హిమబిందు/తృతీయ భాగం

వికీసోర్స్ నుండి


తృతీయ భాగం1. బెదరింపు

కనాడు సమవర్తి చెంత శత్రువులకడనుండి ఒక రాయబారి వచ్చినాడు. వినీతమతియు సమవర్తియు మంతనము సలిపిన వెనుక సమవర్తి రాయబారిని తన మందిరములోనికి రావించెను. ఆ రాయబారి-

“ఓ సేనానాయకా! వీరాగ్రణీ! నేను నీకు కొన్ని పరమరహస్యముల నెరింగించెదను. నాకు అభయమిచ్చినచో మనవిచేసెదను” అనివాక్రుచ్చెను.

“ఓయీ! రాయబారము నిండుసభలో సలుపవలయును. అయినను నీవు కోరినందున ఏకాంతమనుమతించితిని. రాయబారి ప్రాణ మెప్పుడును సురక్షితము. తుచ్ఛులగు నితరులు ధర్మమునకు దూరు లగుదురేమో కాని ఆంధ్ర వంశము మాది. నేను సాతవాహనుడను. మే మట్టి యవినీతి ఎన్నడును సలుపము. నీ ప్రాణము నీయదియ, చెప్పుము.”

“సమవర్తీ! ఓ నరోత్తమా! మీరు సాతవాహనవంశజులు. చక్రవర్తి కాదగినవారలు. మీకు తెలియని ఆలోచన ఒండెద్దియు లేదు. ప్రతిష్ఠానమున యువరాజు నెవరో నిర్జీవుని చేసినారని మాకు వేగు వచ్చినది. నిజ మరయుటకై అంచెలపై చారులను పంపినాము. రేపు నిజము తెలియగలదు.”

“శాంతం పాపం! ఈ అబద్ధపు వేగు తెచ్చినవాని నాలుక వేయి చీలికలు చేయదగును. ఓయి వెర్రివాడా! ఎవరురా శ్రీకృష్ణసాతవాహనుని సమయించుటకు దెగించినవారు?”

“ప్రభువులు ఆగ్రహింపకుందురుగాక. మా రాయబారము గడముట్ట నడపనిండు. ధనకటకమున ఈ వార్త తెలిసినది. ఆంధ్రప్రభువు యుద్ధ యాత్రకై బయలుదేర సంసిద్ధుడై యుండియు నాగిపోయెను. మీకు సహాయము రాడు. నాల్గుదినములైన వెనుక మీ సైన్యము సమస్తము రూపు మాసిపోవును. మా సైన్యము దినదినాభివృద్ధి గాంచుచున్నది.”

“అయిన నే మందువు?”

“వినుడు, మీరు వీరాగ్రేసరులు, యౌవనవంతులు. మీరు మాలోన జేరిపొండు. మీకు మా రాజభయమిడుటయేగాక ఆంధ్రరాజ్యము సమస్తము జయించి మీ కాధిపత్యము కట్టంగలవారు. మా యొడయనికి స్నేహితులై సేనానాయకులై మీరు ఆంధ్రభూమి పాలించెదరుగాక! మీ రిరువురు ఉత్తర దేశముల జయింతురు. వేదమతోద్ధారకులై రాజసూయమునందు పాల్గొందురు. ఆయన చక్రవర్తి యగును, ఆయనకు మీరు కుడిభుజ మగుదురు గాత.”

“ఏమి ధైర్యము! అటు తరువాత?”

“మీకు రెండు దినములు గడువు ఇచ్చినారు. ఇంతలో మీ సైన్యములు కోట దాటిపోవలయును, ఆయుధములు దిగవిడిచి వెడలవలెను. ఆహార పదార్థములు ఒక్క దినమునకు సరిపడునవి మాత్రమే తీసికొని పోవలయును. మీరు మీ దారిని పొండు, లేదా మాళవేశ్వరునికడకుబోయి అగ్ని సాక్షిగా మిత్రత్వము నెరపుడు.” “ఓరి వాచాలుడా! ఆంధ్రులలో పిరికిపందలు, రాజద్రోహులు మందునకై ననులేరు. మీరాజు చక్రవర్తియా? నే నాంధ్రరాజు నగుదునా? ఏమి యీ చాతుర్యము! కౌటిల్యుని యుక్తిని మించిపోవుచున్నది. పో! ఇంక నీ రాయబారము నాకు వలదు. ఆంధ్రులలో ఒక్కనికైన ప్రాణమున్న ఆతడుకూడ తనబాహుబలము రుచిచూపి మరియు అంతరించును. చక్రవర్తి వచ్చుచున్నాడు. మాకు వేగువచ్చినది. శుకబాణబలమే వచ్చినది. మీ సైన్యములు నామరూపములులేక నశించిపోవును. ఇప్పటి కైన నా మాళవుని, తదితరనాయకులను ఆయుధములు వదలి మా కోటలోనికి శరణార్థులై రా నిండు. మీ సైన్యములు విడిపోయి చెల్లా చెదరు కానిండు. మీ నాయకులకు ప్రాణదానము చేసెదము. లేదా ఒక్కనినైనను కొనయూపిరితోకూడ పోనీయము. ఆంధ్రసింహనాదము మీగుండె లవియజేయును. ఆంధ్ర మృగేంద్ర నిశిత నఖములు మిమ్ము వచ్చి వందరలాడును. పో! ఇదియే నీ రాయబార మున కుత్తరము. మీకు ఒకదినము గడువిచ్చినాము. ఆలోచనచేయుడు.

నే చెప్పినట్లు చేసి ప్రాణములు దక్కించుకొనుడు. కాకున్న ప్రాణము లఱచేత నిడుకొని యుద్ధమునకురండు” అని సమవర్తిమోము జేవురింప కన్ను లుజ్వలింప నుత్తరువిచ్చెను. అతనిచేయి కరవాలపు బిడిపైననే తాండవ మాడుచున్నది.

“సైన్యాధిపా! ఆగుడు, అంత్యసందేశ మున్నది. అయ్యది తమకు మనవి చేసి మరియు పోయెదను. చారుగుప్తుడను వర్తకరాజు మీకు మేన మామయట!”

“అగును.”

“సౌందర్యనిధి యగు హిమబిం దాయన కూతురట!”

“అగుచో?”

“చారుగుప్తుడు ఆంధ్రసింహాసనమున కాదిశేషువట.”

“ఏమిరా నీవాచాలత మీరు చున్నది?”

“ఆ హిమబిందుకుమారి తమకు మిక్కిలి బ్రియతమ యట!”

సమవర్తి మాటాడక తీక్షణదృష్టుల నా రాయబారిని గమనించుచు, తన గుండెలు అటుల కొట్టుకొనుచున్నవేమా యని ప్రశ్నించుకొనియెను.

“ఆర్యా! ఆ బాలిక ఇప్పుడు మాకు బంది అయినది. ఆమెను మీ దేశస్థులే ఎవరో ఎత్తుకొనివచ్చి మాకు ఒప్పగించినారు. మీ సైన్యము లీ దినమున కోట విడిచిపోవలయును. లేనిచో హిమబిందును ఒక కుష్టువానికిచ్చి వివాహము గావించెదము. రేపటికిని మీరు వదలనిచో ఆమె కొకకన్ను, ఒక చేయి నశించును. ఆమె కన్యాత్వము ఏరును అనుమానింపకుండ ఆమె ముత్తవనుగూడ ఆమెతో బాటు బంధించుకుని వచ్చినారట. ఇదియ నా రాయబారము. పనివినియెదను. నమస్కారము. మేము చెప్పిన ఆజ్ఞలు పాలింప మీ సైన్యముల కిచ్చలేనిచో మీ రొక్కరైన మా శిబిరములకు వచ్చివేసి, మా ప్రభునకు మిత్రులు కండు. ఆర్యా! నమస్కారము” అని ఆ రాయబారి వెడలిపోయెను. సమవర్తికత్తిని యొరనుండి తీసినాడు. కోపముచే వణకు దేహముతో, రౌద్రముచే దుమారము కప్పిన మనస్సుతో సమవర్తి వినీతమతి కడకు మహా వేగమున వేడలిపోయి రాయబారపుటుదంత మంతయు వాక్రుచ్చెను.

వినీతమతి ఆశ్చర్యనయనములతో సమవర్తిని కనుంగొని “ఓయీ, నే నా మాటలను ఏ మాత్రము విశ్వసింపను. అంతయు కల్ల. వారికి కోటలోని సంగతి తెలిసికొన ఊహ కలిగి వీనిని పంపినారు. అదియే నిజము.” “ఆర్యా! నేను జాగ్రత్త పడియే యుంటిని. కోటగుమ్మ మావలనే ఆతని కన్నులు కట్టి సభాభవనమున కట్టు విప్పినాము. వెడలిపోవునప్పుడు కోటగుమ్మమునకు వెలుపలనే కట్టువిప్ప ఆజ్ఞ యిచ్చినాను.”

“మంచిపని చేసితివి! అయిన ఈ రాయబారమునుగూర్చి నీ వేమందువు? హిమబిందును పట్టుకొనుట వీరి కెట్లు సాధ్యమగును?”

“నా కేమియు నమ్మకము లేదు.”

ఇంతలో శుకబాణు డచ్చటకు వచ్చెను.

సమవర్తి శుకబాణునకు సమస్తము వినిపించి వానియభిప్రాయ మడిగెను.

శుక: ఇప్పటికి పదిదినములవెనుక హిమబిందుకుమారిని చోరు లెత్తుకొని పోయినారనియు, ఆ చోరుల వెంటనే కొన్ని దళములు తరుము కొనుచు పోయెననియు వార్త వచ్చినది. ప్రతిష్ఠానమునుండి మహారాజు రెండు మూడు దినములలో వేట నెపమున బయలుదేరెను. సైన్యములు నాసిక కనియు, అటు వాతాపినగరమున కనియు బయలు దేరినవి. చక్రవర్తి మహా సైన్యములతో దంతిపురము దాటి, మహానదిని దాటి విదేహ రాజ్యము చొచ్చినాడు. మగధరాజధానిలో నున్న సైన్యములు తక్కువ కాబట్టి ఒక సైన్యము మన సైన్యములనుండి విడిపోయి ఉజ్జయిని వైపు తిరిగినది. మూల సైన్యమునే యడగించుటకు ఔఘలుడు విదర్భ సైన్యములతో, కొన్ని కళింగ సైన్యములతో మహానదికడ అడ్డగించినాడట. ఏనుగు తామరతూళ్ళను చిందరవందరచేసి కాసారము చొచ్చునటుల, దావాగ్ని కాంతారమును దహించుచు విజృంభించునటుల ఆంధ్రసైన్యములు ఆ సైన్యముల నాశనముచేసి, ముందుకు చొచ్చుకుపోయి పాటలీపుత్రము వైపుకు బోవుచున్నవి. ఇంక పదిదినములవరకు మన కోటకు భయము లేదని నిస్సంశయముగ చెప్పగలను.

వినీ: “అవును. కాని హిమబిందువిషయము....” అని వినీత మతి ఇంకను ఏమియో చెప్పబోవుచుండ, ఒక సైనికుడు లోని కేతెంచి వారికి ప్రణామమిడి “జయము! జయము! ఆ రాయబారి వెడలిపోవుచు “నేను సమవర్తి సైన్యాధ్యక్షునకు తెలిపిన యుదంతమునకు సాక్ష్యములివిగో, వీటిని వారి కందజేయుడు” అని యీ మంజూష మా కిడినాడు. ఇందేమున్నదో యచ్చటనే పరిశీలించి మరియు కొనివచ్చినాము. ఇందు ద్రోహమేమియు లేదు. అధిపతులు పరీక్షింతురుగాక” అని యా చిన్న పెట్టె వారి మ్రోల నునిచెను. వారా మందసము తెరచుటయు నందున్న భూషణముల చూచి సమవర్తి హాహాకార మొనర్చెను. నవరత్నఖచితములై మెరయు నా యాభరణములు హిమబిందు కుమారికారత్నము ధరించునవియె. వానికడ నొక మొగలియాకు పై లిఖించిన లేఖయున్నది. అది అందుకొని సమవర్తి యిట్లు చదివెను.

“శ్రీ మహారాజశ్రీలు, వీరాగ్రేసరులు, మేనబావలు నగు సమవర్తి సైన్యాధ్యక్షులకు హిమబిందు నమస్కారములు. నన్ను వీరు మా ఇంటినుండి హరించి మా అమ్మతోగూడ కొనివచ్చినారు. ఇది యే ప్రదేశమో తెలియదు. ఇందు మమ్ము బంధించినారు. మమ్ము వీరు గౌరవముగా జూచుచున్నారు, మేము ధైర్యముగా నున్నాము. కాని మమ్మేలనో వీ రనేకవిధముల బెదరించుచున్నారు. మీకు కమ్మ వ్రాయ మని కోరగా వ్రాసినాను. ఇంతవరకే వీరు నన్ను వ్రాయనిచ్చినారు.

చిత్తగింపుడు,
హిమబిందు”

అక్షరములు హిమబిందువే! ఇక నమ్మకుండుటెట్లు! వినీతమతికి మోము వైవర్ణ్య మొందెను. “హిమబిందు ప్రాణము రాజ్యములతో సంబంధించియున్నది. జంబూద్వీప వర్తక చక్రవర్తి యగు చారుగుప్తున కామె యొక్కతియు కుమారిత, అత డామె కెంతమాత్ర మాపదవచ్చినను ప్రాణములు విడచును. అతడాంధ్ర సామ్రాజ్యమున కేడుగడ. ఇక నే మున్నది?” అని వినీతమతి మతిలేని మాటలు వణంకుచు బలుకజొచ్చెను.

సమవర్తి స్థితి నుడువనక్కరలేదు. ఆతని నాశికాపుటములు విస్తరించెను. ఆతడు తనవిశాలవక్షము నింకను విపులముచేసినాడు. మృగ మొక్కటి పరిసరమున సంచరించుచుండ అపుడ పసిపట్టు సింహమువలె ఆతడు గర్జిల్లినాడు.

అయినను అస్థానకోపమువలన లాభమేమి? ఏమి చేయగలుగును? తాను ఆమెకై యుజ్జయినీదుర్గము వీడిపోయిన తనరాజ్యమునకు, ప్రభువునకు తీరరాని అగౌరవము తెచ్చి పెట్టినవాడగును. హిమబిందు తనకు ప్రాణాధిక. అది యటులుండ అబల, ఆర్త. తా నెట్లు పేక్షింపగలడు? ఒకవంక ప్రభుకార్యము, ఒకవంక ప్రియారక్షణము. సమవర్తి కామవశుడై రాజద్రోహముచేయునా? రాజవశంవదుడై ప్రేమదేవతకే విద్రోహము చేయునా? ఓహో చారుగుప్తతనయా రక్షణముమాత్రము రాజకార్యముకాదా? అవునని నే నెట్లు స్వతంత్రింతును?

“వినీతమతి సేనానాయకా! శుకబాణులవారూ! ఇప్పుడు మీరు నాకేమి యాలోచన చెప్పెదరు? మీ రనినట్లు హిమబిందు ప్రాణముతో, గౌరవముతో, మన సామ్రాజ్య గౌరవము లీనమైయున్నది” అని సమవర్తి తలవంచుకొని ముఖము హస్తములచే కప్పుకొనెను.

అట్లే, “ఈ యుజ్జయినీకోటతోగూడ మనసామ్రాజ్యప్రతిష్ఠ ముడి వేసికొనియున్నది. ఈ కత్తెరలో చిక్కుకొనియున్న మన మేమి చేయవలయునో” అని వినీతమతి యనెను.

శుకబాణుడు తీవ్రాలోచనలతో వారిమాటలు వినిపించుకొనియు వినిపించు కొననట్లు నిలుచుండిపోయెను. 

2. అన్వేషణ

సువర్ణశ్రీ వెంటనే చారుగుప్తునిభవనములనుండి మరలి ఇంటికి పోయినాడు. తల్లిని కలుసుకొని హిమబిందును ఎత్తుకొనిపోయినమాట నిజ మనియు, ముక్తావళీ దేవి గారినికూడ ఎత్తుకొనిపోయిరనియు ఇంతలోనే వారు దొరికితీరుదురనియు, భయపడ నవసరములేదనియు చెప్పి లోనికి బరువిడి, వెంటనే కవచాదులు ధరించి, తిలకము తీర్పుమని నాగబంధునిక యున్న పెరటిలోనికి అంగలువేయుచు వెళ్ళెను. ఆ బాలిక అదిరిపడి ఎవరా యని చూచినది.

అన్నగారివేషము చూచి నాగబంధునిక “అన్నా, ఇది ఏమిటి? ఎక్కడనో దాచి ఉంచిన నాయనగారి చిన్న నాటికవచము తీసినావు? ఎవరోయని భయమందినాను. వేషమువేయుచున్నావా లేక ఉత్సాహము పుట్టినదా, మతిపోయినదా?”

 “కన్న చెల్లీ! నాకు తిలక ముంచుము. చిన్న చెల్లి ఏదీ? ఎవరక్కడ? అమ్మాయి సిద్ధార్థినికను పిలువుడు. త్వరగా లోనికి వచ్చి తిలకము పెట్టుము!”

“అన్నా! తిలక మెందుకు? యుద్ధమునకు రమ్మని నాన్నగారికడ నుండి ఆజ్ఞవచ్చినదా? లేక సేనానాయకు లెవరైన ఆజ్ఞ ఇచ్చిరా?”

“అన్నియు చెప్పుచుందును. నీవు ముందు నాకు తిలక ముంచవలయును, రమ్ము.”

“అమ్మా!” అని నాగబంధునిక కేక వైచెను. తల్లి పూజాగృహము నుండి నిష్కుటములోనికి వచ్చినది. ఆమెయు కుమారుని జూచి, ఎవరో ఏమోయనుకొని, దిగ్భ్రమనంది, యట్లే నిలుచుండిపోయినది. నాగబంధునికయు, సువర్ణశ్రీయు పకపక నవ్విరి. అప్పుడు పుత్రు నాలవాలుపట్టి “ఇది ఏమిరా నాయనా?” యని యామె వా రిరువురికడకు వచ్చినది.

సువర్ణశ్రీ: అమ్మా! నేను యుద్ధమునకు బోవుటలేదు. హిమబిందును వెదుక బోయెదను. కొందరు సేనాధికారు లపుడే ఆమెను వెదుక బోయిరి. నేనును పోయెదను. హిమబిందునింట శ్రీ ఆనందులవారు కనబడినారు. నన్ను వెంటనే బయలుదేరి పొమ్మని ఆజ్ఞఇచ్చినారు. వెళ్ళు చున్నాను. చెల్లీ, తిలకముదిద్దవే, ఆరతితో అమ్మగారి ఆశీర్వాదము పొందవలెను. జాగు చేయకు.

శక్తి: వెదకుటకు ఈ వేషమంతయు వేసినావు, పోరాటము ఏమైన జరుగునా ఏమి? అంతమంది వెళ్ళుచున్నప్పుడు నీ వెందుకురా బాబూ?

నాగ: అమ్మా! నీకును మతిపోయినదా? అన్నను వెళ్ళనీ! ఇక్కడ ఏమియుతోచక మతిపోయినవానివలె నున్నాడు. వీరులైన ఆంధ్రయువకులింటి దగ్గర కూరుచుండు సమయమా? అన్న తీసికొని వెళ్ళునేని నేనుగూడ సిద్ధము.

శక్తి: నీ వెంతకైన తగుదువు! మగవీరుడవు.

ఇంతలో మహాలియు, సిద్ధార్థినికయు, పలువురు పనికత్తెలు, కొందరు చుట్టములు, సేవకులు అచ్చటకు పరుగిటివచ్చిరి. చిరుగాలివలె వచ్చిన చిన్నచెల్లెలిని సువ్వున నెత్తికొని సువర్ణశ్రీ యామెను ముద్దిడు కొని, క్రిందకు దింపి, “తల్లి నాకు ఆరతి ఈయవలయును, తిలక మిడవలెను, రా, లోనికి” అని ఇంటిలోనికి సాగినాడు.

యుద్ధములోనికి వెళ్ళుచుండెనేమో యని పనివారంద రనుకొనిరి. మహాలికంతయు నర్థమై, లోనికిబోయి, దేవతాగృహమునుండి బంగారు పళ్ళెము, దీపపుకుంది, కర్పూరము, అక్షతలు, పూవులు, అగరునూనెయు, తిలకకరండము సిద్ధముచేయుచుండ నచ్చటి కందరు వచ్చిరి.

బుద్ధభగవానుని పంచలోహవిగ్రహ మందున్నది. ఆ విగ్రహమున కీవలావల పంచానన బ్రహ్మవిగ్రహ మున్నది. క్రొత్త పూజ లెన్ని వచ్చినను శిల్ప బ్రాహ్మణులు అనాదియగువారి పంచముఖవిశ్వ బ్రహ్మపూజ మానరు. ఆ పీఠముప్రక్క వేరొక్క పూజాపీఠముపై మాయాదేవి విగ్రహమును, శారదాదేవి విగ్రహమును, పార్వతీదేవి విగ్రహము నున్నవి. ఆ పూజాపీఠము శక్తి మతీదేవిది.

శక్తిమతీదేవి నిర్ఘాంతపడి మాటలాడక, తన పూజాపీఠమునుండి కాశ్మీరపుష్పమిశ్రిత మగు తిలకము తానే యాతనినొసట నుంచి, కొమరితలతో కూడి ఆరతినిచ్చి, మోకరించు కొమరుని ఆశీర్వదించుచు అక్షతలు జల్లెను. ఆమె కన్నులు గిఱ్ఱున నీరుతిరిగినది. సిద్ధార్థినిక కేమియు నర్థము కానందున వెక్కివెక్కి ఏడ్చినది. నాగబంధునిక చిరునవ్వుమోమున ప్రసరింప, కన్నులు విస్ఫారితముగా, ప్రభాకలితవదనయై అన్నను జూచి, “అన్నా! నీవు క్షేమముగా వెళ్ళిరా. మాఅన్న వీరుడని చెప్పుకొన ఎంతో ముచ్చట నాకు. హిమబిందును రక్షించుకొనుము. ఆ పని ఇంక ఎవ్వరును చేయలేరు. నేను నీకు తమ్ముడనైనచో, ఈ విపత్తులో నీ వెను వెంట వచ్చియుందును. ఆంధ్రశత్రువుల నాశనము చేసి నీ ప్రియురాలిని నీవే తీసికొనిరా” యనినది.

శక్తిమతి తలవంచియున్న పుత్రుని శిరస్సుపై చేయినిడి “మహాశ్రమణకుడు నిన్ను రక్షించుగాక! నాయనా! జయశ్రీ శోభితుడవై యశో విరాజితుడవై తిరిగిరా. అనవసరముగ ప్రాణములు బలిగొనకుము. శరణార్థుల విడిచిపుచ్చుము. నీ శిల్ప బ్రాహ్మణ వంశమర్యాద మరువకు. ఈ రక్షరేకును నీ హృదయమున ధరించుకో, పోయిరా!” అని గద్గదికమున బలికినది.

అశ్వము సిద్ధముగానున్నదని ఇంతలో వార్త వచ్చినది. సువర్ణశ్రీ నాగబంధునిక వీపుపై తట్టి, సిద్ధార్థినికను ముద్దుపెట్టుకొని తల్లికి నమస్కృతులిడి, మహాలి మొదలగువారికడ సెలవునంది, సర్వాభరణభూషితము, సార్వభౌమ బహుకృతమునగు ఉత్తమాజానేయము కడకుబోయి సూతుడందిచ్చు ఖలీనము నందుకొని, చివ్వున నా ఆశ్వముపై నధిరోహించి సేవకుడందిచ్చు బాణములపొదియు, విల్లు నంది పుచ్చుకొని, పొది స్కంధమునకు బిగించుకొని కేడెము వీపున బిగించుకొని, ధనుస్సు ఎడమభుజమునకు తగిలించుకొని, శూలము, శూలశిరస్సులు, పరశువు, ఆహారపుసంచి, ధనపుసంచి, వస్త్రపుసంచియు జీవనమునకు గట్టిగా సేవకుడు కట్టినది పరిశీలించి “వెళ్ళివచ్చుచున్నా” నని కేకవైచి గుఱ్ఱమును నడిపించెను.

ఎవరీ సుందరుడని ప్రజలు అక్కజంపడ రేవుకడ కృష్ణలో సువర్ణశ్రీ గుఱ్ఱమును దింపెను. లంకలపై నడచుచు, అక్కడక్కడ సెల యేళ్ళవలె ప్రవహించు కృష్ణపాయలను ఆ గుఱ్ఱముపై పదిక్షణములలో దాటెను.

అతడు ఫ్లుతగతితో ప్రొద్దు నెత్తిమీదకు వచ్చునప్పటికి మహారాజ పథమున పదిగోరుతముల దూరము పోయెను. అక్కడ నొక సత్రమున నాగి స్నానాదికము లొనరించి, భోజనముచేసి పదిముహూర్తము లచ్చట విశ్రమించెను. గుఱ్ఱమును సేదతేర్చి, ఆహారమిచ్చి, ఒడలంతయు రుద్ది, అశ్వారూఢుడై ప్రయాణము సాగించెను.

అతడు రాత్రి మొదటియామములో మహాగ్రామము చేరెను. 

3. మహారణ్యము

నాలుగు రోజులలో సువర్ణశ్రీ మహారణ్యప్రవేశ మొనర్చెను. ఆతనికిముందు ఆంధ్రచమూపతులు ఇటు వెళ్ళిరి అటు వెళ్ళిరి అనువార్తతక్క హిమబిందుజాడగాని, చోరులజాడగాని ఇంతయైన తెలియలేదు. మంత్రకల్పమునవారందరు ధాన్యకటక పరిసరములనే మాయమైపోయిరా? లేక ఆంధ్రచారులను మించిన మాయాధురీణులా ఆ చోరులు? ఏమైపొయినారు? ఆ దివ్యమూర్తిని వారు తమకర్కశహస్తములతో అంటిరి కాబోలు ఆమె ఎంతబాధ పడుచున్నదో, ఎంత భయమందినదో? ఆ సుందరోజ్వలమూర్తి వడలిన పూపువలె సొమ్మసిల్లిపోయి వుండును. చిన్ననాటనుండియు కష్టమెట్టిదో ఎరుంగని ముక్తావళీదేవి ఎంత అలమట చెందుచున్నదో? ఎంత పని చేసి రీ దుర్మార్గులు!

 చారుగుప్త సర్వస్వము సపహరించుకొనిపోయిన ఈ దుష్టులు చోర మాత్రులు గారు. ధనరాసులు దిగవిడిచి బాలికల నపహరింతురా చోరులు? వారికి ముక్తావళీదేవితో నేమి పని? ఇందేదియో రాచకార్యమున్నది. ఇది యంతయు శత్రువుల కుతంత్రము. ఔరా! ఆంధ్రరాజధాని యేమి, రాజ దుర్గముకంటెదుష్ప్రవేశ మగు వణిక్సార్వభౌముని ప్రాసాదము చొచ్చుటేమి ఎంత అరాజకమైపోయినది. శత్రువుల కాంధ్రరాజధాని యింత అలుసై పోయిన దేమి! దేశద్రోహులగు ఆంధ్రు లెవరో, ఇంటి దొంగలవలే ఇంత పని చేసిరికాని శత్రువు లెన్నిగుండెలతో ధాన్యకటకమున గాలిడగలరు?

ఆ బాలిక పరీమళజలముల ఉదయమున స్నానమాడునది, తూలికా మృదు వస్త్రములు ధరించునది, సుగంధము నలదుకొనునది, మసృణకిసలయ సదృశము లగు పర్యంకముల పరుండునది. అయ్యబల శత్రువులచే నెట్టి ఇడుమలపాలైనదో! తానేమి చేయగలడు? ఎచట వెదుకగలడు? తనకు దూరదృష్టి, దూరశ్రవణాసిద్ధులు, ఆకాశ గమనాది విద్యలు తెలియవాయెను.

ఎంతమంది నడిగినను ఇసుమంతయైన జాడ తెలియుటలేదు. ఆ బాలిక బ్రతికియుండునా? “ప్రభూ మహాశ్రమణకా! ఆమెను రక్షించుము. ఆమె క్షేమముగ నున్న చాలును. జంబూద్వీపస్థము లగు మహాచైత్యము లన్నిటికి శిల్ప సేవ గావించుకొందును.”

సువర్ణశ్రీ ఇట్టి ఆలోచనలతో ఒక్కడు ఆ మహాశ్వముపై నవలీలగ క్రోశములు, క్రోశములు గడచి ముందునకు పోవుచుండెను.

పూవు ఎన్ని యోజనముల దూరముననుండిన నుండు గాక. దాని పరీమళములు పసిపట్టి సూటిగా భృంగబాలుడు ఆ పూవుకడకు పోవును. ప్రేమికులకు ప్రియురాలి జాడను ప్రణయమధుర పరీమళములు పసిపట్టి యిచ్చును. సువర్ణునకు చోరులజాడ నెవ్వరినడిగినను దెలియరాలేదు. అయినను క్షణక్షణము ఆమె అక్కడ ఉన్నది. ఆమె ఇటు పోయినది అని ఆతనియంతరంగమున స్పష్టమున తోచుచుండెను. దివ్యదృష్టి నిచ్చును గదా ప్రేమ!

సువర్ణశ్రీ కుమారుడు గుఱ్ఱమును నందపురము (నందిగ్రామము), గిలనకేర (గార్ల), మంత్రకూటము (మంథెన) దారిని పోనిచ్చి అచ్చట గోదావరీనదిని దాటిపోయెను.

నాగులలో జాతిభేదము లెన్నియో యున్నవి. ఆర్యనాగులు నాగపూజ చేయుదురు. పన్నగులనువారు మద్రజాతి నాగులు. వారిని ఆర్యా నార్య మిశ్రజాతి అందురు, అనార్య సంపర్క మెక్కువయున్నవారిని గూఢపు లందురు. వారే గోండులు. గోండులుండు కాంతారములకు గోండువనమని పేరు.

గోండులు ఆర్యబ్రాహ్మణ ప్రభువులగు సాతవాహనులయెడ పరమ భక్తులు. దక్షిణ కోసలమునకు బడమటనుండు దండకాటవిభాగమున శబరు లుండిరి. వీరు గాంధర్వ పన్నగ మిశ్రజాతికి జెందినవారు. పన్నగవంశములవారు నాగరపధములందే నివసించుచు, ఆంధ్రసాతవాహనదేశమున శూద్రులైరి. వారు మంగలి, చాకలి, ఉప్పరి వృత్తు లవలంబించియుండిరి.

శబరులకు, గోండులకు ఎప్పుడును ప్రబలశత్రుత్వ ముండెడిది. శబరులు ఆంధ్ర చక్రవర్తులకు భయముచే లోబడియుండిరిగాని భక్తిచేగాదు. శబరులు మాయావులు. వారు మంత్రవిద్యను గంధర్వులకడ నేర్చినారు. ఆ శాబర మంత్రతంత్రములకు భయపడి గోండులు ఆర్యఋషుల నాశ్రయించి యుండిరి. కాని గోండులు బహుపరాక్రమవంతులు. గోండుయువకుడొంటియై సింహమునే ఎదుర్కొనును. గోండుమహాప్రభువు వీరమల్ల గోండమహారాజు సాతవాహన సామంతేశ్వరుడు. ఆతని పుత్రుడు మహామల్లగొండ యువరాజు ధాన్యకటక మహా సంఘారామ పరిషత్తునందు విద్యనభ్యసించినాడు. అప్పుడే సువర్ణశ్రీకిని ఆతనికిని గాఢస్నేహము కలిగినది. మహామల్లుడు సువర్ణశ్రీ ఇంటనే వాసముచేయువాడు. వారి ఇంట భుజించువాడు.

ధర్మనందియు, సువర్ణశ్రీయు దేవతలని వారి శిల్పములు చిత్ర లేఖనములు జూచి మహామల్లు డనుకొనువాడు. గోండు భాషలో తీయని పాటలు బాడుచు, అవి సువర్ణశ్రీచే బాడించుచు, చిన్నబిడ్డ యగుసిద్ధార్థినికను ఒక్క నిమేషమైన క్రిందకు దింపక ఆడించుచు, శక్తిమతీదేవికి రెండవ కొమరునివలె మెలగినాడు.

సువర్ణశ్రీ బయలుదేరు నప్పుడే మహామల్లుని తలచుకొన్నాడు. అత డప్పుడే యొక ఉత్తమ గోండసామంతునితనయను వివాహమైనాడనియు, యువరాజ పట్టాభిషేకము నందినాడనియు సువర్ణునకు దెలియును.

తనకు వార్తలంపు విధానము సువర్ణునకు మహామల్లుడే తెలిపినాడు. గిలనకేరపురము పుళిందరాజ్యమునకు దక్షిణమున నున్నది. పుళిందులు ఆంధ్ర సాతవాహనులకు దాసులయ్యు, నేడు స్థౌలతిష్యుని మహిమవలన వారికి విరోధులై ఆంధ్ర సామ్రాజ్యమును విచ్ఛిన్నముచేయ సంకల్పించియుండిరి. కాని పుళిందులలో కొన్ని జట్టులనాయకులు శుకబాణుని అనుయాయులు. వారును గోండునాయకులును రహస్యముగ నెప్పటివార్త లప్పటికి శుకబాణునకు తెలియజేయుచుండిరి.

తన స్నేహితుడగు పుళిందయువక నాయకు డొకడు గిలనకేరపురమున నుండుననియు, నాతడు తనకువార్త పంపగలడనియు, తాను గోదావరి కావల ఉత్తరమున మూడు యోజనములు దూరముననున్న నగరిగ్రామమున కలుసుకొందుననియు మహామల్లగోండుడు తాను ధాన్యకటకనగరము వీడునప్పుడు తెలిపియుండెను. ఆనవాలుగా తన దండకడియము సువర్ణశ్రీ కిచ్చినాడు.

గిలనకేరపురమున నాగినప్పుడే ఆ పుళిందనాయకుని గలుసుకొని సువర్ణుడు మహామల్లుని దండకడియము సందేశ మంపినాడు. నగరి గ్రామమున రెండు దినములు విశ్రమించినాడు. దీర్ఘ ప్రయాణముచే అలసట నొందిన ఆతని ఉత్తమాశ్వమునూ అలసట తీర్చుకొని పదనుపట్టిన కరవాలమువలె మెరసిపోయినది.

మూడవనాటికి మహామల్లుడు పుష్కలమహా మేఘమువలె గజయూధ పతివలె వచ్చి సువర్ణుశ్రీని కౌగిలించుకొనెను.

“అన్నా! ఏమిది, ఈ అడవుల సంచారము చేయుచున్నావు? భగవంతుని శిల్పము, చిత్రలేఖనము దర్శింపవచ్చినావా?”

“మహాబలా! నేనొకనాడు నీ రాజ్యమున నిన్ను దర్శించెదననలేదా? నేడు వచ్చినాను. కాని, సంతోషయాత్రాభిముఖుడనై కాదు. పవిత్రకార్య దీక్షాపరుడనై వచ్చినాను. నీవు తప్ప ఇంక నేరును నాకీ దుర్ఘటకార్యమున సహాయము చేయలేరు.”

సమున్నతరూపుడు అతిరధుడు నగు సువర్ణుడును, మహాబలావతార మగువాడును, మధ్యమోన్నతమూర్తియు నగు మహాబలగోండుడు బిగియార కౌగిలించుకొన్నారు. 

4. శాపాభయముద్రలు

శ్రీకృష్ణసాతవాహనకుమారుడు మరునాడు ప్రభాతకాలముననే ఆఖేటనావ్యాజమున యుద్ధయాత్ర సలుపువాడై, రాత్రిద్వితీయయామమధ్య కాలమువరకు సంగీతలోలుడై యుండెను. ఒక సుందరి విపంచి మేళవించి మధురగీతముల నాలపించినది. వేరొక పాటలాధరి మురళిపై తరళరాగపూర్ణ కీర్తనల మ్రోయించినది, పద్మహస్త యోర్తు కాంస్య తాళములు చఱచినది. కలకంఠి యొకరిత మనోహరగానామృతశైవాలిని యైనది.

రెండవయామము పూర్తియగునప్పటికి రాజకుమారుడు లేచినాడు. సుగంధ తైలపోషితకరదీపికల దీపాంగనలు దారిచూప నాతడు శయనమందిరమున కేగి కలశాంభోధి సదృశ మగు తల్పముపై మేనువాల్చెను. ఆతడు వెను వెంటనే తీయని నిద్దురలో కనుమూసి ఒడలు మరచెను.

చీకట్లు ద్రవించి యామినీఫాలమున అలకలై, యమునావీచికలై మిన్నుమన్నా క్రమించి పరవడులెత్తినవి. చీకట్లురూపముమారి చైతన్య పూరితములై, మహిషములై, ఖడ్గమృగములై, కాల కరియూధములై పేరెములువారినవి. అవి యన్నియు మాయమైనవి. చీకట్లన్నియు కలిసి ఒక్కటే చీకటియైపోయినవి. ఆ చీకటి బరువు శ్రీకృష్ణసాతవాహనుని వక్షముపై ఆవహించి, ఆతని ఎదఱురొమ్ము ఎముకలు పిప్పియగునట్లు బరువెక్క నారంభించినది. నిర్మల నిద్రపరవశుఁడై యన్న ఆ యువకునికి భయంకర స్వప్న మొక్కటి ప్రత్యక్షమైనది.

కర్కోటక నాగేంద్రుడు తన శతవదనములనుండి నిప్పులు గ్రక్కుచు, కన్నులు భయంకర జ్వాలలుగా మహావేగమున శ్రీకృష్ణుని వైపు రాసాగెను. వీరుడగు నా రాజకుమారుడు ధనస్సు నెక్కిడబోయెను. అది ఎచ్చటను కనబడదు. ఖడ్గము దూయబోయెను. వట్టియొర మాత్రము దొరకినది.

ఆ భీషణోరగముబారినుండి తప్పించుకొనబోయి, పరుగిడలేక యాతడు పడిపోయెను. ఓ, ఓయను యార్తనాదము కంఠపుముడులలో మాత్ర మాగిపోయి గురగురలైనది. ఆతనికి చెమటలు పట్టి మెలకువ వచ్చినది. ఆ మందిరములోని సుగంధ తైలముల వెలుగు దీపములలో రెండు తక్క తక్కినవన్నియు నారిపోయినవి. సగము మందిరము చీకట్లమయమైనది. ఆ గుడ్డి వెలుగులో కాలసర్పమొక్కటి బుసలుకొట్టుచు ఎటుల శయన మందిరములోన ప్రవేశించినదో శ్రీకృష్ణసాతవాహనుని తల్పముకడకు చేరవచ్చుచుండెను. అ సర్పము కలలోనిదా, లేక నిజమాయని శ్రీకృష్ణుడాలోచించెను. భయమనునది ఎరుంగని యా రాచబిడ్డ నేడు గజగజవణంకెను. నోటమాటరాదు. పెదవులు, నాలుక, గళము పొడియారిపోయినవి. ఆ పాము కొట్టు బుసలలో అగ్నిశిఖలు కనిపించిన వా మహారాజునకు. ఆ క్రూరపన్నగము పన్నెండుపదముల పొడుగున నల్లనై, మహాకాళికావేణి వలె, మృత్యుపాశమువలె మిలమిలలాడుచు నాతనితల్పముకడకు వచ్చినది.

విభ్రాంతుడై చేష్టలుడిగి యా మహారాజు తల్పముపై నటులనే కూర్చుండి పోయినాడు. ఆ పాము చుట్టవేసికొనిపోయినది. అక్కడనుండి పడగ హస్తమున్నర పైకిఎత్తి నాల్కలు చాచుచు బుస్సనుచు కాటువేయ బోవుచు ఆడిపోవుచున్నది. శ్రీకృష్ణసాతవాహనుడు దీపమును జూచు శలభమువలె నట్లేకదల లేక ఆ పాము ఎట్లాడిన నటువైపునకు తల త్రిప్పుచున్నాడు.

అంతకన్న అంతకన్న ఆ పామునకు కోప మెక్కువైనది. ఆవేశముచే పాము ఇటునటు ఊగిపోవుచుండెను.

ఒక్కసారిగా ఆ భయంకర కాలవిషధరము మహావాయువైనట్లు, సర్పాస్త్రమైనట్లు, ఇటునటు పరువులెత్తి, ఇంకను మంచముదాపునకు వచ్చి ఒక్కపెట్టున తోకపై లేచి మంచముపై కురికినది.

అంతపెద్ద పర్యంకముపై ఏ పామురకగలదు అన్న ధైర్యముతో నున్న కతమున నా పన్నగ ఉరుకునకు శ్రీకృష్ణుడొక పెద్ద హాహాకారము సలిపి వెనుకకు పడిపోయెను.

ఆ వెంటనే తెల్లని మొగలిరేకువంటి, గంగోత్తరకడ భాగీరథీ ప్రవాహమువంటి, మహర్షి దీవనవంటి, దేవతల పాణితలముల జగన్మోహినిపోయు అమృతపుధారవంటి శ్వేతోరగి ఒకర్తు మంచముపై కురికినది. శ్రీకృష్ణసాత వాహనునిపాదమున కాటువేయబోవు ఆ కాలసర్పము వెంటనే ఆగి పడగెత్తి ఆడుచు కదలక బొమ్మవలె నైపోయినది.

ఆ పాము నెదుర్కొనిన యాధవళపన్నగి కోపమెరుగని నిశిత సత్యమువలె మిలమిలలాడుచు పడగెత్తి యాకాలనాగము నెదుర్కొని కదలక, మెదలక ఒక్కసారి మాత్రము రామబాణమువలె, మహేశ్వర వీణానాదమువలె “గస్” అనిమాత్ర మనినది.

భయపడి, సిగ్గుపడి, ఓటమిని సూచించుచు తల ముడుచుకొని యా కాలనాగము మంచమునుండి క్రిందికి జారిపోయి ఎటుల మాయమైనదో మరల శ్రీకృష్ణున కది గోచరముకాలేదు.

శ్వేతపన్నగిమాత్రము ఒకసారి శ్రీకృష్ణసాతవాహనునివైపు తల త్రిప్పిచూచి యదియు మంచమునుండి యురికి మాయమైనది.

భయము ఒక ముహూర్తకాలమువరకు శ్రీకృష్ణసాతవాహనుని వదలలేదు. కొంతవడి కాభయముతీరి, వీరుడగు నా మహారాజు ఒక్కుమ్మడిలేచి మంచమునుండి యురికి, దాపున ఉన్నతపీఠముపై నుంచిన బంగారుగంట గణగణ వాయించెను. చెంతనున్న ఒరనున్న కరవాలము చర్రునలాగి, గుమ్మముకడకు బోవునప్పటికి బిరబిర తలుపులు తెరచి రక్షకస్త్రీలు లోనికి ప్రవేశించిరి. వారందరి హస్తముల కత్తులు తళతళలాడు చుండెను.

క్రోధపూరితనయనుడై కరవాలము ధరించి ద్వారముకడ తమకెదు రైన ప్రభువునుజూచి వారు సంభ్రమము నందిరి. ఇంతలో సేవకు రాండ్రు ద్వారపాలకులు, కంచుకులు శయనమందిరముకడకు వచ్చిరి.

శ్రీకృష్ణసాతవాహనునికి మెరుపువలె ధాన్యకటకమున జరిగిన శ్వేత పన్నగ దర్శన సంఘటన జ్ఞప్తికి వచ్చినది.

నిమిషమున మనస్సు త్రిప్పుకొని, యాతడు చిరునవ్వు నవ్వుచు,

“ఓయీ! అంతఃపురపాలకునికి వెంటనే ప్రయాణసన్నాహము చేయ మా ఆజ్ఞగా తెలుపుడు. స్నానార్థము మేము పోవుచున్నాము. శుభముహూర్తము కెంత కాల మున్నది?”

“ప్రభూ! ఇంకను మూడు గడియలు వ్యవధి యున్నది” యని కంచుకి మనవి యెనర్చెను.

5. మృగపథము

గోండువన యువరాజగు మహాబలగోండుడును, సువర్ణశ్రీయును మహా వేగమున అడవులన్నియు గడచిపోవుచున్నారు. “అటవీ సంచరణము ఒక మహావిద్య. శత్రువునకు తెలియకుండ ప్రయాణముచేయవలెనన్న నీవు అటవీ మృగమైపోవలెను. ఆకులో ఆకువై, కొమ్మలో కొమ్మఅయి పోవలెను. నీవు పక్షివలె ఎగిరిపోవలెను. ఉడతవు, ఉడుమువు, పామువు అయిపోవలెను. నేను వెనుకనే నీకు ఈ విద్య చాలావరకు నేర్పితిని. నేను చెప్పినది చేయుము సువర్ణా!” యని మహాబలు డనెను.

“మనకు హిమబిందు వార్త ఎప్పుడు ఎక్కడ తెలియగలదు?”

“మా గోండు అరణ్యములు తక్క, తక్కిన అరణ్యములన్నియు ప్రస్తుతము విరోధులగు కిరాత జాతులతో నిండియున్నవి. వారికి తెలియ కుండ మావాళ్ళు మనకు సర్వవిషయములు తెలియజేయవలెను. మీ హిమబిందును వారీ అరణ్యములోనికే కొనివచ్చియున్న యెడల మన కా విషయము తెలియగలదు. ఆ గుఱ్ఱమువలన మనకు ఎక్కువ ప్రమాదము సంభవించునని, గుఱ్ఱమును నగరి గ్రామమునుండి గోండుమార్గమున గోండువనము పంపించుట మంచిదే అయినది.”

“గుఱ్ఱమునుబట్టి యానవాలు పట్టరా?”

“గుఱ్ఱము రంగు మార్చివేసినాము. కావున నీ గుఱ్ఱము నానవాలు పట్టలేరు. మే మా గుఱ్ఱమును ఎచ్చటనో తస్కరించి తీసికొనిపోవుచున్నామని మన ఎదిరికక్ష వా రనుకొనునట్లు చేసినాము.”

“నీవు నా మిత్రుడవని తెలిసిన వెంటనే నిన్ను వారు బాధలనొనరించెదరేమో యని భయపడుచున్నాను.”

“ఓయి వెఱ్ఱివాడా! నన్ను బాధలుపెట్టగల ఆటవికజాతి యున్నదా? మాకు భక్తులైన రాక్షసులజాతి యొకటి యున్నది. ఆ జాతివారు దండ కారణ్యగర్భమందు, కటిక చీకటి నాట్యమాడు ప్రదేశాలలో ఉందురు. వారి జోలికి వెళ్ళుటకు ఆటవిక జాతులలో నాగరికపుజాతులవారికి భయము. నాతో మనకు కనబడక నూరుగురు రాక్షసులు గట్టివా రున్నారు.”

సువర్ణశ్రీ మహాబలుడు మూడుదినము లా విధముగ ప్రయాణము చేసిరి. సువర్ణశ్రీ గోండు వేషము ధరించియుండెను. ఆతడు గోండు స్త్రీలద్దిన రంగు రంగుల కౌపీనమును ధరించియుండెను. రంగురంగు పూసల హారములు మెడను వ్రేలాడుచుండెను. దేహమంతయు వివిధవర్ణములతో విచిత్రాలంకరణ చేయబడెను. మోము పెద్దపులి ముఖము వలె వర్ణము లద్ద బడెను. చేతులకు వెండి దండ కడియములు, ఔషధీ మూలముల తాయెత్తులున్నవి. వక్షమున చిరుతపులి తోలు వలెవాటయ్యెను. తలపై రంగు రంగుల పక్షి ఈకెలు, రంగురాళ్ళు, గవ్వలు పొదిగిన ఎలుగుబంటితోలు కిరీటమునుండి పైకెగసి యాడుచుండును.

ఇంతలో వేగు గొనివచ్చిన పరిచారకునితో మహాబలగోండుడు మటలాడి, “అన్నా, హిమబిందును, ఆమె అమ్మమ్మను తూర్పు దండకాటవి దారినే తీసికొని పోయిరట” అని సువర్ణశ్రీ కెరిగించెను. “ఏమీ, దండకాటవికే! నేను భయపడినట్లే అయినది. ఎంతపని చేసినారు! వా రింకా ఎంతదూరాన ఉన్నారో! ఎచ్చట నున్నారో! క్షేమముగా నుండిరా? మన మచ్చోటికింక నెపు డేగెదము?”

“తొందరపడకుము. వీరుడు కోపమున కఱ్ఱ నిప్పును దాచుకొనినట్లు తనలో దాచుకొనును.”

“నాకన్నియు చెప్పుము తమ్ముడూ! మనమచ్చటికి త్వరితముగ పోవలెను.”

“వారిని ఎత్తుకొనిపోయినది సాధారణాటవికులు కారు. వారట్టి పనులు చేయరు, చేయుట చేతకాదు. నగరవాసు లన్న నే మాకు భయము. నగరమును జూచిననే మేము ముడిచికొని పోవుదుము. వారిని ఎత్తుకొని పోయినది ఎవరో చక్రవర్తి విరోధులట.”

“మాగధులా?”

“మాగధులో, వందులో వారి నిరువుర నెత్తికొనిపోయి, ధాన్యకటక నగర ప్రాంతమున దాగికొనియున్న శబరులకు అప్పగించిరట!”

“నే ననుకొనినంతయు నైనది. వారికేమియు ప్రమాదము కలుగ లేదు గదా!”

“వారిని నర్మదాతీరమున నున్న స్ఫటికశిలాపర్వతములవైపు తీసికొని పోయిరట.”

“నడు, మన మచ్చటికే పోదము.”

“అచ్చటికే పోవుదము. ఈలోన మా నాయనగారికి గోండు సైన్యము నుండి సింహములవంటివారిని ఏరి మన సహాయమునకు పంపపలయు నని వార్త పంపినాను.”

“అటులనే అన్నా!”

ఆ ఉదయమున వారొక సరోవరముకడ వంట చేసికొని భుజించి, మరల ప్రయాణము సాగించిరి. ఎంత వేగముగ నడచినను ఒక్క ఆకు కదలిన చప్పుడైన కాదు. మహాబలగోండుడు అనుమాన మేమైన తోచినప్పుడు, సైగచే సువర్ణుని ఆపి ముందునకు బోయి పరిశీలించి, అచ్చట చిన్న పక్షి ఈలవేయును. సువర్ణు డప్పుడు ముందుకు సాగిపోయి, యాతని గలిసికొనును. వా రిరువురు ముందుకు సాగిపోదురు.

మహాబలగోండునకు పాము చెవులు. ఎంత చిన్న చప్పుడెంత దూరముననుండి వినిపించినను ఆతని కర్ణములకు సోకును. ఆతడు ముక్కుపుటములు విస్ఫారితముజేసి, ఎట్టివాసననైన పసిపట్టగలడు.

వారట్లు మహావేగమున బోవుచుండ నొకమధ్యాహ్నము వారి ఎదుట నొక బాణము వచ్చి పడినది. గోండుడు వెంటనే ఆగి, భూమిపై వాలిపోయెను. సువర్ణునిగూడ భూమిపై వ్రాలమని సైగచేసెను. ఆతడును, సువర్ణుడును పాకికొనుచు, దట్టమైన యొకపొదలోనికి దూరిపోయిరి.

మహాబలుడు సువర్ణుని చెవికడ వదనముంచి మనలను విరోధులగు పుళిందులు కనిపెట్టినారు. ఆ బాణమే ప్రశ్న. నీవును గోండుడవు అని వారికి తెలుపవలె. లేనిచో మనలను బాణములచే చెండివేసెదరట. ఆ బాణము వచ్చిన విధమునకు, నా ముందర పడుటకు, ఆ బాణమునకు కట్టిన ఈకలకు అర్థమది” అని తెల్పెను.

“అయిన నిప్పుడేమి చేయవలెను?”

“నీ వూరక చిత్రము చూచుచుండుము” అని చెప్పి మహాబలు డప్పుడు పెదవులు మూసి పామువలె బుసకొట్టినాడు. వెంటనే దూరమునుండి వేరొక మహానాగము బుసకొట్టినది ఆకాశములో చిన్న చిన్న ఈటెల వంటివి వేలకువేలెగిరినవి. “కో” యని, “హో” యని పది, పదిహేను అరపులు వినబడినవి. తర్వాత నంతయు నిశ్శబ్దము. పాముబుస దీర్ఘమై విననైనది. మరల నిశ్శబ్దమా వహించినది.

సువర్ణున కిదియంతయు భయాశ్చర్యముల గొలిపినది. “అన్నా! మన విరోధులందరు మాసిపోయినారు. ఆ శవముల రాక్షసులు భక్షింతురు అని మహాబల గోండుడు పలికినాడు.

సువ: ఛీ! ఛీ ! నరమాంసభక్షణమే? బుద్ధం శరణం గచ్చామి.

మహా: నరమాంసభక్షణము మాకు మాత్రము ఇష్టమా! రాక్షసుల పాలబడినవాని గతి అంతియ. మహాబలగోండు నేమి, మఱి ఏ ఒక్క గోండునేమి శబరుడు, పుళిందుడు యుద్ధమున కాహ్వానించుట చావును తెచ్చుకొనుటే. రాక్షసులు గోండుల ఆజ్ఞచే వచ్చిరని తెలిసిన మరలగోండువిరోధి ఈ అడవుల నుండునా? రాక్షసుల నోడింపగలవా రొక్క గోండులే!

సువ: అబ్బ! నా హృదయమున వెర పింకను పోలేదు తమ్ముడూ!

మహా: నన్ను క్షమింపుము. నీకు నే నీ విషయము తెల్పియుండకూడదు. నీవు వీరుడవు. శిల్పిమాతృడ వేయైన అడవుల కేల వత్తువు? హిమబిందును తలచుకొనుము.

సువ: అన్నియు భగవంతుని చిద్విలాసములు. కానిమ్ము. విచారించుటకు నే నెవడను?

మన మొక్క ఘడియ ఆలసించినకొలది హిమబిందు, ముక్తావళీదేవుల ఇడుమలు ఒక్కొక్కటే అధికమగు నని నా భయము.

వా రంతట ఇంకను వేగముగ సాగిపోయిరి. 

6. నాగరాజు

స్థౌలతిష్యుడు ఓషధీ ప్రభావముచే విషబాలకు గాఢనిద్ర కల్పించెను. విషవైద్య విశారదులగు కొందరు సేవకులు ఆమెను ఏనుగుపై అరణ్య మధ్యమునకు గొనిపోయిరి. శ్రీకృష్ణసాతవాహనుడు వేట నెపమున మాళవమునకు యుద్ధాభిముఖుడై వెళ్ళుచుండెనని యాత డూహించియుండనోపు.

శ్రీకృష్ణసాతవాహనుడు వెళ్ళుదారికి ఒక క్రోశము దూరమున నిబిడమగు నొక కాంతారభాగమున విషబాలను వదలిలేసినారు.

“నీరము లా చుట్టుప్రక్కల కొన్ని క్రోశములవఱకు నుండవు. ఫలములు కానరావు. కంటకావృతమై, ప్రాణరహితమై, బీభత్సమగు దుర్గమారణ్యమున వొంటి విడచి రండు. ఈమె ఇతరులకు మృత్యు వగుగాక!” అని స్థౌలతిష్యుని యాజ్ఞ.

విషబాల కన్నులు దెరచి చూచినది. కర్కశస్థలమున నామె పడియున్నది. ఒక పెనుబా మామెపై ప్రాకుచు చోద్యము చూచుచున్నది. ఆమె ఉలికిపడి లేచి నిలుచున్నది, ఉన్నతములగు చెట్లు, మహోరగముల బోలు తీగలు, కంటకావృత్తము లగు పొదలు, కఠినశిలలతోనిండిన భూమి. ఆమె కన్నులు నులిమికొన్నది. విహ్వలచిత్తయై యామె కెవ్వున నార్చినది. ఆమె కేక ఓ ఒ! ఒ! ఓఓఒ! అని మారుమ్రోగినది. ఆమె పూర్తిగా వివస్త్రయై యున్నది. ఏమి శిక్ష! విషకాంతుల వెలిగిపోవు ఆమె దిగంబరదేహము భయముచే, బిడియముచే ముడుచుకొనినది. ఆ ఉదయమున మలయపవనములు హాయిగా వీచి ఆమెను సేదదీర్చెదమని వచ్చినవి. కాని ఆచ్ఛాదనా రహితమగు నామెతనువు నవి సోకగనే ఆమెకు గజ గజలాడు చలి వచ్చినది. ముడివేసియున్న జటాభారము నామె విదలించి నది. అందమగు మంచు శిఖరమును కప్పివేయు నీల మేఘములవలె ఆమెతలకట్టు పాదములవరకు నల్లగా ప్రవహించి ఆమెను ముంచి వేసినది. ఒత్తుగా తన శిరోజముల నొడలంతయు గప్పుకొని ఆమె నిశ్చేతనయై కూలబడినది.

మరల మెలకువ వచ్చునప్పటికి సూర్యకిరణములు తీక్షణముగా నా యాకు జొంపముల నుండి లోనికి జొచ్చివచ్చి యామె నాస్వాదించు చున్నవి. ఆ బాలిక లేచి కూర్చుండి “నే నిక్కడనున్నానేమి? ఏల వచ్చినాను? ఎప్పుడు వచ్చినాను? ఎవరు తీసుకొని వచ్చినారు? నే నో వేళ చనిపోయినానేమో! ఇది యమలోకములో నొక భాగము కాబోలు! పూజ్యపాదులగు తాతయ్యమాటకు ఎదురాడినాను. వారి కోర్కె నెరవేర్చలేదు. వారి శాపమే నాకిట్లు తగిలినది. అప్పుడే యమకింకరు లీ యమలోకమునకు గొనివచ్చినారు. నే నిప్పు డేమి చేయుదును? అదిగో ఆ పెద్దనాగు బాము పడగయెత్తి ఆడుచు కరుణామయమగు చూపులు నాపై బరపు చున్నది. ఓ అయ్యా! నీ వెవరవు? నీవునూ ఈ యమలోకమున నొక బంటువా? ఇక్కడకూడ సూర్యుడు వెలుగునా? ఈతడు యమలోకపు సూర్యుడు కాబోలు. పూర్తిగా తన కిరణముల వెదజల్ల లేకున్నాడు” అని యామె వెర్రిమాట లాడుకొనుచున్నది.

ఆమె ఇటు నటు చూచినది. అక్కడ నాడుచున్న పామును సమీపించి బుజ్జగింపసాగినది. పాములతో ఆట నామె కలవాటేకదా! ఆ పామును చెంతకు తీసికొని కౌగిలించినది. ఆ పన్నగేంద్రము ఆమెను మెలివేసికొనిపోయినది. “ఓ నాగరాజా! నీవును శిక్షపడి ఈ యమలోకమునకు వచ్చినావా?” అని ఆమె ప్రశ్నించెను.

నాగరాజు కన్నులు: అమ్మా! నిన్ను స్పృశించిన కాలకూట విషా నందమూర్తివలే తోచుచున్నావు. సముద్రమున జనించిన హాలాహలమే నీలకంఠుని గళమునుండి యిట్లు నీ రూపు తాల్చెనేమో?

విషబాల: ఓ ఉరగాధిపా! నీపై నెవరికి కోపమువచ్చినది? నీ కీ భయంకర పాపలోకముల బాధనొందుమని ఎవరు శాపమిచ్చినారు? నీకును తాతగారున్నారా?

నాగరాజు ఫణిపాదములు: ఓ సౌందర్యగాత్రీ! శ్రీకృష్ణుని పాద రజమువలె సాక్షాత్కరించినావు. నీ దేహమున హిమశైతల్యము, దావానలోష్ఠిమ వియ్యమందుచున్నవి.

విషబాల: ఓ వాయుభక్షకా! నీ కాకలి దహించుకొనిపోవుటలేదా? నీ గృహ మెక్కడ? నీ గృహముకడ పావనోదకములుగల నదీమతల్లి పారుచున్నదా? అందు చల్లని నీరములు కడుపునిండ త్రావుచుంటివా?

నాగరాజు చుట్టలువీడి, ఆ డొంకలలో నటు నిటు ప్రాకజొచ్చెను. విషబాల లేచి కచభారము సర్దుకొని యా దిక్కునకు పోవ ఒక్కవాడి ముల్లు కసుక్కున పాదమునకు గ్రుచ్చుకొనుటచే కెవ్వున నార్చెను. తెల్లబోయి యా పాము వెనుక కమితవేగముతో వచ్చి యామె కాలు చుట్టి చుట్టి చూచెను. విషబాల నెమ్మదిగ నా కంటకము నూడబెరకుకొనెను. పాములదారి బాలలకెట్లు సరిపోవును? ఎటుచూచినను ఆమెకు దారి కనబడ లేదు. ఆ పాము నాలుగువైపుల తిరిగివచ్చినది. కాని దాని హృదయమునకుగూడ మనుష్యస్త్రీ నడచుదారి ఏమియు కానరాలేదు.

ఉస్సురనుచు విషబాలిక కూలబడినది. స్థౌలతిష్యుని అనుచరులు ఆ చుట్టునున్న దారులన్నియు ముండ్ల డొంకలతో కప్పి మరియు వెడలి పోయిరి. ఆమె నాల్క ఆరిపోయినది. దాహమని ఆమెనాలుగువైపుల మోముత్రిప్పి కనుగొన్నది. పాపము ఆపాము చేయునది లేకకాబోలు అంతర్థానమైపోయెను.

అత్యంత పిపాసార్ధితయై దిగంబరియగు నా బాల తన తలకట్టే పక్కగా ఒక లెరుంగక నిద్రపోయెను.

మెలకువ వచ్చి చూచునప్పటికి సూర్యుడు నడినెత్తిపై నున్నాడు. ఆమె కాకలి దహించుకొనిపోవుచున్నది. దాహము! ఈ నిర్జనాటవిలో తన గోడెవరాలకింతురు? ఆ పాముజాడకూడ లేదు. మానవుడు వీడిన యా యనాథబాలను క్రిమికీటకాదులుకూడ వీడిపోయినవా? ఇంతలో బుస కొట్టుచు నెచ్చటినుండియో యా పా మచ్చటకు వచ్చెను. దాని నోట ఒక కప్ప యున్నది. విషబాలిక కా పామాహారము కొనివచ్చినది కాబోలు!

విషబాల పక్కున నవ్వినది. “ఓ ప్రాణ స్నేహితుడా! నా కాహారము కొనివచ్చినావా? కాని నీ ఆహారము నాకు సరిపడదే! నీ ప్రేమయే నా కాహార మగుగాక! ఈ యది నరక మని నాకు తోచుటలేదు. గాఢారణ్యమై యుండు ననుకొనియెదను. అయిన నే నిచ్చట కెట్లు వచ్చితిని? అయ్యో! మా తాతయ్య ఇచ్చట దిగవిడిచి చనలేదుకదా! అమ్మో! నా ఒడలు వణకుచున్నది. నే నేమి చేయుదును? నాకు దిక్కెవరు?” అని గాఢవిషాదమున ఆమె అతికరుణముగా ఏడ్చినది. ఆమె మరల నొడలు మరచి పడిపోయెను.

ఆమెకు జ్ఞానము వచ్చుసరికి సాయంకాలమైనది. ఎల్లయెడల కారుచీకట్లు క్రమ్మినవి. కీకురుకీకురు మని కీచురాళ్ళ చప్పుడు, అడవి మెకముల అరపులు దూరమున వినబడుచున్నవి. విషబాల యిప్పుడున్న అడవి భాగమునకు వన్యమృగములుకూడ రా వెరచును. అక్కడ చుట్టుప్రక్కల రెండామడలవరకు నీరములు లేవు. ఆకాశమువరకు పెరిగిపోయి, పాతాళమునుండి నీరుత్రావు పెద్ద పెద్ద వృక్షములు, వర్షకాలమున చిగిర్చి పెద్దవియై తరువాత ఎండిపోవును. కీటకములకుగూడ దారి యీయని కంటక నికుంజములుతప్ప అచ్చట నేమియు గానరావు.

ఆ నాగుబా మీ దినమున అడవిలో తిరుగుచు మనుష్యుల అడుగుల జాడ కన్పించి భయపడెను. మానవు డెచ్చటను కానరాలేదు. ఆ అడుగుల వాసనలచే నా భుజంగము ఆ పాదములజాడనే ధనువులు, క్రోశములు గడిచి యా విషబాలను కనుగొన్నది. మానవస్త్రీని చూడగనే భయపడి వెనుకకు బారి, భయము కలిగించు వాసనకొట్టనందున ఆ పన్నగము మెల్ల మెల్ల బాలికను సమీపించినది.

ఆకలిబాధ చేతను, దాహముచేతను ఆ విషబాలిక నిశ్చేతనమగు గాఢమూర్చలో మునిగినది. ఆమె రాత్రియంతయు నట్లే పడిపోయియుండెను. మరల తెల్లవారినది. ఒక యామము గడచినది. ప్రకృతియే యామెను సేద తీర్చినది. ఆకలిబాధ ఎట్లో మందగించినది. దాహముకూడ ఏ విధముననో తగ్గినది. కాని కదలలేనంత నీరసస్థితిలో ఆమె అట్లే పడియున్నది.

మరల నిద్రపోయినది. మధ్యాహ్నమగువేళ విషబాలకు మరల మెలకువ వచ్చినది. ఆమెకు కన్నులు విప్పుటకుగూడ శక్తి చాలలేదు. కాని తానొక్కతెయే యచ్చట లేదను నభిప్రాయ మామెకు కలిగినది. నరకలోకము వీడి దేవలోకము వచ్చిన ట్లామెకు భావ మొండు కలిగెను. కన్నులు విచ్చి చూచెదమా యని కోర్కె, కనులు విప్పనీయని నీరసము. ముక్కుపుటముల, గళమును, వాయకోశముల నార్పివేయు విషవాయువులు వీచు నీ ప్రదేశమున సువాసనాపూరితములై వీచు నీ తెమ్మెర లెక్కడివి? అనుకొనుచు ఆమె కన్నులు తెరచినది. ఎట్టఎదుట మబ్బులు గ్రమ్మియున్న యామె చూపులకు తలపై వంగిచూచు ఒక పురుషునిముఖము మిరుమిట్లు కొలిపినది. ఆమె మాట రాకపోవుటచే నోరు మెదపి మరల కన్నులు మూసివేసుకొనెను. ఇంతలో ఆమె పెదవులపై తీయని, పుల్లని శీతల మగు సుగంధపూరితములగు రసబిందువులు పడినవి. ఆమె నోరు చప్పరించెను. మరల రసబిందువులు వొలికినవి. ఆమె నాలుక జాపినది. అందుపై ప్రాణము లేచివచ్చు నాగరంగఫలరసము నెవ్వరో పిండినారు. 

7. ఆచ్ఛాదనము

వేట రాజుల వ్యసనము. బ్రాహ్మణ ప్రభువులకుగూడ వేట తప్పదు. బుద్ధభగవానుని ధర్మము నాశ్రయించినను రాజులకు వేట ఏల తప్పును?

మృగయావినోదియై శ్రీకృష్ణసాతవాహనమహారాజు పరివారసమేతుడై వెడలినాడు. వేటకుక్కలు, డేగలు, గరుడులు, చిందుగులు, ఏనుగులు, కిరాతులు, సామువాండ్రు కూడ బోవుచుండిరి. వారితో శుల్బములు మృగబంధనములు, భారయష్టులు, డప్పులు, వృక్షాదనములు, క్రకచములు, మృగబంధనములు, భారయషులు, డప్పులు, నారాచములు, త్రిశూలములు, ఔషధములు, కాగడాలు, శిబిరములు, మంచములు, ఆసనములు మొదలగు పరికరము లెన్నియో తెచ్చుచుండిరి.

విషవైద్యులు, కార్తాంతికులు, భిషక్కులు, వంటవారు, ఆఖేటన విద్యాచతురులు తోడరా మహారాజు సేనాపతిద్వితీయుడై చనుచుండెను.

చిందుగులు వేటాడుటయందు ప్రసిద్ధినందిన జంతువులు. చిందుగులను సివంగు లనియు బిలుతురు. అడవి ఎర్రకుక్కలను కూడ చిందుగులవలె బోనులలో పెంచి మృగములను వేటాడించువారు ఆంధ్రులు.

ఆంధ్రశాతవాహనులు బుద్ధపదారాధనాతత్పరులయ్యు, సంధ్యార్చనాదికముల మరవరు. క్రతువుల నాచరింతురు కాని వానిని హింసాపూర్వకముగా జేయరు. శ్రీకృష్ణ శాతవాహనమహారాజును రేపకడనే స్నానమాచరించి సంధ్యార్చనాదికముల నిర్వర్తించి కవచము ధరించి సకలాయుధోపేతుడై శుభముహూర్తమున విప్రాశీర్వాదములు చెలగ ఏనుగు నెక్కబోవుచుండ దూరమునుండి తీయని ఒక బాలికాకంఠము తెల్లవారుగట్ల పాటపాడుచు వినంబడినది.

రాజజ్యోతిషికుని తనతో భద్రదంతావళము నెక్కగోరి శ్రీకృష్ణుడు గజారోహణ మొనర్చెను. గజమును కదలినది. వేటపరివారమంతయు గదలినది. శ్రీకృష్ణుడు జ్యోస్యునితో తన కలయంతయు తెలిపి దాని ఫలితము వినిపించ ప్రార్థించినాడు. ఒక యరనిమేషము ఆలోచనాధీనుడై యా కార్తాంతికుడు శ్రీకృష్ణుని జూచి,

"ప్రభూ! తమ స్వప్నమును, తాము ప్రాయాణోన్ముఖులై నప్పుడు వినిపించిన యా మధురగీతాలాపన పరమార్థమును సమన్వయించిన, తమకు కొన్ని చిక్కులు వివాహవిషయమై రాగలవనియు, అవియన్నియు తీరి పరమానందముగ వివాహమగుదు రనియు, తమకీ ప్రయాణమున అఖండ విజయము, ఆ విజయమునకు ముందు వివాహాదివిషయమువలెనే కొన్ని చిక్కులు, ప్రాణాపాయస్థితులు సంభవించుననియు, నాకు తోచుచున్నది” యని మనవి చేసెను. “స్వప్నమువలన నట్లు చెప్పవచ్చునా? ఈ జ్యోతిష్యాదులు నిజమా? యన్న ప్రశ్నలు నాలో నప్పుడప్పు డుద్భవించును. ఈ ప్రపంచమంతయు మాయ యందురుకదా! ఈ ప్రపంచమెంతయున్నది? దీని కాధారము మేరు పర్వతమేనా? ప్రపంచమధ్యమున జంబూద్వీపమా? ఆ ద్వీపములో నవవర్షములు. అందు మనము నివసించు భారతవర్షము అనంతమైన జగత్తులో మనమేపాటి? మనస్వప్నము లేపాటి?”

“ప్రభూ! తాము సెలవిచ్చినది సత్యమే. మహత్తత్త్వమువలన ఈ సర్వ భూమండలము పరిభ్రమింపవచ్చును. లోకాలోకపర్వతము వరకు పోవచ్చును. మనవారు జంబూద్వీపాంతరములకుబోయి సువర్ణద్వీపములు చూచి రాజ్యము లేర్పరచుకొన్నారు. యవనరాజులతో వర్తకములు చేయుచున్నారు. అనేక వర్షములలో చిత్రచిత్ర మనుష్య జాతులను, మృగజాతులను జూచుచుండిరి. ప్రపంచమెంత విశాలమైనను సనాతనమైన ధర్మమొక్కటే దీనిని ధరించుచున్నదికదా!”

“అవును, మహాశ్రమణకుని బోధకు, ఆర్యఋషుల బోధకును సర్వవిషయముల నొకేభావము ద్యోతకమగుచున్నను, నిర్వాణాది విషయములందు, సత్యదర్శనమందు కొలది భేదములు మాత్రము కనబడుచున్నవి. సర్వప్రపంచమిట్లు ప్రత్యక్షమై రాజ్యములకై, సంపదకై దారాపుత్రాదులకై సంతోషాదులకై మనమిట్లు తాపత్రయముల బడుచుండియు, నిదియంతయు భ్రమ అనుకొనుట ఏల?”

“మహారాజకుమారా! అంతమాత్రమున జగత్తు సత్యమగునా? మనమును సత్యము కాము. ఒక మహాకర్మమున నేమియులేని శుద్ధానందములో నుండి వికృతినంది మన మీ విచిత్రనాటక మాడుచున్నాము. దానికి ద్రష్టలమును మనమే అయ్యు అహంకార మమకార వశుల మగుచున్నాము. అదియే దుఃఖనాటకము.”

ఇట్లు సంభాషించుచు మహారాజు సపరివారుడై అటవీ మధ్యము జొచ్చెను.

ఆ దినమంతయు వేట జరిగినది. అనేకమృగములు హింసింపబడినవి. అరణ్యమంతయు గగ్గోలుపడిపోయినది.

ఆరాత్రి మహారాజు చిన్నపట్టణమునకు సరిపడు తన పరివార జనమందరితో నొక శైవాలినీకూలమున శిబిరముల వేయించి విశ్రమించెను.

యామములు యామము లాతనికి ఏదియో ఆవేదన. యుద్ధమెట్లుండునో? భరుకచ్చము పట్టుకొనుట, ఆభీరులతో యుద్ధము, వివాహము! ఈ ఆలోచనలు ఆషాఢ మేఘములవలె అతని మనఃపథమున సంచరించినవి.

కొంతకాలమునకు యౌవనశ్రీసుభగుడు నా శాతవాహన కుమారుడు తన మృదుపల్యంకమునుండి లేచి క్రిందికి దిగి మెత్తని పాదరక్షలు తొడుగుకొని మైనపువత్తి దీపములు వెలుగు దీపస్తంభముకడకు పోయి, యా దీపములకొడులన్నియు సరిచేసి, యక్కడనొక ఆసనముపై కూరుచుండి, తన్ను కలచివేయు వివిధాలోచనముల జెదరగొట్టుచుండెను.

ఎన్నిసారులు దూరముగ త్రోసిపుచ్చినను మరల మరల తన వివాహవిషయము అతనికి ప్రత్యక్షమగుచున్నది. ఏమి వివాహము? ఎవరితో? మహారాజుల కొమరితలు తనకు వలదు. వారు తనపుత్రులకు తల్లు లగుదురేగాని తనమనోవేదన తీర్చశక్తి కలుగు వారగుదురా? వారలలో కొందరు అందకత్తియలు నున్నారట. అందచందములు జంతువులకు మాత్రము లేవా? తమ మాండలికులలో అద్భుతసౌందర్యముగల యువతు లున్నారని ఎన్నియో సంబంధములు వచ్చినవి. తండ్రిగారు తన భావ మేమని కోరినప్పు డా ప్రస్తావనకు తాను ప్రతియీయలేదు. వివాహ మేమి? కామ నిర్వహణమునకు తనకడనున్న బాలికలు చాలరా? అనాఘ్రాత పుష్పములై కుసుమపేశలదేహలై, పరీమళోచ్ఛ్వాసనాసికాసుందరులైన యా బాలల కన్న తన కామాగ్ని కింధనము లగుటకు వేరు వనిత లేల? అయిన వారిని తా నంటినదియు లేదు. వారి యౌవనామృతరసము నాస్వాదన చేసినదియు లేదు. తుచ్ఛానందము దేహసంయోగమాత్రమున జనించును. గాఢమై, గంభీరమై, అనంతమై, అత్యంత గోప్య మగు మానవప్రకృతి కాసౌఖ్యము తృప్తినీయగలదా? కురూపులై భరింపరాని దుర్గంధముల నోలలాడు ఈ కిరాతులలో స్త్రీ పురుషులానందమొందుటలేదా? ఈ దేహసౌఖ్యమాత్రమునకు అందముగూడ నెందుకు? సాధారణ వృక్షములును మహౌషధులు నన్నియు గుసుమించి ఫలించుటలేదా? బీజధర్మ మంతట నొక్కటియే కదా!

శ్రీకృష్ణశాతవాహనుడు పోయి మంచమున మేనువాల్చి నిదుర గూరెను. వేకువనే వైతాళికులు ఉషోదయగీతికల బాడిరి.

వేటజనమంతయు లేచెను. సర్వము సిద్ధముచేసికొని వేటసాగింప బయలుదేరెను, మహారాజు శ్రీకృష్ణశాతవాహన కుమారుడు.

ఏనుగుపై నెక్కి కొంతదూరము సాగెనో లేదో ఎదుట నొక గిరినాగు ఏనుగునకు కొలదిదూరములో కానవచ్చినది. గిరినాగము లన్న ఏనుగులకేమి, సింహములకేమి, మనుష్యులకేమి యన్నింటికిని భయమే. గిరినాగము కంటబడినవాడు దానిబారినుండి పారిపోలేడు. మంత్రవేత్తలు, పాములవాం డ్రానాగములవైపునకైన పోవరు.

“మనుష్యునకు కనంబడని యీ పాము నేడింత నిర్భయముగ నడవుల సంచరించుచున్నదేమి?” యని వారందరు సంభ్రమాశ్చర్యముల నందిరి.

అప్పుడొక పాములవాడు ముందునకు వచ్చి, మహారాజు గజము వైపు తిరిగి చేతులు జోడించుకొని “మహాప్రభూ! ఈపాము దేవరవారిని ఎక్కడకో రమ్మని అడుగుచున్నది. ఈ పాములమాట మే మెవ్వరము జవదాటి ఎరుంగము” అని మనవిచేసికొనెను. 

8. మహావిష సాన్నిధ్యము

ఆ మహానాగము ముందు, వెనుక శ్రీకృష్ణశాతవాహనుడు కతిపయ పరివారము తోడను అమితవేగమున వెడలజొచ్చిరి. ఉత్తరాభిముఖమై ఆ పొదలలో, నిబిడ వృక్ష సమూహములలో, నల్లనిబండరాళ్ళలో ఆ పర్వత నాగేంద్రుడు వారిని కొనిపోయినాడు.

శ్రీకృష్ణసాతవాహనుని మత్తగజము లెక్క సేయక వేగమున బారు నా పన్నగేంద్రు ననుసరించి పోవుచుండెను. వెనుక ఏనుగులు, గుర్రములు, బండ్లు, ఎద్దులు వచ్చు చుండెను.

యువరా జెక్కిన మదగజముపై మంత్రగురువు, విషవైద్యుడు, పాములవాడును ఎక్కిరి. వారట్లు రెండుక్రోశములదూరము పోవునప్పటికి దారి దొరకుటయే కష్టమగు భయంకరారణ్యము చొచ్చిరి. ఆ ప్రదేశము మృత్యుదేవత విహరించు ఉద్యానవనభూమివలె నుండెను. భయ మనునది ఎరుగని శ్రీకృష్ణసాతవాహన భద్రదంతావళము “మందరాద్రి” యను పేరుగలది ముందునకు అడుగువేయుటకు జంకి ఆగిపోయెను. ఏనుగు లన్నియు నాగిపోయినవి. శ్రీకృష్ణసాతవాహనున కేదియో వివశత్వము కలిగినది. మావటీల నాయకుడగు మంద రాద్ర్యాధోరణుడు ఏలనో గజగజ వడంకెను.

విషవైద్య, మంత్రవైద్యులు వెంటనే తమ గజము నాపి, తాము దిగిరి. మంజూషలో నుండి విషవైద్యుడు ఒక కరండము తీసి, యందు కొన్ని చూర్ణములు వడివడిగా బోసి, చెకుముకి వెలిగించి యా చూర్ణమంటించెను. ఆ కరండమునుండి నల్లటి దూపములు ఘాటైనవి పొగమంచువలె పై కెగసినవి. ఆ కరండమును బట్టుకొని యా విషవైద్యుడు ఎండిన యా ముళ్ళపొదలో ఎటులనో దారిచేసుకొనుచు ముందునకు దూలుచున్న భద్రదంతావళము కడకు బోయెను. అందరికి తుమ్ములు, దగ్గులు వచ్చినవి. ఆ ప్రదేశమంతట నావరించియున్న భయంకర విషవాయువు ఈ పొగలచే సమసిపోయినది. మందరాద్రియు, మావటివాడును, శ్రీకృష్ణసాతవాహన మహారాజును మత్తుతెలిసి ప్రకృతిస్థులైరి.

మహారాజు: ఏమి ఈ విచిత్రము?

విషవైద్యుడు: ప్రభూ! ఈ ప్రదేశమంతయు భయంకర విషగంధ సమ్మిశ్రితమై యున్నది. సర్వవిషనాశకమగు ఈ దివ్యచూర్ణ మొక్క హాలాహల కాలకూటవాయువులదక్క తక్కినవిష వాయువుల నన్నిటిని సమయించును. తామును, మావటీడును, తమ మహాగజమును తూలిపోనారం భించితిరి. నాకును ఆ విషవాయువు తగిలినది. వెంటనే మా ఏనుగుపై వారమందరము “అమృతరస” మను నీ మందును మాత్రలుగా సేవించి, ఏనుగు నాపి, దిగి ఈ పనిని చేసితిని.

అప్పుడా భద్రదంతావళము భూమిపై నధివసింపజేసి శ్రీకృష్ణసాత వాహనుడును గజావరోహణ చేసెను. ఇంతలో పాములవాండ్రు, కిరాతులు మొదలగువార లనేకులా ప్రదేశముకడకు వచ్చుచు దూరముననే యాగిపోయిరి. అందొక్క పాములవాడు “హో” యని కేక పెట్టి యుచ్వైసనమున నిట్లు చెప్పినాడు.

“ఏలినవారు ఉన్నది మహావిషపుగాలులు వచ్చే ప్రదేశం. ఆ చుట్టు ప్రక్కలనే, అదిగో ఆ విధముగ ఆగి, వింతబడి చూచుచున్న ఆ పాపఱేని నివాసము ఉండి ఉండవలె. లేకపోయిన దొరా! అంత చావుగాలి రాదయ్యా” అని చెప్పినాడు.

“ఇప్పుడేమి చేయవలె?” అని విషవైద్యు డరచినాడు.

“స్వామీ! ఆ పొగలు బాగుగా వేయండి. మేమందరము అచ్చటికే వచ్చుచున్నాము” అని ఆ పాములవారిలోఁబెద్ద పెద్దకేక వేసి చెప్పెను. వారంద రచ్చటికి దారిని సరిచేసుకొనుచు వచ్చిరి. ఈలోన ధూపకరండము లయిదారింటిలో విషనాశక చూర్ణము పొగలువేయబడినది. రాజకుమారుడు, పాములవాండ్రు, కిరాతులు, విషవైద్యగురువు, మంత్రవైద్యుడు మాత్రము కాలినడక నా పన్నగేంద్రమును వెంటనంటిరి.

“అమృతద్రావక” మను ఒక మందు స్ఫటికశిలలో దొలచిన కలశములో నుంచిన దానిని విషవైద్యుడు వలిపెములపై పోసి తడిపి, ఆ వలిపెముల ముక్కలు అందరి ముక్కులకు కట్టి తానును కట్టుకొనెను. అప్పటికే సూర్యుడు చండకిరణుండై మధ్యాహ్న సింహాసనము నాక్రమింప వేగమున బోవుచుండెను. అందరికిని నాల్కలు తడియారి పోవుచున్నవి. చిరుచెమ్మటలైన వారి దేహముల నుద్భవించుటలేదు. దాహముకాకుండ వైద్యుడు యష్టిమధుకాదుల భావనచేసిన మాత్రల నెల్లవారికి నిచ్చెను. అవి ఒక్కొక్కటియే వారు నోటిలో వైచుకొనుచుండిరి. వారి దాహము కొంచెము తగ్గజొచ్చినది.

ఇంతలో ఎదుట విగతజీవివలె పడియున్న యొక దివ్యసుందరి విగ్రహము! ఆ విగ్రహము దిగంబరమై ఒరనూడ్చి పడవేసిన కృపాణమువలె నున్నది.

ఆ విగ్రహపు దీర్ఘవినీలకుంతల భారము చెదరి, యామెపై ఆచ్ఛాదన వస్త్రమువలె పడియుండెను. ఆ విగ్రహము అమరత్వముదాల్చిన రూపమే. అయినను ఏ మహావిధి సంఘటనవల్లనో వాడిపోయిన నందనవన పారిజాతకుసుమమువలె నున్నది.

ఆ నాగుబాము విషాదముతో, ఆ పడియున్న విగ్రహముచుట్టు బుసలు కొట్టుచు వీరందరు నిలుచుండియున్నవైపు చూచుచు, తిరుగుచు తొక్కట పడుచుండెను.

ఈ దృశ్యమేమి? ఆ బాలిక ఎవరు? ఆమె ఎక్కడిది? ఆమె బ్రతికియున్నదా, చచ్చిపోయినదా? యని యాలోచన లందరిహృదయముల నొక్కసారి జనించెను. ఆ వైద్యగురువు పడియున్న బాలికను దూరమునుండియే ఒక నిమేషము తీక్షణదృక్కుల పరికించి “మహాప్రభూ! ఆ బాలిక బ్రతికియున్నది. కొనయూపిరితో నున్నయది. ఆమెకు వెంటనే చికిత్స సేయకపోయినచో ఆమె చనిపోవును. కాని.... కాని....” అని తొందర తొందరగా మాటలాడెను.

“కాని ఏమి! వెంటనే ఆమెను రక్షింపవలెను. రండు పోవుదము”

విష: ఆగుడు మహారాజా! ఒక్క అడుగు ముందుకు వేయకుడు! ఆమె ఏ మహత్తరవిషమో సోకి అట్లయియుండవచ్చును. ఆమెదగ్గరకు పోవుటే మృత్యువదనమున బడుట.

మహా: మఱి కర్తవ్యమేమి? వ్యవధి లేదు. ఆ దేవాంగన చనిపోవును. మీరు రానిచో నేను పోయెదను. ఏదిరా ఆ గొడ్డలి?

అని శ్రీకృష్ణసాతవాహనుడు ముందు కురకబోయినాడు. ఋషితుల్యడగు నా విషవైద్యుడు మహారాజుకడకు పరుగెత్తి వారిని నివారించి, “ప్రభూ! ఒక్క అడుగు ముందుకు వేసితిరా, తథాగతునిపై నాన! తొందర పడకుడు. నేను ఇంకొక మహావిషమును సేవింతును. ఈ విష మా విషమును విరచును. ఇది సేవించినవారు మూడుదినములావల వేయి గజనిమ్మ పండ్లు సంపూర్ణముగ భక్షింపవలయును! ఆ భయంకరవిషము ఈ విషమును నాశనముచేయుచు తాను నశించును. ఇప్పుడు నేను పోయి, ఆ విషమును నా సంచిలోనున్న గజనిమ్మపండును ఒలిచి ఆ రసముతో రంగరించి, ఆ బాలికనోటిలో పిండెదను. మీరంద రిచ్చటనే యుండుడు. ఆ వ్యాళగ్రాహియు, నేనును పోయెదము” అని వేగముగ బల్కెను.

వారందరట్లు చూచుచుండగనే, విషవైద్యునికడ విషము ఆ ఇరువురు భక్షించి, ముళ్ళకంచెలు గొడ్డలిచే ఛేదించుచుపోయి యా బాలికను చేరిరి. విషవైద్యుడు వెంటనే యామెపై తన ఉత్తరీయమువైచి యామె దిగంబరత్వమును కప్పెను. 

9. ప్రణయా వేదన

విషవైద్యుడు విషబాల నాడిని పరీక్షించి, యా నాడిబలమున కచ్చెరు వంది, ఆమె పెదవులపై గజనిమ్మపండు రసమును పిండినాడు.

ఆ తీయని, పుల్లని, శీతల మగు సుగంధపూరితములగు రసబిందువులు అమృతరసబిందువులై పడినవి. ఆమె నోరు చప్పరించెను. మరల రసబిందువులు ఒలికినవి. ఆమె నాలుక జూపినది. అప్పుడా విషవైద్యుడు తన సంచిలోనుండి నాగరంగఫలము నొకదానిని తీసి ఒలిచి ప్రాణము లేచి వచ్చు ఫలరసమును ఆమె నాల్కపై పిండినాడు.

విషబాల “దాహము, దాహ” మని లేచినది. పాములవా డామెను “తల్లి! నువ్వు కదలకు; అన్నీ మేము చూచుకొందుము” అని అనునయించుచు, తన తలపాగాతీసి ఆమె తలకు దిండుగ నమర్చి, తనపై గొంగళిని పక్కనమర్చెను.

ఇంతలో విషవైద్యుడు పరుగున సేవకులకడకుబోయి తోలు తిత్తులలో నున్న జలమును ఒక కలశమున సేకరించి, విషబాలకడకు వేగముగ వచ్చి, యామెమోముపై నీరములు చల్లి, చేతులు పాదములు జలముల గడిగి, చల్లని ఆ నీటిని కొంచెము కొంచెముగ ఆమె తలయెత్తి తనయొడిలో పెట్టుకొని త్రావించెను. పాముల వాడామెకు ఎండతగులకుండ ఛత్రము నొకదానిని తెచ్చి అడ్డము పట్టెను.

శ్రీకృష్ణసాతవాహనుడు ఆశ్చర్యమున నిశ్చేష్టుడై, యా విషబాల వైపు తదేకదృష్టితో జూచుచుండెను. ఆమె భయంకర జగన్మోహనాకారము, ప్రళయతాండవేశ్వరదృత సంచార సంచలచ్చరణోద్భూతైకాదశ రుద్రమండల మహాగ్నిస్ఫులింగములవలె ఆమె మెరసి పోవుచుండ తన చూపులు, ప్రాణము, మనస్సు, హృదయము, ఆత్మయు ఆమె కర్పించి వేసెను.

విపులమై, భారమై, సుదీర్ఘమైన ఆమె కైశ్యశ్రీ నిర్మలశర్వరీ నిశ్చలాకాశమువలె ఆమె అనంత చైతన్యసౌవర్ణపాటలత్వమును కప్పుచున్నది.

ఇంతలో ఆమె దిగంబరయైయున్నదన్న భావ మాతనికి మెరపు వలె స్ఫురించినది. వెంటనే యా మహారాజు తన నడుమున కట్టియున్న దుకూల బృహతికను ఆమె కంతరీయముగ నిమ్మని యా యహితుండిక వృద్ధున కిచ్చెను.

“ఓ వైద్యగురూ! ఆమె సేదతీరినంతనే వలయురక్షకుల నేర్పాటు చేయుడు. నా అంతఃపుర బాలికల నిరువుర నా మెకడ కంపుదునా?”

“చిత్తము ప్రభూ! ఆ ఏర్పాటు లన్నియు నొనర్చెదను. ఈ ప్రదేశమంతయు సూర్యకిరణములు చొరగానిది. దుర్మార్గు లెవరో ఈ బాలను ఇట దిగవిడిచి ఇటునటు బోకుండ ముళ్ళకోట కట్టినారు.”

"అవును. ఆమెను ఎవరో మునుష్యులే ఇక్కడ క్రూరచిత్తులై దిగవిడిచిపోయినారు. ఇంతవరకు ఆమె శాపగ్రస్తయై భూమికి అవతరించిన ఏ దేవియో యను భ్రమలోనుండి, మానవులకు ఆమెకు సంబంధము ఊహించనైతిని. ఆమె నాగలోకవాసిని కాదుగదా!”

“ప్రభూ! ఆ గిరినాగము గడబిడలో ఏమైనదో కనిపెట్టలేకపోతిమి. మీ రనునది నిజమేమో? కానిచో ఈ బాల ఇంత విషయుక్తయయ్యు, ఎట్లు బ్రతుకగలిగినది?" “విషయుక్తయా? అది యేమి?”

“ప్రభూ, ఈమెయందు మహావిషము కూడియున్నది. ఆమె కను కొలకులు పరీక్షించితిని. నఖములు పరీక్షించితిని. నాలిక చాపినప్పు డా జిహ్వము తీక్షణముగ పరిశీలించితిని. ఆమె పెదవులు, చెవుల తమ్మెలు, భ్రూయుగ్ముము, ముక్కుపుటములు అత్యంత నిశితముగ పరిశీలించితిని. మహారాజా! ఈ బాలికయందు సర్వవిషములు జీర్ణించియున్నవి. అవి ప్రస్తుతము విజృంభించియున్నవి. ఆ విషములే మనల నందర నంత చికాకు పరచినవి.”

“అయిన నీ బాలిక ఎట్లు బ్రతికియున్నది? ఆమె ఇంతలోనే చనిపోవునా? ఆమెను బ్రతికించు ఉపాయములు లేవా? మీ శాస్త్రముల కాపాటి శక్తి చాలదా? ఏ దుర్మార్గులు, రాక్షసులు, పిశాచులు ఈ బాలిక నిట్లుచేసిరో వారిని వేయి ఖండములుగ నరికివేతును వారిని బ్రతికియుండగానే ఇటులనే తిండి పెట్టక, నీరమియ్యక, ఇట్టి మరుభూమిలో మాడ్చి, గ్రద్దలకు, రాపులుగులకు బలిచేయుదును!”

శ్రీకృష్ణశాతవాహనుని కండ్లు స్ఫులింగశకములైపోయినవి. ప్రచండ సూర్యగోళము లైనవి. ఆతని కుడిచేయి కరవాలమును దృఢతర ముష్టి బంధమున పట్టుకొనినది. ఆతడు ప్రళయకాలరుద్రునివలె మండి పోయినాడు.

ప్రక్కనున్న మంత్రగురువు ఎదుటికి వచ్చి, “శాంతింపుడు, మహారాజా! శాంతము ఎట్టికష్టములనైన నివారించునుగదా! ఇప్పుడు కర్తవ్య మాలోచింపవలయునుకాదా? ఆ బాలికకు ప్రాణాపాయ మేమియు నుండదు....” అనెను.

శ్రీకృష్ణ: మీ రెట్లు చెప్పగలరు?

విషవైద్యుడు: ఆమెకు ప్రాణాపాయ మేమియు లేదని నేను నా వైద్యశాస్త్ర జ్ఞానమంతయు నాధారముగ ప్రతిజ్ఞచేసి చెప్పగలను ప్రభూ!

మంత్ర: ప్రభూ! నేను నా మంత్రశాస్త్ర ప్రమాణముగ ప్రతిన చేయగలను.

శ్రీకృష్ణ: మనకందరకు ప్రాణభయము కల్పించునంతటి విషము లామెకు ఇచ్చినా రంటిరి. ఆమె ఎట్లు బ్రతుకును? మీ మాటలు నమ్ముటెట్లు?

విష: మహారాజా! అదే విచిత్రము. కారణ మిప్పుడు నేను చెప్పలేను. కాని ఎంతటి విషమునైన ఈమె హరించుకోగలదు.

శ్రీకృష్ణ: నాకు మీ యిరువురి మాటలవలన మతిపోవుచున్నది! ఈ లోన ఆ బాలిక ప్రాణము పోకుండ చూడుడు. ఆ బాలిక ప్రా-ణ-ము-పో-యె-నా, సర్వదేవతలు సాక్షిగ నాప్రాణములు మరుక్షణమున నా బొంది నుండవు!

ఇది యేమి యని చకితులై మంత్రగురువును, విషవైద్యులు నొకరి నొకరు చూచుకొనినిరి. వెంటనే మంత్రగురువు....

“ప్రభూ! ఈ విషగాలులు తమ నరములను క్షోభింపజేసినవి. తాము పోయి, గజ మారోహించి కొంచెము విశ్రాంతినందుడు” అని విన్న వించెను.

“నా కింతటినుండి విశ్రాంతి యనునది లేదు. ఈ బాలిక జీవితము ఏదియో మహత్తర విధివశమున నాబ్రతుకుతో అత్యంతగాఢసంశ్లేషత నందినది. ఆమెకు ప్రాణము నిలిచినది అన్నమీదట నా ప్రాణము తనంత నిలుచును” అని మహారాజు వచించెను.

విషవైద్యుడు భయముగదురు హృదయముతో చేతులు వడక, విషబాలకడకు బోయి, మరల నతిశ్రద్ధగ నామె ఉచ్ఛ్వాసనిశ్వాసములు, కన్నులు, కపోలకంఠ హస్తతల మణిబంధకూర్పరపాదగుల్నోరుపజిహ్వాదినాడులన్నియు బరీక్షించెను. అత డంత లేచి, మహారాజుకడకు బోయి “ప్రభూ! ఈ బాలిక బ్రతికియున్నది. ఆమెయందు మహాసర్పనాడి వ్యాప్తమై యున్నది. అయినను ఆమెలో భోజనము, నీరము గైకొనని నీరసముతప్ప వేరొండు దోషమేమియు లేదు. ఆ దోషములైనను ఇప్పుడు కొలదిగ మాత్రమున్నవి. ఆమె ఇప్పుడు నిద్రపోవుచున్నది. మహావిషదిగ్ధయగు నీ బాలిక ఇతిహాసములలో, విష శాస్త్రములలో చెప్పినట్లు ఈ.....బా....లి.....క....“వి......ష......క......న్య.....క...” యని వణంకుచు చెప్పి తలవంచుకొనెను.

శ్రీకృష్ణ: విషకన్యకయా!

సింహగర్జనవలె ఆ ప్రదేశముల మారుమ్రోగ నిట్లడిగిన యువరాజు వదనమాలోకించి,

“చాణక్యదేవుడు పర్వతకుని పై విషకన్య ప్రయోగముచేసెనని వినరా మహారాజ కుమారా!” అని మంత్రవేత్త పలికెను.

శ్రీకృష్ణ: అట్టి బాలిక ఇక్కడ నెట్లు పడియుండును?

విషవైద్యుడు: ప్రభూ! ఆమె నాశనము గోరి ఎవరో ఇచ్చట వదలి యుండవచ్చును.

శ్రీకృష్ణ: కార్తాంతికులవారిని పిలువనంపుడు.

వెనుక వేరొక గజముపైవచ్చు కార్తాంతికు డచ్చటికి విరుగుడు మందులు సేవించి కొలదికాలమునకు వచ్చెను.

శ్రీకృష్ణశాతవాహను డాయనవైపు తిరిగి “పండితులవారూ, ఎవరు ఈ బాల? ఈమె నా కంటబడిన ఫల మేమి?” అని యడిగెను.

కార్తాంతికు డంతట తనలో నొకింతసేపు గుణించుకొని “మహారాజా! ఈ బాలిక రెండు మూడు సంవత్సరములు ఈ స్థితిలో నుండును. ఈమె సత్కులవంశజాత. ఈమె జాతకము పరమోత్కృష్ఠము. ఈమె మహారాజ్ఞి యగును. మీ జీవితమునకు ఈమె జీవితమునకు ఏమియో సంబంధమేర్పడు సూచనలున్నవి. ఈమెను వెంటనే వలయు నుపచారములతో, కట్టుబాటులతో మనతో గొనివచ్చు ఏర్పాటులు చేయుడు. ఒక శిబికపై ఈమె ప్రయాణము చేయును. ఈ మహావైద్యు లీమె రక్షణకై వలయున వన్నియు నిర్వర్తింతురు” అని మనవిచేసెను.

విషవైద్యుడు, “ప్రభూ! తాము నా అనుమతిలేనిదే రెండునెలల పాటు ఈమెను సమీపింపనని మాట ఇచ్చినచో నే నీ భారము వహింపగల” నని విన్నవించెను. 

10. నర్మదానదము

నర్మదానదము ఎంత శ్యామలమో అంత ప్రసన్నము. ఎంత గంభీరమో అంత సుందరము. సింధునది మహాశక్తిమతి. ఆమె అనాది చరిత్రకలది. ఆమె వేదములతోడనే ఆవిర్భవించినది. ఆమె అదితిదేవి. దెస దెసల ఆవరించు వెలుగు వాకలై ప్రవహించు మహానది ఆమె. ఆమె గర్భమున దేవనదులే ఇమిడిపోయినవి. ఆమె కాళికారూపిణి. ఆమె సర్వమతములు తనలో జీర్ణించుకొన్నది. ఆమె దస్యులకు, అసురులకు, యవనులకు ఆశ్రయమిచ్చినది.

నర్మదానది నవోఢ. ఆమె భారతవర్ష దేవికి మణిమేఖల. ఆమె పాత్ర పూరితారుణ రాగరంజితావనతవదన. యమునాదేవి గంభీరచరిత్ర. ఆమె తరళనయన, ప్రేమ ప్రేంఖణిత మానస, కృష్ణభక్త్యంకిత, వినీల జలజనయన.

నర్మద అల్లరిపిల్ల. ఆమె నాట్యమాడును. కిరాతకన్యలతో ఆ అడవులలో దోబూచులాడును. అడవిపూలే అలంకరించుకొనును. అడవిలతల మేఖల నొనరించును. తీయని స్ఫటిక జ్యోత్నలలో, ఆ అడవిదారుల వనపత్రవస్త్రాలంకృతయై దీర్ఘకుంతలములు విరియబోసికొని, పురుకుత్సునకై వియోగ గీతికల బాడుకొనును. గంగానది మహావేగవతి, త్రిపథగామిని. పవిత్రాంబుపూరయై మానవజీవితములనే పూత మొనర్చును. ఆమె స్నిగ్థసితాంగ. ఆమె పుట్టుకయే మహారహస్యము. ఒకనాడు విష్ణుపాదముల జనించును. వేరొకనాడు మహేశ్వరజటాజూటస్థ యోగనిద్రపరవశ. ఒక దినమున జాహ్నవి, మరు దినమున భాగీరథి. ఆమె సాగరసింహాసన పట్టాభిషిక్తమహాసామ్రాజ్జి. వరణుని దేవేరి.

నర్మద భర్తనుజేరు దివ్యసంగమస్థలముకకు డెబ్బది యోజనముల దిగువను గౌతమి ఉద్భవించినది. ఆమె నర్మదను చెల్లీయని పిలుచును. కృష్ణ గౌతమినే చెల్లి ఏమి చేయుచున్నదని ప్రశ్నించును. వారి పెద్దక్కసింధునది. వార్తలు నర్మదయే గౌతమికి వినిపించును. సరస్వతీనది సంగీతమును వేసవిరాత్రులందు నర్మదా గౌతమీ కృష్ణా భీమరధీ తుంగభద్రావేణీ కావేరినదులు ఆలకించును. ఆమె వీణాస్వరముల మేళవించి తీయని గీతికల పాడును. గంగా యమునా శోణా బ్రహ్మపుత్రికా మహానదులు తన్మయురాండ్రై విందురు.

ఆనాటి రాత్రి వైశాఖపూర్ణిమ. వెన్నెలకరుళ్ళు విశ్వమెల్ల ప్రవహింపుచున్నవి. సువర్ణశ్రీ కుమారుడు గోండువేషముతో నర్మదానది తీరమున ఆ తెల్లని రాలలో రాయియై, నీడలలో నీడయై, నదీజలమువంక చూచుచు నదీకంఠ మహా సౌందర్యము గమనింపుచు గూరుచుండెను.

మహాబలగోండుడు, హిమబిందు నింతవరకు విరోధులు గొనివచ్చి ఇచ్చట మాయమైనారని సువర్ణునకుజెప్పి రాక్షసులచే నా ప్రదేశమంతయు, గాలించి వెదకింపనెంచి యాతని సప్రమత్తుడై యుండగోరి మాయమయ్యెను. ఇన్నాళ్ళ నుండియు మహాబలుని స్నేహమువలన ఆటవీ సంచరణ విద్య సువర్ణునకు చాలవరకు అభ్యస్తమయ్యెను. ఆతడు ఎంత ప్రమత్తతతో నున్నట్లు కనబడుచుండెనో, అంత జాగరూకతతో అన్ని సవ్వడులను వినుచుండెను. సర్వదిశలు పరిశీలించుచుండెను.

“హిమబిందూ, శిల్పదేవీ! నీ వేమైతివి? నీ వెట్టికష్టముల నందుచున్నావో? ఆగర్భ శ్రీమంతురాలవు, వర్ణనాతీత సుందరశ్రీ మూర్తివి. శిల్పులు నీ యందమును మూర్తింప గలరా? కవులు నిన్ను కావ్యమున బాడగలరా? దేవీ! ఏ మహావిధి మనల నిద్దర గూర్చినది. నీవు నాకడ లేకున్న నా హృదయము సౌందర్యదూరమగును. ఏ బాలికనో పెండ్లియాడి బిడ్డలగనుచు జీవితమును సముద్రతీరపు పఱ్ఱనేలవలె పరచి యుంచువానికి శిల్ప మెందుకు? కవిత్వ మెందుకు? గాన మెందుకు?” అని లోలోన అస్పష్టవాక్యముల గొణుగుకొన్నాడు సువర్ణశ్రీ.

 “ఈ యాత్ర నీకునై, ఈ మాహాటవిలోన,
ఈ గవేషణఫలము ఈవు నా కౌదువే?"

ఆమెకు దనకు నేమి సంబంధము? ఆకాశమున దివ్యదర్శనము దోచినది. అప్పుడే మాయమైనది.

తానట్టి సన్నివేశము కోరెనా? ఏల తనకా దివ్యదర్శనము కావలెను? దూరదూరము నుండియే పవిత్రాద్భుత సౌందర్యమును, రసజ్ఞ తపఃఫలమైన దానిని పూజించుకొను చుండియుందునే? తనకడ కామె నన్ను ఏల రానిచ్చినది? ఏల ప్రేమించినది? ఇంతలో నీ ఎడబాటేమి?

లోకములో సౌందర్యానేకశ్రుతులు శిల్పి సమీకరించుకొనును. ఒకచోట కన్నులు, ఒకచోట మోము, ఒకచోట హస్తములు, ఒకచో పాదములు, ఊరువులు, కటి, వక్షము వేరువేరు స్థలముల సుందరులయందు ప్రత్యేకముగ శిల్పి పరిశీలించును. దోషములు త్రోసివేసి వానిని ప్రమాణములు చేసికొనును. అటులుండ ఏ అపశ్రుతియులేని మొక్కవోని అపరాజిత సౌందర్య మొక యెడ భాసింప, నా దేవి స్వప్నగతజీవి యగుశిల్పికి ప్రత్యక్ష మగుటయా? అతడు రాశీభూతమైన ఆ అలౌకికసౌందర్యము సన్నిహిత మొనర్చుకొనలేక పోవుటా? “సువర్ణా! నీ వెఱ్ఱికాని ఆంధ్ర సింహాసన మెక్కదగిన ఆ దేవి యెక్కడ? శిల్పిమాత్రుడవు నీ వెక్కడ? ఆ దేవిసౌందర్యశ్రీని వేభంగుల శిల్పించుకొమ్ము. లోకమెల్ల నా సౌందర్యముతో నింపుము. నీ జన్మమున కదియే చరితార్థత” అనుకొని అతడు నిట్టూర్పు విడిచెను.

హిమబిందు తా నెటులైన వెదకి, యామెను శత్రువుల బారినుండి రక్షించి వణిక్సార్వభౌముడు చారుగుప్తున కప్పగించు పుణ్యము లభించునా? సార్వభౌముని సైన్యము లీయడవులలో నాశనమైనివో, వెనుకకుబోయినవో ఇంకను యుద్ధము చేయుచు ముందునకు వచ్చుచున్నవో?

చారుగుప్తున కా సౌందర్యనిధిని అప్పగించి తాను హిమాలయములకు పోవుట మంచిది. శాక్యసింహజనన పవిత్ర ప్రదేశముల దర్శించి, ఆ పవిత్రహిమాలయములలో నివసింపనిచో నా యారాధ్యదైవతము నారాధించి, రూపెత్తించు మనస్సమాధి తనకు లభింపదు. ఆ దేవిని గండరింప గన్నచో మహోజ్వల మూర్తికి భరతఖండమంతట నీరాజనము నెత్తింపగన్నచో, నపుడుకదా ఆ దేవి తన్ననుగ్రహించినదానికి ఫలము లభించుట, ఆ దేవి తన కింక నేమి వరమొసంగగలదు! తద్వారస్వీకృతికి అర్హత సంపాదించు కొనుటయే తనపని.

ఇంతలో, ఆ ఆలోచనామధ్యమున నీటిలో అస్పష్టధ్వను లొనరించుచు కొండచరియ క్రీనీడలో ఒక పడవ చనుచున్నట్లు చప్పుడు విననయ్యెను. సువర్ణుని యాలోచనలన్నియు ఆ ధ్వనివైపు తీక్షణతో ప్రవహించినవి. అతడు నెమ్మదిగా భూమిమీద వ్రాలిపోయెను.

ఆ పడవ నది ఈవలి వైపునకు దాటి, సువర్ణశ్రీయున్న కొండచరియ గట్టు క్రింద నాగిపోయెను. నెమ్మది నెమ్మదిగ సువర్ణశ్రీ జరిగి జరిగి పది హస్తముల దూరముననున్న నదీకూల శిలాతలమునకు బోయి, నదిలోనికి తొంగిచూచెను. క్రింది పడవగాని మనుష్యులు గాని కనబడలేదు. ఇంద్రజాలముచే వలె వారందరు మాయమైపోయిరి.

ఏమిది ఈ చిత్రము? ఏమైపోయిరి తనకు కలవచ్చినదా, లేక భ్రాంతి కలిగినదా? ఏమి జరిగెను? ఆతడు కన్నులు చిల్లులుపడ ఆ చీకటి లోనికి చూచుచుండెను. రెండు ముహూర్తములట్లు జరిగిపోయెను. ఇంతలో నా పడవ ఆ కొండచరియ గోడలనుండి వచ్చినట్లు బయలుపడు చుండెను. అందు ఇరువురు మనుష్యులుండిరి. వారు చల్లగ నా పడవను నడిపించుకొని పోయిరి. ఆవలి ఒడ్డున కరిగి ఆ గుట్టలలో, రాళ్ళలో చరియలనుండి నీటికడకు వ్యాపించు తీగలలో, వృక్షములలో, క్రీనీడలందు ఆ పడవ మాయమైపోయెను.

సువర్ణశ్రీ దడదడలాడు గుండెలతో ఆ గుట్టలలో నేరికి గనపడ కుండ ప్రాకుచుపోయి కొంచెము వీలయినచోట నదిలోనికి దిగజారెను. అక్కడ మొసళ్ళుండునేమో యను భయ మాతనికి కలుగలేదు. లోతులుండునో, వడులుండునో, ప్రచ్ఛన్నశిల లుండునో, ఒడ్డునకు మరల చేరుటకు వీలుండునో ఉండదో యని యాత డాలోచింపలేదు.

అతడు నెమ్మదిగ ఈదుకొనుచు ఆ పడవ యాగినదని తాను నిర్ణయించుకొన్న ప్రదేశముకడకు పోయెను. నీటివడి ఎక్కువగ నున్నది. అయినను వీరుడగు నా బాలకుడు మత్స్యతరణవిధాన ముపయోగించుచు నెమ్మదిగ నా ప్రదేశమంతయు గాలించెను. ఆ పడవ యెచ్చట మాయమైనదో ఆతనికి గ్రాహ్యము కాలేదు.

ఇంతలో పెద్దస్ఫటిక శిలప్రక్క నొకగుహవంటి ద్వార మా శిలాతలమున నీటిమట్టమున గాన్పించినది. దానిని గుహాముఖమని ఏరును కనిపెట్టలేనంత విచిత్రముగ నచ్చట శిలాశిఖరములు నీటిలోనుండి తలలెత్తియుండెను. వాన కాలపు వరద లెంతవచ్చినను ఆ గుహలోనికి పడవ కటాకటిగ పోవచ్చును.

సువర్ణశ్రీ యా గుహలోనికి ఈదుకొని పోయెను. అచ్చట పడవ యాగుటకై ఎత్తయిన వితర్దికయు, ఆ వితర్దికనుండి వ్రేలాడు తా డొకటియు నాతనికి గోచరమైనవి. అత డా త్రాడు పట్టుకొని నీటిలోనుండి వెడలివచ్చు చప్పుడు కొంచెముకాగా ఆ వితర్దికపై కెగబ్రాకి, యందు కొంతకాలము చప్పుడుకాకుండ పండుకొనియుండి బల్లివలె ముందునకు కటిక చీకటిలోనికి ప్రాకుకొని వెడలిపోయెను. 

11. మహా గుహాంతరము

ఆ గుహాముఖమున అడుగడుగునావుండు రక్షకభటులలో మొదటి వంతు వారప్పుడే భోజనముకు వెళ్ళిరి. రెండవవంతువారు అప్పుడే వచ్చి వెళ్ళిన ఆగంతుకులు తెచ్చిన వార్తల విషయమై ఇతరులతో జర్చింప నేగి కొంత ఆలస్యమొనర్చిరి. ఆ తరుణముననే సువర్ణశ్రీ గుహలోనికి సగము వరకు బల్లివలె ప్రాకుచు పోయెను.

ఇంతలో మనుష్యులు మాట్లాడుకొనుచు తనవైపువచ్చు సవ్వడి విని సువర్ణుడు చైతన్యమును వదలి, రాయిలో రాయియైపోయెను. గోడకు ఒదిగిపోయి ఊపిరియేనియు వదలలేదు. మాటలాడుకొనుచు ఇరువురు రక్షక పురుషులు సువర్ణుని ప్రక్కనుండియే నడచివెళ్ళిరి. వా రట్లు నడచి నడచి గుహాద్వారమునకు వెడలిపోయిరి. వెంటనే సువర్ణుడు తథాగతుని ప్రార్థించి ముందునకు బ్రాకుచు సాగిపోయెను. ఆతడు ఇరువది ధనువు లట్లు పోవుటయు గుహాంతము దూరమున తోచినది.

ఎట్టి ప్రాంగణమునకు కొనిపోవునో యా గుహ, గుహవెలుపల వెన్నెల వెలుగు తెల్లని పూలప్రోవువలె కన్పించుచుండెను. అచట నొక వీరుడు విచ్చుకత్తులతో నిలువబడి యుండెను. సువర్ణశ్రీ పదినిమేషములు తీవ్రాలోచనలో మునింగి కర్తవ్యము నిశ్చయించుకొనెను. అతడు ఇటునటు తడవినంత రెండుచిన్న రాళ్ళు దొరకినవి. తన నడుమునకు కట్టియున్న చురకత్తియను వదులుచేసికొని, ఎడమచేత దృఢముష్టిని ధరించి, కుడిచేత నా రాయిని నేల పైగొట్టి “టికటిక” చిన్న చప్పుడు చేసెను.

గుహాముఖమున నున్న ఆ రక్షకభటుడు స్తంభించిపోయెను. ఇటు నటు పరిశీలించి యాతడు నెమ్మదిగ సువర్ణశ్రీ వైపునకు వచ్చెను. ఆ కటికచీకటిలోగూడ సువర్ణశ్రీ చూపు మార్జాలదృష్టివలె నైనది. అది అటవీ సంచరణ విద్యాఫలము.

సువర్ణశ్రీ లేడిపై నురుక పొంచియున్న శార్దూలమువలె సర్వావయవములు పొంగ ఛెంగున విరోధిపై నురుక సన్నద్ధుడైయుండెను. అజానుబాహుడైన యా రక్షకభటుడు తనతో నొక దివిటీ తీసికొనిరాక పోవుటయే దోషము.

తన ప్రక్కనుండి యాతడు పోవుచున్నప్పుడు చప్పుడుకాకుండ సువర్ణశ్రీ ఆ రక్షకభటుని వీపుపై ఉరికి కుడిచేత విరోధినోరు గట్టిగమూసి ఎడమచేత నా మనుష్యుని చుట్టి నొక్కిపట్టుచు, కుడిచేయి మణికట్టు గట్టిగ నొక్కిపట్టెను.

తనగురువు సోమదత్తాచార్యులు నేర్పిన మల్లయుద్ధపు నేర్పు నుపయోగించి విరోధిముద్దయై ఒరుగునట్లు మోకాలు డొక్కలో నొక్కి వేసెను. వాని చేతులు బంధించియే బొటనవ్రేల మెడరక్తనాళము గట్టిగ నొక్కుటయు, అయిదు నిమేషములలో స్పృహతప్పి ఆ మనుజు డొరగి పోయెను. క్రిందకు బడిపోవు ఆతని కత్తిని వెంటనే వేగమున పిడితో పట్టుకొని, వానిని క్రింద చల్లగ బరుండబెట్టి, వాని నడుమునకు బిగించు కొనిన కాసెకోక వదలించి, నెమ్మదిగ లాగి, ఒక చివర ఆతని నోటిలో కుక్కి కిక్కురుమనకుండ బంధించి వేసెను. తన నడుమునకు చుట్టియున్న త్రాటితో ఆ మనుష్యుడు కదలకుండ గట్టిగ కట్టివేసినాడు. అచ్చటినుండి త్వరితముగ తన అలంకరణవిధ మంతయూ నూడ్చి యా రక్షకభటుని గోండునుజేసి, తా నా రక్షకభటుని వేషము వైచికొనెను.

ఒక అరగడియలో సువర్ణశ్రీ మాళవ సైనికుని వేషమున నిర్భయముగ లేచి గుహ వెలుపలికి వెడలిపోయెను.

అక్కడ సువర్ణశ్రీ సందర్శించిన దృశ్యము పరమాద్భుతమైనది. అది వింధ్య పర్వతములో ప్రకృతి ఏర్పరచుకొనిన చక్రాకారమగు లోయ చుట్టును మనుష్యుడు ప్రాకలేని ఎత్తయిన శిఖరములు పెట్టని కుడ్యములై ఆకాశము నంటుచుండెను.

ఆ విశాల చక్రాకార కందరాప్రదేశము ఎనుబది ధనువుల వెడల్పు నూటఇరువది ధనువుల పొడవు నున్నది. ఆ భృగుకుడ్యము చుట్టును ముప్పది, నలుబది బిలము లున్నవి. కొన్ని గహ్వరము లయిదారు ధనువుల ఎత్తున నున్నవి. ఎత్తయిన యా బిలములకు పోవుటకు మెట్లున్నవి.

ఈ పర్వతాంతరస్థలమునకు వచ్చుటకు సువర్ణశ్రీ వచ్చినమార్గము తప్ప వేరొండు లేదనియే యాతనికి తోచినది. ఆ ప్రదేశమునందు మూడు నాలుగు వందల జను లుండవచ్చును. అందు బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆటవికులు, నాగరజనులు అనేకులు కనబడిరి. కొందరు అక్కడక్కడ నులకమంచములపై పండుకొనియుండిరి. కొందరు తన గుహాప్రాంగణముల ప్రక్కలు వైచుకొనియుండిరి. అన్నింటికన్న మధ్యగానున్న గుహ యొక్కటి సువర్ణుని దృష్టి నాకర్షించినది. ఆ కందరము ఎత్తుగా అందముగా నలంకరింపబడియున్నది. అచ్చట పలువురు స్త్రీలు నడయాడుచుండిరి. అందు కొంద రాంధ్రస్త్రీలవలె కాననయిరి. సువర్ణశ్రీ గుండెలు తోడనే దడదడకొట్టుకొన నారంభించెను. ఎప్పుడు తాను కట్టివేసిన మనుష్యునివంతు మార్చుటకు కొత్త రక్షకభటులు వచ్చెదరో? దీర్ఘ కందరాగతుడై పడియున్న తన బందీని ఎవరైన గుర్తించెదరేమో? తా నేమి చేయవలసియుండునో?

ఇంతవరకు తన్నిక్కడకు కొనివచ్చిన యదృష్టదేవతయే తన్ను రక్షించుగాక యని సువర్ణుడు ప్రార్థించుకొనెను. తాను కానరాక మహాబల గోండుడేమి అలమటచెందునో యనియు నాతడు భయపడెను.

కొంతకాలమునకు మనుష్యులందరు సద్దుమణగుచుండిరి పోత పోసిన విగ్రహమువలె సువర్ణుడచ్చటనే నిలుచుండి యాలోచించుచుండెను. ఇంతలో ముక్తావళీ దేవి కంఠము స్పష్టముగ వినవచ్చినది. “ఎన్నిదినము లీ చీకటి గుహలో మా కీ నిర్బంధము?” అను ఆమెమాటలు ఆ నిశ్శబ్దతలో మారుమ్రోగినవి.

సువర్ణశ్రీ మ్రాన్పడిపోయెను. అతనికి సంతోషము, విషాదము, కోపము ఒక్కసారి ఉప్పొంగిపోయినవి. తాను వారి దగ్గరకు పోవుట మంచిపని కాదు. ఈ చాటుచోటు నెట్లయిన పట్టుకొని తీరవలయును. ఈ స్థలమును రక్షించు సైనికులు నూరు, నూట ఏబదికన్న ఎక్కువయుండరు. యుద్ధముచేసి ఈ స్థలము పట్టవలయు నన్న హిమబిందుదేవి కేమి కష్టము వాటిల్లునో? ఎవరో ఒక విరోధి ఈ స్థలము తెలిసికొన్నాడని వారికి తెలిసి పోయినచో నేమి మొప్పము వాటిల్లునోయని యాతడు తీవ్రాలోచనలో మునింగి “ఇప్పుడే వారిని రక్షింపవలెను. తరువాత కథయంతయు తారుమారు కాగలదు” అను నిశ్చయమునకు వచ్చెను.

ఆలోచన పొడముట ఏమి, అపుడపుడే వెన్నెల కొండశిఖరములపై దాటి యవతలకు ఒరిగిపోయిన కారణమున చిరువెలుగుతో నిండి యున్న యా ప్రదేశములోని కాతడు నడచిపోవుట యేమి?

ఒక రిద్ద రీతనివైపు చూచిరికాని గుహాముఖమున కావలికాయు మనుష్యుడిట్లు వచ్చుచున్నా డని వా రనుకొనలేదు. ఎవరో రక్షకభటుడు ఆ క్రొత్తగ వచ్చిన ముసలమ్మను మందలించుటకును పోవుచున్నాడని భావించిరి.

అతడు తిన్నగ ముక్తావళీదేవి కేకలువిన్న గుహకడకు బోయెను. ఆ గుహ యందెన్నియో మృగచర్మములు పరచియున్నవి. అచ్చట ఇరువురు రక్షక స్త్రీ లాయుధపాణులై కావలిగాచుచు నిలిచియుండిరి. సువర్ణశ్రీ అనుమానమేమియు లేనివానివలెనే నిర్భయముగ నటకు బోయెను.

కాని అతని ప్రాణము లరచేత నున్నవి. 

12. పునస్సందర్శనం

కంఠధ్వని మార్చుకొని, కొంచెము బొంగురుపోయిన గొంతుకతో సువర్ణశ్రీ మాగధిలో “ఏమి ఆ ముసలమ్మ కేకలు వేయుచున్నది? అని ప్రశ్నించెను.

“ముసలమ్మా! ముసలమ్మ కేకలు పెట్టదా మరి! మేము మనుష్యులము అనుకొంటిరా, పశువుల మనుకొంటిరా?” అని ముక్తావళీ దేవి కెంపులుగ్రమ్మిన కన్నులతో వణకుచు కేకలు వేసినది. “ఏమి కష్టము వచ్చినది మీకు?”

“ఏమికష్టము వచ్చినదా? దుర్మార్గులారా, మీరందరు నాశనమై పోదురు. ఎక్కడి ధాన్యకటకము, ఎక్కడి యీ ప్రదేశము? బోనులో జంతువులను పట్టుకొని వచ్చినట్లు మమ్మిచ్చటకు కొనివచ్చెదరా?”

"ఊరుకో ముసలమ్మా! కేకలు పెట్టకు. మా కార్యము నెరవేరిన తోడనే మిమ్ము మీ స్థానములకు బంపివేసెదము.”

సువర్ణశ్రీ ఆలోచనలు మెరుపులవలె ప్రజ్వలించి మాయమగు చుండెను. ఇంక కొంతతడవు వారితో మాట్లాడుచున్నచో, సహజ జిజ్ఞాసతో ఆ యా గుహలలోవారు, అచ్చటచ్చట తిరుగాడువారు ఇచ్చట చేరవచ్చును. అంతటితో ఎట్టి ఆపత్తయిన ఘటింప వచ్చును. వారికి దనరాక నెఱింగించు టెట్లు? వారు ఏమియు గడబిడ చేయుకుండు టెట్లు? ఏలాగున వారిని తప్పించుకొనిపోవుట?

ఈ ఆలోచనలు మహావాయుసంచలితసముద్రతరంగములై ఒక దానిపై నొకటి ఓరసి దొర్లుకొనిరా, దలయూపుకొనుచు వెనుకకుబోయి, తిన్నగా నా గుహావలయములో నంత్యగుహ కావలనున్న విశాలస్థలమున కేగి యచ్చట నొక రాతిప్రక్క గూరుచుండెను.

ముక్తావళీ దేవియు, హిమబిందును వసించు కందరమునకు కావలి కాచు రక్షక స్త్రీలు ఆ వచ్చిన రక్షకభటుని మాటలలో అధికారధ్వని గ్రహించి, యాతడు మారువేషముననున్న రాజాధికారి ఎవరోయైయుండునని యూహించుకొనిరి. వారు మాగధస్త్రీలని వేషభాషలను బట్టి సువర్ణశ్రీ చేసిన ఊహ సరియైనదే! వారును అతనినొక మాగధవీరునిగ నెంచిరి.

అతని నడకలో, మాటలో, ముఖమున అధికారము ప్రజ్వలితమగు చున్నది. అతనిమాటను తెరవెనుక మంచముపై ఒరగిపండుకొనియున్న హిమబిందు వినినది. బొంగురుగనున్నను ఆ మాటలలో ఎక్కడో వినిన ధ్వని యామెకు అస్పష్టముగ తోచినది.

ఎక్కడ నా మాటలు వినిపించినవి? ఎవరివి? ఆలోచించినకొలది ఆమెకు ఏదియో అనుమానము, ధైర్యము కలిగినది.

ఎవరును “మిమ్ము మీస్థానమునకు పంపివేసెదము, అని ఇంతకు మున్ను చెప్పలేదే? ఆ మాటల యర్థమేమై యుండును?” అని యాబాలిక ఆలో చింపజొచ్చెను.

సువర్ణశ్రీ కుమారునివెంట ఆరక్షక స్త్రీల చూపులు వెంబడించినవని యాతడు గ్రహించినాడు. ఇటులకాదటుల అని ఎన్ని మార్గములనో యాతడు త్రోసిపుచ్చినాడు. వెంటనే యాతడు లేచి, త్వరితగతిని గుహాముఖ ప్రాంతమునుండి నడచుచు, ఆ పర్వత నిమ్నాంత ప్రదేశము చుట్టి, అక్కడక్కడ నాగుచు, పనియున్నవానివలె నడచి నడచి, హిమబిందు ఉండిన గుహకడకు బోయి, ఒక రక్షకస్త్రీకడకు జేరి, యామె చెవిలో “ఉజ్జయిని!” యని అస్పష్టముగ బలికెను.

ఆతడు తన దగ్గరకు వచ్చుటయే గమనింపని యా స్త్రీ వెంటనే తలవని తలంపుగ “ఏమిటి?” యని రహస్యముగ ప్రశ్నించెను.

సువర్ణశ్రీ కన్నులు మెఱయ పెదవులకడ తన కుడిచేయి చూపుడు వ్రేలుంచి గుసగుసలతోడనే “వారిరువురకు వినంబడును! వీ రిద్దరిని వెంటనే ఇచ్చటనుండి సౌరాష్ట్రము తరలింప ఆజ్ఞ వచ్చినది. నన్ను పెద్ద సైన్యముతో పంపిరి. సైన్యము బయట నది కావలనున్నది. ఇచ్చటి నుండి రహస్యవచనము “ఉజ్జయిని!” నేను మరల వచ్చునప్పటికి మీరిరువురు లోనికిపోయి, వారిని మాటలాడక బట్టలు సర్దుకొనుడని చెప్పుడు. “ఉజ్జయిని!” మరువకుడు. జయ జయ శ్రీ శ్రీ శ్రీ కాణ్వాయన సార్వభౌమ!”అని మాగధిలో పలికెను.

ఆ ప్రతీహారిణి గుండెజల్లు మన నేదియో విచిత్ర మూహించుకొనినది. తాము సుశర్మకాణ్వాయనచక్రవర్తికడ ప్రతీహారిణులని చక్రవర్తి సందేశ హరు డీ యువకవీరు డెరిగియుండును అని ఊహించుకొన్నది.

“ప్రభువు ఆజ్ఞ ఏమి?”

“ఈ బాలికను ప్రభువే వివాహమాడునట! ఈ బాలిక చారుగుప్త తనయ. వణిక్సార్వభౌముని అట్టి బాలికను వివాహమాడిననాడు ఆంధ్రదేశము చక్రవర్తిదే! వీరందరికి ఈ రహస్యము తెలియదు. వీరికి తెలియకుండ అనగా మాళవులకు, ఆంధ్రులకు తెలియకుండ, మన మీబాలికను సౌరాష్టమిషచే పాటలీపుత్రము చేర్పవలెను.”

“మేము, మాళవస్త్రీ లిరువురు వచ్చువరకు కదలకూడదు కదా?”

“అవును, నాకు తెలియును. నీవును ఆ వనితయు ఊరకుండుడు, మీరు వారివెంటనే నాతో గుహలోనికి ఒక్క క్షణములో పరుగున రండు. మనలను మాళవులు, ఆంధ్రులు అనుమానింపగూడదు!”

“అయినచో చక్రవర్తి వేలిముద్ర చూపుము. అదిగదా నాయాజ్ఞ!”

“అవునవును! లోనికిరా! దీపపు వెలుతురున చూపెదను. నీకు ఆంధ్రము వచ్చునా?”

“రాదు.”

“అయ్యయో! సరే, నేను వారితో రెండుమాటలాడెదను. నీకు ఉంగరము చూపెదను. నీ వీ లోన నీ తోటియామెకు విషయము బోధింపుము.”

అని సువర్ణశ్రీ లోనికి విసవిసబోయి, గుహను రెండుగదులుగా విభజించు తెరను ఒత్తిగించి, ముక్తావళీ దేవిని చూచి తన నోటి పై కుడి చేయి వ్రేలుంచుకొని ఎడమచేత మాటలాడవలదని సైగచేసి, తాను సువర్ణ శ్రీనని యామె చెవిలో నూదెను. ఆమె కెవ్వున కేకవేయబోయి, నోట ఉపవీతపు కొంగును కుక్కుకొనెను. దూరమున ప్రక్కపై పండుకొని యుండిన హిమబిందు తేరిపార చూసి, “ఓ” యని యరవబోయి, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము కలదికాన, మాట లణచుకొని, మంచమునుండి లేచి పరుగున వచ్చి, యాతని భుజములు పట్టి, మొగములోనికి తీక్షణముగ చూచి యాతని చిరునవ్వు గమనించి, “అమ్మయ్యా!” యని యాతని కౌగిలింతలో కరిగిపోయెను.

ముక్తావళీ దేవికి సంతసము, ఆశ్చర్యము ఒక్కసారి జన్మించినవి. సువర్ణశ్రీ వెంటనే యా కౌగిలిలోనే హిమబిందు చెవిలో “మీ ఇద్దరు ఆ రక్షక స్త్రీల వేషముతో నాతో రండు. వారిని లోనికి రప్పించి కట్టివేసెదను. అంతయు నీపై నాధారపడియున్నది. హిమబిందూ! నేను ఒక బాలికను కట్టగనే నీవు పోయి రెండవ బాలికను కొనిరా. మామ్మగారు రక్షక స్త్రీ వేషము వేసుకొనుచుందురు” అని మరుమాటలాడక, ఆమెను కౌగిలి నుండి వదలి, గుండె దడదడ మన గాలిలో నడచుచు, తెరయీవలికి వచ్చి మొదటి ప్రతీహారిణిని లోనికి రమ్మకి సంజ్ఞ యొనర్చెను. ఆమె అప్పటికే రెండవ ప్రతీహారిణితో చక్రవర్తి శ్రీసుశర్మ కాణ్వాయనుల ఆజ్ఞగా వచ్చిన సేనాపతి యని చెప్పి, యామెను సిద్ధముచేసి చక్రవర్తి ఉంగరము ఆనవాలుగ చూచుటకు ఎదురుచూచుచుండుటయు, నా నూత్న పురుషుడు లోనికి రమ్మని పిలిచెను.

ఆ ప్రతీహారిణి లోకరక్షణభారమంతయు తాను మోయుచున్నట్లు భావించుకొనుచు లోనికి బోయినది. ఇరువది మూడుకలల కాలములో హిమబిందీవలకు వచ్చి రెండవ యామెను లోనికి బిలిచెను. మరి పదికాష్టలలో మొదటి ప్రతీహారిణి వచ్చి గుహాముఖమున నిలబడినది. 

13. బంధ విమోచనము

ఈ చిన్ననాటకము నెడమ వైపుననున్న గుహనుండి ఆరుగురు నాయకులు గమనించిరి. బందీగా కొనిరాబడిన వారలలో పెద్దయామె మొదట ఏవియో కేకలు వేసినదనియు, అల్లరిచేయ ప్రారంభించుటచే గుహాముఖమున కావలికాచు యోధుడు వచ్చి సరైననియు వా రనుకొనిరి.

ఆతడు రెండవసారి వచ్చి, అక్కడ కావలిగాచు రక్షక స్త్రీలతో మాటలాడుట వారిలో నొకరికి అనుమానము కలిగినది.

“ఏమయ్యా, ఆ భటుడు రెండుసారులు గుహకడకు వచ్చినాడేమి?”

రెండవయతడు: ఎవరు వచ్చినది?

మొదటి: గుహాముఖమున కావలికాయు భద్రుడు.

మూడవ: అవును. భద్రుడు తనస్థానము కదలుట ఎందుకు? గుహాముఖమున శక్తిమఖుడు లేడే? అత డేమయినాడు?

తక్కినవారు: ఏమీ! శక్తిమఖుడు లేడా?

మొదటి: అతడు కనపడలేదు, ఇది ఏదో వింతగ నున్నది. నీవు శంఖమూదుము. వెంటనే కత్తులు ధనుర్బాణములు పుచ్చుకొని రండు!

ఒకడు వెంటనే శంఖము నెత్తి, “భోం! భోం!” అని ఆ గుహా ప్రాంగణావరణమంతయు మారుమ్రోగునట్లు ఊదెను.

నిదురపోవు వా రులికిపడి లేచిరి. కత్తులతో, కటారులతో, శూలములతో గుహలనుండి వీరులు బయటి కురికిరి. పలువురు ధనుర్బాణములు ధరించి ఈవలకు పరువిడి వచ్చిరి. మన నాయకు లిర్వురలో ఇద్దరు హిమబిందు గుహవై పునకు, నలుగురు గుహాముఖమునకు పరువిడిరి.

ఈలోననే సువర్ణశ్రీ ఇరువురు రక్షకస్త్రీలతో గుహాముఖమువైపు పరుగిడెను. పెద్దదైన ముక్తావళి పరుగిడలేక మోకాళ్ళు బిగిసికొనిపోయి ముందునకు బోర్లగిలపడెను. తరుముకొని వచ్చువారు ఘుల్లున కేకలువేసి అటకు ఉరికిరి. కాని సువర్ణశ్రీ యామెను సునాయాసముగ నెత్తి, గుహాముఖమువైపు పరుగిడెను. ఈలోన మొదటి నలుగురిలో ఒకడు గుహా ముఖమును ముందుగా జేరెను.

కరవాలము మాత్రము చేత ధరించి, హిమబిందు తూలుచు సువర్ణశ్రీ వెనుకనే పరుగెత్తి వచ్చుచుండెను. సువ్వున పది బాణములు వీ రున్నదెసకు వచ్చి, పర్వత కుడ్యమునకు తగిలి ఖంగు ఖంగున మ్రోగినవి. సువర్ణశ్రీ ఆగి, హిమబిందును ముందునకు త్రోసి, ఆమె వెనుక ముక్తావళీ దేవితో పరుగిడ నారంభించెను. బాణములు వర్షమువలె కురియ నారంభించెను. ఆ కనుచీకటి వలనను, సువర్ణు డడ్డదిడ్డముగ పరుగిడుట వలనను, హిమబిందు కుమారికకుగాని, ముక్తావళికిగాని బాణము తగులకూడ దని విలుకాండ్రు శరములు వదలుచుండుటవలనను వా రింకొక పది నిమేషములలో గుహాముఖము చేరిరి. గుహాముఖమున ఖడ్గము త్రిప్పుచు నొకడు నిలిచియుండెను.

సువర్ణశ్రీ ముక్తావళీ దేవిని దింపి, వారి నిద్దరను సొరంగపుగోడ నానుకొని ముందుకు సాగిపోవుడని చెప్పి, సింహమువలె సొరంగముఖముననున్న వీరునిపై నురికెను. ఆ ఉరుకుటలో తనచేతిలోని ఖడ్గముచే ఎదుటి వీరుని ఖడ్గమును క్రిందకు గొట్టి, కాలితో నాతని పొట్టపై దన్ని, యాతడు పడిపోవుటతోడినే ఒక్క ఉదుటున సొరంగ మార్గములోని కురికి వెనుకనున్న విరోధిని కత్తితో నివారించుచు, సగము ఏడ్పుతో, సగము నవ్వుతో ఊగిపోవు హిమబిందును ఒక చేతితో పట్టి “రండ”ని బుసకొట్టి ముక్తావళిని రెండవచేతితో పట్టి ముందునకు సాగెను.

ముక్తావళీదేవి పరుగిడలేదు. కావున సువర్ణశ్రీ ఆమెను కుడిచేతితో బుజమున వేసుకొని “మామ్మగారూ! మీరేమియు భయపడకుడు. బోను దాటి వచ్చినాము ఇంక పది అడుగులలో నదికడకు వచ్చెదము. అచ్చట నా స్నేహితుడు పెద్దసైన్యముతో ఉన్నాడు. మనము తొందరగ పోవలెను అంతియ” అని చెప్పి ముందునకు వేగముగ సాగెను.

పదియడుగులు నడిచెనో లేదో, సువర్ణశ్రీ, కట్టిపడవేసిన శక్తిముఖునకు మెలకువ వచ్చినది కాబోలు నెమ్మదిగ దొర్లుకొనుచు గుహాముఖ మనకు వచ్చుచుండెను. ముందు వేగముగ బరుగిడు హిమబిందు కాలి కాతడు తగిలి, ఆతనిపై తలక్రిందులుగ పడి, “హో” యని కేకవేసి నది. ఆమె మీదపడినప్పు డేమియైనది తెలియక “హో” యని యాతడు భయమున నరచెను.

ఈ రెండు ధ్వనులతో సొరంగమంతయు మారుమ్రోగెను. ఈ లోన సొరంగము లోనికి విరోధులు తండతండముల పొలికేకలు పెట్టుచు పరుగిడి వచ్చుచుండిరి. బాణములు వర్షము కురియుచు “ఖంగు ఖంగు” మని గోడలకు తగులుచుండెను.

సువర్ణశ్రీ ముక్తావళీ దేవిని దింపి “మీరు ముందు వీలయినంత వేగమునపొండు. హిమబిందూ! నీవు మామ్మగారి చేయిపట్టుకొని త్వరితముగ బోయి, సొరంగపు మొగమునకు కొంచెము దూరమున ఆగుము. అక్కడ ఇద్దరు కాపుండెదరు. నేను వచ్చిన వెనుక వారి పని పట్టెదను” అని అరచి, పడిన యతనితో “ఆ బాణములు నిన్ను చంపును. నీవు కేకలు వేయుచు నీ కట్లు విప్పించుకొని బ్రతుకుము. గోడ ప్రక్క దొర్లిపొమ్ము” అని కేక వేసి, పరుగిడెను.

ముక్తావళీ దేవికి యవనరక్త ముప్పొంగినది. ఈలోన ఆమెకు రక్తనాళముల బాగుగా రక్తము స్రవించినది కాబోలు, మనుమరాలు తన చేయిపట్టుకొని దారిచూప, ఆ రక్షక స్త్రీ వేషముతో ముందునకు సాగిపోయెను. కావలికాయువాని కవచమే తన్ను రక్షింప, నమితవేగమున సువర్ణశ్రీ హిమబిందును, ముక్తావళీ దేవిని కలుసుకొనెను. వెనుకవారు అతి వేగముగ కాగడాలు పట్టుకొని పరుగిడి వచ్చుచుండిరి. వారికిని, పారిపోవు వారికిని ఇరువది ధనువులకన్న ఎక్కువదూరములేదు. ఈ కేకలు, గడబిడయు, సొరంగద్వారమున నున్నవారికి వినిపించి నవికాబోలు వారు మాళవభాషలో “ఏమి టీ గడబిడ!” రా యని కేక వేసి చేత నున్న ధనస్సుల నెక్కుపెట్టిరి.

సొరంగమార్గము ఎచ్చుతగ్గులుగా పక్కల, పైన పెద్దరాళ్ళతో నిండియున్నది. వెనుకవచ్చు కాగాడాలు ముందుపోవు ముక్తావళీ హిమబిందు సువర్ణశ్రీలకు ఒకరకపు గుడ్డిదారిని చూపుచున్నవి. ఎదుట ఇద్దరు బాణము ఎక్కుపెట్టి “ఆగుడు” అని కేక వేసిరి.

సువర్ణశ్రీ హిమబిందు చెవిలో నేమియో యూదెను. హిమబిందు నిర్భయముగ ముందుకు పరుగిడుచు, “ఎవరోవిరోధులు కొండలమీద నుండి దిగి వచ్చిరి. కొందరము సొరంగములోనికి వచ్చినాము. కొందరు మనవారు గుహలలోనుండి యుద్ధము చేయుచున్నారు” అని మాళవభాషలో అరచినది.

తమస్నేహితుడు శక్తిమఖుడును, ఇరువురు రక్షక స్త్రీలు నిట్లు వచ్చుటయు “ఆపుడు, కొట్టుడు, పట్టుకొనుడు” అని వారి వెనుకనుండి కేకలు విన వచ్చుటయు, ఆ ఇరువురివీరుల మనస్సులను కలతపెట్టుటచే వారు ఇదమిత్థమని తేల్చికొనలేక, బాణము లెక్కుపెట్టియే వీరిదెస చూచు చుండ వెనుక మలుపులో దీపములువచ్చు వెలుతు రాడుచుండెను.

ఇంతలో శక్తిమఖుడని వారనుకొన్న వీరుడు విల్లునుండి విడువబడిన బాణమువలె రివ్వునవచ్చి ఒక రక్షకభటుని కౌగలించుకొని “కొంపలు మునిగినవి,” అని కేకలువేయుచు, ఆతని పట్టుకొని, బరబర నీటికడకు లాగుకొనిపోయి, యాతనితో నీటిలో పడెను.

రెండవయాతడు ఏమిది యని వారి వెనుకనే పరుగిడి చూచుచుండ హిమబిందింతలో వచ్చి యా మనుష్యుని నీటిలోనికి త్రోసినది. ఆతడు నీటిలో మునిగిపోయి, పైకి తేలునప్పటికి సువర్ణశ్రీ యాతనిపై కురికి గొంతు పట్టుకొనెను.

సువర్ణశ్రీ నీటిలోనికి త్రోసినవాడు గట్టెక్కవలెనని ప్రయత్నించుచుండ హిమబిందు ఖడ్గపు మొనతో నతనిచేయి గ్రుచ్చినది. అతడుచేయి వదలి నీటిలోనికి జారిపోయెను. రెండవవాడు ప్రాణభయమున గుహాద్వారమునుండి నదిలోనికి గబగబ ఈదుకొనిపోయెను.

ఆత డిట్లేదుకొనిపోవుటచే సువర్ణశ్రీ ముక్తావళీ హిమబిందుల ప్రాణ రక్షణయైనది.14. “నేలయీనినట్టు నిండెదండు”

అట్లా రక్షకభటుడు ప్రాణరక్షణకై నదిలోనికి ఈదుకుపోవుటయు, అక్కడనే ఒక తెప్పయు, ఆ తెప్పనిండ గోండు లుండిరి.

ఆ తెప్పపైన గోండువీరులు ఈ మనుష్యుడు ఈదుకొనుచు ఎప్పుడు కనబడెనో వెంటనే తెప్పను తెడ్లతో నటకు త్రోసి, యా మనుష్యుని రెక్కపట్టి తెప్పపైకి లాగివేసిరి.

వెంటనే మాటలాడక ఆ మహాశిలలవెనుక దాగియున్న సొరంగపు ముఖ ద్వారమునకు తెప్పను త్రోయించినాడు మహాబలగోండుడు. అట్లు త్రోయించుచు ఆ పర్వతములలో, లోయలలో మారుమ్రోగునట్లు నెమలికేక పెట్టెను. ఆ ప్రతిధ్వనులకు ప్రతిధ్వనులా యనునట్లు నలువైపుల నుండి ఎన్నియో నెమలికేకలు వినవచ్చినవి.

ఆ మరుక్షణమున నది కీవ లావల గట్లపై, శిలలపై, కొండచరియ లపై వేలకువేలు గోండులు, రాక్షసులు మూగిపోయినారు. పది పన్నెండు తెప్పలు నది కెగువ దిగువలనుండి వేగముగ తెడ్లచే, వెదురుగడలచే నడుపబడుచు వీరి తెప్పవైపు పరుగిడివచ్చుట కారంభించినవి.

ఈలోననే మహాబలగోండుని తెప్ప గుహాముఖమునకు బోయెను. అచ్చట నీళ్ళలో ముక్తావళీ దేవిని పట్టుకొని ఈదయత్నించుచు ముణుగుచు దేలుచున్న సువర్ణశ్రీని, హిమబిందును, వీరిని ముంచ ప్రయత్నించు నా రెండవ రక్షక భటుని సొరంగముఖమున గట్టుపై కాగడాలతో నీటిలోని మనుష్యులను, స్త్రీలను పట్టుకొనప్రయత్నించువీరులను, నీటిలోనికి ఉరుకు వీరులను మహాబలగోండుడు చూచెను. తెప్పను గుహలోని వారును చూచిరి.

తెప్పమీదవారిని నాశనము చేయుటకు ధనుస్సు లెక్కుపెట్టియున్న గుహలోని వీరులు కొందరు బాణములను వదలిరి. నలుగురు గోండులు ఆ బాణములు మొఖమున, ఎదురు రొమ్మున, భుజమున తగిలి క్రిందకు కూలిపోయిరి. ఒకడు నీటిలోనికి శవమై దొర్లిపోయెను.

ఇంతలో వేరొక తెప్ప గుహాముఖమునకు వచ్చెను. దాని వెనుక మరొక తెప్ప వచ్చినది. ఇవి చూచుటతోడనే కాగడాలు పట్టుకొనిన కొందరు క్రిందపడవేసిరి, కొందరు సొరంగములోనికి పారిపోయిరి.

మొదటనే మహాబలగోండునితెప్ప వచ్చుటఏమి, ఇరువురు మువ్వురు వంగి నీటిలో ముణుగుచు తేలుచు ప్రాణసంకటావస్థలోనున్న సువర్ణశ్రీని, హిమబిందును, ముక్తావళిని, రక్షకభటుని వారు తెప్పలపైకి లాగివేసిరి.

సువర్ణశ్రీ బారినుండి పారిపోవలెనని ప్రయత్నించిన రక్షకభటుడు నదిలోనికి ఈదుకొనిపోయెనుకదా! అప్పుడే నీటికడకు సొరంగమునుండి విరోధులు వచ్చిరి. వారు తారసిల్లుట గమనించి హిమబిందు చీర వెనుకకు విరిచికట్టి నీటిలోనికి ఉరికినది. నీటిలో ఈదుచు అమ్మమ్మను నీటిలోనికి రమ్మని కేక వేసినది.

అటు విరోధు లేమి చేసెదరో యను భయము? నిటు ఈదుట ఎరుంగని కారణమున నీటి భయము? ఏడ్చుచు గజ గజ వణకుచు ఆ గట్టు మీద ముక్తావళి కూరుచుండుట ఏమి, గుహలోనికి తెప్పయు, ఆమెకడకు విరోధులు ఒక్కసారి వచ్చిరి. ఆ భయముననే యామె నీటిలో దొర్లిపడి పోయెను. విరోధుని ఒక్కతోపుత్రోసి, సువర్ణుడు ముక్తావళీదేవికడకు ఒక్కబార ఈతలో ఉరికి ఆమెను పట్టుకొనెను.

ఆమె సువర్ణుని గొంతు గట్టిగ కౌగిలించుకొనినది. సువర్ణుడెంత గజయీతగా డయిననేమి, ముక్తావళీ దేవి గొంతు గట్టిగ పట్టుకొనినతోడనే మునిగిపోయి, ఒక్కఊపున పైకిలేచి, మరల మునిగి, మరల లేచునప్పటికి ఇరువురను తెప్పపైకి ఎవరో లాగివేసిరి. అదివరకే ఎవరో హిమబిందును తెప్పమీదికి లాగిరి. సువర్ణశ్రీయు, ముక్తావళియు సొమ్మసిల్లి పడిపోయిరి. వారిరువురును రెండు మూడు గ్రుక్కల నీరు మ్రింగియుండిరి.

హిమబిందేమియు చెక్కుచెదరక, మహాబలగోండు డిచ్చిన వస్త్రముచే దీర్ఘమగు తన తల కట్టును తుడుచుకొనకయే సువర్ణుని, ముత్తవను తుడుచుచుండెను. తెప్పలన్నియు నదిలోనికి పోయినవి. సొరంగమునుండి వచ్చిన బాణములేమియు తగులకుండగనే వారా గుహముఖమునుండి ఈవలకు రాగలిగినారు.

సువర్ణశ్రీ ఇంతలో తెప్పరిల్లి లేచి, ముక్తావళీ దేవిని హిమబిందుతోపాటు ఉపచారములు చేయుచుండ తెప్పలన్నియు నావలిగట్టు చేరినవి. అచ్చట కొందరు గోండులతో మహాబలు డేమియో వారి భాషలలోపలుక, నొక ముదుసలి గోండుయోధుడు ముందునకు వచ్చి తన మొలనున్న సంచి కట్టు విప్పి, ఏదియో యెండిన యాకింత తీసి మహాబలున కిచ్చెను. మహాబలుడు సువర్ణశ్రీకుమారునికి ఆ ఆకు నిచ్చుచు ఇది వారి మువ్వురను నమలు డని చెప్పెను.

ఆ ఆకును హిమబిందును, సువర్ణశ్రీయు నమలి మ్రింగిరి. ముక్తా వళీదేవి నెమ్మదిగ కన్నులు తెరచి, తలయూపి కన్నులు మూసికొనెను.

“అమ్మమ్మా, ఈ ఆకు ఇంత నమలి మ్రింగుము. అమృతమువలె మాకు పనిచేసినది. నోరుతెరచి కొంచెము నములుము” అని హిమబిందు ముత్తవనోరు తెరిపించి యామెచే చిటికెడు ఆకు నమలించెను. వెంటనే ముక్తావళీదేవి కన్ను తెరచినది. హిమబిందు మరల కొంతఆకు నమలించినది. ఆమె లేచి కూర్చుండెను.

సువర్ణశ్రీ సహాయమున హిమబిందును, ముక్తావళీదేవియు తెప్పల నుండి క్రిందికి దిగిరి.

అచ్చట గోండువీరు లనేకులు బారులు బారులుగ వేనకువేలు కూర్చుండియుండిరి. ఎవరో మంటలు చేసిరి మెత్తనితోళ్ళ నక్కడ పరచిరి. అందుపై ముక్తావళీ దేవిని పండుకొన బెట్టిరి.

మహాబలగోండుడు: సువర్ణశ్రీ! నీ వేమైతివోయని ఒక్కనిమేషము నేను భయపడినాను సుమా! ఏలనన, నిన్ను నేను వదలిన ప్రదేశము నుండి నీవు నీటికడకు ప్రాకి వెళ్ళినది గమనించితిని. అటుపైన మరల వెనుకకు నీ గుర్తులు కనుపించినవి. అటనుండి నీటి ఎగువవైపు నీవు పోయితివి. అచ్చట ఒకచోట నీవు నీటిలోనికి జారిపోవుట చూచితిని. అది ఏమరుపాటున జారిపోవుటకాదు. జారిపోవలెనని నీవు జారితివని గమనించుటకు నాకు కొంతకాలము పట్టినది.

సువర్ణ: అవును. నేను చల్లగ చప్పుడుకాకుండ నీటిలోనికి దిగవలెనని ప్రయత్నించుచుండ, చటుక్కున జారి నీటిలో పడితిని. కాని దెబ్బమాత్రమేమియు తగులలేదు.

మహా: యీలోననే ఆ అడవియంతయు గోండులు, రాక్షన మిత్రులు వెదకి అక్కడక్కడ కావలికాయు పుళిందులను, శబరులను పట్టుకొన్నారు.

సువర్ణ: మీ వారందరు ఎప్పుడు వచ్చినారు?

మహా: నేను మా దేశాభిముఖుడనై వెళ్ళినసంగతి ఎరుగుదువు. రాక్షసుల నీ ప్రదేశమంతయు వెదుక నాజ్ఞనిడితిని. ఇంతలో మన ప్రయాణములో పంపినవార్త అంది, మా గోండులు వచ్చి నన్ను కలుసుకొనిరి.

సువర్ణ: యీ అటవీ సంచరణవిద్య చాల అద్భుతమైనది.

హిమబిందు సువర్ణశ్రీ దెస కృతజ్ఞతయు, ప్రేమయు నుట్టిపడ గాంచుచు, స్మితవదనయై, “మేమున్నస్థల మెట్లు కనిపెట్టినారు? ఇతరు లందు చొరనేరరని వారందరు గర్వపుమాటలు పలికిరే!”

సువర్ణ: అయస్కాంత మెక్కడున్నదో, లోహశకలమునకు తెలియదా! ముక్తావళీ దేవి లేచి కూరుచుండి సువర్ణశ్రీని చూచి, “మన మిక్కడనే యున్నచో, విరోధులు వచ్చి మనల నాశనముముచేయరా?” యవి యడిగెను.

మహా: అమ్మా! మే ముండ మీ కేమియు భయములేదు.

ముక్తా: ఇక్కడనుండి ఎచ్చటకు బోవుట? ధాన్యకటకమునకా?

సువర్ణ: మహాబలుడు ఏమి చెప్పిన అట్లు చేయుదము.

ముక్తా:' యీ మహాబలు డెవరు?

సువర్ణ: ఈతడు గోండుదేశ యువరాజు. గోండుమహారాజు మన చక్రవర్తికి ప్రాణ స్నేహితులు. యీతడు నాకు పరమమిత్రము, మామ్మగారూ!

ముక్తా: నాయనా? నాహృదయమున జనించిన భయమింకను దీరలేదు. ఇచ్చటనుండి తరలించి మమ్ము వెంటనే సురక్షిత ప్రదేశమున కెచటికైన చేర్పింపుము. 

15. పాటలీపుత్రము

పాటలీపుత్రము గంగాతీరమున మాగధరాజధానియై భారతవర్ష చక్రవర్తులకు పెక్కు శతాబ్దములు రాజధానియై ప్రసిద్ధినందినది. యీ మహా నగరమునందు నంద సార్వభౌములు అఖండవైభవముగ రాజ్యము నేలిరి. వారివెనుక తద్వంశజుడైన చంద్రగుప్త మౌర్యుడఖండజంబూద్వీపమునకు చక్రవర్తి ఆయెను. ఆతని మనుమడు అశోక ప్రియదర్శి మహాసామ్రాట్టయి బౌద్ధమతావలంబియై భరతవర్షమంతయు రాజ్యముచేయుచు బౌద్ధమతమును వెన్నెలవలె, అమృతమువలె సకలలోకమునందు వరదలు కట్టించెను.

ఒకనాడు జంబూద్వీపమునకు అయోధ్య ముఖ్యనగరము; మరొకనాడు ప్రాగ్జోతిష నగరము, వేరొకప్పుడు కుండిన నగరము, కురువంశ కాలమునకు హస్తినాపురము, హస్తినాపురమునుండి కౌశాంబియు నటనుండి పాటలీపుత్రము రాజధానులుగా మారినవి.

ఏది ముఖ్యనగరమో, అచ్చట సింహాసనాసీను డగువాడు సకల భరత వర్షమునకు చక్రవర్తి యగును. మౌర్యులలో చివరివాని వధించి పుష్యమిత్ర శుంగుడు చక్రవర్తి యయ్యెను. అంత్యశుంగుని పేరునకు రాజును చేసి, కాణ్వాయనబ్రాహ్మమంత్రులు నిజ మగు చక్రవర్తులైరి.

తుది కాణ్వాయనవంశజుడు సుశర్మ తానే చక్రవర్తియని లోకమునకు వెల్లడించెను. అయినను మగధదేశమునందింకను శుంగుల సేనా నాయకులు శుంగమహారాజు కే జోహారు లొనరించుచు, సుశర్మకాణ్వాయనుని లెక్కచేయుటలేదు.

సుశర్మకును దేశములోపలుకుబడి ఎక్కువగనే యుండెను. ఆతని సైన్యములు మగధదేశమంతయు నిండియుండెను. ఈ ఇరువాగుల సైన్యములకు, వారి వారి మాండలీకులకు సర్వదాపోరులు సాగుచునేయుండెను.

దేశ మరాజకమై, హిమాలయప్రాంతమందలి గంధర్వయక్ష జాతులకు, కామరూపప్రాంత నాగులకు, అరణ్య జాతులగు పుళిందాదులకు కొల్లగొను ప్రదేశమై పోయినది. బలవంతుడగు చక్రవర్తి పరిపాలన లేకపోవుటచే వర్తకమును నీరసించినది. ఒక దేశమునుండి వేరొకదేశమునకు బేహారులు వస్తువులు కొనివెళ్ళుట మానిరి.

వింధ్యకు దక్షిణము మాత్రమే ఆంధ్రుల చల్లని పరిపాలనమువలన సర్వసంపదల తులతూగుచుండెను. దేశ మొకచో నీరసించియుండిన సర్వభరతవర్షము నీరసించి పోవుననియు, ప్రక్కదేశము లరాజకములైన, బలవంతమగు దేశములుకూడ అనేక కష్టముల పాలగుననియు, శాతవాహనులు సకల భూమండలమునకు చక్రవర్తులగుట మానవ కళ్యాణమునకే యనియు, ఒక దేశ భాగ్య మాదేశపువర్తకముపై నాధారపడి యుండుననియు, ఆంధ్ర వైశ్యుల వర్తకము ఉత్తరప్రదేశముల వృద్ధిపొందుటకే వీలులేకుండ పోయినదనియు, సర్వధర్మరక్షణకై ఆంధ్రులు యావద్భారత చక్రవర్తులు కాకతప్పదనియు, చారుగుప్తుడు వాదించి శ్రీముఖునకు పాటలీపుత్ర సింహాసనముపై కోర్కె పుట్టించెను.

ఆతనికి సర్వభూవలయమునకు చక్రవర్తి కావలయునను ఆశకంటె, సర్వభూవలయమునకు శాంతి చేకూర్చవలయునను వాంఛ ఎక్కువైనది.

సకలదక్షిణాపథము శాంతముగ నున్నది. పాండ్యులు, చోళులు, కేరళులు, కుంతలులు తమలో దా మేమియు కలహములు లేక శాంతులై యున్నారు. ఒకరిదేశము నొకరు వాంఛింపనేల? చిన్నదేశమునకు రాజయిన నేమి, మహాదేశమునకు రాజయిన నేమి? యశముకొరకై పురుషుడు రాజ్యములు కాంక్షింపవలయునా? రాజులు రాజ్యతృష్ణచే లోకకంటకులగు చున్నారు.

ఇదియంతయు కలిమహాత్మ్యమేనా? ధర్మజచక్రవర్తి సభలో భూమిలోని నిక్షేపమునకై తగవులాడినవారి గాథనిజమా? మొదటిదినమున “నీది, నీది, యని తగవులాడిరట; కలిప్రవేశించిన మరునాడు “నాది, నాది” యని తగవులాడిరట.

రాజుల ధర్మము లోకమున శాంతి నెలకొల్పుట. కాణ్వాయనులు ధర్మచ్యుతులైరి. బుద్ధ భగవానుడు సంచరించిన పవిత్రభూమి యగు ఆర్యావర్తమంతయు వీరివలన అధర్మములతో నిండిపోయినది.

భగవంతుని కనుగొను కర్తవ్యము మనుజునిది. తన నడవడిచే మహర్షులు, అర్హతలు, జ్ఞానులు, రాజులు లోకమునకు దారిచూపించవలయును. అధర్మము విజృంభించిననాడు భగవంతుడంతర్హి తుడగును. అధర్మము నణచుట రాజుల ధర్మము. తానుగాని తనపూర్వులుగాని రాజ్యకాంక్షచే ధాన్యకటక శ్రీకాకుళములనుండి పడమటి తీరమునకు విజృంభించినారా? మహామధ్యరథికులు, అభీరులు విజృంభించి దక్షిణా పథమును, కుంతలమును పాడుచేయ ప్రారంభించినప్పుడుకదా తా మారాజ్యముల నరాజకము నుండి యుద్ధరించినది.

ఈ విధమగు ఆలోచనలతో శ్రీముఖసాతవాహనుడు తన మదగజము పై ప్రయాణము చేయుచుండెను.

ఆంధ్రసైన్యములు మహావేగముతో సాగిపోవుచున్నవి. ముందు నడచు సైన్యములకు పాటలనగరము పదునైదు గోరుతములు మాత్రమున్నది. చారులు పట్టుకొని వచ్చిన వార్తవలన శ్రీ సుశర్మకాణ్వాయనుడు నగర కుడ్యములు, నగరచుట్టునున్న పదునెనిమిది కోటలు బాగుచేయించి తనకున్న అరువదివేల సైన్యమును, కౌశాంబీనగరమునుండివచ్చిన ముప్పది వేల సైన్యమును నగర రక్షణకై నచ్చటచ్చట నుంచినాడనియు, ప్రథమమున ఆంధ్రులు తనపై ఎత్తివచ్చుట నాతడు నమ్మలేదనియు, గయకడకు ఆంధ్రసైన్యములు వచ్చి విడియుటతోడనే భయపడి నగరరక్షణ సన్నాహములు ప్రారంభించినాడనియు తెలిసినది.

ఆంధ్ర సైన్యములో అరువదివేల కాల్బలము, వేయి ఏనుగులు, వేయి రథములు, రెండువేల ఆశ్వికదళము గయకడకు విడిపోయి, మాళవాభిముఖమైపోయినవి. ఆ సైన్యములకు సోమదత్తాచార్యులు సేనాధిపతియై, ఒక మద గజముపై నధివసించి ముందుకు సాగిపోవుచుండెను.

మహారాజు సైన్యసమేతముగా బుద్ధమహాచైత్యమునకు, మహాబోధి వృక్షమునకు పూజలొనరించి ముందునకు సాగెను. ధర్మనంది విన్యసించిన ధర్మచక్రము నొకదానిని సార్వభౌముడు చైత్యమున కర్పించెను. చారుగుప్తుడును వేయి నారికేళములు, భూరిదానములు, లక్షదీపములు, నవలక్ష సువర్ణము లా మహాచైత్యమునకు, సంఘారామమునకు నర్పించెను.

ఆంధ్రచక్రవర్తి గయాక్షేత్రమందు మహబోధి చైత్యమందు పది దినములు ఆగినాడు. ఆ దినములలో మూడవదినమున హిమబిందును చోరులు తస్కరించి ముక్తావళీ దేవితో ఎత్తుకొని పారిపోయినారని వార్త వచ్చినది. ఆ వార్త వినినవెంటనే చారుగుప్తుడు “హా” యని నేల కొరగి మూర్చపోయెను.

16. నిర్వేదము

చారుగుప్తుని ఉపశమింపజేయుటకు ముఖ్యమంత్రి అచీర్ణుడు, సర్వ సైన్యాధ్యక్షుడు స్వైత్రుడు, చక్రవర్తియు, మూర్తిమంతులవారును గుడారమునకు వచ్చిరి. చారుగుప్తుని శిబిరము చక్రవర్తి శిబిరమునకు కొలది దూరముననేయున్నది. ఆ వర్తకుని శిబిరమున నాలుగు గుడారములున్నవి.

వీరందరికన్న ముందరనే ప్రక్కగుడారముననున్న శ్వేతకేతుల వారు పరుగిడివచ్చి వైద్య మొనరించి చారుగుప్తునకు చైతన్యము గలిగించిరి.

చక్రవర్తి: మాకు నిన్ననే యీ వార్త వచ్చినది. మేము నెమ్మదిగ చారుగుప్తులవారికి యీ వార్త విన్పింపదలచితిమి. ఇంతలో ఎవరీ వార్తను తీసుకువచ్చినది?

చారుగుప్తుడు: (నీరసస్వరమున) ప్రభూ! ఇంద్రగోపుడు గూఢచారులతో మాటలాడుటవలన నీ విషయమును తెలిసి అత్యంత భయము నంది, నా కడకు పరుగిడివచ్చి చెప్పినాడు.

మహామంత్రి: చారుగుప్తులవారూ! మరేమియు భయపడవలసిన అవసరము లేదు. పదివేల సైన్యము ఆ దొంగలను వెంబడించినారట. ఆ దొంగలు మంజుశ్రీని ఎత్తుకొనిపోయిన స్థౌలతిష్యులవారి శిష్యగణములై యుందురు.

సేనాధ్యక్షుడు: స్థాలతిష్యులవారివలన నీ పని జరిగియున్నచో ప్రాణమానములకు ఏమియ భయముండదు.

మూర్తిమంతులు: దేశములన్నియు తిరిగినవారు, సముద్రములను మోకాలి బంటిగ నొనర్చుకొనినవారు మీరు ఇంత బేలలైతి రేమి?

చక్ర: చారుగుప్తులవారూ! మన మీ పాటలీపుత్రముపై దండెత్తుట మాని, సకల భారతదేశము గాలించి మీ తనయను పట్టుకొందుము. మా కనుమతి నిండు.

శ్వేతకేతులవారు: నా కేలనో హిమబిందునకు ఏ ఆపదయు రాదనియు, కొలది దినములలోనే ఆమెను మనవా రెవ్వరో రక్షింతురనియు అటు వెనుక మనలను ఇచ్చటనే ఆమె త్వరలో కలుసుకొనుననియు తట్టుచున్నది. నా కిట్టి ఆలోచనలెప్పుడు వచ్చినను అవి నిజమగుచుండును.

మూర్తి: నా తమ్ముడు గొప్ప జ్యోతిష్కుడు. ఆతడు చెప్పినచో తప్పదు. చారు: మహాప్రభూ! వార్త తటాలున వినుటచే నామనస్సు కలత నందినదిగాని మరేమియులేదు. శ్వేతకేతులవారు చెప్పినది తప్పక జరుగునని నాకు తెలియును. ధర్మప్రేరితులమై, చక్రవర్తిని సకలభూమండల చక్రవర్తిగా పాటలీపుత్రసింహాసనమెక్కు డని మనము కోరియుంటిమి. అది జరిగితీరవలయును. నా బాలిక నాకు ఎంత ముఖ్యమో ఇదియును అంతముఖ్యము. మనకు పాటలీపుత్రమే గమ్యము.

మహామంత్రి: చారుగుప్తులవారూ! ఈ సాయంకాలములోపుననే మహాభాగు డగు శుకబాణునకు “హిమబిందు రక్షణకై మీరు పూనవలసిన” దని సందేశమంపుదము.

చక్ర: ఈ ఆలోచన ఎంతయు సమంజసము. స్థౌలతిష్యుల దుర్నీతి మితిమీరిపోవు చున్నది. ఆ ముదుసలి బ్రాహ్మణు డేమి సంకల్పించెనో?

మహామంత్రి: ప్రభూ! మీ పాలనమున మనదేశమఁతయు బౌద్ధ ధర్మపూర్ణమై ప్రజల నీతిదూరుల చేయుచున్నదట. మంజుశ్రీ కుమారులను గద్దె యెక్కించుట కాతడు పూనెను.

చారు: అట్టి ఆలోచన లాయనకున్నవని నాకును తెలియును. కాని ముక్కు పచ్చలారని నాబిడ్డ నెత్తుకొనిపోవుట యేటికో!

మహామంత్రి: మీ రాంధ్రదేశమున నొక మహాసంస్థ. శ్రీసార్వభౌముల శక్తివెనుక మీ అపార అర్ధబల మున్నదట. హిమబిందును ఎత్తుకొనిపోవుట మిమ్ము నీరసింప జేయుటకై యుండును.

చారు: ఆమెను వా రేమియు చేయరుకదా! మహామంత్రులవారూ?

చక్ర: వర్తక చక్రవర్తీ! మీతనయ కేమియు భయములేదు. మే మీ దినముననే ధాన్యకటకమునకుగూడ వేగు పంపెదము. అచ్చటనున్న సర్వసైన్యమును ఆమె యుండిన తావు కనుగొని రక్షింపవలయునని.

చారు: కృతజ్ఞుడను మహాప్రభూ!

చక్ర: ఇందు కృతజ్ఞులు కాదగిన దే మున్నది? ఆంధ్రచక్రవర్తియే మీయెడ కృతజ్ఞుడు.

చారు: అటు లనకుడు ప్రభూ! దాసునిసర్వస్వము ప్రభువుదే కదా!

అందరు చారుగుప్తునికడ సెలవు నంది వెడలిపోయిరి. చారుగుప్తుడు చక్రవర్తి వెడలిపోవునప్పుడు లేచి నమస్కరించి, గూడారము గుమ్మమువరకు సాగనంపి వచ్చి మంచముపై వాలిపోయెను. శ్వేతకేతులవారు చారుగుప్తుని జాగ్రతగా పరిశీలించి చూచుచుండిరి.

ఎందుకు తన బాలికను చోరులెత్తుకొనిపోయినారు? తనతో తీసి కొనివచ్చి యుండిన ఎంతయు బాగుండియుండును. తా నా బాలికను ఇంటి కడ వదలివచ్చి ఎంత తెలివి లేని కార్యము చేసినాడు! తనముద్దుబిడ్డ ఎంత భయమందిపోవునో? ముక్తావళీదేవికూడ నుండుటవలన కొంతధైర్యముగా నుండును. ఆమెను యువరాజున కీయ దలచుకొనుటను శత్రువులు గ్రహించినారా? నిజముగ నిది స్థౌలతిష్యుని పనియేనా? లేక ధనమున కాశించి ఏ తుచ్చులయిన నిట్టిపనిచేసినారా?

ఈ ఆలోచనలు తన్ను కలచివేయ, “ఇంద్రగోపా!” యని పిలిచెను. ఇంద్రగోపుడు పరువిడివచ్చెను.

“ఓయీ! నీవు నాస్వంత సైన్యమునకు అధిపతి యగు విజ్ఞాన కంఠీరవునకు నా ఆజ్ఞగ తన సైన్యములోని మాయాశీలురు, దక్షులగు యాదార్హవర్ణుల, అపకృష్ణుల, గూఢపురుషుల వెంటనే పంపి ఎవరు హిమబిందు నెత్తుకొనిపోయిరో కనుగొని ఆ ముష్కరుల నాశన మొనరింపు మనుము. మన ఇంటికడనున్న యాదార్హవవర్ణు లేల ప్రమత్తులై ఇట్టి మహాహాని నాకు సంభవింపజేసిరో కనుగొమ్మనుము. అట్టి ప్రమత్తులను నేను వచ్చువరకు కారాగారమున నుంచునటుల ఆజ్ఞల నంపుము. ఇదిగో నా వేలిముద్ర. పో!” అని ఆనతిచ్చెను.

ఇంద్రగోపుడు వేగముగ వెడలిపోయెను. చారుగుప్తు డంత తన మామగారి తండ్రికి, వణిక్కుల శక్తులన్నియు నుపయోగించి హిమబిందెక్కడ నున్నదియు కనిపెట్టి ఆమెను రక్షింప వీళ్ళన్నియు చూడవలెనని గజసందేశహరులను బంపెను.

వేగవంతులు, ప్రజ్ఞావంతులు నగు గజసందేశహరులు మాళవ, మగధ, సౌరాష్ట్ర, కుంతల, విదేహ, విదర్భాది దేశములనున్న వణిక్సానము లన్నిటికి జని చారుగుప్త వణిక్సార్వభౌముని సందేశము నాజ్ఞగా విని పించిరి. 

17. స్కందావారము

మహాప్రవాహ మతివేగముగ వచ్చి కొండపై బడినట్లు, ఫెళఫెళార్భటుల దావానలము భయంకరకాంతారమును పొదివినట్లు, వర్షసమ్మిశ్రిత ప్రచండ ఝంఝానిలము వటవృక్షమును తాకినట్లు ఆంధ్ర సైన్యములు వచ్చి పాటలీపుత్ర మహాపురమును ముట్టడించినవి.

పాటలీపుత్రమున కొకవైపు గంగానది ప్రవహింపుచున్నది. తక్కిన మూడువైపుల గంగాజలములు నిండిన కందకము, ఆకాశము నంటు కుడ్యములున్నవి. కోటచుట్టు అయిదు వందల డెబ్బది బురుజులున్నవి. నదిచుట్టినవైపు మూడుగోరుతములు పొడుగుగాక, భూభాగముపై ప్రసరించిన నగరమహాకుడ్యము తొమ్మిది గోరుతముల పొడుగున నున్నది. నగరపుకోటకడకు వెళ్ళుటకుముందు, కోటచుట్టు ఎనిమిది చిన్నకోట లున్నవి. గంగానది యావలియొడ్డున నొకటియు, పట్టణమువైపు కుడ్యముల చుట్టును ఏడుకోటలు, నగరకుడ్యమునకు అర్ధగోరుతము దూరము చొప్పున నున్నవి. గంగానదివైపు ఇరువది గోపురములు, తక్కిన భూభాగమువైపు నలుబదినాలుగు గోపురమహాద్వారము లున్నవి. అశోకచక్రవర్తి నగరకుడ్యముచుట్టు కట్టిన ఏడుకోటలకు మహాకుడ్య మొకటి కలిపి, దానిచుట్టు శోణానదినుండి ఒక పాయను కొనివచ్చి పాటలీపుత్రమునకు దిగువను గంగానదిలో కలిపినాడు.

సుశర్మచక్రవర్తి ఈ కోటలన్నియు బాగుచేయించినాడు. కుడ్యములన్నియు బాగుచేయించినాడు. పట్టణమున నున్న కోటబురుజులు, గోడలు, పట్టణ మధ్యమున గంగానదీతీర ముననున్న సార్వభౌమదుర్గము, దుర్గముచుట్టునున్న కందకము అన్నియు బాగుచేయించినాడు. నగరమునందు ధాన్యాది ఆహారపదార్థములు సేకరించినాడు. ఎన్నియో యాయుధ విశేషములు, కోట గోడలనుండి శత్రువులపై కళపెళ కాచిపోయుటకు అవిసి మొదలగు నూనెలు, ఆయుధ యంత్రములు సేకరించినాడు.

ఆంధ్రులు పాటలీపుత్రము పై ఎత్తివచ్చెదరని యాతడు కలనైన ననుకొనలేదు. తనకున్న లక్షయేబదివేల సైన్యములో లక్షసైన్యము మాళవమునకు బంపినాడు. నేడా సైన్యము వచ్చుటకు వీలులేదు. లిచ్ఛవులు బౌద్ధులు. తన చుట్టునున్న దేశములవారందరు బౌద్ధులు. కాని కామరూపమునకు, వంగదేశమునకు, వారణాసికి, నేపాళమునకు అతివేగమున వార్త లంపుటచే వంగమునుండి ఇరువదివేల సైన్యము, నేపాళమునుండి ఎనిమిదివేల యక్షసైన్యము, కామరూపమునుండి నాలుగువేల సైన్యమును వచ్చినవి.

మగధదేశమునందు మాండలకులు ముప్పదివేల సైన్యము నంపిరి. ఈ లక్ష పదివేల సైన్యము పాటలీపుత్రమును సంరక్షించుచుండ, ఉజ్జయిని పడిపోవుటతోడనే మాళవ మహారాజు తన లక్షసైన్యముతోడను, శివస్వాతి అరువదివేల సైన్యముతోడను, మాగధసైన్యము లక్షయు, పుళిందాదుల ఆటవిక సైన్యములు, ఔఘలుని సైన్యము అన్నియు వచ్చినచో ఆంధ్ర సైన్యములు తుత్తునియలైపోవును. ఆంధ్రదేశమునెత్తిపోయి, ఆంధ్రుల నోడించుటకంటె ఇదియ ఉత్తమమైనది అని సుశర్మ యూహించినాడు. పాటలీపుత్రమున విజయహోమములు, దేవతారాధనలు జరిగినవి. అంతకు ముందుగనే బౌద్ధులందరు పారిపోయిరి. సంఘారామములు పాడు పడిపోయినవి. మహా చైత్యముల నిదివరకే పాడు పెట్టి నాశనము చేసిరి.

గంగానది వేసవివరదలతో నిండియున్నది. ఉత్తరమున గండకీ నది పూర్తిగా ప్రవహించుచువచ్చి, గంగానదిలో కలియుచున్నది. శోణానదిలో గోగ్రలో జలములు చాల తక్కువయున్నవి. వైశాఖమాసాంతపు టెండలకు, వేడిగాడ్పులకు ముట్టడించిన ఆంధ్ర సైన్యములు మాడిపోవుచున్నవి. పాటలీపుత్రనగరము చుట్టును ఎన్నియో తోటలుండుట సైన్యమునకు మంచిదైనది.

సైన్యములు వచ్చి ముట్టడించిన మూడవదినమునుండి చారుగుప్తుడు ప్రత్యాసారులను చుట్టునుండు గ్రామగ్రామములకు పంపి, కోట్లకొలది తాళపత్రముల తెప్పించి ఏబదివేల శిబిరములు నిర్మించెను. మృణ్మయ కలశములు శిబిరములందుంచ బడినవి.

పానశాలలు, వీరపాణశాలలు, అంగడులు విరివిగ నేర్పరుపబడినవి. వైద్యశాలలు ఏర్పాటు గావింపబడినవి. వేరొక మహాపట్టణమే ఎత్తివచ్చినట్లు ఆంధ్ర సైన్యము లమరింపబడినవి.

చారుగుప్తుడు పదివేల గోవులను, ముప్పదివేల మహిషములనుకొని వచ్చెను. అవియుగాక అతడు ధనము వెదజల్లుటచే చుట్టుప్రక్కల గ్రామాదులనుండి గోపకులు పాడిపశువుల గొనివచ్చిరి. వర్తకులు వచ్చి అంగడులు పెట్టిరి. నర్తనశాలలు ఏర్పరుప బడెను. గాయకులు, కవులు వచ్చిరి. ఇదియంతయు నిట్లుండ, యుద్ధము విషయములో కోటలు, కుడ్యములు ఛేదించుటకు ఎత్తయిన దిబ్బలు చిన్నబురుజులు ప్రతిగా నిర్మింప బడినవి. వారిపై మహాధన్వులగు ఆంధ్రులు ప్రవేశించిరి. సర్వతో భద్రాదియంత్రములు నెలకొల్పినారు.

ఒక్కొక ఏనుగుపై పదిమంది విలుకాండ్రుందురు. అన్ని ఏనుగులకు సంపూర్ణ కవచములున్నవి. ఖడ్గమృగపు చర్మముచే చేయబడి, నున్నగ మైనము పూయబడి ధనువు ఎత్తుననున్న కేడెములు ధరించి తలపై రక్షక భటుడు అడ్డముపట్ట, ధన్వి బాణములు వేయును.

ధనుర్యుద్ధమం దాంధ్రు లప్రతిమానులు. కోట గోడలపై సైనికుడు పొడసూపుటేమి బాణము సువ్వునవచ్చి, ఎట్టికవచమునై నను దూసుకొని పోయి, ఆ సైనికుని ప్రాణము గొనును. అట్టి బాణములు మహా వర్షపాతపు జినుకులకు బాఠము నేర్పునట్లు ఆంధ్రుల విండ్లు వీడివచ్చి పడుచుండును. కోటగోడలపై, బురుజులపై, గోపురములపై పాటలీపుత్ర పుర సైనికుడు తలచూప భయపడిపోవుచుండెను. ఈలోన అగ్ని గోళములు, శతఘ్నులు శిలాఘ్నులు శిలావర్షము కురియుచున్నవి. ఆంధ్ర సైన్యములపై గూడ ఆ భయంకరా యుధములు వర్షము కురియుచున్నవి. ముట్టడి ప్రారంభించిన ఎనిమిదిదినములవరకు ఆయుధ వర్షములతోడనే ఇరువాగుల సైన్యములు పోరాటము సలుపుచుండెను.

ఇంతలో పదవదినమున శుకబాణునికడనుండియు, ధాన్యకటకము నుండియు వార్తలు వచ్చినవి. ధాన్యకటకపురి సేనానాయకులు హిమబిందు జాడలు తెలియుటకు సర్వప్రయత్నములు చేయుచుండిరనియు, శ్రీధర్మనందిగారి కుమారుడు సువర్ణశ్రీ అడవులలో ఆమెను వెదుకబోయెననియు ధాన్యకటకమునుండి వార్తలు వచ్చెను.

హిమబిందు మాళవులచేతిలో బడెననియు, ఆమెచే నుత్తరము వ్రాయించి సమవర్తిని యుద్ధ పరాజ్ముఖునిచేయ బ్రయత్నించిరనియు, ఉజ్జయినిలో ఆంధ్రసైన్యములు ధైర్యముతో బోరుచున్నవనియు, తానుగూడ కొందరు చారులనుబంపి హిమబిందును వెదకించెదననియు వార్తనంపినాడు శుకబాణుడు. శ్రీకృష్ణ సాతవాహనుడు అభీరుల నోడించి, భరుకచ్ఛము పట్టుకొనినాడట. స్థౌలతిష్యుడు శిష్యగణముతో కాశికాపురయాత్రకై బయలుదేరినాడట. ఆంధ్ర సైన్యములు పోయి ఉజ్జయినిని ముట్టడించిన మాళవ సైన్యమును తాకినారట. ఈలోన గోండులు వేలకు వేలు వచ్చి వేరొక ప్రక్క తాకినారట. గోండు సైన్యమువలన మాళవ సైన్యములకు సంభవించిన నాశనము వర్ణనాతీతము.

ఈ వార్తలన్నియు సమాలోచించుటకు చక్రవర్తి భవనమునకు చారుగుప్తుడేగెను. చక్రవర్తి పాటలీపుత్ర మాండలికుని భవనమొకటి యాక్రమించి యందుచేరినారు. ఆలాగుననే పట్టణము బయటనున్న అనేక భవనములలో, పరిసరములనున్న గ్రామాదులలో సేనాపతులు, మంత్రులు, ధర్మనంది మొదలగువా రందరు చేరినారు.

చారుగుప్తుడు చక్రవర్తిచే ననుజ్ఞాతుడై వారి సభామందిరము జేరి, సామ్రాట్టుకు నమస్కరించి, యుచితాసన మధివసించెను. ఇంతలో స్వైత్రుల వారు, అచీర్ణులవారును వచ్చిరి.

చారు: ప్రభూ! మన సైన్యములు నెమ్మదిగ ముట్టడిసాగింపనెంచినచో ముందు ముందు చిక్కు లెక్కువయగును. అఖండవేగమున మన కున్న శక్తినంతయు నుపయోగించి, పాటలీపుత్రమును ఛేదింపవలయును.

మహామాత్యుడు అచీర్ణుడు: ప్రభూ! ఆంధ్ర సైన్యములు హిమపాతము రీతి మహాకల్లోలమువలె పాటలీపుత్రముపై విరుచుకుపడుటకే నేను సర్వసన్నద్ధములు చేయుడని సైన్యాధ్యక్షులతో మనవి చేసియున్నాను.

స్వైత్రుడు: ప్రభూ! ఇక్ష్వాకులు ఉత్తరపు నదీతీరమునను, పూంగీయులు వారికి బాసటగాను, పల్లవులు వారి నంటియు మొనతీర్చియున్నారు. తూర్పున మంజష్టులు, యక్షులు, నాగులు మోహరించియున్నారు. వేంగీయులు, వజ్రభూములవారు దక్షిణ తీరమున నున్నారు. ప్రతీకారపు బురుజులు సిద్ధమైనవి. సొరంగములు త్రవ్వుచున్నారు.

చక్ర: ఎన్నియైనను ముట్టడి ఆటపాటలుగ సాగుచున్నది. ఎవ్వరికిని వేడి ఎక్కలేదు. ఎక్కడో ఏదియో లోటు కనబడుచున్నది. చారు: కోటగోడలు సమీపించుటకు వీలులేకున్నది. మనము కోటలోనికి ప్రవేశింపవలయునన్న నాకు బది దినములు గడు విచ్చినచో ఒక ఉపాయము చేయగలను. అది మనవి చేసెదను.

చక్ర: ఏ మా ఉపాయము?

చారు: ప్రభూ! గంగానదియే మనకు దారిచూపునని నా అభిప్రాయము.

స్వైత్రుడు: చారుగుప్తులవారూ! ఆ వైపున తొంగిచూచుటకైన వీలు లేకుండ చేయలేదా విరోధులు?

చారు: కావుననే అటువైపు ఛేదించుటకు ఎక్కువ వీళ్ళున్నవి.

చక్ర: ఈ పదిరోజులును ఆటపాటలతో కాలముపుచ్చవలసినదేనా?

స్వైత్రుడు: నే నొక యాలోచన చేసినాను. అది తమకు మనవి చేయగలను. ధర్మనందులచే పాటలీపుత్ర గోటలు, కుడ్యములు మట్టి బొమ్మలుగా రచింపజేసినాను. అది తమ అందఱి ఎదుటనుంచి నా ఆలోచన మనవిచేయగలను. 

18. ముట్టడిపై ముట్టడి

ఉజ్జయిని పట్టణమున ముట్టడించిన మాళవాది సైన్యముల నాంధ్ర సైన్యములు ముట్టడించినవి. అదివరకే నాలుగురోజులనుండి పదివేల గోండులు ఎడతెగని దాడులచే మాళవులను చీకాకుపరచి నాశనము చేయుచుండిరి.

ఈ దాడులు సాధారణ గోండుల దాడులవలె లేవు. కొన్ని సంవత్సరములు క్రమశిక్షణ నందిన సంశప్తకాంధ్రులవలె గోండులు యుద్ధము చేయుచుండిరి. నేడు తూర్పువైపునవచ్చి తాకుదురు. విల్లులు ధరించి ముందు తీగెలతో దట్టముగా అల్లిన తడకలవంటి కేడెములు ధరించి వత్తురు. కేడెము నొకడు పట్టుకొనును. ఒకడు విల్లును లాగి బాణములు వదలును. ముందు పంక్తివారు వెల్లకిల పండుకొని పాదములతో విల్లు దండమును నొక్కిపట్టి రెండుచేతులతో రెండు చేతుల పొడవుగల ఈటెలను వదలుదురు.

ఆ వెనుక పంక్తివారు మోకాళ్ళపై గూరుచుండి బాణములు వదలుదురు. వెనుకపంక్తి వారు నిలుచుండి అంబుల వదలుదురు. బాణములు మృత్యుదేవతా కటాక్షాంచలములవలె పర్వును. వేలకువేలు విరోధులు చనిపోదురు.

మరునాడా దండంతయు మాయమైపోవును. తెల్లవారు ఘడియలలో, సాయంకాలపు ఘడియలలో శత్రువుల తాకుచుందురు. ఇంకొక దినమున పడమటి వైపున దాకుదురు. వేరొకరోజున ఉత్తరమున ప్రత్యక్ష మగుదురు. ఎంత వేగముగ వచ్చి దాడిసలుపుదురో, అంత వేగముగ మాయమగుదురు.

పట్టణమునకు పడమటగనున్న శీప్రానది వారి దాడుల నరికట్టలేదు. మాళవుల సైన్యముల వేలకువేలు సైనికులు మట్టి పాలగుచున్నారు. అశ్వములు, గజములు నాశనమైపోవుచున్నవి. మాళవాధిపతి “ఎవ్వరీ గోండుల నాయకుడు, ఈ గోండు లేల విరోధము పూని తమపై వచ్చిపడిరి?” అను ప్రశ్నలచే విహ్వలచిత్తుడయ్యెను.

గోండులు వచ్చి తాకిరనువార్త ఉజ్జయినీ నగరములోని ఆంధ్రులకు తెలిసినది. వినీతమతి, సమవర్తి, శుకభాణాదుల యాశ్చర్య సంతోషములకు మేరలేదు. ఇంతలో నొకనాటి రాత్రి గోండు డొకడు ఎటుల కోటలోనికి వచ్చెనో, సమవర్తి ఎదుట నిలుచుండినాడు. సమవర్తి సంభ్రమంబున నాతని రమ్మని సైగ చేసి తమ రథంబున కూర్చుండబెట్టుకొని వినీతమతి భవనమునకు బోయెను. వా రిరువురు శుకబాణునకు వార్తనంపిరి. అతడు వెంటనే యచ్చటికే వచ్చెను. శుకబాణునకు సర్వభాషలు తెలియును. అతడు గోండునితో సంభాషించెను.

“ఎవరు పంపిరి?”

“సువర్ణశ్రీ.”

“సువర్ణశ్రీయా!”

“ధాన్యకటకమున బొమ్మలు వేయువాడు. గొప్ప వీరుడు. మా మహామల్లగోండు మహారాజు స్నేహితుడు.”

“ఆత డెట్లు మీ దేశము వచ్చెను?”

“హిమబిందుకుమారిని వెదకుచు వచ్చెను. మా యువరాజు సహాయము కోరెను. వారు రాక్షసుల సహాయమున ఆమెను దాచిన ప్రదేశము గుర్తెరిగినారు. సువర్ణశ్రీ నర్మదానదీతీరమునందున్న గుహాంతరమునుండి వారిని రక్షించినాడు దొరా!”

శుక: సమవర్తితో హిమబిందును రక్షించినారట!

సమవర్తి: హిమబిందును రక్షించినారా? నిజముగా ఆమె క్షేమముగా నున్నదా? ఆమె ఏమనుచున్నది? ఎచ్చటనున్నది? త్వరగా చెప్పు మనుడు శుకబాణులవారూ!

శుక: తొందరపడకండి. ఓయీ గోండువీరా! ఆ బాలిక, ఆ బాలికతో వచ్చిన ముసలిస్త్రీ క్షేమమా?

గోండు: దొరా! వారిద్దరు క్షేమము. వారికి మా దొరసానివారు పంపిన గోండు స్త్రీలు సేవలు చేయుచున్నారు. వారు ఇచ్చటకు ఏబదిమైళ్ళ దూరముననున్న నొక గ్రామమున బ్రాహ్మణుని ఇంట నివసించి ఉన్నారు.

శుక: సమవర్తి సేనాపతీ! వారిరువురు క్షేమం. ఆరాటపడకుడు.

సమ: అమ్మయ్య. సువర్ణశ్రీ ఎంతపనిచేసినాడు! ఈత డింతటి వీరు డెప్పుడైనాడు! ఆ దినమున బండిపందెములో నన్నోడించినాడు. నేడు హిమబిందును రక్షించినాడు. ఈ హార మీ శుభవార్త తెచ్చిన గోండు వీరున కీయుడు.

శుక: గోండువీరా! నిన్నెవ్వ రిచ్చటికి బంపినారు? నీవు తెచ్చిన శుభవార్తకు మా సేనాధిపతి నీకు బహుమాన మిచ్చుచున్నాడయ్యా!

గోండు: దొరా! సువర్ణశ్రీ దొరయు, మా దొరయు నన్నంపిరి. వారు చెప్పుమనిన ముఖ్యవార్త “ఆ కొండలలోని గుహాగ్రామమును మేము పూర్తిగ పట్టుకొనినప్పుడు, అచ్చట ఆంధ్రచక్రవర్తులవారి కుమారుడు మంజుశ్రీ రాజకుమారుడు మాకు దొరికినారు. వారును క్షేమముగ నున్నారు” అని మీతో చెప్పుమని మా దొరల ఆజ్ఞ.

శుకబాణుడు “ఏమిటి గోండు దొరా! నీవు చెప్పినది నిజమా! రాజ కుమారుడు మంజుశ్రీయే మీకు దొరికినది? ఓహో ఎంత సంతోషము!” అనుచు ఆంధ్రప్రాకృతమున “ఆంధ్రా సేనాధిపతులారా! ఈ మహోత్కృష్టమగు వార్తవినండి. రాజకుమార మంజుశ్రీ, సువర్ణశ్రీ పట్టుకొనిన గుహలలోనే దొరికినాడట. ఎంత ఆనందము! నేను చేయలేనిపని సువర్ణశ్రీ చేసినాడు. ఆ బాలునిఎప్పుడు కలుసుకొందును? ఎప్పుడు కౌగిలింతును” అని వినశుడై పలికెను. వినీతమతి, సమవర్తి: ఏమి, మంజుశ్రీ దొరికినాడా? ఎంత ఆనందము! నిజమేనా?

వినీతమతి: ఓ దొరా! నీవు అసాధ్యుడవు. దేవదూతవలె నున్నావే! నీకు మా హారము లన్నియు ఇవిగో!

సమవర్తి: ఎవరక్కడ? ఈగోండుమహావీరుని నోటినిండ మిఠాయి లుంచుడు! నాకు నాట్యముచేయ బుద్ధివేయుచున్నది. ఈహారములను తీసికొనుము. శుకబాణుల వారూ! వెంటనే ఈ వార్త పాటలీపుత్రము చక్రవర్తికి అందజేయుడు.

గోండుడు చెక్కుచెదరని మోముతో గంభీరముగ గూరుచుండి, వా రిచ్చిన హారములు మెడను ధరించెను.

గోండు: మీలో “చిలుక ఈటె” అనువా రున్నారట.

శుకబాణుడు పకపక నవ్వుచు ఆంధ్రప్రాక్రృతమున వినీతమతి, సమవర్తులతో “నేను “చిలుక ఈటె” నట వినుటయ్యా!” యని మరియు నవ్వుచు “ఓ గోండుదొరా! నేనే యా చిలుక ఈటెను” అనెను.

గోండు డేమియు నవ్వక “ఓ చిలుకదొరా, నేను మా మహారాజు కడ నీ ఉద్యోగము వంటి ఉద్యోగమునే చేయుదును. నేను మా మహారాజును కొలుచు కొన్ని గూడెముల నాయకుడను. నా పేరు “గాలిదొర” అందురు. గాలివలె వచ్చి గతివలె పోగలను. గాలి రాకపోకలు తెలిసి తీరును. నా రాకపోకలు తెలియనే తెలియవు.”

శుకబాణుడు సువ్వున లేచి యీ గోండు దొరకు తమ యపసర్ప నమస్కారము లిడెను. అతడును తమజాతి యపసర్ప నమస్కారమును రెండు చేతులతో కళ్ళనుమూసి, చెవులు మూసి, నోరునుమూసి చూపించెను.

ఆ వెనుక వారిరువురును కౌగలించుకొనిరి.

గోండుడు: ఇదివరకే మా దొరలు పాటలీపుత్రమునకు వార్త పంపినారు. ధాన్యకటకమునకు వార్తలు పోయినవి. అటు తూర్పునుంచి సువర్ణశ్రీదొర గురువు ఆంధ్ర సైన్యములతో వచ్చుచున్నారు. వారునాలుగు దినముల దూరములో నున్నారు. పటమటవైపునుండి మహారాజు శ్రీకృష్ణ సాతవాహనులవారు వచ్చుచున్నారు. వారు పది రోజుల దూరములో ఉన్నారు. ఈ రాత్రి నేను మా దండును కలిసికొని మరల మీకు వార్తలను పట్టుకొని వచ్చెదను.

19. సైన్యాధిపతి - శిల్పి

శత్రువులను సర్వవిధముల నాశనము చేయుచు, కోటపై ఒత్తిడి తగ్గించుచు, సువర్ణశ్రీ అద్భుత యుద్ధము చేయుచుండెను. ఆతడు గోండు వీరుల యుద్ధవిధానమే మార్చివేసెను. ఒక దినమున తెల్లవారుఘడియలలో గోండువీరులను మూడు జట్లుగ విభజించినాడు. వారి నొక్కపర్యాయమే విరోధుల మూడువైపుల బోయి తాకుడని ఆజ్ఞయిచ్చెను.

ప్రథమ గోండుయుద్ధ విధానము మాళవాది సేనాపతులకు అవగత మగుటచే వారందుకు సిద్ధపడియుండిరి. సైన్యశిబిరములకు నాతిదూరము నుండి గూఢచారులు దాగుకొని యుందురు. గోండులు వచ్చుచున్నా రనగానే యా ప్రక్కపెద్ద భోగిమంటలు లేచును. మంటలకు దూరము నుండి కుడ్యములవలె గట్టి గట్ల చాటుననుండి శత్రు ధనుర్వీరులు బాణ వర్షము కురిపించెదరు. మంటలు దాటి గోండువీరులు వెళ్ళుటకు వీలు లేదు. గోండువీరులకు మంట లావల ఏమగుచున్నది కనబడదు. అట్లు గోండులు చీకాకునందగనే వీరివెనుక చెట్లలో దాగికొనియున్న పుళిందులు ఒక్కుమ్మడి గోండులపై గవిసెదరు ఆ సంకులసమరములో శిబిరములనుండి అందుకు సిద్ధమైయుండిన వేలకు వేలు శత్రువులు వచ్చి గోండులను తాకెదరు. ఇట్లు జరిగిన ఒక రణమున గోండులు వేయిమంది వరకు హతమారిరి. సువర్ణశ్రీ హృదయము చివుక్కుమనిపోయినది. ఆతడాలో చించి ఒక దినమూరకొని, యుద్ధమున గాయపడినవారిని వైద్యమునకై దూరపు టడవులకు పంపివేసెను.

ఆ దినమంతయు ఆలోచించి, రాక్షస గోండు నాయకుల చేర్చి వారేమి కార్యము లొనరింపవలయునో బోధించి పంపెను.

ఆ రాత్రియంతయు రాక్షసులు శిబిరముచుట్టు నున్న చెట్లపై కొమ్మలలో దాగి యుండిరి. కొందరు రాక్షసులు కుండలతో నీళ్ళు పట్టుకొని పోయి, నూనెపోసి సిద్ధము చేసియుంచిన భోగిమంటల దుంగల పై, నూనె తడిపిన గుడ్డప్రోగులపై నీళ్ళుపోసి తడిపి వేసిరి. గోండులు తమబాణము లకు నూనెతో తడిపిన గుడ్డలను చుట్టిరి.

అటు అన్నివిధముల సిద్ధమై ఒక్కసారిగా మూడువైపులనుండి ప్రత్యూషకాలముననే వచ్చి, శత్రువుల తమ సింహనాదములచే కలచి వేయుచు దాకిరి.

యధాప్రకారము మూడువైపుల మంటలంటింపబోయిన నవియంటు కొనలేదు. ఈలోన గోండుల అగ్నినారాచములు వేగమునవచ్చి పాకల, గుడారముల తగులబెట్టు చుండెను. గుర్రములు, ఏనుగులు, పశువులు చెదరిపోయెను. అటు కోటలనుండి ఆంధ్ర వీరులు తలుపు తీసికొనివచ్చి తీవ్రముగ తలపడిరి. ఈ సంకులసమరములో మాళవ సైన్యములు ధైర్యము కోలుపోయి చిందరవందరయైపోయెను. వేలకువేలు నశించి పోయిరి. చెట్లపై దాగుకొనుటకుపోయిన పులిందులను, ఆ చెట్లపై ఇదివరకే దాగు కొనియుండిన రాక్షసులు నాశనముచేసిరి.

మరల తెల్లవారుసరికి గోండులు లేరు. కోటలోనికి ఆంధ్రసైన్యములు తిరిగి పోయినవి. సమరభూమిలో, శిబిరములలో, మాళవ సైనికులు, పుళిందులు, వైదేహులు, కాళింగులు, విదర్భులు, శూరసేను లనేకులు శవములై యుండిరి.

విజయులై గోండులు, రాక్షసులు అడవులలో మాయమైనారు. మాళవుల సైన్యాలు, నూరు గజములు, అయిదువందల ఆశ్వికులు, రెండు వందల రథములు, వేయి పదాతులుగా నాలుగువైపులకు జీలిపోయి, గోండులు దాగియున్న ప్రదేశములు కనుగొని, వారని వేటాడుటకు నిశ్చయించుకొన్నవి.

ఈ విషయము సువర్ణశ్రీ గ్రహించకపోలేదు. గోండు సైన్యాలు కనబడియు కనబడనట్లు, వేరువేరు భాగాలై శత్రుసైన్యములను గోండువన దేశమువైపు దూరాటవులకు కొనిపోయి, అచ్చట వారిని చిందరవందరచేసి నాశనముచేయ సువర్ణశ్రీ, మహాబలగోండు లాజ్ఞయిచ్చిరి. ఈ వ్యూహా విధానమునకు నాయకత్వ భారము మహాబలగోండునిపై బడినది. సువర్ణశ్రీ మాటుమణిగెను. హిమబిందు కుమారియు, ముక్తావళియు కొలది దినముల వరకు దాము ప్రచ్ఛన్నముగ నివసించియున్న ఇంటనే తలదాచుకొన సువర్ణశ్రీ యుపదేశించెను. సువర్ణశ్రీ మారువేషమున హిమబిందు నివసించు గ్రామముననే యుండెను. అచ్చట నొక ఫలముపై దుకూల మంటించి, దానిని చిత్రరచన కనువగున ట్లమరించి, చిత్రము నొండు రచించెను. ఆతని కుంచెల వత్సకర్ణ రోమములచే, ఉడతతోక వెంట్రుకల నాతడే నిర్మించుకొనును. ఆతడు వర్ణము లెచ్చట వీలయిన నచ్చట సముపార్జించును. నీలిరంగు, ఇంగిలీకము, సత్తుభస్మము, హరిదళము, గైరికము కాసీసము, ఖజ్జలి, మంజిష్ట, లక్షారసము మొదలుగునవి సముపార్జించుకొనినాడు. వానిని నూరి రంగులుగ నొనర్చి, తూలికతో నా చిత్రము రచించినాడు.

ఆ చిత్రమునందు తన హృదయమునే చిత్రించినాడు. ఆకాశమున గంధర్వరాజు తేలిపోవుచున్నాడు. అతని యెదుట వీణవాయించు గంధర్వాంగన త్రిభంగాకారయై పద్మాసనాసీనయైయున్నది. దిగువ కొండల మధ్య చెరువుకడ తపస్సుచేయు నొక బాలకుడు.

ఆ చిత్ర మతిమనోహరము. ఆకాశమున మేఘములు, పక్షులు, కొండలలో జంతువులు, వృక్షములు; బాలతపస్వికడ పాములు, పూల మొగ్గలు, చెరువులో పద్మములు, ఆకులు, కొంగలు, అంచలు ఇవియన్నియు చిత్రభావమునకు శ్రుతిగ నున్నవి.

ఏ నాటికైన తనకు సన్యాసమే, భిక్షుకత్వమే! ఆమెను రక్షించి ఆమె తండ్రికి అప్పగించుట తోడనే తనధర్మము పూర్తియగును. అటుపైన ఆంధ్రదేశమునకు అతి దూరమున, ఏ సంఘారామ క్షేత్రముననైన ధర్మమును, సంఘమును కొలచుచు నుండవచ్చును.

హిమబిందు తనకు దేవత. ఆమె ప్రజ్ఞాపరితాదేవియే! ఆమెను దూరమునుండి పూజచేయును. తానామె దేహమును కాంక్షించియుండెను. తన్ను ఆమెకూడ అట్లే కాంక్షించి యుండునా? ఉండదు. అట్లు కాంక్షించియున్న ఇతరుల నెట్లు ఉద్వాహము కానిచ్చగించినది?

ఆమె ఇతరుల వివాహమాడ ఇచ్చగించియుండునా? తండ్రిమాట జవదాటలేక అట్లు ఒప్పుకొనియుండునా? ఏది అయిన నేమి? ఆమె పరతంత్ర. తన ప్రభువునకు కోడలు కాబోవుచున్నది. భావి ఆంధ్ర సామ్రాజ్ఞి.

ఆమెను మనస్సులోనైన తాను తలంపగూడదే! ఎంత ప్రయత్నించినను ఆమెను మరవలేని నీరసత్వము తనగుణములందు ఏర్పడినది. అట్లు మరచుట కుపాయ మేమి? అమృతపాదార్హతులు తన కుపశమన మీయలేరా? తన గురువు సోమదత్తాచార్యులు వచ్చుచున్నారు. వారికడ నేర్చిన విద్య నేటికిట్లు ప్రదర్శిత మగుచున్నది. ఈ మాత్రము ప్రభు సేవ మొనర్చి తన ప్రభుఋణమును, గురువుల ఋణమును, హిమబిందును రక్షించి ప్రేమఋణమును, ఎచ్చటనైన సంఘారామమునకు శిల్ప మర్పించి పిత్రూణమును తాను తీర్చుకొనుగాక! ఆ పైన హిమాలయములే తనకు శరణ్యములు. హిమాలయ శిఖరములు, మహానదులు, మహోన్నత ప్రదేశములు, హిమము ఏ అగ్నిపూరిత హృదయమునకైన పరమశాంతిని ప్రసాదించగలవు.

సువర్ణశ్రీ రెండుదినములవరకు హిమబిందుకడకు బోలేదు. ఆమెను దర్శించుట ఆమె ఆజ్ఞవల్లనే. కాబోవు మహారాణి ఆజ్ఞ అనుల్లంఘనీయము కదా!

సువర్ణశ్రీ వెళ్ళుటతోడనే హిమబిందుమోము రాకాచంద్రబింబము వలె వికసించెను.

అంతవరకు ముత్తవతో నామె వాదనలు సలుపుచునే యుండెను. తాను శ్రీకృష్ణ శాతవాహనుగాని, మరి ఏరినిగాని వివాహమాడననియు, తాను భిక్కుణియై మహా శ్రమణకుని సేవ చేసెదననియు, అమృతపాదార్హతులు తనకు గురువగుననియు నామె ఖండితముగ ముక్తావళీదేవితో చెప్పినది.

ముక్తావళీదేవి యవనవంశజాత. ఇంద్రియభోగము, ఇహసౌఖ్యము నామె యేవగించు కొనదు. ఆమెకు భక్తియున్నది. ఆమెకు భగవంతుడు లేడను బౌద్ధబోధ అర్థము కాలేదు. శనికన్న గురువు బలవంతుడగుటచే, ఆతడు భగవంతుడయ్యెను. గురువుకన్న బుద్ధదేవుడు బలవంతుడైనాక కదా ఆతడు భగవంతుడగుట! ఇటుల ఆమె వాదించుకొనును. శని గురువులు యవనదేవతలు. హెరాక్లిసు మనుష్యుడే దేవుడైనాడు. డైనోసీయసు మేరుపర్వత నివాసి యని గ్రీకులమతము.

యవనులు భారతదేశమువచ్చి అచ్చటి ఆర్యసంప్రదాయముల నర్థము చేసికొనలేక ఎట్లో కొన్నిటి సమన్వయ మొనర్చుకొనిరి. భారతీయులు మహేశ్వరుడే వారి జ్యూస్ (ద్యోఃపిత) మహేశ్వరుని అంకమునుండి డైనోతయసు అను స్కందుడు పుట్టినాడు. 

20. ముగ్ధకోపన

యవనులు భారతీయ దేవతానిసరమును, వేదాంతమును ఏమియు అర్థము చేసికొనలేకపోయిరి. అందుకనియే ఎన్నియో యవకతవకభావములు వారి కుద్బవిల్లినవి.

ముక్తావళీదేవికి తనయన్న మొదలగువారికన్న భారతీయభావములు ఎక్కువగ నర్థమైనను, తన మనుమరాలు బిక్కుణి యగుట ఏలనో గ్రహింపలేదు. ఆడువారు సన్యాసు లగుట యేమి? పురుషులమాత్ర మేల సన్యసింపవలెను?

సువర్ణశ్రీ వచ్చుటతోడనే హిమబిందు లేచి, యాతనికడకు వచ్చి “ఓ శిల్పిశేఖరా! ఇన్ని దినములు ఆలస్యముచేసివచ్చిన మీ ఉద్దేశమేమి? యుద్ధ మన నంత వెఱ్ఱి ప్రేమ ఎక్కడనుండి వచ్చినది? ఉత్తమకళ లన్నియు మరచిపోదురా? మీరును గోండులవలె అడవిమనుష్యులగుదురా?” యని ప్రశ్నించెను.

ముక్తావళీదేవి: ఏమయ్యా! ఎంతకాలము మేమీ గ్రామమందుండుట నాయనా! నీ కింకను ఈ యుద్ధపువెఱ్ఱి వదలదా ఏమి? ఈ గ్రామమున మమ్ము విరోధులెవరయినా గుర్తించి, మరల మమ్ము నెత్తుకొనిపోవుదు రేమో!

సువర్ణశ్రీ: ఈ గ్రామముచుట్టును మహావీరులైన గోండులు కావలి కాయుచున్నారు. విరోధులీగ్రామమునకు రాలేరు. వచ్చినవాడు హతమారిపోవును. మీ కేమియు భయములేదు. పదివేల గోండులు నాశనమమైనగాని మి మ్మెవరును తేరిచూడలేరు.

హిమబిందు: అమ్మమ్మా, నాకు ధాన్యకటకనగరముపోవుట కిచ్చలేదు. ఈ అడవులలోనే ఉండిపోవలెనని ఉన్నది.

ముక్తా: అది ఏమి, వెర్రి తల్లీ! వట్టి మతిమాలినదానవై పోవుచున్నావు.

హిమ: అమ్మమ్మా, నాకు మతిలేదు; నిజము. పిచ్చి ఎత్తుచున్నది. నే నీ అడవులోనైన నుండవలయును, భిక్షుకురాలినైన గావలయును, లేనిచో దేహమును త్యజింపనైన వలయును.

ముక్తా: ఛీ! ఛీ! ఎంతమా టంటివి? నీ వీ దినమున నా మనస్సును పూర్తిగ పాడుచేయ దలచుకున్నావా? తల్లీ! నా యీ ముసలితనములో నిన్ను చూచుకొని బ్రతుకుచుంటిని. నీవలన నీ తండ్రియు, నీ తాతలును జీవములు నిలుపుకొనియున్నారు. సువర్ణశ్రీ: హిమబిందుకుమారీ! ఈ భయంకర సమయములో అట్టి మాటలనుట తగునా? ఈ సాయంకాలము తూర్పునుండి చక్రవర్తిపంపిన ఆంధ్రసైన్యములు మా గురువులగు సోమదత్తాచార్యుల నాయకత్వమున వచ్చుచున్నవి. ఇంకను రెండుమూడు దినములలో ప్రభువులగు శ్రీకృష్ణ సాతవాహనులు తమ సైన్యములతో పటమట దిక్కునుండి వచ్చుచున్నారు. ఆ వెంటనే మిమ్మిరువురను పాటలీపుత్రమునకు సైన్యము నిచ్చి పంపివేయగలను.

హిమ: మీరట్లు పంపివేయునది నా శవమును మాత్రమే.

సువర్ణ: బుద్ధా! బుద్ధా! ఎంతమాటంటిరి? ఈ దినమున మీకీ విచిత్ర చిత్తవృత్తి సంభవించిన దేమి? హాస్యమునకైన అట్టిమాట లన గూడదు.

ముక్తా: నేను ఎ నూయియో, గోయియో చూచుకొనవలసియుండను. ఈ దినమున హిమమాటలు నా హృదయమును బద్దలుకొట్టు చున్నవి.

హిమ: ఈ మహాసేనాధిపతి నన్ను పంపివేయునట! తన చెల్లెలితో ఆడుకొనిన నన్ను “మీరు” అని గౌరవించుచున్నారు. నే నేమియు మాట లాడను. నే ననిన మాటలన్నియు తప్పులు, మీ యిష్టము వచ్చినట్లు చేయుడు. నేను పోయి పండుకొనెదను.

హిమబిందు కన్నుల నీరుగ్రమ్మ అతివేగమున పరుగిడిపోయి, మంచముపై గభాలునపడి, వెక్కి వెక్కి ఏడువజొచ్చినది.

సువర్ణశ్రీ, ముక్తావళీదేవులు ఒకరి మొగ మొకరు చూచుకొనిరి.

ముక్తా: సువర్ణశ్రీ! నీ ఋణము మే మెప్పుడును తీర్చలేము తండ్రీ! నీవు మహాబంధనమునుండి మమ్ము రక్షించినది మొదలు రెండు మూడు అహోరాత్రములు ఆనందముచే పొంగి పొరలిపోయినది. నీవు మమ్మీ గ్రామమున వదలి వెడలిన నాటినుండియు అల్లరి ప్రారంభించినది. “నే నా బంధమున వృద్ధురా లగువరకు ఉండిపోయిన ఎంత బాగుండెడిది” అనుట మొదలు పెట్టినది. తనకు పెండ్లి వలదట, పెటాకులు వలదట. ఏ రాత్రియో లేచి తాను అడవులలోనికి పారిపోవునట ఇంకను ఎన్నియో మాట లని నన్ను భయంకరస్థితికి తీసికొనిపోవుచున్నది.

సువర్ణ: మామ్మగారూ! మీరేమియు కలతనందకుడు. మీరు ధైర్యము వహించి యుండనిచో ఆమె కింక దిక్కెవ్వరు? పరమసాధ్వి యైన ఆమెతల్లి శరీరము చాలించిన నాటినుండి మీరే ఆమెకు తల్లియైతిరి. చిన్నతనపుమాటలకు అర్థము లేదు.

ముక్తా: తండ్రీ! నీవుమాత్రము చిన్నవాడవుకావా? నీ చరిత్రయే నా కద్భుతమగు చున్నది. మీ గృహమున నీవు రచించిన శిల్పములు, చిత్రలేఖనములు చూచినాను. విశ్వబ్రహ్మ వంశసంజాతుడవై నందులకు, విశ్వబ్రహ్మయే నీలో అవతరించినాడు. ఇటు మహావీరుడవు. ఎన్ని మహా సైన్యములువచ్చిన ఆ గుహను పట్టుకొనగలరు! నీవు మాళవులను చికాకుచేయు విధము అనన్యము. శక్తిమతీదేవి కడుపున త్రిరత్నములు నీవై ఉద్భవించినవి తండ్రీ!

సువర్ణ: మామ్మగారూ, నన్ను పొగడకండి.

ముక్తా: నాయనా, హిమబిందును తండ్రి శ్రీకృష్ణసాతవాహనున కిచ్చి మహారాణిని చేయనున్నాడు. చక్రవర్తి కాదనలేడు. ఇదివరకే ఒప్పుకొని నాడని మా అల్లుడు చెప్పినాడు. నాతల్లికి సర్వవిద్యలు తెలియును. హిమ సంగీతము పాడుట నీవు వింటివో లేదో! ఏ రాగముపాడిన తదనుగుణములయిన విచిత్రములు సంభవించును. శైలాలి కృశాశ్వసూత్రము లామెకు కంఠస్థములు. ప్రాతిశాఖ్య అమ్మాయి వ్యాఖ్యానముతోకూడ చెప్పును. జతులు, రాగములు, గాంధారగ్రామము, పరమమహాశబ్దము ఆమెకు కొట్టిన పిండి. ఈ తల్లి మృదంగము వాయించగలదు. వీణను స్పందించి ఆమె పాడునప్పుడు రాళ్ళే కరగిపోవును. భరతనాట్య సూత్రములకు వన్నెతెచ్చునట్లు నాట్యమాడగలదుగదా! మా యవన దేశములలో గాని, మన ఖండమునందుగాని యిట్టి సుందరాంగియైన బాలికను ఎందును చూచియుండరు. నీవీ రహస్యమును గ్రహించియే కాబోలు నాతల్లి బొమ్మను లిఖించినావు.

సువర్ణ: మామ్మగారూ! హిమబిందుకన్న సకలభారతవర్షమునకు సామ్రాజ్ఞి కాదగినవారు వేరొక్కరు లేరు. భగవంతు డామెను రక్షించి సామ్రాజిని చేసి తీరునుగాక!

ముక్తా: తండ్రీ! అదే మా కోరిక.

సువర్ణశ్రీ: నీవు హిమబిందుతో చెప్పి మరియు వెళ్ళుము. లేనిచో నన్ను చంపి వేయును. ముక్తావళీ దేవికి హిమబిందు సువర్ణుని ప్రేమించుచున్నదని స్పష్టముగ తెలియును.

ఒకనాడు ప్రేమించినవారి హృదయమునకు ఇతరుల హృదయములు స్పష్టముగ తెలియునుగదా! తాము గుహలో బంధితులై యున్నప్పుడు ఒక్కనిమేషము హిమబిందు సువర్ణశ్రీ పేరు తలంపక యుండలేదు? సువర్ణశ్రీయే వచ్చి తమ్ము రక్షించు నని ప్రతిదినము ఎన్నిసార్లో అనునది. వెనుక బాలనాగి మాటలవలననే హిమబిందు సువర్ణశ్రీని ప్రేమించుచున్నట్లు తాను గ్రహించినది. ఇట్టి సంఘటన కలుగుట బుద్ధభగవానుని యిచ్ఛయేమో! తండ్రియేమో శ్రీకృష్ణసాతవాహనున కీయ సంకల్పించినాడు. ఏమి కానున్నదో?

ఈ దేశమున బాలికలు తండ్రిమాట జవదాటరు. ప్రేమించినచో ప్రేమించిన వారిని భర్తయని యనుకొందురు. ప్రేమ యొక్క ఈ యౌన్నత్యము యవనబాలికల కేమి తెలియును? వారు భోగప్రియులు. పురుషుని ఆటవస్తువులు. ఒకనికి భార్యగానుండి ఇతరుని కామించుట యవనస్త్రీ దోషముగా నెంచదు. ఆర్యస్త్రీలు ఎంత పవిత్రమైన హృదయము కలవారు! ఒప్పుకొని ఒకనిని పెండ్లి చేసికొనినచో తమసర్వస్వమును వారికి ధార పోయుదురు. ఆ దివ్యధర్మము పాతివ్రత్యమట! ఎంత ఉత్కృష్టధర్మ మిది! గ్రీకుదేవతలు, ఆంధ్రదేవతలు తనయందు ప్రేమగలవా రగుటచే తన్నీ విధమున ఆర్యస్త్రీ నొనరించినారు.

ముక్తావళీదేవి యిట్లాలోచించుకొనుచు ఆ బ్రాహ్మణుని గృహమున ముందటి సావిడినుండి దొడ్డిలోనికి వెడలిపోయినది. సువర్ణశ్రీ హిమబిందు కడకు పోయినాడు.

హిమబిందు మంచముపై పరుండి వెక్కి వెక్కి ఏడ్చుచున్నది. సువర్ణశ్రీ నెమ్మదిగ నడచిపోయి, అస్పష్ట స్వరమున “హిమబిందూ!” అని పిలిచినాడు. హిమబిందు పలుకలేదు. మరల స్వరము నింకకొంచెము హెచ్చించి సువర్ణశ్రీ “హిమబిందూ! నీ విటుల చేయుట న్యాయము కాదు. విధి సంఘటన ఎవరు తెలిసికొనగలరు? త్వరలో నీతండ్రిగారి కడకు నిన్ను పంపించెదను” అనెను. హిమబిందు మంచముపై నున్న దిండ్లకు మోము నొత్తికొని కఠినస్వరమున “నీవు మా తండ్రిగారికడకు పంపనక్కరలేదయ్యా. సోమదత్తాచార్యులవారు వచ్చుచుంటి రని చెప్పి యుంటివికదా! వారే మా ప్రయాణమునకు వలయు ఏర్పాటు లన్నియు చేయుదురు” అని మరియు రోదించినది. సువర్ణశ్రీ కోపము నభినయించుచు, “అవును, నేను ప్రాణమునకైన వెరువక మిమ్ముల రక్షించితిని. ఇప్పుడు నా అవసరమేమి మీకు? ఇక నాముఖమైన మీకు చూపించి మీ మనస్సును కష్టపెట్టను లెమ్ము” అని ఖండితముగ ననెను. హిమబిందు సువ్వున లేచి కూర్చున్నది.

“నీవు రక్షించు టేమిటయ్యా, మహాబలగోండుని సహాయమున రక్షింపగల్గితివి. అదియు ఒక గొప్పయే! నీ ముఖమును నాకు చూప నక్కరలేదు. ఒకటి మాత్రము జ్ఞాపక ముంచుకొనుము. నీ వీ జన్మమున నిక హిమబిందును ప్రాణముతో చూడలేవు.”

సువర్ణశ్రీ ఎప్పుడును కంట నీరు పెట్టనివాడు కన్నుల నీరు గిర్రున తిరుగ ఆ నేలపై చతికిలబడిపోయి, రెండుచేతులు ముఖమున కడముచేసి కొని, కంటనీరు పెట్టుకొని, కొంతవడికి లేచి చిరునవ్వు ముఖమునకు తెచ్చుకొని “హిమబిందూ, నీవింత అల్లరిపిల్లవైనందుకు మా చెల్లెలివైనచో.... అవి ఏటి మాటలు?” 

21. హిమాలయ శిఖర ప్రత్యక్షము

హిమబిందు సువర్ణశ్రీ స్థితినిచూచినది. ఆశ్చర్యమునంది, మనస్సు వ్యాకులము నంద నాతనికడకు వచ్చి, యాతని రెండుచేతులుపట్టి లేవనెత్తి ఆతని కడ తాను మోకరించి, “ప్రభూ! మీరు దేవతలు! బోధిసత్వులు. నేను సమస్త దేవతల సాక్షిగ, బుద్ధ భగవానుని సాక్షిగ, సర్వధర్మముల సాక్షిగ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను వివాహమాడినచో నా హృదయము నిండి, నా జీవితమే తానయి, నాఆత్మ కధీశ్వరుడైన వానినే వివాహమాడుదును. లేనిచో భైక్షుక దీక్షనంది బౌద్ధధర్మ మాచరింతును. నా ప్రాణమును నేను ఎప్పుడును బలిగా సమర్పింపను” అని సువర్ణుని పాదములుపట్టి, అందమైన ఆ పాదములపై తన మోముంచి ముద్దుగొని, లేచి, “ఇంక మీ పనిపై మీరు పొండు” అని తెలిపినది.

సువర్ణశ్రీ సంభ్రమాశ్చర్యములకు లోనై, సర్వము మరచి, పది క్షణము లట్లే నిలుచుండిపోయి, కన్నులరమూతలుగా సర్వము హిమబిందు వయిపోవ, ఆ సుందర విగ్రహస్వర్ణపాటలారుణకాంతులు, దీర్ఘ పక్ష్మాంచల వినీలకాంతులు, మాంజిష్టరాగ సంక్లిష్టమృదులరేఖాసమన్వితాధరోష్ఠలో హితద్యుతులు తన్నలమివేయ చేతులు హృదయమున కద్దుకొని, అచ్చట నుండి కదలి ఎటుపోవుచున్నదనియు తెలియక, యా కాపు వేషముననే యా గ్రామాంచలముల ప్రవహించు సుందర శైవాలినీ తీరమునకు బోయి, ఆ కొండలలో, ఆ వనవృక్షములలో, ఆ శిలలలో ఆ సాయంకాలము తాను దివ్యమూర్తియై చంద్రలోకములోని సుధాకరునివలె సంచరించెను. ఆతని ఆనందము రూపరాగ రహితమైనది. ఆతని ఆనందము సాయంకాల నటేశ్వరపాదపద్మపాటల వర్ణాంకితమైనది. ఆతని ఆనందము విశ్వపథ ప్రసారితదివ్యశబ్దాదిత్యమైనది.


ఓ దేవి :

 నిన్ను వలచిన బ్రతుకు
నిన్ను కొలిచిన ఆత్మ
నిత్యమై లోకముల
సత్యమై నిలుచునే!
ఓ దేవి:

 నిన్ను పాడిన కవియె,
నిన్ను మూర్తించుకొని
పూజించు శిల్పియే
పుణ్యమూర్తులు వారు!”

అని మనసార పొడికొనెను.

ఈ మహదానందము భౌతికోపాధియై తుచ్ఛమగునా? పురుషుడు స్త్రీని, స్త్రీ పురుషుని ప్రేమించుట, పూజించుట దోషమా? సిద్ధార్థుడు యశోధరాదేవిని ప్రేమించ లేదా? పూజింపలేదా? వారి శృంగార పూజాఫలమై వరప్రసాది రోహిలుడు జన్మించలేదా? జగదేకసుందరి హిమబిందు తన్ను ప్రేమించుచున్నది. ఇంకొకరిని ప్రేమింపజాల ననుభావమేనా తనకీ యానందము ప్రసాదించినది? అది సార్థరూప మగు తుచ్ఛకామము కాదా? ఆ బాలిక శ్రీకృష్ణసాతవాహనమహరాజునకు జనక దత్తయైనది. తన కామె పవిత్రమూర్తి, అర్చాదేవతమాత్రము.

హిమాలయ శ్వేతశృంగదర్శనము శిల్పికి పులకరముకలిగించునట. పరమ దృశ్యమును మోహించి కళాశీలి నీచభావ సంకలితుడా? కాదు. సందర్శన జనిత భావములు, అసదృశసౌందర్య ప్రకృతివిలాస సందర్శన జనిత భావముల వియ్యమొంది, ఒక అతిలోకసాదృశ్యనిర్మాణ మొనరించు కొని, నిర్వాణాంచల పథాలకు బోవు అర్హతుల దివ్యచిత్తవృత్తి ప్రమాణములు గైకొని రూపకల్పన చేయవలయునుగదా శిల్పి! అందుకై శిల్పి పవిత్రజీవి కావలయునుకదా! ఇంక తనశిల్పి జీవితము ఉత్తమపథాల నడువ గలుగునుగాక!

హిమబిందు పూజాపీఠం యగు దేవి. ఆమె మహారాజ్ఞి యగును. సామ్రాజ్ఞి యగును. అట్టి మహోన్నతపదమునుండి శిల్పమాత్రుని నీచ జీవితమున కా బాలికను దిగలాగుట మహాపాపమే యగును. శ్రీకృష్ణసాతవాహనహిమబిందుల జీవిత ప్రవాహ సంగమము సర్వభారతవర్షమునకు కళ్యాణ ప్రదమైనది. అట్టి జగత్కళ్యాణ సంఘటనకే శిల్పి విఘ్నము సంకల్పించగలడు.

హిమబిందు మరల తన్ను చూడకుండుగాక! తా నామె కంటబడకుండ యుద్ధ వ్యవసాయ దీక్షితుడై యున్నచో, సర్వము శుఖాంతమగును. ఆ వెనుక ఇచ్చటకు కొంత దూరమున మహాసంఘారామ క్షేత్ర మొకటి యున్నదట. అచ్చటికి దేశదేశములనుండి శిల్పులు వచ్చుచుండిరట. అందు తా నొకడై బుద్ధభగవానుని అర్చించునుగాక!

ఇట్లు నిశ్చయ మొనర్చుకొని, గ్రామాభిముఖుడై పోవుచుండ హిమబిందాతని కెదురైనది. ఆతని ఆశ్చర్యమునకు మేరలేదు.

“ఓ శిల్పీ! మీ శిల్పభావములకు పరిమళములు సేకరించుకొనుటకా యేమి, ఈ సాయంకాలవాహ్యాళి వెడలినారు?”

“నామాట యటుండనిమ్ము. నీ వీ సంధ్యాకాలపు మసకచీకట్లలో ఒంటిగా బయలువెడలితి వేమి?”

“ఔను, నిర్భయత పురుషుల సొమ్ము గడప కదలజాలని భీరుత్వము స్త్రీల కలంకారము.”

“హిమబిందుకుమారీ! విరోధు లెల్లెడల నిండియుండి రని....” “తామే పదివేలగోండు స్నేహితులంతటా యున్నారని నిర్భయమున వచ్చినాను. ఇదిగో వినండి....” అని హిమబిందు భరద్వాజ పక్షివలె కూతవేసినది. వెంటనే సంపూర్ణాయుధోపేతు లగు నలుగురుగోండు లట ప్రత్యక్షమైరి.

సువర్ణశ్రీ వారిని జూచి, నవ్వుకొని “ఈ రహస్య మెప్పుడు గ్రహించినావు? ఆ కూత నీ కెట్లు పట్టుబడినది?” యని ప్రశ్నించెను.

“మమ్ము గుహాబంధమునుండి విడిపించి తెచ్చినపుడు మీసాంకేతికము నేను వినలేదుకాబోలు! మహాబలగోండుడు నాకు గురుత్వముచేసెను. అన్నట్లు మీరెప్పుడు నాకు చిత్రలేఖనము సంపూర్ణముగ నేర్పుట? ఇంకను ప్రొద్దుపోలేదు. అదిగో, ఆ సెలయేటిగట్టున రాతిపై కూర్చుందుము. (గోండు భాషలో గొండులను జూచి) మీరుపోయి, ఈ పరిసరములనే కాచియుండుడు.”

వారిరువు రొక శిలాతలముపై కూరుచుండిరి. సువర్ణశ్రీ ఏమి మాటలాడ గలడు? హిమబిందు మూగనోముపట్టిన యాతని భావభరము నెఱింగి,

“శిల్పాచార్యా! నేను రచించిన ఈ పాట వినుడు” అని అత్యంత మనోహర స్వరమున.

“కుసుమ మొకటి అర్చనకై
కోసికొనిన దొక బాలిక,
మధుర సౌరభాంచితమై,
మధుపూర్ణము దాని ఎడద.
పూజింపగ నా పుష్పము
పొలతితీసె, కుసుమములో
మధుపానం బొనరించెడి
భ్రమర మొకటి నామె చూచె.
అళి మూచూచిన పువ్విది
అర్చనకై పనికిరాదు
అనుచు బాల ఆ పుష్పము
అంజలితో వదలె నదిని.
ఆ భృంగము ఆ పుష్పము
ఆనందమె జీవితమై
అలల నూగి ఝరుల తేలి
కలిసిపోయె మహాజలధి-”

అని పాడినది.

ఆ పాట ముగియునప్పటికి హిమబిందు చిత్తవృత్తి యంతయు నాతని కవగతమైనది. ఆ బాల “శిల్పమూర్తీ! నీవు సర్వకళాకోవిదుడవు నీకు తెలియని రహస్యమేమున్నది! నాకు కొన్ని అనుమానములున్నవి. తీర్పగలవా?”

“హిమబిందూ, నా కేమి తెలియును? శిల్పరహస్యములు మా జనకుడు తెలుపు చుండ వినవలెను, సర్వకళలకు దేశికులు వారు.” “అవును. సంఘారామ విద్యాపరిషత్తునందు మాకు వారు శిల్ప సూత్రములు, నాట్యసూత్రములు, నందికేశ్వర నాట్యశాస్త్రము, గాంధర్వ విద్య అన్నియు పాఠములు చెప్పినారు. నేను నిన్ను తీర్చు మనిన అనుమానము లివి: ఒకరిని ప్రేమించి, ఇంకొకరిని ప్రేమింప వలనుపడునా? ప్రేమింపకయే వివాహ మాడదగునా? మనసు నీయకుండ మే నిచ్చుట పాపముకాదా? ఈ ప్రశ్నలే నా గుహాబంధన జీవితములో సర్వకాలము నాలోచించుకొనెడి దానను. ఇంకొకటి - ఈ ప్రశ్నల కుత్తరము లిచ్చు ముందు ఒకటి మరచిపోవద్దు ప్రభూ! మనము పాటలీపుత్రము చేరునంత వరకు, నన్ను మీరు విడిచి యుండకూడదు. ఎరుగుదురుగదా స్త్రీలు భీరువులని, న న్నేకాకినిచేసిన ఏమగుదునో యని భయమగుచున్నది.” 

22. ఉజ్జయిని విడుదల

సోమదత్తాచార్యుని సైన్యము లొకవంక వచ్చి తాకినవి. ఇంకొక వంక గోండులు వచ్చి తాకిరి. పోరు సంకులమయ్యెను. మాళవులు మహా భీకర సంగ్రామము చేసిరి. ఆంధ్ర సైన్యములన్నియు ఒక్క భయంక రాయుధరూపమున వచ్చి తాకినను, సోమదత్త, సువర్ణశ్రీ, మహాబలగోండుల రణకౌశలము వేలకువేలు మూకల నాశ మొనర్చుచున్నను, మాళవ సైన్యములు వెనుకంజ నిడుటలేదు. దుర్గద్వారములు తెరచి సమవర్తి, వినీతమతియు, శుకబాణాదు నొకప్రక్క మాళవుల రూపుమాపుచుండిరి. యుద్ధము మూడు దినములీ విధమున జరుగునప్పటికి శ్రీకృష్ణసాతవాహన మహారాజు ఏబదివేల సైన్యముతో పడమటి దిక్కునుండి వచ్చి మాళవుల దాకినాడు. ఆ యుద్ధము ప్రళయతాండవమైనది. ద్వంద్వయుద్ధమే అభి సంపాతవిధానమైపోయినది.

సోమదత్తా చార్యుడు సైన్యములతో వచ్చుటతోడనే సువర్ణశ్రీ పోయి, యాతని పాదముల కెరగినాడు. సోమదత్తుడు మహానందమున సువర్ణశ్రీని కౌగిలించుకొని “తండ్రీ! హిమబిందును, ముఖ్యముగ మంజుశ్రీకుమారునిరక్షించినావట. నేనునిన్నుకూర్చి ఊహించినవన్నియు నిజముచేసినావు. ఎప్పుడో మాయమైపోయిన మంజుశ్రీని తిరిగి సంపాదించి ఇచ్చిన నీనేర్పు ఆంధ్ర సామ్రాజ్యమునుద్ధరించినది. నీవు నాకు ఉప సైన్యాధ్యక్షుడవు. మహాబల గోండుని సేనాపతిని చేయుచున్నాను. వ్యూహము తోమర స్వరూపము. ఈ మూడులక్షల విరోధులను నిశ్శేషముగా నాశనం చేయవలయును. నేను సైన్య ముఖమున, నీవు కుడివైపున, మహాబలుడు తన గోండులతో ఎడమ వైపున, తక్కిన అధికారులందరులు ఆ యాస్థానముల నుందురు” అని సువర్ణశ్రీని, మహాబలుని కౌగిలించుకొని భద్ర దంతావళము నధిష్టించి, సేనా ముఖమునకు పోయెను. ఆంధ్రులను తెరలు తెరలైవచ్చు మాళవులెన్ని సారులు తాకినను తోమరవ్యూహ మిసుమంతయైన చలింపక శత్రువ్యూహములోనికి చొచ్చుకొనిపోవుచుండెను.

ఆంధ్ర సైన్యములకు ఉజ్జయినీ నగరము ఇక రెండున్నర క్రోశములు మాత్రమే యున్నది. ఇంతలో శ్రీకృష్ణసాతవాహనుడు మహావేగముతో వచ్చి పడమటి దిక్కున తాకుటయు, మాళవ సైన్యముల నాశనదేవత ఆవహించినది. తమ సైన్యమునకు ఏడుగోరుతముల దూరమున శ్రీకృష్ణసాతవాహనుడు మాహానంభ్రమముతో విరోధుల తాకి, విరోధిప్యూహములోనికి చొచ్చుకువచ్చుచున్నాడని తెలియగనే సోమదత్తుడు సువర్ణశ్రీని పిలిచి “నాయనా! నీస్థానమున శతస్కంధు డుండును. నీవు పోయి మహారాజున కంగరక్షకాధిపతిగ పనిచేయుము. మాకు దారిలో చారులవలన తెలిసిన యుదంతమంతయు సమాలోచింపగా స్థౌలతిష్యులవారు, మాళవులు, శివస్వాతి, సుశర్మ, శూరసేనపతి మొదలగువారు కుట్రపన్ని సార్వభౌముని, శ్రీకృష్ణసాతవాహన మహారాజును మడియించి, మంజుశ్రీకుమారుని ధన కటక సింహాసన మెక్కించి, బౌద్ధధర్మమును నాశనముచేసి, వేదధర్మమును తిరిగి నెలకొల్ప నెంచుచుండిరి. ఈవార్త చక్రవర్తికి వేగుపంపినాను. నీ వా కుట్రను ఛేదించి ముక్కలు చేసినావు. సామ్రాజ్ఞి ఆనంద దేవి నిన్నెంతకొనియాడునో! ఆమెకు మంజుశ్రీ యనిన అంత ప్రేమ. మంజుశ్రీ నెచ్చట దాచినావు?”

“గురుదేవా! ఇది మీ ఆశీర్వచనము. మహాబలగోండుని సాహాయ్యము లేనిచో నేను కాలు కదల్చలేకపోయెడివాడను. హిమబిందు నిక్కడకు పదునొకండు గోరుతముల దూరముననున్న గ్రామమున నుంచినాను. అయిదువేలగోండు లా గ్రామమును కాపాడుచున్నారు. ఆ గుహలో దొరికినవారినందరిని చావగా మిగిలినవారిని బద్దులచేసి గోండువనమున పంపితిని. రాజకుమార శ్రీశ్రీ మంజుశ్రీని దాదులతో, బ్రాహ్మణులతో, బౌద్ధ సన్యాసులతో ఎనిమిదివేల గోండుల రక్షణమున హిమబిందున్న గ్రామమునకు రెండు గోరుతముల దూరమున వేరొక గ్రామమున నుంచితిని. నేను మూడు నాలుగు దినములకొకసారి అచ్చటికిపోయి, అన్నియు విచారించి రాజబాలకుని వినోదపరచి వచ్చుచుంటిని. నిన్ననే వారాబాలుని హిమబిందు ముక్తావళీదేవులకడకు కొనిపోయి యుందురు.

“మొదటినుండియు హిమబిందు ముక్తావళులకడనే యా ప్రభువును ఏల పెట్టితివి కాదు?”

“మొదట హిమబిందు ముక్తావళుల రక్షించి రక్షకులతో నా గ్రామము చేర్చినాను. పిమ్మట ఆ గుహను గోండుల సహాయమున పట్టు కొనగ నందు మంజుశ్రీ దొరికినాడు. ఆ బాలుని ఉజ్జయినీ ప్రాంతముల శ్రీప్రానదీతీరముననున్న స్థౌలతిష్యులవారి యాశ్రమమున పెంచుచుండిరట. శాతవాహన సేనాధిపతియగు సమవర్తి ఉజ్జయిని చేరినవెంటనే శత్రువులు మంజుశ్రీని గొనివచ్చి ఆ గుహలో నుంచినారట. ఆ బాలకు డెవరో హిమబిందునకు, ముక్తావళీ దేవికిని తెలియదట. ఆతని పెంచు బ్రాహ్మణి వలన నంతయు వింటిని. ఆమె చంద్రస్వామికి చెల్లెలట. మీరెరుగుదురు కాదూ ఆ చంద్రస్వామిని?”

“ఆ ఎరుగుదును. ఎంత అద్భుతమైన కుట్రచేసినారు! సరే, నీవు వెంటనే పోయి, నా ఆజ్ఞగా శ్రీకృష్ణసాతవాహన మహారాజునకు అంగరక్ష కాధిపత్యము వహింపుము. శుభవార్తలన్నియు ప్రభువుతో చెప్పుము.”

సువర్ణశ్రీ వెంటనే చుట్టుదారుల శ్రీకృష్ణసాతవాహనుని చేరబోయెను. శ్రీకృష్ణ సాతవాహనుని మహారాజును కలిసికొని వీరనమస్కారమిడి, సోమదత్తులవారి భూర్జపత్ర మందించెను. ప్రభువా పత్రము నామూలముగ చదువుకొని, సువర్ణశ్రీని ఏనుగుపై నెక్కించుకొని గాఢముగ కౌగిలించుకొనెను. “ఏమయ్యా, వృషభశకట పరీక్షయందు నీవే నెగ్గినావు. అన్నిట జయలక్ష్మి నిన్నే వరించుచున్నది. మా తమ్మునిగూడ రక్షించితివి. ఈ హారములన్నియు నీ మెడను వేయనీ. మా కుటుంబము నీ ఋణమునెట్లు తీర్చుకొనగలదు? జయ! ఆంధ్ర సామ్రాజ్య మహా మాండలికా! హిమబిందును రక్షించి మారాజ్య రమనే కాపాడితివి! మాకు అంగరక్షకాధిపతి వగుటయే కాదు, నిన్ను ఉపసైన్యాధ్యక్షునిగా నొనరించినాము. కాకుండకుల వారితో, సోమదత్తాచార్యులతో, వినీతమతి మండలేశ్వరులతో, అక్షఘ్నులతో, అఘబలులతో, చిత్రకులతో, జఘన్యులవారితో, సమవర్తితో సమానుడవైతివి. అఘబల ప్రభువును భరుకచ్చమున నుంచి వచ్చితిని. వారు లేనిలోటు నీవు తీర్చెదవుగాక!” అని శ్రీకృష్ణసాతవాహను డతిసంతోషమున నుడివెను. మహారాజు దంతావళమునుండి దిగి సువర్ణశ్రీ తనయశ్వము నధిరోహించి ఉప సైన్యాధ్యక్షచిహ్నమైన ఛత్రము, పతాకము ధరించు అంగరక్షకులు వెంటరా శ్రీకృష్ణసాతవాహనుని యనుమతిని సైన్యమును గురుడ ప్యూహముగా దీర్చి, మాళవుల దాకెను.

మాళవులు చక్రప్యూహారామమున ఉజ్జయిని చుట్టును ధట్టముగ గ్రమ్మి భేదవిధాన మవలంబించిరి. వారి సైన్యముల మొదటి శ్రేణిలో ఏనుగులు, వెనుక శ్రేణిలో ఏనుగుకు ఏనుగుకుమధ్య రథములు, ఆవెనుక అశ్వికులు, వారిని పొదివి వెనుకకు కాల్బలములు, వారివెనుక సర్వతోభద్రాదియంత్రముల దిబ్బలు, మహారథములు నుంచిరి. ఈ మహారథములు పదియోను ఇరువది హస్తముల ఎత్తున నుండును. ఆ వెనుక ఆశ్వికులు, కాల్బలములు ఆ వెనుక ఏనుగులు, మరల కాల్బలములు, యంత్రముల, దిబ్బలు, మహారథములు, ఆ వెనుక కాల్బలములు, ఏనుగులు, మహాశకటములు. (మహా శకటములన పెద్దదూలములు. వానికి చక్రము లుండును. ఆ శకటము తోసుకొనిపోయి గోడలు, తలుపులు బద్దలుకొట్టుదురు.)

ఈ చక్రవ్యూహము పది గోరుతములమంద మున్నది. ఆ మందమున ఛురికవలె సోమదత్తుని సైన్యములు చొచ్చుకొనిపోవుచున్నవి. చక్రవ్యూహమటు ముక్కలు గానే ఇటు శ్రీకృష్ణసాతవాహనుని సైన్యముపై మాళవ సైన్యములు విరుచుకుపడినవి. ఆ మహాసంగ్రామ మభిసం పాతము గాక ఆహుయమై, సమితియై పోయినది.

ఒక్కసారిగా శ్రీకృష్ణసాతవాహనుపై పలువురు యోధు లురికిరి. ఆంధ్ర సైనికులు, యోధులు, వీరవరులు తమ వ్యూహమును వదలరు. వారి క్రమశిక్షణ లోకప్రసిద్ధము. వారు చెక్కుచెదరరు.

పలువురు యోధు లిట్లు కలిసి, మహారాజు పై బాణములు పుంఖాను పుంఖములుగా బరపిరి. అంగరక్షకులు నిలిచి పోరుచు ప్రాణములు వదలి పడిపోవు చుండిరి. అప్పుడంగరక్షకాధిపతియైన సువర్ణశ్రీ విరోధులందరకు నెచట జూచిన నచట దానే ప్రత్యక్షమగుచు, ఎడమచేతి భల్లమున పొడుచుచు, కుడిచేతి కత్తితో నరకుచు, తన కవచము తూంట్లుపడి గాయము లగుటకూడ గణింపక రక్తసిక్తాంగుడై మహారాజు గజమును రక్షించుచుండెను. అతని వెన్నంటి అంగరక్షక సైన్యము మహావిక్రమము చూపుచున్నది. మహారాజు చెవికంటలాగి వేసిన ఒక్కొక్కబాణము ఒక్కొక్క వీరుని ప్రాణము గొనుచున్నది.

అప్పుడొక మహాగజముపై నెక్కి శివస్వాతి స్వయముగ చక్రవర్తి ఏనుగును తలపడినాడు. ఆ ఏనుగులు రెంటికి మహాయుద్ధ మావహిల్లినది. తొండముల దాల్చిన మహాగదలతో తాడించుకొన్నవి. భయంకరదంతముల పొడుచుకొన్నవి. కుంభమును కుంభముతో తాకి, తొండములు పెనవైచుకొని మహాయుద్ధ మొనరించుచుండ ఆంధ్ర సైన్యముల హాహాకారము లుప్పతిల్లినవి.

కళింగసైన్యముల జయజయ ధ్వానములు మిన్ను ముట్టినవి. సువర్ణశ్రీ మొదలగు అంగరక్షకులు, సేనాపతులు, వీరులు దూరముగ నిలిచి చూచుచుండిరి. ఇంతలో అందరు వలదనుచున్నను సువర్ణశ్రీ, యంతట తన పరశు వెత్తి గుఱ్ఱమును ముందుకు దుమికించి, చిత్రగతుల శివస్వాతి మహా గజముకడకు పోయి, తన అశ్వమునకు హానిజరుగకుండ నడుపుచు, ఆ గజమును పార్శ్వమునందు తాకినాడు. అతని హుంకారపూరిత గాఢపాతముల నా గజకవచము బ్రద్దలై ఆ ఏనుగు పార్శ్వమునందు భయంకరమగు గాయమై రక్తము మహాప్రస్రవణమై ప్రవహించినది. ఏనుగు గాసిచెంది, వెనుకకు తిరిగి సువర్ణశ్రీని కదియుటయు, సువర్ణశ్రీ యందులకు సిద్ధముగ నుండుటచే ఒక్క మహాప్లుతమున తనబలమును కలిపినాడు. శ్రీకృష్ణుని గజము శివస్వాతి దంతావళమును క్రింద కూల్చినది. ఆంధ్రులు ఆకాశమంట జయజయధ్వానములు చేసిరి.

అది మొదలు ఆంధ్ర సైన్యములు రెండును ఒకజాములో ఒకటి నొకటి కలిసికొన్నవి. సమవర్తి, వినీతమతి, శుకబాణుడు నగరమునుండి తమ సైన్యములతో వచ్చి తాకిరి. మాళవ సైన్యములు పంచబంగాళమై పరుగువారుట ప్రారంభించినవి. రాత్రి మొదటి యామమునకు శత్రువులు ఒక లక్ష హతమారిరి. తక్కినవారు పారిపోయిరి. వేలకువేలు ఆంధ్ర సైన్యముల శరణుజొచ్చిరి. ఉజ్జయిని శత్రునిర్ముక్తమైనది. 

23. శుభవార్త

పాటలీపుత్రమును ముట్టడించి విజృంభించుచున్న చక్రవర్తికి, చారుగుప్తునకు సువర్ణశ్రీ కుమారుడు హిమబిందు మంజుశ్రీ ముక్తావళీ దేవుల రక్షించెననియు, నచ్చటనుండి పదివేల గోండులతో ఉజ్జయినీ పురమును జేరి మాళవులను నాశనముచేయుచు, నగరములోని ఆంధ్రసైన్యములఒత్తిడి తగ్గించినాడనియు, సోమదత్తాచార్యులు తన సేనలతో వెళ్ళి ఉజ్జయినికడ మాళవుల తలపడినాడనియు వార్తలు వచ్చినవి.

చారుగుప్తుని ఆనందము వర్ణనాతీతమైనది. ఆ వార్త తెచ్చిన చారునికి పదివేల సువర్ణములు బహుమాన మిచ్చెను. ఒక్కొక్క సైనికునకు, మావటీనికి మూడేసి సువర్ణము లీయ నేర్పాటులు గావించెను. బుద్ధగయా క్షేత్రమునకు లక్ష సువర్ణములు దానము పంపెను. బౌద్ధ సంఘారామములకు నెలదినముల గ్రాసములు అర్పింప నేర్పాటులు చేసెను. బ్రాహ్మణులకు గోదానాదికములు వేలకొలది చేసెను.

శ్రీముఖసాతవాహన, ఆనందరాణుల ఆనందము వర్ణనాతీతము. మంజుశ్రీ దొరకినాడను ఆనందమున, అమృతమందాకినియై మహారాణి వార్త తెచ్చిన చారునికి నిలువు దోపిచ్చినది. అంతఃపురపరిజనులకు దుకూలములు, ఆభరణములు పంచి పెట్టించెను. బౌద్ధ భిక్షువులకు, బ్రాహ్మణులకు చక్రవర్తి పాటలీపుత్ర పరిసరముల నున్నంతకాలము సంతర్పణలు, సమారాధనలు జరుపవలయునని ఆజ్ఞయైనది. విజయానంతరము జరుగు మహోత్సవములకన్న నధికముగ ఆంధ్ర సైన్యముల ఉత్సవములు జరిగినవి. మంజుశ్రీకి బంధనవిముక్తి నొనరించిన మహావ్యక్తి సువర్ణశ్రీయని తెలియగనే చక్రవర్తి ధర్మనందికి వార్తపంపి, తనమందిరమునకు రప్పించుకొని యాతని కౌగిలించు కొనెను.

“ధర్మనందులవారూ! మీ పుత్రుడొనరించిన యుపకృతి మా జన్మము నందెప్పుడును మరచిపోము. శకటపరీక్షయందు జయమందిననాడె యాతడు మహాపురుషుడని మే మూహించితిమి.”

“ప్రభూ! తమకరుణ ఇది. మావాడు వీరబలగోండుమహారాజు తనయుడైన మహా బలగోండుని సహాయమున రాజకుమారులను, సౌభాగ్యవతి హిమబిందును, మహాభాగుడగు కీర్తిగుప్తులవారి పత్ని ముక్తావళీ దేవిని విడిపించినాడు. గోండుల సహాయమే సర్వము సాధించినది.”

“ఓహో! మంచివాడవయ్యా ధర్మనందీ! కుమారుని పరాక్రమము కప్పిపెట్టుకొను చుంటివి. పోనిమ్ము. గోండులు మనకు స్నేహితులని హిమబిందును వెతుకపోయిన మనసేనాపతుల కేల తోచలేదు? గోండుల సహాయముతో మీ చిరంజీవి మాళవుల చికాకు పరచుచున్న విధాన మప్రతిమాన మని శుకబాణులవారి కమ్మలో నున్నది. రావయ్యా, మనము చారుగుప్తుల వారికడకు పోవుదము” అని సింహాసనమునుండి లేచెను.

ఇంతలో “రోజుచువచ్చిన చారు డొకడును, వానివెంట సేనాపతి యొకడును ద్వారమున వేచియున్నా” రని ప్రతీహారిణి యోర్తు జయధ్వానము పలికి, నమస్కరించి విన్నవించినది. సార్వభౌముడు త్వరితముగ నా చారుని కొనిరమ్మని ఆజ్ఞనిచ్చి మరల సింహాసన మధివసించెను. ధర్మనందియు తన యాసనముపై కూర్చుండెను.

చారుడును, సేనాపతియు లోనికి వచ్చి సార్వభౌమునకు, ధర్మనందికిని వీర నమస్కారము లిడిరి. చారు డప్పుడు తన శిరస్త్రాణమున దాచియుంచిన భూర్జ పత్రమును సార్వభౌమునకు మోకరించి యర్పించెను. సార్వభౌముడా లేఖను విప్పిచూచి, “శుభము! శుభ”మని కేకవేసి, ముద్రాంకితము చూచి, “ధర్మనందీ! మా కుమారుడు శ్రీకృష్ణసాతవాహన మహారాజు వ్రాసిన లేఖయిది. దీనిని చదువుడు” అని ధర్మనంది చేతికిచ్చెను. సేనాపతిని కూర్చుండుడని యాజ్ఞ నిచ్చును, చారుని తనకడకు రమ్మని తన కంఠముక్తావళినితీసి “నీవు తెచ్చిన శుభవార్తకిది మా బహుమాన” మని వాని కొసంగెను.

ధర్మనంది యిట్లు చదివెను.

“మహాసాతవాహన వంశభానులు, శ్రీశ్రీశ్రీ సాతవాహన సార్వ భౌములగు పితృపాదుల పాదారవిందములకు ప్రణమిల్లి, కుమారుడు శ్రీకృష్ణుడు మనవి చేసుకొను చున్నాడు. ప్రభూ! ఉజ్జయిని ముట్టడి అంత మొందినది. మాళవపతి శూర సేనపతులు పారిపోయిరి. శత్రు సైన్యములో మూడవవంతు నాశనమైనది. ఒకవంతు మాచే పట్టుబడినది. ఒక వంతు పారిపోయినది.

ఈ యుద్ధ విజయమునకు మొదటి కారణము శిల్ప చక్రవర్తియగు ధర్మనందులవారి తనయుడు సువర్ణశ్రీ. మహామండలేశ్వరుడు, ఉప సైన్యాధ్యక్షుడు నగు ఆ కుమారుడే నా ప్రాణములు రక్షించినాడు. ఆతడే తమ్ములు మంజుశ్రీని రక్షించినట్లు శ్రీ సోమదత్తాచార్యులు తమకు మనవి పంపియున్నారు. శ్రీ చారుగుప్తులవారికుమార్తె శ్రీ హిమబిందుదేవిని, వారిముత్తవ శ్రీముక్తావళీ దేవిని రక్షించినవిధానము చిన్నతనమున మేము విన్న నరవాహనదత్త విద్యాధర చక్రవర్తి కథను జ్ఞప్తికి తెచ్చును. తదనంతరమున మహాబల గోండు కుమారప్రభువు సహాయముతో నర్మదా నదీకూలమున నున్న రహస్య కందరాంతర ప్రదేశమును పట్టుకొనినారు.

“సువర్ణశ్రీ కుమారవీరులు శ్రీ హిమబిందుదేవిని, శ్రీముక్తావళీ దేవిని ప్రప్రథమమున రక్షించిన దా గుహనుండియే! ఆగుహ మనవారల కై వసమగుటతోడనే మాతమ్ములు మంజుశ్రీ ప్రభు వందు దొరికినాడు. మా అనుంగుతమ్ములు క్షేమము. శ్రీ అమ్మగారిని, శ్రీ నాన్నగారిని ఎప్పుడు చూచుట అని తొందర చేయుచున్నారు. తమ్ముల నెత్తుకవచ్చిన విరోధులు ఇన్ని సంవత్సరములు మహాప్రభువువలెనే పెంచినారు. తమ్ములను దాచి యుంచిన గుహ సుందర పాతాళమందిరమువలె నుండునట. ఆ మందిరము వేయిసంవత్సరములు వెదకినను ఏరును కనిపెట్టలేరట! అట్టిది సువర్ణశ్రీ కుమారులు కనిపెట్టినారు. నిన్నటి యుద్ధమున నేనధివసించిన దంతావళము విరోధిగజముచే పరాజయమంది, నాశనమంద సిద్ధముగానున్న సమయమున, అదివరకే గాయము లంది అఖండ విక్రమము చూపుచు, సంశప్తక సమరము నాటి యర్జునునివలె విజృభించియున్న సువర్ణశ్రీ విరోధి ఏనుగుపై గవిసి భల్లముచే దానిమీను గాడునట్లు నాటెను. నా గజమప్పు డా దంతావళమును గూల్చినది సువర్ణశ్రీ కుమారు డట్లొనర్పక పోయినచో నేమయ్యెడి దోయని తలంచుకొన్నచో నొడలు జలదరించుచున్నది. సువర్ణశ్రీ కుమారుల నేనెంత పొగడినను చాలదు. ఆయనకు గాయములు చాలా తగిలినవి. కాని మొప్ప మేమియు లేదు. గోండు లావీరునికి వైద్యము చేయుచున్నారు. శ్రీ హిమబిందు కుమారి సర్వోపచారములు చేయుచున్నది. తమ్ములు నిన్నటివరకు వారితో నుండిరి. ఇప్పుడు నాకడనున్నారు. స్థౌలతిష్యులవారు తమ్ములకు పండితులచే విద్యలు గరపించుచుండిరట. రాజద్రోహనేరములకు పాల్పడి, ఇప్పుడు శ్రీశ్రీ అమృతపాదార్హతుల కడనున్న చంద్రస్వామి గారి చెల్లెలును, బావమరదియు తమ్ములకు పోషకులు. వారెన్నియో రహస్యములు మాకు నివేదించినారు. అవన్నియు తమ సమక్షముననే! వినీతమతుల మాళవ ప్రభు నొనరింప తమకు నామనవి. సమవర్తి సాతవాహన ప్రభుని విదేహరాజ్యమునకు మహామండలేశ్వరుల నొనరింపను విన్నవించుచున్నాను. వినీతమతి నిచ్చట నేబదివేల సైన్యముతోనిలిపి, మేమందరము తమపాదసన్నిధికి రేపటి దినమున బయలు దేరుచున్నాము. శుభవర్తమానములు శ్రీ చారుగుప్తులవారికి, శ్రీధర్మనందులవారికి అందజేయ దేవరవానిని వేడుకొను పాదసేవకుడు కుమారుడు ఆనందపుత్ర శ్రీకృష్ణసాతవాహనుడు.”

ఈ ఉత్తరము చదువుచున్నప్పుడే ధర్మనంది డగ్గుత్తికపడెను. ఆతని కన్నుల నీరు తిరిగినది. సార్వభౌముడులేచి తనతో లేచిన ధర్మనందిని గాఢముగా కౌగిలించెను. “శిల్పి సార్వభౌమా! మీవంశమునకు సర్వదా మా వంశము కృతజ్ఞము. మా పుత్రులిర్వురను మాకు తిరిగి ఇచ్చిన మీ పుత్రునికి తిరిగి మే మేమి ఈయగలము? ఈ పాటలీపుత్రమున నాతడు మా ప్రతినిధి యగుగాక!” యని ఉచ్చైస్వరమున బలికెను.

ధర్మనందియు ఆ శుభవర్తమానము కొనితెచ్చిన చారునికి తన కంఠహారము బహుమాన మిడెను. చక్రవర్తి ఈ వార్త తెచ్చిన సేనాపతిని ఉప సైన్యాధ్యక్షునిగ నొనరించి తన ప్రక్కనున్న రవ్వల ఒరగలిగిన ఛురికను బహుమాన మిచ్చెను. ఆ చారుడు యాదార్హ వర్ణనాయకుడైనాడు. ధర్మనంది తథాగతుని ప్రార్థింపుచు ఆ

రాత్రి గడపెను. 

24. స్వప్నము

“మహాప్రభూ! నా కొమరిత హిమబిందును, యువరాజశ్రీ శ్రీ శ్రీకృష్ణ సాతవాహన మహారాజునకు కళత్రముగ నర్పింప నేను ప్రభువుల ననుజ్ఞ వేడుటయు తా మందుకు సంతోషముగా నియ్యకొనిరి. శ్రీశ్రీశ్రీ ఆనందదేవి మహారాణివారును శుభ మనినారు. ఈ విషయము శ్రీశ్రీశ్రీ యువరాజులవారికి తెలియ నంపుటకు తమకడకు వచ్చి యున్నాను” అని చారుగుప్తుడు విన్నవించెను.

“వర్తకచక్రవర్తీ! శుభము. యువరాజును, శ్రీ చిరంజీవి సౌభాగ్యవతి హిమబిందు కుమారియు ఉజ్జయినికడ కలిసికొనిరిగాన అచ్చటికే యీ శుభవార్త పంపినచో మన సంకల్ప మీడేరుటు సుకర మగును.”

“ప్రభూ! తాము నా హృదయమును గ్రహించినారు.”

“మంచిది! కాని తమ పుత్రిక ఈ విషయ మెరుగునా?”

“ఎరుగును మహాప్రభూ! నేను ఈ జైత్రయాత్రకు బయలుదేరక పూర్వమే అమ్మాయికి తెలియజేసితిని. ఆమె ఆనందమందినది. ఇట్టి భర్త లభింపనుండ ఉప్పొంగక యుండు కన్య యుండునా!”

“మీ తనయ అపురూపసుందరి యనియు, సకలగుణాభిరామ యనియు, సర్వశాస్త్ర పారంగత యనియు వింటిమి. ఈ యేటి శకటపరీక్షా మహోత్సవమున నాట్యమాడిన బాలలలో నామె యొకరిత కాదూ?”

“చిత్తము. చిత్తము.”

“సంతోషము. ఆమె గగనమునుండి దిగివచ్చినట్లున్నది. అట్టి బాలిక మహారాణి యగుటచే ఆంధ్రదేశము, మా పెద్దకోడలగుటవలన మా కులముగూడ తరించును.”

చారుగుప్తుడు వెంటనే వ్రాయసకానిచే చక్రవర్తి శ్రీకృష్ణసాత వాహనున కీ శుభవార్త నందజేయునట్లు కమ్మను భూర్జపత్రముపై వ్రాయించి, అది సామ్రాట్టుకడకు పర్యవేక్షణకై పంపినాడు. చక్రవర్తియు నది చదివికొని శ్రీశ్రీశ్రీ కౌశికీపుత్ర శ్రీముఖనామాంకిత ముద్రవేయించి, నమ్మిన చారులచే వెంటనే యా శుభలేఖ నంపించవలసినదిగ ముఖ్య మంత్రికి బంపెను.

చారుగుప్తుడు చిరతరమగు తనకోరిక ఈడేరు సమయ మరుదెంచెనని ఆనంచమున మిన్నంటెను. ఈ సువర్ణశ్రీగాక, శ్రీకృష్ణసాతవాహనులే రక్షించియుండవలసినది తన బాలికను. బాలికల హృదయము మైనము వంటిది. ఒక్కొక్క సమయములో బాలిక యొకనిజూచి మరులు గొనవచ్చును. అది ఆమె హృదయమున నెలకొన్నచో మఱి మరల్ప జాలము. తన బాలిక శ్రీకృష్ణసాతవాహనుని చూచెను. ఆతడు మహా వీరుడు, పరమ సుందరుడు, భావిచక్రవర్తి. తన కోరిక బిడ్డకు దెలిపియే యున్నాడు. పెద్దలమాట జవదాటి ఎరుగని ఆ సుశీల ఈపాటికి తన హృదయమంతయు యువరాజున కర్పించియుండును.

స్థౌలతిష్యులవారు శ్రీ ముక్తావళీ దేవినికూడా తస్కరించి కొని పోవుట మేలయినది. మామగారగు కీర్తి గుప్తులవారు, తన తండ్రిగారును తన అత్తగారును ఆలోచించికదా, ఈ మహాసంకల్పము పూనినది. ఆమె తన మనుమరాలిని వెయికన్నుల కాపాడుచుండును. హిమబిందును ఎత్తు కొని పోవుటయు మంచిదేయైనది. ఉజ్జయిని నగరముననే ఆ బాలిక విజయరమాస్వయంవృతుడగు యువరాజును చూచును. ఆతడును అతి లోకసుందరి యగు తన బాలికను చూచును. చక్రవర్తి శుభవర్తమాన మందగనె, శ్రీకృష్ణుని మనస్సు హిమబిందుపై సంపూర్ణముగ లగ్నమగును. వారిరువురును కలసి పాటలీపుత్రము వరకు ప్రయాణము చేయుటయు ఈ కార్యమున కానుకూల్యము సంపాదించును.

పాటలీ పుత్రము తమవశమగుటతోడనే జరుగు సకలజంబూద్వీప పట్టాభిషేకోత్సవ సందర్భమున తన తనయకు, శ్రీకృష్ణసాతవాహన మహారాజునకును ప్రధానమంగళము జరుగగలదు. ఆ యుత్సవము లోకోత్తర మగుగాక!

చారుగుప్తుని పరిచారకు డొకడు లోనికి జనుదెంచి “స్వామీ! తమ్ముచూడ అమృత పాదార్హతులు చంద్రస్వామిద్వితీయులై వచ్చుచున్నా” రని విన్నవించెను.

తోడనే చారుగుప్తుడు ఆసనమునుండి లేచి, ద్వారముకడకు వేగముగబోయి ద్వారమును సమీపించిన అమృతపాదార్హతుల పదములకెరగెను. లేచి చంద్రస్వామికి నమస్కరించెను.

అమృతపాదార్హతులు “బుద్ధ! బుద్ద!” యని యాశీర్వదించిరి. చంద్రస్వామి “దీర్ఘాయుష్మాన్ భవ. సంకల్పసిద్ధి రస్తు” అని ఆశీర్వదించెను. వారందరు లోనికి బోయిరి.

చారుగుప్తుడు: దేశికులు ఈ శిష్యుని అనుగ్రహింప విచ్చేసినారు.

అమృతపాదార్హతులు: వణిక్సార్వభౌమా! ఈ ప్రత్యూషమునందు నా కెన్నడురాని స్వప్నమొకటి వచ్చినది. మీరు వేగమున నొక మహా నగరమునకు బోవుచుంటిరి. మీహస్తముల పూలునిండిన పూర్ణకలశ మున్నది. అట్లు పోవుచున్న మీకు నే నెదురైతినట. నాహస్తమున శ్వేతపన్నగి యోర్తున్నదట. తమ్మా పన్నగము చూచుటతోడనే కన్నులు కెంపులుగ్రమ్మ బుసకొట్టుచు నాచేతినుండి జారి ఎదుట ఆడుచు నిలిచినదట. నేను భయము లేదనుచున్నను మీరు వెనుకకు తిరిగినారట. మీ హస్తములనున్న పూర్ణ కుంభమును ఒక మహాగరుడుడు వేగముగ పర తెంచి వచ్చి కాలదన్నుకొని పోయెనట. నాకు వెంటనే మెలకువ వచ్చినది. నేను చంద్రస్వామి పండితుల ఆ స్వప్న భావము నడిగితిని. వా రనునది నా కెంతయు నాశ్చర్యము గొల్పుచున్నది.

చారు: వారేమనినారు స్వామీ?

అమృత: వారే వచియింతురుగాక!

చంద్రస్వామి: చారుగుప్తులవారూ! నాకు శ్రీభగవానుని స్వప్నము విచారింప నొక్క విషయము తోచినది. కాని స్వప్నములు నిజమగునా?

అమృత: అటు లనకుడు! స్వప్నములు రానేరావు. వచ్చిన వాని కేదియో పరమార్థముండును. అనారోగ్య కారణమున వచ్చు కలలకు అర్థముండకపోవచ్చుగాక! కొందరు ఆయుర్వేదపండితులు ఆ స్వప్నముల ననుసరించి రోగమేదియో స్పష్టముగ తెలియవచ్చు నందురు.

చారు: పండితులవారూ! తమ భావము తెలియజేయుడు.

చంద్ర: చిత్తము. మీరు మహాసంకల్ప మొకటి పూనినారు. ఆ సంకల్పము వేరుదారిని పోవును. అట్లుపోవుటకు కారణము శ్రీశ్రీ భగవానులే. భగవాను లనుటకన్న వారినుండి వెడలిన ఒక విచిత్రసంఘటన కారణమగును. కావున నది శుభాంతము కాకతీరదు. చారుగుప్తునకు ముచ్చెమటలుపోసినవి. నోట తడియారెను. గుండె దడదడ కొట్టుకొనెను. అమృతపాదార్హతులు చారుగుప్తుని తీక్షణముగ నొక నిమేష మాత్రము చూచి, నవ్వుచు “ఏమండీ చారుగుప్తులవారూ! ఈ మాటలకే ఇంత భయపడుచున్నారా? స్వప్నములకు ధీరులు భయపడరు. భయపడవలసినది మనలోని కల్మషములకు కదా! మనయత్నములు ఫలింపక అన్యథా యైనంతమాత్రమున మానవుడు వ్యధలపాలు కావలసినదేనా? సర్వము శుభమునకే” యని అనునయించెను.

చారుగుప్తుడు లేని ధైర్యము మోమున ప్రతిఫలింపజేసికొని, చిరునవ్వు నవ్వుచు, అమృతపాదార్హతులకు నమస్కరించి, “భగవానులవారీ శిష్యుని క్షమింతురుగాక! అందరము ప్రపంచము శాశ్వతమనుకొని కార్యముల నొనరింతుము. ఆ కార్యము భగ్నమైనచో వ్యాకులమొందుదుము. దుఃఖములకు వెరచు స్వభావము నాకు లేదు. ఒక విషమఘటన నాహృదయమును వ్రక్కలుచేసినది. ఆ విచారమును నా కన్నతల్లి హిమబిందును పెంచుకొనుటలో మరచిపోతిని. బిడ్డకు ఏమైన ఆపద వాటిల్లిన నా బ్రతుకు హుళక్కి!”

చంద్రస్వామి చారుగుప్తుని చూచి “వర్తకచక్రవర్తీ! నీతనయ కేమియు హాని రాదు. ఆమె మహదానందము నందును. ఆమె ప్రపంచ పూజ్యత నందును. ఆమెయు ఆమెభర్తయు లోకకళ్యాణ రూపు లగుదురు. ఆమె భర్త ఎవరగుదురో ఆ వ్యక్తిని నేను తెలియజేయలేనుగాని, ఈ కాలమునకు ముహూర్తము కట్టిచూచితిని. ఆమె భర్త ధిగంత యశోవిశాలుడగును. మహావిక్రముడు, శుద్ధసత్వరూపుడు, మనోవాక్కాయ బుద్ధ్యహంకారముల నాతని ప్రేమించి నీ బాలిక పెండ్లియాడును” అని మోము పరమతేజస్సున వెలుంగ దివ్యవాక్కులు పలికినాడు.

అమృత: వర్తక చక్రవర్తీ! నీతనయ ఆనందముకన్న నీకు గావలసిన దేమి?

చారు: నిజము భగవాన్, నా తనయ ఆనందమే నాయానందము. 

25. ఎవరు మహారాణి కావలసినది?

ఉజ్జయిని శత్రువిముక్తమైన పదునైదు రోజులకు శ్రీముఖసాతవాహనుని లేఖ శ్రీకృష్ణసాతవాహనునకు అందినది. ఆ లేఖ చదువుకొనుట తోడనే యత్యాశ్చర్యమంది యువరాజు తనమందిరమున గూర్చుండలేక పోయినాడు.

“మా కుమారులు చిరంజీవులు యువరాజు శ్రీకృష్ణసాతవాహన మహారాజును ఆశీర్వదించి వ్రాయునది. తండ్రీ! మీ విజయమునకు మే మెంతయు సంతసించితిమి. ఇచ్చట మహోత్సవము లెన్నియేని జరుగు చున్నవి. అన్నిటికన్న ముఖ్యమగు సంతోష వార్త చారుగుప్తుని తనయను శత్రువుల బారినుండి రక్షించుట. ఆ బాలికతోపాటు శ్రీ ముక్తావళీ దేవిగారును రక్షింపబడుట. మీ తమ్ముడు చిరంజీవి శ్రీ మంజుశ్రీ కుమారుడు కందరమున దొరకుట అద్భుతవిషయము. మీ తల్లి యానందముచే మైమరచి పోయినది. మాకును అత్యానందము కలిగినది.

“చారుగుప్తుల వారిని మీ రెరిగియేయుందురు. భూమికి అదిశేషు వాధారమైనట్లు సాతవాహనవంశమునకు చారుగుప్తుల వారాధారులు. అన్ని విధముల వారు మన వంశమునకు అతి సన్నిహితులైనారు. వారికి ఒకర్త తనయ. ఆమెయే కదా హిమబిందు కుమారి! ఆ బాలిక మహాలక్ష్మి. ప్రజ్ఞా పరిమితాదేవి అవతారము. సౌందర్యమున ఆమె కెవరు దీటురాగలరు? అన్నిట ఆమె కామెయే సాటి. సాతవాహనవంశమునకు కీర్తిని, తేజస్సును కొనిరాగలిగిన ఆ బాలికను మీకు దేవేరిగా సమర్పింప చారుగుప్తుల వారు మా అనుజ్ఞ వేడినారు. మేమును మీ తల్లిగారును తక్షణ మంగీకరించితిమి. అట్టి సుగుణరాశిని, అతిలోకసుందరిని భావిసామ్రాజ్ఞిగా బడయ గలుగుట మహాభాగ్యము. కుమారా! మిమ్మల నందర త్వరలో కలుసు కొన కుతూహలము నందుచున్నాము. ఇట్లు శ్రీశ్రీశ్రీ కౌశికీపుత్ర శ్రీముఖ నామాంకితము.”

ఈ కమ్మ శ్రీకృష్ణసాతవాహనుని సంపూర్ణముగ కలంచినది. తానా హిమబిందు కుమారిని సువర్ణశ్రీ శకటవిజయ మందిన దినమున చూచినాడు. ఆమె అద్భుత సౌందర్యవతి యనిన మాట నిజము. కాని ఆ సౌందర్యము, తన కాశ్చర్యము మాత్రము కలిగించినది. ఆమెయందు యవనసౌందర్యము ఆంధ్ర సౌందర్యము మధురముగ మిశ్రమ మందినవి. కాని ఆమెను తానానాడు చూచినప్పుడు తనలోని రసార్చనయైన పులకరింపలేదు. ఆమె నొక దేవీ విగ్రహముగ జూచు భావమైన తనకు కలుగలేదు. మహాశిల్పి విన్యస్తమగు చైత్యాలంకార శిల్పముగ మాత్ర మామె తనకు ప్రత్యక్షమైనది. తాను అనేకులగు ప్రభుకుమారులవలె కామోపభోగములు వాంఛింపలేదు. తన ఆత్మేశ్వరి దివ్యదర్శన మగునంతవరకు తనలో ప్రణయభావ మంకు రింపనే లేదు.

ఆ బాలిక, ఎవరామె? ఆమె విషకన్యయా? అమృతకన్యయా?

“ఓ దేవి! మహోజ్వలమూర్తీ! నీవు నా కీ జన్మమున ప్రత్యక్షము కాక యున్నచో నే నీ యుద్ధమున ఏ శివస్వాతిబాణముననో ప్రాణములు వదలి యుందును. ఓ దివ్యసుందరగాత్రీ! ఓ పరమ వనితావతారమా! ఇన్నాళ్ళు నీవు దాగియున్నది. నా కొరకేనా? నిన్ను నాపై ప్రయోగించుట నా అమరత్వమునకే! నాకు నీ దర్శనమే కాకయుండినచో ఆంధ్ర సామ్రాజ్యమునకును నాకును సంబంధమే లేకయుండును!”

అని తనలో తాను మాట్లాడుచు విషవైద్యుని పిలువనంపెను. ఆ విషవైద్యుడు మహారాజుపాలిటికి బోధిసత్వుడే! శ్రీకృష్ణుడు ఉజ్జయినిలో తాను నివసించు, మహారాజ భవనమున కనతిదూరమున ఆ ధన్వంతరికి విడిది సమకూర్చెను. ఆ ధన్వంతరి భవనము నంటియే అంతఃపుర మొకటి యున్నది. అందు విషబాల నివాసము.

విషబాల సౌందర్య మిప్పుడు వర్ణనాతీతము. మధురపరిమళపూరిత హిమవాలుకా రూపమందిన సౌదామని వంటి ఆ బాల, విషరహితదివ్య పన్నగియై ఆ బాల నిష్కంటక కేతకీపుష్పమై తనచేతి కందు టెన్నడో!

కాని ఆమెలో విషము లింకను తగ్గలేదు. ఆమెకడకు వెళ్ళిన ప్రాణి కొలదికాలములో నశించును. ఆమె నంటిన ప్రాణి అందర్థకాలమున నశించును. ఆమెచే లాలింపబడిన శుక శారికా హరిణాది ప్రాణులు వెంటనే ప్రాణములు గోల్పోవును.

శ్రీకృష్ణుడు విషవైద్యునితో - “స్వామీ! ఆచంద్రబాలాదేవిని దర్శించి మూడుదినము లయినది. ఈ దిన మాదేవిని దర్శించి తీరవలయును.”

“ప్రభూ! ఏడుదినము లోపిక పట్టుడు.” “నిజమేకాని ఈలోపల అత్యవసరవిషయ మొకటి వచ్చినది. నే నా దేవిని చూడక తీరదు. మీ విద్యయంతయు ప్రదర్శించు సమయ మరుదెంచినది స్వామీ!”

“చిత్తము. అటులయిన నాకొకజాము వ్యవధి దయచేయవలెను. దివ్య ఓషధులు వారిచే సేవింపజేయవలయును. నేను దినదినము తమకిడు ఔషధములేగాక ఇంకను మూడురకముల చూర్ణములు అమృతఫలసురచే సేవింపచేయవలయు. వత్సాదని, సోమవల్లి, నిర్గుండి, శ్వేతసురస, మధూలికా, కర్పూరశిలాజిత్తు, ఇంకను హిమ పర్వతోద్భవములగు తొమ్మిదిమూలికలతోడను రచించిన మహౌషధమును తమ కర్పింప వలయును. అటువెనుక దివ్యలేపము తమఒడలికి అలందవలయును. ఇంత తతంగమైనగాని తామా బాలికను సందర్శింపకూడదు. తమకు ఏడు దినముల కొకసారి ఇచ్చు ఔషధములు, దేహలేపములు ఇప్పుడు చాలవు.”

“మంచిది స్వామీ! అవి యన్నియు చేయుడు.”

ఈ తతంగములన్నియు నెరవేరిన వెనుక, జామున్నర ప్రొద్దెక్కిన తరువాత శ్రీకృష్ణసాతవాహనుడు విషకన్యను చూడబోయెను. ఆతని హృదయము కొట్టుకొను చుండెను. ఆతని కేదియో వివశత్వము. ఆతని కెదియో మహామధుర పరీమళస్పర్శ.

ఆతడా బాలికను చూడబోవునప్పుడెల్ల ఈ దివ్యానుభూతి కలుగును. ఆ అరణ్యమున నా బాలిక తనకు పెన్నిధివలె దొరికినదని యువరాజు భావించినాడు. ఎన్నినాళ్ళు తానీ పవిత్రఫలమునకై ఆవేదనపడిన నాకు! ఈ బాలిక విషకన్యక యగుటయే తన తపఃఫలమా? ఈ బాలకై తా నింతకాలము ఎదురుచూచినది ఆ హిమబిందు నుద్వాహమాడుటకేనా? ఇప్పటికి రెండు మూడు తరములనుండి సాతవాహను లేకపత్నీవ్రతులై లోకారాధన మొనరించిరి. తనకుమాత్ర మిరువురు భార్య లేల?

ఆ విషకన్య దొరికిననాటినుండియు నీ యుద్ధయాత్రలో దన వెంటనే యున్నది. ఆమె శిబిరములు వేరు. పాములవారిని, విషవైద్యులను, ముగ్గురు నలుగురు పనికత్తెలను ఆమె సేవకై నియమించిరి. వారికిని విరుగుడు ఔషధముల సేవ సర్వకాలముల నుండవలయును. ఒక్కొక్క సేవకురాలు ఏడుదినముల కన్న ఆ విషకన్య కడ ఎక్కువకాలము సేవయందుండరాదు. సేవచేసి వచ్చిన సేవకురాలు రెండునెలలు వైద్య మొనరించు కొనవలెను. అందుకనియే విషవైద్యులు విషకన్యక కడ ముగ్గురికన్న ఒక్కొక్కసారి ఎక్కువ పరిజనులుండకుండ కట్టుదిట్టముచేసిరి.

వారందరు పాములవారి స్త్రీలే. అటులు వంతులుగా సేవచేయు వనితలు నలుబదిమంది ఏర్పాటు కావింపబడిరి. వారందరికి శుభ్రవస్త్రములు, ఆభరణములు ఒసగబడినవి. వారికి నాగరికత అలవరింపజేసినారు. ఒక మహారాజకుమారికడ నుండ ప్రతీ హారిణులవలె, చెలువులవలె వారప్రమత్తులై చరించుట నభ్యసించిరి.

విషకన్యకాంతికమున పనిచేయువారుగాక తక్కినవా రందరు, ఆ భవనమునందు వేరువేరు పనులు చేయవలెను. విషకన్యకకు వంటచేయుటకు ఒక బ్రాహ్మణ కుటుంబము నుంచిరి.

ఆనాడు శ్రీ కృష్ణసాతవాహనుడు విషకన్యకా దర్శనార్థియై పోవుచు “ఈ బాలికయా, హిమబిందా సాతవాహనరాజవంశమందు వధువుగ నడుగు పెట్టును!” అని ప్రశ్న వేసికొనెను. 

26. వీణాగానము

విషకన్యక శ్రీకృష్ణసాతవాహనుడు తనకడకు వచ్చుటకుముందు వీణ వాయించు చుండెను. ఆమె చేతనున్న వీణ కాండవీణ. కాండవీణ, కర్కారి, వాణవీణ వేదవాద్యములు. ఆంధ్రులకు కాండవీణయనిన పరమప్రేమ. వారు కాండవీణను మయూరిగా నొనర్చి రత్నఖచితముచేసి, పన్నెండు స్వర భేదములకు పన్నెండు తీగెలను బిగించెదరు. ఆ వీణ ఎక్కుపెట్టిన ధనుస్సువలె వంగి యుండును. ఏ మేళము వాంఛింతురో ఆ మేళమునకు సరిపోవునట్లుగ తీగ లన్నియు శ్రుతి కలుపవలెను.

విషకన్యకకు వేదసాంప్రదాయసిద్ధమైన సామగానమే స్థౌలతిష్యులు నేర్పించినారు. లౌకిక సాంప్రదాయమున ఆంధ్రులు శుద్ధస్వరములతో కనకాంగీ మూర్ఛనను లోకమున వెదజల్లిరి. సామగానమున తారశ్రుతినుండి మంద్రమునకు వచ్చి దిగుదురు. లౌకికమున మంద్రమునుండి తారకు బోదురు. సామము అవరోహణము. లౌకికము ఆరోహణము.

లౌకికమున మాగధు లొక విధాన మవలంబించిరి. ఆంధ్రులు మరి యొక విధాన మవలంబించిరి. ఔత్తరాహులు మధ్యగ్రామవాదులు, పంచమము సాందీపినియై మూడవ శ్రుతిస్థానము చెందును. ఆంధ్రులు షడ్జ గ్రామవాదులు. పంచమము నాలుగు శ్రుతులలో ఈ గ్రామము మహదానంద స్వరూపమైనది.

భారత యుద్ధానంతరమున కలిగిన మహాప్రళయమునను, జాతిసంకరమునను లౌకిక విధానము పెరిగిపోయినది. బౌద్ధమతము దానిని ప్రోత్సహించినది. కాని బౌద్ధులైన ఆంధ్ర సాతవాహనులకాలము వచ్చువరకు దానికి ఎక్కువ పోషణ లేకపోయినది. అతిపురాతన మగు వేదసంప్రదాయము నాశనమగుచున్నదని స్థౌలతిష్యులు మహా పండితులచే పరిష్కరింపజేసి విషాదస్వర ప్రారంభ మగు సామగాన గ్రామవిధానమున సంగీత శాస్త్రమును పరమాభివృద్ధినందింపజేసిరి. సామగానమున కైలాసేశ్వరునైన నాట్యముచేయింపగలదు విషకన్యక.

అంతర్గాంధారయుక్తమై, ఔడవమైన ఆభోగి రాగముతో సామగాన మార్గమున -

“నీవే శివుడవు
నేనే నీ పదపూజకు
సూనమునై వ్రాలెద నిట.
గానములోనే రాగము నీవై
రాగములోనే స్వరమును నేనై
దివ్యములగు నీ చూపులె ఈశా
దీనను నను మండింపగ లేవా! నీవే.”

ఆ పాట పాడుకొనుచుండగనే ఆమె కన్నుల నీరు పద్మములందు చేరిన హిమబిందువులవలె మిలమిలలాడిపోయినది. “ఈ జన్మసాఫల్యమునకు ఈ కృష్ణసాతవాహన మహారాజు అవతార మెత్తిన పరమశివుడు. హాలాహలమును ఈశానుడు తన కంఠమున నిలిపికొన్నాడట. హాలాహల విషసదృశనైన నన్ను తన పాదములనైన నీ ఈశానుడు నిలుపుకొనునా? కాలకూటవిషవదనమగు మహానాగ మతనికి అలంకారమట. ఈ ఈశానునకు నేనలంకార మెట్లగుదును? ఆత డమృతస్వరూపుడు. నేను మృత్యుకల. పరమేశ్వరుడు నన్నీ దివ్యమూర్తికంట నేల బడవైచినాడు? ఆ మహారణ్యమున దుర్భర క్షుత్పిపాశావశనైన నాకు అంత మేల రాలేదు? ఈ దివ్యమూర్తికి నే నెట్లు సేవచేయగలను? దూరముననుండియైన ఈ మహారాజుతో మాటలాడుటకు వీలులేదు. నా సేవచేయు నీ పరిచారికలే మహర్షియైన ఆ వైద్యుని సహాయము పొందియు నాకడకు వచ్చుటకు గజగజలాడి పోవుదురు. క్రిమికీటకాదులుకూడ నాకడకు వచ్చుటకు భయపడును.

“నన్ను కుట్టిన చీమయు చచ్చిపోవునుగదా! నేను భవన గవాక్షముల నుండి తోటలోనికి తొంగిచూచినప్పుడు ఆ తోటలోని బాలబాలికలు వెన్నెల కిరణములవలె ఎంత చక్కగ నాడుకొనుచుందురు! వారిదికదా ఆనందము! జన్మము మృతితో అంతము కాదుకదా! అయినచో నే నిది వరకే మరణమును హృదయమున కద్దుకొనియుందును. ఈ మహారాజు నన్ను ప్రేమించుచున్నాడు. ఆతని చూచిన మొదటి లిప్తలోనే నాథునిగ ప్రేమించితిని.

ప్రేమ ఎంత దివ్యానందదాయకము! తాతగారు వచించిన మోక్ష మున్నదియో, లేదో తెలియదు. ఆ మోక్షము శుద్ధానంద స్వరూపమట! ఆ విషయమును గూర్చి నే నేమి చర్చింపగలను? కాని ఇన్నాళ్ళకు నిజమగు ఆనందమేమియో తెలిసినది. శ్రీకృష్ణసాతవాహన మహారాజును నాశనము చేయ నన్ను ప్రయోగించినారు తాతగారు. ఆ శ్రీకృష్ణుని నే నిట్లు ప్రేమించుట ఏమి! ఇట్టిది జరుగునని భయమందియేకదా నన్ను ప్రయోగింపవల దని తాతగారి నా దినమున వేడికొనినది! తాతగారుచేసిన పనియు మంచిదే యైనది. కాకున్న నే నీ ప్రభువును, ఈ దివ్యమూర్తిని ఎట్లు చూడగలుగుదును? ప్రయోగ మన, నాశన మన, ప్రేమ యన నేమియో ఆ దినముల దెలిసెడివి కావు!”

పాట మాని ఆలోచనావశయై యున్న విషకన్యకడకు శ్రీకృష్ణసాతవాహనుడు వచ్చియున్నాడు. ఆతడు దివ్యునివలె భాసిల్లుచుండెను. ఆతడు వచ్చుటయు, చకితయై విషకన్యక లేచి, దూరముగ నుండియే నమస్కరించుచు, మోకరిల్లినది.

శ్రీకృష్ణుని కన్నులవెంట నీరు తిరిగినది. ఆమె అది చూచినది.

విషకన్యక: ప్రభూ! ఎందులకా కన్నుల నీరు? ఆమె మాట లాడువిధమే ఈ దినములలో మారిపోయినది.

శ్రీకృష్ణ: దేవీ! నీకు సర్వసౌకర్యములు జరుగుచున్నవా?

విష: వచ్చినప్పుడెల్ల అట్లడిగెదరు, నాకేమి లోపమని? ఆ లోపము నీ సౌకర్యములు తీర్చగలవా? అట్టి శంకతోడనా మీ కన్నుల నీరు?

శ్రీకృష్ణ: అదికాదు చంద్రా! కన్నుల నేదియో పడి నీరు తిరిగినది. వేరు కారణము లేదు. మీ తాతగారిని చూడ నీకు కోరిక పుట్టుట లేదా?

విష: మాతాతగారిని నేనెట్లు చూడగలను? నా కేమియు ఆ ఆలోచనలు కలుగవు ప్రభూ! మీ రెందుకు ఈసారి పూర్తిగ ఏడుదినములు ముగియకుండగనే వచ్చినారు?

శ్రీకృష్ణ: నేను ఏడు దినములు గడపుట బ్రహ్మప్రళయ మగుచున్నది. దినదినమును చూచుటకు వీలులేకపోవుచున్నది.

విష: అమ్మ! దినదినము నీ విషకీటకమును చూచుటకు వచ్చి మీ రేల ఆపద పాలగుదురు?

శ్రీకృష్ణ: ఆపద సంభవించకుండ దినదినము నిన్ను చూచుటకు రావలెను. లేనిచో నాసర్వస్వము మహాసముద్రమున పడిపోవుచున్నది. విష: నవ్వుచు, అయినచో నావంటి యొక సాలభంజికను చేయించి, దానిని దినదినము చూచుకొనుచుండుడు.

శ్రీకృష్ణ: సాలభంజికనా! ప్రతిమలు నా కెట్లు తృప్తినీయగలవు? చంద్రబాలికా! నేను నిన్నే పూజింపవలయును.

విష: నన్నా! నన్ను పూజింపకూడదు. పాముతో ఆటలాడెదరా? అగ్నిని ఒడిని ధరించెదరా? ఎవరైనను మృత్యువును పూజించెదరా?

శ్రీకృష్ణ: నీవు మృత్యువని ఎవరు చెప్పిరి?

విష: మా తాతగారే యనిరి.

శ్రీకృష్ణ: మీ తాతగా రెంత మూర్ఖుడు! అంత తపస్వి ఇట్టిఘోరమున కెట్లు పాలయినాడు? ఆ మాటల కేమి పోనిమ్ము. నీ మందిరమునకు నేను వచ్చుచుండ నీవు దివ్యగాంధర్వ మాలాపించుచుంటివి? ఏదీ, నీ వీణపై నా యీ సర్వవేదనలు మరచునట్లు వాయింపుము. చంద్రదేవీ! నీ గానచంద్రికామృతాస్వాదినై దివ్యత్వ మందెదనుగాక!

విషకన్యక సంతోషమున, సిగ్గున తన రత్నకంబళి పై నధివసించి కాండవీణను చేతదాల్చి మధురసుధాగానాలాపన మారంభించినది. 

27. గాంధర్వ ప్రభావము


గీతి గానేన యోగ స్స్యాత్ యోగాదేవ శివైకతా
గీతిజ్ఞో యది యోగేన సయాతి పరమేశ్వరం.

(సూత సంహిత)

ఆమె కిప్పుడు గానమున బరమార్థము గోచరించినది. ఇంతకు మున్నామెకు పాటలు బాల్యక్రీడలు. యవ్వనము వచ్చినవెనుక, పరభృతము తన పెంటికి మరులుగొల్పు విధమున, అప్రత్యక్షుడై యున్న తన నాయకుని కొరకై ఆమె పాటలు పాడినది. గానముచే కాలక్షేపము చేసినది. నేడు నాయకుడు ప్రత్యక్షమైనాడు. ఇప్పు డామె నిండుజవ్వని. ఇప్పుడామె భక్తురాలు. ఆమెకు నాయకుడే భగవంతుడు. ఆమెకు భగవంతుడు, నాయకుడు వేరు వేరుగా స్ఫురింపనే లేదు.

ఆమె ఆలపించిన భైరవిరాగము సామగానగ్రామము. ఆమె కంఠమున వెన్నెలలు కురిసినవి. మల్లెలు, జాజులు, శేఫాలికలు గుత్తులు గుత్తులై విరిసిపోయినవి. ఆమె నాదమున అమృతనదులు పొంగుచు, పొరలుచు, గట్టులమీరి ప్రవహింపుచు వచ్చినవి. ఆమె పాటపాడు విధానమున తారకా కాంతుల నొరసికొని నాట్యమాడు కల్యబాలికా నృత్తగతులవలె నుండెను. తప్తజంబూనదమున శోణవర్ణము కలిసినట్లున్న యామెగళము ఆమె పాడు నప్పుడు, ముడుచుకొనియుండి విడివడబోవు బంగారు కమలకోరకముపై ఉదయార్కకిరణములు ప్రసరించి నట్లుండెను.

ఆమె ఈ కొలదిదినములలో కొంచెము చిక్కినది. ఆమె ఈ నెల దినములలో కొంచెము పొడు గెదిగినది. ఆమెలో నేదియేని యొక దివ్యమగు తృప్తి భాసమానమై పోయినది.

ఆమె అందము వర్ణనాతీత మగుటవలన ఆమె ప్రతి అణువును మోక్షార్తుడగు మహర్షివలె శ్రీకృష్ణసాతవాహనునికై ఆర్తి చెందుచుండెను. ఆమె నీటినుండి వెలువడి వచ్చి రెక్కలు చాచి ఎగిరిపోవు కొదమ రాయించవలె నుండెను. ఆమె యజ్ఞశాలలో ఋత్విజుల సువర్ణపాత్రనుండి యాజ్ఞాగ్నిలో నొలుకు సోమరసధారవలె నుండెను.

ఆమె ఆకాశమహాపథాల అఖండవేగమున తేలిపోవు తారకను వెన్నంటు కాంతి ప్రవాహమువలె నుండెను.

ఆమె ధరించిన బంగారు రంగువస్త్రములు, దివ్యదుకూలమును, ఆమె స్వర్ణ కరవీరపుష్పములు తలలో ధరించి, కేశభారమును ఊర్థ్వశిఖా స్వరూపమున ముడిచి యుండెను.

ఆమె మోము కొలనై, ఆమెకన్నులు అరమూతసోగలై, ఆమె నాసిక సమదీర్ఘమై, ఆమె చెవులు బంగారుమేఘాల తరకలై నవి.

ఆమెలోని శాంతి మోహినీదేవీ హస్తాం చితామృతకలశము. ఆమె లోని ప్రేమ పారిజాతసుమగర్భ కింజల్కము.

కాండవీణ తీగల స్పందించు నామె హస్తాంగుళులు పూర్ణిమనాడు గగన మధ్యమున సంయోగమందు సూర్యచంద్రకిరణాలు.

ఆ తంత్రీ విసుర్ము కస్వరమున మేళవించి యా బాలిక :


నీవుగలుగు టాత్మనమ్మి
నిలిచితి పూజాగృహమై
పన్న గేంద్రభూష! నాకు
నిన్ను చూచుచుంట ముక్తి....
ఎన్ని రూపులో వహించి
ఏగుదెంచు ని న్నెరుగక!
తలవాకిలి యోరజేసి
నిలిచియుంటి నీ కొఱకై.... నీవు....
నిన్ను పూజ సేయు టదియె
నీకు సేవ సలుపు కాంక్షె
వరము, జన్మఫలము నాకు
పరమయోగ మదియె నాథ!....నీవు....

అని పాడినది.

ఈ బాలిక నెట్లు తాను విడిచియుండగలుగును? తనకు రాజ్యములేల, యువరాజత్వ మేల, ఈ బాల తనరాణి కానిచో? ఈ బాలికామూర్తితో నిండిన తన హృదయమున వేరొక్కబాలిక రాణి ఎట్లగును? హిమబిందుకుమారి తన చెల్లెలు మాయదేవివలెనే కానుపించును దనకు.

తండ్రికి తా నేమి ప్రతివచన మీయగలడు? తాను చారుగుప్తుని మో మెటు చూడగలడు? తనకు రాజ్యమే వలదు. మంజుశ్రీ రాజగుగాక! రాచపుట్టువు ఇంతటి పరతంత్రమా? వారు ప్రేమింపకూడదా? రాముడు సీతను ప్రేమించి యుద్వాహము కాలేదా? దశరథాదులు రాముని బలవంత మొనరించిరా? బోధిసత్వుడైన సిద్ధార్థుడు యశోధరాదేవిని కోరి తన అర్ధాంగిని చేసికొనలేదా? ఇంతకు, ఈమె అమృతకన్య యగు టెట్లు? లోకములో నీ మెను తిరిగి విషరహితగా జేయువారే లేరా? స్థౌలతిష్యులు చేయగలుగునా? కలిగినను అట్లు చేయుట కనుమతించునా? ఏది మార్గము?

ఈ బాల తనకు అర్ధాంగి యగుటకే వీలులేనిచో తాను సర్వస్వము వదలి బౌద్ధదీక్ష గైకొని, ఏ సింహళమునకో, చీనాదేశమునకో, త్రివిష్టపమునకో వెడలిపోయి లోకమును, ధర్మమును ఆరాధించుట మేలు.

“ప్రభూ! నా పాట ఎట్లున్నది?”

“నీ పాట సరస్వతీదేవి వీణాగానమునకు పరీమళమును జల్లు చున్నది చంద్రబాలా!”

“ప్రభూ! ఏల మీరు నాకడకు పదియుసారులు వచ్చెదరు?”

“దేవీ! ఎంత బేలవు నీవు! నీవు నాసర్వస్వము; నేను నీవాడను. నిన్ను విడిచి యెట కేగుదును?”

“మహారాజా! నేను మృత్యుదేవతను. నన్నేల కోరుదురు? నాకు మీ నామస్మరణమే చాలు! మీ రూపమననమే చాలు. ఈ జన్మమున నా కింతకంటె భాగ్యములేదు. మిమ్ము దూరము నుండి పూజింపుచు, మీ నామము స్మరింపుచు, అగస్తిగగనులవలె యోగినినై యుండెదను.”

“అప్పుడు నేనును నీతోడ యోగినై తపస్సు చేసికొనెదను.”

“మీ రాజ్య మేమగును?”

“నీ వున్నచోటనే నా రాజ్యము.”

“మహారాజా! నాకు రాజవైద్యులెన్నియో విషయములు చెప్పుచున్నారు. ఎంత చిత్రము ఈ ప్రపంచము! ఎన్ని సుందరవిషయము లున్నవి! నాయెదుట యామినీ తమస్సులు విడిపోయి, ఏదియో మహత్తర ప్రపంచము న్నియో అందముల ప్రత్యక్షమగు చున్నది. దీనిపై మీరు విరక్తిచెంద నేల?”

“దేవీ! ఈ విచిత్ర ప్రపంచము నా కంటితో నీకు జూపి, నీ హృదయముతో నే ననుభవించినగదా రక్తి? కానినా డిదియెల్ల శుష్కమే నాకు.”

“మీ కంటితో ఏట్లు చూపిరగలరు?”

“మన మిద్దరము సముద్రయానముచేసి ఏవియో విచిత్రతీరాలకు పోదము. మనము హిమాలయపథములకు పోయి ఎన్నియో యుదయముల దర్శింతము. మన మిరువురమే! నీవు నాచేయి పట్టుకొని, నేను నీ హృదయమున; నీవు నా బాహువులలో, నేను నీ సర్వస్వమునందు.”

“ఓ దివ్యమూర్తీ! మీరు వెళ్ళిన ముహూర్తమునుండి మీరు వచ్చు దినమువరకు మీకై ఎదురు చూతును. మీరు వచ్చి వెళ్ళిపోదురు. మరల మీకై ఎదురుచూతును. ఈ జన్మమున నా కిదియే మహాభాగ్యము.”

“నిన్ను చూచి, ఆనందశిఖర మంటి వెళ్ళిపోదును. నీవే నాయెదుట. నీవే నా ఊహల, నీవే నా స్వప్నముల, నీవే నా హృదయమున, నిన్ను చూతును. మరల వెళ్ళిపోదును. నేను వెళ్ళుదును, నా ప్రాణము, నా ఆత్మ నీకడ ఆ పాదములలో, ఆ కుంతలములలో, ఆ పెదవులలో, నీ లోచన పద్మాంచలములలో, ఆ పెదవుల రక్తిమలలో! ఎట్లు నిన్ను విడిచి యుండుట?” “నా ఆత్మేశ్వరా!”

“నా ఆత్మమూర్తి! నా యీ కౌగిలింతకు రా! ఈ దివ్యప్రేమలో నే ప్రాణము వీడుటకల్ల. నీ ప్రేమబలమే నన్ను రక్షించును. నా పూజయే నిన్ను, నాపూజాపీఠమున నున్న దేవిని నా హృదముమున చేర్చును!”

“వలదు దేవా! వలదు. అపాయము.”

“అపాయమైన నేమి, ప్రాణముపోయిన నేమి? ఈ దివ్యానందానుభూతి కోరి మాద్రీ దేవిని చేరిన పాండురాజు గాథ నెఱుగవా?”

“వద్దు ప్రభూ! వద్దు, మీరటులనే యుండుడు. నాపూజామూర్తికి, నా శివునకు, నా భగవంతునకు కళంకము రానీకుడు!”

శ్రీకృష్ణసాతవాహనుడు గడగడ వడంకి, కన్నులు మూసికొని, యా మందిరము వెడలి అంగలువేసికొనుచు నడచిపోయెను. విషబాల నిల్వున కూలిపోయెను. 

28. పునస్సమాగమము

పాటలీపుత్రముకడ పోరు మిన్నంటిపోవుచుండెను. ఒక దినము జరిగినకొలది ఆంధ్రుల ప్రతాపము ఉధృతము మీదుమిక్కిలి యగుచున్నది.

రాత్రిందినములు అరువది గడియలు ఎడతెగని ఆ ముట్టడిచే అభేద్యమగు పాటలీపుత్రనగరము ఇంద్రుని వజ్రఘాతముచే కొండలరెక్కల ముక్కలగుచున్నట్లు ఒక కోటవెనుక వేరొక కోట, మహానగరము చుట్టు నున్న ఏడుకోటలు వశమయ్యెను.

ఈ రెండు నెలలలో ఆంధ్ర సైన్యములు చెక్కుచెదరక, అలసట నొందక పోరాడుచున్నవి. సుశర్మకాణ్వాయనుడు మొక్కవోని ధైర్యముచే పోరాడుచుండెను. ఉజ్జయినికడ ఓడిపోయిన మాళవ సైన్యములలో పదివేలమంది కరకుమానిసులు అమావాస్య చీకటి రాత్రులలో పాటలీపుత్ర నగరములోనికి గంగపై పడవలలో వచ్చి చేరిరి.

వారు సుశర్మచక్రవర్తికి ఎంతయో ధైర్యము కొనివచ్చిరి. మాళవులలో పారిపోయి వచ్చిన తక్కిన సైన్యములు ఆంధ్రులను వెనుకనుండి చీకాకుపరచుచు, నాశనముచేయుచు, పాటలీపుత్రముపై ఒత్తిడి తగ్గించెదమని మాట నిచ్చిరి.

ఆ మాళవుల సైన్యములు మహావేగముతో వచ్చుట, ఆంధ్రుల నొకమూలతాకుట, మరల నంత వేగముతోడనే వెడలిపోయి మాయ మగుట - ఇట్టి యుద్ధవిధాన మవలంబించెను. ఆ యుద్ధవిధానమువలన ఆంధ్రులు చికాకు నందిరి. దాదాపు ఒక వేయిమంది ఆంధ్ర సైనికులు, అశ్వికులు నాశనమైరి.

అటుల రెండుసారులు జరుగునప్పటికీ స్వైత్రులవారు - కాండీర, శాక్తిక, యాష్టీక, సైస్త్రింశిక కాంతికాది అశ్వికముఖములను నూరింటిని జంఘాకఠికముఖములుగా నేర్పాటుచేసి, మాళవాభిముఖముగా నంపి, వారి ఉనికి తెలిసి వారిని తలపడుటకును, వార్తాహరులచే తనకు వార్తలంపుటకును ఏర్పాటు చేసెను.

ఇంతలో ఉజ్జయినినుండి శ్రీకృష్ణసాతవాహనుడు, మంజుశ్రీసాతవాహనుడు, సోమదత్తాచార్యులు, సమవర్తి, సువర్ణశ్రీ, హిమబిందు, ముక్తావళీ దేవి, విషబాల, మహాబలగోండుడు మొదలగువారు సైన్యములతో పాటలీపుత్రము వచ్చి చేరిరి.


ఆంధ్ర సైన్యముల మహోత్సవములు జరిగెను. చక్రవర్తియు, మహారాణియు కుమారుల నిద్దర కౌగిలించుకొనిరి.

మంజుశ్రీ ఎదిగినాడు. బాలుడు, తల్లి ఒడిలో చేరి -

“అమ్మగారూ, మీరుక్షేమముగ నుంటిరా! నాకోసము బెంగగొంటిరా? బెంగ ఎందుకు జననీ! నేను ఆడపిల్లనా? మా అన్నగారు ఒక్కరు మిమ్ము వదలి పాటలీపుత్రమున ఉండలేదూ?” అన చక్కని, తీయని మాటలు పల్కినాడు. ఆనందదేవి పుత్రుని గాఢముగ హృదయమున కదుముకొని, ఆతనిమోమంతయు ముద్దులు పెట్టి “నా తండ్రీ! ఎంత పెద్ద మాటలు నేర్చినావు?” అనెను.

“అదేమి అమ్మగారూ! అట్లనెదరు? పెద్దఏమి? చిన్న ఏమి? అందరి ఆత్మలును ఒకటియ! నీవు పరమాత్మవు నేను పరమాత్మను. మాయచే మనము వేరు వేరని, బద్ధుల మని అనుకొనుచుంటిమి. మీరు భగవద్గీత చదువలేదా?”

“ఓయి నాయన! నా తండ్రి తత్వవేత్త అయినాడా? ఎవరు నేర్పిరయ్యా నీకీ చదువులు?”

"స్థౌలతిష్యులవారు. ఇంకను ఎందరో ఋషులు, నన్ను పెంచిన బ్రాహ్మణోత్తములు ఎన్ని విద్యలు నేర్పిరమ్మా నాకు! తల్లీ! మీరు భాసుని నాటకములు, వాల్మీకి రామాయణము, వ్యాసుని మహాభారతము చదివినారా? అవి యన్నియు నేను నేర్చుకొనుచున్నాను. మీకును నాయన గారికిని కొన్ని ఘట్టములు పాడి వినిపించెదను.”

“ఓహో! నా తండ్రి ఎంతటి పండితుడైనాడు! ఇన్ని నెలలు ఏమి చేయుచుంటివి? ఎవరు నీకు బువ్వ పెట్టిరి?”

హిమబిందును చారుగుప్తుడు తనహృదయమున కద్దికొని, ఆనందముచే, భార్య ప్రజాపతిమిత్ర తలంపున దుఃఖముచే కండ్ల నీరు వరదలై పార తల తడిపెను. హిమబిందు వాపోయినది. ముక్తావళీదేవి వెక్కి వెక్కి ఏడ్చినది.

తరువాత వారి ఆనందమునకు మేరలేదు. చారుగుప్తుడు చిన్నబిడ్డ వలె గంతులు వేసినాడు.

సువర్ణశ్రీ ధర్మనందికడకుపోయి, యాతని పాదముల కెరగెను. ఆ మహాశిల్పి. కుమారుని గాఢముగ కౌగిలించి, మనస్సులో బుద్ధదేవుని ప్రార్థించి, యాతని వదలెను.

శ్రీకృష్ణసాతవాహనుడు, సోమదత్తా చార్యులు, సమవర్తి సాతవాహనులు చక్రవర్తికి ఉజ్జయినీ యుద్ధ కృత్తాంత మంతయు నివేదించిరి. స్వైత్రులవారు, అచీర్ణులవారు అచ్చటనే యుండిరి. 

29. స్థౌలతిష్యమహర్షి

“చేయుటయే మన పని. దాని ఫలము మనది కాదు, అది భగవంతునిదే”, అనిగదా వాసుదేవుడు గీతయందు ప్రవచించినాడు. గీతామహా వాక్కు ఆశయప్రస్థాన మగు మహాపథము కంటకావృతమైననేమి యనిగదా వచించును. భగవంతుడే యట్లొనరించెను. భగవంతుని దారియే మాయ. కంసుని, నందుని, యశోదను, గోపికలను, కాలయవనుని, జరాసంధుని, శిశుపాలుని, కౌరవులను, అందరు జీవులను నిమిష నిమిషమున మాయచే నింపి, వక్రగతుల నడచిన భగవంతుడే మాయలమారియైనప్పుడు మోహినియై రాక్షసుల మాయచేసి, దేవతలకుమాత్రము అమృతము పంచినప్పుడు, జగన్మోహినియై భస్మాసురునే భస్మ మొనరించినప్పుడు - వేదములు, ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రములు, పరమశివారాధన, భగవద్భక్తి, ధర్మము వీనిని పునరుద్ధరించుటకు- నే నేమార్గమైన నవలంబించదగును” అని యాలోచించుకొనుచు స్థౌలతిష్యుడు శిష్యగణపరివృతు డై పాటలీపుత్రపురాభిముఖుడై ప్రయాణముచేయుచుండెను.

సాతవాహనవంశమును నిష్కల్మషముచేసి, దానిచేతనే ప్రపంచ మంతయు ఏలించవలె! దేవతాతృప్తి, మానవముక్తి ప్రసాదించు యజ్ఞ యాగాది క్రతువులు దేశమంతట జరగాలి. పాషండము, వైదికమార్గ నిరసము, మోక్షదూరము, నరకహేతువగు బౌద్ధధర్మము, జైనధర్మము నిశ్శేషం కావాలి. ఈ దినముల వర్ణభేదమే పోయినది. “చాతుర్వర్ణ్యం మయాస్వష్టం” అనే భగవంతుని వాక్కును నాశనము చేసినారీ బౌద్ధులు. వారే నాశనమగుదురు.”

తన మనుమరాలు విషకన్యను శ్రీకృష్ణసాతవాహనుడు వెంటబెట్టుకొనియే తిరుగుచున్నాడు. కాని ఇంతకాల మతడు నాశనమందకపోవు టెట్లు?

ఎవరా సువర్ణశ్రీ ? ధర్మనంది కుమారుడా? ఆ ధర్మనంది సువర్ణశ్రీల విషయ మావల కనుంగొనబడును. ఆతడు హిమబిందు వెంటాడుట ఏమి? తన నర్మదాశ్రమ రహస్య మాత డెట్లు భేదించెను? హిమబిందు మంజుశ్రీల కాతడు బంధముక్తిచేయుట యేమి? ఇదియంతయు విచిత్రమే. భగవంతుడేమి చిత్రసంఘటన కల్పించి ఈ నాటక మాడించి నాడో?

ఉజ్జయినికడ మాళవులు ఓడిపోవుటయు మంచిదే యైనది. లేనిచో వారు సర్వవిధముల భగవంతుని కార్యమునకు అడ్డుతగిలియుందురు. కాని పాటలీపుత్రముకడ బౌద్ధులు నాశనమయితీరవలెను. శ్రీముఖసాతవాహనుడు నాశము కావలెను. శ్రీకృష్ణు డెట్లును నాశనమైనట్లే! మలయనాగ ప్రభువును సాతవాహనులు చంపించిరని కింవదంతి వ్యాపింపజేయుటవలన ఆంధ్రనాగు లందరు అనుకొనిన దినమున ఆంధ్ర సైన్యములపై తిరుగబడి సాతవాహనులను వారి అనుయాయులను నాశనము చేయుదురు. మంజుశ్రీని మాత్రము వారు రక్షింతురు. ఆంధ్రసైన్యములలో నాలుగు లక్షలమంది యున్నారు. ఎందరో సేనానాయకులు, ఉప సైన్యాధికారులుగా ఉన్నారు. స్వైత్రులవారూ నాగప్రభువే యైనను బౌద్ధుడు. ఆతడే మలయనాగుని వెనుక చీవాట్లు పెట్టియుండెను. ఆతడే మలయనాగుని చక్రవర్తి యాజ్ఞచే చంపించెనని కదా తాను వదంతి పుట్టించెను?

ఎవరీ అమృతపాదార్హతులు? చాలా గట్టివాడు. బౌద్ధధర్మమును, ఆర్యధర్మమును ఆత డంత చక్కగ సమస్వయముచేయుట తన ఉద్యమము నకు భంగము కలిగించినది. చక్రవర్తి రెండు ధర్మములను సమముగ జూచుచున్నాడు. అది తన మహోద్యమమునకు ఎన్నియో చిక్కులు తెచ్చినది. ఈ అమృతపాదులు బౌద్ధధర్మము నిజమైన ఆర్యధర్మమని వాదించునట. బ్రతికియున్న ఆర్యజాతి యుగయుగమునను మార్పుచెందునట. కృతయుగానంతరము మహర్షులు ఉపనిషద్రూపమున వేదదేవతలకు స్వస్తి చెప్పిరట. అంతటితోడనే వైదిక దేవులమహాత్మ్యము ప్రజల హృదయము నుండి తొలగిపోయెనట! ఓహో ఏమివాదన! త్రేతాంతమందు ఉపనిషన్మతములోని భక్తిధర్మము, యోగధర్మము, సాంఖ్యమైన ద్వైతభావము తలయెత్తినవట. ద్వాపరాంతమందు అన్నింటిని సమన్వయము చేయు భగవద్గీతను భగవంతుడే స్వయముగ బోధించెనట. కలియుగములో ఇట్టి అవతారము లెన్నియో రావలెనట. బుద్ధు డట్టి అవతారమట! ఇది నిజమనినమ్మినారు ఎంతమందియో పండితులైన బ్రాహ్మణులే. ఈ విషయమున అమృతపాదునితో తాను వాదించి తీరవలయును. ఈ అమృతపాదుని తాను ఓడించి తనధర్మమునకు జేర్చగలిగినచో తన జన్మము సార్థకమగును.

ఈ ఆలోచనలతో స్థౌలతిష్యుడు తనగజము పై ఆరోహించి ప్రయాణము చేయుచుండెను.

ప్రతిష్ఠానమునుండి గయకడకు అతడు శిష్యగణముతో, నూరు ఏనుగులతో వచ్చుసరికి, ధాన్యకటకమునుండి వచ్చు కొన్ని కుటుంబము లచ్చట కలుసుకొన్నవి. ప్రియదర్శిసాతవాహనుని భార్య అమృతలతాదేవి ధర్మనంది కుటుంబము, కొందరు గోపసైనికుల వెంటబెట్టుకొని ప్రయాణము చేయుచు వచ్చుచుండిరి. ఆ జట్టులో భిక్షకు డగు వినయగుప్తుడు, శ్రీమంతుడగు కీర్తిగుప్తుడును ఉండిరి.

క్షేత్రగయలో స్థౌలతిష్య డాగిపోయిను. స్థౌలతిష్యుని కలుసుకొని కీర్తిగుహుడనేక విషయములు మాటలాడెను. తన మనమరాలిని తస్కరించిన దీ అపరవిశ్వామిత్రుడే యని యాతని హృదయమున స్థాలతిష్యునిపై కోప ముదయించినమాట నిజమే కాని మరల నేమిచేయుట కీ వృద్ధదుర్వాసుడు పాటలీపుత్రమునకు బోవుచున్నాడో యని కీర్తిగుప్తుడు కళవళపడెను.

ఆతని పేరు వినినంతనే అమృతలత మండిపోయెను. ఎక్కడనుండి దాపురించినా డీ ప్రళయరుద్రు డని యామె యనుకొనెను.

ఈ రెండుజట్టులు కలిసి ఒకేదినమున పాటలీపుత్రమును ముట్టడించిన శిబిరముల జేరిరి. పాటలీపుత్రమునకు ఇరువదిమైళ్ళ దూరమున గంగానదికి దిగువను ఒక గ్రామమునందు స్థాలతిష్యులు స్థావర మేర్పరచు కొనినారు.

ధర్మనంది శిబిరమునకు శక్తిమతీదేవియు, యామె ఇరువురు కొమార్తెలు చేరినారు. సువర్ణశ్రీ తల్లి పాదములకు సాష్టాంగనమస్కార మొనర్చి లేచి యామె కన్నుల నీరు తిలకించి,

“అమ్మా, ఎందుకా కన్నీరు?” అని ప్రశ్నించెను.

“నాయనా, నీవు క్షేమముగ నుంటివి. అదియే పదివేలు.”

నాగబంధునిక: మా అన్న ఎంత గొప్పవాడయినాడు!

సిద్ధార్థినిక: ఇప్పు డగుట యేమి! ఎప్పుడును గొప్పవాడే!

నాగ: ఓహోహో! చిన్నచెల్లెలుగారు అన్నగారిని వెనుక వేసుకొని వచ్చుచున్నది.

శక్తి: ఉండండి తల్లీ. నాన్నా! నిన్నుగురించి కథలు విన్నాను. బృహత్కథలోని వీరులవలె పేరుపొందినావు తండ్రి!

నాగ: తన నాయికను తాను రక్షించుకొన్నాడు.

సువర్ణశ్రీ: నాకు నాయికలేదు నాగూ! నాకు నా శిల్పమే నాయిక.

సిద్ధా: అటు లనుచుంటి వేమి అన్నా?

సువర్ణు డీలోననే సిద్ధార్థినికను ఎత్తుకొని గాఢముగ హృదయమున కదిమికొని, ఎగురవేసి, మరల పట్టుకొని, యాబాలిక ఋగ్గలపై కొన్ని వేల ముద్దుల వర్షము కురిపించి మరియు దింపెను. నాగబంధునికను తలనిమిరి ముద్దుగొని, భుజములుపట్టి, ఆడించి, వీపున చరచి వదలెను. ధర్మనంది భార్యనుచూచి, “ప్రయాణము సౌకర్యముగ జరిగినదా?” యని ప్రశ్నించెను.

శక్తి: అమృతలతాదేవియు, కీర్తిగుప్తులవారు, వినయ గుప్తులవారు మాతో వచ్చియుండిరికదా! అందులో కీర్తిగుప్తులవారి ఆదరణము వర్ణనాతీతము. ఆయన సువర్ణుని చూడవలెనని ఎంతయో కుతూహలము కనబరచినారు. ఆయనకు దారిపొడుగున వచ్చు వార్తలన్నియు మొట్టమొదట మా బసకు వచ్చి చెప్పుచుండువారు.

ధర్మ: కీర్తిగుప్తులు ఉత్తమపురుషులు. ఆయన హృదయము ప్రేమమయము.

నాగ: కాని అమృతలతాదేవిగారు దారిపొడుగునా చిరచిరలాడుచునే యున్నది. అమ్మా ఆవిడ కెప్పుడును అంత విసుగెందుకో?

సువ: అమ్మా మనయింట విద్యార్థులందరును క్షేమమా? పందెపు గిత్తల నేమిచేసివచ్చితిరి?

నాగ: మరల శకటపరీక్ష నెగ్గవలెనని యున్నది అన్నకు. పందెము గెలుతువేకాని ఇంకొక హిమబిందు నెచట తెత్తువు?

ధర్మ: అది ఏమితల్లీ! నీవు రెండుసారులు హిమబిందు మాట నెత్తితివి. హిమబిందు కుమారిని శ్రీ చారుగుప్తులవారు శ్రీకృష్ణసాతవాహనమహారాజునకు దేవిగా నర్పింతురు. చక్రవర్తియు, మహారాణియు నొప్పుకొనినారు.

సువ: మేము ఉజ్జయినినుండి వచ్చిన వెంటనే చారుగుప్తులవారు నన్ను కలసికొని, తన కొమరితను నేను రక్షించినందుకు నాకు కోటి ఫణము లీయ సంకల్పించు కొన్నాననియు. భావి యువరాజ్ఞి కాబోవు నామెను రక్షించి లోకమునకు నేను ఎంతయో యుపకారమును చేసినాననియు చెప్పినారు. నేను నాధర్మము నేరవేర్చినాను, నాకు కోటిఫణములు వలదనియు, నవి మధ్యవన మహాసంఘా రామమునకును, వ్యాఘ్రనదీ సంఘ రామమునకును ఇచ్చుట మంచిదనియు చెప్పితిని.

ధర్మ: అవును. చక్రవర్తి ఈ వివాహము నంగీకరించెను. మహారాణి ఆనందించెను. శ్రీకృష్ణసాతవాహన మహారాజు, హిమబిందుకుమారియు ఎంతయో ఆనందించు చున్నారు. ఈ విషయములు నాకు చారు గుప్తులవారే చెప్పిరి.

30. పాటలీపుత్ర పతనము

యుద్ధ మతితీవ్రముగ సాగుచున్నది. ఆంధ్రు లెంత జాగరూకత వహించినను మాళవసైన్యములు గంగమార్గమున పాటలీపుత్రములోనికి చొచ్చుకొని పోవుచునే యున్నవి. పాటలీపుత్రము బలము పొందుచునే యున్నది.

శుకబాణులవారి ఎత్తుగడ లన్నియు విఫలమగుచున్నవి. ముట్టడి కొన్ని నెలలు సాగినచో ఆంధ్రులకే నష్టముగాని పాటలీపుత్రములోని వారేమియు చెక్కుచెదరరు. యువరాజుచే ఉప సైన్యాధ్యక్షుని పద నియుక్తుడైన సువర్ణశ్రీ ఒకనాడు వారి అనుమతిని సర్వసేనాధ్యక్షుని సందర్శించెను.

స్వైత్రులవారికి సువర్ణశ్రీ వీరనమస్కార మిడి వారి యాజ్ఞను ఒక పీఠ మలంకరించి యిట్లు మనవిజేసెను. “మహారాజా! మాళవులు మనలను ఏమరించి పాటలీపుత్రములోనికి తండతండములుగ పోవుచున్నారు. వారిని నగరములోనికి చేరనీయకుండ చేయుట కొక ఉపాయము తట్టినది. మనము పాటలీపుత్రమును పట్టుకొనవలెనన్నను, గంగాదేవియే మనకు ఉపకరించవలెను. గంగాదేవి మార్గము చాలకష్టమైనను ఆ తల్లిని మనకు తోడ్పడ చేసికొన్నచో పాటలీపుత్రనగరము పది ఝాములలో మనకు హస్తగత మగును.”

“చక్రవర్తి సైన్యనష్టము ఎక్కువకాకుండ కోటను పట్టుకొనవలె నని ఆదేశించినారు. అమృతపాదులవారు ఇట్టి జననష్టము భగవత్ప్రీతి కరముగాదని, నిర్వాణదూర మని వాదింతురు. నీ ఉపాయము జననష్టము తక్కువగు ఉపాయమై ఉండవలెను.

“మహారాజా! ఇంతవరకు గంగ అవతలికోటను మనము పట్టు కొనలేదు. ఆ కోటను పట్టుకొనునట్లు వేలకొలది సైన్యము దానిని చుట్టు ముట్టవలయును. ఇంతవరకు గంగానదిలోని పడవలు మనకు వేయికన్న ఎక్కువలేవు. నే నీ మధ్య గంగానదికి ఎగువను, దిగువను ప్రయాణము చేసి రెండువేల పడవలను మూల్య మిచ్చి కొని తీసికొచ్చినాను. ఇవి కాక ఈ పరిసరములనున్న గ్రామము లనేకములు తిరిగి చిన్న చిన్న అడవి బూరుగుచెట్లు, బాడితచెట్లు మూల్య మిచ్చి నాల్గయిదువేలు కొన్నాను. ఇవి యన్నియు బండ్లుకట్టి మనశిబిరములకు ఆయా గ్రామవాసులు తీసికొనివచ్చుచున్నారు. ఈ వృక్షము లన్నియు తెప్పలుగా కట్టి గంగానదిలో వేయవలెను. ఈ తెప్పలపై, పడవలపై నదిని దాటుటకు వేలకొలది సైనికులు సిద్ధముగ నుండవలయును. ఆ సైనికు లందరు మాళవ సైనికుల సంకేతము లెరుగవలెను. వారికి మహాబలగోండుడు సాయ ముండును.”

“ఈ ఆర్భాట మంతయు నెందులకు?”

“మనము మాళవదండు నొకదానిని పాటలీపుత్రములోనికి చొర నీయవలెను. వారివెంటనే మాళవవేషములనున్న మనవారు చొచ్చిపోవలెను. వారివెంట తక్కిన ఆంధ్రసైన్యములు మనసంకేతముల తెలుపు కొనుచు నగరములోనికి చొచ్చిపోవలెను. ఈలోన భూమివైపు సైన్యములవారు కోటగోడలు ముక్కలుచేయుటకు ప్రయత్నముచేయుచు న్నట్లు సంరంభము చేయుచుండవలెను. ఒకసారి లోనికి సైన్యములు పోగానే....”

“పట్టణము రెండు గడియలలో మన వశమగును. స్థౌలతిష్యులు వచ్చినప్పటి నుండియు మాళవసైన్యములు, పాటలీపుత్ర సైన్యములు కూడ విజృంభించినవి. నీ ఉపాయము మంచిదే. లోనికిపోవు దండునకు నాయకులుగా నీవును, మీ గురువు సోమదత్తాచార్యులు, సమవర్తి కుమారులును, మహాబలగోండుడు నాయకుడుగా ప్రభాతశూరుడు, ఆనందవసువు, చంద్ర కేతుడు, గుణవర్మ, శతస్కంధుడు, ప్రమానందుడు మొదలగు ఉపనాయకులు వెళ్ళుడు. కాని అతిజాగరూకతకలిగి జయము సముపార్జించ వలెను.”

“మహారాజా! అందరు నాయకులు, ఉపనాయకులు ఈ మధ్యాహ్నము తమ సమాలోచనామందిరమున కలుసుకొన ఆజ్ఞ ఈయ కోరు చున్నాను.”

“మంచిది, సువర్ణశ్రీ! మంచిది. మీమ్మందర ఇచ్చటకుజేర్ప చారులు ఆజ్ఞలు పట్టుకొనివత్తురు. ఈ విషయము సంపూర్ణముగ సమాలోచనచేసి, ఎవరే పనిని, ఏ సమయమున, ఎచ్చట ఏ విధముగ నిర్వర్తింపవలయునో నిర్ణయించుకొనిగాని, కార్యనిర్వహణమునకు దిగకూడదు.”

సువర్ణశ్రీ మహా సైన్యాధ్యక్షుని కడ సెలవుపుచ్చుకొని, తన హయ మధిరోహించి శిబిరమునకు బోయెను. వర్షాకాలము వచ్చుటచే వానలు కుంభవృష్టిగ గురియుచున్నవి. గంగానది వరదలై తెల్లటి బురదనీళ్ళతో ప్రవహింపుచుండెను. ఈదురు గాలి విపరీతముగ వీచుచున్నది. శోణానదియు పొంగివచ్చినది. ఆకాశము సర్వకాలము మబ్బులతో నిండియేయున్నది. వర్షములు యుద్ధనిర్వహణ మున కంతరాయమును గల్పించుచున్నవి. గ్రహణి మొదలగు రోగములు ఆంధ్ర సైన్యముల బ్రాకుచున్నవి. వైద్యులకు పని ఎక్కువ అయినది.

సువర్ణశ్రీ మహాసైన్యాధ్యక్షులతో మాటలాడినపిమ్మట నాల్గవనాటి రాత్రి కన్ను మిన్ను కప్పి జోరున వర్షము కురియుచున్నది. ఆ వర్షములో రెండువందల నావలు సైనికులతో, తోళ్ళుకప్పిన సామానులతో కిటకిట లాడుచు, పాటలీపుత్ర గంగాతీరమున నొక గోపురద్వారముచెంత నాగినవి.

ఆ వర్షపుమ్రోతలో పడవలలోనివా రొకరు శంఖ మొకటి “భోం, భోం, భోం, భోం, భోం, భోం,” అని పలికినది. అంత లోననుండి నింకొక శంఖము ప్రతిధ్వనిగా “భోం, భోం,” అని పలికినది. అంత పడవలలోనుండి కాహళియొకటి, “టు, టు, టూహూ” అని అరచినది. ఇంతలో నెమ్మదిగ గోపుర మహాద్వార కవాటముల నున్న చిన్న కవాట మొకటి తెరువబడినది. ఒక్కొక్క పడవ గోపురసోపానముల కడకు వచ్చుట, అందుండి సామానులతో, సైనికులు దిగి ఒక్కొక్కరు, ఇరువురు, ముగ్గురు లోనికి పోవుచున్నారు. అటుల రెండువేలమంది వెళ్ళిరి, మూడువేలమంది వెళ్ళిరి, సోపానములకడ వేలకొలది పడవలు మూగిపోయినవి. జనము దిగుచునేయున్నారు. లోనికి పోవుచునే యున్నారు.

ఆవల భూభాగమువైపు ఆంధ్రులు వర్షమని వెరవక ఏనుగులచే, శకటములచే, అస్త్రములచే, శస్త్రములచే నగరకుడ్యముల పొడవుననున్న ఇరువది, ముప్పది గోపురములకడ తలపడిరి. ప్రతి బురుజుపైన శతఘ్న్యాది అస్త్రములు వచ్చి, బురుజు గోడలను బద్దలుకొట్టుచుండెను. మాళవులు, మాగధులు, శూరసేనులు కోటగోడలపై విజృంభించి బాణములు, శతఘ్నులు, రాళ్ళు, యంత్రములు ఎడతెగక ప్రయోగించి ఆంధ్రుల నాశనము చేయుచుండిరి.

అయినను ఆంధ్రుల వేగము, ధాటియు తగ్గలేదు. గోపుర మహాకవాట మొకటి ఆంధ్రుల ధాటికి ఫెళఫెళ విరిగిపోవునట్లుండెను. ఆ గోపురముకడ చక్రవర్తి శ్రీముఖుడు స్వయముగ తన మహాదంతావళముపై నధిరోహించి యుద్ధము నడుపుచుండెను. వేరొక గోపురముకడ స్వైత్రులవారు నాయకత్వము వహించిరి. శ్రీకృష్ణసాతవాహనులు మరియొక గోపురముకడ విజృంభించి యుద్ధమును సాగించుచుండిరి.

ఒక్కసారిగ పొంగివచ్చు గంగానది ముంపులవలె, శోణానది పొంగులవలె ఆంధ్ర సైన్యములన్నియు, ఆ రాత్రి ఆ అఖండసృష్టిలో పిడుగులై, మెరుపులై, మరుత్తులై, పుష్కలావర్తక మహామేఘములై పాటలీ పుత్రనగర కుడ్యములపై గవిసినవి.

ఆ వృష్టిలో క్రింద శత్రువు లేమౌచున్నదీ మాగధులకు, మాళవులకు తెలియుట లేదు. ఆంధ్రులకు గోడలమీదనున్న శత్రువులసంఖ్యయు తెలియుటలేదు. అశ్వఘోషలు, గజఘీంకారములు, వీరుల సింహనాదాలు మహాప్రళయనాదములై పోయినవి.

గోడలమీదివారకి “శత్రువులు చొరబడినారు” అన్న మహాధ్వని యొకటి వినబడసాగెను. గంగఒడ్డుననున్న ఆ సింహద్వారములోనికి అనంతమై మాళవులు ప్రవేశించు చుండుట అచ్చటి సేనాపతికిని, సైనికులకు నానందమైనది. కాని సంతత ధారగా వేయి, రెండువేలు, మూడువేలు, నాల్గువేలు మాళవులు వచ్చుట కా సేనాపతి యక్కజంపడి మాళవసేనాపతిని మీ రెంతమంది సైనికులతో వచ్చినారని యడిగెను. రెండువేల అయిదు వందలమంది వీరు లుందురని యాతడు చెప్పెను.

“మీరు లెక్కపెట్టలేదేమో. ఇప్పటి కయిదారువేలమంది వచ్చినారు. ఇంకను పది పది హేను వేలమంది పైన నున్నారు. మహావర్షము కురియుచున్నది. విరోధులు రారుగదా యని గోపురద్వారములను మీ ఉప సేనానులు కొందరు పూర్తిగ తెరచివేసినారట. ఈపాటికి ఎనిమిదివేలమంది లోనికి వచ్చియుందురు.”

“ఏమిటిది! ఇది యేదో మాయగ నున్నది. చూచెదము రండు.”

ఇంతలో కోటబురుజు మూలముననున్న వీరిమందిరములోనికి ఇరువురు సేనాపతులు, కొంతమంది సైనికులు బిలబిల నడిచివచ్చినారు. “ఇదియేమియని” ఈనాయకు లనుచుండగనే “అయ్యా, నేను సువర్ణశ్రీ సేనాపతిని, మిమ్ముల నిరువుర మా సైనికులు బంధింతురు” అని అనుచుండగనే ఆ మాళవ సైనిక వేషధారులు వారిని బంధించినారు.

నాలుగువేల మాళవ సైనికులు నచ్చటికి పావుక్రోశము దూరములో నున్న వేరొక నదీతీరము గోపురముకడకు వేవే బోయి, ఆ గోపురకవాటములు తెరచిరి.

సమవర్తి ఉగ్రుడై తనతోవచ్చు ఒక బాలవీర నాయకుని సహాయమున నెదిరించుచు సైనికుల ఆయుధముల లాగించుచు, మహావేగమున నగరములోనికి మూడువేల సైనికులతో పోసాగెను. సోమదత్తుడు మూడు వందల గజముల నదిలో ఈదించుకొనుచు గోపురద్వారమున నగరములోనికి చేరి, నదీతీరమందున్న బురుజుల పట్టించుచుండెను. శుకబాణుడు వేయి ఆశ్వికులతో మహావేగమున చక్రవర్తి యుద్ధముచేయు బురుజు కడకుపోవు చుండెను. గోండులతో మహాబలుడు గంగప్రక్కనున్న భూఖండముపైని గోపురము పట్టుకొనెను.

ఈ గడబిడ యగునప్పటికి నగరములో గగ్గోలు బయలుదేరెను. ఆ కటిక చీకటిలో, వర్షములో ఏమిజరుగుచున్నదియు నెవరికి తెలియక, ఆ దినమున వంతు లేక యుద్ధవిశ్రాంతిగైకొను నాయకులు కవచములు తాల్చియు, తాల్చకయు, ఆయుధములు సేకరించియు సేకరించకయు, తమ తమ భవనములవీడి తమ సైన్యాగారములవైపు పోదొడగిరి. వీధుల నిండి పోయి ఆంధ్రులకు పట్టుబడిరి.

చక్రవర్తి పోరాడు గోపురద్వారము ఇంతలో ముక్కలయ్యెను. ఆంధ్రులటనుండి లోనికి రాసాగిరి. శుకబాణుల ఆశ్వికులు అచ్చటనున్న మాళవులను చెండాడుచు నిరాయుధుల చేయుచుండిరి.

పాటలీపుత్రనగరము ఆంధ్రుల వశమైనది.

***