ని మార్గములనో యాతడు త్రోసిపుచ్చినాడు. వెంటనే యాతడు లేచి, త్వరితగతిని గుహాముఖ ప్రాంతమునుండి నడచుచు, ఆ పర్వత నిమ్నాంత ప్రదేశము చుట్టి, అక్కడక్కడ నాగుచు, పనియున్నవానివలె నడచి నడచి, హిమబిందు ఉండిన గుహకడకు బోయి, ఒక రక్షకస్త్రీకడకు జేరి, యామె చెవిలో “ఉజ్జయిని!” యని అస్పష్టముగ బలికెను.

ఆతడు తన దగ్గరకు వచ్చుటయే గమనింపని యా స్త్రీ వెంటనే తలవని తలంపుగ “ఏమిటి?” యని రహస్యముగ ప్రశ్నించెను.

సువర్ణశ్రీ కన్నులు మెఱయ పెదవులకడ తన కుడిచేయి చూపుడు వ్రేలుంచి గుసగుసలతోడనే “వారిరువురకు వినంబడును! వీ రిద్దరిని వెంటనే ఇచ్చటనుండి సౌరాష్ట్రము తరలింప ఆజ్ఞ వచ్చినది. నన్ను పెద్ద సైన్యముతో పంపిరి. సైన్యము బయట

  1. చేరి సంతసమున చెక్కిళ్ళు వికసింప ఆజ్ఞలిచ్చు రాత్రులందు నాకు పగలువంచియున్న మొగమెత్త దదె యిది అనుచు చెలిని నమ్ముటరిది చూడు.

    (రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారి భాషాంతరీకరణం)

  2. నడుమువరకే
  3. విడిపయ్యెద
  4. దొంగనిద్దురవాడ! ముద్దుగొనినట్టిచెక్కిళులరేగు పులకల చెలువు గంటి ఏల కనుమూసికొనెదు? చోటిమ్ముకొంత మసలనుండనులె మ్మిట్లుమర నెపుడు.

    (రా. అనంతకృష్ణశర్మగారి భాషాంతరీకరణము)

  5. *అడుగుదమ్ములందు పడి వేడుపతివీపు చిన్నికొమరు డెక్కి చెలగియాడ అలుక ఎంత తెగని దయ్యును నిల్లాలిమోమునందు నవ్వు మొలచినపుడు. (రా.అనంతకృష్ణశర్మగారి భాషాంతరీకరణము)