హలో...డాక్టర్/వ్యాపక జ్వరము (Influenza)

వికీసోర్స్ నుండి

36. వ్యాపక జ్వరము ( Influenza ) వ్యాపక జ్వరాలు ( Influenza ) ప్రతి సంవత్సరము చాలా దేశాలలో పొడచూపుతాయి. ఫ్లూ బహుళ వ్యాపక వ్యాధిగా ( epidemic ) చాలామందికి కలుగవచ్చును. చాలా మందిలో దానంతట అది తగ్గిపోయినా, ఈ జ్వరాలు ప్రపంచము అంతటా వ్యాపించి చాలా మృత్యువులకు కారణమయిన సంఘటనలు ఉన్నాయి. దీని ప్రభావము అనేక జనులపై ఉండుట వలన ఈ వ్యాధికి Influenza అనే పేరు కలిగింది.

సాధారణముగా ఈ వ్యాపక జ్వరాలు పశ్చిమ దేశాలలో ఆకురాల్చు కాలములోను, శీతాకాలములోను పొడచూపుతాయి. వ్యాపక జ్వరములు ఇన్ఫ్లుయెంజా A, B, C, D అనే విషజీవాంశములు ( Viruses ) వలన కలుగుతాయి.

విషజీవాంశములు (viruses) అతిసూక్ష్మమైనవి. వీటికి కణ నిర్మాణము ఉండదు. వాటంతట అవి మనజాలవు. వాటంతట అవి ప్రత్యుత్పత్తి చెందజాలవు. వీటిలో జీవరాశులలో వలె జీవవ్యాపారక్రియలు జరుగవు. ఈ విషజీవాంశములు యితర జీవకణాలలో ప్రత్యుత్పత్తి అవుతాయి. ఇవి న్యూక్లియక్ ఆమ్లములతో (Nucleic acids) నిర్మితమవుతాయి. వీనిలో పొందుపఱచబడిన న్యూక్లియక్ ఆమ్లము బట్టి డీఆక్సీరైబోజ్ న్యూక్లియక్ ఆమ్ల విషజీవాంశములు (DNA Viruses), రైబోజ్ న్యూక్లియక్ ఆమ్ల విషజీవాంశములు (RNA Viruses) గాను వీనిని విభజించవచ్చు. వ్యాపకజ్వరాలు (Influenza) కలిగించే విషజీవాంశములు రైబోజ్ న్యూక్లియక్ ఆమ్ల విషజీవాంశములు RNA Viruses). ఇవి Orthomyxoviridae సముదాయమునకు చెందుతాయి. Influenza - A మనుజులకే కాక యితర క్షీరదములకు, పక్షులకు కూడా వ్యాధిని కలిగించగలవు. వీటివలనే విశ్వవ్యాపక వ్యాధులు (Pan:: 377 :: demics), తీవ్రవ్యాధులు కలుగుతాయి. ఈ జీవాంశముల ఉపరితలముపై హీమగ్లూటినిన్ hemagglutinin (HA) న్యూరెమినిడేజ్ neuramidinase (NA) అనే ప్రతిజనకములు (antigens) ఉంటాయి. ఆ ప్రతిజనకములలో విభాగములబట్టి ఈ విషజీవాంశములను విభజిస్తారు. వీనిలో జన్యుపదార్థము ఎనిమిది ఒంటి పోగుల RNA తునుకలుగా ఉంటుంది. అందువలన కొత్త విషాంశముల ప్రత్యుత్పత్తి జరిగినపుడు జన్యుపదార్థములో మార్పులు (mutations) కలిగే అవకాశములు మెండు. అందువలన ఒకసారి వ్యాపకజ్వరము - ఎ బారిన పడినవారు మఱల ఆ వ్యాధికి గుఱి అయ్యే అవకాశములు ఉన్నాయి.

Influenza -B మనుజులలోనే చూస్తాము. సీలుచేపలకు, ఫెరెట్ పిల్లులకు ఈ వ్యాధి కలుగవచ్చు. ఈ విషజీవాంశములలో పరివర్తనలు (mutations) తఱచు జరగవు. అందువలన చాలా మందికి ఒకసారి సోకగానే వ్యాధిని ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. దీనివలన విశ్వవ్యాపక వ్యాధులు కలుగవు.

Influenza - C మనుజులకే కాక పందులకు, కుక్కలుకు కూడా సోకగలదు. ఈ వ్యాధి అసాధారణమైనా తీవ్రముగా ఒక్కొక్క ప్రాంతములో వ్యాప్తి జెందగలదు. Influenza - D వ్యాధి పశువులకు పందులకు సోకుతుంది. మనుజులకు సోకగలిగినా యింతవఱకు మనుజులలో యీ వ్యాధి కలిగిన సూచనలు లేవు. వ్యాపక జ్వరాలు వ్యాప్తి :

వ్యాపక జ్వరము సోకిన వారు దగ్గు తుమ్ముల ద్వారా విషజీవాంశ రేణువులను గాలిలోనికి వెదజల్లుతారు. దగ్గఱలో ఉన్నవారు ఆ నలుసులను పీల్చినా, లేక ఆ నలుసులు పడిన వస్తువులను తాకి ఆ చేతితో ముక్కు, నోరు,కళ్ళను తాకినా, ఆ విషజీవాంశములు శరీరములోనికి ప్రవేశిస్తాయి. వ్యాధి గలవారిని స్పర్శించుట వలన, వారితో కరచాలనములు చేయుట వలన ఆ విషాంశములను అంటించుకొనే అవకాశము ఉన్నది.

378 :: ఈ విషజీవాంశములు వస్తువుల ఉపరితలములపైన 24 నుంచి 48

గంటల వఱకు మనగలవు. తుమ్ములు, దగ్గుల వలన గాలిలో వెదజల్లబడినా అవి త్వరగానే వాటి బరువుకు క్రిందకు చేరుకుంటాయి. గాలిలో ఎక్కువ కాలము ఉండవు. తేమ ఎక్కువగా ఉన్నా, సూర్యకాంతిలో అతినీలలోహిత కిరణాల వలన (ultraviolet rays) ఈ విషాంశములు త్వరగా ధ్వంసము అవుతాయి, సబ్బు, బట్టలసోడా, ఆల్కహాలు ఈ విషాంశములను నశింప చేస్తాయి. విషజీవాంశములు ముక్కు, గొంతుక, ఊపిరితిత్తుల కణముల పొరలకు హీమెగ్లూటినిన్ ల ద్వారా అంటుకొని పిదప కణముల లోనికి చొచ్చుకుంటాయి. ఆ కణములలో వాటి ప్రత్యుత్పత్తి జరిగి అనేక విషజీవాంశములు కణముల నుంచి విడుదలవుతాయి. ఆక్రమించబడిన కణములు ధ్వంసమవుతాయి. వ్యాపక జ్వర లక్షణములు :

స్వల్ప తీవ్రత గల వారిలో ఏ లక్షణములు కనిపించకపోవచ్చును. వ్యాధిసోకిన వారిలో ఒంటినొప్పులు, కండరముల పీకు, శరీరమంతా నలత, గొంతునొప్పి, ముక్కుకారుట, జ్వరము,వణుకు, తలనొప్పి, దగ్గు, కలుగుతాయి. ఈ లక్షణములు రెండుదినముల నుంచి వారము వఱకు ఉండి క్రమేణ రోగులు కోలుకుంటారు. పిల్లలలో వాంతులు, విరేచనములు కలుగవచ్చు. ముక్కు కారుట కొంత ఉన్నా సాధారణ జలుబులో వలె ఎక్కువగా ఉండదు. సాధారణ జలుబు చేసిన వారిలో జ్వరము ఎక్కువగా ఉండదు. ఫ్లూ కలిగిన వారిలో ఒంటినొప్పులు, జ్వరము ఎక్కువగా ఉంటాయి.

వ్యాధినిరోధక శక్తి తక్కువయినవారిలోను, వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలోను వ్యాపకజ్వరముతో ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ) విషజీవాంశముల ( viruses ) వలన కాని, ఆ పిమ్మట దాడి సలిపే సూక్ష్మజీవుల ( bacteria ) వలన, లేక రెండిటి వలన కాని కలుగ వచ్చును. విషజీవాంశముల వలన కలిగే ప్రాథమిక పుపుస తాపములో ( Primary pneumonia ) రోగులు త్వరగా కోలుకోక జ్వరము కొనసాగి, పొడి దగ్గు,

379 :: లేక తక్కువ కఫముతో దగ్గు, ఆయాసము కలుగుతాయి.

సూక్ష్మజీవుల వలన ఊపిరితిత్తుల తాపము కలిగిన వారిలో (Secondary bacterial pneumonia) ముందు జ్వరము తగ్గినా మళ్ళీ జ్వరము, దగ్గు పుంజుకుంటాయి. వీరిలో కఫము ఎక్కువగా ఉంటుంది. ఆయాసము కూడా కలుగవచ్చును. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా (Streptococcus Pneumoniae), స్టాఫిలోకోకస్ ఆరియస్ (Staphylococcus Aureus), హీమోఫిలస్ ఇన్ ఫ్లుయెంజా (Haemophilus Influenzae) సూక్షాంగజీవుల వలన తఱచు ఈ ఊపిరితిత్తుల తాపము ఉపద్రవముగా సంక్రమిస్తుంది.  ఊపిరితిత్తుల తాపము ఎక్స్ రే చిత్రములలో ప్రస్ఫుటముగా కనిపిస్తుంది. ఊపిరితిత్తుల తాపము తీవ్రతరమయితే శ్వాసవైఫల్యము (respiratory failure) కూడా కలిగే ప్రమాదము గలదు.

వ్యాధిగ్రస్థులలో  క్రొత్త విషజీవాంశముల ప్రత్యుత్పత్తి కలిగినపుడు వాటి జన్యుపదార్థములో (genome) మార్పులు ( mutations) స్వల్పముగానో (viral drift), ఎక్కువగానో జరిగినపుడు (viral shift) వ్యాపకజ్వరముల తీవ్రత అధికము కావచ్చును, వాటి ఉగ్రత అధికమయి వ్యాధి అధిక సంఖ్యాకులకు సోకి త్వరగా వ్యాపించవచ్చును. వ్యాధి నిర్ణయము :

వ్యాపక జ్వరములు ప్రబలముగా ఉన్నపుడు వ్యాధిలక్షణముల బట్టి వ్యాధిని నిర్ణయించవచ్చును. జ్వరము, దగ్గు ఎక్కువగా ఉండి ముక్కు కారుట తక్కువగా ఉంటే వ్యాపకజ్వరము (influenza) అయే అవకాశములు హెచ్చు. ముక్కు, గొంతుకల నుంచి  సేకరించిన శ్లేష్మమును ప్రతిజనకములకు (antigens) పరీక్షించి వ్యాధిని నిర్ణయించవచ్చును. polymerase Chain Reaction తో ప్రతిజనకములు ఉత్పత్తి చేసి జన్యు పదార్థములను కనుగొనవచ్చును. ప్రతిరక్షకములను direct fluorescent antibody test తో కనుగొనవచ్చును. శ్లేష్మములోని విషజీవాంశములను వృద్ధిచేసి (culture) వ్యాధిని నిర్ణయించ వచ్చును.

380 :: వ్యాధి చికిత్స ;

వ్యాపకజ్వరాలు ఉన్నవారిలో చాలామందికి ఉపశమన చికిత్సలు సరిపోవచ్చును. ఎసిటెమైనోఫిన్, పారాసిటమాల్ జ్వరమునకు తలనొప్పికి వాడవచ్చును. పిల్లలలో ఏస్పిరిన్ రేయీస్సిండ్రోమ్ (Reye’s Syndrome) కలిగించవచ్చు, కాబట్టి ఏస్పిరిన్ వాడకూడదు. తగినంతగా ద్రవపదార్థములు, ఆహారము, విశ్రాంతి సమకూర్చాలి. వీరు మద్యము సేవించరాదు. పొగత్రాగుట మంచిది కాదు. వ్యాధి తీవ్రత పొగత్రాగుట, మద్యముల వలన ఎక్కువ అవుతుంది. మందులు : న్యూరమిడినేజ్ నిరోధకములు ( Neuramidinase inhibitors )

ఇవి విషజీవాంశముల పొరపై గల న్యురమిడినేజ్ అనే జీవోత్ప్రేరకమునకు (enzyme ) అవరోధము కలిగించి విషజీవాంశముల విడుదలను నిరోధిస్తాయి. ఓసెల్టమివీర్ (Oseltamivir - Tamiflu) వయోజనులలో 75 మి.గ్రాలు దినమునకు రెండు పర్యాయములు, జెనమివీర్ (Zanamivir Relenza) వయోజనులలో 10 మి.గ్రా లు పీల్పువుగా దినమునకు రెండుసారులు 5 దినములు వ్యాధి చికిత్సకు, నివారణకు కూడా వాడవచ్చు. ఎమాంటడిన్ (Amantadine ) ఇన్ ఫ్లుయెంజా ఏ కి వాడవచ్చు. ఈ ఔషధములను వ్యాధి కలిగిన 24 - 48 గంటలలో మొదలుపెడితే ప్రయోజనము ఎక్కువ.  సూక్ష్మజీవ నాశకములు (antibiotics) ఫ్లూ జ్వరము తర్వాత సూక్ష్మజీవులు (bacteria) దాడిచేసి కలిగించే ఊపిరితిత్తుల తాపమునకు (Pneumonia), శ్వాసనాళిక పుపుసనాళికల తాపమునకు (Bronchitis) ఉపయోగిస్తారు. విషజీవాంశములపై వాటి ప్రభావము శూన్యము. వ్యాధితీవ్రముగా ఉన్నవారికి వైద్యాలయములలో చికిత్సలు అందించాలి.

వ్యాపక జ్వరముల నివారణ :

వ్యాపక జ్వరముల నివారణకు టీకాలు లభ్యము. 6 మాసములు

381 :: నుంచి 18 సంవత్సరముల వారు, 50 సంవత్సరములు నిండినవారు,

ఫ్లూ కాలములో గర్భిణీస్త్రీలు, ఫ్లూ కాలములో గర్భము దాల్చబోయే స్త్రీలు, ఉబ్బస, మధుమేహము, శ్వాసకోశపు వ్యాధులు, హృద్రోగములు వంటి ఇతర వ్యాధులు ఉన్నవారు, ఆరోగ్య విధులలో పనిచేసేవారు టీకాలు వేసుకొనుట మేలు.

వ్యాపక జ్వరాలు ఉన్నవారికి దూరముగా ఉండుట, స్పర్శ, కరచాలనములు  పాటించక పోవుట వలన, నోరు ముక్కులపై కప్పులను (masks) ధరించుట వలన, చేతులను తఱచు శుభ్రము చేసుకొనుట వలన, నోరు, ముక్కు, కనులు, ముఖములపై చేతులను చేర్చకపోవుట వలన వ్యాపక జ్వరములను కొంతవఱకు నివారించ గలుగుతాము.

దగ్గు, తుమ్ములు ఉన్న వారు మోచేతిని గాని ఆచ్ఛాదనములను (masks)  కాని నోటికి, ముక్కుకి అడ్డుపెట్టుకొని దగ్గుట, తుమ్ముట చేస్తే తుంపరలను వ్యాప్తి చేయరు.

382 ::