హలో...డాక్టర్/ధన్యవాదములు

వికీసోర్స్ నుండి

ధన్యవాదములతో

పదికోట్లమంది మాట్లాడే భాష తెలుగు భాష. తెలుగునాడు నుంచి భారతదేశపు ఇతర ప్రాంతాలకు, ఆపై ఇతర దేశాలకు కూడా వలస వెళ్ళినవారు భాషను ఇతోధికముగా వ్యాప్తి చెందించారు. సాంకేతిక పరముగా అభివృద్ధి సాధించుకొనుట వలన, కొందఱి అసాధారణ యత్నము వలన గణనయంత్రాలలోను, సామాజిక జాల మాధ్యమములలోను తెలుగుభాష వాడుక విశేషముగా పెరిగింది. ప్రాత, కొత్త సాహిత్యసంపద, దినపత్రికలు, తెలుగు నిఘంటువులు, అనేక ఇతర విషయాలు చిటికెలో తెలుగులో లభ్యము అవుతున్నాయి.

ఈ శుభతరుణములో పెక్కు తెలుగు అంతర్జాల పత్రికలు వెలుగులోనికి వచ్చాయి. 2017 జనవరిలో కెనడా నుంచి ‘తెలుగుతల్లి కెనడా‘ మాసపత్రిక వెలువడుటయు, దేముడిచ్చిన మాచెల్లి శ్రీమతి రాయవరపు లక్ష్మిగారు ఆ పత్రికకు తెలుగులో వైద్యవిషయములను వ్రాయమని నన్ను ప్రోత్సహించుటయు జరిగాయి. 2017 ఏప్రిల్ మాసములో మొదలిడి నెలకొక వ్యాసము చొప్పున 2020 నవంబరు మాసము వఱకు నాకు నిత్యము అనుభవములో ఉన్నవి, నేను చికిత్స చేసేవి, ప్రజలకు ఉపయోగకరమని నేను భావించినవి అయిన వైద్యవిషయములపై వ్యాసములను వ్రాసాను. నాకు తెలుగుభాష, వైద్యములపై అభిలాష ఎక్కువ. వైద్యమయినా, ఇతర విజ్ఞానశాస్త్రములనయినా చెప్పుకొనుటకు తెలుగులో విస్తృత పదజాలము గలదని, లేని సందర్భాలలో చాలా సాంకేతిక పదములను తెలుగులో సృష్టించుకోగలమని ప్రగాఢ విశ్వాసము ఉండుటచే ఆ యత్నము కొనసాగించగలిగాను. పాఠకుల సౌలభ్యము కొఱకు ఆంగ్ల పదములను కూడా జతపఱిచాను. వైజ్ఞానిక విషయాలు ఏ భాషలో చదువుకున్నా కొంత జటిలముగానే ఉంటాయి. సాంకేతిక పదములు సమకూర్చుకొనుటకు ఆంగ్లము లాటిన్, గ్రీకు భాషలను ఆశ్రయించినట్లు భారతీయ భాషలు కొన్నిసారులు సంస్కృతమును ఆశ్రయించక తప్పదు. వ్యాసములను వీలయినంత సరళము చేయుటకు ప్రయత్నించాను. వైద్యబోధన గాని, మిగిలిన వైజ్ఞానిక శాస్త్రాలు గాని సమీప కాలములో ఉన్నత స్థాయిలో తెలుగులో బోధింపబడుతాయనే భ్రమ నాకు లేదు. కాని అధిక సంఖ్యాకులు మాట్లాడే మన తెలుగుభాషలో సకల వైజ్ఞానిక విషయాలు అందుబాటులోనికి రావాలనే ఆకాంక్ష, తప్పక వస్తాయనే విశ్వాసము నాకు ఉన్నాయి.

నా చిన్న ప్రయత్నమునకు ప్రోత్సాహము ఇచ్చిన తెలుగుతల్లి కెనడా పాఠక ప్రముఖులకు, ముఖపుస్తక మిత్రులకు ధన్యవాదములు. శిలీంధ్ర చర్మవ్యాధులకు ఛాయాచిత్రములను అందించి, నెమ్మిపలుకులతో ప్రోత్సాహమిచ్చిన నా ఆప్తమిత్రుడు, చర్మవ్యాధి నిపుణులు డా. గండికోట రఘురామారావు గారికి ఆదరపూర్వక కృతజ్ఞతలు. నైపుణ్యముతో ముఖచిత్రమును తీర్చిదిద్దిన శ్రీ పుక్కళ్ళ రామకృష్ణగారికి, కొన్ని వ్యాసములకు చిత్రాలను అందంగా సమకూర్చిన శ్రీ పొన్నాడ వెంకటరమణమూర్తిగారికి ప్రత్యేక ధన్యవాదములు. సమయాభావము వలన చాలా వైద్యాంశములకు తగిన చిత్రాలను నేనే వేసాను. ఆ చిత్రాలకు శ్రమతో, సాంకేతిక నిపుణతతో దిద్దుబాట్లు చేసి వివిధ భాగములను గుర్తించిన మా రెండవ కుమారుడు డా. భవానీశంకర్ కు ఆశీస్సులతో కృతజ్ఞతలు. రక్త ఘనీభవన సోపాన పటము తయారు చేసినది కూడా తనే.

నా వ్యాసములను తొలినుంచి శ్రద్ధగా చదువుచు వెన్నుతట్టుచు ఎంతో ప్రోత్సాహము అందించిన పూజ్యనీయులు, అగ్రజులు శ్రీ గంటి లక్ష్మీనారాయణ మూర్తిగారు తమ ఔదార్య వచనములతో మరల సంతోషము చేకూర్చారు. వారికి నా ప్రణామములు. ఈ వ్యాసములను ఓపికతో చదివి, సముచిత సలహాలు ఇచ్చిన నా ప్రియమిత్రుడు, సహాధ్యాయి డాక్టరు అడుసుమిల్లి శివరామచంద్రప్రసాద్ కు శతధా కృతజ్ఞతలు. నా వ్యాసములన్నీ వెలువడగానే ఓపికతో చదివి తన అభిప్రాయములను చెబుతూ యిపుడు సదయతో పుస్తకమునకు శుభవాక్యములను వ్రాసిన నా ఆప్తమిత్రుడు వైద్యనిపుణులు

డా. ఇరగవరపు అచ్యుతప్రసాద్ కు హృదయపూర్వక ధన్యవాదములు.

అందముగా పుస్తకమును ముద్రించిన శ్రీమతి జ్వలితగారికి కృతజ్ఞతలు. ఆదరాభిమానాలతో పుస్తక ప్రచురణకు పూనుకొన్న తెలుగుతల్లి కెనడా వారికి, చెల్లెమ్మ శ్రీమతి రాయవరపు లక్ష్మిగారికి బహుధా ధన్యవాదములు. మన మాతృభాష తెలుగులో ఇంకా చక్కని వైజ్ఞానిక వ్యాసాలు వస్తాయని ఆశిస్తూ పాఠకులకు కృతజ్ఞతలతో,

- డా. గన్నవరపు నరసింహమూర్తి.

డాలస్, ఉత్తర అమెరికా.

జూలై 1, 2021.