Jump to content

హలో...డాక్టర్/ఆరోగ్యము ; వైద్యము

వికీసోర్స్ నుండి

1. ఆరోగ్యము - వైద్యము

శరీరము స్వస్థత కలిగి రోగములేవీ లేకుండా ఉండుటయే ఆరోగ్యము. ‘అరోగస్య భావః ఆరోగ్యమ్’ అని పద వ్యుత్పత్తి.

రోగాలు పలురకాలు. పుట్టుకతో శరీరనిర్మాణ లోపాల వలన వచ్చే రుగ్మతలు పుట్టువ్యాధులు (Congenital diseases). ఈ రుగ్మతలు అవయవ నిర్మాణ లోపాలు, అవయవ కార్యనిర్వహణ లోపాలు, జీవ రసాయనాల ఉత్పత్తి లోపాలు, లేక జీవప్రక్రియ లోపాలు వలన కలుగుతాయి.

కొన్ని వ్యాధులు జన్యు సంబంధమైనవి (Genetic disorders). జన్యు సంబంధ వ్యాధులు కొన్ని పుట్టుకతోనే  కనిపించినా, కొన్ని పుట్టుకతో పొడచూపక  ఆ తరువాత ఎప్పుడో కనిపించవచ్చును.

గాయములు, ప్రమాదాలు, క్షతములు, అనారోగ్యమును కలిగించవచ్చును.

ఏకకణ సూక్ష్మాంగ జీవులు (Bacteria), శిలీంధ్రములు, (బూజుల జాతికి చెందిన జీవులు (Fungi), విషజీవాంశములు (Viruses) శరీరములో చొచ్చుకొని ఆక్రమణ  వ్యాధులను (Infections) కలిగించ వచ్చును.  పరాన్న భుక్తులు (Parasites) శరీరములో ప్రవేశించి స్థావరము ఏర్పఱుచుకొని (infestation) వ్యాధులను కలిగించ వచ్చు.

జీవవ్యాపార లోపాల వలన కొన్ని రుగ్మతలు కలుగుతాయి. మధుమేహ వ్యాధి (Diabetes), గళగ్రంథి స్రావకము (Thyroxine) తక్కువ లేక ఎక్కువ అగుట (Hypo or Hyperthyroidism) అడ్రినల్ హార్మోనులు ఎక్కువ లేక తక్కువ అగుట, క్రొవ్వు పదార్ధాలు ఎక్కువ అవుట ఇట్టి వ్యాధులకు ఉదాహరణలు.

కొత్త పెరుగుదలలు (Neoplasms) రుగ్మతలు కలిగించ వచ్చును. ఈ పెరుగుదలలు నిరపాయకరమై (benign) నెమ్మదిగా పెరిగి ఎట్టి హాని కలిగించక ఉండవచ్చును. మరి ప్రమాదకరమైన కర్కట వ్రణములు, (Cancers) అపాయకరము (malignant). పుట్టకుఱుపులు  (Cancers) త్వరగా పెరుగుతాయి. శరీరములో వివిధ అవయవాలలోను ఈ పెరుగుదలలు పొడచూపవచ్చును. ఒకచోట ప్రారంభమైన యీ వ్రణాలు ఆ అవయవముల లోను, మిగిలిన అవయవాలకు వ్యాప్తి చెంది ప్రమాదభరితము అవుతాయి.

శరీరములో అవయవాల శైథిల్యము వలన శిథిల వ్యాధులు (Degenerative diseases) వస్తాయి. వృద్ధాప్యములో అవయవాల క్షీణత చూస్తుంటాము.

పొగత్రాగుట, పొగాకు వినియోగము, మితము దాటి మద్యము త్రాగడము, మాదక ద్రవ్యాల వినియోగము, పోషకపదార్థాల లోపము, శరీర అవసరాలకు మించి తినుట, భౌతిక జడత్వము వంటి  జీవన రీతులు (life styles) వ్యాధులకు దారితీయ వచ్చును.

ఇవి కాక మానసిక వ్యాధులు కొందఱిని పీడిస్తాయి. క్రుంగుదల (Depression) ద్విధ్రువ వ్యాధి (Bipolar disorder) మనోవైకల్యము (schizophrenia) వంటి వ్యాధులు ఊహాత్మకము కాదు. తెచ్చిపెట్టుకున్నవి కాదు. అవి నిజమైన రుగ్మతలే.

రుగ్మతలను నిరోధించడము, వ్యాధి నిర్ణయము చేయుట, వచ్చే వ్యాధులకు చికిత్స చేసి, నిర్మూలించడము, పూర్తిగా నయము కాని వానిని  అదుపులో పెట్టుట వైద్యుల లక్ష్యము. చికిత్సకు వ్యాధులు లొంగని పరిస్థితులలో (ఉదా; చికిత్సకు లొంగని కర్కటవ్రణములు) ఉపశమనము కలిగించి రోగుల బాధ నివారించుటకు యత్నము చేస్తారు.

రోగి బాధలను, రోగ చరిత్రను విని, రోగిని పరీక్షించి, అవసరమైన రక్త పరీక్షలు (Blood counts and Blood chemistry tests), యితర పరీక్షలు, ఎక్సరేలు (X-rays), శ్రవణాతీత ధ్వని చిత్రీకరణములు (Ultrasonography), హృదయ విద్యుల్లేఖనములు (electrocardiography) యింకా అధునాతనమైన గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణములు (Computerised axial tomography), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు (magnetic resonance imaging), అంతర్దర్శనములు (endoscopy and laparoscopy)  వంటి  పరీక్షలు చేస్తే అవి వ్యాధి నిర్ణయానికి తోడ్పడుతాయి.

అవసరము, వ్యయము దృష్టిలో పెట్టుకొని ఏ పరీక్షలు కావాలో వైద్యులు నిర్ణయించాలి. కొన్ని వ్యాధులకు నిపుణులను సంప్రదించాలి.

వైద్యము ఒకే ఒక శాస్త్రము కాదు. వైద్యశాస్త్రము ఒక వినియుక్త శాస్త్రము. వైద్యవిద్యార్థులు దేహనిర్మాణ శాస్త్రమును (Anatomy), శరీర వ్యాపార శాస్త్రము (Physiology), జీవరసాయన శాస్త్రము (Biochemistry), వ్యాధి విజ్ఞాన శాస్త్రము (Pathology), సూక్ష్మజీవుల శాస్త్రము, (Microbiology), పరాన్నజీవ శాస్త్రము (Parasitology), ఔషధ శాస్త్రములను (Pharmacology)  అభ్యసించి తరువాత వైద్య శాస్త్రము (Medicine), శస్త్రచికిత్స (Surgery), కంటి వైద్యము (Opthalmology) చెవి, ముక్కు, గొంతు వ్యాధులను (Otorhinolaryngology) స్త్రీ, ప్రసూతి శాస్త్రములను (Gynaecology and Obstetrics) అభ్యసిస్తారు. మరి రసాయన శాస్త్రము (Chemistry) భౌతిక శాస్త్రములలో (Physics)  ప్రాథమిక జ్ఞానము కూడా తప్పనిసరే. భౌతిక, రసాయనక, ఔషధ శాస్త్రాలలో పరిశోధనలు జరిగి, క్రొత్త విషయాలు, కొత్త పరికరాలు, క్రొత్త మందులు లభ్యమైతే, అవి వైద్యానికి ఉపయుక్తమయితే అవి వైద్యశాస్త్రములో యిమిడి పోతాయి. వైద్యశాస్త్రము కూడా నిత్యము పరిణామము చెందుతుంది.

ప్రజాబాహుళ్యములో అక్షరాస్యత పెరిగి, శాస్త్రీయదృక్పథము అలవడితే రోగులకు, వైద్యులకు కూడా ఆ విజ్ఞానము ఉభయతారకము అవుతుంది. పాఠశాలలలో నేర్చుకొనే విజ్ఞానశాస్త్రముతో బాటు వైద్యశాస్త్రములో ప్రాథమిక విజ్ఞానము కూడా అందఱికీ అవసరము.

  • * *